అలనాటి అపురూపాలు – 247

0
5

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

సేవాసదనం – 1938:

పుస్తక ప్రేమికులకు, కళాభిమానులకు మున్షీ ప్రేమ్‍చంద్‍ను (1880 -1936) కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ‘షేక్‌స్పియర్ ఆఫ్ ఇండియా’ అని పిలవబడిన ఈ సాహితీ మేధావి భారతీయ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశారు. ఆయనకీ, ఆయన రచనలకూ భౌతికంగా దూరంగా ఉన్న దక్షిణ భారతం – ఆయన ప్రభావం విషయంలో మాత్రం వెనుకబడలేదు. ఆయన పలు కథలు, నవలలు అన్ని దక్షిణాది భాషలలోకి అనువదించబడ్డాయి. ప్రేమ్‌చంద్ భావాలు, రాజకీయాలు – ప్రజాభిప్రాయన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాయి.

ప్రేమ్‌చంద్ 1918లో ఉర్దూలో ‘బజార్-ఎ-హుస్న్’ అనే నవలను రాశారు. అది హిందీలో ‘సేవా సదన్’గా ప్రచురితమైంది. 1924లో లాహోర్‌లో ఉర్దూలో మళ్లీ ప్రచురించబడింది. దీనిని ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీమాన్ శ్రీనివాస అయ్యంగార్ కుమార్తె అంబుజమ్మాళ్ తమిళంలోకి అనువదించారు. 1928లో ప్రారంభమైన ఆనంద వికటన్ పత్రిక పాత్రికేయ ఖ్యాతి 1930లలో తారాస్థాయికి చేరుకుంది. S.S. వాసన్ నేతృత్వంలో, ప్రకటనల నిర్వాహకులుగా పనిచేస్తున్న కల్కి కృష్ణమూర్తి, టి. సదాశివం వంటి రచయితల మద్దతుతో, పత్రిక అభివృద్ధి చెందింది, గొప్ప లాభాలను ఆర్జించింది. ఈ పత్రిక జాతీయోద్యమంలో కూడా చురుకుగా పాల్గొంది. ‘సేవా సదన్’ నవల తమిళంలో ఆనంద వికటన్‌లో ధారావాహికగా వచ్చింది.

దర్శకుడు కె సుబ్రమణ్యం గారికి ఈ కథ విపరీతంగా నచ్చేసింది. దీని చిత్రీకరణ హక్కులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హక్కులని సుబ్రమణ్యం అప్పట్లో నాలుగు వేల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఈ ఒప్పందం కుదర్చడంలో ముఖ్య పాత్ర పోషించిన సదాశివం, తాను సూచించిన హీరోయిన్‌ని నటింపజేయడానికి దర్శకుడు అంగీకరిస్తే సినిమా ఖర్చులో యాభై శాతం రాయితీ ఇస్తానని చెప్పారు. ఆ కథానాయిక మరెవరో కాదు మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి, లేదా తరువాతి కాలంలో ప్రపంచానికి ఎం.ఎస్. సుబ్బులక్ష్మిగా లేదా ఎం.ఎస్.ఎస్.‍గా పరిచయమైన నటి, భారత రత్న పురస్కారం పొందిన మహాగాయని.

అయితే సినిమా చిత్రీకరణ అంత సజావుగా సాగలేదు. దర్శకుడు సుబ్రమణ్యంతో సదాశివం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, సుబ్బులక్ష్మి తల్లి దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో ఆమె తమ సామాన్లు సర్దుకుని మధురైకి తిరిగి వెళ్ళిపోయారు. ఆరునెలల తర్వాత ధైర్యం చేసి ఇంటి నుంచి పారిపోయి మద్రాసుకు వచ్చేసారు ఎం.ఎస్.ఎస్. ఆమె మద్రాసు తిరిగి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

ఒక పేద యువతి గాయని కావాలనుకుని, ఒక వృద్ధ బ్రాహ్మణుడికి రెండవ భార్య కావడం ‘సేవా సదన్’ ఇతివృత్తం. ఆయనకి గుండు చేయించుకున్న వితంతు సోదరి ఉంది, ఆవిడే కథలో విలన్. ఆ యువతి గాయని అవడంలో ఓ మంచి వ్యక్తి తోడ్పడతారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటాందామె. చివరికి భర్త వచ్చి క్షమాపణ కోరతాడు. వితంతు సోదరి పాత్ర కోసం, దర్శకుడు సుబ్రమణ్యం నిజ జీవితంలో వైధవ్యం పొంది, గుండు చేయించుకున్న ఓ బ్రాహ్మణ వితంతువుని ఎంపిక చేశారు. ప్రముఖ రంగస్థల, స్క్రీన్ యాక్టర్ ఎఫ్ జి నటేషా అయ్యర్ వృద్ధుడి పాత్రలో నటించగా, సుబ్బులక్ష్మి యువతి పాత్రలో నటించారు. బాలనటిగా తెలుగు నటి ఎస్. వరలక్ష్మి నటించారు.

ఈ చిత్రం సంప్రదాయవాద తమిళ సమాజంలోని కొన్ని వర్గాలలో, ముఖ్యంగా బ్రాహ్మణులలో ప్రకంపనలు సృష్టించింది. సినిమా చివరలో హీరో నటేషా అయ్యర్ పశ్చాత్తాపంతో తన యజ్ఞోపవీతాన్ని తెంపివేసి, క్షమించమని కోరే సన్నివేశం వంటివి.. ఆ కాలంలో విప్లవాత్మకమైనవి. ఇవి సామాజిక నిబంధనలను ప్రశ్నించాయి, సంఘ సంస్కరణల కోసం ప్రేరకంగా ఉన్నాయి.

దురదృష్టవశాత్తూ ఈ సినిమా కాపీ లేదు. ఈ చిత్రం ఎం. ఎస్. సుబ్బులక్ష్మి గారి తొలి చిత్రం. ముద్రిత సాహిత్యాన్ని సినిమాగా మార్చిన ఒక ప్రధాన మార్గంగా గుర్తుండిపోతుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ చిత్రం ప్రేమ్‌చంద్ గారి శక్తివంతమైన రచనను దక్షిణ భారత పుస్తక ప్రేమికులకు, సినీ అభిమానులకు పరిచయం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here