శ్రీవర తృతీయ రాజతరంగిణి-34

2
6

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ సర్గ

పార్థివోపప్లవే చౌరా అన్ధకారేభిసారికాః।
దుర్భిక్షే చైవ తుష్యంతి ధాన్యవిక్రయిణో జనాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 31)

రాజులు ఉపద్రవాలను ఎదుర్కునే సమయంలో దొంగలు, చీకటిలో అభిసారిక, దుర్భిక్ష సమయంలో ధాన్యం ఆమ్మేవారు సంతోషిస్తారు.

రాజులు సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వారి దృష్టి పాలనపై అంతగా నిలవదు. పాలన సరిగ్గా లేకపోవడంతో దొంగలు విజృంభిస్తారు. వీరవిహారం చేస్తారు. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని ఆధారం చేసుకుని వారు పబ్బం గడుపుకుంటారు. కాబట్టి రాజులు ఉపద్రవాలను ఎదుర్కుంటే సంతోషించేది దొంగలు.

అలాగే చీకటిలో అభిసారికలు సంతోషిస్తారు. అష్టవిధ నాయికలలో ఒక నాయిక అభిసారిక. అర్ధరాత్రి ప్రియుడిని రహస్యంగా కలిసేందుకు వెళ్ళే నాయిక అభిసారిక. ప్రియుడిని తన వద్దకు రప్పించుకునే యువతి కూడా అభిసారికే. అభిసారికలలో స్వీయ, పరకీయ, సామాన్య అనే మూడు విభాగాలున్నాయి. కవులు తమ కావ్యాలలో అధికంగా ‘జ్యోత్స్నాభిసారిక’, ‘తమిస్రాభిసారిక’ లను వర్ణించారు. ‘జ్యోత్స్నాభిసారిక’ అంటే, వెన్నెలలో ప్రియుడిని కలవటానికి వెళ్ళే యువతి. ‘తమిస్రాభిసారిక’ అంటే అంధకారంలో ప్రియుడిని సంకేత స్థలంలో కలిసేందుకు వెళ్ళే యువతి. ప్రియుడిని రహస్యంగా సంకేత స్థలంలో కలవాలి కాబట్టి అభిసారికలు చీకటి వుంటేనే సంతోషిస్తారు. శ్రీవరుడు ప్రస్తావిస్తున్నది తమిస్రాభిసారిక గురించి.

 దేశంలో కరువు కాటకాలున్నప్పుడు అందరికి అవసరమైనది ధాన్యం. కానీ అది దొరకక పోవటమే కరువు పరిస్థితి. ఏది దొరకదో దాని విలువ ఎక్కువ. కాబట్టి కరువు సమయంలో ధాన్యం అమ్మే వాళ్ళ పంట పండినట్టే. అత్యవసరం కాబట్టి ఎంత ధర అయినా పెట్టి కొంటారు ప్రజలు. కాబట్టి దుర్భిక్షం సమయంలో ధాన్యం విక్రయించే వారు సంతోషిస్తారు.

అతః క్షుదా మహార్ఘా యే పదార్థా ధాన్య విక్రయాత్।
గృహీతాస్తేస్తు తాన్ పూర్వ మూల్యేనా ప్రాపయన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 32)

దుర్భిక్షం సమయంలో ధనాన్ని అధిక ధరకు అమ్మినవారి దగ్గరనుంచి, అమూల్యమైన వస్తులకు బదులుగా ధాన్యాన్ని అమ్మిన వారి నుండి ఆ అధిక ధరకు బదులుగా తీసుకున్న వస్తువులను ప్రజలకు తిరిగి ఇప్పించాడు. అంటే మామూలు ధరకు కాక ఎక్కువ ధరకు అమ్మిన వారి దగ్గర నుంచి ఎంత ఎక్కువకు అమ్మారో దాన్ని వసూలు చేసి, అధిక ధరకు కొన్న ప్రజలకు డబ్బు వాపస్ ఇప్పించాడన్న మాట జైనులాబిదీన్.

‘అద్భుతం’ అనిపిస్తుంది!

సాధారణంగా, ఏది తక్కువగా లభిస్తుందో, ఏది అత్యావశ్యకమో దాని ధర అధికంగా ఉంటుంది. కరువు కాటకాల సమయంలో మామూలు కన్నా ధాన్యాన్ని  అధికమైన ధరకు అమ్ముతారు. ‘కరోనా’ సమయంలో అందరూ అనుభవించారు ఈ పరిస్థితి. ఇప్పుడు రూపాయకి దొరికే ‘మాస్క్’ కరోనా కాలంలో వందలు పలికింది. ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకేది. ఆసుపత్రులలోనయితే స్వర్గాన్ని తాకేయి  ధరలు. లక్షలలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. కరోనా తగ్గిన తరువాత, ఏయే ఆసుపత్రుల్లో, ఎవరెవరికి నుండి మామూలు కన్నా అధిక రెట్లు వసూలు చేశారో, వారందరికీ అధికంగా వసూలు చేసిన డబ్బులు ఆసుపత్రుల నుంచి వాపస్ ఇప్పివ్వటం అసంభవం. అందుకే,  ఎంతగా అద్భుతాలకే అద్భుతమైన అద్భుతమో, అంత అద్భుతమైన చర్య జైనులాబిదీన్ సాధించినది. ఊహకు అందని అద్భుతం!

బహుశా ప్రపంచంలో ఏ రాజుకు కూడా సాధ్యం కాని అతి గొప్ప కార్యం ఇది.

కరువు పరిస్థితులు తొలగగానే ప్రజల నుండి అధికంగా వసూలు చేసిన సొమ్మును ప్రజలకు వ్యాపారుల నుండి తిరిగి ఇప్పించటం అన్నది సంభవమయిందన్నది తలచుకుంటేనే జైనులాబిదీన్ కన్న గొప్ప రాజు కంచుకాగడా పెట్టి వెతికినా లభించడు అనిపిస్తుంది.

మత ఛాందసుల చేతిలో ప్రాణాలు కోల్పోవటమో, ధర్మం వదిలి పరాయి మతం స్వీకరించటమో తప్ప గత్యంతరం లేని పరిస్థితులలో ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదలి పారిపోయిన పరమతస్తులను, సగౌరవంగా కశ్మీరుకు ఆహ్వానించి, వారికి భద్రతను, గౌరవాన్ని, ఉన్నత పదవులను  ఇచ్చి కశ్మీరులో స్థిరపరచటం ప్రపంచంలో ఏ రాజు కూడా సాధించలేని పరమాద్భుతమైన విషయం.

 ఇప్పుడు కరువు కాటకాల సమయంలో అధికంగా వసూలు చేసిన ధనాన్ని తిరిగి ప్రజలకు ఇప్పించటం ఇంకా అద్భుతమైన విషయం.

‘వాళ్ళ అవసరార్థం అడిగినంత ధర ఇచ్చి వస్తువులు కొన్నారు. ఇందులో మా తప్పు ఏముంది?’ అని వ్యాపారులు వాదించవచ్చు. కానీ వారికి అలా వాదించే అవకాశం ఇవ్వకుండా వారి ద్వారానే వారు అధికంగా సంగ్రహించిన ధనాన్ని తిరిగి ఇప్పించటం మామూలు విషయం కాదు.

తెలుసుకుంటున్న కొద్దీ జైనులాబిదీన్ గొప్పతనం హిమాలయమంత ఎత్తు ఎదుగుతోంది. భారతదేశం సగర్వంగా ప్రపంచానికి ప్రదర్శించదగ్గ ఉత్తమ రాజు జైనులాబిదీన్ అన్న ఆలోచన స్థిరపడుతుంది.

దుర్భిక్ష భక్షితాక్షోటలోకదక్షః క్షితీశ్వరః।
ధియా సరళవృక్షే భ్యసైలాకర్షణ మాదిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 33)

దుర్భిక్షం సమయంలో అక్రోటు కాయలు  తిని ప్రాణాలు కాపాడుకున్న వారిని, రక్షకుడయిన రాజు, సరళమైన వృక్షాల నుండి నూనెను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. అంటే దుర్భిక్షం తరువాత రాజు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాడన్న మాట. కరువు సమయంలో అల్లకల్లోలమయిన వారికి ఏదో ఒక పని చూపించటం వల్ల వారు తమ జీవికను గడిపే పరిస్థితులు కల్పించినట్టవుతుంది. జైనులాబిదీన్ వారికి ఏదో ఓ పని కల్పించి జీవనోపాధి ఏర్పాటు చేశాడన్న మాట.

తస్మిన్ సంవత్సరే రాజ్ఞా కారుణ్యాద్ భూర్జగామినీ।
ఉత్తమర్ణావమర్ణనాం వ్యవస్థా వినివారితా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 34)

కరువు సమయంలో ఆహారం కోసం ఆస్తులమ్మేరు అనేకులు. ఆస్తులను అమ్మినట్టు భూర్జర పత్రాలపై రాసిచ్చారు. ఆ వ్యవస్థను రద్దు చేశాడు దయాళువైన జైనులాబిదీన్.

అంటే, కరువు కాటకాల సమయంలో ఇళ్ళను, వాకిళ్ళను అమ్ముకున్న వారికీ, తాకట్టు పెట్టి కోల్పోయిన వారికీ వారి ఆస్తులను తిరిగి ఇప్పించాడన్న మాట. అలా భూర్జర పత్రాలపై రాసిచ్చిన వాటినన్నిటినీ రద్దు చేశాడు.

జైనులాబిదీన్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆశ్చర్యం పెరుగుతున్నది. అద్భుతం అనిపిస్తుంది. నెత్తిన పెట్టుకుని పూజించవలసిన రాజును, చరిత్ర పుటల్లో ఓ చీకటి మూల దాచిపెట్టుకున్నాం మనం.

ఇలా అన్యాయమైపోయిన వారికి న్యాయం చేయాలని ఓ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని, హింసాయుత పోరాటాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ జనజీవితాలను దశాబ్దాలుగా అల్లకల్లోలం చేస్తున్నారు. ఎంత హింస జరిపినా, ఎంత అల్లకల్లోలాలు నెరపినా వారు తుపాకీ గొట్టం ద్వారా సాధించలేనిది జైనులాబిదీన్ కశ్మీరులో ఎలాంటి హింస లేకుండా సాధించి చూపాడు.

చతుష్షష్టికళాం శిల్ప విద్యా మోభాగ్యమేవ చ।
దుర్భిక్షోపప్లవే సర్వం తదాభృన్నిష్ప్రయోజనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 35)

ఆ దుర్భిక్ష కాలంలో 64 కళలు, శిల్పం, విద్య, సౌభాగ్యం వంటివి నిష్ప్రయోజనమై నిద్రాణస్థితిలోకి దిగజారాయి.

పదవాక్యతర్కనవకావ్యకథా
బహుగీతవాద్యారసానృత్యకళాః।
సురతప్రపంచచతురా వనితాః
క్షుధితస్య నైవ రచయన్తి సుఖమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ సర్గ, 36)

కళలు ఎందుకని నిష్ప్రయోజనమయ్యోయో వివరిస్తున్నాడు శ్రీవరుడు. పద వాక్యాలు, తర్కం, నవీన కావ్యాలు, కథలు, గీతాలు, వాద్యాలు, రసం, నృత్యం వంటి కళలు ఎంత దక్షులైన వారు ప్రదర్శించినా కడుపు నింపవు.

కాలే కడుపును లలితకళలు నింపలేవు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తాడు శ్రీవరుడు.

‘ఆకలితో కడుపు కాలుతున్న వాడికి కావల్సింది దైవం కాదు, అన్నం’ అన్న నినాదానికి ప్రతిధ్వనిలా ఉంటుంది శ్రీవరుడి శ్లోకం.

ఇతి జైనరాజతరంగిణ్యాం పండిత శ్రీవర విరచితాయాం
షట్‍త్రింశద్ధక్షే దుర్భిక్ష వర్ణనాం నామ
ద్వితీయ సర్గః

ఇది శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలో దుర్భిక్ష పరిస్థితులను వర్ణించే 36 శ్లోకాలతో కూడిన ద్వితీయ సర్గ సమాప్తం.

(వచ్చే వారం శ్రీవర విరచిత తృతీయ రాజతరంగిణి  తృతీయ సర్గ ఆరంభం)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here