వసంత లోగిలి-4

0
4

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[సెలవలు పూర్తవుతాయి. నిత్య పిల్లలు సునంద, చక్రి తిరిగి హాస్టల్‍కి బయల్దేరే సమయం వస్తుంది. నిత్య, సావిత్రి వాళ్ళకి కావల్సిన పదార్థాలు చేసి ఇస్తారు. మాటల సందర్భంలో సునంద ఫ్రెండ్ కుందన వాళ్ళ అమ్మమ్మ తాతగారి ప్రస్తావన వస్తుంది. తమ ఇంట్లోంచి వాళ్ళని నాన్న వెళ్ళగొట్టేసాడని చెప్పి కుందన బాధపడిందని చెప్తుంది సునంద. వాళ్లని తలచుకుని సావిత్రి, నిత్య బాధపడతారు. పిల్లలు వెళ్ళిపోతారు. నిత్య ఫ్రెండ్ శారద ఫోన్ చేస్తుంది. నిత్యతో అత్యవసర విషయం మాట్లాడాలనీ, తన మావగారితో పాటు నిత్య ఇంటికి వస్తున్నానని చెప్తుంది. ఫోన్ ఎవరు చేశారని భర్త నవీన్ అడిగితే, శారద చేసిందనీ, వాళ్ళ మామగారితో మనింటికి వస్తోందని, ఏదో సాయం కావాలందని చెప్తుంది నిత్య. నాలుగు రోజుల తర్వాత మామగార్ని వెంటబెట్టుకుని నిత్య ఇంటికి వస్తుంది శారద. మామగారిని నిత్య అత్తమామలకు పరిచయం చేస్తుంది. ఆయనను విశ్రాంతి తీసుకోమని చెప్పి, స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడతారు. కాసేపయ్యాకా తనకి కావల్సిన సాయం గురించి చెప్తుంది శారద. తన మామగారికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారని అంటుంది. నిత్య మామయ్య డాక్టర్ కావడంతో ఆయనకి చూపిద్దామని అంటుంది. అయితే, ఆయనతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని చెప్పించమని కోరుతుంది. నిత్య కోపం పట్టలేక శారదని బాగా తిడుతుంది. శారద నొచ్చుకోకుండా తన ఆర్థిక పరిస్థితిని వివరించి, ఆపరేషన్ చేయించలేని తన అశక్తతని వెల్లడిస్తుంది. ఇంత పిరికిగా ఆలోచిస్తావని అనుకోలేదు అంటుంది నిత్య. నిన్ను నమ్మి నీ వెనుక వచ్చిన ఆ పెద్దాయనను ఎలా మోసం చేయాలనిపించిందని నిలదీస్తుంది. బాధపడుతూనే శారద తన సమస్యలని చెప్పుకుంటుంది. ఆమెకి ధైర్యం చెబుతుంది నిత్య. పెద్దవాళ్ళు ఆస్తిలాంటివాళ్ళని చెబుతూ.. ఏం చేయాలో ఆలోచిద్దామంటుంది. శారద మాత్రం సంఘర్షణకి లోనవుతూనే ఉంటుంది. నిత్య మామగారు జగన్నాథం, శారద మామగారు సూర్యనారాయణగారు లైబ్రరీకి వెడతారు. ఇక చదవండి.]

“ఇంతకీ మామయ్యగారి ఆసుపత్రి పని.. మీ మామయ్యతో మాట్లాడావా నిత్యా?”

“ఆఁ.. రేపు సాయంత్రం తీసుకు రమ్మన్నారు”

“ఆఁ.. సరే” అంటూ ముభావంగా ఉన్న శారద మనసులో జరుగుతున్న సంఘర్షణకి ముగింపు దొరకలేదు. నిద్రపోయినట్టు నటించిన శారద మనసులో సమస్యల సుడిగుండాలు చెలరేగుతున్నాయి.

‘మధ్యతరగతి జీవితాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ సమస్య తీరితే, ఇంకొకటి.. అది తీరితే ఇంకొకటి.. ఉద్యోగం లేని భర్త, చదువుతున్న పిల్లలు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే గాని బతికి బట్ట కట్టని మామగారు.. పైసా ఆదాయం లేని నేను..’ అని మనసులో అనుకుంటూ..

‘ఎన్ని వ్యాపారాలు చేసాను.. ఒక్కటి కలిసిరాలేదు.. ఎప్పుడూ నష్టాలే.. ఉద్యోగ ప్రయత్నం.. అంతలా శ్రమించలేదు దానికోసం మామయ్య గారి జీతంతో, అప్పుడప్పుడు తనకు నచ్చినప్పుడు చేసే భర్త ఉద్యోగంతో పిల్లల చదువులు ఇంతవరకు ఈడ్చగలిగాను.

ఇప్పుడు మామయ్య హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి అయ్యే 20 లక్షల ఖర్చు గురించి ఆలోచించిన నేను ఆయన ప్రాణం గురించి ఆలోచించలేదు. నిత్య చెప్పినట్టు నేను ఎంత నీచంగా అలా ఎలా ఆలోచించాను? కుటుంబానికి ఆయన జీతం ఇంతవరకు వాడుకుని, ఇప్పుడు ఆరోగ్యం దెబ్బ తిన్నాక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. డాక్టర్ చెప్పినా, అవసరం లేదని చెప్పించటం ఎంత హేయమైన పని. నా మీద నాకే సిగ్గేస్తోంది. నా పిల్లల భవిష్యత్తు గురించి నేను మామయ్యగారిని చంపేయడమే కదా! ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఎలా ఆలోచించాను? ఇలాంటి ఒక విషయాన్ని నిత్యతో పంచుకున్నందుకు నా విలువ ఎంత తగ్గిపోయి ఉంటుంది’ అనుకుని నిద్రపోయింది శారద.

***

“శారదా.. శారదా.. సాయంత్రం అయింది. లేచి ముఖం కడుక్కుని రా! మా మామయ్యగారు, మీ మామయ్యగారు నిన్న వెళ్ళిన లైబ్రరీకి వెళ్లారు. ఇంకా రాలేదు.. రాగానే మా డాక్టర్ మామయ్య దగ్గరికి వెళ్లి వద్దాం. టీ తాగు” అంటూ టీ కలిపి తెచ్చింది నిత్య.

నిత్య కళ్ళల్లోకి చూడలేక.. “ఆఁ..అలాగే” అంటూ బాత్రూమ్‌కి వెళ్లి వస్తూ ముఖాన్ని తువ్వాలులో దాచుకుంది నిత్య కంటపడకుండా.

“ఇదిగో శారద.. ఆ తువ్వాలు తియ్యవే.. నేను నీ చిన్ననాటి స్నేహితురాల్ని, నువ్వంతలా ఫీల్ అవ్వనక్కర్లేదు. సాటి మధ్యతరగతి స్త్రీగా నీ ఆలోచన తప్పు కాకపోవచ్చు. పైగా ఒడ్డునుండి నీ సమస్యని నేను చూసాను.. కాని ఈదుతున్నది నువ్వు.. పిల్లల భవిష్యత్తా? మామగారి ఆరోగ్యమా! అనే సమస్య వచ్చినప్పుడు.. ఒక తల్లిగా నువ్వు ఆలోచించావు. అదే నీకు దొరికిన పరిష్కారం. నేను ఏదో ఒకటి మాట్లాడుతా.. ఇక నువ్వు పట్టించుకోకు.. సమస్య నాతో చెప్పావు కదా! ఇక వదిలేయ్” అంటూ భుజం మీద చెయ్యి వేసిన నిత్యని గట్టిగా కౌగలించుకుంది శారద.. ఏడుస్తూ.

“ఏంటి శారదా.. ఇది, చిన్న పిల్లలా..” అంటూ ఓదార్చింది నిత్య.

“నేను చాలా పెద్ద తప్పు చెయ్యబోయాను నిత్యా.. అలా ఎలా ఆలోచించాను?” అని ఏడుస్తున్న శారదతో

“చిన్నప్పుడు ‘కాపీ కొట్టి రాసే మార్కులు నావి కావు’ అని క్లాస్‌లో ధైర్యంగా చెప్పేదానివి గుర్తుందా! అటువంటి నీలో మానవత్వం లేదని నేను అనుకోను.. నేను కాస్త కటువుగా మాట్లాడాను. సారీ శారదా” అంది నిత్య.

“ఎందుకే సారీ? నా కళ్ళు తెరిపించావు. నేను చేయ్యబోయే ఆలోచన ఎంత తప్పో అని ఎత్తి చూపించావు. తప్పు చెయ్యకుండా ఆపావు. నేను ఉండే ఇల్లు మామయ్యగారిదే.. అది తాకట్టు పెట్టి, నా పిల్లల చదువు కోసం దాచిన పాతిక లక్షలు ఖర్చు చేసి, ఇంకా అవసరమైతే అప్పు తెచ్చి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తా” అంది శారద.

“అదిగో.. అదిగో.. ఓవర్‌గా స్పందించకు.. చూద్దాం.. మామయ్య దగ్గరకి వెళ్లి వచ్చాక ఒక నిర్ణయం తీసుకోవచ్చు.. ఇక్కడికి వచ్చి మంచి పని చేసావ్”.. అని నిత్య అనడంతో మౌనం వహించింది శారద.

“అదిగో మాటల్లో నే వచ్చేశారు, రండి రండి” అంటూ టీ అందించి ఆసుపత్రికి బయల్దేరమని చెప్పింది సూర్య నారాయణ రావు గారిని.

***

“ఏమిటే.. నిత్యా నీ ‘బృహత్ ప్రణాళిక’ లో భాగమేనా ఇది కూడా!” అన్నాడు మామయ్య డాక్టర్ రఘునందన్.

“అవును మామయ్యా” అంది నిత్య

“కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి..?”

“బాగానే నడుస్తున్నాయి మామయ్యా” అంది నిత్య

“బహుదూర్ వంశా౦కురానివా! మజాకా! ఆఁ.. ఆఁ.. సర్లేకాని ఈ మామయ్య సహాయం కావాలా!” అడిగాడు రఘునందన్.

“కావాలి మామయ్యా”.. అంటూ శారదని వాళ్ళ మామయ్య గారినీ, డాక్టర్ మామయ్యకి పరిచయం చేసింది నిత్య.

డాక్టర్ రఘునందన్ నారాయణ రావు గారిని కొన్ని టెస్ట్ లకు పంపిస్తూ..

“హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి లేట్ చెయ్యకూడని పరిస్థితి ఉంది.. ఈ నెలలో చెయ్యాల్సిందే..”

“కాని మామయ్యా.. ఒకవేళ చెయ్యకపోతే..”

“చెయ్యకపోతే.. ఆయన లైఫ్ గట్టిగా నెలలు మాత్రమే.. ఆఁ.. ముందే కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కరెంట్ ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే లేదు.. ఇదే లాజిక్” అన్నాడు డాక్టర్ రఘునందన్.

“హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే?”

“చేస్తే మరో 25 సంవత్సరాలు సునాయాసంగా బతికే చాన్స్ ఉంది” అన్నాడు డాక్టర్.

“సరే మామయ్యా! హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సిద్ధం చెయ్యండి మామయ్యా!” అంది నిత్య.

“ఎంత ఖర్చు అవుతుంది.. వంటి వివరాలు” అని శారద అడిగి ఆగడంతో..

“అవన్నీ మాట్లాడదాం శారదా!.. పద ఇక ఆ ఏర్పాట్లు చేసుకుందాం” అంటూ.. “మామయ్య గారిని ఇంటి వద్ద దింపేసి మనం కాస్త బయటకు వెళ్దాం” అంది నిత్య.

ఇద్దరు కార్లో అలా బయటకి వెళ్లారు.

“శారదా.. నువ్వేం వర్రీ అవ్వకు.. ఆపరేషన్ ఖర్చు ఎంతైనా నేను చూసుకుంటా!.. ఈ కార్పోరేట్ హాస్పిటల్ మామయ్యదే.. కొన్ని కొన్ని ఖర్చులు తగ్గుతాయి. మిగిలిన ఖర్చు నేను చూసుకుంటా.. నువ్వేమీ వర్రీ అవ్వద్దు” అంది నిత్య.

“అదేంటి.. వద్దు నిత్యా వద్దు.. పిల్లల చదువు కోసం ఉంచిన డబ్బులు తీసుకు వస్తా” అంది శారద.

“ఆఁ.. అవి పిల్లల చదువుకి ఉంచు.. నేను నీకు ఊరకనే ఇవ్వటం లేదులే.. అప్పుగా ఇస్తున్నా. ఇది తీర్చే మార్గం నేనే చెబుతా” అంది నిత్య.

నిత్య రెండు చేతులు తీసుకుని కళ్ళకు అద్దుకుంది శారద కృతజ్ఞతగా..

“ఒక నిండు ప్రాణం పోయినా పరవాలేదు అనుకున్నాను నేను.. ఒక నిండు ప్రాణం నిలబడాలి అనుకున్నావ్ నువ్వు.. నీ ముందర నిల్చునే అర్హత లేదు నాకు” అంది శారద

“ఇదిగో మళ్ళీ చెబుతున్నా శారదా.. నేను ఇది ఊరకనే ఇవ్వలేదు.. అప్పుగా ఇచ్చా అంతే. ఈ మాత్రానికే నేనేదో పై నుంచి ఊడిపడ్డట్టు మాటాడకు” అంది నిత్య .

“అయినా!.. నీ ఋణం..” అని ఆగింది శారద.

“అంతంత పెద్ద పెద్ద మాటలు వద్దు.. నా దగ్గర ‘అవకాశం’ ఉంది – నీ దగ్గర ‘అవసరం’ ఉంది.. మనిద్దరి మద్య ‘స్నేహం’ అనే వారది ఉంది. అంతే. ఇంకొక మాట.. మీ మామయ్యగారిని ఆపరేషన్ అయ్యాక ఇక్కడే ఉండనివ్వు .. ఆయన అనుభవం నా ‘వసంత లోగిలి’కి ఉపయోగపడచ్చు.. పండుటాకుల్లా పండిపోతున్న వృద్ధాప్యానికి కాస్త ‘విలువ’ని అదనంగా అద్దుదాం. అందుకు నువ్వు కూడా సహకరించు శారదా” అంది నిత్య.

“నీ భాష.. నీ భావం.. నీ బృహత్ ప్రణాళిక – ఇవన్నీ చూసాక, తెలిసాక నేను ఎలా సహకరించకుండా ఉంటా నిత్యా! అసలు మామయ్య సర్జరీకి నువ్వు డబ్బు కట్టి ‘అప్పు’ అంటున్నావ్.. నీ అప్పు తిరిగి కట్టే స్తోమతైనా నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించావా నిత్యా! పైగా పైసాకి పనికి రాని మామయ్యగారిని ఇక్కడే ఉంచమంటున్నావ్.. నీ బృహత్ ప్రణాళికకి మామయ్యగారు గాని, నేను గాని ఎలా నీకు ఉపయోగపడతాము? అద్భుతమైన నీ ‘వసంత లోగిలి’ నాకు చూపించి, కార్యక్రమాలు చెప్పావు.. కాని అందులో మేము..” అని ఆగింది శారద.

“అవన్నీ ఆపరేషన్ అయ్యాక నీకు చెబుతా.. మీ వారికి చెప్పాలేమో చూడు మీ మామయ్యగారి ఆపరేషన్ గురించి..” అని టాపిక్ మారుస్తూ సలహా ఇవ్వడంతో

“ఆఁ.. ఆఁ.. అవును ఫోన్ చేస్తా” అని ఫోన్ తీసి రింగ్ చేస్తూ పక్కకి వెళ్లి తన భర్తతో మాట్లాడుతోంది శారద.

“ఇదిగో శారదా.. ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు.. ఆపరేషన్ అయ్యే మొత్తం ఖర్చు.. అంటే సుమారు 20 లక్షల వరకు అవుతుంది.. ఆ ఖర్చు మొత్తం నిత్య పెట్టేయడమేంటి? నాకేం అర్థం కావట్లేదు.. అసలే ఆ పిల్ల చదివింది మేనేజ్‌మెంట్ కోర్స్.. కాస్త చూసుకో శారదా.. మన ఇల్లు రాసి ఇమ్మనదు కదా!” అన్నాడు శారద భర్త సునీల్.

“ఆఁ.. అవును. మరి మనకి ఒక ఇంద్ర భవనం ఉంది.. అది కొట్టేద్దామని అనుకుంటోంది. లేకుంటే నా భర్త పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు.. అతడ్ని బుట్టలో వేద్దామని నా స్నేహితురాలు ప్రయత్నం చేస్తోంది మరి?” వెటకారంగా అంది శారద.

“సరే.. సరే.. నేను వస్తున్నా.. డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వస్తా” అని ఫోన్ పెట్టేసాడు సునీల్.

***

పదిహేను రోజుల్లో ఆపరేషన్‌కి అన్ని సిద్ధం చేసారు నిత్య మామయ్య డాక్టర్ రఘునందన్.

సునీల్ వచ్చాడు.

“ఎలాంటి ప్రశ్నలు వెయ్యకు.. ముందు ఆపరేషన్ కాని” అంది శారద.

“అదేంటి? నీ స్నేహితురాలు ఏమి మెలిక పెడుతుందో, ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతోంది.. పైసా ఖర్చు లేకుండా ఊరకనే చేయిస్తోందంటే.. ఏమి లాభం ఆశించి..” అని ఆగిపోయాడు సునీల్.

“అవును లాభం ఆశించే చేస్తోంది.. నువ్వు ఒక IPS ఆఫీసర్‌వి కదా!.. భవిష్యత్తులో ఉపయోగపడతావని!” దెప్పి పొడిచింది శారద.

“అది కాదు శారదా డబ్బు రూపంలో..” అని మళ్ళీ ఆగిపోయాడు సునీల్.

“అవును మరి, అంబానీ కుటుంబం మనది” అని వెటకారంగా అంటున్న శారద ధైర్యం నచ్చలేదు..

‘కాని సర్జరీ చేయించే స్తోమత లేదే నాకు? కాదు కాదు ఆ మనసే లేదు నాకు’ అనుకుని ఊరుకున్నాడు సునీల్.

సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. తండ్రి సూర్యనారాయణ రావు గారితో కాసేపు మాట్లాడి, “డ్యూటీలో జాయిన్ అవ్వాలి, నేను బయలుదేరుతున్నా నాన్నా, నీ దగ్గర శారద ఉంటుంది.. సరేనా” అని చెప్పి డాక్టర్ గారికి, నిత్యకి థాంక్స్ చెప్పి బయలుదేరుతున్న సునీల్..

“నిత్య గారూ, మీరు.. ఆపరేషన్”.. అన్న సునీల్ మాట పూర్తీ కాకుండానే.. సునీల్‌ని పక్కకి లాగింది శారద, ఇంకా అక్కడ ఉంటే ఏమి మాట్లాడతాడో అని.

“నిత్యా, నీకూ, మీ మామయ్యగారికి ‘థాంక్స్’ చెప్పలనుకుంటున్నారు మావారు” అంది శారద.

“నిత్యా గారూ మీకు చాలా పెద్ద ‘థాంక్స్’ .. అలాగే మీ మామయ్యగారికి కూడా..” అని అంటుండగానే..

“ఈయన డ్యూటీలో జాయిన్ అవ్వాలి. స్టేషన్‌లో దింపి వస్తాను” అంటూ బయటకు తీసుకు వచ్చేసింది శారద.

“అది కాదు శారదా, ఎంత ఖర్చు అయిందో అడుగుదామని” అన్నాడు సునీల్.

“అడిగి.. ఇచ్చేయగలవా!.. అసలు నువ్వు ఇవ్వగలవనే తను చేసిందా!.. అసలు నిత్య గురించి నీకేం తెలుసనీ?.. అసలు తను నీ నుంచి ఏదో ఆశించి ఈ ఆపరేషన్ చేయిస్తుందని ఎందుకు అనుకుంటున్నావ్? తానెవరో.. తన బ్యాక్‌గ్రవుండ్ ఏంటో తెలుసుకుని మాట్లాడు సునీల్” అంది శారద.

“అసలు నిత్య ఎవరో తెలుసా” అంది మళ్ళీ శారద .

“ఆఁ.. ఎవరు?.. తానేమైనా దేవతా.. ఆకాశం నుంచి ఏమైనా ఊడి పడి వచ్చిందా” అన్నాడు సునీల్.

“ఆఁ, ఆకాశం నుంచే ఊడిపడింది.. తన పరిచయం కూడా ఓ అదృష్టం తెలుసా!”

“అసలు నిత్య ఎవరు?.. తను మనకెందుకు సాయం చేస్తుంది?..” అన్నాడు రెట్టించిన కోపంతో సునీల్.

“ఓ.కే. అయితే విను. నిత్య గురించి.. విను” అంటూ భర్త సునీల్‌కి నిత్య గురించి చెప్పడం ప్రారంభించింది శారద.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here