సిరివెన్నెల పాట – నా మాట – 71 – శివాత్మకమైన పాట

1
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

అందెల రవమిది

~

చిత్రం: స్వర్ణకమలం

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం, వాణీ జయరాం

~

పాట సాహిత్యం

గురుబ్రహ్మః గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

అతడు: ఓం నమో నమో నమశ్శివాయ.
ఆమె: మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగి తోత్తమాంగతే నమః శివాయ
అతడు: ఓం నమో నమో నమశ్శివాయ
ఆమె: శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండ మాలినే నమః శివాయ

పల్లవి:
ఆమె: అందెల రవమిది పదములదా? ॥2॥ అంబరమంటిన హృదయముదా? అమృతగానమిది పెదవులదా?
అమితానందపు ఎదసడిదా?
అతడు: సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగఫలముగా ॥2॥
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా..

చరణం:
ఆమె: మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై ॥2॥
మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అతడు: అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేలా
ఆమె: జంగమమై జడమాడగా
అతడు: జలపాతగీతముల తోడుగా
ఇద్దరు: పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా

చరణం:
అతడు:
నయన తేజమే ‘న’ కారమై
మనో నిశ్చయం ‘మ’ కారమై
శ్వాస చలనమే ‘శి’ కారమై
వాంఛితార్థమే ‘వ’కారమై
యోచన సకలము ‘య’ కారమై
నాదం ‘న’కారం, మంత్రం ‘మ’ కారం స్తోత్రం ‘శి’ కారం, వేదం ‘వ’ కారం, యజ్ఞం ‘య’ కారం ఓం నమశ్శివాయ
ఆమె: భావమే భవునకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా
అతడు: తుహిన గిరులు కరిగేలా తాండవమాడేవేళ
ఆమె: ప్రాణపంచకమె పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
అతడు: ఖగోళాలు పదకింకిణులై పదిదిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా
॥ అందెల రవమిది॥

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా పరమేశ్వరుడికి పూజలు, ఆరాధనలు జరుగుతున్నాయి. అన్ని మాసాలతో పోలిస్తే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనదని స్కాంద పురాణంలో పేర్కొనబడింది. అత్యంత మహిమాన్వితమైన మాసం ఇది. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో హిందువులంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతారు.

మూడుమూర్తులకును మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
బేధమగుచు తుదికబేధమై యొప్పారు
బ్రహ్మమనగ నీవె ఫాలనయనా..

అని శివ స్తుతి చేశారు పోతన, భాగవతంలో.

శివపురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణాలతో పాటు పలు ఇతిహాసాలు పరమేశ్వరుని లీలా గాథలను చాటుతున్నాయి. ఆదిదేవుడైన శివుడు అల్ప సంతోషి, నిరాడంబరుడు, భక్తవశంకరుడు సకల శుభాలనిచ్చేవాడు, బోళాశంకరుడు, విభూతి ప్రియుడు, చితాభస్మదారి, అభిషేక ప్రియుడు, ఆదియోగి, భూతగణాధి సేవితుడు, కైలాస వాసి, సర్వాంతర్యామి అని వేదోపనిషత్తులు స్తుతిస్తున్నాయి. శివుడు – లింగ రూపుడు, పంచభూత సమన్వితుడు. సృష్టికి మూలం, ఆ స్వరూపమే. అది విశ్వమంతటా వ్యాపించిన చైతన్య శక్తికి సంకేతం. ఇటువంటి ఆదిదేవుని స్తుతించడమంటే సిరివెన్నెలకు ఎంతో మక్కువ!

తండ్రి వద్ద వేదోపనిషత్తులను, పురాణేతిహాసాలను అధ్యయనం చేసిన సిరివెన్నెలకు, బోళా శంకరుడంటే చెప్పలేనంత భక్తి. అందుకే ఆయన శివుడితో గారాలు పోతూ..

నిన్ను కాదని నాకు పరమార్థమేది?
నన్ను కాదని నీకు పరివారమేది? ..

అంటారు తన శివదర్పణంలో. తనకు అవకాశం దొరికినప్పుడల్లా, సినీ గీతాల్లో శివ తత్వాన్ని ఆవిష్కరించడంలో అత్యద్భుతమైన కృషి చేశారాయన. ఆది భిక్షువు వాడినేమి కోరేది/ ఆనతి నియరా హరా/ శివ పూజకు చివురించిన సిరిసిరిమువ్వా/ భరత వేదమున నిరత నాట్యమున/.. వంటి పాటలు, మరి ముఖ్యంగా నృత్య ప్రధానమైన పాటలు ఎన్నో! అలాంటి శివాత్మకమైన పాటల్లో, అందెల రవమిది పదములదా.. పాట కూడా ఒకటి.

శివుడు నాదశరీరుడు, నాదాత్మకుడు. ‘నాదతనుమ్ అనిశం శంకరం’, అంటూ త్యాగరాజ స్వామి వారు కీర్తించడంలోని విశేషం. ఈ విశ్వంలోని అణువణువూ, ప్రతి కదలికా రుద్ర తాండవమే! నటరాజుకు నృత్యం నిత్య కృత్యం. ప్రతిరోజు సాయంసంధ్య సమయంలో ఆయన మహోత్సాహంతో చేసే వీరతాండవాన్ని బ్రహ్మాది దేవతలంతా పోటీపడి చూస్తుంటారని చెబుతారు. వివిధ వాయిద్యాలతో, తాళాలతో, దరువులతో జరిగే ఈ తాండవంతో కైలాసం కదలిపోతుందనీ, ఆయన జటాజూటం చెల్లా చెదురైపోతుందనీ, తలపై గంగ గజగజలాడుతూ వణికి పోతుందనీ, మూడవ కన్ను తెరుచుకుంటూ అగ్నిజ్వాలలు వెలవడుతుంటాయని శివతాండవంలో వర్ణించారు.

ప్రాణులన్నింటికీ ఆంగిక, వాచిక, సాత్విక, ఆహార్యమంతా ఈ తాండవంలోనే లభ్యమవుతుందని చెబుతారు. శివతాండవం అంటే ఈ విశ్వతాండవమే! ఇది అనంతంగా సాగే నిరంతర శక్తి ప్రవాహం.. Cosmic Dance.

కథాంశం:

స్వర్ణకమలం చిత్రమే ఒక ఖండ కావ్యం లాంటిది. ఇందులో కథ, పాత్రలు, సన్నివేశాలు, అభినయం, పాటలు, మాటలు, వేటికవి తీసిపోని అద్భుత రస సంగమంలా ఉంటాయి. చిత్రకారుడైన ఒక యువకుడు తన పొరుగింటిలో ఉండే వృద్ధ బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్యకళా కౌశలం గుర్తించి, ఆమెను ప్రోత్సహించి, ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం.

కథ మొత్తం మీనాక్షి( భానుప్రియ) చుట్టూ తిరుగుతుంది.

ఆ వృద్ధ కళాకారునికి ఇద్దరు కుమార్తెలు. సావిత్రికి కర్ణాటక సంగీతంలోనూ, మీనాక్షికి కూచిపూడి నాట్యంలోనూ, తానే స్వయంగా శిక్షణ ఇస్తాడు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచి, దాన్నే జీవనాధారంగా భావిస్తుంటుంది. కానీ రెండవ కూతురు మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది. సాధారణంగా అందరిలాగే విలాసవంతమైన జీవనం గడపాలని కలలు కంటుంది. వాళ్ల నాన్న నేర్పే విద్యపై మక్కువ లేకుండా, ఏకాగ్రత లేకుండా పెంకితనంగా వ్యవహరిస్తుంటుంది.

ఇదిలా ఉండగా వారి పక్కింట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకారుడు అద్దెకు దిగుతాడు. ఆమెలోని సహజమైన నాట్య కళా కౌశలాన్ని గుర్తించి ఆమెను ఎంతో అభిమానిస్తాడు. ఆమెకు సంప్రదాయ నాట్యం పట్ల ఉన్న అయిష్టతను పోగొట్టడానికి చాలా కృషి చేస్తాడు. అయినా ఆమె దృక్పథంలో ఎటువంటి మార్పు రాదు. చాలా సంఘటనల తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమెలో మార్పు ప్రారంభమవుతుంది. ఈ వరుస క్రమంలో, ఆమె తండ్రి మరణిస్తాడు.

మీనాక్షి అభిప్రాయాలు చాలవరకు మారి, ఆమె కలల ప్రపంచం నుండి బయటపడి, వాస్తవ లోకంలోకి వచ్చిన తర్వాత, చంద్రం ఆమెను గురుపూర్ణిమ జరుపుకుంటున్న ఒక నాట్యమండలికి తీసుకెళ్తాడు. అక్కడి విద్యార్థులందరూ తన తండ్రి పటాన్నే పూజించడం చూసిన మీనాక్షికి జ్ఞానోదయమవుతుంది. తనకు వారసత్వంగా వచ్చిన నాట్యకళను నిర్లక్ష్యంగా చూడటం, తండ్రి మరణానికి తనే పరోక్షంగా కారణమవడం, అన్నీ గుర్తుకొచ్చి ఆమెలో పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంటుంది. నటరాజస్వామి పాదాల చెంత వున్న మువ్వలను ముట్టుకొని తీవ్రమైన భావోద్రేకానికి, వివశత్వానికి లోనవుతుంది. జీవితంలో మొదటిసారిగా తన కోసం, తన ఆత్మానందం కోసం గజ్జకట్టి నాట్యం చేస్తుంది. అటువంటి ఉన్మత్త స్థితిలో, ఆమె మనసులో రేగే అలజడికి అక్షర రూపమే ఈ గీతం.

ఉప్పొంగిన కథానాయిక భావవేశానికీ, ఎల్లలెరుగని పులకింతలతో ఆమె చేసే నృత్యానికీ, ఉత్తుంగ తరంగం లాంటి భాషనూ, భావాన్నీ అందిస్తూ, ‘అందెలరవమిది పదములదా..’ అనే రసవత్తర నాద కావ్యాన్ని తెలుగు తెరకు అందించారు సిరివెన్నెల.

గీత విశ్లేషణ:

గురుబ్రహ్మః గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
అతడు: ఓం నమో నమో నమశ్శివాయ.
ఆమె: మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ
గంగయా తరంగి తోత్తమాంగతే నమః శివాయ
అతడు: ఓం నమో నమో నమశ్శివాయ
ఆమె: శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచి తుండ మాలినే నమః శివాయ.

గురుపూజోత్సవం నాడు, తండ్రిని గురువుగా పొందిన తన భాగ్యానికి మురిసిపోతూ, గురుః బ్రహ్మ, గురుః విష్ణు.. అనే గురుస్తుతితో, పాట ప్రారంభమవుతుంది. శంకర భగవత్పాదులు రచించిన, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రంలోని భాగాలతో, ఆ గీతం ముందుకు సాగుతుంది. శివ పంచాక్షరి ఘనతను చాటే ఆ స్తోత్రం ఇలా మొదలవుతుంది..

నమఃశ్శివాయ నమఃశ్శివాయ జటాఝూటధారీ నమఃశ్శివాయ
శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమఃశ్శివాయ
ధామలేక దూత కోక భంధవే నమఃశ్శివాయ నామశోషి తానమద్భావాంధవే నమఃశ్శివాయ పామ రేతర ప్రధాన భంధవే నమఃశ్శివాయ
నమఃశ్శివాయ నమఃశ్శివాయ జటాఝూటధారీ నమఃశ్శివాయ

నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం యజుర్వేదం, రుద్రాధ్యాయంలోని నాల్గవ అనువాకంలోనిది. అన్ని కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం, ఓంకారమనే శిరస్సు వంటి ప్రణవాక్షరంతో కలిపి, ఓం నమఃశివాయగా దీన్ని ఉచ్చరించడం వల్ల చిత్తశుద్ధి, జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి.

పల్లవి:

ఆమె: అందెల రవమిది పదములదా? ॥2॥ అంబరమంటిన హృదయముదా? అమృతగానమిది పెదవులదా?
అమితానందపు ఎదసడిదా?
అతడు: సాగిన సాధన సార్ధకమందగ
యోగ బలముగా యాగఫలముగా ॥2॥
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా..

అంత ఉత్తమోత్తమమైన సంప్రదాయ నృత్యం పట్ల తాను ఇప్పటివరకు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరికి, తన తండ్రి రూపంలో అంత గొప్ప గురువు లభించినా, దాని విలువను అర్థం చేసుకోలేని తన మూర్ఖత్వానికి పశ్చాత్తాపపడుతూ, ఉప్పొంగిన స్ఫూర్తితో ఆమె నృత్యం ప్రారంభిస్తుంది. తన మనసు స్పందించి, తన్మయంతో నర్తిస్తూ, భావావేశంతో కూడిన లాస్యాన్ని ప్రదర్శిస్తుంది.

తాను ఆనాడు చేస్తున్న నృత్యంలో వినిపిస్తున్న అందెల రవళి, పాదాల నుండి జనిస్తోందా? ఆకాశాన్ని తాకే తన హృదయ స్పందన నుండి జనిస్తోందా? తన పెదవుల్లో నుంచి వెలువడుతున్న అమృత గానం పెదవులదా? మనసులో ఉప్పొంగిన అమితానందపు రసఝరిదా? అని, తన స్థితి తనకే అర్థం కాకుండా, మనసులో చెలరేగే సందేహాలను వ్యక్తపరుస్తుంది మీనాక్షి. ఇలాంటి ప్రశ్నల వల్ల, హృదయ స్పందనకు, రసజ్ఞతకు సంబంధించిన నాట్యమనే గొప్ప కళను, తాను ఇప్పటివరకు ఎంత భౌతికమైనదిగా, దేహికమైనదిగా భావించిందో సిరివెన్నెల ఎంతో గుట్టుగా, పట్టుగా మనకు తెలియజేస్తున్నారు.

ఇన్ని ఏళ్లుగా సాగిన తన నాట్య సాధనకు ఈరోజు సార్థకత చేకూరిందని, యోగ బలము లాగా, తన కళాయజ్ఞానికి ఫలము లాగా, ఈ రస సిద్ది లభించిందని కథానాయకుడు ఆమెకు సమాధానమిస్తూ, నీలో కలిగిన ఈ పరివర్తన వల్ల నీ జీవితం నిత్యోత్సాహంతో ఒక ప్రణవంలాగా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాడు.

మనకు ప్రాప్తించని వస్తువును ప్రాప్తింప చేయడమే యోగం. అంటే, ఇప్పటివరకు భౌతికమైన శరీరానికి మాత్రమే పరిమితమైన ఆమె నాట్యం, దాని ద్వారా పొందాల్సిన రససిద్ధి అనే అసలైన ఫలాన్ని ఆమె ఇప్పుడు పొందుతోందన్న గాఢమైన వ్యక్తీకరణ ఇవ్వడం కోసమే సిరివెన్నెల యోగ బలముగా అనే భావాన్ని ఇక్కడ ప్రయోగించారు.

చరణం:
ఆమె: మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై ॥2॥
మేను హర్ష వర్ష మేఘమై
వేణి విసురు వాయువేగమై
అతడు: అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై
లాస్యం సాగే లీల.. రసఝరులు జాలువారేలా
ఆమె: జంగమమై జడమాడగా
అతడు: జలపాతగీతముల తోడుగా
ఇద్దరు: పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా.. ॥ అందెల రవమిది ॥

పల్లవిలో మీనాక్షి ఎంత పరవశంతో నర్తిస్తోందో మనకు వివరించిన సిరివెన్నెల, చరణంలో ఆ నాట్య విన్యాసాన్ని పదాల కాన్వాస్ మీదికి ఎక్కించి, ఒక అద్భుతమైన మనో చిత్రాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు.

సంగీత సాహిత్యాది కళలలో ఉన్న మాధుర్యాన్ని అనుభూతి చెందడమే రసం. రసాస్వాదన, ఆత్మానందమే కళలకు పరమార్థం.

కళల అంతరార్థం తెలియని మీనాక్షి జీవితంలో ఇప్పటివరకు వున్న గ్రీష్మం తరలిపోయి, వర్ష ఋతువు ప్రారంభమైందన్న సూచికతో ఈ చరణం సాగుతుంది.

భూమి మీద మీనాక్షి నాట్యం చేస్తున్నా, మువ్వలు గగనంలో ఉరుముల్లాగా సవ్వడి చేస్తున్నాయట! ఈమె నాట్య భంగిమల్లోని మెలికలు, ఆకాశంలోని మెరుపుల్లాగా తన కొత్త జీవితానికి మెలకువలను సూచిస్తున్నాయట!

తన శరీరం ఒక హర్ష మేఘంలా అంతులేని ఆనందాన్ని వర్షిస్తోందట! నర్తకీమణులు నాట్యం చేస్తున్నప్పుడు పొడవాటి జడ కూడా వారి భంగిమలకు, నడుము తిరిగే హొయలకూ, లయలకూ అనుగుణంగా, అందంగా ఆడుతూ ఉంటుంది. ఆమె నృత్యం చేస్తున్నప్పుడు, ఆ వేణి, అంటే జడ విసురు వాయువేగంతో ఉందట!

ఆమె నాట్య భంగిమలు గంగ పొంగుల్లాగా, అంటే.. ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి.. రీతిలో ఆపలేని ఒరవడితో సాగుతోందని, ఆమె నర్తిస్తున్నప్పుడు ప్రదర్శిస్తున్న హావభావాలు నింగికే కొత్త రంగులు దిద్దుతూ, రసఝరులు జాలువారేలా ఆ లాస్య లీల సాగుతోందని, నాయకుడి ద్వారా సిరివెన్నెల ఆమెని ప్రశంసిస్తాడు.

“రస భావ వ్యంజనాదియుక్తం నృత్య మితీర్యతే” రసము, భావము, అభినయము అన్నీ కలిసి తాళము, లయను అనుసరిస్తూ చేసేది నృత్యము. ఇప్పుడు లాస్యం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.

శివుడు తాండవం చేస్తే, పార్వతీదేవి చేసే నృత్యాన్ని లాస్యమంటారు. “ఉద్ధతం తాండవం విధుః”. ఉద్ధతమైన ప్రయోగాలు కలది తాండవం అనబడుతుంది. “సుకుమారంతు తల్లాస్యం” సుకుమారముగా నృత్యం చేసే పద్ధతిని లాస్యము అంటారు. దీనిలో అభినయానికే అధిక ప్రాధాన్యత వుంటుంది. దీనికి అధిదేవత పార్వతీదేవి. ఇందులో అవయవాల కదలికలు మనోహరముగా ఉండి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తాయి.

ఈ సృష్టిలో స్థావర, జంగమాలని రెండు రకాల స్థితులు ఉంటాయి. కదలకుండా స్థిరంగా ఉన్న పర్వతాలు, కొండలు వంటి వాటిని స్థావరాలు లేదా జడాలు అంటారు. కదలిక ఉన్న నదులు, సముద్రాలు, జలపాతాలు, వృక్షాలు, పశువుల వంటి జీవరాశులను జంగమాలు అంటారు.

స్పందన లేకుండా ఒక జడం లాగా ఉన్న మీనాక్షి పరవశంతో నటిస్తుండగా, జలపాతాలు గీతాలు పాడుతుండగా, జడాలు కూడా జంగమాలై ఆడుతున్నాయట! ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రకృతితో మమేకమై, పరమాత్మతో లీనమైన ఒక అదిభౌతిక యోగ స్థితిని సిరివెన్నెల మనకు, ఒక గీతం ద్వారా పలికించి చూపించారు.

అసలు సిరివెన్నెల మనోఫలకంపై ముద్రితమైన ఆ సన్నివేశం నుండి వెలువడిన ఈ గీతం ఎంత భావోద్వేగ పరిమళాలు వెదజల్లుతోందో కదా! ఆ తొలకరికి మొలకలెత్తి, పచ్చదనాన్ని సంతరించుకున్న ప్రకృతే, పర్వతరాజ పుత్రి పార్వతి ఆకృతిని దాల్చి, ప్రకృతి పురుషులిద్దరూ ప్రణయ నృత్యం చేస్తున్నట్టుగా ఉందని సిరివెన్నెల ముగ్ధ మనోహరంగా వివరించారు.

చరణం:
అతడు:
నయన తేజమే ‘న’ కారమై
మనో నిశ్చయం ‘మ’ కారమై
శ్వాస చలనమే ‘శి’ కారమై
వాంఛితార్థమే ‘వ’కారమై
యోచన సకలము ‘య’ కారమై
నాదం ‘న’కారం, మంత్రం ‘మ’ కారం స్తోత్రం ‘శి’ కారం, వేదం ‘వ’ కారం, యజ్ఞం ‘య’ కారం ఓం నమశ్శివాయ
ఆమె: భావమే భవునకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా
అతడు: తుహిన గిరులు కరిగేలా తాండవమాడేవేళ
ఆమె: ప్రాణపంచకమె పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
అతడు: ఖగోళాలు పదకింకిణులై పదిదిక్కుల ధూర్జటి ఆర్భటిరేగా ॥ అందెల రవమిది ॥

ఇక రెండో చరణంలో పంచాక్షరీ మంత్ర విశిష్టతను వివరిస్తూ, మీనాక్షి పరివర్తనలో ఆ పంచాక్షరి ఎలా ప్రతిఫలించిందో ఆచరణత్మకంగా వివరిస్తున్నారు సిరివెన్నెల. ముందుగా అందరికీ తెలిసిన పంచాక్షరి గురించి అర్థం చేసుకుందాం. ఆద్యంతరహితుడూ, పంచభూతాత్మక స్వరూపుడైన మహా శివుడిని శివ పంచాక్షరి మంత్రంతో ధ్యానిస్తాం.

న భూమి- కంచిలోని పృథ్వీ లింగ రూపం

మః జలం- జంబుకేశ్వరం లోని జలలింగం

శి వాయువు- శ్రీకాళహస్తిలోని వాయు లింగం

వా అగ్ని- అరుణాచలంలోని అగ్ని లింగం

య ఆకాశం- చిదంబరంలోని ఆకాశలింగం.

అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో, మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిపేదే శివతత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే శివునిలా మెలగడమే.

హర్షాతిరేకంతో నర్తిస్తున్న మీనాక్షి కళ్ళలోని తేజంలో నకారాన్ని, నాట్యానికే జీవితాన్ని అంకితం చేయాలన్న తన మనో నిశ్చయంలో మకారాన్ని, శ్వాసలో శికారాన్ని, ఉచ్ఛతమైన తన వాంఛలో వకారాన్ని, పరివర్తన చెందిన తన యోచనలో యకారాన్ని.. కలిపి పంచాక్షరిగా, తనను తానే పరమశివుడికి సమర్పణ చేసుకునే ఆత్మ – పరమాత్మల అనుసంధానాన్ని సిరివెన్నెల ఇక్కడ ఆవిష్కరించారు.

నాదం ‘న’కారం, మంత్రం ‘మ’ కారం స్తోత్రం ‘శి’ కారం, వేదం ‘వ’ కారం, యజ్ఞం ‘య’ కారం ..ఓం నమశ్శివాయ.. అని మరొక నిర్వచనం కూడా ఇచ్చారు.

భావమే భవునకు భావ్యము కాగా భరతమే నిరతము భాగ్యము కాగా.. ఆ భవుడికి మనం చేసే కర్మాచరణ కంటే.. మన భావమే ప్రధానమైనదని, భరత వేదమైన నాట్యం నిరంతరంగా చేసే భాగ్యం ఆమెకు దక్కుతుందని సిరివెన్నెల ఆమె భవిష్యత్తును సూచిస్తున్నారు.

అటువంటి స్థితిలో, ఈశ్వర సృష్టి అయిన ప్రకృతికి తాను చిహ్నంగా మారి, ఈ సృష్టి మొత్తం నిండిన శివమే తానై, తాండవం చేసినప్పుడు, మంచు పర్వతాలు సైతం ఆనందంలో కరిగిపోతాయట! అలాంటి సమయంలో ఆమెలోని పంచప్రాణాలే పంచాక్షరి మంత్రంలాగా, ఆమె ప్రతి పదం జపంలాగా, ప్రతి కదలికా నాట్యమై, పరమపదము ప్రకటితమై, తానే విశ్వ చైతన్యమై, ఖగోళాలే పాదాలకు మువ్వలుగా మారి, పది దిక్కుల్లోనూ ఆ పరమశివుడిలాగా భీకరమైన తాండవం వెల్లువెత్తుతుందని, మనిషిలోనే మహేశ్వరుడిని ఎలా ఆవిష్కరించుకోవాలో సిరివెన్నెల వివరించారు.

“శం నిత్యం సుఖమానందమికారః పురుషః స్మృతః వ కారః శక్తి రమృతం మేలనం శివ ఉచ్చతే.”

శివుడు ‘శ’కార ‘వ’కారాల కలయిక. శ అంటే నిత్యం ఆనందం, ‘ఇ’ అంటే పరమ పురుషుడు, ‘వ’ కారం అంటే అమృతపరమైన శక్తి అని అర్థాలు. అమృత సమానమైన పరమానంద దివ్య శక్తిని నిత్యం ప్రసాదించే పరమ పురుషుడు శివుడని భావం. ఈ మొత్తం భావాన్ని, పరమానంద స్థితిని పొందే యోగాన్ని, ఈ గీతం ద్వారా సిరివెన్నెల ఒక అజరామరమైన స్ఫూర్తి సందేశాన్ని మనకు అందించారు.

మీనాక్షి నృత్యాన్ని, తన అక్షరాలతో నర్తింపజేసిన అపార శివకృపా నర్తకుడు సిరివెన్నెల.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here