తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-34

1
4

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆకాశం నీ హద్దురా..:

ఓ గది మూలన చెక్క గుర్రం ఉంది. అది చాలా పాతదిలా ఉంది. దానికి వేసిన రంగులు చాలా చోట్ల వెలిసిపోయి ఏదో రోగం వచ్చిన ముసలి గుర్రంలా కనిపిస్తున్నది. ఆ గుర్రం బొమ్మను చూడగానే నాకెందుకో జాలి కలిగింది. ఇంట్లో మా బామ్మా అంతే, ముడతలు పడిన శరీరం.. కంటి చూపు ఆనదు. బాగా వంగిపోయిన నడుము.. కర్ర సాయం లేనిదే నడవలేదు. పాపం, ఈ గుర్రం కూడా ముసలిదైపోయినట్లుంది. దీని ఆలనాపాలనా చూడాలి.

నాకప్పుడు ఎనిమిదేళ్లు. మా అమ్మమో, నన్ను అక్కనీ ఎవరింటికో తీసుకు వెళ్ళింది. వారిల్లు చాలా విశాలంగా ఉంది. మధ్యలో పెద్ద హాలు. చుట్టూ ఐదారు గదులు. హాలు మధ్యలో ఉయ్యాల బల్ల ఉంది. ‘హాయ్..’ సంతోషంగా ఎగురుకుంటూ ఆ ఉయ్యాల బల్ల ఎక్కేసి ఊగడం ప్రారంభించాము. ఉయ్యాల బల్ల కొంచం ఎత్తులోనే ఉండటంతో దాని మీద కూర్చుంటే కాళ్లు నేలకు ఆనడం లేదు. మా అక్కకి ఆ ఇబ్బంది లేదు. మరి అక్క నాకంటే పొడుగు కదా. తన కాళ్లను నేలకు ఆనించి తోస్తూ, భలే తమాషాగా ఉయ్యాల ఊపు ఎక్కువ అయ్యేలా చేస్తుండేది. ఎర్ర బస్సు డ్రైవర్ లాగానే అక్క ఊయ్యాల డ్రైవర్ అయిపోతుందనుకున్నాను. పక్షికి రెక్కలొచ్చి ఎగురుతున్నట్లు, అంతలో క్రిందకు వాలుతున్నట్లుగానే ఉయ్యాల బల్ల పైకీ క్రిందకీ వస్తోంది. పైకి ఎగురుతున్నప్పుడు గుండె బరువెక్కినట్లు అనిపిస్తుంటే, క్రిందకు వస్తున్నప్పుడు తేలిక అవుతున్నట్లు అనిపించ సాగింది. ఆ తర్వాత చాలా పెద్దయ్యాక విమానం టేకాఫ్, ల్యాండింగ్ అప్పుడు ఇలాంటి భావనే కలిగింది. కానీ అప్పుడేమో విమానం అంటే పేపర్ విమానమే నాకు తెలుసు. భవిష్యత్తులో విమానం ఎక్కుతానని నేను అస్సలు అనుకోలేదు. కానీ పక్షిలా ఎగరాలని మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుండేది. ఎగిరే శక్తి పక్షికి ఎలా వచ్చిందా !! అని తెగ ఆశ్చర్యపోతుండే వాడ్ని.

సరే, ఉయ్యాల బల్ల ఎక్కి, ఓ నాలుగు ఊపులు ఊగగానే ఇంటావిడ వచ్చి, ‘బల్లకు కట్టిన గొలుసు బాగాలేదు. గట్టిగా ఊగకండర్రా’ అంటూ హెచ్చరించింది. అప్పటి వరకు పెద్దపెద్ద ఊపులు ఊగుతున్న మాకు భయం వేసింది. ఉయ్యాల బల్ల ఊపులు ఎంత పెద్దవంటే, అటు ఇంటి కప్పు తాకుందా అన్నంతగా పైకి వెళ్ళి, అంతలో దూకుడుగా నేలకు దిగుతోంది. క్షణంలో మళ్ళీ అటూ అంతే ఎత్తుకి వెళుతున్నది. ఎత్తునుంచి పడితే..అమ్మో ఏమైనా ఉందా? మొదట్లో ఆ భయం రాలేదు, కానీ ఇంటావడ వచ్చి గొలుసులు బాగాలేవని చెప్పేసరికి పడిపోతామేమో అన్న భయం పుట్టి చమటలు పట్టేశాయి. నెమ్మదిగా ఉయ్యాల బల్ల వేగం తగ్గగానే అక్క తనకు తెలిసిన విద్యతో కాళ్లు నేలకు తాకిస్తూ బ్రేక్ లు వేస్తున్నట్లుగానే బల్ల వేగాన్ని అదుపు చేసింది. ఉయ్యాల బల్ల ఆగగానే, నేను క్షేమంగా దిగేసి ఊపిరి పీల్చుకున్నాను. అచ్చు ఇలాంటి భావనే విమానాలు నిజంగా ఎక్కినప్పుడు కలిగింది. రైలు, బస్సు వంటివేమో నేలమీదనే పోతుంటాయి కదా, కాబట్టి అవి ప్రమాదకరం కావనీ, అదే ఆకాశంలో తిరిగే విమానం ఆ రెంటికంటే ప్రమాదకరమని మొదట్లో అనుకున్నాను. చాలా పెద్దయ్యాక తెలిసిందేమిటంటే, టెక్నాలజీ పరంగా చూస్తే, రైలు బస్సు ప్రయాణాల కంటే విమానయానం సురక్షితమైనదే. కాకపోతే గాలిలో ఎగరుతుండటంతో మనలో భయం పోవడం లేదు. ఇప్పుడు ప్రపంచమంతటా ప్రతి గంటకూ పది వేలకు పైగానే విమానాలు ఎగురుతున్నాయి, క్షేమంగా దిగుతున్నాయి. విమాన ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. అంటే టెక్నికల్ లోపాల వల్ల జరిగే ప్రమాదాలు తక్కువనే కదా. కనుక అన్ని ప్రమాదాలను పాపం, విమానానికే కట్టబెట్టడం ఏం సబబు చెప్పండి. సరే, ఈ లెక్కలు గట్రా అప్పట్లో నాకు తెలియదు కదా. మళ్ళీ ఉయ్యాల బల్ల దగ్గరకే వెళదాం. పదండి..

ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇంటావిడకు మేము ఉయ్యాల ఊగడం ఇష్టం లేదట. బల్ల పాడైపోతుందట. ఈ విషయం తెలియగానే నా ముఖం కందగడ్డలా మారింది. కోపం రాగానే నా బొటనవేలు నోట్లోకి వెళ్ళింది. చాలా ఏళ్లు వచ్చేదాకా నేను నోట్లో వేలు వేసుకునే వాడ్ని. పాలపళ్లు రాలి, కొత్త పళ్లు వచ్చేటప్పుడు కూడా ఈ అలవాటు మానలేదు. దీంతో ముందు వరసలోని పై పళ్లలో రెండు పైకి లేచాయి. నోట్లో పళ్లు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో ఇప్పుడున్నంత అవగాహన అప్పట్లో తల్లిదండ్రులకు ఉన్నట్లు లేదేమో. ఒకవేళ వాళ్లు చెప్పినా నేను వినలేదేమో.. ఏమో.. నాకు గుర్తులేదు. సర్లేండి. నెమ్మదిగా బల్ల దిగాము. అక్కేమే అమ్మ ఒడిలో కూర్చుని పెద్దోళ్ల మాటలు వింటున్నది. నేనేమో అబ్బాయిని కదా. ఎనిమిదేళ్లు వచ్చేశాయి.. పెద్దపిల్లాడ్ని అయ్యాను అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఇళ్లంతా చూడటానికి బయలుదేరాను. ఒక్కో గది చూస్తూ దక్షిణం దిక్కున ఉన్న గది తలుపులు తెరిచాను. అలా తెరుస్తున్నప్పుడు తలుపులు – ‘కిర్రు.. కిర్రు..’ మంటూ శబ్దం చేశాయి. ఇందాక ఉయ్యాల బల్లమీద నుంచి పడతామనుకున్నప్పుడు వచ్చిన భయం కంటే ఈ శబ్దం మరీ భయపెట్టింది. మగ పిల్లలు భయపడకూడదని అప్పటికే కొన్ని సినిమాలు చూసి తెలుసుకున్నాను లేండి. పైగా మగ పిల్లలు అప్పుడప్పుడు సాహసాలు చేయాలట. అది రూల్ అని మా ఫ్రెండ్ గాడు చెప్పాడు. సాహసాలు అంటే పెద్దవేమీ కావులేండి. గెంతడాలు, దూకడాలు, పరిగెత్తడాలు, కుస్తీ పట్టుకోవడాలు అన్న మాట. అందుకే ధైర్యంగా గదిలోకి వెళ్ళాను. ఆ గదిలో వెళుతురు కూడా తక్కువగానే ఉంది. వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. పనికిరాని వస్తువులన్నీ ఈ గదిలోనే పడేసినట్లున్నారు. అప్పుడు చూశాను. ఓ మూలగా కొయ్య గుర్రాన్ని. బాగా వెలిసిపోయింది. అది నా వైపు దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. పాపం, దీన్ని రక్షించాలనుకుని ప్రేమగా దాన్ని నిమిరాను. అంతే – ‘కిర్రు.. కిర్రు’ మంటూ శబ్దం. చెక్క గుర్రం నుంచి ఈ వింత శబ్దం వస్తున్నదేమో అని భయపడ్డాను. కానీ, నా వెనుక వైపు నుంచి వచ్చినట్లు అర్థమై వెనక్కి చూశాను. అప్పటికే తలుపు తోసుకుని ఇంటావిడ గదిలోకి వచ్చేసింది. ఈ సారి ఏమంటుందో అని నాకు మరింత భయం వేసింది. కానీ..

‘ఏరా, ఈ గుర్రం నచ్చిందా.. కావాలా..’ అంటూ ఆఫర్ ఇచ్చింది. కావాలన్నట్లుగా తల ఊచి నోట్లో వేలు వేసుకున్నాను. ‘సర్లే అమ్మకు చెబుతాను, రేపు జీతగాడ్ని పంపిస్తే గుర్రం ఇస్తాన్లేరా’ – అనేసరికి ఆమె పట్ల ఉన్న మునుపటి భయం, కోపం పూర్తిగా పోయి, చెక్క గుర్రం వరంగా ఇచ్చే దేవతగా కనిపించింది. బోలెడు సంతోషం వేసింది.

అప్పటి నుంచీ చెక్క గుర్రం గురించి ఆలోచనలు. ఇంట్లోకి తీసుకు వస్తే దాన్ని ఎక్కడ పెట్టాలి, దానికి ఏ పేరు పెట్టాలి, దానితో ఎలాంటి ఆటలు ఆడాలి..ఇలా సాగుతున్నాయి ఎడతెరప లేని ఆలోచనలు. ఎప్పుడు పట్టిందో తెలియదు కానీ, నిద్ర పట్టేసింది. మర్నాడు నిజంగానే చెక్క గుర్రం ఇచ్చేసింది ఆ దేవత. దానికేమో నేను ‘కీలు గుర్రం’ అని పేరు పెట్టాను. ఎందుకంటే, అప్పటికే ఆ సినిమా నేను చూసాను. కీలుగుర్రం సినిమాలో నాకు బాగా గుర్తున్నవి రెండు –

  1. ఇద్దరు ఆడ రాక్షసులు రాత్రి వేళ ఏనుగులను చంపి తినడం.
  2. ఎవరో తెలియదు కానీ భలే చిత్రంగా కీలు గుర్రాన్ని తయారు చేస్తారు. అది ఎక్కి ఓ కుర్రాడు ఆకాశ వీధుల్లో ఎగురుతుంటాడు. అమ్మాయిని కూడా ఎక్కించుకుని పాట కూడా పాడుతుంటాడు.

ఇంట్లో ఈ చెక్క గుర్రం రాగానే – అమ్మని అడిగాను, ‘దీని మీద ఎక్కి ఎగురొచ్చా’ అని. అమ్మేమో ‘ఎగరడమా, అది కుదరదురా’ అంటూ తేల్చి చెప్పేసింది. అయినా ఊరుకోలేదు. నా కీలుగుర్రం కూడా ఎగరాలి. పెద్దయ్యాక సినిమాలోని కుర్రాడు లాగానే ఓ అమ్మాయిని ఎక్కించుకుని పాట పాడాలి. ఈ ఆలోచనలు ఎక్కువ కావడంతో ఒకరిద్దరు ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను. ‘లోపల ఏదో యంత్రాలు పెట్టాల్రా.. నేను మా మామయ్యని అడుగుతాన్లే. మామయ్య గాడేమో సైన్స్ చదువుతున్నాడుగా, మార్చేస్తాడులే, దీన్ని కీలు గ్రురంలాగా’ అంటూ ఉత్సాహపరిచాడు. వారం గడిచినా ఆ మామయ్య గాడు రాలేదు. ఇంతలో ఫ్రెండ్ గాడేమో వేరే ఊరు చెక్కేశాడు. ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చెక్క గుర్రం కీలుగుర్రం కాలేదు. అది ఇంట్లో అలాగే పడి ఉంది, జాలిగా నా వైపు చూస్తూ.

కానీ, ఆకాశంలో ఎగరాలన్న కోరిక రోజురోజుకీ ఎక్కువ అవుతున్నది. అది,1964లో అనుకుంటా – ఎండాకాలం సెలవులకు మేము గుంటూరు నుంచి అడవిరావులపాడు వచ్చాము. అప్పటికే నేను కాగితాలతో విమానం, రాకెట్, పడవ, గూడు పడవ, కత్తి పడవ, నాలుగు గిన్నెల గుత్తి, సీరా బుడ్డి, కమలం పువ్వు, వంటి బొమ్మలు తయారుచేసే విద్య నేర్చేసుకున్నాను. అంతే కాదు, బంక మట్టి , ఎండు పుల్లలతో విమానం, గూడు బండి బొమ్మలు చేయడం కూడా వచ్చేసింది. అయితే ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. నా విమానం, గూడు బండి బొమ్మలకు చక్రాలు సరిగా కుదరడం లేదు. బంక మట్టితో ఉండలు చేసి చక్రంగా గుండ్రంగా మార్చి బిగించినా కుదరడం లేదు. బొమ్మకు దారం కట్టి లాగగానే మట్టి చక్రాలు విరిగిపోయేవి. దీనికి మార్గం ఏమిటా అని ఆలోచిస్తుంటే ఓ చక్కటి ఉపాయం తట్టింది. మా ఊర్లో ప్రక్క వీధిలోనే ఆర్ఎంపీ డాక్టర్ ఒకాయన ఉండేవాడు. ఓ సారి ఆయన ఇంజెక్షన్ చేశాక మందు బాటిల్‌నీ దాని రబ్బరు మూతనీ చెత్త బుట్టలో పడేసేవాడు. నాకు అది గుర్తుకు వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెత్తలో పడేసిన రబ్బరు మూతలను ఏరుకు వచ్చాను. అమ్మనడిగి సూది తీసుకుని రబ్బర్ మూత మధ్యలో చిల్లు పెట్టాను. చిన్న అగ్గి పుల్లకు అటూ ఇటూ రబ్బర్ మూతలు గుచ్చాను. రబ్బరు మూతలను నేర్పుగా విమానం బొమ్మకు బిగించి దారంతో లాగడం మొదలు పెట్టాను. మట్టి చక్రాల్లా ఇవి విరగలేదు. పైగా లూజ్ అయినకొద్ది రబ్బరు చక్రాలు తిరగడం మొదలెట్టాయి. గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యాను.

ఇలా ఏవేవో ప్రయోగాలు చేస్తూ, వాటి గురుంచి పల్లెటూరి ఫ్రెండ్స్‌కి చూపిస్తుంటే వాళ్లేమో బోలెడు ఆశ్చర్యపోయేవారు. ఇలా ఓ రోజు పేపర్ విమానాలు ఎగురవేస్తున్నప్పుడే ఓ వింత జరిగింది.

ఆకాశంలో ఉన్నట్లుండి పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కి పడి, పైకి చూశాము. క్షణాల్లో ఆకాశంలో విమానం ప్రత్యక్షమైంది. అంతలో వేగంగా మా ఊరు దాటి వెళ్ళిపోయింది. కానీ అది వదిలిన పొగ చాలా సేపు కనిపించింది. అప్పటికే ఎర్ర బస్సులు, లారీలు కూడా ఇలాగే పొగ వదిలిపెడుతుండేవి కదా, అందుకే విమానం పొగ చూసి మేమేమీ ఆశ్చర్యపోలేదు. మా ఆశ్చర్యమల్లా పేపర్ విమానం ఏ మాంత్రికుని మాయాజాలంతో పెద్ద విమానంగా మారిపోయిందనే. నిఝంగా అలాగే అనుకున్నాము. అప్పట్లో విమానాలు దిగే చోటుని విమానాశ్రయం అంటారని కూడా తెలియదు. టెన్త్ అయ్యాక ఓ సారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు చాలా క్రిందగా, ఇళ్ల మీదగా వెళుతుండే విమానాలు చూశాను. ఆకాశంలో చూసిన ఈ అద్భుత దృశ్యం నా మదిలో బలంగా నాటుకుపోయింది. చాలా సార్లు విమానం ఎక్కి నేనూ ఆకాశయానం చేసినట్లు కలలు వచ్చేవి. ఒక్కోసారి మరింత చిత్రంగా.. నా చేతులను బలంగా ఊపగానే ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది. ఆ వెంటనే చేతులు పక్షి రెక్కలుగా మారిపోయాయి. గెంతడం మొదలు పెట్టాను. మునుపటి కంటే ఎక్కువ ఎత్తుకు గెంతగలగుతున్నాను. మొదట్లో భూమికి ఒక అడుగు ఎత్తు లేవగలిగాను. ఇంకా ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా ఇంటి చూరు దాకా ఎగర గలిగాను. ఆశ్చర్యం.. గదిలో – గాలిలో చెక్కర్లు కొట్టగలుగుతున్నాను. ఉయ్యాల బల్ల పైకి లేచినట్లుగా , పక్షి ఎగురుతున్నట్లుగా నేనూ పైకి, పైపైకి లేవగలుగుతున్నాను. ఎగిరే నేను దిగాలంటే ఎలాగా అని ఆలోచిస్తుంటే , అంతలో ఆ టెక్నిక్ కూడా తెలిసింది. చేతులు ముడవగానే క్రిందకు దిగగలుగుతున్నాను. మళ్ళీ చేతులు జాపగానే పైకి ఎగరగలుగుతునాను. ఆ టెక్నిక్ పట్టేశాను. ఇక కీలు గుర్రం అక్కర్లేదు. విమానమూ అక్కర్లేదు. ఏ ఊరైనా ఎగురుతూ వెళ్ళవచ్చు..హ్హాహ్హాహ్హా..

ఇలా అనుకుంటుండగా కల చెదిరింది.. మెలుకువ వచ్చేది. ఓహ్..కలేనా, నిజమైతే ఎంత బాగుండేది అనుకున్నాను.

నా చిన్నప్పటి కల ఇప్పుడు సాంకేతిక సహకారంతో నిజం అయింది. భ్యూమ్యాకర్షణ శక్తిని బలహీనపరిస్తే మనిషి పై పైకి గెంతుతాడు. స్వేచ్ఛగా ఎగరగలుగుతాడు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ మధ్యనే కొన్ని చోట్ల పిల్లలూ పెద్దలకు గేమ్‌లా ఓ గదిలో ఎగిరే అవకాశం కల్పిస్తున్నారు.

నా మనవడు విరాజ్, వాడి నాన్న రాజేష్ ఆ మధ్య ఇంగ్లండ్ లోని ‘I FLY’ సెంటర్‌కి వెళ్ళి అక్కడి విశాలమైన గదిలో రెక్కలు తొడిగిన పక్షిలా ఎగరగలిగారు. ఆ దృశ్యం చూడగానే నాకు నా చిన్నప్పటి కల గుర్తుకు వచ్చింది. మనవడితో చెబితే, వాడు ఆ చిన్న వయసులోనే (ఆరేళ్లు) ‘ఇదంతా జీరో గ్రావిటీ వల్ల సాధ్యమవుతుంది తాతా’ అంటూ ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడో బీఎస్సీలో చదివిన సూక్ష్మమైన ఫిజిక్స్ సూత్రాలను మా మనవడి తరం వాళ్లు ఆరేళ్లలోనే తెలుసుకోగలుగుతున్నారు. భూమ్యాకర్షణ శక్తి క్రమంగా తగ్గుతుంటే మనం ఎగరడం సులువవుతుంది. జీరో గ్రావిటీ అయితే అంతరక్షంలో తేలియాడుతూ వెళ్లవచ్చు, ఈ సూత్రంతోనే అస్ట్రోనాట్స్ అంతరక్ష ప్రయాణం చేయగలుగుతున్నారని కొంచం పెద్దయ్యాక తెలిసింది. అప్పుడనిపించింది – ప్రతి అద్భుతం వెనుక సైన్స్ సూత్రం ఒకటి ఉంటుంది. అది తెలియనంత వరకే మాయలు, మంత్రాలు, మహిమలు మనం నమ్ముతుంటాము. హేతువు తెలిస్తే చాలా భయాలు, సందేహాలు తొలిగిపోతాయి. ఈ కాలం పిల్లలు ఇలాంటి లాజిక్స్‌ని ఇట్టే పట్టేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి వారికిప్పుడు అనేక పుస్తకాలు, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ లేని రోజుల్లో, అంటే నా చిన్నప్పుడు ప్రతిదీ ఆశ్చర్యమే, అద్భుతమే. ఈ రకంగా చూస్తే మేము ఓ అద్భుత ప్రపంచంలో బతికామన్న సంతృప్తి కలుగుతోంది.

ఆకాశంలో పక్షిలా ఎగరలేకపోయినప్పటికీ నా జీవితంలో పెద్ద పెద్ద విమానాలు ఎక్కుతాననీ, సముద్రాలు, ఖండాలు దాటుతానని అనుకోలేదు. ఓ బలమైన కోరిక తీరినట్లు మొదటి సారి విదేశీ యాత్ర చేసినప్పుడు అనిపించింది. ముఖంలో ఆనందం తాండవమాడింది. అయితే అంతకు ముందు రెండు సార్లు చిన్నచిన్న విమానాలు ఎక్కాను. అందులో ఒకటైతే పైలెట్ ట్రైనీ విమానం. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే కూర్చోగలరు. అలాంటి విమానం ఎక్కి గగన విహారం చేస్తూ హైదరాబాద్ అందాలు చూడగలిగాను. కొన్ని సంఘటనలు చాలా చిత్రంగా జరుగుతుంటాయి. పైలెట్ ట్రైనింగ్ కోసం ఉపయోగించే విమానం ఎక్కిన సంఘటన కూడా అలాంటిదే.

ప్రైవేట్ విమానం ఎక్కడం హైటెక్ సిటీని విహంగ వీక్షణం చేయడం నాలాటి మధ్యతరగతి వారికి కుదిరే పనేనా? చెప్పండి. నిజానికి ఇది కలలో కూడా రాదు. తరంగా రేడియో స్టేషన్‌లో ప్రొగ్రామ్ డైరెక్టర్ పనిచేస్తున్నపుడు అనుకోకుండా అవకాశం వచ్చింది. హైదరాబాద్ శివారులోని ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమీ వారి ఆహ్వానం మేరకు అక్కడకు మా తరంగా టీమ్ వెళ్ళింది. అతి చిన్న విమానంలో మేము ఐదుగురం కూర్చోగానే పైలెట్ విమానాన్ని నడిపాడు. రన్‌వే మీద నుంచి టేకాఫ్ అయింది. చిన్న విమానం హైదరాబాద్ ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టింది. ఈ అకాడమీ ప్రాంగణంలోనే ఓ యుద్ధ విమానం ఉంది. ఆ విమానం దగ్గర మేము ఫొటో దిగాము. టీమ్ లీడర్‌గా నేను, నాతోపాటుగా ఆర్.జె నిహార, వివేకానంద్‌తో పాటుగా మరో ఇద్దరితో తరంగా టీమ్‌గా తయారై అక్కడకు వెళ్ళాము. ‘ఆకాశమే నీ హద్దురా..’ అన్న పేరిట పైలెట్‌గా శిక్షణ పొందుతున్న వారి అనుభవాలను రికార్డ్ చేసి ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేశాము. ఇదో వింత అనుభవం.

విమానం ఎక్కడం ఇది రెండో సారి. అంతకు ముందు చెన్నై నుంచి నేనూ మా ఆవిడ, అమ్మాయి హైదరాబాద్‌కి ప్లైట్‌లో వచ్చాము. అయితే ఆ సందర్భంలో మనసులో తెగ ఆందోళన. విమానం ఎక్కినందుకు కాదు, మా ఆవిడకు తగిలిన దెబ్బ గురించి. తిరుమలలో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయింది. చెన్నై విజయా ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. కొన్నాళ్లు మా అక్కా వాళ్ళింట్లో ఉన్న తరువాత మేనల్లుడు ప్లైట్ టికెట్ బుక్ చేశాడు. నెమ్మదిగా ఆమెను హైదరాబాద్ తరలించాము. ఈ గందరగోళ పరిస్థితిలో తొలిసారిగా విమానం ఎక్కామన్న అనుభూతి మనసు పొరల్లో చేరనేలేదు.

మా అబ్బాయి ఫ్యామిలీ ఇంగ్లండ్‌లో సెటిల్ కావడంతో 2017లో అంతర్జాతీయ విమానం ఎక్కే అవకాశం వచ్చింది. అప్పుడు మాత్రం నా చిన్ననాటి విమానం ముచ్చట్లు గుర్తుకు వచ్చాయి. నా యీ తొలి విదేశీ యాత్ర లో అత్యంత ఆనందం కలిగించిన విషయం – నేను తాతను కావడం, తను బామ్మ కావడం. మాకు మనవడు పుట్టాడు. ఇంతకు ముందు ప్రస్తావించిన మనవడు వీడే (విరాజ్). మా తుర్లపాటి వంశంలో 21వ తరం వాడు. వీడికో తమ్ముడు (విహాన్) 2022లో పుట్టాడు. ఈ ఇద్దరు మనవళ్ల మధ్యలో మరో మనవడు (కూతురు కొడుకు) 2021లో పుట్టాడు. వాడి పేరేమో అద్వైత్. ముగ్గురు మనవళ్లతో బామ్మ తాతలు ఆడుకుంటూ చిన్నప్పటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము.

ఇప్పటికి (2024 నాటికి) విమానం ఎక్కి రయ్యిరయ్యిన యుకె నాలుగు సార్లు వెళ్ళాము. ఈ నాలుగు పర్యటనల్లో చాలా విశేషాలు మదిలో నిక్షిప్తమయ్యాయి. ప్రస్తుతానికి కొన్ని గుర్తుచేసుకుంటున్నాను. విశ్వ విఖ్యాత నాటక రచయిత William Shakespeare పుట్టిన ఊరు చూడటం, అలాగే  లండన్ లోని Madame Tussauds మ్యూజియంలో క్వీన్ ఎలిజబెత్ మైనపు బొమ్మ ప్రక్కన నిలబడి ఫొటోలు దిగడం, రెండు యూనివర్శిటీలు (Oxford, Cambridge), పిల్లలు పాడుకునే రైమ్‌లో వచ్చే లండన్ బ్రిడ్జ్ చూడటం, సరదాగా హాట్ క్రాస్ బన్స్ తినడం, నాటక ప్రదర్శనలు వీక్షించడం.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంగ్లండ్‌లో నాటక ప్రదర్శనలను విశేషంగా ఆదరించడం నాకెంతో నచ్చింది. Harrogate వెళ్ళినప్పుడు అక్కడి థియేటర్ లో ‘The Emperor’s New Cloths’ నాటకాన్ని చూశాను. హాల్ ఫుల్ అయింది. ప్రదర్శన తీరు, దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకున్నాయి.

మరో చోట (పేరు గుర్తుకు రావడం లేదు) రెండవ ప్రపంచ యుద్ధం నాటి విమానాలు చూశాను. ఈ మధ్య టివీలో ‘విమానం’ పేరిట ఓ సినిమా చూశాను. విమానం ఎక్కాలని ఆ పిల్లాడి కల, పట్టుదల చూస్తుంటే నాకు చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చాయి. కాకపోతే పిల్లాడు విమానం ఎక్కుతాడు, అదే విమానంలో తుది శ్వాస విడుస్తాడు. ఈ దృశ్యం మాత్రం నన్ను కలచివేసింది.

మొత్తానికి ఇప్పటికీ విమానం ఎక్కడం, ఆకాశయానం చేయడం, పక్షిలా ఎగరాలనుకోవడం.. ఇవన్నీ చాలా మందికి తీరని కోరికలే. నా జీవన యాత్రలో కలలు సాకారం కావడమన్నది ఓ అదృష్టం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here