తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-29

1
3

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

281.
పాపి, దోషి వీడని యాగ్రహింప, పాపరహితు డెవడు?
పాపి మనోగతంబుల దెల్సిన వారలే మనము?
పాపి యయ్యె వాడెదో దౌర్భాగ్యంబు చేత, వానియం దను
కంపము లేక నిందించ దగునె – మంకుతిమ్మ!

282.
పాపంబు సేయుట సులభ సాధ్య మదేమి గాదు; ఎన్ని
తాపంబులన్ వాడు తపించి తపించి వేగియుండెనో!
పాపి యంతరంగ కూప తలమును, దరి నిల్చిన వాడెఱుంగునే!
పాపి యెదలోన దూరి చూడవలె – మంకుతిమ్మ!

283.
ఎంతటివాడో రావణుడు – యాతని తెగడుదువేని – తాళుము;
ఎంతటి లావణ్యమోయది యాతనిన్ మోహంబునన్ బడవైచె,
ఎంత వారలైన దాసులగుదురని దెల్సియు; నాతని తెగడుదువేని
కొంత మూర్ఖత్వమే యగు – మంకుతిమ్మ!

284.
జీవ ఋణముల లెక్కలవేవో తెలియని మనము,
అవును సరియని, కాదు తప్పని వక్కాణించ గలమె!
అవుగాదనెడిది కడు నిష్ఠుర నిర్ణయ భారము మనకేల?
దైవమునకే వదలి వేయ సరి – మంకుతిమ్మ!

285.
సౌఖ్యపు దాతురత మనము దొల్త జేసిన పనులు నెమరు వేయ
సహ్యము కావని యని దలచి సిగ్గున తలదించుకొనమె; ఆ
సహ్యము కాని వాటిని మరల మరల జేయకుండుట, య
వశ్యము గాదె – మంకుతిమ్మ!

286.
దైవ పాశవిక స్వభావంబు లుండు నరునియందు సాజముగను
భావంబుల మిశ్రమ రూపమే నరజన్మ మరయ
దైవాంశ మది ప్రబలిన నరుడు యుత్తమగతిని పొందు
పశ్వాంశంబు ప్రబలిన యధోగతి పాలగు – మంకుతిమ్మ!

287.
నరుల వక్ర స్వభావంబుల నెంచనేల?
గిరి, తన శృంగంబుల, లోయల గని వగచునే?
గరళము, సుధమును పుట్టవే పాల్కడలి చిల్కిన వేళ
వక్ర స్వభావములవి సాజము – మంకుతిమ్మ!

288.
రాముడుండిన కాలమందే రావణుడొకడుండె గాదె,
భీముడుండిన కాలమందె దుశ్శాసనుడొకడుండె
ఇమ్మహి యన్యాయంపు మార్గమున నడయని వాడెవడు?
రామ భటుడవై యద్దారి నడువుము – మంకుతిమ్మ!

289.
బహు లోతైనదీ సంసార జలధి, అరయ నశక్యము దీని లోతు, ఇ
మ్మహా కడలినిన్ మునిగి తేలి, దాని న్యాయాన్యాయ విషయంబుల
బహు వివరంబుగ దెలుపు వారుల్గలరే! యందరున్
కుహనా వేదాంతులే – మంకుతిమ్మ!

290.
శర్కర భక్షంబుల పిల్లల చేరువ నుంచి, వారి చే
చిక్క నుంచి, దాని వారు తస్కరింప, దూర నేల వారిని?
మక్కువగాని యపేక్షల నూరించి, మధుపానంబు సేయు రీతి, ఇవ్వధి
చిక్కున బడవేయు గాదె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here