[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘భరతమాత ముద్దు బిడ్డడా!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ధ[/dropcap]వళవర్ణ శోభిత హిమశిఖరం
రక్కసిమూకల దౌర్జన్యానికి
రక్తవర్ణ సంశోభితమయిసది
దేశక్షేమం కోసం తపనబడే
దేశమాత ముద్దు బిడ్డడా
ఓ భరతవీర సైనికుడా
భాయీ భాయీ అంటూనే
నిన్ను బలిగొన్నారే
బాంబుదాడిలో
ఛిద్రమైన నీ దేహం
చెట్టు కొకటి పుట్ట కొకటైతే
కన్నూ కాలు చేతులను
కూడదీసి ముక్కలైన
భాగాలుమూటగా కట్టారు
ఏ తల్లికి కడుపు కోతో గదా!
ఏ ఇల్లాలు కన్నీటి వరదైనదో కదా!
నీ ఆఖరి శ్వాసలో కూడా
శత్రువులను వెతుకుతూ
మూతబడని నీ కన్నూ
ఎదురొచ్చిన వారిని కాల్చాలనే
కసితో ట్రిగ్గర్ పై నిలిచిన నీ వేలు
దేశమాత సెల్యూట్ కోసం
నుదుటిన ఆనిన నీ చేయి
ఎగిరిపడిన నీ గుండె చప్పుడులో
గాలిలో కలిసిన నీ జైహింద్ నినాదం
మా చెవులలో మారుమోగుతున్నది
రెప్పపాటులేని నీ కావలే
మా స్వేచ్ఛకు ప్రాణవాయువు
నీ చూపు సారించకపోతే
అనునిత్యం మాకు ప్రాణగండమే
ఇంతటి మారణహోమం సృష్టించిన
ఉగ్రవాద మతోన్మాద శక్తులకు
దీటైన సమాధానమివ్వడానికి
నీ సోదర సైనికులు ప్రతిన పూనారు
దేశం కోనం నిన్నర్పించిన నీ వారికి
దేశమాత సేవలో ప్రాణార్పణ చేసిన
మీ వంటి వీర సైనికులకు
దోయిలొగ్గి నివాళులర్పిస్తున్నాం.
జై హింద్! జై హింద్! జై హింద్!