శ్రీమద్రమారమణ-3

0
4

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[బడి వదిలిన తరువాత పిల్లలంతా వెళ్ళిపోతారు. వైనతేయ దస్తగిరి సారు దగ్గరకి వెళ్తాడు. ఆయన వాడికి పద్యం నేర్పుతాడు. వర్కు బుక్కులు కొనలేదు, నాయిన ఇంకా డబ్బులివ్వలేదని వైనతేయ చెబితే, తాను కొనిస్తానని చెప్తాడు సారు. ఎల్లుండి రెండో శనివారం, ఆవలెల్లుండి ఆదివారం సెలవులు కాబట్టి శనివారం మధ్యాహ్నం తమ ఇంటికి రమ్మని చెబుతాడు సారు. ఆ రోజు రాత్రి ప్యాపిలి చెన్నకేశవ స్వామి దేవళంలో ఆంజనేయ శర్మగారనే విద్వాంసుడు ‘భక్త మార్కండేయ’ హరికథ చెప్తారని, మనిద్దరం వెళ్దామని చెప్తాడు. వైనతేయ సంతోషంగా ఒప్పుకుంటాడు. ఇంటికి వెళ్ళి కాళ్ళూ చేతులు కడుక్కుని అమ్మ పెట్టిన కారం బొరుగులు తింటాడు. రాత్రి నాయిన ఇంటికి వచ్చాకా, సారు తనని ప్యాపిలిలో హరికథకి తీసుకువెళ్తానన్న సంగతి చెప్తాడు వైనతేయ. కోనేటయ్య తెచ్చిన కూరలతో ఇంట్లో వాళ్ళు అన్నం తింటారు. నాయన డబ్బులివ్వబోతే, వద్దని, పుస్తకాలు సారు కొనిస్తానన్నాడని చెబుతాడు. తమ కొడుకంటే సారుకు ఎంతో అభిమానమని అనుకుంటారు వైనతేయ తల్లిదండ్రులు. శనివారం పొద్దున్నే అమ్మ పెట్టిన ఉగ్గాణి తిని సారు వాళ్ళిల్లు చేరుతాడు. సారు భార్య నీళ్ళ కోసం బోరింగ్ వద్దకు వెళ్తుంతే, ఆమెను ఆపి, బిందె తీసుకుని నీళ్ళు తెచ్చి పెరట్లోని సిమెంట్ తొట్టిని నింపుతాడు వైనతేయ. మధ్యాహ్నం సారువాళ్ళతోనే అన్నం తింటాడు. భోజనమయ్యాకా, సారు కాసేపు మంచం మీద పడుకుంటే, ఆయనకు కాళ్ళు పడతాడు. ఆయన ఓ పద్యం చదవమంటే, ‘అమ్మలగన్నయమ్మ’ పద్యం చదువుతాడు. రాత్రి భోం చేసుకుని, ప్యాపిలి లోని చెన్నకేశవులు దేవళం చేరుకుంటారు గురుశిష్యులు. స్వామివారి దర్శనం చేసుకుంటారు. పూజారి నీలకంఠ దీక్షితులు గారు వారికి తీర్థం ఇచ్చి, శిరసులకు శఠగోప స్పర్శ చేయిస్తారు. ఈ కుర్రాడేవరని అడిగితే, తన శిష్యుడని, పద్యాలు బాగా పాడతాడని చెప్తాడు సారు. హరికథా విద్యాంసుడు ఆంజనేయశర్మ గారు రావటానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, వైనతేయని ఏదైనా పద్యమో, శ్లోకమో పాడమంటరాయన. సారు అనుమతి తీసుకుని ‘వసుదేవ సుతం దేవం’ పాడతాడు. అప్పుడే ఆలయంలోకి ప్రవేశిస్తున్న ఆంజనేయశర్మగారు ఆ శ్లోకం విని ముగ్ధులై, గాత్రం బావుందని, స్వచ్ఛమైన ఉచ్చారణతో ఆలపించావని అంటారు. హార్మోనిస్టు రాకపోవడంలో, అతని కోసం ఎదురు చూసే సమయంలో వైనతేయ కొన్ని పాటలు, పద్యాలు పాడతాడు, వినమని హరిదాసు గారు ప్రకటిస్తారు. – ఇక చదవండి.]

[dropcap]ద[/dropcap]స్తగిరి సారు వాడి వైపు చూసి సైగ చేశారు. వాడు ముందుగా ఆయన కాళ్లకు దండం పెట్టి, తర్వాత హరిదాసుగారికి పెట్టాడు. మైకు లేదు. సారు దగ్గరికి పోయి ఏదో చెప్పాడు. ఆయన సరే అన్నాడు.

వాడు, ‘సతీసక్కుబాయి’ సినిమాలోని

“జయ పాండు రంగ ప్రభో విఠలా!

జగదాధారా జయ విఠలా!

పాండురంగ విఠలా, పండరినాథ విఠలా!”

భజన అని అందుకొన్నాడు. భజన సంప్రదాయంలోకి చక్కగా ఒదిగే పాట అది. జలదుర్గం సుంకులమ్మ అమ్మవారి గుడిలో సారుతో కలిసి భజనలో కూడా కూర్చుంటూ ఉంటాడు వాడు.

మంచి లయ ప్రధానమైన పాట అది. మృదంగం ఆయన వెంటనే గ్రహించి, పాట కనుగుణంగా వాయించసాగాడు. పాట పూర్తయింది. భక్తులు చప్పట్లు కొట్టారు!

ఆంజనేయశర్మ ఆశ్చర్యపోయారు. ‘పిట్ట కొంచెం, కూత ఘనం అన్నట్లు ఉందే వీడి ధోరణి’ అనుకొన్నారు.

దస్తగిరి సారు కళ్లతోనే వాటిని మెచ్చుకున్నాడు.

ఆంజనేయశర్మగారు, దస్తగిరి సారును పిలిచి, “కార్యక్రమం పూర్తయిన తర్వాత మీరు వెళ్లిపోకండి సార్. మీతో మాట్లాడే పని ఉంది” అని చెప్పారు.

హార్మోనిస్టు పత్తాలేడు! ఏం అవాంతరం వచ్చిందో ఏమో పాపం! వైనతేయ హరిదాసు గారి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

“స్వామి, మా సారు కూడా హార్మోనియం బెమ్మాండంగా వాయిస్తాడు.”

శర్మగారి ముఖం ప్రసన్నమైంది!

“ఇంకేం అయితే! సార్, మీరు కొంచెం వాద్య సాయం చేయాలి” అని అభ్యర్ధించాడు ఆయన.

దస్తగిరి సారు మొహమాటపడ్డాడు. “నాకంత విద్యత్తు లేదు స్వామి! ఏదో.. కొంచెం..” అన్నాడు.

“పరవాలేదు” అన్నాడు హరిదాసు. “ఊర్లో ఎవరింట్లోనైనా హార్మోనియం ఉంటే తెప్పించండి దయచేసి” అని నిర్వాహకులకు చెప్పాడు. ఇద్దరు వెంటనే వెళ్లి ఎక్కడో ఒక హార్మోనియం సంపాదించి తెచ్చారు.

“రాగం, నా శృతి ముందే చెబుతాను. ఆదుర్దాపడకండి. కొంచెం అటు ఇటు ఐనా ఏం కాదు” అన్నాడా విద్వన్మణి.

దస్తగిరి సారు హార్మోనియంను శృతి చేసుకొన్నాడు. కాసేపు దాని మీద ‘హాయిహాయిగా ఆమని సాగె’ అన్న సినిమా పాటను వాయించాడు. హరిదాసుగారు ప్రశంసగా తల ఊపారు.

హరిదాసు గారు కాళ్లకు గజ్జెలు కట్టుకున్నారు. చిడతలు ఒక చేత ధరించారు. సాక్షాత్తు పుంభావ సరస్వతిలా ఉన్నాడాయన. మొదట విఘ్నేశ్వర స్తుతితో హరికథను ప్రారంభించడాయన.

“వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా!”

ఆయన గాత్రం విలక్షణంగా ఉంది. గొంతులో చిన్న జీర దానిని సుసంపన్నం చేసింది.

“నట్టాయి.. ఐదున్నర రూపక తాళం” అని సూచించారు వాయిద్యకారులకు.

ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తన ‘మహాగణపతిం మనసాస్మరామి, వశిష్ట వామదేవాది వందిత..’ ఆయన కంఠంలో కాంతులీనింది. తర్వాత, ‘శ్రీమద్రమారమణ గోవిందో.. హరి!’ అని భక్తులందరితో నినదింప చేశాడు.

తర్వాత సరస్వతీ ప్రార్థన. తర్వాత సర్వ విద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవుని ఇలా ప్రార్థించారు హరిదాసు.

“జ్ఞానానందమయం దేవం, నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వవిద్యానాం, హయగ్రీవ ముపాస్మహే!”

తర్వాత హరిదాసు లందరికీ గురువైన, ‘హరికథా పితామహ’ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుల వారిని ఇలా స్మరించారు. ఆ పద్యం ఆంజనేయశర్మ గారే రచించి స్వరం కూర్చారు.

కం.:

సంగీతము, నృత్యములన్

అంగాంగములందు వెలుగు నభినయ ఫణితిన్

రంగారు హరికధాఝరి

పొంగెడు మాయాదిభట్ల పూజ్యుని గొలుతున్.

మోహన.. లో ఆ పద్యం మోగింది!

తర్వాత ‘భక్త మార్కండేయ’ కథాగానం ప్రారంభమైంది.

పరమేశ్వరునితో, వరము బడసినారు, మృకండ మహర్షి, మరుద్వతి దంపతులు. మృకండునికి ఆ పేరు ఎందుకు వచ్చిందో వివరించారు ఆంజనేయశర్మ. తపస్సమయంలో ఆయన నిశ్చలంగా, శిలాసదృశంగా నిలబడి ఉంటే, మృగములు తమ కండుయం (దురద) తీర్చుకోవడానికి ఆయన శరీరమునకు తమను తాము రుద్దుకునేవట. మృగముల కండుయమును తీర్చినవాడు కాబట్టి ఆయనకు మృకండుడు అని పేరు వచ్చింది. శ్రోతలు చప్పట్లు.

“శ్రీ మద్రమారమణ గోవిందా! హరి!” అని అందరితో నినదింప చేసినారు శర్మగారు.

శివుడు ప్రత్యక్షమై, గుణహీనుడైన చిరంజీవి పుత్రుడుగా కావాలా, లేక అత్యంత సద్గుణశోభితుడై, కేవలం 16 సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన సుతుడు కావాలా, అని అడుగుతాడు. వారు సద్గుణుడైన కుమారునే కోరుకుంటారు. మృకండుని కొడుకు కాబట్టి మార్కండేయుడైనాడు. ఈ సందర్భంలో శర్మగారు ఇట్లా చెప్పారు.

“నాయనలారా, దశరథుని పుత్రుడు ‘దాశరథి’ అనగా రామచంద్ర ప్రభువు.

‘దశరథస్య అపత్యం పుమాన్.. దాశరథిః’ అంటే దశరథునికి పురుషసంతానం అని అర్థం. అట్లా పుట్టినది ఆడపిల్ల ఐతే అపత్యం స్త్రీ.. అని వ్యుత్పత్తి వస్తుంది.

జనకస్య అపత్యం స్త్రీ.. జానకీ

అదేమి? తండ్రి పేరిట మాత్రమే పేరు ఉండటమెందుకని మీరనుకోవచ్చును. మన నిజ వ్యవహారంలో మనం కూడా ఏ దరఖాస్తు ఫారం నింపినా, మన పేరు తర్వాత ‘సన్ ఆఫ్’  అని అబ్బది పేరు రాయాల్సిందే. కొన్నిసార్లు తల్లి పేరు కూడా అడుగుతారు. అది శుభపరిణామం! నీ తల్లీ తండ్రి ప్రసక్తి లేకుంటే నీవు శూన్యం. అంటే జీరో!”

భక్తులందరూ నవ్వారు.

“మా తండ్రిగారు మారుతీశర్మగారు. నాకు ఆయన దయ వల్లే అంతో ఇంతో పాండిత్యం వచ్చింది. ఈ శరీరంతో పాటు, జ్ఞానాన్ని ఇచ్చినవాడు మా నాన్నగారు. ఆయన లేకపోతే నేను ఇక్కడ హరినామసంకీర్తనం చేయగలిగేవాడినా చెప్పండి!”

మళ్లీ నవ్వులు!

“భక్తాసురుడైన పహ్లాదుడన్నట్లు ‘తండ్రి హరి జేరుమనియెడి తండ్రి, తండ్రి!’.

ఆ కుమారుని సప్తర్షులు, బ్రహ్మదేవుడు దీర్ఘాయువు కమ్మని దీవిస్తారు.

16 సంవత్సరాలు నిండగానే యముడు తన భటులను పంపుతాడు. ఆ పిల్లవాడు వారికి సాధ్యం కాడు. సాక్షాత్తు యముడే వచ్చి, తన యమపాశమును ఆ బాలునిపై విసరగా, అతడు శివలింగమును పరిష్వంగమొనర్చి ఉండిపోతాడు. లింగోద్భవుడైన శివుడు కాలరూపుడి యముని సంహరించబోగా, సమవర్తి ఆయనను శరణు కోరతాడు. శివుడు యముని క్షమించి, మార్కండేయుడిని చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు.

నాయనలారా! ఏదీ ఒకసారి, భగవన్నామ స్మరణ చేద్దాం! శ్రీమద్రమారమణ గోవిందో! హరి!”

“ఈ మార్కండేయ మహర్షియే, మహాభారతంలోని అరణ్యపర్వములో ధర్మరాజుకు నీతిసూత్రాలు బోధించాడు. యమపాశానికి దొరక్కుండా ఆయన చేసిన స్తోత్రమే ‘చంద్రశేఖరాష్టకము’.

చంద్రశేఖర, చంద్రశేఖర పాహిమాం

చంద్రశేఖర, చంద్రశేఖర, చంద్రశేఖర రక్షమాం

అనే పల్లవితో మొదలై..

చంద్రశేఖరమాశ్రయే మమ

కిం కరిష్యతి వై యమః

అంటూ శ్లోకం ముగుస్తుంది.

భక్తులారా! చంద్రశేఖరుని ఆశ్రయిస్తే, నన్ను యముడేమి చేయ గలడు? అని దాని అర్థం” అంటూ అంజనేయశర్మగారు ఆ స్తోత్రంలోని ఎనిమిది శ్లోకాలనూ రాగయుక్తంగా గానం చేస్తూ ఉంటే, దస్తగిరి సారు హార్మనియం మీద అనుసరిస్తూ ఉంటే, ఓబులేశయ్య మృదంగం మీద లయ విన్యాసం చేస్తూ ఉంటే, చెన్నకేశవుల దేవళమంతా శివనామ సంకీర్తనతో మారుమోగింది. భక్తులు పరవశులై ఊగిపోయినారు.

“అష్టాదశ పురాణములలో ‘మార్కండేయ పురాణము’ ఒకటి. దీనిని తిక్కన శిష్యుడు మారన తెలుగు లోకి అనువదించినాడు. అది బృహత్ గ్రంథము. అందులో గద్యములు, పద్యములు కలిసి 2547 ఉన్నాయి.”

శ్రోతలందరూ ఆశ్చర్యపోయినారు.

“‘మనుచరిత్ర’, ‘సత్యహరిశ్చంద్రోపాఖ్యానము’ మార్కండేయ పురాణము నుండి తీసుకున్నవే, భక్తులారా! దీనిని మారన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి అంకితం ఇచ్చినాడు.

నాయనలారా! మనకు ఇంగ్లీషు వాడు చెబితే గాని మన గ్రంథాల విలువ తెలియదు. ‘పర్గీటర్’ అను పాశ్చాత్యుడు మార్కండేయ పురాణాన్ని మొత్తం ఇంగ్లీషులోకి అనువదించినాడు. ఇది జర్మనీ భాషలోకి కూడా కొన్ని అధ్యాయాలు, వెళ్లింది.”

సభలో కరతాళధ్వనులు!.

“ఆరుద్ర అని మహాపండితుడు, విమర్శకుడున్నాడు. మనకు ఆయన సినిమా కవిగా మాత్రమే తెలుసు! మార్కండేయ పురాణాన్ని ఆయన ఒక ‘మైనర్ విజ్ఞానేశ్వరీయం’గా అభివర్ణించారు. ఇందులో ఎన్నో ధర్మ సందేహాలకు సమాధానం ఉంది. ఉదా: ద్రౌపది ఎవరు? ఆమెకు ఐదుగురు భర్తలు ఎందుకున్నారు? లాంటివి.

ఇందులోని హరిశ్చంద్రుని కథను బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అద్భుత పద్యనాటకంగా వ్రాశారు. గుర్రం జాషువా గారు తమ కావ్యఖండం ‘స్మశానవాటిక’లో కూడా ఈ భావాలను మనోహరమైన పద్యాలుగా ఆవిష్కరించారు. అవి ఇప్పటికీ పండిత పామరుల నోళ్లల్లో నానుతూనే ఉన్నాయి” అంటూ ముగించారు ఆంజనేయశర్మగారు. చివరగా, “పవమానాసుతుడు పట్టూ పాదారవిందములకూ నీ నామరూపమునకూ నిత్యజయామంగళం” అన్న త్యాగరాజస్వామి వారి కీర్తన పాడారు అద్భుతంగా.

“మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే

చక్రవర్తి తనూజాయ, సార్వభౌమాయ మంగళమ్”

అని రామచంద్ర పరబ్రహ్మకు మంగళాశాసనము పలికారు శర్మగారు.

పూజారిగారు మూల విరాట్టు చెన్నకేశవ స్వామికి కర్పూర నీరాజనం ఇచ్చారు. భక్తులందరూ హారతి కళ్లకద్దుకున్నారు. రామలింగయ్యశెట్టిగారు భక్తులందరికీ పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.

వైనతేయకు ఇదంతా ఒక కలలా ఉంది! హరికథకుని ఆహార్యం, పద్యాలు పాడే విధానం, పాటలు ఆలపించే తీరు, సందర్భానుగుణంగా ఆయన చేసే నాట్యం, పాత్రల హావభావాల కనుగుణంగా ఆయన చేసే అభినయం, ఆ ఎనిమిది.. తొమ్మిదేళ్ల పిల్లవాడిని మంత్రముగ్ధుడిని చేశాయి. మార్కండేయుని కథలో, ఆయన వివరించిన లోతైన విషయాలు ఆ చిట్టి మెదడుకు అంతగా అర్థం కాలేదు కాని, రెండు గంటలపాటు ఏదో లోకంలో విహరించినట్లుంది వాడికి.

ఆంజనేయశర్మగారు ఆరున్నర శృతిలో గంభీరంగా, శ్రావ్యంగా చంద్రశేఖరాష్టకం ఆలపిస్తూ ఉంటే వాడి మనస్సు అనిర్వచనీయమైన ఆనందానికి లోనైంది. శ్రోతలలో ఇంచుమించు అందరి పరిస్థితి ఇదే. ఒక అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలోకి తన హరికథాగానం ద్వారా తీసుకు వెళ్లాడా గానసరస్వతి.

అప్రయత్నంగా వెళ్లి, ఆ పండితోత్తముని పాదాలపై పడిపోయాడు వైనతేయ. కళ్ల నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. గొంతు గద్గదమవుతుండగా “స్వామి!” అంటున్నాడు కాని ఏమీ చెప్పలేకపోతున్నాడు. దస్తగిరి సారు ఇది గమనించి లేచి వచ్చాడు “వైనా, ఏమయిందిరా?” అంటూ!

ఆంజనేయ భాగవతార్ గారు ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని వాడి కన్నీరు తుడిచారు.

“నాయనా. నా జన్మ ధన్యమైంది. ఇంత చిన్నవయసులో ఇంత రసస్ఫూర్తిని పొందావు” అన్నారు.

దస్తగిరి సారుతో “సార్, ఇటువంటి శిష్యుని పొందిన మీరు ధన్యులు. ఇంగ్లీషులో వీడు పొందిన స్థితిని బ్లిస్ (bliss) అంటారు. మీకు చెప్పగలవాడిని కాను. నేను ఈ రాత్రికి పూజారిగారింట్లో బస చేస్తాను. మీరు భోజనాలు చేసి వారి యింటికి రండి. మీతో వీడి గురించి చర్చించాల్సినది చాలా ఉన్నది” అన్నారు.

దస్తగిరి సారు చేతులు జోడించి “సరే స్వామి” అన్నాడు.

సర్పంచ్ వీరబ్రహ్మేంద్ర రెడ్డిగారు, ఆంజనేయశర్మ గారికి దుశ్శాలువా కప్పి, తాంబూలంలో రెండు చీనీ (బత్తాయి) పండ్లు, వెయ్యిన్నూట పదహార్లు సంభావన సమర్పించి సన్మానించారు. గ్రామస్థులందరూ వరుసదీరి శర్మగారికి పాదాభివందనం చేసి, తమ శక్తి మేరకు పది, ఇరవై, వంద, ఇలా సంభావన ఇచ్చారు. వారందరినీ ఆయన నిండు మనముతో ఆశీర్వదించారు.

చివరగా, పూజారిగారి స్వస్తివాచకముతో కార్యక్రమం ముగిసింది.

“స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం

న్యాయేన మార్గేణ మహిం మహిశాః .

గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం

లోకా సమస్తా సుఖినో భవన్తు”.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here