సాహిత్యం – రచయిత – సమాజం

0
3

[డా. కొండపల్లి నీహారిణి గారు రచించిన ‘సాహిత్యం – రచయిత – సమాజం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]హిత్యం హితాన్ని కోరుతుంది. కోరాలి! అంటే రచయితలు సమాజం కోరేలా బాధ్యత వహించాలి. సమాజానికి తగినట్టు వ్రాయాలి. శరీరానికి గాయమైతే మందులేసే, శస్త్ర చికిత్స చేసి తగ్గిపోయేలా, నయమయ్యేలా ప్రయత్నించినట్టే సంఘమనే శరీరానికి దుర్మార్గపు ఆలోచన అనే గాయానికి సాహిత్యమనే మందు వేయాలి. ఎవరు చదువుతున్నారు వ్రాసేదంతా అని బాధ్యతారహితమైన, అవమానకరమైన మాటలు బూచిలా చూపించి తప్పించుకోకూడదు. సంస్థలు, సంఘాలు, పత్రికలు, గ్రంథాలయాలు కృషి చేయాలి. పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థి స్థాయిలోనే మంచి సాహిత్యాన్ని అందించినట్లైతే భావితరాలకు బంగరుదారులు పడ్తాయి. ఇందుకు సాహిత్యమేమి చేస్తుంది? ఎట్లా చేస్తుంది? అనే ప్రశ్నలక్కర లేనేలేదు. విద్యార్థులకు మాతృభాషపై తప్పనిసరి ఒక విషయము, ద్వితీయ భాష, తృతీయభాషలుగా విషయమూ తప్పక పాఠ్యాంశాల్లో ఉంటాయి కాబట్టి రాసిన అందరివీ పెట్టలేము గానీ, మంచి సాహిత్యాన్నెంచుకొని సిలబస్‌లలో పెట్టి తీరాలి. అవి సక్రమంగా వారికి అంది చైతన్యవంతులయ్యేట్లు భాషాపండిట్స్ కృషి చేయాలి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు అమలయ్యేట్లు చూడాలి.

ఇక మంచి సాహిత్యమంటే ఏంటీ? అనంటే, చాలా ఉంది. ఏ రంగానికి సంబంధం ఉంది? ఏ రంగానికి సంబంధించింది అని తర్కించుకుంటే మానవత్వపు విలువలు మనుషుల్ని వీడిపోకుండా ఉండేలా సాహిత్యముండాలి. అది విస్తృతమైందే – విద్య, సాధారణ జీవనశైలి, వ్యక్తిత్వ చైతన్యం, అభివృద్ధి, వ్యక్తిగత నడవడి, కుటుంబము, అనుబంధాలు, ఆప్యాయతలు, సంఘము, తోటి మానవుడు వంటి అన్ని విభాగాలను పరిగణనలోకి తీసుకొని సామాజిక బాధ్యతతో క్రియాశీలక బాధ్యతగా ఆలోచించే ఆలోచన కలుగజేయాలి. ఇందుకు రచయితలు, కవులు, రచయిత్రులు, కవయిత్రులు, కథయిత్రులు నడుం బిగించాలి. ఈ సమాజ శంఖారావాన్ని నవీనరీతిలో వినిపించడానికి దాదాపు అన్నీ సాహిత్య ప్రక్రియలూ అవసరమవుతాయి.

చదివేదెవరు? అనే అనుమానమక్కరలేదు. ఈ రోజుల్లో మార్కెట్ విధ్వంసం విశృంఖలంగా ఉన్నా ప్రతి ఇంట్లో అతిదగ్గరగా ఉండి మనుషుల మధ్య దూరాన్ని పెంచే ‘రంగుల డబ్బా’ లోని దృశ్యమాలికలెన్ని ఉన్నా, పాఠకులకు కొదువలేదు. అది గ్రహించాలి. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు చదవకున్నా ఒక్కరు ఎక్కడో ఏదో చిన్న కథనో, కవితనో, పాటనో, వ్యాసాన్నో చదువుతారు. అలా చదివినా అది వాళ్ళ హృదయాలకు దగ్గరగా ఉండేలా వ్రాస్తే తప్పక కవి చెప్పదల్చుకున్న నీతి కనబడకుండానే వినబడుతుంది. ఇది నిజం. నిజంగా నిజం.

కాబట్టి రచనాశైలి కొద్దిగా మార్చుకోనైనా సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత రచయితలపైనా, పత్రికలపైనా ఉంది. సోషల్ మీడియాపైన కూడా ఉంది. సాహిత్యం ప్రజల నోట! రచయితలు ప్రజల బాట!! – ఇదే పెద్ద నినాదం.

“తనువురు జావృతంబయిన దార్ధ్యము తప్పుచునున్న భాషపై

గనికరముంచి తీవ్ర కృషి కర్షకురీతి నొనర్చి తత్ఫలం

బనిశము నాంధ్ర లోకమునకై వినియోగమొనర్చి యుంట నా

జననము సార్థకంబయి పొసంగెను లక్ష్మణ రాయ ధీమణీ” (-శేషాద్రి రమణ కవులు)

దూపాటి శేషాచార్యులు, దూపాటి వేంకట రమణాచార్యులు శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధి చెందిన జంటకవులు. తెలుగు భాషా సాహిత్య వికాసాల కోసం నిరంతరం కృషి చేశారు. ఈ పద్య భావం సాహితీవేత్తలకు సుపరిచితమే!

స్త్రీ పాత్రలను విశ్లేషించేప్పుడు కొడవటిగంటి, చలం స్త్రీ పాత్రల మీద వచ్చిన పుస్తకాలు చదవాలి. భారత స్త్రీ పాత్రల మీద జరిగిన పరిశోధనను, ప్రబంధ స్త్రీ పాత్రల మీద వచ్చిన పుస్తకాన్ని చదవడం, సంప్రదించడం అవసరం.

కొంతమందికి ఎంత పని చేసినా అలసట అన్నదే ఉండదు. ఈ క్రింది సామెత అట్లాంటివారిని చూసే వచ్చుంటుంది –

సామెత: ‘ఉరికి బొయ్యేవోడు పని జెప్పితే, ఊరూరా చేసినా అయిపోదు’

పని చెయ్యాలనే ఆకాంక్ష ముఖ్యం. సమాజం కోసం సాహిత్యాన్ని రాయడమూ ముఖ్యం.

కొందరు దేశం కోసం సమాజం కోసం కృషి చేసే వాళ్లు ఏదో చెయ్యాలి అనే తపనతో ఉంటారు. రాచపాళెం చంథ్రేఖర్ రెడ్డి గారి కృషి కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటే.. (రాచపాళెం గారి పుస్తకం సాహిత్య పరిశోధన సూత్రాలు 1997)

1. పూర్వ పరిశోధన, 2. నేపథ్యం – ఏ విషయమ్మీద పరిశోధన చేసినా సిద్ధాంత గ్రంథంలో మొదటి రెండధ్యాయాలు సమానంగా ఉంటాయి.

విభిన్న ప్రక్రియల్ని పరిశీలించేప్పుడు, విశ్లేషించేప్పుడు చారిత్రక దృష్టి ప్రధానంగా ఉండడం అవసరం.

“కాలం మీద ఆత్మ వేసిన నిమ్నోన్నత రేఖలే చరిత” – భావ మనస్తత్వ దృష్టి ప్రాచీన, ఆధునిక సాహిత్య ప్రక్రియల నేపథ్య వైవిధ్యాన్ని గుర్తు పెట్టుకోవడం అవసరం – అంటూ పరిశోధన చేసేవాళ్లు బాధ్యతను గుర్తు చేస్తూనే ఎన్నో విశేషాలు చెబుతూ ఎంతో విశ్లేషణ చేస్తూ వివరించారు. ఇంతే కాకుండా సాహిత్య పరిశోధన భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలి. కాబట్టి కొన్ని విషయాలను చర్చించుకోవచ్చు.

సిద్ధాంత గ్రంథం మూడు రంగాలు అంటూ ఈ మూడు రంగాలుగా తీసుకొని వివరిస్తే, ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది.

1. పూర్వరంగం, 2. ప్రధాన రంగం, 3. ఉత్తర రంగం. ఈ మూడు విషయాలను ఫోకస్ చేస్తే సాహిత్య విమర్శ, పరిశోధన చేయడానికి తగిన అంశాలను విభజించుకుని ముందుకు సాగాలి.

ఉపోద్ఘాతం: ఒక అధ్యాయాన్ని రాయడానికి పూనుకోగానే మొదట చెయ్యవలసిన పని ఆ అధ్యాయానికి పెట్టిన శీర్షికను వివరించడం. ఉదా: ‘కన్యాశుల్కం – సంభాషణ’ – సంభాషణ అంటే ఏమిటి చెప్పి, తర్వాత కన్యాశుల్క సంభాషణల గురించి రాయాలి. పై ఉపోద్ఘాతానికి అన్వయమే తర్వాత వ్యాసం.

అన్వయం: విషయాన్ని తర్కించాలి. చెప్పదలచుకున్న విషయాన్ని వివరించబోయే సబ్జెక్టుతో అన్వయించాలి. ఈ విషయాన్వయానికి, పరిశోధనా తత్వంతో ఏ ఏ ఇతర గ్రంథాల నుండి తీసుకుని వివరిస్తున్నామో తెలియాలి కాబట్టి ఉపయుక్త గ్రంథసూచి లేదా అనువిద్ధ గ్రంథసూచి లేదా వాడుకున్న గ్రంథాలు “ఇంకా ఉపయోగపడే గ్రంథాలు” అని పేరు పెట్టి సపరేట్‌గా ఇవ్వాలి. తెలుగు భాష గురించి, భాషా శాస్త్రం గురించి, సాహిత్యం గురించి ఎంతో కృషి చేసారు.

తెలుగు పరిశోధనలో కొందరివి – ఎన్. గోపి, వావిలి వసంత కుమార్, ననుమాస స్వామి, కసిరెడ్డి వెంకట రెడ్డి, ఆర్. వి. ఎస్. సుందరం, బిరుదురాజు రామరాజు, సినారె, నాయిని కృష్ణ కుమారి, ముదిగంటి సుజాతా రెడ్డి, వెలుదండ నిత్యానంద రావు వంటి పెద్దల రచనలను చదివితే తెలుస్తుంది. ఆచార్య వెలుదండ నిత్యానందరావు ‘విశ్వ విద్యాలయాలలో తెలుగు పరిశోధన’ గ్రంథంలో ఎవరెవరు ఏయే అంశాలలో పరిశోధన చేసారో వివరాలు ఉన్నాయి.

ఎవరైతే ఇంతవరకు పరిశోధనకు తీసుకోని సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిపై శ్రద్ధ పెట్టి సవివరంగా పరిశోధన చేయవచ్చు.

సమాజం కోసం కృషి చేసిన, ఇంకా చేస్తున్న ఇటువంటి సాహితీవేత్తలు సదా స్మరణీయులు. రచయితలు అందరూ విధిగా చదవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే సాహిత్యం సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో అర్థం అవుతుంది.

ఇలా ఏ సాహితీవేత్తలు ఏ రచనలు సాహిత్య విమర్శలో పరిశోధనలు చేసారో తెలుసుకుంటే చాలు కనీసం! కాస్తనైనా భాషా సాహిత్య వికాసాల కోసం మనవంతుగా ఏం చేయాలి అనే స్పృహ కలుగుతుంది.

కట్టమంచి రామలింగారెడ్డి – కవితత్వ విచారము – 1973; ఆదిరాజు వీరభద్రరావు (తెలంగాణ శాసనాలు), ఆరుద్ర – సమగ్రాంధ సాహిత్యం; రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ – సారస్వతాలోకము – సప్తమ ముద్రణ 1977; జి.వి. సుబ్రహ్మణ్యం – నవ్యాలోకము; రంగనాయకమ్మ – కథాయజ్ఞం – 1982; తెలుగులో జాతీయోద్యమ కవిత్వం – మద్దూరి సుబ్బారెడ్డి; కొలకలూరి ఇనాక్ – తెలుగు వ్యాస పరిణామం – 1980; కాత్యాయని విద్మహే, మృణాళిని, రావిరంగారావు, వేల్చేరు నారాయణరావు, కె. శ్రీనివాస్, బి.ఎస్. రాములు, గిరిజా మనోహర్ బాబు, సంగనభట్ల నర్సయ్య, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఇట్లా ఎందరో రచయితల వారి వారి ఆసక్తి మేరకు సాహిత్య పరిశోధన, సాహిత్య విమర్శలు చేసారు, చేస్తున్నారు. ఈ రచయితల గురించి, వీళ్ళ సాహిత్యాన్ని గురించి సంక్షిప్తంగానైనా ఈ కాలం సాహిత్య సృజనశీలులకు తప్పక తెలియాలి.

సాహిత్య విమర్శకూ – పరిశోధనకు తేడా

సాహిత్యం: సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం సమానార్థకాలుగా వాడుతున్న పదాలు. సాహిత్యానికి ‘సహితస్య భావః సాహిత్యమ్’ అనీ ‘హితేన సహతం సాహిత్యమ్’ అనే నిర్వచనాలున్నాయి. అంటే హితంతో కూడిందీ, హితాన్ని చేకూర్చేదీ అని అర్థం. సాహిత్యం రసప్రధానమైంది. సృజనాత్మక భాషాభివ్యక్తి అని చెప్పదగినది. సారస్వతంలో చరిత్ర రచన మొదలైనవి చెప్పదగినవి. వాక్ + మయం = వాఙ్మయం అయింది. వాక్కుల్తో కూడినది అని చెప్పదగినది, సాహిత్యం సారస్వతం పదాల కన్నా వాఙ్మయం విశాలమైన భావంతో ఉంది. సారస్వతం, వాఙ్మయం కన్నా సాహిత్యం చాలా ప్రసిద్ధి చెందింది. సాహిత్యం బహుముఖాలుగా వ్యాప్తి చెందింది. కథ, నవల, లేఖ, జానపద సాహిత్యం అనే అన్ని ప్రక్రియలలో విస్తృతి చెందింది సాహిత్యం..

సాహిత్యం ఎవరికి హితాన్ని చేకూరుస్తుంది అనే ప్రశ్న ఉదయించి, ‘విశ్వ శ్రేయః కావ్యమ్’ అనే జవాబు లభిస్తుంది. కాలాన్ని, సంస్కృతినీ బట్టి, దేశదేశాలను బట్టి ఎట్లా మారుతుందో తెల్సుకోవాలి. విశ్వంలో ఉన్నది మానవుడు. అతడే భావ వ్యక్తీకరణ కొరకు భాషనుపయోగించింది. మనిషి సంఘజీవి. సంఘం అంటే సమాజం. సమాజంలో ఉండేవారు ప్రజలు. ఈ సమాజం ఏ కొందరికో మంచి చేసి, కొందరికి ఆధిపత్యాన్నిచ్చేదే సాహిత్యమనే భావం లేదు. ఈ సాహిత్యం నోటితోనూ, రాతతోనూ ఆవిర్భవించవచ్చు. మౌఖిక సాహిత్యం బీజరూపంలో ఉండి లిఖిత సాహిత్యంగా ఎదుగొచ్చు. లిఖిత సాహిత్యం చారిత్రకాధారాలతో సాగుతుంది. సమాజం సాహిత్యం రెండు ఒకదానిలో ఒకటి ప్రతిబింబిస్తాయి. పూర్వసాహిత్యం ఎక్కువశాతం మతాధిపత్యాన్ని చూపాయి. నీతిశతకాల్లో సంఘం బహుముఖాలుగా కన్పిస్తుంది. ఆధునిక సాహిత్యంలో మానవతా విలువలకు పట్టంకట్టి సామాన్య మానవుని అందులో అధిష్టింప చేసింది. సమతాభావన, సామాజికత సాహిత్యంలో చోటు చేసుకున్నవి. కాలక్రమేణా సాహిత్యం మానవ పరిణామానికి తోడ్పడుతూ వస్తుంది. సామాజిక అభ్యుదయానికి, మంచితనానికి సాహిత్యం అవసరం .అందుకే సమాజానికీ, సాహిత్యానికీ అవినాభావ సంబంధముంది. కనుక భావ వ్యక్తీకరణ సాధనమైన భాషపై పటుత్వం ఉంటే సాహిత్య ప్రయోజనం నెరవేరుతుంది, రసస్ఫోరకమై హృదయానందం, మానసికోల్లాసం కల్గిస్తుంది.

విమర్శ:

‘వి’ అనే ఉపసర్గతో కూడిన ‘మృశ్’ ధాతువు నుండి ఏర్పడింది విమర్శ. పరామర్శించుట, ఆలోచించుట, పరిశీలించుట, చర్చించుట, పరీక్షించుట అనే అర్థాలు విమర్శ ధాతువుకున్నాయి. విమర్శ అంటే ఖండనము అని లోకంలో చెప్పబడుతుంది. దోషాలతో కూడిన అంశాలను ప్రదర్శించుట అనే అర్థంలో ఖండించడం అనే భావం తీసుకోవచ్చు. విమర్శించేవాడు విమర్శకుడు. సాహిత్యాన్ని విమర్శించేప్పుడు విమర్శించేవాడు కావ్యంలోని గుణదోషాలేవో చెప్పడానికి కొంత ప్రామాణికత అవసరం. విమర్శకుడు స్వీయ సూత్రాలతో పరిశీలించడం, పూర్వులు చెప్పింది అనుసరించడం వంటివి ఉంటాయి. ఈ అంశాలను పూర్తిగా ఉపేక్షించలేము. సర్వజనీనమైనవి, సర్వకాలీనమైనవి కొన్ని నియమాలుంటాయి. విమర్శకుడు మూల గ్రంథాన్ని అమూలాగ్రం చదవాలి అప్పుడు సరైన అవగాహన వస్తుంది. సంగ్రహ రూపాన్ని మాత్రమే చదివి, విమర్శ చేయడం సరికాదు.

విమర్శ లక్షణాలు: విమర్శకుడు ముందు సాహిత్యంపై పట్టును సాధించి సాహిత్య శాస్త్ర విజ్ఞానాల్లో అధికారత సాధించి ఉండాలి. విమర్శకుడు కేవలం విమర్శ చేసే గ్రంథంపైనే దృష్టి పెట్టాలి గానీ రచయిత ప్రవృత్తిపై కాదని గుర్తుంచుకోవాలి. తనవారన్న భావాన్ని విస్మరించి, అహంకారాన్ని పరిత్యజించి విమర్శ చేయాలి. సంపెంగపూవు వాసననో, రూపమో గిట్టని విమర్శకుడు తనకిష్టం లేని సంపెంగను, కవి ఇంత బాగా వర్ణించాడని కోపం తెచ్చుకోకూడదు.

విమర్శకులు రాగద్వేషాలను విడిచి, వాటికి లోనుగాక సమదర్శనత్వంతో కావ్యవిమర్శ చేయాలి. గ్రంథకర్త వ్యక్తిగతంగా దగ్గరి వాడైనట్లై అతణ్ణి ఆకాశానికెత్తడం, నచ్చనివాడైతే అథఃపాతాళానికి తొక్కడం చేయరాదు. స్నేహవైరాలకు లోనుగాక కావ్య విమర్శ చేయాలి.

పాశ్చాత్య విమర్శనా విధానము: విమర్శ ఎక్కడైనా విమర్శే! ఏ కాలంలోనైనా, ఏ దేశంలో నైనా విమర్శ ఒక్కవిధంగానే ఉంటుంది కానీ ఆయా దేశాల విమర్శకులు విమర్శనాంశాలకు ఇచ్చే ప్రాధ్యానతను బట్టి విమర్శ కొంత తారతమ్యం కలిగి ఉంటుంది. పాశ్చాత్యులు గ్రంథాన్ని విమర్శించే ముందు ఆ గ్రంథకర్త ఏ దేశంలో ఏ కాలంలో నివసించాడో అప్పటి, అక్కడి మత పరిస్థితులెట్లున్నాయో, వాటి ప్రభావం ఆ రచయితపై ఎట్లుందో పరిశీలిస్తారు. భారతీయులు కావ్యానికిచ్చినంత ప్రాధాన్యం చరిత్రకు, కవి చరిత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పాశ్చాత్యులు కావ్య అంతఃస్వరూపానికి ఇచ్చినంత ప్రాముఖ్యం బహిస్వరూపానికివ్వలేదు. రసము, ధ్వని, అలంకారాలు, గుణములు, దోషాలు, ఔచిత్యం వంటి వానికి భారతీయ లాక్షణికులు అపారమైన పరిశీలన చేశారు. మొన్నమొన్నటివరకు పాశ్చాత్యులు రసధ్వన్యాదులను గురించి అంతగా పరిశ్రమించలేదు. వారి విమర్శలు మనోభావ పరిశీలన, ఔచిత్యం, సౌందర్యం వంటి వాటికే సంబంధించి ఉంటుంది. భారతీయుల్లో సంప్రదాయమెక్కువ, లక్షణామనసరణం ఎక్కువ. పాశ్చాత్య విమర్శకుల్లో కూడా కొంతమంది సంప్రదాయాభిమానులున్నారు. ఆనంద సంధాన దక్షతకు పాశ్చాత్యులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. వ్యక్తిగత దూషణ తక్కువగా కన్పిస్తుంది. ఇది సారస్వత అభివృద్ధికి ఎంతో మంచిది. గుణాలు విదేశీయులవైనా ఆదరణీయమైనవే! దోషాలు స్వదేశీయమైనవైనా విమర్శించాల్సిందే!

భారతీయ లాక్షణికులు: భానుహుడు, వామనుడు, ఉద్భటుడు, జగన్నాథ పండితుడు, ఆనందవర్ధనుడు, రాజశేఖరుడు, విశ్వనాథుడు మొదలైన భారతీయ లాక్షణికులు సాహిత్యాన్ని విపులంగా విశ్లేషించారు. కుంతకుడు వక్రోక్తి ప్రాధాన్యవాది, క్షేమేంద్రుడు – ఔచిత్యమే జీవితమన్నాడు. విశ్వనాథ, విద్యానాథ, జగన్నాథలు ధ్వని సిద్ధాంతాన్ని బలపరిచారు. మహిమభట్టు – రసము ప్రాధాన్యం వివరించాడు. వామనుడు రీతిని గురించి, బానుహుడు గుణమును గురించి చెప్పారు. భరతుడు కావ్యరూపకం ‘రసము’ అన్నాడు. అట్లే అభినవగుప్తుడు హేతువే ప్రతిభ అని కూడా చెప్పాడు. లోచనకర్త – శబ్దమే కావ్య శరీరమన్నాడు. భానుహుడు శబ్ధార్థ సహితమే కావ్యం అంటే, ధ్వన్యాలోక కర్త ఆనందవర్ధనుడు ధ్వని ప్రాధాన్యమైన రసం కావ్యానికి ముఖ్యమన్నాడు.

రమణీయార్థ ప్రతిపాదికమైన శబ్దమే కావ్యము అని జగన్నాథ పండితుడు అంటే, కాళిదాసు మహాకవి

వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః

అంటూ పార్వతీ పరమేశ్వరుల్లాంటి వాక్కు అర్థాల ప్రాముఖ్యతను చెప్పాడు.

‘నా నృషిః కురుతే కావ్యమ్’ అని పెద్దలు ఋషి కానివాడు కవి కాజాలడని చెబితే ఆధునికులు ‘కవి క్రాంతదర్శి’ అన్నారు. చర్మచకకక్షువులకు అతీతంగా విషయాలను చూడగలిగినవాడు కవి అనే అర్థంతో చెప్పారు.

“నన్నయభట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధరుడయ్యె జగద్ధితంబుగన్” అని నన్నయ చెప్పుకుంటే జగద్ధితము అంటూ ఉపదేశ ప్రాధాన్యత చెప్పాడు. “ఈ బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్” అంటూ పోతన చెప్పడం ఆంధ్ర శబ్ద చింతామణికర్త “విశ్వ శ్రేయః కావ్యం” అనే చెప్పిన మాటకు బలాన్ని చేకూర్చింది. అది కావ్య ప్రయోజనాన్ని సూచిస్తుంది. కావ్య ప్రకాశిక కర్త మన్మటుడు కావ్యం వల్ల ఉపదేశాలు కల్గుతాయన్నాడు. ఆంగ్లేయులు ఉపదేశం, ఆనందం కావ్య ప్రయోజనమన్నారు. ఎవరు ఏవి చెప్పినా కావ్య రచనాకాలం నుండి కథ, నవల, గల్పికలు వచన రచనల కాలం వరకు రచన ప్రయోజనాన్ని సాధించాలి.

పాశ్చాత్య లాక్షణికులు: ప్లాటో, అరిస్టాటిల్, ఫిలిప్ సిడ్నీ, జాన్ డ్రైడెన్, అలెగ్జాండర్ పోప్, జాన్సన్, కార్లైట్, అస్కార్ వైల్డ్, టి.ఎస్. ఇలియట్, రిచర్డ్స్ మొదలైన పాశ్చాత్య లాక్షణికులు కావ్య ప్రయోజనాలను, లక్షణాలను విమర్శనాత్మకంగా చెప్పారు. వీళ్ళను గురించి కొంత సమాచారమైనా కవిత్వం ఇష్టపడే వాళ్ళూ, రాసే వాళ్ళూ తెలుసుకోవాలి.

కవిత్వం: ఆంగ్లభాషలో పోయెట్రీ అనే మాట కవితా సహితమైన ఛందోమయమైన కవిత్వానికి పేరు ఉంది. అట్లాగే కవితామయమై, గద్యరూపమైన రచనను ఆంగ్లంలో ప్రోజ్ పోయెట్రీ అంటారు. కాబట్టి వీటిల్లో కవితాధర్మంతో పాటు ఛందసాహిత్యం కూడా ఉంటుందని అర్థం. కవిత్వానికి ఛందస్సుకు అవినాభావ సంబంధముంది. కావ్యానికి ఛందస్సు వలన ఉత్కర్ష, ప్రకర్షలు కలుగుతాయి. కానీ సిడ్ని. కోల్‌రెడ్జ్ వంటివారు కొందరు ప్రాచీన లాక్షణికులు చెప్పినట్లు కావ్యానికి బాహ్యమైన ఛందస్సుతో ఎలాంటి సంబంధం లేదని భావించారు. ఛందస్సు కావ్యానికి అలంకారప్రాయమైన బహిరాచ్ఛాదనమే కానీ, హేతువు కాదని అన్నారు. ఉత్కృష్టమైన కవిత్వం ఛందోరహితంగా ఉండవచ్చని కోల్‌రెడ్జ్ అన్నాడు. లెహెస్ట్, కార్లైని ఆర్నాల్డ్‌లు మాత్రం కవిత్వానికి ఛందస్సు పరిహార్యమని భావించి, పరికత్వకు ఛందస్సు అవసరమనీ, అది లేకుంటే కవితాసౌందర్యం అసమగ్రంగా ఉంటుందనీ చెప్పారు. స్థిరమైన, శక్తివంతమైన ఛందోలంకారాలే కవితా సమగ్రత నిస్తుందన్నారు. రసమయమైన కావ్యంతో లయాన్వితమైన ఛందస్సును జతచేరిస్తే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది ఈ పండితుల అభిప్రాయం. ఇది కవిత్వానికి తీసుకుంటే వచన సాహిత్య ప్రక్రియలో భావ ప్రాధాన్యతతో సమాజ శ్రేయస్సును కోరే సాహిత్య సృజన చేయాలి.

ప్రయోజనము:

కవిత్వం, కావ్య రచనలలో ముఖ్యమైనవి ఈ క్రింది ప్రయోజనాలు, వాటి లక్షణాలు.

  1. కవిత్వం రసానంద ప్రాప్తిని అధికంగా కలిగిస్తుంది.
  2. ఛందస్సు కవిత్వ స్వాతంత్య్రానికి భంగం కలిగించదు.
  3. సహజ సంగీత మాధుర్యాన్నే ఛందస్సు కలిగిస్తుంది.
  4. కవితావేశాన్ని కలిగించడానికి ఛందస్సే ఉత్తమ సాధనం.
  5. సమగ్రత కలిగించడానికి ఛందస్సు ప్రేరకమే. అందుకే మన పూర్వ లాక్షణికులు, కవులు ఛందస్సుకు అంత ప్రాముఖ్యాన్నిచ్చిందన్నారు.
    • జాన్ స్టూవర్ట్ మిల్ – నిశితమైన భావం లయాన్వితమైన భాషలోనే వ్యక్తీకరించబడు తుందన్నాడు.
    • హెగెల్ – ఛందోరూప కవిత్వం పఠితలను మరొక ప్రపంచానికి తీసుకుపోతుందన్నాడు.

ఇలా పాశ్చాత్యులు కూడా కవిత్వానికి రిథమ్ అనేది ఎంతో శక్తినిస్తుందని ఎన్నో రకాల నిర్వచనాలను ఇచ్చారు.

ఒక్కొక్కచోట గద్యానికి కూడా నిశిత భావోపేతమై ఉంటుంది. అప్పుడు ఓ జన్యు సమగ్రత ఛందోలోపాన్ని పూరిస్తుంది. ఛందస్సు కవితావేశాన్ని ప్రేరేపిస్తుంది. ఓ రెండు పద్యాలు వ్రాయాలని మొదలుపెట్టిన కవి మరో పది పద్యాలైనా వ్రాయడమే ఇందుకు నిదర్శనం. ఛందస్సు సంగీతం వంటిది. సామాన్యుల హృదయాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఆనంద పరవశాన్ని కలిగిస్తుంది. పోతన మహాకవి వంటి పద్యాలను విన్నప్పుడు పదాల అర్థాలు తెలియకపోయినా పద్యాల్లోని ఛందస్సు వలన తలలూపించేలా చేస్తుంది. ధారణశక్తిని కలిగించి, ప్రేరేపించేందుకు ఛందస్సు తోడ్పడు పదాల కూర్పు లయాను గుణంగా చెప్పబడి ధారణ చేయించగలుగుతుంది ఛందస్సు.

కానీ ఈ ఆధునిక కాలంలో వచన కవిత వటవృక్షంలా పాతుకున్న ఈ కాలంలో ఛందోబద్ధమైన కవిత్వమే రాణిస్తుందనలేదు. కాని ఛందోబద్ధమైనవే పురాణేతిహాసాల పూర్వ కవిత్వాన్ని చదివిన జ్ఞానం మాత్రం తప్పకుండా వచన కవితకు చక్కని ప్రేరణనిస్తుంది. ముత్యాలసరాలు కవితామతల్లి కంఠహారానికి అందాలనిచ్చినట్లు, కావ్యాలన్నీ ఆమెకు మకుటాలై విరాజిల్లినట్లు తెలుగు భాషా సౌష్టవంగా ఉంటే కవిత్వం పటిష్టంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం.

తెలుగులో సాహిత్య విమర్శ తెలుగు సాహిత్యంలో విమర్శ విపులంగా వచ్చింది కందుకూరి వీరేశలింగం వివేకవర్ధినితో 1876 నుండి ప్రారంభమైందని అభిప్రాయం. ‘విగ్రహతంత్ర విమర్శనం’ మొదట విమర్శ రచనగా పేర్కొంటారు.

“విమర్శకు స్పష్టమైన స్వరూపాన్నిచ్చి, స్వతంత్య్ర ప్రతిపత్తిని కల్పించి, ప్రత్యేక ప్రక్రియగా విలసిల్ల జేసిన ప్రథమాంధ్ర విమర్శకుడు కందుకూరి” అని ఎస్.వి. రామారావు గారన్నారు.

గురజాడ అప్పారావు గారు ‘మాటా-మంతీ’లో – “అభిరుచి, గుణదోష నిశ్చయ జ్ఞానమున్న రచయిత ఒక కావ్యాన్ని రచిస్తున్నప్పుడు, అతని సృజన విమర్శనా శక్తులు రెండూ కుడిఎడమలుగా ఉంటాయి” అన్నారు. జి.వి.సుబ్రహ్మణ్యం గారు ‘ఆంధ్ర సాహిత్య విమర్శ – ఆంగ్ల ప్రభావం’లో “సాహిత్య విమర్శ సృజనాత్మక శీలాన్ని అనవతరం పోషించుకోవాలి. యుగధర్మం నుండి యుగయుగాల దర్శనాన్ని వెలికితీసి, వెలుగులు నింపాలి” అన్నారు.

ఒక రచనను చదివి బాగుంది అని అన్నంత మాత్రాన ఆ రచన పూర్తిగా తెలిసినట్లు కాదు. అప్పుడు అందులోని ‘బాగు’ ఏమిటని బాగాలేదనడానికి కారణాలేమిటి? ఆ కారణాలు చెప్పడం మామూలు మాటల్లో చెప్పడమా? విశిష్టమైన మాటల్లో చెప్పడమా? బాగుంటే, అది ఎక్కడ ఎట్లా దాగుంది, ఎట్లా బహిర్గతం చేస్తుంది? విడదీసి చూపగలమా? పాలలో వెన్నలాగా మొత్తంగా వ్యాపించి ఉందా? సజీవంగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ చెప్పే సమాధానమే విమర్శ? 19వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త కొత్త ప్రక్రియలు ఆవిర్భవించాయి. ప్రాచీన సాహిత్యం ముద్రణకు నోచుకుంది. ముద్రణా సౌకర్యాలు రావడం, పత్రికలు వెలువడడం మరొక పరిణామం. పాశ్చాత్య సాహిత్య పరిచయాలు పరిశోధనలకు – విమర్శలకు పునాదులయ్యాయి.

కవిత్వ విమర్శ: కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్వ విచారం’ 1914లో రచించారు. ఆధునిక సాహిత్య విమర్శ దీనితోనే ప్రారంభమైందని చాలామంది నిర్ణయించారు. నిష్పక్షపాతమైన విమర్శ రామలింగారెడ్డి పుస్తకంలో చోటు చేసుకుంది. వీరి వచన రచన కూడా సూటిగా స్పష్టంగా ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ “విమర్శన పథాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యాఇనకి కొత్త బోదెలు తవ్వారు” అని రామలింగారెడ్డిని ప్రశంసించారు. ‘నన్నయ్యగారి ప్రసన్న కథాకలితార్థ యుక్తి’, ‘ఒకడు నాచన సోమన’, ‘అల్లసాని వారి అల్లిక జిగిబిగి’, ‘శాకుంతలము యొక్క అభిజ్ఞానత’ వంటి విశ్వనాథ విమర్శనా గ్రంథాలు వారి ప్రతిభను ప్రదర్శిస్తాయి.

రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, దువ్వూరి రామిరెడ్డి, నోరి నర్సింహ శాస్త్రి, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, ఖండవల్లి లక్ష్మీరంజనం, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, కేతవరపు రామకోటిశాస్త్రి, బూర్గుల రామకృష్ణారావు వంటివారు తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో మైలురాళ్ళు. ఆధునికుల్లో డా. సి.నారాయణరెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ, బుచ్చిబాబు, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య, దేవులపల్లి రామానుజరావు వంటివారు సుప్రసిద్ధులు.

ఆధునిక విమర్శకుల్లో పాశ్చాత్య రీతులను మేళవించి సాహిత్య విమర్శ చేసినవారిలో ఆర్.ఎస్ సుందరం ముఖ్యులు. విమర్శలో నిజాయితీ, సహృదయత ముఖ్యమని చెప్పిన వీరి పంథాలో విమర్శ చేసే జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య విమర్శ వికాసానికి ఎనలేని కృషి చేశారు. ‘భారతీయత’ ‘దేశీయత’ నేపథ్యంగా సాహితీ విమర్శ ఉండాలనీ, విమర్శకుడికి ‘నిబద్ధత’ ఉంటే పరిస్థితులు, ప్రాంత విశిష్టత అవసరమనీ చెప్పారు. జి.నాగయ్య, నాయని కృష్ణకుమారి, తూమాటి దోణప్ప, తిరుమల రామచంద్ర, చేకూరి రామారావు వంటివారు సాహిత్య విమర్శనా వ్యాసాలు ప్రకటించినవారిలో ప్రముఖులు.

అభ్యుదయ దృక్పథంలో, మార్క్సిస్ట్ అవగాహనతో కొడవటిగంటి కుటుంబరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఎస్వీ సత్యనారాయణ, అద్దేపల్లి రామ్మోహనరావు, కె.వి. రమణారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, సోమసుందర్ వంటివారు సాహితీవిమర్శను చేపట్టిన వారిలో ప్రముఖులు.

పాకాల యశోదారెడ్డి, రావి భారతి, కాత్యాయని విద్మహే, మృణాళిని, నవీన్, పాపినేని శివశంకర్, కొలకలూరి ఇనాక్, ఎన్. గోపి, అనుమాండ్ల భూమయ్య, ద్వానాశాస్త్రి, బి.ఎస్.రాములు, ఓల్గా, బాలగోపాల్, అఫ్సర్, చేకూరి రామారావు, పేర్వారం జగన్నాథం వంటివారి సాహిత్య విమర్శనా వ్యాసాలు, గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని విమర్శిస్తూ మౌలికమైన అంశాలపై సాహిత్య చర్చ జరిగేందుకు కారణాలయ్యాయి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల ద్వారా వెలువడిన సిద్ధాంత వ్యాసాలు కూడా సాహిత్య విమర్శ వ్మాయానికి చేయూతనిస్తున్నాయి.

పరిశోధనలెక్కువై, ప్రామాణికత తగ్గడానికి, డాక్టరేట్ డిగ్రీల పట్ల మోజువల్ల ఈ పరిస్థితులె దురవుతున్నవన్న అపవాదు కూడా వస్తుంది. కాబట్టి పండితులంతా కోరుకునేది ఒక్కటే. పూర్వ సాహిత్య విమర్శనా సిద్ధాంతాల పట్ల నేటి కవులకు, కవయిత్రులకు చక్కని అవగాహన ఉండాలి. సశాస్త్రీయ సాహిత్య విమర్శల ద్వారా సమకాలీన సమస్యలను ప్రతిబింబించే రచనలు చేస్తే బాగుంటుందని, మనిషి నిత్య జీవితంలో అనుభవిస్తున్న కష్టనష్టాలను సాహిత్య సూత్రీకరణలతో ముడిపెట్టవద్దని పిడివాదం చేస్తున్న వారు కూడా ఒకసారి ఈ అభిప్రాయాలపై దృష్టి సారిస్తే మంచిదని విస్తృత పరిజ్ఞానం సంపాదించుకోవడంలో తప్పులేదు, విలక్షణమైన సాహిత్యానికి ఆధునికతతో మెరుగులు దిద్దుతూ, కవిత్వం రాస్తే బాగుంటుందని, వ్యావహారిక ఉద్యమాలనూ, వాటిపై వచ్చిన వివిధ పరిశోధనలను, వ్యాసాలను పుస్తకాలను చదివి గిడుగు రామమూర్తి గారి ఆ వచన కవితా ఉద్యమకారులు చెప్పిన విషయాలు ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విస్తృత పుస్తక పఠనాసక్తి లేకపోవడం, ఎలాంటి కృషి చేయకపోవడంతో పాఠకుల హృదయాల్లో పది పంక్తులను వ్రాయలేకపోతున్నందుకు నేటి కవుల అభిప్రాయాలు అంత ఘాటుగా ఉండడం లేదు. ధీటుగా నిలవడం లేదు. పామరుని నాలుకలపై ఆడడం లేదు.

ఈ సత్యాన్ని గ్రహించి, మంచిపుస్తకం మంచి స్నేహితుని వంటిదని గ్రహించాలి. పాత పుస్తకాలను తిరగేయాలని తెలుసుకోవాల్సిన అవసరం యువతది. తెలుపాల్సిన బాధ్యత సాహితీవేత్తలది. తమ వంతు కృషిగా నేటి సాహితీవేత్తలందరు పురాణ సాహిత్యాన్ని చదివేలా ప్రోత్సహించాలి. అప్పుడే చిక్కని చక్కని సాహితీ గుభాళింపులతో కవిత్వం వెల్లివిరుస్తుంది.

పరిశోధన: ‘శోధన’ అంటే వెతకడం, సరిచూసుకోవడం అనే అర్థాలు వాడుకలో ఉన్నవి. ‘పరిశోధన’ అనే మాటని ‘రిసెర్చి’కి పర్యాయపదంగా వాడుతున్నాం. ఈ కాలంలో ఎం.ఫిల్ లేదా పిహెచ్.డి. కోసం చేసే కృషిని ‘పరిశోధన’ అంటున్నారు. పరిశోధించి వ్రాసిన గ్రంథాన్ని “సిద్ధాంత గ్రంథం” లేదా ‘సిద్ధాంత వ్యాసం’ అంటున్నారు. కొత్త సత్యాలను కనుగొనడం లేదా నిర్ధిష్టమైన విషయాన్ని మరింత సమాచారంతో అందించే అన్వేషణను ‘రిసెర్చ్’ అంటారు.

The act of researching (closely or carefully) for a specified thing or a person The Oxford Universal Dictionary.

Research an endevour to discover, develop and verify knowledge. If is an intellectual process…. always searching for truth – J. Francis.

కొత్త విషయాలను కనిపెట్టేలా, ఉన్న జ్ఞానాన్ని మెరుగుపరిచేలా ఉండేది పరిశోధన. కొత్త ఆలోచనలను కలిగించే బౌద్ధిక ప్రక్రియ పరిశోధన. విజ్ఞాన శాస్త్రాల్లోని పరిశోధనకు, సాహిత్య పరిశోధనకు తేడా ఉంటుంది.

సత్యనిష్ట, తాటస్థ్యం, లభ్య ఉపపత్తుల సహాయంతో సిద్ధాంత ప్రతిపాదనం చేసుకుంటూ పరిశోధన వస్తునిష్టగా సాగిపోతుంది.

శ్రద్ధ, ఆసక్తి, నేపథ్య పరిజ్ఞానం, అవ్యయ సామర్థ్యం, వ్యుత్పన్నశీలత వంటి అరతలు పరిశోధకునికి ఉండాల్సినవి. దీనికి కావలిన అవసరాలు పరిశోధన సామాగ్రి.

శోధన అనే నామవాచకం కన్నా శోధించు అన్న క్రియాపదం ఎక్కువ వాడుకలో ఉంది.

  1. మానుగ శోధింప వలయు మానవపతికిన్ (నన్నయ భారతం)
  2. గణాధీశ్వరుల నెల్ల కడలను శోధించి (నన్నెచోడుని కుమార సంభవం)
  3. బహుళ క్రియ శోధించిరి (శ్రీనాథుని శివరాత్రి మహాత్మ్యం)
  4. శోధింపబడి సర్వశాస్త్రముల్ (భాగవతం)

అధి శోధకుడు: అధిక శోధన అంటే పరిశోధన. ఈనాడు విశ్వవిద్యాలయాల్లో రీసెర్చి ప్రథమ పరిశోధకుడు కావలి వెంకటబొర్రయ్య. వీరు ప్రథమ చారిత్రక పరిశోధకుడు. అధిక శోధకుడు అంటే బహుగ్రంథ పఠనాశీలుడు. వ్రాయసకాడు సంపత్కుమారాచారి గారు “అప్పకవి అనేక గ్రంథాలను ఉటంకించాడు, ఉరసరించాడు, అభిప్రాయాలకు ప్రమాణాలను ప్రదర్శించాడు. పూర్వుల అభిప్రాయాలు స్వీకరించాడు. వివిధ అంశాలను వర్గీకరించాడు, శాస్త్రీయంగా విశ్లేషించాడు, ఆధారాలతో ప్రదర్శించాడు. తర్వాత వచ్చిన లాక్షణికులు అన్ని సందర్భాల్లో ఏకీభవించకపోయినా, ఆయన పరిశోధనను కాదనలేం” అన్నారు. వాటి మాటల్లో పరిశోధకుడు చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి.

చిన్నయసూరి – బాలవ్యాకరణం

ఖండవల్లి లక్ష్మీరంజనం – ఆంధ్రుల చరిత్ర సంస్కృతి

సురవరం ప్రతాపరెడ్డి – ఆంధ్రుల సాంఘిక చరిత్ర పిహెచ్డి పట్టాలు వీటికి లభ్యం కాకున్నా ఆనాటి నుండి నేటివరకు ప్రామాణిక గ్రంథాలుగా ఉపయోగిస్తున్నాం.

పరిశోధన తత్వం పరిశోధన స్వరూపం: తెలిసిన విషయాన్ని తెలియని అంతర్భహిస్త తత్వాలని అన్వేషించడం. అది ఒక క్రమపద్ధతిలో సాగడం. ఒక స్పష్టమైన రీతిలో చెప్పడం. దేశకాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పరిశోధించడం. విజ్ఞాన విచక్షణా జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోవడం. ఒక క్రమ పద్ధతిలో ఏది? ఏమేమి? ఎందుకు? వంటి ప్రశ్నలు తర్కసహితంగా, శాస్త్రీయంగా వెదకడమే! ఇట్లా వెదకడం పరమార్థమే పరిశోధన పరమార్థం.

పరిశోధన, విమర్శ, సమీక్ష: ఈ మూడు ఒక్కోసారి విడదీయరానంత సన్నిహితంగా ఉన్నట్లు కన్పిస్తాయి. పరిశోధన విమర్శనకు తేడాను విమర్శకులు కోర్టులో వకీలు వలె పక్షపాతం మారవచ్చు. కాని పరిశోధకుడు న్యాయనిర్ణేత (జడ్జ్) వలె ఉండాలి అంటారు ఆండ్ర శేషగిరి రావు. నిస్వార్థంగా, సత్య సంధతతో విమర్శ ఉంటే పదికాలాలు నిలుస్తుంది.

సిద్ధాంత గ్రంథంలో పరిశోధన, విమర్శన సమపాళ్ళలో ఉంటే పరిశోధనలో సర్వకాలికులు ఆదరిస్తారు, పాఠకులు విజ్ఞులు ఆనందంతో ఆచరిస్తారు. దీని కోసం –

  1. నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించుకోవాలి.
  2. పూర్వ సిద్ధాంతాలనూ వ్యాసాలను సవరించి, పరిష్కరించి మార్గాలను ఏర్పరచాలి.
  3. విలువలను వినూత్న ధోరణిలో నిర్ధారించే పద్ధతులను ప్రతిపాదించాలి. వినూత్న దృక్కోణంతో అనుశీలించాలి. ఇవన్నీ సాధించాలంటే,
  4. సాహిత్యంలోని ప్రయోగాలను ప్రక్రియలను వివిధ సాహిత్యాంశాలను విశ్లేషణాత్మకంగా వివేచించడానికి వివరిరచడానికి సహాయకారిగా కావాలంటే సాహిత్య పరిశోధకులూ, సాహితీ వేత్తలు, కొత్తగా సాహిత్య విమర్శలో ఆసక్తిని చూపించే వాళ్ళందరూ ఒక నిబద్ధతతో రాయాలి.

పరిశోధనలో వివిధ శాఖలను ఆవిష్కరించడం, భావితరాలకు విలువలను అందించడానికి ప్రాచీన సిద్ధాంతకర్తల సూచనలను ఈనాటి సామాజిక పరిస్థితులకు అన్వయించాలి” అనే భావాన్ని తెలుగులో పరిశోధన – తీరుతెన్నులు – తెలుగు రచన రజతోత్సవ సంచికలో జి.వి. సుబ్రహ్మణ్యం గారు అన్నారు.

సాహిత్య పరిశోధనకూ, విమర్శకూ ఉన్న సూక్ష్మ తేడాను గుర్తించాలంటే ఇన్నేళ్ళుగా బయటికి రాని కవుల సాహితీ మూర్తుల రచనలను వెలికితీయాలి. పూర్వ సాహిత్యాన్ని కొత్తగా విశ్లేషించాలనే ప్రయత్నంలో కాల పరమావధిని పాటించాలి.

– కొత్తది వెదకడం పరిశోధన – ఉదా. ఒద్దిరాజు సోదరుల సాహిత్య పరిశోధన

– ఉన్నదాన్ని విశ్లేషించడం విమర్శ: ఉదా. భారతం సారాన్ని వివరించడం.

ఈ విధంగా సాహిత్య విమర్శకు, పరిశోధనకూ ఉన్న తేడాను, ఆంతర్యాన్ని గ్రహించి విద్యార్థులు, పరిశోధకులు, విశ్లేషకులూ ముందుకు పోవాలి. అప్పుడే పదికాలాలపాటు నిలబడగలిగే సాహిత్యం భావితర బంగరు నిధౌతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here