[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన తిరుమలశ్రీ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]
[dropcap]బం[/dropcap]గాళాఖాతంలో చెలరేగిన తుఫానులా నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. పార్క్‌కి వచ్చి కూర్చున్నాను. మనసు బావుండనపుడల్లా పార్క్‌కి రావడం అలవాటు. ఎప్పుడూ అదే బెంచ్ మీద కూర్చుంటాను. పార్క్ అంతా ఖాళీగా వుంది.
కరోనా తెచ్చిన రిసెషన్ కారణంగా రాత్రికి రాత్రి ప్రపంచవ్యాప్తంగా వేలకొద్ది ఉద్యోగాలు ఊడిపోయాయి. అందులో నాదీ ఒకటి. మూడు నెలల క్రితం వరకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిని నేను. నెలకు అరవైవేల రూపాయల జీతం. జీవితం హాయిగా గడచిపోయేది.
అమ్మ-నాన్నలకు ఏకైక సంతానం నేను. నాన్న ఓ ప్రైవేట్ ఫర్మ్‌లో చిరుద్యోగి. అమ్మ గృహిణి. ఏం తిన్నారో ఏం లేదో, కష్టపడి నన్ను బి.టెక్. చదివించారు. అనంతరం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది నాకు. బంధువుల పిల్లను చూసి పెళ్ళిచేసారు.
అయితే మొదటి రాత్రి నుండే ఆరంభం అయింది నా పెళ్ళాం పోరు- నా తల్లిదండ్రుల నుండి వేరుపడిపోదాం అని! షాక్ తిన్నాను నేను.
నాకు జన్మనిచ్చి, విద్యాబుద్ధులు గరపించి, భావి జీవితానికి బాటలు పరచిన కన్నవారిని దూరం చేసుకునే ప్రసక్తే లేదు నాకు. పైపెచ్చు అనారోగ్యం కారణంగా నాన్నను బలవంతంగా ఉద్యోగం మానిపించేసాను నేను. అదాయం లేదు, ఆస్తులు లేవు. పిల్లల మీద ప్రేమానురాగాలతో వారి భవిష్యత్తు కోసం తాము కొవ్వొత్తుల్లా కరిగిపోతూ జీవితంలో ఎన్నో కోల్పోతూ నిరంతరం శ్రమిస్తారు తల్లిదండ్రులు. అవసానదశలో వారిని గాలికి వదిలేయకుండా ఆదుకోవలసిన గురుతర బాధ్యత ఆ పిల్లలది.
తల్లిదండ్రుల తరువాతే ఎవరైనా నాకు. ఎంత నచ్చజెప్పబోయినా, నా భార్య ససేమిరా అంది. అంతే! నా తల్లిదండ్రుల మాట కూడా వినిపించుకోకుండా విడాకులు ఇచ్చేసాను. ఫలితంగా నా సేవింగ్సులో సింహభాగం ఆమెకు అరణంగా చెల్లించడం జరిగింది. అయినా, విచారించలేదు నేను.
అది జరిగి ఏడాది తిరక్కుండానే, ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా మరో ఉద్యోగం లభించలేదు. మిగిలిన కాసిన్ని సేవింగ్స్ హరించుకుపోయాయి. క్రమంగా కుటుంబాన్ని పోషించడం కూడా కష్టం అయిపోతోంది. నాన్నకు మందులకు, ఆసుపత్రి ఛార్జీలకూ డబ్బు సమకూర్చలేని అసమర్థుణ్ణి అయిపోయాను. నాలాంటి కొడుకు ఉంటేనేం, లేకపోతేనేం అనిపించింది. అందుకే, చావాలనుకున్నాను.
కానీ, అంతలోనే అనిపించింది, నా ఆలోచన తప్పు అని! నేను లేకపోతే ఆ ఒక్క అదరువు కూడా వుండదు వాళ్ళకు. నేను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిస్తే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి.. ఏం చేయాలో పాలుపోక, ఎటూ నిర్ణయించుకోలేక ఆలోచిస్తూ పార్కుకి వచ్చి కూర్చున్నాను..
అదిగో, అప్పుడే అక్కడికి వచ్చాడు ఆ పెద్దాయన. “నేను ఇక్కడ కూర్చోవచ్చా?” అనడిగి, నా సమాధానానికి ఎదురుచూడకుండానే, బెంచ్ మీద నా పక్కను ఆసీనుడయ్యాడు.
ఎనభయ్‌కి అటో ఇటో ఉంటుంది అతని వయసు. మనిషి పొడవుగా, సన్నగా, తెల్లగా ఉన్నాడు. కళ్ళకు చత్వారం జోడు, చేతిలో ఊతంగా కర్రా ఉన్నాయి. మనిషి నీరసంగా ఉన్నాడు. చేతులు చిన్నగా ఒణుకుతున్నాయి.. పార్క్‌కి వచ్చినపుడల్లా అతన్ని చూస్తూవుంటాను నేను. ఎక్కువగా పార్క్ లోనే గడుపుతుంటాడో, ఏమో!
మధ్యాహ్నం మూడు గంటలయింది. సాయంత్రం అయిదు దాటితేకానీ, ఎవరూ రారు అక్కడికి. అందుకే, అతను అ వేళప్పుడు రావడం ఆశ్చర్యం కలిగించింది నాకు.
“నేనంటే ఇంట్లో ఉండలేక వచ్చాను ఇక్కడికి. కుర్రాడివి నువ్వు ఈ వేళప్పుడు పార్క్‌కి వచ్చావంటే..? ఎందుకో దిగులుగా కూడా కనిపిస్తున్నావు. ఏదో పెద్ద సమస్యతోనే సతమతమవుతున్నట్టు అనిపిస్తోంది..” ఫేస్ రీడింగ్ తెలిసినవాడిలా అన్నాడతను. “నీకు అభ్యంతరం లేకపోతే నాతో పంచుకోవచ్చుగా? మనోభారం కొంతయినా తీరుతుందేమో..”
మా ఇద్దరి వయసుల్లో దాదాపు యాభయ్యేళ్ళ వ్యత్యాసం ఉంటుంది. అంత పెద్ద మనిషి ఆప్యాయంగా అడుగుతూంటే, గుండెల్లోంచి తన్నుకువస్తోన్న నా బాధను అతని ముందు పరచకుండా ఉండలేకపోయాను.
శాంతంగా ఆలకించి, “కొడుకంటే ఎలా వుండాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా, ఎవరైనా!” అంటూ నిట్టూర్చాడతను.
“ఈ వయసులో మిట్టమధ్యాహ్నపు వేళ ఈ ఎండలో పార్క్‌కి ఎలా రానిచ్చారు మీవాళ్ళు?” అనడిగాను నేను, విషయాన్ని మార్చే ఉద్దేశంతో.
నవ్వాడతను. “నాకంటూ ఎవరైనా ఉంటేకదా!” అన్నాడు. నేను విస్తుపాటుతో చూస్తే, అతను చెప్పింది ఇది-
అతని పేరు వరదరాజులు. ఓ ప్రముఖ బిజినెస్‌మేన్. జీవితమంతా సంపాదనలో పడి భార్యను కూడా సరిగా పట్టించుకునేవాడు కాదు. సంతానం లేదు. పదేళ్ళ క్రితం భార్య కాలం చేసింది. ఆ తరువాతే అర్థమయింది అతనికి, మనిషి విలువ. అంతవరకూ డబ్బు సంపాదనకోసం వెంపర్లాడుతూ మనుషుల్ని మరచిపోయాడు. ఇప్పుడు కావలసినంత డబ్బు ఉంది, కానీ ఆప్యాయతను పంచే మనుషులు లేరు. వయసు పెరిగేకొద్దీ ఆసరాగా ఉండడానికి ఎవరూ లేకపోయారు. దారాళంగా ఛారిటీలకు పంచుతూ వున్నా, తరగని సంపద. కానీ, ఒంటరి జీవితం! ఓ పెద్దావిడ వండిపెడుతుంది. చేయూత కోసం చేరదీసిన మనుషులు మోసం చేసి పోతున్నారు..
కాసేపు మా మధ్య నిశ్శబ్దం రాజ్యం ఏలింది- ఎవరి ఆలోచనల్లో వాళ్ళం ఉండిపోవడంతో. అంతలో నా దృష్టిని ఆకర్షించుకుంది ఓ దృశ్యం..
పార్కులో ఉన్న కుళాయి దగ్గర స్నానం చేస్తోంది ఓ వృద్ధజంట. అరవయ్‌లలో ఉంటారు. ఆమె స్నానం చేస్తూంటే, తన పంచెను ఓ వైపు పక్కనున్న చెట్టుకు కట్టి, రెండోవైపు తాను పట్టుకుని, ఇటువైపు తిరిగి, ఆమెకు మరుగు కల్పిస్తున్నాడతను. అనంతరం అతను గోచీ పెట్టుకుని స్నానం చేసాడు. స్నానాలు పూర్తి కాగానే విప్పిన దుస్తులను తడిపి ఆరేసుకున్నారు. కాసేపటి తరువాత ఆ బట్టలనూ, తుడుచుకున్న తువాలునీ ఓ గుడ్డసంచిలో పెట్టుకున్నారు. మనుషులు ఎండిపోయి నీరసంగా కనిపిస్తున్నారు. చేతులు పట్టుకుని సప్తపదిలా మెల్లగా అడుగులు వేసుకుంటూ నడవసాగారు.
నేను వారినే తదేకంగా చూస్తూంటే, అడిగాడు వరదరాజులు నన్ను- “వాళ్ళు ఎవరో తెలుసా?” అని. “బిచ్చగాళ్ళలా ఉన్నారు” అన్నాను నేను కాజ్యువల్‌గా.
“రోజూ జనం వచ్చేలోపునే ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళుతుంటారు. పార్క్‌కి కొంతదూరంలో వీళ్ళ పాక ఉంది. పాకంటే, నాలుగు పక్కలా ఈతాకులు అడ్దు పెట్టుకున్న, ఇద్దరు మనుషులు పడుకోవడానికి సరిపడే స్థలం..” అన్నాడు వరదరాజులు.
ఆశ్చర్యంగా చూసాను నేను. “వాళ్ళు మీకు తెలుసా?” అనడిగాను.
తలూపి, చెప్పుకొచ్చాడు ఆయన- ‘ఆ వృద్ధుడి పేరు రామ్మూర్తి. ఓ గిరిజన గ్రామంలోని ప్రైవేట్ స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేసేవాడు. ఒక్కడే కొడుకు. దంపతులు కడుపులు కట్టుకుని, శక్తికి మించి వాణ్ణి చదివించారు. ఏదో ఒక ఉద్యోగం చూసుకోమంటే, అమెరికాలో ఎమ్మెస్ చేస్తానంటూ పట్టుపట్టాడు కొడుకు. స్టేట్స్‌కి వెళ్తే, ఎమ్మెస్ పూర్తికాగానే మంచి ఉద్యోగం వస్తుందనీ, తన భవిష్యత్తు బాగుంటుందనీ, అప్పులన్నీ తీర్చేయవచ్చుననీ అన్నాడు. కొడుకు కోరికను కాదనలేకపోయాడు మాస్టారు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఓ పాత ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు లేవు. ఉన్న ఒక్క ఇంటినీ తాకట్టుపెట్టి పైచదువులకు కొడుకును అమెరికా పంపించాడు.
రెండేళ్ళు గడచిపోయాయి. రామ్మూర్తి కొడుకు ఎమ్మెస్ పూర్తిచేసాడు. అక్కడే ఉద్యోగం కూడా దొరికింది. రూపాయలలో చూసుకుంటే, జీతం నెలకు ఐదు లక్షలు. అయితే, కన్నవారిని మరచిపోయాడు ఆ సుపుత్రుడు. ఓ అమెరికన్ యువతిని పెళ్ళిచేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేదు. తెలిసినవారెవరో అమెరికా నుండి వస్తే, ఆ సంగతులన్నీ తెలిసివచ్చాయి రామ్మూర్తి దంపతులకు.
తనఖా పెట్టి అన్నేళ్ళయినా అప్పు తీర్చకపోవడంతో ఇంటిని జప్తుచేయడం, అప్పు ఇచ్చిన వ్యక్తి తప్పిదం కాదు. అంతలోనే రామ్మూర్తి పదవీ విరమణ కూడా జరిగింది. ప్రైవేట్ స్కూలు కావడంతో పెన్షన్ సదుపాయం లేదు. ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ట్యూషన్ చెప్పించుకునేవారు కూడా కరవయ్యారు. దంపతులు వీధిన పడ్డారు.. ప్రస్తుతం ఎవరైనా ఏమైనా ఇస్తే తింటారు. లేకుంటే పస్తు పడుకుంటారు..’
నిర్ఘాంతపోయాను నేను. నాకు తెలియకుండానే పెద్ద నిశ్వనం ఒకటి వెలువడింది. మనిషి జీవితంలో ఎన్ని కోణాలు!?.. కన్నవారిని సరిగా చూసుకోలేకపోతున్నానే అని అహర్నిశలూ బెంగపడుతున్నాను నేను. కన్నవారిని కరివేపాకులా ఏరిపడేసి స్వార్థంతో రోడ్డున పడేసాడు మాస్టారి కొడుకు. సంపాదన కోసం మానవసంబంధాలను విస్మరించాడు వరదరాజులు..!!
“మీరు ఏమీ అనుకోనంటే ఓ విషయం అడగనా?” అన్నాను వరదరాజులుతో. ‘ఏమిటన్నట్టు’ చూసాడతను.
“మీకు సంపద పుష్కలంగా వుంది. చారిటీస్‌కి ఇస్తుంటారు. రామ్మూర్తి మాస్టారి దైన్యగాథ తెలిసుండీ, ఆ దంపతులకు ఆర్థికసాయం చేయాలని మీకెందుకు అనిపించలేదు?” అనడిగాను.
అతను చెప్పిన సమాధానం విని అవాక్కయాను నేను. “స్వయంకృతాపరాధానికి శిక్ష అనుభవింపక తప్పదు ఎవరైనా. రామ్మూర్తి మాస్టారు బడిపంతులుగా ఎందరో విద్యార్థులకు పాఠాలు నేర్పించాడు. కానీ, తాను మాత్రం జీవితంలోంచి పాఠాలు నేర్చుకోలేదు. బి.టెక్. చదివిన కొడుకును తల తాకట్టు పెట్టి విదేశాలకు పంపించవలసిన అవసరంలేదు. అయినా, ముందువెనుకలు ఆలోచించకుండా ఉన్న ఒక్క ఆధారాన్నీ కోల్పోయాడు. ఇన్‌డిస్క్రెషన్‌కి అతను చెల్లిస్తూన్న మూల్యం అది.. అలాగే, నా విషయమూను. చేతులు కాలాకగానీ, ఆకుల విలువ తెలిసిరాలేదు. అందుకే అనుక్షణం అనుభవిస్తున్నాను ఇప్పుడు”.
ఆగి, మళ్ళీ అన్నాడతను- “ఓ విధంగా నువ్వూ నేరస్థుడివే. నిస్సహాయతతోనే అయినా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను చేసావు చూడూ, అందుకే! నువ్వు పోతే అమ్మ-నాన్న అనాథలు అవుతారన్న వాస్తవాన్ని విస్మరించావు.”
కొన్ని క్షణాలు మా మధ్య భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది.
తన ఇల్లు చేరువలోనే ఉందనీ, కాస్త ఇంటివరకూ సాయంరాగలవా అనీ అడిగాడు అతను. ‘సరే’నన్నాను.
వరదరాజులు ఇల్లు పెద్ద భవంతి. కానీ, మనుషులు లేక నిశ్శబ్ద-నీరవంలో ఓలలాడుతోంది.
నేను బయలుదేరుతూంటే అన్నాడు వరదరాజులు- “ఈ వయసులో, పరిస్థితిలో ఓ నమ్మకమైన మనిషి అవసరం నాకు. తల్లిదండ్రుల క్షేమంకోసం తాపత్రయపడే వ్యక్తి ఇతరులను మోసం చేయడు. అందుకే నీకో ప్రతిపాదన చేస్తున్నాను.. నాకు చేయూతగా ఉండడానికి నీకు భేషజాలేవీ లేకపోతే.. నెలకు లక్ష రూపాయలు ఇస్తాను. జీతం అనను. అది నీ సర్వీస్ ఛార్జ్ అనుకో.. అంతేకాదు, అవసాన దశలో ఆదుకుంటున్నందుకు నీ ఋణం తీర్చుకోకుండా పోను..”
నా ఆనందానికి మేరలేకపోయింది. పెద్దాయనకు సహాయకారిగా వుండడంలో అభ్యంతరం ఏముంటుంది!
అప్పటికప్పుడే మరో నిర్ణయం కూడా తీసుకున్నాను నేను – మాస్టారు దంపతులను తీసుకువెళ్ళి నా తల్లిదండ్రులతో పాటు చూసుకోవాలని!!