మొక్కై వొంగనిది.. మానై వొంగునా!?

0
4

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన కె. లక్ష్మీ శైలజ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

[dropcap]“పి[/dropcap]ల్లలూ దేవుడూ చల్లనివారే కల్ల కపటమెరుగనీ కరుణామయులే..”

ఆన్‌లైన్ మ్యూజిక్ క్లాస్‌లో మేడం పాట నేర్పిస్తూ ఉంటే జాహ్నవి చక్కగా పాడుతోంది. గొంతు ఖణేల్మని వినిపిస్తోంది. ఈ మధ్య స్కూల్‌లో పాటల పోటీలో మొదటి బహుమతి కూడా తెచ్చుకుంది.

‘నిజమే కదా పిల్లలు మనం ఏం చెప్తే అది నిజమని అనుకుంటారు, కల్లా కపటం తెలియని వారు.. మనం చేసేట్టుగానే వాళ్ళూ చేస్తారు’ అనుకుందా పాట వింటూ జానకి.

***

“చిట్టి తల్లీ.. రామ్మా, స్నానం చేద్దువు” అన్న అమ్మమ్మ జానకి పిలుపుకు.. హాల్‌లో ప్లాస్టిక్ స్లైడర్ ఎక్కి జారుతున్న జాహ్నవి “నేను చెయ్యను” అంటూ మళ్ళీ స్లైడర్ ఎక్కుతోంది.

“స్కూల్‌కు టైం అవుతుందమ్మా. స్నానం చేసి, బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలి. డ్రైవర్ అంకుల్ కూడా వచ్చేస్తున్నాడు” అంటూ వచ్చి యూ.కె.జి. చదువుతున్న ఐదేళ్ళ జాహ్నవి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళబోయింది జానకి.

పక్కనే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్న జానూ వాళ్ళమ్మ జయశ్రీ “అబ్బా.. వస్తుందిలేమ్మా. హాయిగా కాసేపు ఆడుకోనీ” అంటూ జాహ్నవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడి, జానకి చేతిని తీసేసి “నువ్వాడుకోలే జానూ” అంది పాపతో. పాప అమ్మమ్మను తోసేస్తూ మళ్ళీ స్లైడర్ ఎక్కింది.

“జయా, నువ్విలా చేస్తే ఆ పిల్ల నా మాట వింటుందా? త్వరగా తయారవ్వమని చెప్పకుండా ఏమిటిది?” అంది జానకి.

“చిన్నపిల్లలేమ్మా. ఆడుకొనీ” సోఫాలోనుంచి లేస్తూ అన్నది జయ.

ఇంకా “మమ్మల్ని పెంచినట్లు కాదమ్మా. వీళ్ళను ఫ్రీగా పెంచుతాను. నీలాగా ‘పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి’ అని నేను బలవంతంగా వాళ్ళను ఏడిపించను” అని వెక్కిరించినట్లు మాట్లాడి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది.

ఆ మాట వినగానే జానకి అవాక్కయ్యింది. తన పెంపకాన్ని ఎత్తి చూపుతోందని కోపమొచ్చినా కూతురిని ఏమనకుండా తమాయించుకుంది జానకి. వాళ్ళమ్మ వెళ్ళగానే జాహ్నవి “అమ్మమ్మా యూ బ్యాడ్” అంది వచ్చీరాని ఇంగ్లీష్‌లో. జానకి ఆ పిల్ల వైపు కోపంగా చూడలేక చిరునవ్వు మొహానికి పులుముకుంది.

***

జానకి కర్నూల్‌లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలగలుపుగా వుంటూ, రెండుపూటలా అక్కడి ఆడవాళ్ళతో కలిసి వాకింగ్ చేసుకుంటూ, సత్సంగాలకు వాళ్ళతో కలిసి గుళ్ళకు వెళుతూ, హైదరాబాద్‌లో ఉన్న ఒక్కతే కూతురైన జయశ్రీతో వీడియోకాల్ మాట్లాడుతూ.. మనవరాలిని పలకరించుకుంటూ, బి.పి. షుగర్ లకు మాత్రలు వాడుతూ ఆరోగ్యంగానే కాలం గడుపుతూ ఉండేది. అరవై సంవత్సరాలు దాటాయి అనే ఫీలింగ్ లేకుండా మామూలుగా వుంటుంది.

ప్రభుత్వ ఉద్యోగిగా తనకు వచ్చే పెన్షన్ కాక భర్త పోయిన తరువాత అతని పెన్షన్‌లో కొంత భాగం కూడా వస్తూ ఉండటంతో ఎవరి మీదా ఆధార పడకుండా 63 సంవత్సరాల జానకి తనకు తీరిన సమయంలో ప్రవృత్తిగా కథలు వ్రాసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ ఉండేది.

కూతురు రెండవసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అమ్మాయి, అల్లుడు ఇద్దరూ కలిసి జానకిని కొద్దిరోజులు వాళ్ళింటికి వచ్చి ఉండమని అడిగితే సహాయానికి హైదరాబాద్‌కు వచ్చిందిప్పుడు.

తను వచ్చిన వారంరోజుల నుంచీ జానకి గమనిస్తోంది. ‘పాపను అరవకుండా, కొట్టకుండా పెంచాల’ని జయ అంటుంది. ‘మాట విననప్పుడు అరవాలి కదా?’ అంటుంది జానకి. ఈ విషయంలో ఇద్దరికీ అభిప్రాయభేదంతో వాదనలు జరుగుతున్నాయి. ఆ పిల్ల పెంకిగా తయారవుతోందని ‘ఏమిటో? చిన్న పిల్ల మాట వినడం లేదు’ అనుకొని బాధపడుతూ ఉండేది జానకి.

ఆ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో “అమ్మా..” అన్న జయశ్రీ పిలుపుతో తన అలోచనల్లోనుంచి ఈ లోకం లోకి వచ్చింది జానకి.

“అమ్మా, జాహ్నవిని కొద్దిసేపు సైకిల్‌లో వాకింగ్‌కు తీసుకెళ్తావా!” అంది.

“సరే. తీసుకెళ్తాలే” అన్నది జానకి.

సైకిల్ తాళం తీసి “జానూ, రామ్మా” అంది జానకి వాకిట్లో ఉన్న ర్యాంపు మీద నుండి సైకిల్‌ను కిందకు తీసుకెళ్తూ.

“అమ్మమ్మా.. నేను ఇక్కడే సైకిల్ పైన కూర్చుంటాను. ర్యాంప్ మీద నుండి సైకిల్ తీసుకెళ్ళు” అంది గోముగా.

“వద్దులే. కిందకురా” అంది జానకి కింద నుంచి.

“ఊ ఊ.. నేను సైకిల్ మీద కూర్చునే దిగుతాను” అంటూ రాగం తీసిందా పిల్ల.

“అమ్మో. అలా వెళ్ళకూడదు. ర్యాంప్ మీద నువ్వు సైకిల్ మీద వుంటే నేను సైకిల్‌ను కిందకు తీసుకెళ్ళలేను. అప్పుడు సైకిల్ స్పీడ్‌గా కింద వాలు వైపు వెళ్తుంది. పట్టుకోవడం కష్టం. అప్పుడు సైకిల్‌తో పాటు నేనూ పరుగెత్తాలి” అంది జానకి.

“ఐతే ఏమవుతుంది మా? పరిగెత్తూ.. కొంచెం స్పీడ్‌గా. అంతే కదా? చిన్నపిల్ల అడిగిందని కూడా అనుకోవు. ఎందుకు ఎప్పుడూ ఆ పిల్ల అడిగింది చెయ్యకుండా రూల్స్ చెప్తుంటావు?” విసుక్కుంటూ అంది జయ. కూతురి మాటలకు జానకికి కోపమొచ్చింది. ‘పిల్ల మీద ప్రేమతో అమ్మ వయసును కూడా మరిచి పోయింది జయ’ అనుకొంటూ మౌనంగా నిలబడింది.

ఇదంతా చూస్తూన్న జాను “ఏం కాదు అమ్మమ్మా పైనుంచి కూడా దిగొచ్చు. అమ్మ చెప్పింది కరెక్ట్. నీకు తెలియదు” అంటూ ఏడవడం మొదలు పెట్టింది. అమ్మ తనవైపు మాట్లాడటంతో ఆ పిల్ల ఇంకా పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది.

జానకి తనే కొంచెం సర్దుకొని “సరే. సరే. తీసుకెళ్తాలే” అంటూ పాపతో పాటు సైకిల్‌ను నెమ్మదిగా దించింది. పక్కనే ఉన్న పార్క్‌లో పాప ఆడుకుంటూ ఉంటే జానకి ఆలోచనలో పడింది.

జయ కూతురి మాట కాదనకూడదన్నట్లు చేస్తుండటం ఎంతవరకూ మంచిది? ఈ రోజు సైకిల్‌తో సహా తనను పైనుంచి దించమంది. రేపు గ్యాస్ స్టవ్ దగ్గర మంటను ముట్టుకుంటాను అంటే ముట్టుకోనిస్తుందా? ఏమిటీ పిచ్చి ప్రేమలు? ఎందుకు వాళ్ళను కాదనలేని అసహాయత?

జానకి కొంచెం సాలోచనగా జయ గురించి ఆలోచిస్తోంది. తను ప్రెగ్నెంట్ అయిన కూతురికి సహాయంగా వచ్చింది. మధ్యలో వదిలిపెట్టి పోలేదు. ‘తన కూతురిని స్నేహపూరితంగా పెంచాలని తన అమ్మను నిర్లక్ష్యంగా మాట్లాడుతోంది జయ’ అని జానకికి తెలుస్తోంది.

ఆ రోజు జానకి చెల్లెలు జమున ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం చెప్పింది జానకి. జయను ఏమీ అనలేక తను ఇబ్బంది పడుతున్నానని బాధపడింది జానకి.

“ఇప్పటి జనరేషన్ అలాగే ఉందక్కా. ‘పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి’ అని పిల్లలను వీళ్ళే తప్పుదారి పట్టిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు చెప్తే ఆ పిల్లలు చక్కగానే వింటారు. కానీ వీళ్ళే అలా చెప్తే వాళ్ళను హద్దుల్లో పెట్టినట్లు అవుతుందనే భావంతో చెప్పలేక పోతున్నారు.

ఇక్కడ నా కొడుకు కూడా అంతే. వాడి కొడుకు జీవన్ మూడేళ్లవాడు కదా! అయినా జీవన్ మాటకు ఎదురు చెప్పకూడదంటాడు. కోడలు ఏమీ మాట్లాడదు. అన్నీ కొడుకే చెప్తాడు. ‘వాడిని అరవద్దు. కొట్టొద్దు. ఏదడిగితే అది ఇచ్చేయ్యి. ఏం కావాలంటే అది చేసి పెట్టు’ అంటాడు. నేనలాగే చేస్తున్నాను.

‘గారాబం చెయ్యొచ్చు గానీ అతి గారాబం పనికి రాద’ని చెప్తే నన్నే కోప్పడుతున్నాడు. ‘మనకేం డబ్బులేదా? అడిగిన బొమ్మలు కొనిస్తే ఏమీ?’ అంటాడు. పక్కింటి పిల్లకుందని అవసరానికి మించి డబ్బు ఖర్చు చేసి బొమ్మలు కొనిస్తే వాళ్ళకు కష్టం విలువ, డబ్బు విలువ తెలియవు. ‘అతి గారాబం పిల్లలను చెడగొడ్తుంద’ని మనం చెప్తే వినడం ముందు ఈ తరం తల్లి తండ్రులకే ఇష్టం లేదు.

వీళ్ళకిప్పుడు తెలియదు. భవిష్యత్తులో తమ పిల్లలు మాట వినకుండా ఎదిరించినప్పుడు మనం గుర్తొస్తాము.

పూర్వం లాగా ‘వాళ్ళు మన పిల్లలు. వాళ్ళను అరిచే, కొట్టే హక్కు మనకు లేదా?’ అని మనం అనుకోకూడదు. వాళ్ళు మన పిల్లలు కాదు. మన పిల్లల పిల్లలు. ఆ పిల్లల మీద మన పిల్లలకే హక్కు వుంది. మనకు లేదు. అందుకే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. చెప్పింది చెయ్యడం వరకే మనపని. అప్పుడే అందరికీ సంతోషం. గొడవలు ఉండవు” అంది జమున. అది విని నిరాశగా నిట్టూర్చింది జానకి. ‘అంతటా ఇలాగే వుందా’ అనుకుంది.

***

ఆ రోజు కృష్ణాష్టమి. “అందరం తలంటుకుంటాము. ఫోటోలు తియ్యమ్మా” అని జయ అంటే ‘సరే’ నన్నది జానకి.

పీటలు వేసి ముగ్గురూ కూర్చున్న తరువాత అందరికీ కుంకుమ పెడతుంటే ‘నేను పెడతా’నన్నది జాహ్నవి. ‘సరే’ నని కుంకుమ గిన్నె ఆ పిల్లకు ఇచ్చి ముచ్చటగా ఫోటోలు తీసింది జానకి.

ఆ తరువాత జానకి పసుపు గిన్నె తీసుకొని నీళ్ళు కలిపి జయశ్రీ కాళ్ళకు పూసే లోపల “నేను పూస్తాను” అంటూ వచ్చి గిన్నె లాక్కుంది పాప.

“వద్దమ్మా. నిన్న రాత్రే కదా పింక్ కలర్ నైట్ డ్రెస్ కొత్తది వేసుకున్నావూ!? డ్రెస్సుకు ఐతే పసుపు పోదు” అంటూ గిన్నెను పాపకు ఇవ్వకుండా పక్కకు పెట్టింది జానకి.

కానీ జాను “ఊ.. ఊ.. నా ఇష్టం. నేను పూస్తా” అంటోంది. “ఇవ్వమ్మా, పూసుకోనీ. పోతే పోనీలే డ్రెస్సే కదా!? పాప హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది” అంది జయశ్రీ.

“అదెలా జయా! ఆ పిల్లకు తెలియదు. మనం చెప్పాలి కదా? ఇలా అయితే మన మాట వినదు” అంది జానకి.

“ఫరవాలేదు” అని పసుపు గిన్నె పాపకు ఇచ్చింది జయ.

పాప పసుపు ఎక్కువగా తీసుకొని పాపం వాళ్ళమ్మ కాళ్ళకు పూయడంలో తన బట్టలకు తన కాళ్ళకు, మోచేతులకు పూసుకుంది.

“చూశావా.. చెప్తే వినలేదు నువ్వు. బట్టలకు పూసేసుకున్నావు. అందుకే నేను చెప్పింది” అని పాపను జానకి అంటూ వుంటే “ఏంటమ్మా అరవై ఏళ్ళు దాటిన నువ్వు ఆరేళ్ళు కూడా లేని పిల్లతో పోటీ పడుతున్నావు? ఆ పిల్ల ఎప్పుడూ నీ మాటే వినాలనుకుంటావు. ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మారడం లేదమ్మా. వాళ్ళకిష్టమైనట్లు ఉండనీ” అంటూ తలకు నూనె పెట్టీ పాపను స్నానానికి తీసుకొని వెళ్ళింది. అల్లుడు ఇదేమీ పట్టనట్లు మౌనంగా మొబైల్‌లో సెర్చ్ చేసుకుంటూ ఉండిపోయాడు.

జానకికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ‘తను మారాలా? తన కూతురికి మంచేదో, చెడేదో చెప్పుకోలేక నన్ను నిందిస్తోంది. అయినా ఇంత నిర్లక్ష్యంగా తన కూతురు తనను ఎలా మాట్లాడగలుగుతోంది? ఐదు వందల రూపాయల నైట్ డ్రెస్ అంత ఈజీగా పాడుచేసుకోవాలా?’ అనుకుంటూ ఆరోజంతా దిగులుగా గడిపింది జానకి.

రాత్రి పడుకునే ముందు ప్రస్తుతం పిల్లల పెంపకం గూర్చి యువ తల్లితండ్రులు ఇలా ఆలోచిస్తున్నారెందుకని చాలాసేపు ఆలోచనలో ఉండిపోయింది జానకి. ‘పెద్దవాళ్ళమీద వాళ్ళకేమీ కోపం లేదు. వాళ్ళ పిల్లలను ముద్దుగా పెంచుకోవాలనే కోరిక తప్ప’ అని తనకు తానే సర్ది చెప్పుకొని కళ్ళుమూసుకుంది.

***

జాహ్నవిని ఏమీ అనకుండా ఉందామని ప్రయత్నం చేస్తోంది జానకి. ఆ రోజు మధ్యాహ్నం జయశ్రీ నిద్రపోతున్నప్పుడు జాహ్నవిని కనిపెట్టుకొని కూర్చుంది.

“అమ్మమ్మా.. నాకూ హెరిటేజ్ వారి ఆర్ట్ అండ్ కల్చర్‌లో మెడల్ వచ్చింది తెలుసా?” అనింది జాహ్నవి.

“అవునా!? ఈ మధ్యనే అమ్మ చెప్పింది. మెడల్ ఇచ్చేటప్పుడు బెంగళూర్ వెళ్ళి పాట కూడా పాడావని. అదేనా ఇది!?” అంటూ మెడల్ తీసుకొని చూసి “జాహ్నవి మా బంగారు కొండ కదా! అందుకే మెడల్ వచ్చింది” అంటూ జాహ్నవికి ‘కంగ్రాట్స్’ చెప్పింది జానకి.

“థాంక్యూ” అంది ముచ్చటగా జాను.

‘పిల్ల తెలివి గలది. అమ్మ గారాబం తో కొంచెం మొండిగా మాట్లాడుతుందంతే’ అనుకుంది జానకి.

జాహ్నవి పెయింటింగ్ బుక్స్ తీసుకొని స్కెచ్ పెన్నుతో కలరింగ్ చేస్తున్నది. బొమ్మ మీద బరబరా గియ్యడం చూసి జానకి “జానూ.. అలా స్పీడ్‌గా కాకుండా స్లోగా, ముందు బోర్డర్ లోపల గీస్తే బాగా వస్తుంది బొమ్మ” అంది జానకి.

“నా ఇష్టం. నేనిలాగే వేస్తాను” అంది జాహ్నవి అమ్మమ్మ వైపు చూడకుండా.

“అలాకాదు తల్లీ. నేను చూపిస్తా చూడు” అని జానకి అంటే

“ఏం కాదు. ఇలాగే వెయ్యాలి” అంటూ యింకా స్పీడ్‌గా గీతలు బైటికొచ్చేట్టు గీయసాగింది.

“జానూ, వద్దులే ఆపేసేయ్. అమ్మ లేచిన తరువాత వేసుకుందాము” అంది జానకి గట్టిగా.. చెప్తున్నా వినకుండా ఆ పిల్ల బుక్ పాడు చేస్తోందని.

“ఏం వద్దు. నువ్వు బ్యాడ్. అవతలికి పో” అని బుక్స్ తీసుకొని లేచింది జాహ్నవి.

ఇంతలో గదిలో నుంచి లేచి వస్తూ జయశ్రీ

“ఏయ్. పెద్దవాళ్ళు అనే రెస్పెక్ట్ లేకుండా అమ్మమ్మను అలా మాట్లాడకూడదు” అన్నది.

“ఆ.. నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా? ఆ పిల్ల ఇవ్వడానికి” అని జానకి మామూలుగా అన్నది.

“నువ్వు ఆ పిల్లను ఏమైనా అంటే జాను కూడా అలాగే మాట్లాడుతుంది. ముందు నువ్వు ఆ పిల్లతో మాట్లాడ్డం నేర్చుకోమా” అంది కోపంగా జయ.

ఆ మాటలకు ఏమీ చెప్పలేక ‘ఇంత సంస్కారం లేకుండా తనను జయ మాట్లాడుతూ ఉందేమిటి? ఇలా మర్యాదగా మాట్లాడలేనట్లుగా తను జయను పెంచానా?’ అనుకుంటూ కూర్చుంది జానకి.

జయశ్రీ ఆ పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంగ్లీష్‌లో పెద్దవాళ్ళను గౌరవించాలనీ వాళ్ళను కోపంగా మాట్లాడకూడదనీ చెప్పింది. అంతా విని మళ్ళీ జాహ్నవి “అమ్మా, అమ్మమ్మ అరుస్తోంది” అంటూ పెద్దగా ఏడుస్తోంది.

“చూశావా! అంతా నీ వల్లే. ఆడుకునే పిల్లలను ఆడుకోనివ్వవు” అంటూ జాహ్నవికి మళ్ళీ స్కెచ్ పెన్నులు ఇచ్చింది జయశ్రీ.

జానకి ఏమీ మాట్లాడలేదు.

ఆ విషయం అంతటితో పోలేదు. సాయంత్రం ఇంట్లో పనిమనిషిని కూడా అలాగే కమాండింగ్‌గా మాట్లాడింది.

“ఏయ్.. నా బొమ్మలు పైనపెట్టి ఇల్లు చిమ్మాలి కదా?” అంది జాహ్నవి.

అది విని జానకి భయపడింది. ‘అయ్యో. పనిమనిషి ఏమైనా అనుకుంటుందో ఏమో’ నని. కానీ పనిమనిషి అలవాటైనది కనుక నవ్వుతూ వెళ్ళిపోయింది.

‘తనను మాట్లాడితే ‘పోనీలే చిన్నపిల్ల’ అనుకుంది. ఇలా నలుగురిలో దురుసుగా మాట్లాడితే ఎంత చిన్నతనంగా ఉంటుంది? అవతలివాళ్ళు అమర్యాదగా మాట్లాడిందని అనుకోరా?’ అనుకొని బాధపడింది.

ఆ రోజు ‘పాప చెప్పినవేమీ కాదనలేని పరిస్థితిలో జయ ఉండటం, మళ్ళీ ఆ పిల్లే తన అమ్మను కోప్పడుతుంటే వద్దని చెప్పాలనుకోవడం ..ఈ ద్వైదీభావనతో జయ ఇబ్బంది పడటం’ గూర్చి ఆలోచిస్తూ ఈ కాలపు ‘పిల్లల పెంపకంలో ఈ మార్పు సహజమేనా?’ అని జానకి ఆరాట పడింది.

ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర ఆపిల్ల అన్నం అంతా కింద పోస్తూ తినడం చూసి “జానూ, అన్నం తినేటప్పుడు ప్లేట్ చుట్టూ అన్నం మెతుకులు పడిపోకుండా ప్లేట్ మధ్యలో నుంచి అన్నివేళ్ళతో తింటే అన్నం వేస్ట్ అవ్వదు. చూడు.. చాలా అన్నం కింద పడిపోయింది” అని జానకి చెప్పగానే,

“పోనీలేమ్మా, పడితే పడనీలే. పిల్లలను ఫ్రీగా ఉండనీ. ఎప్పుడూ ‘అలా చెయ్యీ, ఇలా చెయ్యీ’ అని చెప్పడం మానుకోమ్మా. దాన్నెందుకు అరుస్తావు? మీ కాలం లాగా కాదు. పిల్లలకు వూరికే హద్దులు చెప్పకు.. వాళ్ళే తెలుసుకుంటారులే” అని జయశ్రీ అన్నది.

ఆ మాటతో “ఎందుకు అమ్మమ్మా, నువ్వెప్పుడూ అరుస్తావూ?” అన్నదా పిల్ల గట్టిగా.

జానకి ఖంగుతిన్నది.

‘తాము పిల్లలను క్రమశిక్షణగా పెంచితేనే పిల్లలు మంచి దారిలో నడిచారు. మరి వీళ్ళు చిన్న వయసు నుంచీ పిల్లల స్వంత నిర్ణయాలను గౌరవించాలని చూస్తే ఆ చంటి పిల్లలకు మంచి, చెడూ తెలిసేదెలా?’ అనుకుంది.

కానీ ఒకరోజు జయశ్రీని కూడా ఆ పిల్ల ఎదిరించింది, తను కావాలనుకున్న గౌను జయశ్రీ వద్దన్నదని.

“నీకేం తెలీదమ్మా. నా ఇష్టం. నేను ఇదే వేసుకుంటా” అనింది. జయ ఏమీ అనలేక ఆ పిల్ల అడిగిన గౌన్ వేసింది.

ఇంకో రోజు కప్ బోర్డ్‌లో తన బర్త్ డేకు వచ్చిన గిఫ్ట్స్ పాకెట్స్ ఓపెన్ చేసి తీసుకుంటానని గొడవ చేసింది.

“వద్దు జానూ. అవి మన ఇంట్లో ఉన్న బొమ్మలే కదా! అవి ఇంకెవరికైనా ఇచ్చేద్దాము. పాకెట్స్ ఓపెన్ చెయ్యొద్దు” అని జయ చాలా అనునయంగా చెప్తోంది. అయినా పాప వినడం లేదు. చివరికి గట్టిగా బెదిరించింది. అప్పుడు ఆ పిల్ల ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న డబ్బా ఎత్తి జయ మీద పోసేసింది. అన్నీ చెల్లాచెదరుగా ఇల్లంతా పడ్డాయి. కోపంగా చెయ్యెత్తి కొట్టబోయింది జయ. కానీ ఆ పని చెయ్యకుండా చిన్నపిల్ల మాట వినడం లేదనే బాధతో కంట్లో నీళ్ళు తిరుగుతుండగా కొద్దిసేపు అలాగే కూర్చుండిపోయింది.

అది గమనించిన జానకి ఆ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళితే తను పాపను పెంచుకునే పద్ధతి వల్ల పాప ఎవరి మాటా వినకుండా తయారవుతోందని జయ బాధ పడ్తుందని ఇదంతా చూడనట్లుగా దూరంగా వెళ్ళిపోయింది.

పిల్ల చేయి దాటిపోతోందని జయకు కూడా తెలుస్తోంది. కానీ పిల్లను అరవలేకపోతోంది. కొట్టలేకపోతోంది. ఎన్నో ఆదర్శాలతో పిల్లను పెంచాలని అనుకుంటూ ఉంటే పిల్ల ఇలా తనకే ఎదురు తిరగటం మనసుకు బాధగా ఉంది. ‘ఈ పిల్ల కోసం అమ్మను కూడా అనరాని మాటలు అంటున్నాను’ అనుకుంటూ జయ చాలా సేపు బాధపడుతూ కూర్చుంది.

ఆ రోజు సాయంత్రం జానకి పాపను వాళ్ళ నాన్నతో పార్క్ కు పంపించి జయ దగ్గరకు వచ్చి కూర్చుంది. జయ సోఫాలో కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటూ ఉంది. మధ్యాహ్నం జాను గొడవ చేసినప్పటినుంచి జయశ్రీ దిగులుగా కనపడుతోంది. మౌనంగా తిరుగుతోంది. జానకి అమ్మ మనసు అది కనిపెట్టింది.

అందుకే జానకి వచ్చి జయతో మాట్లాడటానికి పక్కన కూర్చుంది.

“జయా.. పాప కొంచెం అల్లరిగా ఉందని దిగులు పడకు. చిన్నవయసు కదా. అంతే. కొద్ది రోజులు పోతే అర్థం చేసుకుంటుంది. బాగా పాటలు పాడుతుంది. చక్కగా చదువుతుంది. మంచి తెలివి గలది” అని జానకి అనగానే

“అదేమా నేను చెప్పేది. పాప చక్కగా చెప్పింది చేస్తుంది. ఊరికే అది చెయ్యి, ఇది చెయ్యకు అని మనం చెప్పడం ఎక్కువైతే పాపకు కోపం వస్తుంది. వాళ్ళను ఆపకుంటే వాళ్ళు టెన్షన్ లేకుండా ఉంటారని నేను నీక్కూడా చెప్తున్నాను” అంది జయ

“నాకు కోపం రావడం సరేలే. ‘అమ్మ మాట వేదం’ అనుకుంటున్న పసి మనసు. కాబట్టి నువ్వు పాప పొరపాటు పని చేస్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్పడంలో తప్పేముంది? నువ్వొకటి గమనించావా? నువ్వు ఒప్పుకోవడానికి కష్టపడ్డా ఇది నిజం. నువ్వెప్పుడైతే పాపకు సపోర్టింగ్‌గా మాట్లాడుతావో అప్పుడు పాప నన్ను ఎదిరిస్తోంది. అప్పుడే ఎదురించవచ్చు అనే భావం తనలో పెరుగుతోంది. నన్నే కాదు, పనిమనిషిని కూడా మాట్లాడింది. రేపు బంధువులు ఇంటికి వచ్చినా మాట్లాడుతుంది. ఈ రోజు నిన్ను ఎదిరించినందుకు పడ్డ బాధ కంటే ఆ పిల్ల పరాయి వాళ్ళ ముందు మాట విననప్పుడు నువ్వెక్కువ క్షోభ పడతావు. అంత విచ్చలవిడితనంగా పెరిగితే వాళ్ళకు బాధ్యత తెలియదు.”

జానకి మాటలు పూర్తి కాకుండానే “అదే.. అదే నువ్వు చెప్పేది. పిల్లను ముచ్చటగా అడిగినవి ఇచ్చి ఏడిపించకుండా పెంచుకుందామంటే.. ఏమాత్రం పడనివ్వడం లేదు నువ్వు. ప్రతీ దానికీ అడ్దం వస్తావు. ఆడుకోవడం, తినడం, మాట్లాడటం అన్నింటికీ హద్దులే” కోపంగా జయశ్రీ.

జానకి నిట్టూరుస్తూ “జయా, మళ్ళీ మొదటికొస్తున్నావు. ఇది పూర్తిగా తెలియని వయసు. అన్నీ నువ్వు చెప్తేనేగా నేర్చుకుంటోంది? అలాగే ఇది చేస్తే.. ఎలా చేస్తే మంచిది అని చెప్పినంత మాత్రాన మనం హద్దులు పెట్టినట్లు కాదు. ఈ కాలం తల్లితండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకోవడంవల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మన పిల్లలు సంతోషంగా ఉండాలని అనుకోవడంలో తప్పలేదు. కానీ అలా చేయడం వల్ల వాళ్ళకే ప్రమాదముంటే వద్దని చెప్పడం మన ధర్మమే కాదు, మన బాధ్యత కూడా. వాళ్ళను గారాబం ప్రస్తుతానికి సంతోషంగా అనిపించినా భవిష్యత్తులో కష్టమవుతుంది. వాళ్ళను వారించడం ప్రస్తుతం కష్టమనిపించినా భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్గం లోకి వస్తారు” అని జానకి చెప్తుండగా

“మనం ఎప్పుడూ అలా వద్దని చెప్తూ ఉండటం వల్ల పిల్లలు మనకు అబద్ధం చెప్పడం, చెప్పకుండా కొన్ని పనులు చేస్తారేమోనని నా భయం” అంది జయశ్రీ మళ్ళీ కోపంగా.

“కరెక్టే. ‘ఎప్పుడూ నన్ను అంటున్నార’ని పిల్లలు అనుకుంటారని నీ భయం. కానీ వాళ్ళు ప్రమాదం వైపు వెళ్తుంటే మనం చెప్పక తప్పదు. ఇంకా.. మా కంటే ఎక్కువ చదువుకున్నవాళ్ళు మీరు. ఎన్నో పరిశోధనలు చదివి వుంటారు. అయినా ఒక్కోసారి అనుభవాన్ని మించిన సంపద లేదంటారు కదా? అలాగా పెద్దవాళ్ళకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అవి మీరు కాదనకూడదు. వాళ్ళతో తల్లిదండ్రులుగా మీరిద్దరూ కూడా ఎక్కువ సమయం గడపండి. కథల పుస్తకాలు కొని పెట్టడం కాదు. వాటిని అప్పుడప్పుడూ చదివి వినిపించు. వాల్మీకి రామాయణం 2024-2025 సంవత్సరానికి పదవతరగతి ఉపవాచకంగా చేస్తున్నారట. ఎంత శుభ పరిణామం! రామాయణం ఆచరణీయ గ్రంథం. ‘తల్లి తండ్రులతో, తోబుట్టువులతో ఎలా ప్రేమగా వుండాలి’ అని చెప్తుంది. అందులోనుంచి రోజుకొక చిన్న సంఘటన చదివి చెప్పు. ప్రశాంతంగా వింటుంది. ఇంతకంటే నేను చెప్పలేను” అంటూ సంభాషణను ముగించి లేచింది జానకి.

జయ ఒకసారి జానకి వైపు చూసి మూతి ముడుచుకుంది.

ఆరోజు ఊర్లోనే ఉండే జయశ్రీ ఆడపడుచు లహరి, ఆమె భర్త లక్ష్మణ్ వాళ్ళ పాపను తీసుకొని వీళ్ళింటికి వచ్చారు, జయశ్రీని చూడటానికి, జయశ్రీకి నెలలు నిండుతున్నాయని. లహరి, జయశ్రీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా వుంటారు. ఒకేసారి ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఒకరి కష్టసుఖాలు ఇంకొకరికి చెప్పుకుంటారు.

దీపావళి పండుగ అందరూ కలిసి జరుపుకోవచ్చని వాళ్ళను వీళ్ళే రమ్మన్నారు. స్వీట్స్ తెప్పించుకున్నారు. కొత్తబట్టలు కట్టుకున్నారు.

జాను కంటే రెండు నెలలు చిన్నది వాళ్ళ పాప లాస్య. ఇంకా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతోంది. పిల్లలిద్దరూ చక్కగా కలిసిపోయి జాహ్నవి బొమ్మలు తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు.

దీపావళి రోజు రాత్రి టపాకాయలు కాల్చుకునే సమయంలో ప్రమాదం జరుగకుండా అందరూ కాటన్ వస్త్రాలు ధరించారు. కానీ జానూ మాత్రం తనకు నచ్చిన సిల్క్ ఫ్రాక్ కావాలని గొడవ చేస్తోంది.

అసలే జయశ్రీకి పదవ నెల వచ్చిరెండు రోజులయ్యింది. బాగా ఆయాసంగా వుంది.l

“జానూ.. లాస్య కాటన్ గౌన్ వేసుకుంది. నువ్వు కూడా వేసుకోమ్మా. నేను అత్తయ్య కూడ కాటన్ బట్టలు వేసుకున్నాము. అమ్మమ్మ, మామయ్య, నాన్న కూడా కాటన్ డ్రెస్సెస్ వేసుకున్నారు. మనం కాటన్ వేసుకుంటే కాలుతున్న టపాకాయలు మీద పడ్డా మనం కాటన్ బట్టలు వేసుకుంటే వెంటనే కాలి, మనకు అతుక్కుపోవు. గాయం అవదు” అని చాలా సేపట్నుంచి నచ్చచెప్తోంది జయ. కానీ జాహ్నవి వినడం లేదు.

“జాను తల్లీ.. నీకు లాస్యకు మంచి ఫోటో తీస్తాను” అని అత్తయ్య లహరి కూడా బ్రతిమిలాడుతోంది.

కానీ జాహ్నవికి మంచి మెరుపులతో ఉన్న తన సిల్క్ గౌన్ వేసుకోవాలని కోరిక. అమ్మ వద్దంటోంది. ఇంట్లో అందరూ కూడా కాటన్ గౌన్ వేసుకోవాలంటున్నారు. ఆ పిల్లకు బాగా కోపం వచ్చేసింది. వెంటనే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీది వాటర్ బాటిల్ తీసుకొని ఆ నీళ్ళన్నీ కాటన్ గౌన్ మీద పోసేసింది. అందరూ అవాక్కయ్యారు. వెంటనే ఆ పిల్లను లాగి పెట్టి చెంప మీద కొట్టింది జయ.

ఒక్క క్షణం అందరూ నిశ్చేష్టులయ్యారు.

తేరుకున్న జాహ్నవి ఆరున్నొక్కరాగం అందుకుంది. మళ్ళీ కొట్టబోతున్న జయశ్రీని లహరి అడ్డుకుంది. జయశ్రీ మొహం ఎర్రబడింది.

కొద్ది సేపటి వరకూ ఆ పిల్లను బుజ్జగిస్తూ ఉన్నారు అందరూ. ఎపుడూ దెబ్బలు తినని రోషం ఆ పిల్లది.

అందరి ముందు ఎంతసేపటికీ ఆ పిల్ల తను చెప్పిన మాట వినలేదనే బాధ జయది.

పిల్ల త్వరగానే ఏడుపు మరచిపోయింది కానీ చాలా ఆలస్యంగా గాయమైన మనసుతో జయ ఆ దీపావళి రోజు టపాకాయలు కాల్చుకోవడానికి వచ్చింది.

ఆ తెల్లవారి ఆదివారం కావడంతో లహరివాళ్ళు ఆ రాత్రి ఇక్కడే వున్నారు. వికలమైన మనసుతో వున్న జయశ్రీతో ఆ రాత్రి ఎక్కువగా మాట్లాడకుండా ఉదయం పార్క్‌కు తీసుకొని వెళ్ళింది లహరి.

లహరి తలవంచుకొని బెంచ్ మీద కూర్చునీ ఉన్న తన ఆడపడుచైన స్నేహితురాలి చెయ్యి మీద చెయ్యి వేస్తూ ఇలా చెప్పింది.

“జయా, పాపను నువ్వెంత స్వేచ్చగా పెంచాలని అనుకుంటున్నావో నాకు తెలుసు. ఒక ఆడపిల్లగా నేను నీకు ఈ విషయంలో సపోర్ట్‌గా వుంటాను. ఎవరో ఏదో అంటారని నువ్వు వెనుకంజ వెయ్యొద్దు.

కానీ ఆ చిన్నారి మనసులో తన మాటే నెగ్గాలనే భావాన్ని మాత్రం పెంచనీయకు. పెద్దవాళ్ళు చెప్తున్న మంచి చెడ్డలు కూడా వినేట్టు ఇప్పట్నుంచే అలవాటు చెయ్యాలి.

మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ‘మొక్కై వంగనిది మానై వొంగునా?’ ఈ వయసులోనే ‘పెద్దల మాట వింటే తప్పులేదు’ అని ఆ పిల్ల తెలుసుకోవాలంటే ముందు నువ్వే నేర్పించాలి. ‘నీకు ఇష్టమైనట్లే చేద్దాం, కానీ దీని వల్ల నీకు ఇలాంటి కష్టం వస్తుంది’ అని చెప్పడంలో తప్పులేదు. ఇలా ఇప్పుడు మన మాట వినకుంటే రేపు టీచర్ మాట కూడా వినదు. భవిష్యత్తులో తన మాట నెగ్గలేదని డిప్రెషన్‌కు లోనవ్వచ్చు.

ఇప్పుడు ఒక దెబ్బకొట్టినా ఫరవాలేదు. పిల్ల దారిలో కొస్తుంది. లేకుంటే నలుగురిలో నగుబాటు అవుతాము. పూర్వం ఉమ్మడి కుటుంబాల వల్ల మంచి మర్యాదలు ఒకరు నేర్పించకుండానే పిల్లలకు అలవాటు అయ్యేవి. ఇప్పుడు ఏ పుస్తకం లోనో చెప్తేనే తెలుస్తున్నాయి.

‘పిల్లను ఇలా పెంచారేమిటి?’ అని రేపు నిన్ను ఎవరైనా అనే ప్రమాదం కూడా వుంది. అప్పుడు ‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న’ చందాన నువ్వేం చెప్పినా జరగ వలసిన ప్రమాదం అమ్మాయికి జరిగిపోతుంది. ఇప్పుడే మనసు రాయి చేసుకొని అమ్మాయిలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చెయ్యి. చిన్న వయసు. త్వరగానే మారుతుంది. ‘సామ, దాన, భేద, దండోపాయా’లు తప్పవు. ‘దండం దశ గుణం భవేత్’ అని కూడా అన్నారు పెద్దలు” అని ముగించింది.

లహరి మాట్లాడుతుంటే కళ్ళనీళ్ళతో వింది జయ.

నెమ్మదిగా అవునంటూ తల వూపింది. ఈ రోజు లహరి కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అయితే ‘ఎంత సిగ్గుచేటు’ అని కూడా అనుకుంది.

ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి లాస్యకు తన బొమ్మలు ఇవ్వకుండా గొడవ చేస్తోంది జాహ్నవి.

జయ లహరి వైపు ఒక నిముషం చూసి, “జానూ లాస్యకు నీ బొమ్మ ఇవ్వు. కొద్దిసేపు ఆడుకొని ఇస్తుందమ్మా” అంటూ ఆ పిల్ల దగ్గరకు వెళ్ళింది.

“నేనివ్వను. ఇది నాది” అంది జాను.

“ఫరవాలేదు. ఆడుకొని మళ్ళీ నీకే ఇస్తుంది” అని జయ మళ్ళీ అంది.

“ఊహూ.. ఊహూ..” అంటూ గునుస్తున్న జానూతో

“జాను చెప్తున్నా కదా ఇవ్వు” అంది గొంతులో కొంచెం గంభీరత తెచ్చుకొని గట్టిగా.

ఆ పిల్ల ఒకసారి వాళ్ళమ్మ వైపు చూసి ఏమనుకుందో.. ఆ బొమ్మ లాస్యకు ఇచ్చింది. వెంటనే జాహ్నవినీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది జయ. జయ మెడ చుట్టూ చేతులు వేసింది జాను గోముగా. లాస్య కూడా బొమ్మ తీసుకొని జాను వద్దకు వచ్చింది.

ఇదంతా చూస్తున్న లహరి తన శ్రమ వృథా కానందుకు ‘అమ్మయ్య’ అనుకుంది. తల్లి కూతుళ్ళల్లో ఈ రోజు వచ్చిన ఈ చిన్న మార్పు ముందు ముందు ఎంతో మంచి ఫలితాన్నిస్తుందని సంతోషించారు లహరితో పాటు జానకి, ఇంకా కుటుంబ సభ్యులు.

కల్లాకపటం తెలియని పిల్లలు గలగలా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here