[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘స్వర్ణ భారతము’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కష్టము నష్టముల్ పడుచు కాంగ్రెసు తెచ్చె స్వతంత్ర రాజ్యమున్
స్పష్టము రాని చట్టముల శాంతిని బెంచగ దేశమందు, తా
క్లిష్ట విధాన మెంచుచును కీడొనరించును నేటి నాయకుల్
ఇష్టము వచ్చు రీతి ప్రజ నేలగ పూనిరి దుష్ట చిత్తులై
దృష్టిని స్వార్థమున్ నిలిపి, తీరుగ చర్య లొనర్చు నేర్పునన్ (1)
కుల మతముల్, విభిన్నతయు కూడదు వాంఛిత మైకమత్యమే
కలతలు మాని, వృద్ధి గని కార్మిక, కర్షక, ధార్మికోత్తముల్
విలసిత వైభవంబునకు విజ్ఞత, దక్షత దీక్ష బూనరే
నలుగురి క్షేమ లబ్ది కయి నవ్య సుభారత తేజ మొప్పగన్ (2)
సైనిక భక్తి యుక్తి, ఘన శక్తిని చాటగ, రక్ష సేయగా
మానిత పౌరులెల్ల తమ మంత్రుల మాన్యులు గాగ నెన్నఁగా
పూని విదేశ మిత్రులను స్ఫూర్తిగ జూచి, ప్రసిద్ధి గాంచగా
ధీనిధులెల్ల దేశమున దీప్తిని, యున్నతి నిల్ప నెంచరే
కానగ స్వర్ణ భారతము, ఖ్యాతిని గానము సేయరే ధృతిన్ (3)