ఫ్రీ డెమో..

0
3

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఫ్రీ డెమో..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]వండీ, నేను గుడికి వెళ్తున్నాను. ఎవరో హౌస్ క్లీనర్స్ వాళ్ళు ఫోన్ చేశారు. ఫ్రీ డెమో కింద మన ఇల్లు క్లీన్ చేస్తారట. ఓ గంటలో వస్తా అన్నారు.” చెప్పింది.

కాళ్ళు ఊపుతూ, టీవీ చూస్తున్న సుబ్బారావు ఆవులిస్తూ, నేనే ఆన్‌లైన్‌లో చూసి ఫ్రీ డెమో బుక్ చేసాను” చెప్పాడు కాస్త గర్వం పోతూ.

“ఎందుకొచ్చిన అతి ఉబలాటవండీ అది!, మనకి అవసరం లేకపోయినా ఆయా కంపెనీల ఫ్రీ డెమోలు వాడే కక్కుర్తి అవసరమా చెప్పండి. వాళ్ళు వచ్చి మన ఇల్లు శుభ్రం చేయడం, కారు కడగడం, ఏ.సి. సర్వీస్ చేయడం ఇలా రోజూ ఏదోకటి, ఫ్రీ గా వస్తుందని కదా అని రోజూ ఏదోక ఫ్రీ డెమో వేలం వెర్రిగా బుక్ చేయడం ఎందుకండీ?” నెత్తి కొట్టుకుంటూ పళ్ళు కొరికి, కళ్ళు ఉరిమి చూస్తూ అంది లక్ష్మమ్మ.

ఆమె వంక కాస్త భయంగా చూస్తూ, “ఇందులో మనకి వచ్చే నష్టం ఏవీ లేదు లక్ష్మి, పైగా ఫ్రీ సర్విస్ కూడానూ. పైగా, నేనా రిటైర్ అయిపోయాను. ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది, అందుకే కొంత కొత్తగా ఆలోచించి, ఆన్‌లైన్‌లో రోజూ ఏదో ఒక ఫ్రీ డెమో టీమ్‌ని పిలుస్తాను. నాకు ఏదో కాలక్షేపం ఉండొద్దూ.” చెప్పాడు వినయంగా.

“సరే, మీ ఇష్టం, తగలడండి. నేను గుడికి వెళ్ళొస్తాను.” విసురుగా చెప్పి బయటకి నడిచిందామె.

తర్వాత, టీవి చూస్తుండగా, కాలింగ్ బెల్ మోగడంతో, నెమ్మదిగా వెళ్లి డోర్ తీశాడు సుబ్బారావ్. ఎదురుగా ఒక అమ్మాయి, అబ్బాయి నుంచుని పళ్లికిలించి నవ్వుతూ చూసారు.

“ఎవరు మీరు, ఏం కావాలి” చిరాగ్గా అడిగాడు.

“అదే సార్, మేము స్ట్రాంగ్ లాక్ కంపెనీ నుంచి వస్తున్నాo. మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ ఫ్రీ డెమోలు తీసుకోవడం చూసి, మా కంపెనీ కూడా మీకు ఓ ఫ్రీ డెమో ఆఫర్ ఇచ్చింది. అంటే మాది తాళాల కంపెనీ. మా తాళాలు వాడితే అసలు ఎవరూ ఆ తాళాన్ని తెరవలేరు. అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీకు డెమో ఫ్రీగా చూపించి వెళ్ళిపోతాo, అంతే. తర్వాత మీకు నచ్చితే, మా కంపెనీకి ఫోన్ చేసి కావాల్సిన తాళాలు ఆర్డర్ చేసుకోవచ్చు, అంతే సార్” అన్నాడు.

“తాళానికి డెమోనా” అడిగాడు.

“అవును సార్, ఇప్పుడు మీ ఇంట్లో ఇన్ని తాళాలు వేస్తున్నారు కదా, అంటే మెయిన్ డోర్ లాక్, బెడ్ రూమ్ లాక్, ఇవన్నీ సెక్యూర్ కాదు అని మేము మీకు రుజువు చేసి చూపిస్తాం. మా దగ్గర ఉన్న ఈ చిన్న స్టీల్ రాడ్‌తో వాటిని తేలిగ్గా తీసేసి మీకు చూపిస్తాం. అలాగే మా తాళం వేసుకున్న తర్వాత, అది ఎవరు తీసినా రాదు, పగలగొట్టినా విరగదు. అంత గట్టిగా ఉంటుంది. మీరు ప్రస్తుతం వాడుతున్న ఆ నాసిరకం తాళాన్ని, మేము ఈజీగా తీయలేకపోతే, అంటే అన్‌లాక్ చేయలేకపోతే, మీరు మా తాళం కొననవసరం లేదు” ఖరాకండిగా చెప్పాడు ఆ సేల్స్ రిప్రజెంటేటివ్.

“అలాగా, ఏది ఈ మెయిన్ డోర్ లాక్ చేస్తాను. అన్‌లాక్ చేసి చూపించు” అన్నాడు సుబ్బారావు

“ఓకే సార్, తేగ తిన్నంత తేలిగ్గా చేస్తాను చూడండి” అనేసి, చిన్న నవ్వుతో బయటికి వెళ్లి నిలబడ్డాడతను. సార్ “ఇప్పుడు మీరు తాళాన్ని లాక్ చేయండి” అన్నాడతను.

సుబ్బారావు ఇంటిలోపలి నుండి తాళం వేసాక, వెంటనే ఏదో ఒక చిన్న స్టీల్ రాడ్ లాంటిది, తలుపు కీ హోల్‌లో అటు ఇటు పెట్టి, టప్పని మెయిన్ డోర్ తీసేసాడు. సుబ్బారావు షాకయిపోయాడు. గుడ్లు తేలేస్తూ, తెల్ల మొహంతో, “ఇదేవిటి, ఇంత తేలిగ్గా పుటుక్కున తీసేసావ్” అయోమయంగా చూస్తూ అడిగాడు.

“నే చెప్తే విన్నారా, ఇదే కాదు, మీ ఇంట్లో ఇంకా స్ట్రాంగ్ తాళాలు ఏవున్నా సరే, తీసి చూపిస్తాను. కాబట్టి వెంటనే ఈ మా తాళం కొనుక్కోండి” అంటూ తన చేతిలో ఉన్న ఒక తాళానికి సంబంధించిన వివరాలను పాంప్లెట్ ఇచ్చాడు.

“ఈ తాళం ఎంత పడుతుంది” అడిగాడు సుబ్బారావు.

“ఇది మామూలుగా ఐదువేలు, మీకు డిస్కౌంట్‌లో నాలుగు వేలకు వస్తుంది. ఈరోజే తెప్పించండి. మీ తాళాన్ని ఎవరూ తెరవలేరు.” అన్నాడు

“అలాగా!”అని ఓ క్షణం ఆలోచించి, “అలా అనకు, మా బెడ్ రూమ్ తాళం చాలా సేఫ్ ” చెప్పాడు

“అది కూడా సేఫ్ కాదు. కావాలంటే ఇపుడే అది కూడా తెరిచి చూపించమంటే చూపిస్తాను” అన్నాడు తేలిగ్గా సుబ్బారావ్ వంక చూసి నవ్వుతూ

సుబ్బారావ్ ఇగో పెరిగి, “సరే అయితే పదండి.” అనగానే సుబ్బారావు వెనకాలే ఆ ఇద్దరు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా వెళ్లారు.

సుబ్బారావు బెడ్ రూమ్ లోకి వెళ్లి, “ఇది నేను లోపలి నుంచి లాక్ చేస్తాను, నువ్వు బయట నుంచి తెరువు చూద్దాం” అన్నాడు ఛాలెంజ్ చేస్తున్నట్టు

“సరే అయితే” అనగానే సుబ్బారావు, తన పడక గదిలోకి వెళ్లి తాళం వేసి “ఇపుడు తెరవండి” అనగానే “ఇది కొంచెం టఫ్‌గా ఉంది సార్, ఒక రెండు నిమిషాలు పడుతుంది“ అన్నాడు రిక్వెస్టింగ్‌గా.

సుబ్బారావు కాస్త గర్వంగా, “ఆ పరవాలేదు తెరువు చూద్దాం” అన్నాడు

“సరే” అని అతను ఆ స్టీల్ రాడ్ పెట్టి అటు ఇటు తిప్పుతూ ట్రై చేస్తున్నాడు. రెండు నిమిషాలు శబ్దాలు వస్తేనే ఉన్నాయి. తర్వాత శబ్దం రావడం ఆగిపోయింది.

సుబ్బారావు నవ్వుకుంటూ “తీయలేకపోతున్నాడు, చెప్పానా! ఇది స్ట్రాంగ్ లాక్” అన్నాడు మరింత గర్వంగా.

తర్వాత బయటి నుంచి ఎవరూ రిప్లై ఇవ్వలేదు. “ఏవయ్యా తీయగలుగుతావా, తీయలేవా, నన్ను బయటికి వచ్చేయమంటావా.” అన్నాడు.

అయినా సరే ఎవరూ కియ్, కై మనలేదు. దాంతో తలుపు తీసి బయటకు వద్దామని తాళం తీసే ప్రయత్నం చేసాడు. కానీ బయట నుంచి లాక్ చేసి ఉండడంతో తలుపు తీయలేకపోయాడు ఎందుకో సందేహం వచ్చి

“ఎవరక్కడ, ఏం జరుగుతుంది?” ఆశ్చర్యంగా అడిగాడు, కానీ ఎవరూ మాట్లాడలేదు.

అలా ఓ పదినిమిషాలు గడిచిన తర్వాత, గుడికెళ్ళిన వాళ్ళ ఆవిడొచ్చి, తలుపు తీసి, ‘‘అలా ఎలా లాక్ అయిందండీ విచిత్రంగా’’ అని లోనికి వెళ్లిపోయింది .

తర్వాత మొత్తం హాలు వెతికితే, అతని యాపిల్ సిక్స్‌టీన్ సెల్ ఫోన్‌తో పాటు, పదివేలున్న అతని పర్సు కూడా పోయింది. దాంతో సుబ్బారావు, ‘ఈ డెమో దొంగతనం కోసమా’, అని నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. వాళ్ళావిడకి తెలిస్తే ఏం అంటుందో అనే భయంతో తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయి, అలాంటి ఫోన్ కొనడానికి బయలుదేరాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here