ఆకాశవాణి పరిమళాలు-23

0
4

[box type=’note’ fontsize=’16’] అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ముచ్చటగా మూడు దశాబ్దాలు (1967-1997):

[dropcap]1[/dropcap]997 నాటికి ఉద్యోగిగా నేను మూడు దశాబ్దాల జీవనగమనం సాగించాను. కథ ఎలా ప్రారంభమైదంటే 1967 జూన్ నాటికి యస్.వి.యూనివర్సిటీ, తిరుపతి నుండి ఎం.ఎ. తెలుగు గోల్డ్‌మెడల్ సాధించాను. అప్పుడు నా వయస్సు 20+. నేను 1947 జనవరి 29న రథసప్తమి పర్వదినాన నెల్లూరు కన్యకల ఆసుపత్రిలో జన్మించాను. అవధానాలలో సరదా చెప్పాను – “నేను పుట్టానని ఏడు నెలలకే బ్రిటీషువాడు పారిపోయాడు” అని. రిజిస్టరులో నా వయస్సు 1945 ఫిబ్రవరి 9. దాని ప్రకారమే 2005 ఫిబ్రవరి 28న ఢిల్లీలో దూరదర్శన్ అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా రిటైరయ్యాను.

తొట్టతొలి ఉద్యోగం:

కాకతాళీయంగా మా నాన్నగారు లక్ష్మీకాంతరావుగారు మా ఎం.ఎల్.ఏ. బెజవాడ పాపిరెడ్డిని బుచ్చిరెడ్డిపాళెంలో ఓ వివాహంలో కలిశారు. “మా అబ్బాయి ఎం.ఏ. తెలుగు ప్యాసయ్యాడు రెడ్డిగారూ!” అని ఆనందంగా చెప్పారు. ఆయన పేరు, అడ్రస్ వ్రాసివ్వమని తీసుకున్నారు. అదే రోజు అల్లూరులో మరో పెళ్ళిలో పాపిరెడ్డి అప్పటి జిల్లా పరిషత్ ఛైర్మన్ నల్లపురెడ్ది చంద్రశేఖరరెడ్డిని కలిసి ఈ చీటీ ఇచ్చారు. వారం రోజుల్లో మా ఇంటికి ఆర్డర్లు వచ్చాయి.

నాయుడు పేట సమీపంలోని అరవపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో తెలుగు పండిట్ గ్రేడ్-2గా వేశారు. అంత చిన్న ఉద్యోగంలో చేరడం నాకిష్టం లేదు. “పాపిరెడ్డి ఏమైనా అనుకొంటారు. వెళ్ళ”మని మా నాన్న బస్సు ఎక్కించారు. ఆ స్కూలు రెండు గ్రామాల మధ్యలో వుంది. 1967 జూలై 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆ స్కులు చేరాను. హెడ్మాస్టరు నా చేత రిజిస్టరులో సంతకం చేయించుకుని ఆ రోజే 12.10 నిముషాలకి ఫోర్త్ ఫారం క్లాసు తీసుకోమని పురమాయించారు.

క్లాసులో ఓ కుర్రవాడి వద్ద టెక్స్ట్ బుక్ తీసుకొన్నాను. రెండో పాఠం కరుణశ్రీ పద్యాలు రాగయుక్తంగా చదివి భోజన విరామానికి బయటకొచ్చాను. హెడ్మాస్టరు నన్ను ప్రోత్సహిస్తూ – “మీరు మీ ఊరికి వెళ్ళి – కుంపటి, వంటపాత్రలు, బియ్యం తీసుకుని రండి. ఇద్దరం కలిసి ఒకేరూంలో వండుకుని తిందాం” అన్నారు. అప్పుడు నా జీతం నెలకు 150/- రూపాయలు. అక్కడ పనిచేయడం ఇష్టం లేని నేను ఆ సాయంకాలం నాయుడుపేట రైల్వే స్టేషన్ చేరాను. ప్యాసింజరు సిద్ధంగా వుంది. టికెట్ కొని కరవదిలో మా బాబాయి వద్దకెళ్ళాను.

రెండో ఉద్యోగం:

ఒక్కరోజు ఉద్యోగ ఉదంతం తర్వాత నేను కొద్ది రోజులకు హైదరాబాదు చేరాను. అక్కడ శాంతినగర్‌లో నివాసముంటున్న పాపిరెడ్డిని కలిశాను. “రేపు ఉదయం మిమ్మల్ని యం.వి. రాజగోపాల్, పాఠశాలల డైరక్టరు వద్దకు తీసుకువెళ్తాను” అని చెప్పి తీసుకువెళ్ళారు. ఖాళీలు వచ్చినప్పుడు చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

అదే ఆఫీసులో చాలామంది గుమిగూడి ఏవో స్లైక్లోస్టెయిల్డ్ ఫారం పూర్తి చేసి ఒకడబ్బాలో వేస్తున్నారు. నేనూ నా వివరాలు పూర్తి చేసి ఆ డబ్బాలో వేసి వచ్చాను. ఎదురుగా అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఇదే తంతు. నేనూ ఓ ఫారం భర్తీ చేసి వచ్చాను. వారం రోజుల్లో మా యింటికి ఆర్డర్లు వచ్చాయి. ఏ.జి. ఆఫీసులో యు.డి.సి. ఉద్యోగం. బేసిక్ రూ.150/-. నేను చేరలేదు.

ఇంతలో పాపిరెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ చంద్రశేఖరరెడ్దిని ఎక్కడో కలిసి, “మా స్వామిని అడవిలో వేశావటనే?” అన్నారట. ఆయన మర్నాడే మరో ఆర్డరు పంపారు. ఈ దఫా గ్రేడ్-1 తెలుగు పండిట్‍గా నెల్లూరు – కడప జిల్లాల బోర్డర్ మర్రిపాడు హైస్కూల్‌కు వేశారు.

కొత్త పెళ్ళి కూతురుని సాగనంపినట్టు మా నాన్నగారు నాతో కూడా ఆ ఊరు వచ్చి హెడ్మాస్టర్ సత్యనారాయణకు అప్పగింతలు పెట్టి వెళ్ళారు. అలా అక్టోబరు 23న 1967లో మర్రిపాడులో చేరాను. ఒక రూం తీసుకుని స్వయంపాకం చేసుకొని స్కూల్‍కి వెళ్ళేవాడిని. రమణారెడ్డి అనే సోషల్ అసిస్టెంట్ మంచి మిత్రుడయ్యారు. మా హెడ్మాస్టర్ విచిత్రమైన మనిషి. సాయంకాలం అయిదు గంటలకు స్కూలు గేటు బయటకొచ్చి నిలబడి ఆ తర్వాత ప్యూన్‌ని లాంగ్ బెల్ కొట్టమనేవాడు. అందరికంటే ముందుగా తానే స్కూలు వదిలివెళ్ళాలని నియమం.

డిసెంబరు 15 మధ్యాహ్న సమయంలో మా నాన్న హడావిడిగా మా స్కూలు కొచ్చారు. హైదరాబాదులో కాలేజీ డైరక్టరు నన్ను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో ట్యూటర్‌గా నియమిస్తున్న ఆర్డర్ తెచ్చారు. డిసెంబరు 16లోగా చేరాలని షరతు. ఆ రోజు నేను హైదరాబాదులో డబ్బాలో వేసిన పారం ఫలితమిది. మా బ్యాచ్‍లో 13 మందికి 13 కాలేజీలో వేశారు ఒకేరోజు. నేను ఆ సాయంకాలమే టీచర్ పోస్టుకు రాజీనామా లేఖ సమర్పించి, రాత్రికి రాత్రిక్ నెల్లూరు చేరుకున్నాను మా నాన్నతో. తెల్లవారితే 16. ఆ రోజు మా తాతగారి తిథి. అందుకని మా నాన్న నాతో రాలేదు. నేను పొదిలి ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఉదయం 8 గంటలకు కందుకూరు చేరాను.

ముచ్చటగా మూడో ఉద్యోగం:

1967 డిసెంబరు 16న నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖలో ట్యూటర్‌గా చేరాను. ఉద్యోగ జీతం బేసిక్ రూ.250/-, డిఎ రూ.105/- వెరసి రూ.355/-. ఒక రూమ్ తీసుకొని బ్రహ్మచారిగా కొనసాగాను. తెలుగు శాఖ అధిపతిగా జంధ్యాల లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేస్తున్నారు. వారు అనారోగ్యంతో ఉండడంటో వారి క్లాసులు నాకు అప్పగించారు.

కందుకూరు కళాశాల ఉద్యోగం ఎన్నో జ్ఞాపకాల దొంతరలను మిగిల్చింది. అధ్యాపకుడిగా పేరు తెచ్చుకొన్నాను. అవధానాలు ప్రారంభించాను. వివాహం చేసుకొన్నాను. 1969లో శోభాదేవితో మే 8న బిట్రగుంటలో వివాహం. 1971, 1973, 1975లలో వరుసగా ముగ్గురు పిల్లలు.

రచయితల సంఘం అధ్యక్షుడనయ్యాను. తొలి గ్రంథంగా ‘రాష్ట్రపతి వి.వి.గిరి’ – 1970లో ప్రచురించాను. మరుసటి సంవత్సరం ‘మారని నాణెం’ అనే తొలి నవలను ప్రచురించాను. అష్టావధానాలు ఆంధ్రదేశమంతా చేశాను.

కందుకూరి రుద్రకవి రచనలపై పరిశోధనకు 1973లో యస్.వి.యూనివర్సిటీలో డా. జాస్తి సూర్యనారాయణ వద్ద రిజిస్టరు చేసుకున్నాను. 1976 జూన్ నాటికి థీసిస్ సమర్పించాను. నా థీసిస్‌ను ముగ్గురు ప్రసిద్ధులు పరీక్షించి ముద్రవేశారు. వారు ఆచార్య బి. రామరాజు, ఆచార్య తూమాటి దోణప్ప, ఆచార్య తిమ్మావజ్ఝల కోదండరామయ్య (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం)ల అభినందనలతో పి.హెచ్.డి పొందాను. వెంటనే గ్రంథం ముద్రించాను.

సభలు సమావేశాలు:

నాకు పి.హెచ్.డి వచ్చిన సందర్భంగా కడప జిల్లా గ్రంథాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. అప్పటి కడప జిల్లా కలెక్టరు పి.ఎల్. సంజీవరెడ్డి ముఖ్య అతిథి. పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు అధ్యక్షులు. సభలో మాట్లాడిన కేతు విశ్వనాథరెడ్డి – ఈ థీసిస్ వెంటనే ముద్రిస్తే పరిశోధనకు ఉపకరిస్తుందని అన్నారు. ఆయన, నేను కందుకూరులో కలిసి పనిచేశాం. వెంటనే జిల్లా కలెక్టరు సంజీవరెడ్డి తమ నిధుల నుంచి నాలుగువేలు ముద్రణకు ఇస్తున్నామనీ, 200 కాపీలు జిల్లా గ్రంథాలయాలకు ఉచితంగా ఇవ్వాలనీ చెప్పారు. వెంటనే మద్రాసు వెళ్ళి ఫ్రీడం ప్రెస్ ధనికొండ హనుమంతరావుని కలిశాను. నెలలోపలే ముద్రణ పూర్తి అయింది. ఏల్చూరి మురళీధరరావు ప్రూఫులు చూశారు. సర్వాంగ సుందరంగా వచ్చిన ఆ థీసిస్‌ను రాష్ట్ర గ్రంథాలయ శాఖామాత్యులు డా. సి.హెచ్. దేవానందరావు, కె. బి. నరసప్ప ఆవిష్కరించారు.

రచయిత సహకార ప్రచురణ సంఘం:

కందుకూరులో సహకారరంగంలో పితామహుల వంటి పవని శ్రీధరరావు మా రచయితల సంఘం సభలకు వారి శ్రీమతి పవని నిర్మలా ప్రబావతితో వచ్చేవారు. మేము ప్రతీ నెలా కవుల జయంతులు జరిపాము. రుద్రకవి జయంతి, ఎర్రన జయంతి, పిల్లలమర్రి పినవీరభద్రుడి జయంతి – ఇలా వివిధ సభలు జరిపాము.

రచయితల రచనలతో కథలు, కవితలు కలిపి ‘శారద నవ్వింది’ అనే సంకలనం నా సంపాదకత్వంలో తెచ్చాము. ఇలా వుండగా శ్రీధరరావు హైదరాబాదు నుండి టెలిగ్రాం ఫంపారు. సారాంశం:

“1975 మార్చి 14న రాష్ట్ర సహకార శాఖా మంత్రి బత్తిన సుబ్బారావు కందుకూరు వస్తున్నారు. మన రచయితల సంఘం పక్షాన ఒక సభ కాలేజీలో సాయంకాలం ఏర్పాటు చేయండి.”

ప్రిన్సిపాల్ బి. సుబ్రహ్మణ్యాన్ని కలిసి విషయం చెప్పగానే ఆయన అనుమతి ఇచ్చారు. ఆ సాయంకాలం బత్తిన సుబ్బారావు సభ ఘనంగా నిర్వహించాను. రచయిత సహకార సంఘం స్థాపిస్తామని అర్జీ ఇచ్చాము. అప్పటికి చిత్తూరు, కృష్ణాజిల్లా రచయితల సహకార సంఘాలున్నాయి.

నేను వ్రాసిన ‘ప్రకృతి కాంత’ గ్రంథాన్ని సుబ్బారావు గారు ఆవిష్కరించి మాట్లాడుతూ – సహకార సంఘానికి లక్ష రూపాయలు మంజూరు చేశారు. రెందు నెలల్లో నిధులు విడుదలయ్యాయి. పవని శ్రీధరరావు అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా, బి.వి.పి.హెచ్.బి. ప్రసాదరావు కార్యదర్శిగా సంస్థ ప్రారంభిచాము.

శ్రీధరరావు బ్యాంకు లోను తెచ్చి ఒక ప్రింటింగ్ ప్రెస్‍ని స్థాపించారు. ఆ సంస్థ పక్షాన మాల్యాద్రి స్థల పురాణం – సంస్కృతానువాదం 1976లో ప్రచురించాము. ఈ విధంగా కందుకూరులో దాదాపు ఎనిమిది సంవత్సరాల అధ్యాపక జీవితం గడిచింది.

ఆ కళాశాల విద్యార్థులలో ప్రసిద్ధ వ్యక్తులను పేర్కొనాలి: ఐ.వై.ఆర్. కృష్ణారావు (రాష్ట్ర ముఖ్య కార్యదర్శి), గంటా శ్రీనివాసరావు (రాష్ట్రమంత్రి), పి. హరికుమార్ (ఐజి, అ.ని.శా), బి.వీరయ్య (వైస్-ఛాన్స్‌లర్), లింగయ్య నాయుడు (మునిసిపల్ ఛైర్మన్), కోటేశ్వరరావు (మునిసిపల్ ఛైర్మన్), కంచర్ల రామయ్య (ప్రకాశం విద్యాసంస్థల అధిపతి) ఇలా ఎందరో.

ఆకాశవాణి పరిమళాలకు ఈ మూడు దశాబ్దులు బీజాలు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here