[సంచిక కోసం కథా, నవలా రచయిత్రి శ్రీమతి జి. ఎస్. లక్ష్మి గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
తూర్పు గోదావరికి – హైదరాబాద్‌కు, సాహితీ వారధి శ్రీమతి జి. ఎస్. లక్ష్మి:
[dropcap]తె[/dropcap]లుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోను తమ రచనావ్యాసంగం కొనసాగిస్తున్న రచయిత్రులు బహుకొద్దిమంది మాత్రమే వున్నారు. అందులో శ్రీమతి జి. ఎస్. లక్ష్మిగారు ఒకరు. కేవలం రచనలు చేయడమే కాదు, వాటికి అనేక బహుమతులు, అవార్డులు పొందడం రచయిత్రి లక్ష్మి గారి ప్రత్యేకత!
వీరి రచనా వ్యాసంగం ఆలస్యంగా మొదలైనా, ప్రచారానికి బహుదూరంగా ఉన్నా, వీరి రచనలే వీరికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇంకా రాసేలా ముందుకు నడిపిస్తున్నాయి.
తూర్పుగోదావరికి-హైదరాబాద్‍కు, సాహితీ వారధి అయిన రచయిత్రి శ్రీమతి జి. ఎస్. లక్ష్మి గారు తన సాహితీ ప్రయాణం గురించి ఇంకా ఏమి చెబుతారో చూద్దామా..
~
* జి ఎస్ లక్ష్మి గారికి సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. నమస్తే మేడం.
నమస్తే.
~
1: మేడం, ‘సంచిక’ అంతర్జాల మాసపత్రికతో అనుబంధం ఎప్పుడు, ఎలా ఏర్పడింది? మీ సాహితీ చరిత్రలో, ఈ పత్రిక పాత్ర ఎలాంటిది? వివరించండి.
జ: ‘సంచిక’ అంతర్జాల మాసపత్రికతో నా అనుబంధం ఆ పత్రిక ప్రారంభం నుంచీ ఉంది.
పత్రిక ప్రారంభించేటప్పుడు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు నన్ను కాలమ్ రాయమని అడిగారు. నేను అప్పటిదాకా ఏ పత్రికలోనూ కాలమ్ రాయలేదు. అందుకే రాయగలనా లేదా అని కొంచెం వెనక ముందాడాను. అప్పుడు మురళీకృష్ణ గారే నన్ను ప్రోత్సహించి, రాయగలననే ధైర్యాన్నందించి, కాస్త హాస్యం జోడించమని సలహా కూడా ఇచ్చారు. ఆ ప్రోత్సాహం తోనే దాదాపు నూట నలభై వరకూ రాసాను. అది చాలామంది ఆదరణకు నోచుకోవడమే కాకుండా అందులో నేను ప్రవేశపెట్టిన ‘వదిన’ పాత్ర పాఠకుల మనసుల్లోకి వెళ్ళిపోయింది. అదెంతగా వారి మనసుల్లోకి వెళ్ళిపోయిందంటే, నేనెక్కడైనా కనపడితే, “మీ వదిన రాలేదా!” అనడిగేంతవరకూ. ఒక పాత్ర అంతగా జనాల్లోకి వెళ్ళడానికి కారణం సంచికలో నేను రాసిన కాలమ్ వల్లనే అని నేను నమ్ముతున్నాను.
2: మీ రచనా వ్యాసంగానికి తోలి అడుగు ఎప్పుడు ఎలా పడింది?
జ: పుస్తకాలు చదవడం అన్న అలవాటు చిన్నప్పట్నించీ ఉంది.
ఇంక రాయడమంటే—
1991 లో ఆంధ్రప్రభ వారపత్రికలో నేను రాసిన ‘ఇది ఇలా సాగవలసిందేనా!’ అన్న కథ ప్రచురితమవడంతో నా రచనా వ్యాసంగానికి తొలి అడుగు పడింది. ఆ కథ తర్వాత పదేళ్ళపాటు ఏమీ రాయలేదు. 2001 లోనే మళ్ళీ రాయడం ప్రారంభించాను.
3: మీరు తెలుగు సాహిత్యాన్ని (వివిధ ప్రక్రియలు) రచనా వ్యాసంగానికి ఎన్నుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేక ఉన్నదా? వివరించండి.
జ: నేను చదవగలిగిన భాషలు తెలుగు, ఇంగ్లీషు మాత్రమే. చిన్నప్పటినుంచీ మా నాన్నగారు తెలుగు పద్యాలు చెప్పిస్తుండడం వల్ల, మంచి మంచి పుస్తకాలు మాచేత చదివిస్తుండడం వల్ల రాయడానికి భాష మీద కాస్త పట్టు తెలుగులోనే ఉంది. అందులోనూ తెలుగులో రాస్తుంటే నాలోని భావాలు పూర్తిగా వ్యక్తపరుస్తున్నానన్న ఆనందం నాకు కలుగుతుంది. అందుకే కథైనా, కవిత అయినా నేను రాయడానికి తెలుగుభాషనే ఎంచుకున్నాను.
4: మీ మొదటి రచన ఏ పత్రికలో వచ్చింది? అప్పటి మీ స్పందన సవివరంగా తెలియజేయండి.
జ: నా మొదటి రచన..
చిన్నప్పుడు నేను చూసిన ఒక సంఘటన నా మనసుని బాగా కలచివేసింది. ఆ రోజుల్లో మాకు తెలిసిన ఒకావిడ కూతురు పెళ్ళయి ముంబయిలో కాపరముండేది. మెదడు సరిగ్గా ఎదగని ఆ కూతురి కూతురిని ఇరవైనాలుగ్గంటలూ కనిపెట్టి చూసుకుందుకు ఒక పనిపిల్ల కావల్సొచ్చింది. అప్పుడు ఆంధ్రానుంచి తనకి తెలిసున్న ఇక్కడి ఒక అమ్మానాన్నలకి నెలజీతం ఇస్తాననీ, అక్కడ పిల్ల మూడుపూటలా తిండికి లోటు లేకుండా ఉంటుందనీ చెప్పి వాళ్ల పదేళ్ళ పిల్లని కూతురితో ముంబయి పంపించింది. అలా పంపిన పిల్లని ఏడాది దాటినా ఒక్కసారి కూడా అమ్మానాన్నల దగ్గరికి తీసుకురాలేదు. రెండేళ్ళు గడుస్తుంటే, బాగా పెద్దవాళ్ళ చేత అలా పంపిన తల్లితండ్రుల మీద ఒత్తిడి తెస్తే, అప్పుడు ఆ పిల్లని ఆంధ్రా తీసుకొచ్చేరు. ఆ పన్నెండేళ్ళ పిల్లని చూడగానే అందరం ఆశ్చర్యపోయాం.
ఆ పిల్ల చిక్కిశల్యమయి, ఎముకలగూడులా ఉంది. అంతే కాకుండా మతి లేని ఇంకో పిల్లతో, ఎప్పుడు మీద పడి ఏం చేస్తుందోననే భయంతో ఇరవైనాలుగ్గంటలూ ఒకే గదిలో బంధించేసినట్టుండడం వల్ల సరిగా నిద్రలేక కళ్ళు పొడారిపోయి ఉన్నాయి. జుట్టుకి పేలు పడతాయేమోనని కూతురితోపాటు, ఈ పిల్లకి కూడా అస్తమానం గుండు చేయించేసేవారుట అక్కడివారు. అలా వచ్చిన పిల్లని చూసి వాళ్ల అమ్మానాన్నలకే కాదు, చుట్టూ ఉన్న మాకు కూడా మనసు చెరువైపోయింది. అప్పటి ఆ పిల్ల రూపం నన్ను చాలాసార్లు వెంటాడింది.
ఆ సంఘటన తీసుకుని, 1991లో ‘ఇది ఇలా సాగవలసిందేనా!’ అనే కథ రాసి ఆంధ్రప్రభ వారపత్రికకు పంపించాను. అప్పుడు దానికి శ్రీ వాకాటి పాండురంగారావుగారు సంపాదకులుగా ఉండేవారు. ఆ కథను వారు ప్రచురించడమే కాకుండా ‘మనసుని కదిలించే కరుణామయమైన కథ’ అని దానిని ప్రశంసించడం నాకు బంగారుపతకం వచ్చినంత ఆనందమనిపించింది.
ఆ తర్వాత మళ్ళీ 2001 లో రాయడం మొదలుపెట్టి, ఇప్పటివరకూ కొనసాగిస్తున్నాను.
ఆ సమయంలో ‘రచన’ (ఇంటింటి పత్రిక) లో వసుంధరగారు సాహితీవైద్యం అని కొత్త రచయితల కోసం ఒక శీర్షిక నిర్వహించేవారు. రెండోసారి మొదలుపెట్టినప్పుడు కథ రాసి, సాహితీవైద్యం కోసం వారికి పంపించాను. అప్పుడు వారు అన్ని పేజీలు వద్దనీ, కొన్ని పేజీలకే కథను కుదించమనీ, ముఖ్యమైన పాత్రలపైనే ఫోకస్ చెయ్యమనీ చెప్పారు. అలా వారు చెప్పినట్టు కథను రాసి పంపితే, దానికి ‘రచన’ పత్రికలో ‘కథాపీఠం’ పురస్కారం వచ్చింది.
ఆ ప్రోత్సాహంతో రాసిన కథలకు వరసగా అన్ని పత్రికలలోనూ బహుమతులు రావడమూ, ప్రచురించబడడము జరిగింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా నా భావాలను పాఠకులతో పంచుకుంటూనే ఉన్నాను.
5: మీరు తెలుగులో రచనా వ్యాసంగం చేపట్టేనాటికి, తెలుగు రచయిత్రుల పరిస్థితి ఎలా వుండేది? (పత్రికల ప్రోత్సాహం)
జ: నేను మళ్ళీ ఆపకుండా నా రచనా వ్యాసంగాన్ని ప్రారంభించింది 2001 నుండి. అప్పటికి చాలా వార, పక్ష, మాసపత్రికలు మార్లెట్లో ఉండేవి. పాఠకులు కూడా ఇష్టంగా కొని చదువుకునేవారు. ఆ ఆదరణని బట్టే కథకు, కవిత్వానికీ, నవలకు, కాలమ్‌కు, వ్యాసాలకూ మొదలైనవాటన్నింటికీ పాఠకులు ఉండేవారు. కానీ, అప్పటికే పేపర్ ఖరీదు, ప్రింటింగ్ ఖరీదు ఎక్కువ అవడంతో, పత్రికలలో పెద్ద కథలు వేసుకునే సాంప్రదాయం తగ్గి, చిన్న కథలూ, ఒక పేజీ కథలూ లాంటివే వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్నించీ చిన్న కథలు రావడం, ఆ చిన్న కథలోనే కొసమెరుపుతో రచయిత(త్రు)లు రాయడం ఎక్కువయింది.
6: మీరు సాహిత్యరంగంలో అడుగుపెట్టేనాటికి ఏ సాహిత్య ప్రక్రియకు (ఉదా: నవల/కథ) పాఠకులు అధిక సంఖ్యలో ఉండేవారు?ఎందుచేత?
జ: నవలనూ, కథనూ కూడా ప్రేక్షకులు సమానంగా ఆదరించారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వార, పక్ష, మాస పత్రికలో నయినా కూడా సీరియల్సూ, కథలూ సమానంగా ఉండేవి.
7: ఒకప్పుడు ఆదివారం ప్రత్యేక అనుబంధంతో పాటు, వార, పక్ష, మాస పత్రికలు ఎన్నో అందుబాటులో ఉండేవి. వాటిలో సీరియల్స్‌కు, పాఠకుల్లో క్రేజ్ బాగావుండేది. ఇప్పుడు సీరియల్స్ కోసం ఎదురుచూసే పాఠకులు వున్నారంటారా? వివరించండి.
జ: ఒకసారి పుస్తకం చదవడం అలవాటయినవాళ్ళు సీరియల్ అయినా కథ అయినా కూడా ఇష్టంగానే చదువుతారు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఇష్టంగా చదివే పాఠకులు ఉన్నారు. కాలాన్ని బట్టి కథలోనూ, సీరియళ్ళలోనూ విషయం మారుతుంది తప్పితే, రచనకి చదివించే గుణం ఉంటే అన్నీ చదువుతారు.
8: కరోనాకు ముందు, కరోనాకు తర్వాత తెలుగు రచయితల పరిస్థితి ఎలావుందీ? మీ అనుభవంతో కూడిన వివరణ ఇవ్వండి.
జ: కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే అన్నివిధాలుగానూ అతలాకుతలం చేసేసింది. మనిషికి మనిషే ఎదురుపడడానికి భయపడిన ఆ సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితమవడంతో, అన్నింటితో పాటూ పత్రికల పరిస్థితి కూడా మారిపోయింది. చాలా ప్రింటు పత్రికలని మూసివేసారు. అప్పుడే ఆన్‌లైన్‌లో పత్రికలూ, పుస్తకాలూ చదవడం ఎక్కువయింది.
తెలుగు టైపింగ్ వచ్చినవారికీ, ఆన్‌లైన్‌లో కథలు పంపుకోవడం తెలిసిన రచయిత(త్రు)లూ మాత్రమే వారి కథలను పత్రికలకు పంపుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అంతా సర్దుకున్నాక కొన్ని ప్రింటు పత్రికలు మళ్ళీ రావడం మొదలుపెట్టాయి.
కానీ ప్రింట్ ఖరీదు, పేపర్ ఖరీదు విపరీతంగా పెరగడం వలన ఇదివరకున్నన్ని పత్రికలు ఇప్పుడు రావడం లేదనే చెప్పాలి.
ఈ విషయంలో నా అనుభవం అంటే, నాకు తెలుగు టైపింగ్ వచ్చి ఉండడం వలనా, అంతకు ముందునుంచీ కూడా ఆన్‌లైన్ పత్రికలలో నా రచనలు వచ్చి ఉండడం వలనా కరోనా నా రచనా వ్యాసంగంపై ఎటువంటి ప్రభావం చూపించలేదనే చెప్పాలి.
9: విశ్వవిద్యాలయాల్లో తెలుగు విభాగాలు విద్యార్థులు కరువై, సంవత్సర సంవత్సరానికి వెలవెల పోతున్నట్టు సాహితీ పెద్దలే తలలు పట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తెలుగు భాష పరిస్థితి ఎలావుంటుందని మీరు భావిస్తున్నారు?
జ: ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత తీసుకుని, శ్రధ్ధ చూపించాలి. ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్ని తెలుగు సంస్థలుండి తెలుగు పండితులను, కవులను, రచయితలను పురస్కారాలిచ్చి, ప్రోత్సహిస్తున్నా, ప్రభుత్వం ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంటేనే మళ్ళీ విశ్వవిద్యాలయాలు తెలుగు శోభతో కళకళ లాడతాయని నేను అనుకుంటున్నాను.
10: ఈ మధ్య కొన్ని సాహితీ సంస్థలు, కథ/కవిత/వ్యాసం/నవల, ప్రక్రియలలో పోటీలు పెడుతున్నాయి. ఇలా రచయిత్రులను/రచయితలను ప్రోత్సహించడం అభినందనీయమే! కానీ ఆశ్చర్యంగా ప్రతి సంస్థ బహుమతుల లిస్టులో అవే పేర్లు కనపడుతుంటాయి (ఒకటి రెండు పేర్లు తప్ప). ఈ పరిస్థితికి మీరెలా స్పందిస్తారు?
జ: దీనికి జవాబు నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఇప్పటివరకూ ఏ పోటీలూ పెట్టలేదు కనక నాకు వాటి గురించి తెలీదు. నాకు తెలిసున్నది ఒక్కటే. నా రచన పోటీకి పంపించడం వరకే నా పని. తర్వాత అంతా నిర్వాహకుల పని.
11: మీరు నవల, కథ, నాటకం/నాటిక, ప్రక్రియల్లో రచనలు చేశారు. వీటిల్లో మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది? ఎందుచేత?
జ: నాకు ఇష్టమైన ప్రక్రియ కథ రాయడం. నవల, నాటకం కూడా రాసినా కూడా కథ రాయడానికే నేను ఎక్కువ కష్టపడతాను. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, ఫోకస్ పోకుండా, ఎత్తుగడ, కథనం, ముగింపు బాగుండేలా, శిల్పం, శైలి చెడకుండా కథ రాయడమంటే మాటలు కాదు. ఒక్కొక్క కథ రాసి, ఒకటికి పదిసార్లు చూసుకుని, మార్పులు చేసుకుంటూ, అనవసరమైనవి తీసేస్తూ, ఒక శిల్పంలా కథను మలచడానికి కృషి చేస్తాను.
12: ఇప్పటివరకూ మీ ఖాతాలో వెలువడ్డ రచనల గురించి విపులంగా వివరించండి.
జ: నా రచనలు పత్రికలలో రావడమే కాకుండా ఆకాశవాణిలో కూడా ప్రసారం చేయబడ్డాయి. గత ముఫ్ఫైయేళ్ళుగా ఆకాశవాణిలో నా ప్రసంగాలు, కథలు, కవితలు, నాటికలు ప్రసారమయ్యాయి.
అంతే కాకుండా ‘లలితా మహిళామండలి’ అనే మహిళాసంస్థను స్థాపించి గత ముఫ్ఫైయేళ్ళుగా ఆకాశవాణిలో ఆ సంస్థ తరఫున కదంబ కార్యక్రమాలు చేస్తున్నాను.
ఇంక పత్రికలలో అయితే ఇప్పటివరకూ నూట యాభైకి పైగా కథలు, ఒక నవల, రెండు మినీ నవలలూ, ఒక కాలమ్ ప్రచురించబడ్డాయి.
ప్రమదాక్షరి, కథావాహిని, కథావేదిక, కథాకళ, నవ్వుల నజరానా, వంశీవారి కొత్తకథలు వంటి చాలా కథాసంకలనాలలో నా కథలు వచ్చాయి.
ఏ రచన కయినా నేను నా చుట్టూ జరిగే సంఘటనలనే తీసుకుని రచనగా మలుస్తాను. చదివే పాఠకులు ఏ పదాన్నీ అర్థం కాలేదని తప్పించెయ్యకుండా ఉండడానికి భాష కూడా సరళంగానే రాయడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసిన మధ్యతరగతి సమస్యలనే ఎక్కువగా తీసుకుంటాను. ఏ రచనలోనూ కూడా స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా చెప్పను. సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్న దానిని నమ్ముతాను.
మొట్టమొదటగా ‘రచన’ పత్రికలో కథాపీఠం అందుకున్న ‘దాంపత్యం’ కథ అలాంటిదే.
తర్వాత అదే ‘రచన’ పత్రికలో బహుమతి పొందిన ‘చందమామ రావె’ అన్న కథ, కార్పొరేట్ ఉద్యోగాలతో పిల్లలను ఆయాలకు వదిలేసిన పిల్లలకు తల్లి ఎంత అవసరమో చెపుతుంది.
2-6-2001, ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన “ఒఖ్ఖ రెండురూపాయిలు” కథ, వృధ్ధులయిన తల్లితండ్రుల చేతిలో కనీస ఖర్చులకి ఒకటి రెండు రూపాయలైనా ఉండాలన్న పచ్చి నిజాన్ని సూటిగా చెపుతుంది. రెండు పేజీలు కూడా లేని ఈ కథ చదవడానికి అయిదు నిమిషాలు పట్టినా, చదివాక చాలాసేపు మన మనసు మూగపోతుంది. వాట్సప్‌లో ఎన్నోసార్లు చక్కర్లు కొట్టిన ఈ కథ కన్నడంలోకి అనువదించబడి 11-4-2002 ‘సుధా’ పత్రిక లోనూ, ఇంగ్లీషులోకి అనువదించబడి ‘త్రివేణి’ పత్రిక జనవరి, మార్చి2011 లోనూ ప్రచురించబడింది.
అలాగే జాగృతి దీపావళి పత్రికలో శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక కథలపోటీలో ప్రథమ బహుమతి అందుకున్న ‘నాణానికి మరోవైపు’ కథ. సాధారణంగా చాలామంది రచయితలు వృధ్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులని పట్టించుకోని పిల్లల కథలే రాసే సమయంలో తల్లితండ్రులని తమతో సరిగ్గా చూసుకునే పిల్లలు కూడా ఉన్నారనే సంగతి ఈ కథలో చెప్పడమే కాకుండా అందులో నాణానికి మరోవైపు చూపించినట్లు, అలా చూస్తున్న కొడుకు కాపురం పట్ల ఆ తల్లితండ్రుల సహకారం కూడా చూపించాను.
ఆటా 13వ కన్వెషన్ సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో ప్రత్యేక బహుమతి నందుకున్న ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా’ అన్న కథ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సాధారణంగా తల్లి గొప్పతనం గురించి చెపుతూ ‘తొమ్మిది నెలలూ కష్టపడి మోసి, మరణపు టంచుల దాకా వెళ్ళే పురిటి నొప్పులు భరించింది’ అంటూ చెపుతారు. కానీ నేను ఒకచోట చదివాను. వంశం నిలబెట్టడానికి విత్తనం ఎంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యం. అసలు ఒక జీవుడు జన్మించడానికి ముందు అతని ముందు జన్మలో కల సంస్కారాలని బట్టి క్షేత్రాన్ని ఎన్నుకుంటాడుట. అందుకే ‘ఏ తల్లి కన్నదో ఈ బిడ్డను’ అంటారు. అలా పుట్టకముందునుంచీ కూడా తల్లి గొప్పతనాన్ని చెప్పే ఈ కథ 13వ ‘అక్షర’ ఆటా మహాసభల జ్ఞాపక సంచికలో ప్రచురించబడింది.
ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నచ్చి రాసిన కథలూ, పాఠకులు మెచ్చుకున్న కథలూ చాలానే ఉన్నాయి.
ఇలాంటి సెంటిమెంట్ కథలే కాకుండా నేను రాసిన హాస్యకథలు స్వాతిలోనూ, మిగిలిన పత్రికలలోనూ కూడా బహుమతులు గెల్చుకున్నాయి.
ముఖ్యంగా గో తెలుగు. కామ్‌లో నేను వదినగారి మీద రాసిన హాస్య కథలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఆ వదిన పాత్రనే తీసుకుని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాల మీద వదిన స్పందించే తీరును ‘సంచిక’లో కాలమ్ లో రాస్తే అవి పాఠకులకి మరింత చేరువయ్యాయి.
నా కథల్లో చాలా కథలు నా పేరుతో కొన్నీ, పేరు లేకుండా కొన్ని అంతర్జాలంలో చక్కర్లు కొట్టెయ్యడమే కాకుండా, యూ ట్యూబ్‌లో కూడా నా పేరు చెప్పకుండా, నా అనుమతి లేకుండా చదివేస్తున్నారు. నేనేమీ చేయలేక కథ నలుగురిలోకీ వెడుతోందని సంతోషిస్తున్నానంతే.
13: మీ రచనల్లో అధిక ప్రాచుర్యాన్ని పొందినది ఏది? ఎందుచేత?
జ: నేను ఊహించనంత ప్రాచుర్యాన్ని పొందిన నా కథ శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణమూర్తిగారి స్మారక కథలపోటీలో మొదటి బహుమతి గెలుచుకుని, ‘సారంగ’ అంతర్జాల పత్రికలో ప్రచురించబడిన ‘మీ అమ్మ మారిపోయిందమ్మా’ అన్న కథ.
ఇదివరకటి రోజులు కావు ఇప్పుడు. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడో పోయాయి. బాధ్యతలు తీరి, ఒకరి కొకరుగా బతికే భార్యాభర్తలు విధి వక్రించి ఒక్కరిగా మిగిలిపోతే అన్న సమస్య తీసుకుని ఈ కథ రాసాను. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనికి కనెక్ట్ అయ్యారు.
ఈ కథ పత్రికలో వచ్చీరాగానే రచయిత్రి పేరు కూడా లేకుండా వాట్సప్‌లో ప్రపంచమంతా చక్కర్లు కొట్టేసింది. నా స్నేహితులు అలా నా పేరు లేకుండా కథను షేర్ చేసినందుకు బాధపడ్డారు కానీ, నాకైతే నా పేరు లేకపోతేనేమీ, నా రచన ఇందరి హృదయాలను కదిలించింది కదా అని చాలా సంతోషించాను.
అన్నింటికన్న నేను నలుగురిలోకీ వెళ్ళినప్పుడు నన్ను ప్రత్యేకంగా పలకరించేవాళ్లందరూ కేవలం నేను సృష్టించిన ‘వదిన’ పాత్ర కోసమే ననుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. “మీ వదిన రాలేదాండీ!” అనే వారి పలకరింపు వింటే ఒక మనిషి సృష్టించిన పాత్రని నిజజీవితంలోకి అన్వయించేసుకోవడం ఎంత గొప్ప విషయమో అనిపిస్తుంది.
14: మీ పుట్టింట, మెట్టినింట, మీ రచనలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది? మీ పిల్లల్లో ఏ ఒక్కరైనా తెలుగు సాహిత్యం పట్ల మక్కువ చూపేవారున్నారా?
జ: నేను ఈ మాత్రమైనా రాయగలుగుతున్నానంటే కారణం మా తల్లితండ్రులే. మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు, మా అమ్మగారు శ్రీమతి పద్మావతిగారు. మా నాన్నగారు మాకు పుస్తకజ్ఞానం అందిస్తే, మా అమ్మగారు మాకు బతుకు విలువ తెలిపారు.
మా నాన్నగారు సంస్కృతం, ఆంగ్లం, తెలుగుభాషలలో నిష్ణాతులు. ఆయన రాసిన కథలు అప్పట్లో ‘భారతి’ పత్రికలో ప్రచురించబడేవి. ఆశువుగా పద్యాలు చెప్పేవారు. రోజూ మాకు రామాయణం, భారతం, భాగవతంలోని కథలు చెప్పేవారు. అందులో పద్యాలు పాడించి, వాటిలో ఉన్న భావ సౌందర్యాన్నీ, శబ్ద సౌందర్యాన్నీ చెప్పేవారు.
జ్యోతిష్యశాస్త్రంలో నిష్ణాతులయిన పిడపర్తివారి వంశంలో జన్మించడం వల్ల ఆ వంశానికున్న ప్రాముఖ్యత అందరికీ తెలియాలని, వారి వంశచరిత్రపై ఎంతో పరిశోధన చేసి ‘పిడపర్తివారి వంశచరిత్ర, కథలూ-గాథలూ’ అనే పుస్తకాన్ని రాసారు. నేను ఈ మాత్రమైనా రాయగలుగుతున్నానంటే పూర్తిగా మా తల్లితండ్రుల ఆశీర్వాదం వల్లనే.
మరింక మెట్టినింటి విషయాని కొస్తే మా మామగారు శ్రీ గరిమెళ్ళ వెంకట సూర్యనారాయణశాస్త్రిగారు కూడా గొప్ప సంస్కృత పండితులు. మావారు ప్రొఫెసర్ విశ్వనాథంగారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసి రిటైరయ్యారు. నాకు పెళ్ళయే సమయానికి నేను బి.ఎ. మాత్రమే చదివాను. కానీ పెళ్ళయేక మావారి ప్రోత్సాహం వల్లనే ఎం.ఏ, కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసాను.
ఇంత చదువుకున్నావు కనక ఉద్యోగం చెయ్యమని ఏనాడూ మావారు నన్ను అడగలేదు. నేను ఉద్యోగం, సంసారం రెండూ సరిగ్గా బాలన్స్ చేసుకోలేనేమోనని కేవలం పిల్లలకోసం ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. గృహిణిగానే ఉంటూ మా పిల్లల పెరుగుదలను వారితోపాటు నేనూ ఆస్వాదించేను.
మరింక మా అమ్మాయి, అబ్బాయి కూడా తెలుగు చదవగలరు. ఎంత బిజీగా ఉన్నా నా కథలన్నీ చదువుతారు. మా మనవడయితే నేను చదివిన కథల వీడియోలన్నీ ఎడిట్ చేసి పంపుతాడు.
15: మీరు అందుకున్న బిరుదులూ, సన్మానాలు, అవార్డుల గురించి వివరించండి.
జ: అందుకున్న పురస్కారాలు
- ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీవారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమకథకు పురస్కారం
- ‘అతను – ఆమె – కాలం’ కథల సంపుటికి 2017 సంవత్సరానికిగాను గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం
- భీమన్న సాహితీ నిధి ‘కళానిలయం’ ద్వారా శ్రీమతి హైమవతి భీమన్నగారు అందించిన వారి తల్లితండ్రులు శ్రీమతి కొత్తూరి వెంకటలక్ష్మి, శ్రీ కొత్తూరిసుబ్బయ్య దీక్షితులు పురస్కారం.
- తెలుగు యూనివర్సిటీవారు అందించిన ‘మాతృవందనం’ పురస్కారం
- వంశీ ఇంటర్నేషనల్ మరియు లేఖిని సంయుక్తంగా అందించిన ‘యద్దనపూడి సులోచనారాణి’ జాతీయ పురస్కారం
- అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళావేదిక అందించిన ‘వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్’ అవార్డ్
- లేఖిని సంస్థ అందించిన వల్లూరి సత్యవాణిగారి ‘మాతృదేవోభవ’ పురస్కారం
- కథా రచనా విభాగంలో ‘అమృతలత – అపురూప అవార్డ్స్ 2024’ పురస్కారం
16: ఆంధ్ర /తెలంగాణా, సంస్కృతీ సంప్రదాయాలు మీ చుట్టూ తిరుగుతుంటాయి. ఒక రచయిత్రిగా ఈ విషయంలో మీ ఆలోచనలు ఎట్లా ఉంటాయి?
జ: నేను పుట్టి, పెరిగింది ఆంధ్రాలో. కాపురాని కొచ్చింది తెలంగాణకి. రెండూ కూడా నాకు రెండు కళ్ళ లాంటివే. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం సంస్కృతీ సాంప్రదాయాలు ఉంటాయి. అన్నింటినీ మనలో కలుపుకుంటూ పోవాలనే నా ఆకాంక్ష. ఎవరు ఏ మాండలికంలో మాట్లాడినా.. మాట్లాడే భాష తెలుగే కదా!
~
* మీ సమయాన్ని వెచ్చించి మీ గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
జ: మీకూ, సంచిక యాజమాన్యం వారికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.