దంతవైద్య లహరి-23

6
3

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

దంతాలు అవసరమా?:

ప్ర: డాక్టర్ గారూ.. చాలామంది పళ్ళు/దంతాలు లేకపోయినా, అందరిలా తిని ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కదా! అసలు మనిషికి నిజంగా పళ్ళు అవసరం అంటారా?

-శ్రీమతి గంగాదేవి, మౌలాలి, సికింద్రాబాద్.

జ: నిజానికి, పళ్ళు లేదా దంతాలు అవసరమా? లేదా? అన్న విషయం, మీ నిత్య జీవన విధానంలో మీకు తెలిసే ఉండాలి. అయినా, పూర్తిగా దంతాలు గురించి అవగాహన లేకపోవడం మూలాన, ఇలాంటి సందేహాలు రావడానికి అవకాశం ఉన్నది. అందుచేత ఈ నేపథ్యంలో, మీకు దంతాలను గురించి పూర్తిగా అవగాహన కల్పించవలసిన బాధ్యత నాలాంటి వారిపై వుంది.

మానవ శరీరం అనేక అంగాలతో, అంగ విభాగాలతో, నిర్మితమై ఉంటుంది. ప్రతి అంగానికి అంగ విభాగానికి, ప్రత్యేకమైన ‘క్రియ’తో సంబంధం ఉండి, శరీర నిర్మాణం వాటి విధులపై పట్టుకలిగి, అవసరమైన పనుల పైనా, అనవసరమైన పనుల పైనా నియంత్రణ చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి.

ఆరోగ్యవంతుడైన మనిషిలోని అన్ని అంగాలు – అంగ విభాగాలు, సక్రమంగా తమ విధులను నిర్వర్తిస్తుంటాయి. వీటి విధి నిర్వహణలో ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా, శరీరం అనారోగ్యానికి గురికావడం ఖాయం! అందుచేత, శరీరంలో ప్రతి అంగం, అంగ విభాగం నిర్వర్తించే విధులు, మరో అంగం లేదా అంగవిభాగం, నిర్వర్తించే విధులతో, సంబంధాన్ని కలిగి ఉంటాయి. మెదడు, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, చెవి, ముక్కు, గొంతు, నాలుక, కాళ్ళు-చేతులు, కాలేయం, రక్తనాళాలు ఇలా అన్నీ కూడా తమకు ప్రకృతి నిర్దేశించిన విధులను సక్రమమంగా నిర్వహిస్తూ, యావత్ శరీరాన్ని ఆరోగ్యంగా వుంచగలుగుతున్నాయి

వీటిల్లో, ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా దాని ప్రభావం శరీరం మీద వుండి, ఆ శరీరం అనారోగ్యం పాలవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దంతాలు వీటన్నిటికీ అతీతం కాదన్నది గ్రహించాలి. వాటి అవసరమూ, ప్రాధాన్యతలను బట్టి, వైద్యరంగంలో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని సృష్టించడం జరిగింది. దీనినే ‘దంత వైద్య విభాగం’ అంటారు. దీనిలో దంతాలకూ శరీరంలోని ఇతర భాగాలకు గల సంబంధం కూడా సవివరంగా వివరించబడుతుంది. వ్యాధిగ్రస్థమైన దంతాల/పళ్ళ వల్ల వీటికి సంబంధించిన విషపదార్ధాలు రక్త ప్రవాహం ద్వారా ఇతర శరీరభాగాలకు వ్యాపించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకని, పళ్ళు లేకుంటేనే మంచిది అనుకోవడం సరి కాదు సుమా!

పంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పంటి ఉపయోగాలను (అవసరాలను) మూడు ముఖ్య అంశాలుగా విభజించారు. అవి నమలడం (మాస్టికేషన్), స్వచ్ఛమైన పద ఉచ్చారణ (ఫోనేషన్) & సౌందర్యం (ఈస్తటిక్స్) ఈ మూడు అంశాలను బట్టి దంతాల అవసరం ఎంతటిదో మనకు అర్థం అవుతుంది.

నమలడం (మాస్టికేషన్):

ఈ నమలడం అనే ప్రక్రియ రెండు దౌడలలో (మాగ్జిలా & మాండిబుల్) వుండే విసురుడు దంతాల (మోలార్స్) కలయిక ద్వారా జరుగుతుంది. పై దౌడ (మాగ్జిలా) కదలకుండా పుర్రెకు అతుక్కొని ఉంటుంది. క్రింది దౌడ (మాండిబుల్) మాత్రం క్రిందికి పైకి, ముందుకీ వెనక్కీ కదులుతుంటుంది. కీలు (టి. ఎం. జె) సహాయంతో, క్రింది దౌడ పుర్రెభాగంలో కదిలే శక్తిని కలిగి ఉంటుంది. ఈ కదలికలన్నీ ముఖంలో ఇరువైపులా వుండే కండరాల ఆధీనంలో ఉంటాయి. అందుచేత, ఇలా, ఆహారం నమలడానికి సహకరించే కండరాలను ‘మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్’ అంటారు. ఈ నమిలే విధానాన్ని ‘మాస్టికేషన్’ అంటారు. ఈ నమలడం అనే ప్రక్రియ మూలంగా మనం తీసుకునే ఆహారపదార్ధాలు మెత్తగా నోటిలో నమలబడి, ప్రేవుల్లో అనేక ఎంజైముల చర్యలవల్ల నమిలిన ఆహారపదార్థాలు చక్కగా జీర్ణం కాబడి శరీరానికి కావలసిన శక్తిని రక్తం రూపంలో అందిస్తాయి. అందుచేత ప్రతి మనిషికి నమలడం అనే ప్రక్రియ జీవితాంతం వరకూ అవసరమే!

పద ఉచ్చారణ (ఫోనేషన్):

మనిషి సంఘజీవి! ఒకరి అవసరం మరొకరికి తప్పక వుండి తీరుతుంది. అలాంటి సమయంలో మనసులోని మాటను వ్యక్తపరచాలంటే స్పష్టంగా మాట్లాడగలగాలి.

స్వచ్ఛమైన, స్పష్టమైన పద ఉచ్చారణతో ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యే రీతిలో చెప్పగలగాలి.

ఈ నేపథ్యంలో కొన్ని పదాలు (దంత్యములు) పళ్ళు లేకుండా స్పష్టంగా పలకలేని పరిస్థితి ఉంటుంది. దౌడలలో పళ్ళు వున్నవారు, అలాగే పళ్ళు లేనివారు, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఈ విషయాన్ని చక్కగా గ్రహించగలరు. అందుచేత స్పష్టమైన పద ఉచ్చారణకు ఆరోగ్యవంతమైన దంతాల అవసరం వెలకట్టలేనిది.

సౌందర్యం (ఈస్తటిక్స్):

ముఖ సౌందర్యానికి, అందమైన పలువరుస అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడపిల్లల విషయంలో ఇది ప్రత్యేకంగా ఆలోచించవలసిందే! అందవిహీనంగా వుండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? అందుచేత అందమైన ముఖానికి, అందమైన పలువరుస అవసరమే కదా! ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత, పళ్ళ/దంతాల అవసరం ఎంతటిదో తెలిసే ఉంటుందని నా నమ్మకం.

~

ప్ర: డాక్టర్ గారు.. ఇంట్లో వాళ్ళందరూ ఒకే బ్రష్, ఒకే నాలుక బద్ద (టంగ్ క్లినర్) వాడవచ్చునా? వివరించ గలరు.

జ: దంతవైద్యుడిగా, నా వృత్తిలో అడుగుపెట్టిన తర్వాత, ఇటువంటి సందేహాన్ని మొదటిసారిగా వింటున్నాను. అయినా మీకు సందేహం రావడంలో తప్పులేదు. తెలుసుకుంటే ఎప్పటికీ మళ్ళీ ఇలాంటి సందేహం రాదు.

ఇంట్లో ఒకరి కళ్ళజోడు మరొకరు అప్పుడప్పుడు వాడినట్టు, టూత్ బ్రష్ గాని, టంగ్ క్లీనర్ గాని వాడకూడదు. ఎవరిదీ వారికి ఉండవలసిందే. లేకుంటే, ఒకరి అనారోగ్య పరిస్థితి, వీటి ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం వుంది. భార్యాభర్తలు సైతం ఒకరి టూత్ బ్రష్ మరొకరు వాడకూడదు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక వూపు ఊపిన తరువాత ఇలాంటి పిచ్చిపనులు చేసే సాహసం ఎవరికీ ఉండడం లేదు. కరోనా.. సామాన్య మానవుడికి నేర్పిన గుణపాఠాల్లో ఎక్కువగా ఇలాంటివే వున్నాయి, గమనించగలరు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here