అభిమన్యుడు

7
3

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అనిశెట్టి శ్రీధర్ గారి ‘అభిమన్యుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]దు[/dropcap]రదృష్టానికి సారధి అంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్ సీటు ఒక్క ర్యాంకులో తప్పించేసింది. ఇప్పుడున్నట్టు వెయ్యిన్నూట పదహారు కాదు కదా అప్పట్లో కనీసం పదహారు ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఉండేవి కావు. పైగా దురదృష్టానికి ఎంత ముందు చూపంటే అప్పట్లో వరం, ఇప్పుడు శాపం అయిన బ్యాంక్ ఉద్యోగం సారధికి వచ్చేలా చేసింది.

ఈ సంస్థలో ఉద్యోగం రాకపోతే అడుక్కు తినేవాళ్ళమని రొమాంటిసైజ్ చేసుకునే కొందరిలా కాకుండా తనకి జీతం ఇస్తున్నందుకుగాను బ్యాంక్ కోసం అహర్నిశలు కష్టపడుతూ పదోన్నతులు పొందుతూ మంచి స్థాయికి చేరాడు సారధి. నీకింకా తొమ్మిదేళ్ళు సర్వీస్ ఉంది. మరో మూడు ప్రమోషన్లు కొడితే జి.ఎమ్. అయిపోవచ్చు, కనీసం డి.జి.ఎమ్. అవ్వొచ్చు. నువ్వు కొడతావు, నీకా ప్రతిభ ఉంది అని పొగిడారు.

అన్నేళ్ళూ ఓపిక పట్టిన దురదృష్టం ‘సారధి, చీఫ్ మేనేజర్’ అని రాసి ఉన్న కేబిన్ తలుపు తోసుకుని ఖద్దరు బట్టలు వేసుకున్న నరసింహారావు రూపంలో లోపలికి వచ్చింది. ఖద్దరు బట్టలవాణ్ణి చూస్తే తనకి గౌరవం అనుకుంటాడు సారధి. కానీ అది తెలియని భయం అని పాపం అతనికి తెలియదు.

“మీకు నేనేం సేవ చెయ్యగలను” అని తన సహజ సిద్ధమైన వినమ్రతతో కూడిన స్వరంతో అడిగాడు ఖద్దరుని.

“గట్టు సుధాకర్, జక్కుల సుబ్రమణ్యం అని చెరో కోటిరూపాయల లోన్లు ఉన్నాయండి. ముగ్గురు హామీదారుల్లో నేనొకడినండి. తొంభైతొమ్మిది లక్షల చొప్పున విడుదల చేసారండి. మిగిలిన లక్షా ఇప్పించేస్తే చేపలకి మేతెయ్యాలండి” అన్నాడు. ఆఫీసర్‌ని ఫైల్స్ తీసుకు రమ్మన్నాడు. నెల్లూరు జిల్లావాసులకి అక్కడ చేపల పెంపకానికి గుంటూరు జిల్లాలో తమ బ్రాంచ్ ఎందుకు రుణాలు ఇచ్చిందో అర్థం కాలేదు సారధికి.

“వాళ్ళు రాలేదేం?” అడిగాడు సారధి.

“చేపలు బెంగెట్టుకుంటై సార్” అని ఫెళ్ళున నవ్వాడు. పైగా ఈ లోన్లకి విశాఖపట్నంలో బంగారం లాంటి ఇళ్ళ స్థలాల్ని తనఖా పెట్టారు అన్నాడు. సారధి ఆఫీసర్ కేసి చూసాడు. అతను అవునన్నట్టు తలూపాడు. వ్యవసాయ రుణాలకి ఇళ్ళ స్థలాలు తనఖా అంటే ఆ ఆకర్షణే వేరు.

“ఇన్‌స్పెక్షన్ ఎప్పుడు జరిగింది?”

“పాత మేనేజరు వెళ్ళే ముందు అంటే పోయిన నెల చేసారు సార్. రిపోర్ట్స్ ఉన్నాయి”

చెరో లక్ష ఖాతాల్లో జమచేయించుకుని చక్కాపోయాడు.

***

వేరే ఊళ్ళో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న శంకర మూర్తి వచ్చాడు. సారధికి ఆప్తమిత్రుడు.

అతన్ని ముదురు మూర్తి అంటారు. మహా మేధావి, ఏదైనా తప్పు ఇట్టే పట్టేస్తాడని పేరు. మంచి మాటకారి. దొంగని దొంగ అనడానికి ఏమాత్రం మొహమాట పడనివాడు.

“హైదరాబాద్‌కి బదిలీకి దరఖాస్తు పెట్టుకున్నావంట” మూర్తి.

“అవున్రా. మా అబ్బాయికి అక్కడ ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చింది”

“హైదరాబాద్ రీజియన్ అంటే ఏ వరంగల్లో, కరీంనగరో వేస్తే ఏం చేస్తావు”

“లేదు అడిగించాను. హైదరాబాద్ సిటీ ఇస్తామని చెప్పారు”

“అక్కడ ఆర్.ఎమ్. ఎవరో తెలుసుగా. వాడక్కడ ఉన్నంతకాలం వెళ్ళకు. వాడికి మీ కులం వాళ్ళంటే పడదు”

“ఆయన మేనేజర్‌గా ఉన్నపుడు నేను పనిచేసాను. నన్ను చాలా మెచ్చుకునేవాడు”

“అప్పుడు వాడికి అవసరం. ఇప్పుడు మీ వాళ్ళనందరినీ తొక్కేస్తున్నాడు. మీ అబ్బాయి కాలేజ్ ఎక్కడ?”

“బాచుపల్లిలో”

“నీకు హయత్‌నగర్ బ్రాంచ్ పోస్టింగ్ ఇస్తాడు. మీ అబ్బాయి ఇంటినుండి కాలేజ్‌కి ఒకసారి వెళ్ళి రావడానికి ఒక సెమెస్టర్ సమయం పడుతుంది. దానికన్నా హాస్టల్లో పెట్టెయ్”

సాయంత్రం అవడంతో బయట టీ తాగడానికొచ్చారు. పక్కనే క్షణం విరామం లేకుండా బజ్జీల బండి. చాలా మంది బ్యాంక్ మేనేజర్ల లాగే సారధి బజ్జీల బండివాడిని ఈర్ష్యగా చూసాడు.

“నీకెందుకు ప్రమోషన్స్ రాలేదురా. ఆసక్తి లేదా?” మూర్తిని అడిగాడు సారధి.

“జి.ఎమ్. సుందర్రావు తెలుసుగా. వాడు నొక్కేసాడు. ఆరేళ్ళ క్రితం వాడు మేనేజర్‌గా పనిచేసిన బ్రాంచ్ నేను తనిఖీ చేసి బోలెడు అవకతవకలు బయటపెట్టాను. నేను గతంలో పని చేసిన బ్రాంచ్లన్నిటికీ వాడు ఫోన్ చేసి ఇప్పుడు పనిచేస్తున్న మేనేజర్లని ‘మూర్తి ఇచ్చిన రుణాలన్నీ సక్రమంగా ఉన్నాయా, బొక్కలేమైనా దొరుకుతాయా’ అని చూడమన్నాడట.

“నువ్వు అన్నీ జాగ్రత్తగానే చూస్తావు కదా?”

“మనం లక్ష రూపాయలు లోన్ ఇస్తే దీనికి బిల్స్ తీసుకోలేదు, వాడు షాపు పెట్టడా లేదా సరిగ్గా ఇన్‌స్పెక్షన్ చెయ్యలేదు అని వంద ప్రశ్నలు వెయ్యొచ్చు. అంటే మన జీవితమంతా మన ఖాతాదారుడు నీతి, నిజాయితీగా ఉన్నాడా లేడా అని కాపలా కాస్తుండాలన్నమాట. మనం ఆడే వైకుంఠపాళిలో అన్నీ పాముల్నే పెడతారు. నాకో పది సంజాయిషీ మెమోలు ఇప్పించి, ఎందులోనూ ఏం చెయ్యలేక మొత్తానికి ఒక దాంట్లో చార్జ్‌షీట్ చేయించాడు. నేనంటే వాడికి కోపం ఉందంటే అర్థం ఉంది. మొన్నొక ఆఫీసర్ హెడ్డాఫీస్ కారిడార్‌లో నడుస్తూ వీడిని గమనించలేదంట. ఇప్పుడా ఆఫీసర్ పుట్టుపూర్వోత్తరాలు లాగుతున్నాడని తాజావార్త”

కాస్త తీరిక దొరికి బజ్జీల బండివాడు “మేనేజరుగారూ నమస్కారం” అన్నాడు. అదొక్కటే తృప్తి.

“నీమీద హెడ్డాఫీసుకి ఒకసారి తప్పుడు ఫిర్యాదు వెళ్ళింది కదా?” మూర్తి అడిగాడు.

“అవును మూర్తి. ఎంక్వైరీ అంటూ వేసారు కాని పస లేదని వదిలేసారు”

“దొంగపేరుతో ఆ ఫిర్యాదు చేసింది నీ కింద పనిచేసే సిబ్బందే కదా? ఎందుకు చేసారు?”

“నేను పని చెయ్యమంటానని కోపం”

“అదొక్కటే కాదు. అపుడు నువ్వు గ్రేడ్ ప్రమోషన్‌కి వెళ్ళబోతున్నావు. అది చెడగొట్టడానికి”

“అవును మూర్తీ నేను గమనించనేలేదు” అన్నాడు సారధి తెల్లబోతూ.

“అందుకే నన్ను ముదురు మూర్తి అని, నిన్ను సద్గురు సారధి అని అంటారు.”

ఇద్దరూ నవ్వుకున్నారు.

బ్యాంక్ మేనేజరంటే కేబిన్‌లో ఖాళీగా కూర్చునేవాడని చాలామంది అభిప్రాయం. తీవ్రవాదులు ఎటునుండి దాడి చేస్తారో తెలియని సైనికుడిలాంటి వాడని తెలీదు.

***

ఒక్క రూపాయి కూడా కట్టకపోవడంతో చేపల చెరువుల రుణాలు రెండూ రాని బకాయిలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. బ్యాంకు రుణాలు మొండి బకాయిలుగా చూపించడాన్ని హెడ్ఆఫీసు వాళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు. చూపించకుండా ఎలా దాచాలి అనేదాని మీద డాక్టరేట్లు చేసినవాళ్ళు ఉంటారు. అలా విజయవంతంగా మూడేళ్ళు సాగదీసారు.

జక్కుల సుబ్రహ్మణ్యం, గట్టు సుధాకర్ల ఫోన్లు పనిచెయ్యడం లేదు. అదృష్టం కొద్దీ ఖద్దరు నరసింహారావు నంబరు తగిలింది.

“కిస్తీలు కట్టట్లేదాండి. అప్పు ఇప్పించమని చంపుకు తింటారండి. కట్టమంటే కష్టాలు ఏకరువు పెడతారు. నేను పంపుతాలెండి” అని వడ్డీ డబ్బులు నాలుగు లక్షలు పంపాడు. తర్వాత అతనూ మాయం. మొండి బకాయిలుగా చూపించక తప్పలేదు.

నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెలో జక్కుల సుబ్రహ్మణ్యం ఆచూకీ పట్టుకున్నాడు సారధి.

“బ్యాంకికొచ్చానండి. సంతకాలు అవీ పెట్టించుకున్నారండి. తర్వాత లోను సాంక్షన్ కాలేదంటే కామోసని ఊరుకున్నానండి. మరి ఈ నోటీసులేంటో అర్థం కాలేదండి. అడిగితే మేం కట్టేస్తాంలే అన్నారండి”

సారధికి అర్థమైంది.

రుణం ఇప్పిస్తామని దరఖాస్తు మీద, మరికొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టాలని బ్యాంకుకి తీసుకొచ్చి ఒక్క దరఖాస్తేం ఖర్మ లోన్ డాక్యుమెంట్స్ పైనా, సేవింగ్స్ ఖాతా తెరవడానికి, చెక్ బుక్ కోసం, ఖాళీ చెక్కుల మీద, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించేసి రుణం మొత్తం హామీదారులుగా ఉన్న ఖద్దరు నరసింహారావు అండ్ కో స్వాహా చేసేసారు.

“మీరు డబ్బులేమీ కట్టకుండానే మీ పేరున విశాఖపట్నంలో స్థలం రిజిస్టర్ చేస్తామంటే ఎలా నమ్మారు?”

“నాకంతగా తెలీదండి. ఆళ్ళే రిజిస్ట్రీ చేయించారండి. దాని మీద లోను వస్తదని చెప్పారండి”

మరో ఊళ్ళో గట్టు సుధాకర్ గురించి అన్వేషణ. తన దగ్గర ఉన్న ఫోటో, ఓటర్ ఐడి కాపీ చూపించాడు.

“గట్టు సుధాకర్ ఇలా ఉండడండి”

“లేదండీ ఇతనే” అన్నాడు సారధి.

“నాకు తెలిసిన గట్టు సుధాకర్ వేరే అండి. తను బ్యాంకులో లోను తీసుకోకపోయినా నోటీసులు వస్తున్నాయని లబోదిబో అంటున్నాడండి”

సారధి వెంటనే గుంటూరులో ఉన్న ఆడిటర్ గారికి బ్యాంక్ రికార్డుల్లో ఉన్న గట్టు సుధాకర్ పాన్ కార్డ్ ప్రతి స్కాన్ చేసి వాట్సప్‌లో పంపాడు. పేరు, పుట్టినతేదీ, పాన్ (నంబర్) అన్నీ సరిపోతున్నాయని చెప్పారు.

ఫోటో సరిపోతుందా అనడిగాడు సారధి ఆతృతగా. ఆదాయపు పన్ను శాఖ సైట్‌లో పాన్ కార్డ్ వివరాల్లో ఫోటో కనపడదట.

సారధి మరోసారి నిర్ఘాంతపోయాడు.

అసలు గట్టు సుధాకర్ దగ్గరికి వెళ్ళారు. అతనికీ రుణం ఇప్పిస్తామని అతని దగ్గర ఆధారాలు అన్నీ తీసుకున్నారట. అయితే జక్కుల సుబ్రహ్మణ్యంలా అన్ని సంతకాలు పెట్టేంత అమాయకుడు కాకపోవడంతో అతన్ని బ్యాంక్‌కి తీసుకెళ్ళకుండా వేరే వ్యక్తి ఫోటో అతని పాన్ కార్డ్ మీద, ఓటరు ఐడి మీద సూపర్ఇంపోజ్ చేసి ఆ నకిలీ వ్యక్తిని బ్యాంకులో గట్టు సుధాకర్‌గా చెలామణీ చేయించి రుణం నొక్కేసారు. బ్యాంక్ నోటీసులు అసలు సుధాకర్‌కి వెళ్ళాయి.

అంటే ఎవరి పాన్ వివరాలతో అయినా ఫోటో మార్చేసి మరో వ్యక్తి అసలు వ్యక్తిగా చెలామణీ అయిపోవచ్చన్నమాట. బ్యాంకర్‌కి ఎలాంటి రక్షణ ఉండదు! రుణగ్రహీత ఇంటికి వెళ్ళి వెరిఫై చెయ్యకపోవడమే పాత మేనేజర్ చేసిన ఘోర తప్పిదమని అర్థమయ్యింది సారధికి.

తను డబ్బులు తీసుకోలేదన్న సుబ్రహ్మణ్యం వాదన కోర్టులో నిలవదు. అయినా అతను రూపాయికి ఠిఖాణా ఉన్నవాడిలా అనిపించలేదు. తన పేరుతో నకిలీ వ్యక్తికి రుణం ఇచ్చారని గట్టు సుధాకరే బ్యాంక్ మీద కేసు వేసే అవకాశం ఉంది. ఇంక రుణ వసూలుకి మిగిలిన ఆధారం బ్యాంక్‌కి తనఖా పెట్టిన విశాఖపట్నం స్థలాలు.

తదుపరి ప్రయాణం విశాఖపట్నం.

బ్యాంక్ రికార్డుల్లో ఉన్న ఫోటోల ప్రకారం ఒక స్కూల్ దగ్గర్లో ఉన్న ఆ స్థలాలని తేలికగానే గుర్తించారు. బాగా అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం చూడగానే బ్యాంకు బాకీ తీరడానికి ఈ స్థలాలు అమ్మితే సరిపోతాయని సారధి మనసు కుదుటపడింది.

సర్ఫాసి చట్టం ప్రకారం ఆ స్థలాల్లో బ్యాంకు స్వాధీనత చేసుకున్నట్టు బోర్డులు పాతి ఫోటోలు దిగాడు సారధి. ఏంటి సార్ అని అడిగాడు దారినపోయే దానయ్య. సారధి వివరించాడు.

“అది ప్రభుత్వ స్థలం కద సార్. నీళ్ళ ట్యాంక్ కోసం వదిలిపెట్టారు” అన్నాడు దానయ్య. తెల్లబోయిన సారధి బ్యాంక్ లాయర్‌ని తీసుకుని ఎమ్మార్వో ఆఫీస్‌కి పరిగెత్తాడు.

విశాఖపట్నంలో సంబంధిత కార్యాలయంలో ఎమ్మార్వో, రెవెన్యూ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందరూ మహిళలే. మహిళా సాధికారత చూసి సారధికి గర్వం కలిగింది. ఇలాంటి రుణాలు ఎలా ఇస్తారండి అనడిగింది ఎమ్మార్వో. సారధి బలహీనంగా నవ్వాడు. సర్వేయర్ గారు సెలవుట. కూడా ఆరై గారు వచ్చారు బ్యాంకుకి తనఖా పెట్టిన స్థలాల పరిశీలనకి.

“ఈ సర్వే నంబరు వేరండి” ఆరైగారు పెదవి విరిచారు.

“మా దగ్గర ఫోటోల్లో ఉన్న స్థలం ఇదేనండి” అన్నాడు సారధి.

“ఏవండీ ప్రముఖులతో ఫోటోలు దిగి హడావిడి చేస్తే మనం ప్రముఖులమైపోతామా? మీ పాత మేనేజర్ ఈ స్థలం దగ్గర ఫోటో తీసుకుంటే స్థలం బ్యాంకుదైపోతుందా? ఇది ప్రభుత్వ స్థలం. నీళ్ళ ట్యాంక్ కోసం కేటాయించబడింది” కోప్పడింది ఆరై.

“సరేనండి. మాకు తనఖా పెట్టిన దస్తావేజుల ప్రకారం ఆ సర్వే నంబరు ఎక్కడో చూపిస్తారా” సారధి దీనంగా అడిగాడు.

కారెక్కి చాలా దూరం వెళ్ళి ఆ సర్వే నంబర్ దగ్గర దిగారు. అక్కడ ఈ ప్లాట్లలో వేరే ఇళ్ళు వెలిసి ఉన్నాయి.

“స్థలాలు మీవి కావండి. నకిలీ దస్తావేజులు మాత్రమే మీవి” జాలిపడుతూ చెప్పింది ఆరై. అంటే ఎవరివో స్థలాలకి డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారన్న మాట.

“మరి రిజిస్ట్రార్ ఎలా రిజిస్టర్ చేస్తాడు” లాయర్ని అడిగాడు సారధి.

“రిజిస్ట్రార్‌కి సర్వే నంబర్ తన రికార్డుల్లో ఉంటే చాలు. ఎంతమందికైనా రిజిస్టర్ చేసేస్తాడు. ప్రభుత్వానికి ఆదాయం రావడమే ముఖ్యం” సారధి నిర్ఘాంతపోయాడు. బ్యాంకులు నిండా మునిగినా పర్లేదన్నమాట.

“సర్వేయర్ గారితో అలా అని మాకు రిపోర్ట్ ఇప్పిస్తారా” అడిగాడు సారధి.

లాయరుగారు ఇచ్చిన రెండు ఐదొందల నోట్లని ఎందుకండీ అంటూనే అందుకుంటూ “అమ్మో సర్వేయర్ అమ్మగారు చాలా ఖరీదు అండి. మీరు తట్టుకోలేరు” అని నవ్వింది ఆరై.

మహిళా సాధికారత మై ఫుట్ అనుకున్నాడు సారధి.

నరసింహారావు అండ్ కో వాళ్ళు ఇతర బ్యాంకుల్ని కూడా కాపీ పేస్ట్‌గా ఇలానే బురిడీ కొట్టించారని తెలిసింది. మూర్తితో చెప్పాడు జరిగిన విషయమంతా.

లాయరు, ఇంజినీరు, ఆడిటరు, అపరాధ పరిశోధకుడు ఇలా చప్పన్నారు వృత్తులవాళ్ళ కన్నా బ్యాంకు మేనేజరు అనే అమాయకుడు తెలివిగలవాడై ఉండాలి. అతడనేక చట్టములందు ఆరితేరి యుండవలయును. లేకపోతే ఎవడో ఒకడు జెల్ల కొట్టేస్తాడు, ఎర్త్ పెట్టేస్తాడు, కాళ్ళ కింద భూమి లాగేస్తాడు.

రుణం మంజూరు చేసిన మేనేజర్‌కి ఫోన్ చేసి విషయం అంతా వివరించాడు సారధి. ఆ సమయంలో రీజినల్ మేనేజర్ నన్ను ఒత్తిడి చేసి ఇప్పించాడు ఆ రుణాలు అన్నాడు అతను. ఎవరిని నమ్మాలో తెలియదు.

జరిగిందంతా పై ఆఫీసుకి రాతపూర్వకంగా తెలియజేసాడు సారధి. ముందుగా లాయర్‌ని, వేల్యూయర్‌ని ప్యానెల్లోంచి తొలగించారు. వాళ్ళు వేరే బ్యాంకుల ప్యానెల్స్‌లో కొనసాగుతూ హాయిగా డబ్బులు సంపాయించుకుంటున్నారు.

మూడేళ్ళవడంతో ఆ బ్రాంచ్ నుండి బదిలీ కూడా అయ్యాడు సారధి.

ప్రతి సంవత్సరం సారధి పదోన్నతి కోసం పోటీ పడుతున్నా విజయం వరించడం లేదు. మూర్తి దగ్గర వాపోయాడు. చేపల చెరువుల రుణాల్లో సారధిని బ్యాంకు సంజాయిషీ అడగలేదని ధృవపరుచుకున్నాడు.

“పట్టు పరిశ్రమలో అనుభవం ఉండాలి. పైవాడి దృష్టిని ఆకర్షిస్తూ ఉండాలి. పోనీ సుందర్రావులా జనవరి ఒకటిన పైవాళ్ళ ఇంటికెళ్ళి మామూలు బిస్కెట్ల మధ్య ఒక బంగారం బిస్కెట్ పెట్టి ఇస్తావా?”

“ఇలాంటివాళ్ళు ఉన్నా బ్యాంకులు ఎలా మనగలుగుతున్నాయి?”

“ఇతర ప్రభుత్వ సంస్థల్లా కాకుండా బ్యాంకుల్లోమనలాంటివాళ్ళు తొంభైఐదు శాతం ఉండడం వలన”

నాలుగేళ్ళయింది. సారధి ఆ కేస్ గురించే మర్చిపోతున్నపుడు దురదృష్టం నవ్వి ఒక సంజాయిషీ మెమో పంపింది. మూర్తిని సంప్రదించి, ఆఫీసర్స్ అసోసియేషన్ సలహా తీసుకుని సమాధానం పంపాడు.

మరో రెండేళ్ళు గడిచాయి. సారధి ఇంకో నాలుగు నెలల్లో రిటైర్ అవుతున్నాడనగా రుణం మంజూరు చేసిన మేనేజరుకి, ‘రెండు కోట్లలో మిగిలిన రెండు లక్షలు విడుదల చేసి నువ్వు నీ విధిని సక్రమంగా నిర్వర్తించనందువల్ల బ్యాంకుకి రెండుకోట్ల నష్టం వాటిల్లింద’ని సారధికి చార్జ్షీట్స్ వచ్చాయి.

నా కష్టానికి గుర్తింపు లేకపోగా ఈ పిడుగుపాటు ఏంటి అని బాధపడ్డాడు సారధి. ఎవరిని అడిగినా “చిన్నశిక్షతో సరిపెడతారులే. అయినా ఇలాంటివి రాకుండా చూసుకోవాలి” అని ఊరడించారు. కాలుజారి పడినవాడికి అయ్యో అనే సానుభూతి కావాలి కాని సరిగ్గా చూసుకుని నడవాల్సింది అనే మందలింపు కాదు. సారధి అంటే అభిమానం ఉన్న జి.ఎమ్.లు ఉన్నా వాళ్ళు కౌరవులు పాండవులకి అన్యాయం చేస్తుంటే నోరు మెదపలేని భీష్ముడివంటి వారు.

***

చేపల చెరువులకి రుణం మంజూరు చేసిన మేనేజర్ రిటైర్ అయ్యాడు రెణ్ణెల్ల క్రితం. విచారణ జరిపి ఒక ఇంక్రిమెంట్ తగ్గించారు.

“జి.ఎమ్. సుందర్రావు నిన్నరిటైర్ అయ్యాడు తెలుసుగా?” అడిగాడు మూర్తి.

“మరి వాడి మీద ఉన్న చప్పన్నారు కేసులు?”

“అన్నిటికీ కలిపి ఒక ఇంక్రిమెంట్ కట్ చేసేరుట”

మరుసటి నెల పదవీ విరమణ చేసిన సారధికి కూడా ఒక ఇంక్రిమెంట్ తగ్గించి మర్యాదగా ఇంటికి పంపారు. ఆర్నెలల్లో తేల్చాల్సిన కేసుని ఆరేళ్ళపాటు నొక్కి ఉంచి, అంటే జైళ్ళలో మగ్గే అండర్‌ట్రయల్స్‌లా, పదోన్నతులు రాకుండా తొక్కేసారు. అంతే తేడా.

‘బ్యాంక్ సొమ్ము కోట్లు తినేసినోడిని, కుక్క కాపలా కాసిన నన్ను- ఇద్దర్నీ ఒకే గాటన కట్టేసారు’ అని వాపోయాడు సారధి. “పొలాల్లో అడ్డంగా పడి మేసే పశువులతోపాటు పొరపాట్న అందులో కాలుపెట్టిన మన బోటి సాధుజంతువులకి కూడా దెబ్బలు తప్పవు” అని ఓదార్చాడు మూర్తి.

***

“రిటైర్ అయిపోయారు. మన డబ్బులు మనకి వచ్చాయి. అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండండి” అంది భార్య.

అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటున్నాడు సారధి.

కానీ దురదృష్టం సారధిని మర్చిపోతుందా?

కొడుకు ఇంజినీరింగ్ చదువు పూర్తి అయింది. అచ్చం సారధి లక్షణాలు పుణికిపుచ్చుకున్న కొడుక్కి సారధి కోరుకున్నట్టు ఇంజినీర్ ఉద్యోగం రాలేదు. వారసత్వపు వ్యాధిలా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here