[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఏ. అన్నపూర్ణ గారి ‘అనుబంధాల సంకెళ్లు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“మధూ! విలేజ్‌లో ఉన్న గ్రానీ ఫోను చేసింది. ఆవిడ చివరి రోజులు మనతో గడపాలని ఆశపడుతోంది. వెడదామా..?” అన్నాడు రోహన్ ఆఫీసునుంచి ఇంటికి వచ్చాక.
“అబ్బా! నాకు అక్కడ తోచదు. నీకు సెలవు దొరకదు” అంది మధు ఆసక్తి లేనట్టు.
“అది కాదు మధూ నీకు చెప్పేనుగా. మా అమ్మా నాన్నా కార్ యాక్సిడెంట్లో చనిపోతే నెలల పసివాడిని నన్ను చేరదీసి పెంచి చదివించింది. ఆవిడ చివరి దశలో వుంది. నువ్వు త్వరలో బిడ్డకు జన్మనిస్తావు. ఆ బిడ్డను చూడాలని ఎదురుచూస్తోంది. నా జాబ్‍కి కొంతకాలం బ్రేక్ ఇస్తాను.”
“ఇప్పుడు మనం చాలా ఖర్చులో వున్నాం. డెలివరీ, బేబీని పెంచడం, మామూలు విషయం కాదు. జాబ్ మానేసి కూర్చుంటే ఎలా?”
“గ్రానీకి నర్సరీ వుంది. గ్రాండ్‌పా ఎప్పుడో ప్రారంభించారు. అందులో పనిచేస్తా. గ్రామంలో పెద్ద ఖర్చు ఉండదు. స్వంత ఇల్లు. ఏమి ఇబ్బంది ఉండదు. ప్లీజ్ మధూ నా కోరిక తీర్చవా?”
“ఏమో బాబూ! నాకు అసలు ఇష్టం లేదు. డాక్టర్ సదుపాయం ఉండదు.”
“సరే. నీ ఇష్టం” అన్నాడు రోహన్.
మధు వాళ్ళ అమ్మ నాన్న కూతురు డెలివరీ కోసం వచ్చారు.
కొద్దిరోజుల తర్వాత రోహన్ చెప్పేడు.
“మధూ నేను గ్రానీ దగ్గిర కొద్దిరోజులు ఉండి వస్తాను. మీ అమ్మా నాన్నలు నీకు తోడు వున్నారుగా!”
“ఐతే నువ్వు ఉండవా?” కోపంగా అడిగింది మధు.
“నీకు నార్మల్ డెలివరీ అని డాక్టర్ చెప్పింది. పర్వాలేదు. అంతా బాగా జరుగుతుంది. నేను వెళ్లితీరాలి” అన్నాడు.
ఆ రాత్రికే రోహన్ గ్రానీ వుండే గ్రామం తోటపల్లి వెళ్ళేడు.
చంద్రమతి మనవడిని చూసి మురిసిపొయింది. ఒక్కడే వచ్చినందుకు బాధపడింది.
“మధూని వదిలి వచ్చావా..” అని మందలించింది.
“మధూ బేబీ పుట్టేక తీసుకుని వస్తుందిలే గ్రానీ. వాళ్ళ అమ్మ-నాన్నలు వున్నారు. నీకు ఎవరూ లేరు. ఎన్ని రోజులుగానో అడుగుతున్నావు. అందుకే వచ్చేసాను.” అన్నాడు.
చంద్రమతి ఇంకా నర్సరీలో పని చేస్తూనేవుంది. కొత్త మొక్కలు తెప్పించడం, వాటి సంరక్షణ, పూల బొకేలు తయారుచేసి వారం మార్కెట్లో అమ్మడం వగైరా.
ఇంటికి రోజూవచ్చి తాజా పూలను కొని తీసుకువెడతారు రెగ్యులర్ కష్టమర్స్. సీజన్ వారీగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలు చంద్రమతి దగ్గిరే కొంటారు.
అలా వచ్చే పారిజాత రోహన్ ను చూసి “ఎవరీ బంధువు? ఇన్నాళ్లు కనబడనేలేదు” అంటూ అడిగింది.
“వీడు రోహన్. నా మనవడు. సిటీలో పెద్ద ఆఫీసర్. తీరిక వుండదులే. నేనే వెళ్లి వచ్చేదాన్ని” అంటూ చెప్పింది.
“ఓసోస్.. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళేవు? మనవడిని మా బాగా వెనకేసుకు వస్తున్నావులే!” అని చంద్రమతితో అని, “ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఈవిడ?” అంటూ దులిపేసింది రోహన్‌ని.
“ఇక ఇక్కడే ఉండిపోతా. ఇంతకీ నువ్వెవరు?” అన్నాడు.
“నేనా ఈ తోటకు రాణిని. గ్రానీ మంచి చెడ్డా చూస్తూ వుంటాను. క్రితం నెల చాలా జబ్బుచేసింది. బతుకుతుంది అనుకోలేదు. నీ కోసం ఎంతగా కలవరించిందో. ఫోను చేస్తాను నంబర్ ఇవ్వమంటే ఇస్తేనా.. నేను ఊరుకుంటానా.. ఇల్లంతా తిరగేసి తెలుసుకుని ఫోను చేస్తే పని అమ్మాయి నువ్వు లేవని చెప్పింది..” అంటూ గల గలా మాట్లాడింది.
“అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు పారిజాతా? నీ నోరు క్షణం మూతపడదు కదా!” అంటూ చంద్రమతి అడ్డుకుంది.
“నువ్వు చెప్పవు. నన్ను చెప్పనీయవు. ఈ ఇంటిమీద లోను ఇంకా తీరలేదు. మొన్న పంచాయితీలో వార్నింగ్ ఇచ్చారు. డబ్బు కట్టకపోతే నర్సరీని స్వాధీనం చేసుకుంటామని. కోవిడ్ వచ్చినపుడు చాలా నష్టపోయింది. ఒక్కరోజన్నా వచ్చి చూశావా? ఏమి మనవడివి.. నిజంగా బంధువా కాదా?” అంటూ చీవాట్లు పెట్టింది.
“సారీ పారిజాత. తప్పంతా నాది. కోవిడ్ టైమ్‌లో నన్ను వేరే దేశానికి పంపించారు మా ఆఫీసువాళ్ళు. మా స్నేహితుడిని పంపించాను గ్రానీ దగ్గిరకు.”
“ఆఁ.. వచ్చాడులే నీ స్నేహితుడు. ఒంటి స్తంభం మేడలో గ్రానీని కూర్చోబెట్టేడు. ఏడాదిపాటు మాకు ఇద్దరు కనిపించనే లేదు” అంది పారిజాత.
“ఊరుకోవే తల్లి. ఇప్పుడు అంతా బాగున్నాంగా! నువ్వు ఇల్లంతా సర్దు. కూరగాయలు కోసి వండి తీసుకురా. అన్నట్టు రోహన్‌కి బెడ్రూములో దోమతెర కట్టాలి. తెచ్చేవా?”
“ఇవన్నీ చేయడానికి నేను నీ కోడలినా? రోహన్‌తో పెళ్లి చేస్తాను అంటే అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను” అంది కొంటెగా.
“ఆ ఇంతోటి పనిమంతురాలివి చదువుకున్నదానివి దొరకవని! ఈ పల్లెటూరి మేళాన్ని బంగారంలాంటి మనవడికి కట్టబెడతాను. వాడికి పెళ్లి అయిపోయింది. రేపో మాపో కూతురు పుడుతుంది.”
కళ్ళు తుడుచుకుంది పారిజాత.
‘పిచ్చిదానా! పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావ్. బంధాలు అంటూ లేకుండా పెరిగావ్. నాకు నువ్వు నీకు నేను తోడు అయ్యాము. ముందు రోజులు ఎలా గడుస్తాయి నీకు…’ అనుకుంది చంద్రమతి.
అలా సందడిగా రోజులు గడిచిపోతున్నాయి. నర్సరీ పచ్చగా కళకళలాడింది. ఇంటిమీద లోను తీర్చేసి గ్రానీ భారం తీర్చేసాడు రోహన్.
మధుకి ఆడబిడ్డ పుట్టింది. గ్రానీకి వీడియోలు చూపించాడు.
“ఎప్పుడు వస్తావ్? అక్కడే ఉండిపోతావా ఏం?” అంది మధు.
“నిజమే నాకు ఇక్కడే బాగుంది. రావాలనిపించడంలేదు” అన్నాడు రోహన్.
“అయితే నేను బేబీని తీసుకుని వస్తాను.” అంది మధు.
నిజంగా వస్తే బాగుండును అనుకున్నాడు.
పారిజాతకి అనుమానం వచ్చింది. మధు, రోహన్ విడిపోయారా? అని.
చంద్రమతి ఒకరోజు పూలబొకే కడుతూ చెట్లమధ్య తిరుగుతోంది.
పారిజాత వెదుక్కుంటూ వెళ్లేసరికి నేలమీద పడిపోయి ఉంది. “రోహన్” అంటూ కేకపెట్టింది.
హాస్పిటల్లో చేర్పించారు..అదే సమయానికి మధూ బేబీని తీసుకుని వచ్చింది.
“గ్రానీ ఇదిగో నీ మునిమనుమరాలు, బుల్లి చంద్రరేఖ వచ్చింది. చూడు” అంటూ చూపించాడు రోహన్.
మెల్లగా మగతలోవున్న చంద్రమతి కళ్ళు తెరచి చూసింది. ఆమె పెదవులపై చిరునవ్వు వెలిసింది.
“సమయానికి వచ్చాను. లేకుంటే చాలా బాధ కలిగేది” అంది మధు.
“పారిజాతా! ఈ ఇల్లు నర్సరీ నీ పేరున రాసింది గ్రానీ. నువ్వే అందుకు అర్హురాలివి..” అంటూ పేపర్స్ ఇచ్చాడు రోహన్.
“అప్పుడప్పుడు ఈ వూరు వస్తూవుండు రోహన్” అంది కన్నీళ్లతో పారిజాత.
“నేను చంద్ర కూడా వస్తాం పారిజాత! మాట ఇస్తున్నాను” అంది మధూ మనస్ఫూర్తిగా .
కన్నీటి మసకలో, దూరం అవుతున్న వాళ్ళని కనుచూపు మేరకు చూస్తూ ఉండిపోయింది పారిజాత.