అట్టడుగు పొర

0
4

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన విజయ్ ఉప్పులూరి గారి ‘అట్టడుగు పొర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]న్నాళ్ళకు నా చిరకాల వాంఛ ఈడేరే సమయం ఆసన్నమయిందండీ! ఇక ఏమాత్రం అలస్యం లేకుండా, కార్యాచరణకు పూనుకోవాలి.

ఏమిటీ! మనోవాంఛా ఫల సిద్ధిరస్తు! అనబోతున్నారా? ఆగండాగండి! అసలు నేను తలపెట్టిన ఘనకార్యం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా, ఇలా తొందర పడిపోరు. అసలు విషయం ఏమిటంటే నేనో హత్య చేయాలనుకుంటున్నానండీ! అంటే, హంతకుడిగా మారబోతున్నా! బిత్తర పోకండి! తిరిగి తేరుకుని, నావంక జుగుప్సతో చూడకండి! అప్పుడే నేనొక ఘోర పాపినని నిర్ధారించకండి! ముందు నా హృదయ ఘోష సావధానంగా ఆలకించండి! సాంతం విన్నాక, ఛీ! పొమ్మంటారో, ముందుకు సాగమంటారో..? అంతా మీ ఇష్టం!

***

అదిగో! ఆ ఎదురింట్లోంచి కనిపించిన దృశ్యం నన్ను మానసిక కల్లోలానికి గురి చేసిందండీ! ఉప్పెనలా పొంగుతున్న భావోద్వేగాన్ని అదుపులో ఉంచడం కష్టసాధ్యమయింది. నన్నంతగా కలత చెందేలా చేసిన సంఘటన ఏమిటంటారా? చెప్తానండీ! నేను నా గది కిటికీలోంచి అనుకోకుండా చూసినప్పుడు కనిపించిందా కంటగింపు సన్నివేశం.

ఎదురింట్లో రెండేళ్ళ పాప తన తండ్రికి ముద్దులందిస్తూ, కిలకిలా నవ్వుతోంది. అతగాడేమో, పాపను మరింతగా గుండెలకు హత్తుకుని- “మరోసారి నాన్నా! అనమ్మా!” అంటూ పరవశించి పోతున్నాడు. ఇదే! ఇది చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోయింది.

ఇదెక్కడి చోద్యం? తీయని అనుభూతిని పంచే అంత చక్కని దృశ్యం చూసి అనందించడం పోయి, కుళ్ళుకోవడమేమిటి? అంటారా?

అవునండీ! నాకు కుళ్ళే! ఆ ‘నాన్న’ అనే పదం ఉంది చూసారూ? ఆ మాట వింటేనే నాకు కంపరంగా ఉంటుంది. ఎందుకంటే.. ఎందుకంటే.. అది నేను ఎన్నడూ పలకని పదం. నా పాతికేళ్ళ జీవితంలో ఏ ఒక్కసారి కూడా ఆ పదం ఉచ్చరించే అవకాశం రాలేదండి బాబూ! ఆ భాగ్యం, ఆ ‘నాన్న’ అనే ప్రాణి నాకు కలిగించలేదండీ! అందుకే, ఆ పదమన్నా, నా నుంచి ఆ పిలుపుకు నోచుకోని ఆ ‘నాన్న’ అనే వాడన్నా, నాకు – కోపం, కసి, మంట, అసహ్యం, పగ, ద్వేషం, ఇంకా.. ఎన్నెన్నో!

ఓహో! అలాగా? అనుకుంటున్నారా? ఏం తెలుసు మీకు? ఏమర్థమయ్యింది మీకు? అసలు గుండెల్లో గడ్డ కట్టిన బాధంటే తెలుసా మీకు? బహుశా మీకు అనుభవం లోకి వచ్చిఉండదు! సరే! అదెలా ఉంటుందో నేను విన్నవిస్తాను..

ఈ లోకంలోకి మీరందరూ ఎలా వచ్చారో, నేనూ అలాగే వచ్చాను. అందరు పసిపాపల్లాగానే, భూమిమీద పడగానే, నేనూ కేర్.. కేర్ అన్నాను. నా తల్లీ నాకు స్తన్యమిచ్చింది. అంతవరకే, మీకూ నాకూ పోలిక! ఆ తర్వాత అంతా తేడా, భేదం, వ్యత్యాసం!

ఇప్పుడు నా బ్రతుకు పుస్తకం చదవాలని మీలో ఉత్సుకత పెరుగుతోందని నాకర్థమవుతోంది. ఇక నా ఉపోద్ఘాతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా గుండె పుటలు తెరుస్తున్నాను. ముందు మచ్చుకో పేజీ చదవండి!

సూర్యుడు అప్పుడే పైకెగబ్రాకుతూ, తన తీక్ష్ణతను ప్రసరించే పనిలో ఉన్నాడు. ముఖానికి పడుతున్న చిరుచెమటల్ని అద్దుకుంటూ, ఆ మాత్రం ఎండకే కందిన బుగ్గల్ని నిమురుకుంటూ, బుల్లి బుల్లి అదుగులేస్తూ బడికి వెళ్తున్నా! దార్లో ఒక అరుగు బడి ఉంది. రిటైరయిన ఒక ముసలి గుండు మాస్టారు అక్కడ పాఠాలు చెప్తున్నాడన్నమాట. నా ఈడు పిల్లలూ, నాకన్నా బోలెడు పెద్ద పిల్లలూ ఉన్నారక్కడ. ఏం పాఠం చెప్తున్నాడో గాని, నన్ను చూడగానే భళ్ళున నవ్వి, చేయి ఊపి పిలిచాడు గుండు మాస్టారు. నేను వెళ్ళాను. ఆయన నన్ను వాళ్ళందరి ముందూ నించోబెట్టి, గంగాధర్ అనే పిల్లాడ్ని పిలిచి “ఒరేయ్! ప్రపంచ వింతలెన్నిరా?” అని అడిగాడు. నేను గబుక్కున “ఏడు” అందామనుకుని – నన్ను కాదు కదా అడిగింది అని ఊరుకున్నాను! అమ్మో! ఆ గంగాధర్ తెలివైనవాడే! కచ్చితంగా నేను అనాలనుకున్న అంకే చెప్పాడు. గుండు మాస్టారు మెచ్చుకుంటాడనుకున్నాను. కాని, ఆయన వాడి పిర్ర మీద గిల్లి- “ఏడిసావులే!” అన్నాడు. అని ఊరుకున్నాడా? “ఒరేయ్! వెధవాయిలూ! పరీక్షల్లో అలానే రాయాలి. ప్రపంచమంతా మరి ఏడనే ఏడుస్తోంది. వెర్రిమాలోకం! ఎనిమిదో వింత ఇక్కడుందని కనుక్కోలేకపోయింది. అదేదో కనుక్కున్న నేను కనీసం మీకన్నా చూపించాలని వీడ్ని పిలిచాను. ఇదిగో! వీడే ఆ కొత్త ఎనిమిదో వింత!” అని పిల్లలందరికీ నన్ను చూపించాడు. పిల్లలందరూ ఎనిమిదో వింతను – అంటే, నన్ను అబ్బురంగా చూసారు. నిజానికి ఆ క్షణంలో నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. కాని, నాకేం తెలుసు? మరో కొద్ది నిమిషాల్లో, జన్మజన్మలకూ మర్చిపోలేని చేదు అనుభవాన్ని చవి చూడబోతున్నానని!

గుండు నిమురుకుంటూ, ఆయన అప్పుడు నన్నడిగాడు- “ఒరేయ్ బడుద్దాయ్! మీ నాన్న పేరేంటిరా?”

కేవలం సత్యం పలకడానికే దేవుడు మనకిచ్చాడని, అప్పట్లో నేను అమాయకంగా నమ్మిన నా నాలుక ఏమాత్రం తటపటాయించకుండా- “తెలీదు” అంది.

అలా అనడమే ఆలస్యం!- పెళ్ళున నవ్వారు గుండు మాస్టారు.

వారు నవ్వాకే, తోచిందేమో- పిల్లలూ శ్రుతి కలిపారు. శ్రుతీ, గతీ తెలియని నేను బిక్కమొగమేసాను.

“ఒరేయ్ సన్నాసులూ! ఎక్కడైనా చూసార్రా నాన్న పేరు తెలియనోడ్ని? ఇలాంటి చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేని గాడిద మీలో ఒక్కడు కూడా లేడని నాకు తెలుసు. అయినా, అడుగుతున్నా! చెప్పండి మీ నాన్నల పేర్లేంటో!”

– అంతే –

“సుబ్బారావు.. పాంచజన్యం.. దంతవక్రం.. ఏసోబు.. సైదులు.. సలాం ఖాన్.. ఏసుపాదం.. పతంజలి.. భగవాన్ దాస్.. క్రిష్టఫర్.. బ్రహ్మాజీ.. సుబ్రహ్మణ్యం.. దీక్షితులు..” ఇలాంటి పేర్లన్నీ నా చెవుల్లో దూరాయి.

“శభాష్ పిల్లలూ! ఇప్పుడు ఈ ఎనిమిదో వింతగాడ్ని ఇంకో సులువైన ప్రశ్న అడుగుతా చూడండి!”- అంటూ నావైపు చూసి, “ఒరేయ్! మీ నాన్ననెప్పుడైనా చూసావా?”

యథార్థం అంటే- “చూడలేదు” అనే అర్థం నా బ్రతుకు నిఘంటువులో ఉంది! అదే చెప్పాను.

ఈసారి గుండు మాస్టారు నవ్వకముందే- పిల్లలే పొట్ట పట్టుకుని నవ్వారు.

అప్పుడు నేను ఏడ్చానండీ! కన్నీళ్ళతో ఒళ్ళంతా తడిచేలా భోరున ఏడ్చానండీ!

పైశాచికానందంతో పొట్ట నింపుకునే వాళ్ళకు అన్నం తినేందుకు కాళీ ఉండదు. గుండు మాస్టారు ఆరోజు భోజనం చేసి ఉండడని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఆ మాటకొస్తే- నేనూ ఆరోజు తినలేదు.

కారణం – జ్వరమొచ్చింది.

అమ్మ రాత్రంతా నిద్ర లేకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నన్ను చూసుకుంది. ఎన్నెన్నో పలవరింతలుట. అవన్నీ- “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న” అన్న పదం చుట్టూనేనట.

ఛీ-

ఆ దరిద్రపుగొట్టు పదాన్ని నేను పదే పదే పలవరించానని గుర్తు చేసుకుంటేనే ఈరోజు నాకు కడుపులో తిప్పుతోంది. తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. “చాల్లెద్దూ! మరీ ఇంత అతిశయోక్తులు అవసరమా” అంటారా? దయచేసి మీతో నన్ను పోల్చుకుని అంతంత మాటలనకండి! మీరు నా వయసు వాళ్ళయినా, నాకన్నా పెద్ద వాళ్ళైనా, ‘నాన్న’ అనే పదం బ్రతుకులో ఎన్నిమార్లు వాడి ఉంటారు? లెక్కలేనన్ని సార్లు కదా? అలాగే మీరు పుట్టినరోజు లగాయితు, మీ నాన్నల్ని కొన్ని లక్షల సార్లో, కోట్ల సార్లో చూసి ఉంటారు కదా?. (ప్రతిరోజూ లేచింది మొదలు, నిద్ర పోయేదాకా, ‘నాన్న’ అనబడే అవతారం కళ్ళ ముందు కదలాడుతుంటే, పలకక, పిలవక చస్తారా?) మరి నా ఉజ్వలమైన చరిత్ర చూడండి! ఎన్నడైనా చూసానా? పిలవగలిగానా? దొంగచాటున గుళ్ళో పెళ్ళి చేసుకుని, నా తల్లిని తల్లిని చేసి – పుత్ర వాత్సల్యమైనా లేని కసాయిలా, మా ఖర్మానికి వదిలేసి, వేరే చోట సంసార జీవితం వెలగబెడుతున్నాడా ప్రబుద్ధుడు. అలాంటి పురుగంటే ఏహ్య భావం కాకుంటే, గౌరవం పుట్టుకొస్తుందా నాకు?

ఇప్పుడేమంటారు? నాన్న అనే పదంపై నేను అసహ్యం పెంచుకోవడంలో ఏమైనా అపసవ్యత ఉందా?

చెప్పండి!-

మౌనముద్ర దాల్చారా? మరింకేం? నాలో రగిలే బాధ మీరు కొంచెం కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నారు. అది చాలు నాకు. ఇప్పుడు నేనూ సగర్వంగా ఒప్పుకుంటున్నాను! నిజంగా నేను ఎనిమిదో వింతనే!

ఇప్పుడు నా దృష్టిలో గౌరవప్రదమైన వస్తువు గురించి చెప్పాలి మరి. అదేమిటో ఊహించగలరా? మిలియన్ డాలర్ బెట్! మీరు జన్మలో కనుక్కోలేరు. సరే! నేనే చెప్తానన్నానుగా?

అది

‘చెత్తకుండీ’

అవునండీ! అదే! మీకు అనునిత్యమూ వీధుల్లో తారసపడే చెత్తకుండీ అంటే నాకు పూజ్య భావం. మా నాన్న విదిలించుకుపోయిన విధంగా, మా అమ్మ కూడా నన్ను విసర్జించి ఉంటే నేను మీ లోకానికి అందులో కనబడేవాడ్ని! నా గురించి పేపర్లో మీ చిన్నప్పుడే చదువుకుని ఉండేవాళ్ళు!

ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే – మా అమ్మనూ చెత్తకుండీ గానే చూసింది పాడు లోకం! ఒక్క విషయం అడుగుతా! గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి! నాలాంటి వాళ్ళకు ఇలా దుస్థితి దాపురించడానికి మీలాంటి వాళ్ళ బాధ్యతారాహిత్యం ఒక కారణం కాదా? మీలో ఒక్కడైనా, ముందుకొచ్చి, ఆ ద్రోహిని నిలదీసి అడిగి, న్యాయం చెయ్యడానికి పూనుకొని ఉంటే- నా కథ ఇలా ఉండేది కాదు. ఇక మా అమ్మను ఈ లోకం ఎన్నెన్ని అవహేళనలకు గురిచేసిందో చెప్పనలవి కాదు. ఊరు కాని ఊరులో ఉద్యోగం చేస్తూ, గత్యంతరం లేక నన్ను తాతయ్య, అమ్మమ్మల దగ్గర వదిలేసి, కాకుల్లా పొడిచి వేధించే పాడు సమాజంతో ఒంటరి పోరు సాగిస్తూ, మా అమ్మ అనుభవించిన నరకయాతన అంచనా వేయగలిగేవారు మీలో ఎవరైనా ఉన్నారా?

దీనస్థితిలో ఉన్న మనిషికి ఆపన్న హస్తం అందించే బదులు మరింతగా మానసిక క్షోభకు గురిచేసి అనందించే మగమహారాజులతో పాటు- అరె! సాటి ఆడది కదా! ఇలాంటి అవస్థే మనకొస్తే తట్టుకోగలమా? అని లిప్తపాటు కూడా అలోచించకుండా, చెవులు చెవులూ కొరుక్కుని, నోళ్ళు నొక్కుకునే మహిళామతల్లులూ, సాధ్వీమణులూ మీలోనే ఉన్నారుగా?

బాధల్ని భరిస్తూ, కష్టాలకు ఎదురీదుతూ, ఒక సజీవ ప్రేతంలా బ్రతుకీడుస్తూ, రోజులు నెట్టుకొచ్చింది మా అమ్మ. నన్ను మాత్రం ఏ లోటూ లేకుండా పెంచింది. విద్యాబుద్ధులు చెప్పించింది.

రాత్రి పూట అందరూ నిద్ర పోతారుగా! నేనూ ఆదమరిచి నిద్రపోయేవాడ్ని. కాని, ఎప్పుడో, ఏ అర్ధరాత్రి వేళో అనుకోకుండా మెలుకువ వచ్చేసరికి, అమ్మ మౌనంగా రోదిస్తున్న దృశ్యం కనిపించేది. దాంతో కసితో నా పిడికిళ్ళు బిగుసుకునేవి. ఆ సమయాల్లో వచ్చిన ఆలోచనే- ‘మా నాన్నను చంపాల’ని!

***

అవునండీ! బుగ్గల మీద నాన్నలు పెట్టే ముద్దులు నాకు తెలియవు. కనీసం పిల్లల దుందుడుకు పనులకు ఆగ్రహించి శిక్షగా, నాన్నలు వీపు విమానం మోత మోగిస్తే పడే చేతి ముద్రలూ నాకు అనుభవంలోకి రాలేదు. ఇవన్నీ నాకు దూరం చేసిన మనిషిపై కసీ, పగా కాకుండా, ఇంకేం పుట్టుకొస్తాయి చెప్పండి? అందుకే, నాలో అలా మొలకెత్తిన ప్రతీకార బీజం నేను ఎదుగుతున్న కొద్దీ, మరింత ఏపుగా పెరిగి బలపడింది.

కక్ష అనే కాలకూట గరళం గుటకలు వేస్తూ పెరిగి నేనూ యుక్తవయసుకు వచ్చాను. ఈలోగా నా చదువయిపోయింది. ఉద్యోగమూ వచ్చింది. ఎప్పుడెప్పుడు వెళ్ళి అతని గొంతు నులిమి కక్ష తీర్చుకుందామా అని మనసు తొందర చేయసాగింది. కాని, నా చిరకాల వాంఛను అణుచుకోక తప్పలేదు. కారణం ఊహించగలరా?- మా అమ్మండీ! ఇప్పుడిప్పుడే- కన్నీళ్ళు ఇంకిన ఆమె కళ్ళలో, నా భవిష్యత్ గురించి కన్న కలలు నెరవేరుతున్నాయన్న సంతోషానికి చెందిన మెరుపు కళ చోటుచేసుకోవడం మొదలయింది. ఇలాంటి తరుణంలో నేను నా ధ్యేయ సాధనకు ఉపక్రమిస్తే – నాకెలాగూ ఉరిశిక్ష తప్పదు. తెలిసి తెలిసీ, ఆమెకు వార్ధక్య దశలో సుఖసంతోషాలు చేకూర్చే బదులు గర్భశోకం కలిగించే పనికి ఎలా పూనుకోగలను?

అందుకే- నా మనసుకు సంకెళ్లు వేసుకోక తప్పలేదు.

కాని, రోజూ నాకో విచిత్రమైన కల రావడం మొదలయింది. ఆ కలలో- ఒక ‘మెడ’- దాని చుట్టూ బిగుసుకుంటున్న బలిష్టమైన నా చేతివేళ్ళు! – దిక్కులు పిక్కటిల్లేలా ఓ చావుకేక!

దాంతో నాకు మెలుకువ వచ్చేసేది. ఇక కునుకు పట్టేది కాదు.

ఇలా తీరని అశాంతితో ఆలమటిస్తూ, ఎడారి బ్రతుకు వెళ్ళదీస్తున్న నామీద గమ్మత్తుగా ఒక స్వాతి జల్లు కురిసింది. ఒక అమ్మాయి నాకు చేరువయింది. నాతో జీవితం పంచుకోవాలనుకుంది. నా గుండెల్లో స్థానాన్ని సింహభాగం పగా, కసీ ఆక్రమించినా, ఎక్కడో ఒక మూల ఖాళీ ఉంది. ఆ చోటు ఆ అమ్మాయికి ఇచ్చేసాను. నా ఆడుగులో అడుగేస్తూ ఏడడుగులు నడవాలని ఉబలాటపడుతున్న ఆ అమ్మాయి మా అమ్మ దృష్టిలో పడనే పడింది. అప్పుడు మా అమ్మ నాతో అన్నది- “ఆ పిల్ల నాకు నచ్చిందిరా! నాకో మనవడ్ని ఇవ్వమని కోరానని ఆ అమ్మాయికి చెప్పు!” అని. “అలాగే! తప్పకుండా!” అని జవాబిచ్చానని అనుకుంటున్నారా? లేదండీ! దండేసిన కొడుకు ఫొటో చూస్తూ, తల్లి కుమిలిపోవడం భరించలేని వ్యక్తి – కోటి ఆశలతో వెన్నంటి వచ్చిన నూతన వధువుకు వైధవ్యాన్ని ఎలా కానుకగా ఇవ్వగలడు? అందుకే, తెచ్చిపెట్టుకున్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ, కావాలని ఆ అమ్మాయికి దూరమయ్యాను. ఫలితంగా, తను వేరొకరి సొత్తయింది.

ఆమె పెళ్ళయిన రోజు రాత్రి నాకొచ్చిన కలలో – ఆ మెడ చుట్టూ ఆక్టోపస్‌లా ఆల్లుకుని నావేళ్ళు సృష్టించిన బీభత్సం అంతా, ఇంతా కాదు.

చివరికి- నేను ఏ రోజు రాకూడదని కోరుకున్నానో, ఆరోజు రానే వచ్చింది. నా తల్లి కన్నుమూసిందని మీకు అర్థమయ్యే ఉంటుంది. నా దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కర్మకాండ ముగిసాక, ఎలాగోలా దుఃఖాన్ని దిగమింగి నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీద దృష్టి మరల్చాను. ఎట్టకేలకు ఒక క్షుద్ర జీవిని అంతం చేయడానికి నాకు స్వేచ్చ లభించింది. ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. ‘మెడ’ భోగట్టా సేకరించాను. అడ్రెస్ కనుక్కున్నాను. అతని ముందు ప్రత్యక్షమయి, అతగాడి చివరి క్షణాలు లెక్కించడమే తరువాయి. పొంచుకొస్తున్న ఆపద గురించి, పాపం ఆ కీటకానికి తెలియదు. పాతికేళ్ళ క్రితమే తన మరణశాసనం స్వహస్తాలతో లిఖించాడన్న విషయమే విస్మరించి, నిశ్చింతగా కాలం గడుపుతున్న నీచుడు ఎదురుచూడని మృత్యువు ముందు నిలచి మెడను దొరకబుచ్చుకుంటే, భయంతో ఎలా కంపించిపోతాడో ఊహించుకోండి!

***

అదండీ సంగతి! ఇప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమయింది కదా? నాతో ఏకీభవిస్తున్నందుకు ధన్యవాదాలు.

కూ.. చుక్ చుక్..!

ఇన్నేళ్ళ నిరీక్షణ తరువాత, నా చేతివేళ్ళను ఆ ‘మెడ’ దగ్గరకు చేర్చడానికి శరవేగంతో దూసుకుపోతున్న రైల్లో ఉన్నానండీ ఇప్పుడు! ఇంక కొన్ని గంటల్లో మెడ ఎముకలు విరిగితే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో నాతో పాటు మీకూ తెలుస్తుంది.

ఆ..! ఇదేనండి ఆ ఊరు! ఆ పాపిష్టి మనిషి పాద స్పర్శతో అపవిత్రమైన ఆ ఊరి రోడ్ల మీద నా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు. అమ్మయ్య! ఎట్టకేలకు చేరుకున్నానండీ! అదే.. ఆ పదమూడు నెంబరున్న ఇల్లేనండి, కొద్ది క్షణాల్లో గొల్లుమనే ఏడుపులకు నిలయం కాబోతున్నది! ఆ ఇంటి గడపలో కాలు మోపబోతున్నవాడినల్లా, ఎక్కడో తీతువు కూసినట్లనిపించి ఆగిపొయాను. చెవులు రిక్కించి విన్నాను. అంతే! నాకు గుండె ఆగినంత పనయ్యింది. కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయి, ముందుకు తూలి పడబోయి అతికష్టం మీద నిలదొక్కుకున్నాను. నాకు వినిపించింది మరేదో కాదు. నిస్సందేహంగా అది మృత్యుదేవత రాగాలాపనే! అదే ఆ ఇంట్లోంచి సన్నగా రోదనల రూపంలో వినిపిస్తోంది. అప్పటికీ నమ్మకం కుదరక, ఆ ఇంట్లోకి పరామర్శకు వెళుతున్న వాళ్ళను అడిగి కనుక్కున్నా! కాలం చేసింది మరెవరో కాదు. తనే! నేను చంపాలని వచ్చిన మనిషే! గంట క్రితమే బూడిదయిపోయాడు. ఈ విషయం తెలియగానే నా మస్తిష్కం మొద్దుబారిపోయింది. చేష్టలుడిగి ఉన్నచోటే శిలా ప్రతిమలా నుంచుండిపోయాను. నాప్రతీకార వాంఛ ఆవిరై, మబ్బుల్లో కలిసిపోయిందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడం నావల్ల కాలేదు. అవ్యక్త భావన ఏదో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, గుండెల్ని పట్టి కుదపసాగింది. అదింక నన్నక్కడ నిలువనీయలేదు. అయినా, ఇక నేనక్కడ చేసేదేముంది? గిరుక్కున వెనుతిరిగాను. తిరిగి వచ్చిన దారి పట్టాను. భారంగా అడుగులు వేస్తూ నడుస్తున్నాను. సరిగ్గా అప్పుడే మీరు కల్లో కూడా ఊహించని సంఘటన జరిగింది. కరడు గట్టిన పగతో నిత్యం రగిలిపోయే నా కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు జారి పడ్డాయి. ఇదెక్కడి విడ్డూరం అని విస్తుపోతున్నారా? ఔనండీ! పాడు మనసు ఇంతకు తెగిస్తుందని నేనూ ఊహించలేదు. “ఇదేమిటి? మేము ఊహించిందొకటి! ఇప్పుడు జరుగుతున్నది మరొకటి! ఇదేం బాగోలేదు!!” అని నావంక కోపంగా చూడకండి! ఇదేమీ కథ కాదు కదండీ! అనుకున్న విధంగా సాగడానికి? ఇది జీవితం! జీవితంలో జరిగే చర్య, ప్రతిచర్య – అన్నింటికీ మనసే మూలం. మన మనసుల్లో ఏముందో అంతా మనకు తెలుసనుకుంటామండీ! కాని, అది ఒట్టి భ్రమ. పిచ్చి మనసు మనకు తెలియకుండా ఎక్కడెక్కడో, ఏవేవో దాచేచుకుంటుందండీ! అవి ఎప్పుడో ధడేలున బయటకు వచ్చి మనల్ని నిర్విణ్ణుల్ని చేస్తాయండి! ఇప్పుడు జరిగింది అదే కదండీ! ఎంతకాదనుకున్నా నా జన్మకు కారకుడైన వ్యక్తిని చూడాలనే కోరిక నా అంతరాంతరాల్లో గూడు కట్టుకుని ఉందేమో? నాకూ ఇప్పుడే అవగతమవుతోంది. చంపే ముందు- “నువ్వు మాకు చేసిన అన్యాయానికి నిన్ను చంపక తప్పదు” అని చెప్పే మిషతో నైనా “నాన్నా” అని తొలిసారి, తుదిసారి పిలవాలనే కాంక్ష నాలో నిద్రాణమై ఉందేమో? ఇప్పుడు ఆశ నిరాశగా మారిన మారిన పరిస్థితుల్లో, మనసు అట్టడుగు పొరలోంచి అది తన్నుకుని బయటకు వచ్చింది. నా దుఃఖానికి హేతువయింది. ఇంతేనండీ! ఇంతకు మించి మీకు సంజాయిషీ ఇవ్వలేనండీ!

కాకుంటే- ఒక విషయం మీకు చెప్పి తీరాలి! నేనిప్పుడు నడుస్తున్న నేల ఉంది చూసారూ? ఇదే నా నా జన్మకు కారణమైన ప్రదేశం. ఇక్కడే- ఈ ఊళ్ళోనే- నాతో ‘నాన్న’ అని పిలిపించుకోలేని ఆ దురదృష్టవంతుడు మా అమ్మతో కలసి ఏడడుగులు నడిచినది. ఇప్పుడు ఈ నేలపై, ఈ గాలి పీలుస్తూ నడుస్తుంటే- నేను ‘నాన్నా’ అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోవాలనే కొత్త ఆశ నాలో చిగురు తొడుగుతోందండీ! ఎంతైనా, సగటు మనిషిని కదండీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here