కథా, నవలారచయిత ఆర్. సి. కృష్ణస్వామిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ

0
4

[‘జక్కదొన’ అనే కథాసంపుటిని వెలువరించిన శ్రీ ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారూ.

ఆర్. సి. కృష్ణస్వామిరాజు: నమస్కారం.

~

ప్రశ్న 1. జక్కదొనఅనే కథాసంపుటి వెలువరించినందుకు అభినందనలు. 21 కథలున్న ఈ సంపుటికి 10వ కథ అయిన జక్కదొనపేరునే పెట్టడంలోని కారణం ఏమిటి?

జ: జక్కదొన గ్రామ నేపథ్యంతో వ్రాసిన ఈ కథ మక్కెన వారి కథల పోటీలో ఎంపికై పాలపిట్ట పత్రికలో ప్రచురింపబడింది.

రాయలసీమ సిన్నోడిగా పేరుగాంచిన రచయిత స్వర్గీయ పులికంటి కృష్ణారెడ్డి గారి స్వగ్రామం జక్కదొన.

ఈ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇవ్వడం జరిగింది. అందుకే అది పుస్తకం పేరు అయ్యింది.

ప్రశ్న 2: ఇది మీ 17వ పుస్తకం. దీనికి ముందు వెలువరించిన కథాసంపుటాలు ఏవి? ఓ కథకుడిగా మీకు మంచి పేరు తెచ్చిన సంపుటి ఏది?

జ: ఇప్పటి దాకా పదహారు కథా సంపుటాలు, ఒక నవల వెలువరించాను.

వీటిలో మాండలిక కథలు: ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల, గాండ్ల మిట్ట, జక్కదొన

బాల సాహిత్యం: రాజు గారి కథలు, రాణి గారి కథలు, కార్వేటినగరం కథలు, నాన్నారం కథలు

మినీ కథలు: పకోడీ పొట్లం [అరవై కార్డు కథలు], మిక్చెర్ పొట్లం [ముప్పై మినీ కథలు]

హాస్య కథలు: దుశ్శాలువా కప్పంగ

ఆధ్యాత్మిక కథలు: గతం గతః, యోగక్షేమం వహామ్యహం

చిత్తూరు జిల్లా యాస కథలు: కిష్టడి కతలు, రాజనాల బండ, పుత్తూరు పిలగోడు

నవల: మేకల బండ.

ప్రశ్న 3: “ఇలాంటి కథలు, బతుకు పట్ల సానుకూల దృష్టిని కల్గిస్తాయి. ఈ కథల ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో నేరుగా చెప్పకుండా చైతన్యవంతమైన పాత్రల ద్వారా చెప్పించటం కథా నిర్మాణంలో భాగమే” అన్నారు శ్రీ తగుళ్ళ గోపాల్ తమ ముందుమాటలో. మీరు ఎంచుకునే ఇతివృత్తాలను ఈ వాక్యాలు ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా, కథా రచయితగా మీ ప్రస్థానాన్ని వివరించండి?

జ: మనమున్న సమాజంలో మన చుట్టూరా ఎంతో నెగిటివిటీ ఉంటుంది. మనం చదివే కథల్లో కూడా అలాగే ఉంటే మనం ఎదగలేము. ఆశావాద దృక్పథంతో జీవించలేము. అందుకే నా కథల్లో సానుకూల ముగింపులు ఉంటాయి. పాఠకుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయనేది నా నమ్మకం.

ప్రశ్న 4: ‘జక్కదొన’ కథాసంపుటిలో వస్తు శిల్పాల్లో కృష్ణస్వామి రాజు చేయి తిరిగిన నేర్పరితనం కన్పించింది. ఎలాంటి వస్తువునైనా పాఠకుడి మస్తిష్కాన్ని మెలిమెట్టేలాగా, కథగా మలచగల సత్తా వారికుందని అర్థమైందని ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు గారు అభిప్రాయపడ్డారు. వస్తువు, శైలి, శిల్పం లలో కథలకు ఏది ముఖ్యమని మీరు భావిస్తారు?

జ: ముఖ్యంగా చదివించే గుణం ఉండాలి కథకి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది. వస్తువు కానీ, శైలి కానీ, శిల్పం కానీ రచయితకి, ప్రచురణ కర్తకి మాత్రమే నచ్చితే సరిపోదు. పాఠకుడికి నచ్చాలి. చేరాల్సిన పాఠకుడికి చేరాలి. అప్పుడే ఆ కథకి ప్రాణం వస్తుంది. ప్రపంచమంతా చుట్టి వస్తుంది ఆ కథ.

ప్రశ్న 5: మనం ఆలోచించని రెండవ కోణాన్ని ఆవిష్కరిస్తుందని తగుళ్ళ గోపాల్ గారు పేర్కొన్న డబ్బు పాపిష్టిదికథ నేపథ్యం వివరిస్తారా?

జ: సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రికెట్ ప్లేయర్‌లు, డాక్టర్లు,.. సెలిబ్రిటీ లందరూ మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు. వారిని బాహ్యంగా చూస్తే వారంతా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరన్న ఆలోచనల్లో ఉంటాము. కానీ కనిపించేది వేరు, వాస్తవం వేరు అని మనం లోతుకు వెళ్లి చూస్తీ కానీ తెలియదు.

అలాగే వైద్యులందరూ కోట్లు సంపాదిస్తారని, ఆస్తులు బాగా కూడబెడుతారని మనం భావిస్తాం. అందరి డాక్టర్ల పరిస్థితి ఇలా ఉండదని, వారి జీవితాల్లోనూ చీకటి వెలుగులు ఉంటాయని చూపే ప్రయత్నమే ఈ కథ.

దీన్ని చదివిన కొందరు డాక్టర్లు భుజాలు తడుముకోవడం గమనించాను.

ప్రజాశక్తిలో ప్రచురింపబడిన ఈ కథ వాణిశ్రీ గారి సంపాదకత్వంలో తెలుగు కథ రచయితల వేదిక వారి ‘మా కథలు 2022’ లో కూడా చోటు చేసుకుంది.

పుస్తకావిష్కరణ సభకు హాజరైనవారు

ప్రశ్న 6: చదువుతున్నప్పుడు కళ్ళు చెమరింప చేసి, చదివాకా ఆలోచింపజేసే ఫుల్ మీల్స్కథకి ప్రేరణ మీకు తారసపడిన పిల్లలా లేక ఈ కథ పూర్తిగా కల్పనా? ఈ కథ గురించి చెప్తారా?

జ: నా భార్య సూరపరాజు మీనాక్షి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు స్కూల్‌కి వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలు ప్లేట్ల లోని అన్నాన్ని ఆవురావురుమని తినడం గమనించే వాణ్ని. ‘శెలవులప్పుడు వారికి అన్నం ఎలా దొరుకుతుంది?’ అన్న ప్రశ్న నాలో మొదలయ్యింది. అధికారులను అడిగాను.

శెలవుల్లో ఈ పథకం అమలు చేయరని తెలుసుకుని బాధపడ్డాను. ‘ఎప్పుడెప్పుడు బడి తెరుస్తారా, కడుపు నిండా అన్నం తినవచ్చా..’ అని ఎదురుచూసే పిల్లల్ని కళ్ళారా చూశాను. చాలా బాధేసింది.

ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని కథ రూపంలో తెలియజేశాను.

ఈ కథ నవ తెలంగాణ వారి ఆదివారం అనుబంధం సోపతిలో ప్రచురింపబడింది. ఈ కథ నచ్చిన చైతన్య మానవి [మహిళా మాస పత్రిక] సంపాదక వర్గం అదే కథను మళ్ళీ తమ పత్రికలో ప్రచురించి వారి పాఠకులకు అందించడం విశేషం.

చూద్దాం.. ఏ ప్రభుత్వ అధికారి కళ్ళల్లో అయినా ఈ కథ పడి, పిల్లలకి శెలవు దినాల్లో కూడా ఆహారం దొరికే అవకాశం వస్తుందేమో..

ప్రశ్న 7: ఈ సంపుటిలో మూగజీవాలకు సంబంధించిన కథలు. జక్కదొన, ఎర్రమట్టి, నిర్ణయ, పొట్టిగుట్టలు. పుస్తకానికి శీర్షికగా ఎంచుకున్న జక్కదొనకథ గురించి, ఈ కథ వ్రాయడానికి ప్రేరణ కలిగించిన సంఘటన గురించి చెప్పండి.

జ: ఈ ప్రకృతిలో మనుషుల సంఖ్య కన్నా జంతువులు ఎక్కువున్నాయనేది అందరికీ తెలిసిందే. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మూగజీవాల మీద ఆధారపడి ఉన్నామనేది కూడా వాస్తవము. అయితే మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నామనేది నా అభిప్రాయం.

అవి మనుగడ సాగించాలంటే, మన దేశంలో మరిన్ని వెటర్నరీ కాలేజీలు, ఆసుపత్రులు రావాలన్నిది నా కోరిక.

ఇకపోతే.. జక్కదొన కథ గురించి.. నేను పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు పశువుల కాపర్లు చాలామంది పశువులను విచక్షణా రహితంగా కొట్టడం చూశాను. వాటి శరీరాలు రాళ్ళు కావని, ప్రాణమున్న కణాల మయమని వారు గుర్తిస్తే బాగుంటుందని భావించేవాడిని. అలా గొడ్డును బాదుతున్నప్పుడు పుట్టుకొచ్చిన కథే ఈ జక్కదొన.

మూగజీవాల నేపథ్యంతో వ్రాసిన ‘బోడి గుట్ట’ కథ, మొదట జాగృతి పత్రికలో ప్రచురింపబడింది. అయితే ఈ కథ రైతులకు ఉపయోగకరమని భావించిన రైతు నేస్తం మాస పత్రిక వారు వారి పత్రికలో పునర్ముద్రించడం జరిగింది.

ప్రశ్న 8: . ‘గోల్కొండ చూసొద్దాం, రారండి!!!’ కథలో మంచి మార్కులతో పాసైన విద్యార్థులను విమానం ఎక్కించి ప్రోత్సహించిన ఉమాపతి కల్పిత వ్యక్తా? నిజజీవితంలో ఉన్నారా? ఈ కథ వ్రాయడంలో ఈమధ్య వచ్చిన సముద్రఖని నటించిన ‘విమానం’ అనే సినిమా ప్రభావం ఏమైనా ఉందా?

జ: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఓ గ్రామంలో జరుగుతున్న ‘విమానయానం’ ఈ కథకి ప్రేరణ. అధిక మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని ఆ ఊరి గ్రామస్థులు కొందరు విమానంలో తిప్పడం తెలిసుకుని దాన్ని కథగా మార్చాను.

ఈ కథను చదివి ప్రేరణ పొంది తాము కూడా తమ పల్లెల్లో దీన్ని అనుసరిస్తామని కొందరు చెప్పినప్పుడు పొంగిపోయాను.

కాగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎస్కే యూనివర్సిటీకి చెందిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు ఇటీవల ‘నాకు నచ్చిన కథ’ అని పేర్కొంటూ తన బ్లాగ్‌లో ఈ కథ గురించి గొప్ప సుదీర్ఘ వ్యాసం వ్రాయడం చెప్పుకోదగ్గ విశేషం.

మీరు చెప్పిన సముద్రఖని ‘విమానం’ సినిమా నేను ఇప్పటిదాకా చూడలేదు. చూసే ప్రయత్నం చేస్తాను. చూస్తే కానీ బేరీజు వెయ్యలేను.

ప్రశ్న9: ‘తొలి అడుగు’ కథలో రెండో పేరాలో ‘వారానికే ఈ వృత్తి పూల దారి కాదని, రాళ్ళ దారని అర్థమైపోయింద’ని చెప్పడంలో – చాలా నేర్పుగా కథ ఇతివృత్తాన్ని వెల్లడించారు. ఈ కథ, మైత్రేష్ పాత్ర కల్పితాలా లేక మీకు ఎదురైన ఘటన/తారసపడిన వ్యక్తి ఆధారంగా అల్లిన కథా?

జ: అన్నీ ప్రభుత్వమే చేయాలని అనుకోవడం తప్పని తెలియజేయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా యువత దీన్ని గుర్తించాలి. వారిలోని శక్తులను వెలికి తీయాలి. ఈ సమాజానికి తమ వంతు ఉడుత సహాయం చేయాలి అనే తపనతో వ్రాశాను.

కొన్ని గ్రామాల్లో చిన్నచిన్న విషయాలకు సంబంధించి గ్రామస్తులే చందాలేసుకుని చేసుకోవడం చూశాను. పంచాయితీ వారు చేయలేదని నిందించకుండా చేసుకోవడం చూసి అల్లిన కథ ఇది.

ప్రశ్న 10: సాధారణంగా రచయితలకు వారి రచనలన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీకు బాగా నచ్చింది? ఎందుకు?

జ: ‘ఊరి మట్టి’ నాకు నచ్చిన కథ. ఎందుకంటే.. ఏదో ఒక అనుబంధం ఉండే, మనం ఒక ఊరిలో పుడుతాము. ఆ ఊరికీ మన శరీరానికీ ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుందని నా నమ్మకం.

అందుకే మనం పుట్టి పెరిగిన ఊరికి వెళ్తే పోగొట్టుకున్న ప్రాణవాయువు తిరిగి పొందినట్లవుతుంది. దారిపోయిన శక్తి మళ్ళీ దొరికినట్లవుతుంది.

నా మిత్రులెవరైనా మనసు సరిగా లేదంటే.. స్వంత ఊరికి వెళ్లి రమ్మంటాను. రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులను కలిసి రమ్మంటాను.

ప్రశ్న11: ఈ సంపుటిలోని ఏ కథ రాయడం కష్టమనిపించింది? ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘పురుషా.. ఓ.. పురుషా!’ కథ రాయడం కష్టమనిపించింది. కథ లోతుకు వెళ్లి చూస్తే ఎంతో ఉందనిపిస్తుంది. పైపైన చూస్తే సాదా కథగానే తోస్తుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సబ్జెక్టు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ఒకే రకంగా ఉండరని తెలియజెప్పే అంశం.

బియ్యం ఉడుకుతున్నప్పుడు ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. కానీ మనుషుల మనస్తత్వాల జోలికి వెళ్తే.. లోకో భిన్న రుచి అని తెలుస్తుంది.

నేను మరింత అధ్యయనం చేయాలి. సమాజం పట్ల, స్త్రీ పురుషుల మనస్తత్వాల పట్ల మరింత లోతుకు వెళ్ళి అవగాహన పెంచుకోవాలి. అప్పుడు ఇదే కథను మరింత మెరుగ్గా రాస్తానేమో అనిపిస్తుంది.

ప్రశ్న12. జక్కదొనపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా?

జ: ప్రూఫ్ రీడింగ్ నాకు ఓ సవాల్ లాంటిది. ఎన్ని తప్పులు కనిపెట్టినా మరి కొన్ని కొత్తగా కనిపిస్తాయి. అందుకే మిత్రుల సహాయం తీసుకుంటాను. ఒకటికి ఆరుసార్లు చెక్ చేసుకుంటాను. తప్పులు తగ్గించడానికి ప్రయతిస్తాను. అదే నాకు సమస్య. మిగతా అనుభవాలు నా ఆధీనంలోనివే.

ప్రశ్న13. ఈ పుస్తకానికి పాఠకాదరణ ఎలా ఉంది? ఈ పుస్తకానికి ఏవైనా బహుమతులు/పురస్కారాలు వచ్చాయా?

జ: ఈ పుస్తకాన్ని చదివి కే.వి.రమణాచారి గారు, భువనచంద్ర గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించడం ఓ విశేషం.

‘నా పుస్తకం ప్రణాళిక’ ద్వారా గ్రంథమాల సభ్యులకు పంపడానికి 150 కాపీలు కొనడానికి ముందుకు వచ్చారు హిందూపురం కల్లూరు రాఘవేంద్రరావు గారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వారు టాక్ ది బుక్ కార్యక్రమంలో ఈ పుస్తకంపై గంటసేపు సమీక్షా కార్యక్రమం నిర్వహించడం చెప్పుకోదగ్గ విషయం.

పుస్తకం మార్కెట్ లోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. కాబట్టి పురస్కారాలు అందుకోవడానికి మరికొంత కాలం అవసరమవుతుంది. పుస్తకంలో సత్తా ఉంటే ఎవరో ఒకరు గుర్తిస్తారనేది నా అనుభవసారం.

ప్రశ్న14. కథకుడిగా, బాలసాహితీవేత్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఏవైనా కొత్త పుస్తకాలు సిద్ధమవుతున్నాయా?

జ: నా 18వ పుస్తకం ‘మీది తెనాలి-మాది తెనాలి’ [ఇరవై కొసమెరుపు కామెడీ కథల సంపుటి] ప్రచురణకు సిద్ధంగా ఉంది.

అలాగే కుంటోళ్ళ కొట్టం [బాలల హాస్య నవల], తమసోమా జ్యోతిర్గమయ [ఆధ్యాత్మిక కథలు] పుస్తకాలు వచ్చే ఏడాది వెలుగులోకి రానున్నాయి.

అలాగే నావి చిన్నా పెద్దాకథలు 600 దాకా ప్రచురింపబడ్డాయి. ఎప్పటికైనా వెయ్యి కథలు పూర్తి చెయ్యాలని నా ప్రణాళిక.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారు.

ఆర్. సి. కృష్ణస్వామిరాజు: ప్రతి దశలోనూ నన్ను ప్రోత్సహిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇందుమూలముగా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

***

జక్కదొన (కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 167
వెల: ₹ 140/-
ప్రతులకు:
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ఫోన్ 9393662821
ఆన్‌లైన్‌లో
https://www.telugubooks.in/products/jakkadona

 

~

‘జక్కదొన’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/jakkadona-book-review-kss/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here