మరుగునపడ్డ మాణిక్యాలు – 105: వంశవృక్షం

0
4

[సంచిక పాఠకుల కోసం ‘వంశవృక్షం’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

ధర్మం కోసం మనిషి బతకాలా లేక మనిషి కోసం ధర్మం నడవాలా? ఇదే ‘వంశవృక్షం’ (1980) లోని ముఖ్యమైన ప్రశ్న. ధర్మాన్ని, సంప్రదాయాన్ని కాపాడటానికి మనిషి బతకాలని శ్రీనివాసాచార్యులు అంటాడు. కానీ ఆ ధర్మాన్ని ఎవరు నిర్ణయిస్తారు? మనుస్మృతి పేరు చెప్పి ఎన్నో దారుణాలు జరిగాయి. అసలు మనుస్మృతి కలియుగానికి ఉద్దేశించినది కాదు. కలియుగంలో పాటించవలసినది పరాశర స్మృతి. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని ప్రకృతిధర్మాలు అన్ని ధర్మాలకీ అతీతంగా ఉంటాయి. వాటిని కాదంటే జీవితాలు నాశనమవుతాయి. ధర్మం పేరుతో జీవితాలని నాశనం చేసినవారు పాపం చేసినట్టే. అయితే ఈ చిత్రంలో క్రూరమైన పాత్రలు లేవు, ధర్మసూక్ష్మాలు అర్థం చేసుకోలేని పాత్రలు తప్ప. ఈ చిత్రానికి మూలం ఎస్.ఎల్.భైరప్ప రాసిన కన్నడ నవల. తెలుగుదనంతో తెరకెక్కించినది బాపు-రమణ. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.

గోదావరి తీరంలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు శ్రీనివాసాచార్యులు. ఆస్తిపరుడు. ఆయనకి ఒక్కడే కొడుకు. కోడలు సరస్వతి. మనవడికి సంవత్సరం నిండకుండానే కొడుకు పడవ ప్రమాదంలో మరణిస్తాడు. శ్రీనివాసాచార్యులు “భగవద్గీత చదివాను. అర్థమయిందనుకున్నాను. కానీ ఈ దుఃఖం ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు” అని భగవంతుడికి చెప్పుకుంటాడు. గుండె దిటవు చేసుకుంటాడు. భగవద్గీత చదవటం వేరు. ఆచరించటం వేరు. సుఖదుఃఖాలని సమానంగా చూడటమే భగవద్గీత సందేశం. శ్రీనివాసాచార్యులు భార్య కావేరి కొడుకు మరణంతో దేవుడిని నిందిస్తుంది. ఆయన వారిస్తాడు. కోడలిని కూడా సముదాయిస్తాడు. అయితే చిన్నవయసులో వైధవ్యం ఎవరికైనా బాధే. మూడేళ్ళు ఆ బాధని భరించిన సరస్వతి ఆ బాధని మరచిపోవటానికి కాలేజీలో చేరతానంటుంది. కావేరి ఒప్పుకోదు. కానీ శ్రీనివాసాచార్యులు ఒప్పుకుంటాడు. భార్యని కూడా ఒప్పిస్తాడు. ఆయన సహృదయత ఇక్కడే తెలుస్తుంది. కాలంతో పాటు మారే గుణం ఉంది.

‘వంశీకృష్ణా, యదువంశీ కృష్ణా’ అనే పాట చిత్రం మొదట్లోనే వస్తుంది. అందులో ఒక చరణమిది:

“ప్రాణులందరూ వేణువులే

అవి పలికేది నీ రాగములే

పాడేది పాడించేది, ఆడేది ఆడించేది

ఓడేది ఓడించేది, అంతా నీవేలే

అన్నీ నీ లీలలే”

జీవులందరూ భగవంతుని చేతిలో బొమ్మలే. వాక్కు ఆయన రూపమే. నడక ఆయన ప్రసాదమే. అంతే కాదు ఈ సుఖదుఃఖాలన్నీ అనుభవించేది కూడా ఆయనే. మనమే ఏదో సాధించేశామని, మనమే ఏదో పోగొట్టుకున్నామని అనుకుంటూ ఉంటాం. ఈ కర్తృత్వ భావననీ, భోక్తృత్వ భావననీ వదులుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అలవోకగా ఈ చరణంలో చెప్పారు డా. సి. నారాయణరెడ్డి. ఇక ముళ్ళపూడి వెంకటరమణ మాటల గురించి చెప్పేదేముంది? ఒక ప్రొఫెసర్ గారు శ్రీనివాసాచార్యులని గురువుగా భావిస్తాడు. వారి కుటుంబానికి కావలసినవాడు. సరస్వతిని కాలేజీకి పంపించమంటాడు. కావేరి “ఈ ఇంటి కోడలు రోడ్డెక్కి నడవటమా? ఏరు దాటి ఇంకో ఊరు వెళ్ళటమా?” అని నోరు నొక్కుకుంటుంది. అందుకు ఆ ప్రొఫెసర్ “మీరు కాశీ రామేశ్వరం వెళితే రోడ్డు మీద నడవరా? లాంచీ ఎక్కి గోదావరి దాటరా? మాబోటి వాళ్ళకు కాలేజీలే కాశీ రామేశ్వరాలు” అంటాడు. ఎంత ఉదాత్తమైన భావన! ఇక్కడ కావేరి ‘రోడ్డెక్కటం’ అంటే ప్రొఫెసర్ ‘రోడ్డు మీద నడవటం’ అంటాడు. ఆమె ‘ఏరు’ అని నదిని కించపరిస్తే ప్రొఫెసర్ ‘గోదావరి’ అని నది పవిత్రతని గుర్తుచేస్తాడు. తనకి నచ్చకపోతే ఏ మాటనైనా వక్రీకరించే మానవస్వభావం ఇక్కడ బయటపడుతుంది. తర్వాత ఒక సందర్భంలో ఒక పాత్ర “ఎందరో మహానుభావులయితే ఇంకెందరో మామూలుభావులు” అంటుంది. రమణ గారి చమక్కులివి. రమణ రచన, బాపు దర్శకత్వం ఏది బంగారమే, ఎది తావియో తెలియనంతగా కలిసిపోయి గుబాళించాయి. కాలేజీకి వెళ్ళేటపుడు సరస్వతి అత్తమామల పాదాలకి నమస్కరిస్తుంది. అది చూసి నాలుగేళ్ళ మనవడు తాతగారికి నమస్కరిస్తాడు. ఇది బాపుగారి పరిశీలనాశక్తి. పిల్లలు మనం చెప్పినట్టు చేయరు, మనం చేసినట్టు చేస్తారు.

ప్రొఫెసర్ గారి తమ్ముడు శేషశాయి (ముద్దుపేరు శేషు) కాలేజీలో లెక్చరర్. అభ్యుదయభావాలు కలవాడు. అతను సరస్వతి సౌమ్యతకి ఆకర్షితుడవుతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆమెని నవ్విస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి సరస్వతి కూడా అతనికి ఆకర్షితురాలవుతుంది. కానీ అతను సరదా కోసం తన వెంటపడుతున్నాడని సంఘర్షణ పడుతుంది. అతను పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆమెలో ఆశ పుడుతుంది. మామగారు సహృదయుడు. ఒప్పుకుంటాడని ఆయనకి ఉత్తరంలో తన కోరిక వెల్లడిస్తుంది. ఆయన “దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. అన్నీ వారి వారి పూర్వజన్మ పాపపుణ్య ఫలాఫలాలు. మనం గోదావరికి ఎంత చెంబు తీసుకెళితే అన్ని నీళ్ళే వస్తాయి. ఇప్పుడు నీకు తల్లి బాధ్యత ఒక్కటే మిగిలింది” అంటాడు. సరస్వతి తర్జనభర్జన పడుతుంది. చివరికి శేషుని పెళ్ళి చేసుకోవటానికే నిర్ణయించుకుంటుంది. బిడ్డని ఇంట్లో వదిలి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటుంది.

పెళ్ళి జరిగినపుడు ఊళ్ళో లేని ప్రొఫెసర్ తిరిగి వచ్చాక శ్రీనివాసాచార్యులను కలుస్తాడు. “తెలిసి ఉంటే అడ్డుపడేవాడిని. ఈ వయసులో కన్నబిడ్డలా మిమ్మల్ని సేవించకుండా ఆమె మీకు దూరమై మనస్తాపం కలిగించటం నాకెంతో బాధగా ఉంది” అంటాడు. శ్రీనివాసాచార్యులు “మనకి కొందరు చనిపోయి దూరమవుతారు. కొందరు బతికుండే దూరమవుతారు. మా అబ్బాయి ఈ వయసులో నన్ను విడిచిపెట్టు పరలోకం వెళ్ళాడు. అతడి మీద కోపం తెచ్చుకోగలనా? ఈ అమ్మాయికి తన జీవితం తనకి నచ్చినట్టు దిద్దుకునే హక్కు ఆమెకుంది. చాటుగా తప్పు చేయకుండా ధైర్యంగా పెళ్ళిచేసుకున్నందుకు నాకు ఆమె మీద ఎంతో గౌరవం. ఇంతకీ ఇతరుల తప్పొప్పులు ఎంచే అధికారం నాకు లేదు” అంటాడు. ఈ సన్నివేశం చివరలో జాగ్రత్తగా గమనిస్తే గీతోపదేశం ఫొటో నేపథ్యంలో కనిపిస్తుంది. మానావమానాలను సమానంగా చూసే శ్రీనివాసాచార్యుల స్థితప్రజ్ఞతకి ఇది సూచన.

ఇక్కడ చిత్రంలో వచ్చే రెండు ఉపకథలు చెప్పుకోవాలి. మొదటిది ప్రొఫెసర్ కథ. అతనికి భార్య, కొడుకు ఉంటారు. ధర్మశాస్త్రం మీద పరిశోధన చేసి గ్రంథసంపుటి వెలువరించాలని కృషి చేస్తుంటాడు. అతనికి శ్రీలంక నుంచి వచ్చిన కరుణ అనే ఒక యువతి సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె బౌద్ధమతం మీద పీహెచ్‌డీ చేస్తుంటుంది. ప్రొఫెసర్ ఆమెని ప్రేమిస్తాడు. పెళ్ళి కూడా చేసుకుంటాడు. అతని మొదటి భార్య బాధపడుతుంటే శేషు ఆమెని ఊరడిస్తాడు. “నీది రుక్మిణి హోదా. సత్యభామలెందరొచ్చినా నీ హోదాకి ఢోకా లేదు” అంటాడు. రెండో ఉపకథ శ్రీనివాసాచార్యులదే. ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. అతనికి కొడుకు పుట్టాక అతని భార్య సంసారజీవితానికి పనికిరాదని డాక్టర్లు చెబుతారు. అతని మామగారు అతనికి తన చిన్న కూతురినిచ్చి పెళ్ళి చేయాలని ప్రయత్నిస్తాడు. శ్రీనివాసాచార్యులు ఒప్పుకోడు. వారి ఇంట్లో లక్ష్మి అనే పనిమనిషి ఉంటుంది. ఆమెని భర్త వదిలేశాడు. కావేరి ఆమెని తన భర్తని సుఖపెట్టమని అడుగుతుంది. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతానంటుంది. అయినా శ్రీనివాసాచార్యులు నిగ్రహంగా ఉంటాడు. ఇలాంటి పాపం చేస్తే పితృదేవతలు క్షోభపడతారని ఆయన బ్రహ్మచర్యం పాటిస్తాడు. మరో స్త్రీని పెళ్ళి చేసుకున్న ప్రొఫెసర్ సరస్వతిని తప్పుపట్టాడు. నిగ్రహంగా బ్రహ్మచర్యం పాటించిన శ్రీనివాసాచార్యులు సరస్వతి స్వాతంత్ర్యాన్ని సమర్థించాడు. నిజానికి ప్రొఫెసర్ సరస్వతిని సమర్థించాలి, శ్రీనివాసాచార్యులు ‘నేను నిగ్రహంగా ఉన్నప్పుడు ఆమె ఉండలేకపోవటమేమిటి?’ అని ప్రశ్నించాలి. తన దాకా వచ్చి కోరిక ఎంత బలీయమైనదో తెలిసినా ప్రొఫెసర్ అలా మాట్లాడటం అతని డొల్లతనం. ‘ఇతరుల గురించి తీర్పు చెప్పే అధికారం నాకు లేదు’ అనటం శ్రీనివాసాచార్యుల గొప్పతనం.

అయితే ప్రొఫెసర్ అవసానదశలో మొదటి భార్య దగ్గరకి తిరిగివస్తాడు. “ధర్మశాస్త్రం గురించి అధ్యయనం చేశాను కానీ నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను. నీకు అన్యాయం చేశాను” అంటూ ప్రాణాలు వదులుతాడు. వయసు వేడిలో భార్యని, బిడ్డలని వదిలేవారి కన్నా ధర్మాన్ని నిలబెట్టాలనుకునేవారే కొన్నిసార్లు మిన్న అనిపిస్తుంది. అయితే ధర్మం వేరు, ధర్మసూక్ష్మం వేరు. ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ఒక ఉదాహరణ చెబుతారు. తండ్రి మాట పాటించటం ధర్మం. ఆ తండ్రి తాగుబోతు అయితే? మద్యం తెమ్మంటే? అక్కడ ధర్మసూక్ష్మం ఏమిటంటే హానికరమైన తండ్రి మాటను పాటించనక్కరలేదు. శ్రీనివాసాచార్యులు వంశగౌరవం కోసం సరస్వతి కోరిన ఒక కోరికని కాదంటాడు. కఠినంగా ఉండడు, కానీ ధర్మసూక్ష్మాన్ని విస్మరిస్తాడు. చివరికి తను నమ్ముకున్న ధర్మం పునాదులే బలహీనంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈలోపు జీవితాలు నాశనమైపోతాయి.

ఈ చిత్రానికి బాబా ఆజ్మీ ఛాయాగ్రహణం మరో హైలైట్. కెమెరా యాంగిల్స్ పెట్టటంలోనే కథని మరింత లోతుగా చెప్పటం ఆకట్టుకుంటుంది. దీనికి బాపు స్టోరీబోర్డులే ముఖ్యకారణం. సరస్వతి మొదటిసారి కాలేజీకి వెళ్ళేటపుడు ఆమె లోపలి గదిలో నుంచి బయటి గదిలోకి వచ్చి అత్తమామలకి నమస్కరిస్తుంది. తర్వాత కెమెరా యాంగిల్ మారి ప్రేక్షకులు లోపలి గది నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. ఇల్లే పదిలం అన్నట్టు. తల్లి బయటకు వెళుతుంటే పిల్లవాడు అటు నుంచి తల్లి వైపుకి వస్తాడు. తల్లి కోసం వస్తున్నాడనుకుంటాం. కానీ తల్లిని దాటి తాత దగ్గరకి వచ్చి నమస్కరిస్తాడు. స్క్రీన్‌ప్లే, కెమెరా, దర్శకత్వం అన్నీ సమపాళ్ళలో కలిసి సంప్రదాయం, ఆధునికతల ఘర్షణని కళ్ళకి కడతాయి. శ్రీనివాసాచార్యుల ఇల్లు గురించి కూడా చెప్పుకోవాలి. ఐశ్వర్యానికి, సంప్రదాయానికి నెలవులా ఉంటుంది. పెద్ద స్తంభాలు, ఇంటిలోపలి గచ్చుపై ముగ్గులు, గోడలపై దేవుళ్ళూ, పూర్వీకుల పటాలు, ద్వారబంధంపైన నిలబెట్టిన దశావతారాల బొమ్మలతో శోభిల్లుతూ ఉంటుంది.

శ్రీనివాసాచార్యులుగా జె.వి.సోమయాజులు, సరస్వతిగా జ్యోతి, శేషుగా అనిల్ కపూర్, కావేరిగా ఝాన్సీ, ప్రొఫెసర్‌గా కాంతారావు, లక్ష్మిగా డబ్బింగ్ జానకి నటించారు. శంకరాభరణం, వంశవృక్షం, సప్తపది చిత్రాలలో పాత్రలు పోషించటానికే జె.వి.సోమయాజులు పుట్టారేమో అనిపిస్తుంది. డబ్బింగ్ జానకి కూడా ఈ చిత్రాలన్నిటిలో పాత్రలు పోషించింది. శంకరాభరణంలో ఛాందసురాలిగా, సప్తపదిలో ఇంట్లో నలిగిపోయే కోడలిగా, అత్తగా నటించింది. ఈ చిత్రంలో ఉదాత్తమైన పనిమనిషి పాత్ర పోషించింది. శ్రీనివాసాచార్యులని ‘శీనయ్యా’ అని పిలుస్తుంది. ‘నువ్వు’ అని సంబోధిస్తుంది. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి పెరిగారని చెప్పకనే చెప్పారు. చివరికి కథలో మలుపు ఆమె పాత్ర వల్లే వస్తుంది. జ్యోతికి ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ తెలుగు నటిగా అవార్డు వచ్చింది. చిత్రం రెండో భాగంలో ఆమె నటన కన్నీరు పెట్టిస్తుంది. బాపు చిత్రాలలో ఆస్థాననటుడు కాంతారావు ఈ చిత్రంలో నెగటివ్ ఛాయలున్న పాత్రని అవలీలగా పోషించారు. బాపు చిత్రాలలో తరచు కనపడే ముక్కామల ఈ చిత్రంలో సరస్వతి తండ్రి పాత్ర పోషించారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మారుమనువు చేసుకున్న కూతుర్ని తప్పుపట్టే పాత్ర ఇది. సమాజంలో ఉన్న హిపోక్రసీకి ప్రతినిధి ఈ పాత్ర. ఈ చిత్రంలో అనిల్ కపూర్ మాత్రమే నటనాపరంగా కొంచెం బలహీనంగా కనపడతాడు.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

పెళ్ళయిన కొన్నాళ్ళకి సరస్వతికి కొడుకు మీదకి ధ్యాస తిరుగుతుంది. కొడుకుని తెచ్చుకుంటానని అంటుంది. శేషు ఒప్పుకుంటాడు. శ్రీనివాసాచార్యులతో మాట్లాడటానికి తానూ వస్తానంటాడు. ఆమె వారించి ఒంటరిగా వెళుతుంది. ఆమెని అత్తగారు ఆడిపోసుకుంటుంది. తండ్రి తూలనాడతాడు. ఆస్తి కోసమే వచ్చిందని అంటాడు. శ్రీనివాసాచార్యులు అందరినీ లోపలికి పంపి తాను మాట్లాడతాడు. “నువ్వు ఆస్తి కోసం రాలేదని నాకు తెలుసు. నాకు కొడుకు పోయాడు. మరొకడు పుట్టడు. నీకు భర్త పోయాడు. అయినా మరో భర్త దొరికాడు. పిల్లలు పుడతారు. నాకు మనవడు దూరమైతే మా వంశవృక్షం ఇంతటితో అంతరించిపోతుంది” అంటాడు. “గోదావరికి మనం ఎంత పాత్ర తీసుకువెళితే అంతే నీరు దక్కుతుందని మీరు నాకోసారి చెప్పారు” అంటుంది సరస్వతి. అంటే ‘మీ కర్మఫలం అలా ఉంటే మీకంతే ప్రాప్తం’ అని అర్థం. శ్రీనివాసాచార్యులు ఖంగుతింటాడు. ఆమె వెంటనే మన్నించమంటుంది. ఆయన “నేను తీసుకెళ్ళిన పాత్రలో ఈ ఫలం తప్పకుండా ఉందని నా నమ్మకం” అంటాడు. అంటే ఆయన కర్మల మీద ఆయనకంత నమ్మకం. ఇదీ ఒక అహంకారమే. తన బ్రహ్మచర్యదీక్షపై అహంకారం కావచ్చు. మళ్ళీ “సృష్టికి బీజం, క్షేత్రం రెండూ అవసరమే. అయినా జన్మించే మొక్క బీజాన్ని బట్టి ఉంటుంది. మా అబ్బాయి ఈ కుటుంబానికి చెందినవాడు. అతని బిడ్డ ఈ కుటుంబానికి చెందినవాడవుతాడు. ఈ కుటుంబంలో ఉంటే నీకు కొడుకుపై అన్ని హక్కులూ ఉంటాయి. వేరే కుటుంబానికి వెళితే వాడినీ, వాడి ఆస్తినీ తీసుకువెళ్ళే అధికారం నీకు లేదు” అంటాడు. ఆమె మళ్ళీ తనకి ఆస్తి వద్దని అంటుంది. “నీ జీవితాన్ని నువ్వు దిద్దుకున్నట్టే వాడి జీవితాన్ని వాడూ దిద్దుకుంటాడు. వాడికా జ్ఞానం వచ్చేవరకు వాడు పుట్టినచోట వాడికి లభించే చదువు సంస్కారంతో పాటు వాడి ఆస్తిని కూడా కాపాడి వాడికి అప్పజెప్పటం కన్నవాళ్ళ ధర్మం” అంటాడాయన. సరస్వతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆయన “అయినా ధర్మం వేరు, చట్టం వేరు. చట్టపరంగా నీ బిడ్డ మీద నీకే హక్కు. నేను నీకు అడ్డు చెప్పను. నేను చెప్పింది ఆలోచించి నీకు బిడ్డను తీసుకెళ్ళాలనిపిస్తే తీసుకెళ్ళు” అంటాడు. ఆమె బిడ్డను తీసుకెళ్ళకుండానే వెళ్ళిపోతుంది.

బిడ్డ తండ్రి కుటుంబానికి చెందుతాడనేది ధర్మం. కానీ తండ్రి లేకపోతే తల్లికి చెందుతాడు. ఇది ధర్మసూక్ష్మం. మహాభారతంలో భార్యకి వేరేవారి వల్ల పుట్టినవారిని కూడా సొంత కొడుకులా భావించాలని చెబుతారు. దోషముంటే తల్లిది. బిడ్డది కాదు కదా? ఇక్కడ తల్లి దోషం కూడా ఏమీ లేదు. ఇది మరచి శ్రీనివాసాచార్యులు వంశం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మధ్యలో వచ్చిన పట్టింపులు. సంప్రదాయం ముఖ్యం కానీ వంశం ప్రాధాన్యం ఏమిటి? సంప్రదాయాన్ని కాపాడాలంటే శిష్యులకి బోధించవచ్చు. మనవడికే బోధించాలని ఎక్కడుంది? ఇదంతా అహంకారమే. మమకారం కూడా కాదు. ‘వీడు నా బీజం. నేను పోయాక నా బీజం కొనసాగుతుంది’ అనే అహంకారం. తల్లి నుంచి బిడ్డని వేరు చేయటం పాపమనే ఆలోచన కూడా రానీయకుండా చేస్తుంది. శ్రీనివాసాచార్యులు మనవడిని సద్బ్రాహ్మణుడిగా చేయాలని అనుకోవటం మంచిదే. కానీ తల్లి నుంచి వేరు చేసే అధికారం ఆయనకి లేదు. అది ఆయనకీ తెలుసు. కానీ ధర్మమీమాంస చేసి ఆమెని అపరాధభావానికి లోను చేశాడు. ఆమె కాలేజీకి వెళతానంటే ఆయన వద్దనలేదు. అలాగే బిడ్డని తీసుకెళతానంటే మారుమాటాడకుండా అప్పగించటం సిసలైన ధర్మం. దానికి ఆయన అహంకారం అడ్డొచ్చింది. అది అహంకారమని ఆయనకి తెలియదు. అదే ధర్మమని నమ్మాడు. సమాజం అలా నమ్మేలా చేసింది. ఆయన సరస్వతితో ఒక మాట అంటాడు. “రేపు నీ కొడుకు ‘నన్ను నా ఇంటికీ, ఆస్తికీ ఎందుకు దూరం చేశావ’ని ప్రశ్నిస్తే? నిన్ను ద్వేషిస్తే?” అంటాడు. రేపు మనవడు ‘నా తల్లి నుంచి నన్నెందుకు వేరు చేశారు?’ అని ప్రశ్నిస్తే ఈయనేం చేస్తాడు? సత్యనిష్ట కలవాడు కాబట్టి నిజమే చెబుతాడు. అప్పుడు మనవడు ద్వేషించడా?

తర్వాత సరస్వతి మూడుసార్లు గర్భం ధరిస్తుంది. కానీ అన్నిసార్లూ ఆమెకి గర్భస్రావం అయిపోతుంది. “నా బిడ్డకి తల్లిప్రేమ లేకుండా చేశాను. అందుకే నా బిడ్డలు నా ముఖం చూడట్లేదు” అని ఆమె శోకిస్తుంది. ఆమెకి గర్భసంచీ తొలగించాల్సి వస్తుంది. శేషు ఆమెని ఊరడిస్తాడు. ఆమెని కాలేజీలో లెక్చరర్‌గా చేరమంటాడు. ఆమె చేరుతుంది. కొన్నేళ్ళకి అక్కడికి ఆమె కొడుకు కృష్ణ చదువుకోవటానికి వస్తాడు. అతనెవరో తెలిసి ఆమె మాతృహృదయం తల్లడిల్లుతుంది. అప్పటికే అతనికి తన తల్లి గురించి నలుగురూ అనే మాటలు తెలుస్తాయి. చిన్నవయసులోనే ఒకసారి “మా అమ్మ రెండో నాన్న దగ్గరకి వెళ్ళిపోయిందా?” అని తాతగారిని అడుగుతాడు. ఆయన “అలాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు” అంటాడు. కృష్ణ కాలేజీలో చేరాక ఒకసారి సరస్వతి అతన్ని ఇంటికి తీసుకువస్తుంది. “మాకు తెలిసినవాళ్ళకి మీ కుటుంబం గురించి తెలుసట. మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉందట. పిలిపించనా?” అంటుంది. అతనికి ఆమే తన తల్లి అని అప్పటికే అర్థమవుతుంది. అయినా “మా అమ్మ లేదు” అని వచ్చేస్తాడు. ఆమె కుప్పకూలిపోతుంది. ఏ కుటుంబంలో ఏం జరిగినా మొదట క్షోభపడేది స్త్రీలే.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

కొడుకు తిరస్కరించటంతో సరస్వతి మనోవేదనతో మంచం పడుతుంది. డాక్టర్లు ఆమె మనసుకైన గాయం మానితే కానీ బతకదని చెప్పేస్తారు. మరో పక్క శ్రీనివాసాచార్యులు తన తండ్రి గారి తద్దినానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మనవడు అడిగితే తమ వంశవృక్షం పటం చూపించి పన్నెండు తరాల వారి పేర్లు చెబుతాడు. ఇంతలో పటం జారిపడి అద్దం పగిలి ఒక ఉత్తరం బయటపడుతుంది. అది శ్రీనివాసాచార్యుల తండ్రి రాసిన ఉత్తరం. అందులో “కొడుకు పుడితే పెద్ద ఆస్తి కలిసివస్తుందన్న ఆశతో నా భార్య హరికథల శ్యామదాసుతో కలిసి చేయరాని పాపం చేసింది. ఇంతటితో ఈ వంశం అంతరించిపోతోంది. రేపామెకి పుట్టే బిడ్డ నన్ను నాన్నా అని పిలిస్తే పలకలేను. ఈ నరకం భరించలేను. మరణమొక్కటే మార్గంగా కనిపిస్తోంది. భగవంతుడా! ఈ నిజాన్ని ఎలా ఎప్పుడు వెల్లడి చేస్తావో నీదే భారం” అని ఉంటుంది. కింద శ్రీనివాసాచార్యులు తండ్రి సంతకం ఉంటుంది. కుటుంబగౌరవం మట్టిపాలు కాకూడదని ఒక వంక, నిజం దాచకూడదని ఒక వంక ఆలోచించి ఉత్తరం రాసి పటంలో దాచాడాయన. ఆ ఉత్తరం బయటపడేయటం దేవుడి భారం. దేవుడి మీద అంత నమ్మకం. కొన్నిసార్లు మన కర్తవ్యం మనం చేసి మిగతాది దేవుడికి వదిలేయాలి.

ఆ ఉత్తరం చదివి శ్రీనివాసాచార్యులు మ్రాన్పడిపోతాడు. పనిమనిషి లక్ష్మి కుటుంబం తరతరాలుగా ఆ ఇంట్లోనే పనిచేశారు కాబట్టి లక్ష్మి తల్లికి విషయం తెలుసేమోనని, లక్ష్మికి చెప్పిందేమోనని లక్ష్మిని అడుగుతాడు. ఆమెకి విషయం తెలుసు. చెప్పటానికి భయపడుతుంది. ఒట్టేయించుకుని చెప్పమంటాడు. శ్రీనివాసాచార్యులు తండ్రికి చాలా కాలం పిల్లలు కలగలేదు. వారి దాయాదికి ఆస్తి ఉంది కానీ సంతానం లేదు. వీరికి కొడుకు పుడితే ఆస్తి వస్తుందని వీరి ఆశ. మరో పక్క శ్యామదాసు అనే ఆయన హరికథలు బాగా చెబుతాడని శ్రీనివాసాచార్యుల తండ్రి అతనికి ఆశ్రయం ఇచ్చాడు. ఒకరాత్రి ఆయన ఊళ్ళో లేనప్పుడు శ్యామదాసు “నీకు కొడుకు పుడితే లక్షల ఆస్తి వస్తుంది. లేకపోతే నీ భర్త మారుమనువు చేసుకుంటాడు. నన్ను సంబంధాలు చూడమన్నాడు” అని శ్రీనివాసాచార్యుల తల్లిని లొంగదీసుకున్నాడు. ఇది లక్షి అవ్వ చూసింది. ఆమె ద్వారా లక్ష్మి తల్లికి, తల్లి ద్వారా లక్ష్మికి ఈ రహస్యం తెలిసింది. తర్వాత శ్రీనివాసాచార్యుల తల్లి గర్భవతి అయింది. అది తెలిసి శ్యామదాసు ఆమెతో చులకనగా మాట్లాడుతుంటే అమె భర్త విని అతన్ని వెళ్ళగొట్టాడు. అంటే శ్రీనివాసాచార్యుల పుట్టుకకి కారణమైన బీజం ఆ కుటుంబానికి చెందినది కాదు. లక్ష్మి ఈ కథ చెప్పగా ఆయన చేష్టలుడిగి ఉండిపోతాడు. లక్ష్మి “నువ్వు దేవుడిని శీనయ్యా. నిన్నే మైలా అంటదు” అంటుంది. మనిషి గుణాన్ని బట్టి, కర్మలని బట్టి అతని స్థాయిని నిర్ణయించాలి, బీజాన్ని బట్టి కాదు. అది లక్ష్మికి తెలిసినంతగా ఇతరులకి అర్థం కాదు. ఆ రకంగా లక్ష్మి ఉన్నతురాలు.

చివరికి శ్రీనివాసాచార్యులు సరస్వతి ఇంటికి వెళతాడు. శేషు గుమ్మంలో ఎదురుపడతాడు. అతను ‘మీవల్లే నా భార్య మనోవ్యాధితో మంచం పట్టింది’ అనవచ్చు. కానీ అతను సంస్కారవంతుడు. “నేను తెలియకుండా తమని, తమ కుటుంబాన్ని చాలా క్షోభపెట్టాను. నన్ను క్షమించండి” అని పాదాభివందనం చేయబోతాడు. తన బాధ కన్నా ఇతరుల బాధని పట్టించుకునేవాడే మనీషి. శ్రీనివాసాచార్యులు “నాకు అన్నీ తెలుసునన్న అజ్ఞానంతో నేను అపరాధం చేశాను” అంటాడు. సరస్వతి దగ్గరకి వెళ్ళి “వంశం, క్షేత్రం, బీజం అంటూ చెయ్యరాని పాపం చేశాను. తల్లినీ, బిడ్డనీ వేరు చేసి నిన్ను నరకయాతన పెట్టాను. నన్ను నేను క్షమించుకోలేను” అంటాడు. కృష్ణ వస్తాడు. శ్రీనివాసాచార్యులు “ఆమే మీ అమ్మ” అని చెప్పి అతని చేత ఆమెకి తులసితీర్థం ఇప్పిస్తాడు. సరస్వతి కొడుకుని చూసుకుంటూ మరణిస్తుంది. ‘ధర్మమార్గమే వంశవృక్షం, దాని మూలం మానవత్వం’ అనే సందేశంతో చిత్రం ముగుస్తుంది.

వంశం ముఖ్యం కాదు అని చెప్పటానికి కొంచెం ఘాటైన పద్దతినే ఎంచుకున్నారు ఈ చిత్రంలో. కానీ ఆలోచిస్తే వంశం అని చెప్పుకునే దాంట్లో మూడు నాలుగు తరాల కింద ఎవరున్నారో కూడా మనకి తెలియదు. కాబట్టి వంశం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మంచి చేయటమే మన విధి. ధర్మమని చెప్పేదాంట్లో కూడా ఎన్నో అంధవిశ్వాసాలున్నాయి. కొన్ని కాలాన్ని బట్టి మారతాయి. ప్రాచీనకాలంలో ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అనేవారు. అప్పట్లో జనాభా తక్కువుండేది కాబట్టి జనసంతతి పెరగటానికి అలా చెప్పారు. అందులో మళ్ళీ ‘అపుత్రః’ అంటే సంతానం లేనివారనే అర్థం, కొడుకుల్లేనివారని కాదు. దాన్ని ఇప్పటికాలానికి వర్తింపజేసి ‘కొడుకులుండాలి’ అని పట్టుబట్టటం మూర్ఖత్వం. ఇప్పటికే జనాభా బాగా పెరిగిపోయింది. శ్రీనివాసాచార్యులు కూడా ‘నా మనవడు నాకే చెందాలి’ అనకుండా ‘సత్సంప్రదాయం కొనసాగాలి’ అనుకుంటే శిష్యులకి విద్యాదానం చేసేవాడు. కృష్ణకి తల్లిప్రేమ దక్కేది. సరస్వతి ఆనందంగా ఉండేది. దాని వల్ల శేషు జీవితం పచ్చగా ఉండేది. వంశమనే పట్టింపు వల్ల ఇన్ని జీవితాలు బుగ్గిపాలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here