మహాభారత కథలు-86: అర్జునుడి క్షేమవార్త చెప్పిన రోమశమహర్షి

0
2

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అర్జునుడి క్షేమవార్త చెప్పిన రోమశమహర్షి

[dropcap]ధ[/dropcap]ర్మరాజు పురోహితుడు ధౌమ్యుణ్ని చూసి “విసుగు విరామం లేకుండా మా అందరిని ప్రేమగా చూసుకునే పరాక్రమశాలి అర్జునుణ్ని దివ్యాస్త్రాలు సంపాదించడానికి పంపించాను. ఇప్పుడు అతడు లేని ఈ కామ్యకవనం నచ్చడం లేదు. మేఘాల కోసం చూసే చాతకపక్షుల్లా మనమందరం అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నాం. అర్జునుడు తను చేయాలనుకున్న పనిని వదిలి వెనక్కి రాడు. అర్జునుడు తప్పకుండా దేవతా సంబంధమైన అస్త్రాల్ని సంపాదించుకునే వస్తాడు. అంతవరకు మనం తీర్థయాత్రలు చేద్దాం” అన్నాడు.

ధౌమ్యుడు “తీర్థయాత్రల వల్ల మేలు కలుగుతుంది. అలాగే వెడదాము” అన్నాడు.

ధౌమ్యుడితో తీర్థయాత్రల గురించి మాట్లాడుతున్న సమయంలో ధర్మరాజు దగ్గరికి గొప్ప తేజస్సుతో వెలుగుతున్న రోమశమహర్షి వచ్చాడు. ధర్మరాజు తను, తన తమ్ముళ్లు, బ్రాహ్మణులతో కలిసి అమితమైన భక్తితో రోమశమహర్షిని అర్చించాడు. తరువాత “మహర్షీ! మీరు ఎక్కడనుంచి వచ్చారు?” అని అడిగాడు.

“ధర్మరాజా! సమస్తలోకాలు చూసి ఇంద్రలోకం చూడాలని వెళ్లాను. అక్కడ దేవేంద్రుడితో పూజింపబడి అక్కడే ఉన్న నీ తమ్ముడు అర్జునుణ్ని చూశాను. శివుడు మొదలైన దేవతలందరూ తమలో తాము పోటీపడి అర్జునుడికి కోరిన వరాలు అనుగ్రహించారు.

కృతార్థుడైన కురువంశసింహుడు దేదీప్యమానమైన పరాక్రమంతో వెలిగిపోతూ దేవేంద్రుడి అర్థసింహాసనం మీద కూర్చుని ఉన్న అర్జునుణ్ని స్వర్గంలో చూశాను. బలవంతులైన భీష్ముడు మొదలైనవాళ్లని అర్జునుడు యుద్ధంలో అవలీలగా జయిస్తాడు. ఇంక యుద్ధాల్లో కర్ణుడు అర్జునుడితో సరితూగలేడు.

స్వర్గలోకంలో మిరుమిట్లుగొలిపే హొయలుతో దేదీప్యమానంగా వెలుగుతున్న అర్జునుణ్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంద్రుడు అర్జునుడి గొప్పతనాన్ని నాకు వివరిస్తూ ‘ఇతడు పరమశివుడి వలన అమృతం నుంచి ఉద్భవించిన పాశుపతం అనే దివ్యాస్త్రాన్ని; నా నుంచి; యమ, వరుణ, కుబేరుల నుంచి అనేక దివ్యాస్త్రాల్ని సంపాదించాడు.

ఇతడు కేవలం మనుష్యమాత్రుడు కాడు.. దివ్యపురుషుడు. ఇక్కడ ఇతరులకి శక్యం కాని దేవతల పనులు నెరవేర్చి త్వరలో తిరిగి భూలోకానికి వస్తాడు. నువ్వు భూలోకానికి వెళ్లి తమ్ముళ్లతో కలిసి ఉన్న ధర్మరాజుకి చెప్పు’ అని నన్ను ఆజ్ఞాపించాడు.

అంతేకాదు, దీక్షతో ఎప్పుడూ తీర్థయాత్రలు సేవించడంలో నిమగ్నులైన ప్రశాంతమైన మనస్సు కలవాళ్లకి తపస్సు చేసేవాళ్లకి చేయలేనిది అంటూ ఏదీ ఉండదు. ధర్మరాజుని వెంటనే తీర్థయాత్ర చేయించమని నన్ను పంపించాడు. ఇంద్రుడి అదేశం చొప్పున ఇక్కడికి వచ్చాను.

ఈ పని అర్జునుడికి కూడా ఇష్టమే. పరమ పవిత్రమైన తీర్థసేవనం, కపిల గోవుల్ని, బంగారాన్ని దానం చెయ్యడం, గొప్ప తపస్సు మంచి పనులు చేయడానికి ఇహపర సౌఖ్యాలు పొందడానికి వీలు కలుగుతుంది. ఇంతకు ముందే నేను భూమండలంలో ఉండే పుణ్యక్షేత్రాలు అన్నింటినీ రెండు సార్లు చూశాను. ఇప్పుడు ఇంద్రుడు అజ్ఞాపించినట్టు నీతో కలిసి మూడోసారి చూడగలను” అని చెప్పాడు.

ధర్మరాజు “మునులలో గొప్పవాడవైన రోమశమహర్షీ! దేవేంద్రుడంతటివాడు నన్ను గురించి ఆలోచించి నన్ను తీర్థయాత్రలు చెయ్యమని అదేశించడం వల్ల నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. నీవంటి మహానుభావుడు సహ్యాత్రికుడుగా నాకు తోడుగా ఉండడం ఇంకా గొప్ప విశేషం.

ఇంక పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి నీ దయవల్ల పవిత్రుణ్ని అవుతాను. అర్జునుడు కుశలంగా ఉన్నాడని నువ్వు చెప్పడం; తీర్థయాత్రలు చెయ్యమని దేవేంద్రుడు ఆదేశించడం నాకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి” అని సంతోషంతో రోమశమహర్షికి చెప్పాడు.

“మహర్షీ! ఇంతకు ముందే నారదమహర్షి, ధౌమ్యుడు చెప్పిన మాటల వల్ల తీర్థయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరాను. ఇప్పుడు నీ ప్రోత్సాహం కూడా లభించింది. ఇంక పుణ్యక్షేత్రాలు దర్శించి ధన్యుణ్నవుతాను” అన్నాడు.

తనతో ఉన్న బ్రాహ్మణుల్లో కొంతమంది ముఖ్యుల్ని మాత్రం ఉండమని చెప్పి మిగిలినవాళ్లని వెనుకకి పపించేశాడు. మూడు రోజులు కామ్యకవనంలో ఉండి మార్గశీర్షమాసం చివర కొంతమంది బ్రాహ్మణులతోపాటు, ద్రౌపదితో, తమ్ముళ్లతో కలిసి తీర్థయాత్రలకి బయలుదేరాడు.

ధర్మరాజుతో బ్రాహ్మణులు “నీ తమ్ముళ్లు ధనుర్విద్యలో ఆరితేరిన వీరులు. పవిత్రమైన ప్రవర్తన కలవాళ్లు. పొడుగు, పదును కల కత్తులు ధరించేవాళ్లు. నిర్మలమైన కీర్తి కలవాళ్లు. అటువంటివాళ్లు రక్షిస్తూ ఉండగా తేజస్వి అయిన రోమశమహర్షి మార్గదర్శకుడిగా పుణ్యక్షేత్రాలన్ని చూపిస్తూ ఉండగా నీ వెంట రావడం పూర్వజన్మ సుకృతం వల్ల మాకు కలిగిన అదృష్టం.

రాక్షసులు, పిశాచాలు, క్రూరజంతువులు సంచరిస్తూ ఉండే అడవుల్లో మా వంటివాళ్లు ఒంటరిగా తీర్థయాత్రలు చేయడం సాధ్యం కాదు. కనుక, మేము మీతోపాటు వస్తాం!” అని అర్థించారు. ధర్మరాజు వాళ్ల కోరికకి అంగీకరించాడు.

మంచిగుణాలు కలవాళ్లు, పవిత్రులు అయిన పాండవులు తీర్థయాత్రలకి వెడుతున్నారని పరాశరుడి కొడుకు వేదవ్యాసుడు, పర్వతుడు, నారదుడు సంతోషంగా చూడ్డానికి వచ్చారు.

ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి వాళ్లని అర్చించాడు. వాళ్లు ధర్మరాజుతో “దేహానికి సంబంధించిన నియమాలు మనుషులతో చేయబడే వ్రతాలు; మనసుని, బుద్ధిని శుచిగా ఉంచేవి దేవవ్రతాలు. అటువంటి వ్రతాల్ని మాత్రమే ఆచరిస్తూ  మంచి నడవడికతో తీర్థయాత్రలు చేయండి.

పుణ్యక్షేత్రాలు సందర్శించడంలో ప్రసిద్ధికెక్కిన పదిమంది సార్వభౌములు.. మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనే పూర్వపు చక్రవర్తుల్లా సమస్త లోకాల్లోని సుఖాల్ని పొందండి” అని చెప్పి నారద, పర్వత, వ్యాసమహర్షులు వెళ్లిపోయారు.

ధర్మరాజు రోమశుడితో “మహర్షీ భూలోకంలో అధర్మపరులైన దుర్జనులు అభివృద్ధిని పొందుతున్నారు. పవిత్రచరిత్ర కలిగిన ధర్మాత్ములకి భరించలేని కష్టాలు కలుగుతున్నాయి. అలా జరగడానికి కారణం ఏమిటి? అలాగే ప్రాణాలే లేని కొండలు, నదులు, సరస్సులు, ఎందువల్ల పుణ్యతీర్థాలై పాపాల్ని పోగొట్టి మనుషుల్ని పవిత్రులుగా చేయగలుగుతున్నాయి?”  అని అడిగాడు.

పాండవుల తీర్థయాత్ర

ధర్మవిశేషాలు చెప్పిన రోమశమహర్షి

“ధర్మరాజా! భూమిమీద అధర్మప్రవర్తన కలవాళ్ల అభివృద్ధి స్థిరంగా ఎక్కువ కాలం నిలవదు. వెంటనే నశించిపోతుంది. మా కళ్లముందే ఎంతోమంది అభివృద్ధి పొందిన రాక్షసులు అహంకారంతో చెలరేగి దుర్మార్గంగా ప్రవర్తించి  వేలకివేలు నశించిపోయారు కదా!

దేవతలు ధర్మప్రవర్తన కలవాళ్లు కనుకనే అభివృద్ధి పొంది నిత్యకళ్యాణ శోభతో సాటిలేని బలంతో విలసిల్లుతున్నారు. ధృతరాష్ట్రుడి కొడుకులు అధర్మప్రవర్తనతో నేడు అభివృద్ధి పొందినా వాళ్లు చేసే చెడ్డపనుల ఫలితంగా రాక్షసుల్లా తొందరలోనే నాశనం చెయ్యబడతారు.

అధర్మపరుల పతనం ఎలా జరుగుతుంది అని అడుగుతావేమో.. అధర్మప్రవర్తన కలవాళ్లలో గర్వం పుడుతుంది. గర్వం వల్ల స్వాభిమానం ఏర్పడుతుంది. దాని వల్ల కోపం వస్తుంది. కోపం వల్ల సిగ్గు పోతుంది. నడవడిక చెడిపోతుంది. సిగ్గు, మంచి నడవడిక లేనివాళ్లని నిగ్రహం, సంపద విడిచి వెళ్లిపోతాయి.

మీరు దేవతలతో సమానమైనవాళ్లు. ధర్మం కలిగిన పనుల్లో మాత్రమే పురుషకార్యం నెరపడానికి ఇష్టపడతారు. అందువల్ల యుద్ధంలో దేదీప్యమానమైన శోభతో విలసిల్లుతారు. ఘోరయుద్ధంలో శత్రువుల్ని జయిస్తారు.

ధర్మాత్ములైన దేవతలు, ఋషులు ఆశ్రయించడం వల్లనే పుణ్యక్షేత్రాలు పవిత్రాలై అన్ని కోరికల్ని తీర్చకలిగిన మహిమని కలిగి ఉన్నాయి. తీర్థయాత్రలు, యజ్ఞాలు, విప్రుల ఆశీస్సుల వల్ల ప్రజలు బాధలు నశించి మేలు పొందుతారు” అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు.

పాండవులు ఆ మహర్షి ద్వారా అనేక ధర్మసూక్ష్మాలు తెలుసుకుంటూ ప్రయాణం చేసి నైమిశం, అశ్వతీర్థం, గంగాఘోషం, కన్యాతీర్థం, గోమతి, బహుద, మహానది, దేవతలు యజ్ఞం చేసిన ప్రయాగ, గంగాయమునా సంగమం అనే తీర్థాల్లో స్నానం చేసి, ప్రయాగలో కొన్నాళ్లు నివసించి వేదవేత్తలైన బ్రాహ్మణుల ద్వారా వేదాల్లో ఉండే గొప్ప అర్థాల్ని తెలుసుకున్నారు.

ప్రయాణాలు చేస్తూ అనేక పుణ్య నదులు పుట్టిన ప్రదేశం గయపర్వతాన్ని, రామసరస్సుని, బ్రహ్మసరస్సుని, వైవస్వతతీర్థాన్ని, చూసి గయలో అక్షయవటంలో ఋషులు నిర్ణయించిన పద్ధతిలో నాలుగు నెలలు పట్టే యజ్ఞాలు చేశారు.

ఋషులు చెప్తున్న పుణ్యం కలిగించే కథలు వింటూ ఉన్న సమయంలో శమఠుడు అనే ఋషి ధర్మరాజుతో “పూర్వం ఆధూతరజుడి కొడుకు గయుడు అనే రాజర్షి ఇక్కడ బ్రహ్మసరస్సులో చేసిన యజ్ఞాలలో ప్రజలు తినగా మిగిలిన అన్నం ఇరవై అయిదు కొండలుగా గుట్టపడింది.

ఆ యజ్ఞాల్లో గయుడు ఇచ్చిన దక్షిణ సంఖ్యని, నక్షత్రాలసంఖ్యని, ఇసుకరేణువుల సంఖ్యని ఎవరూ తెలుసుకోలేరు. ఆ గయుడి పేరు మీదే విలసిల్లింది ఈ గయాక్షేత్రం, ఈ క్షేత్రం పితృదేవతలకి మిక్కిలి ప్రీతిపాత్రమయింది. ఇక్కడ పిండప్రదానం చేసినవాళ్ల కోరికలు నెరవేరుతాయి” అని గయాక్షేత్రం యొక్క మహత్యాన్ని చెప్పాడు.

అగస్త్యమహర్షి లోపాముద్రల వివాహము

తరువాత అందరూ కలిసి అగస్త్యాశ్రమానికి వెళ్లారు. ధర్మరాజు “రోమశమహర్షీ! ఆగస్త్యమహర్షి వాతాపిని ఎలా చంపాడు? అగస్త్యమహర్షి మంచివాళ్లతో నమస్కరించతగినవాడని, విస్తారమైన తేజస్సుతో వెలిగే మహానుభావుడనీ విన్నాను. ప్రీతితో ఆ మహర్షి చరిత్ర ఇక్కడ వినాలని ఉంది” అని అడిగాడు.

ధర్మరాజుతో రోమశమహర్షి “ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు సుప్రసిద్ధ బలవంతులు; శత్రుసంహారం చేసేవాళ్లు; భయం లేనివాళ్లు. వాళ్లు మణిమతీ పురంలో గొప్ప సంపదలతో నివసిస్తూ ఉండేవాళ్లు. వాళ్లల్లో పెద్దవాడు ఇల్వలుడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుణ్ని భక్తితో పూజించి ‘నాకు అన్ని కోరికలు తీర్చేలా ఒక మంత్రాన్ని ఉపదేశించండి’ అని ప్రార్థించాడు.

అటువంటి మంత్రోపదేశం చెయ్యడానికి బ్రాహ్మణుడు అంగీకరించలేదు. కామరూపుడైన తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసం వండించి బ్రాహ్మణుడికి విందు చేశాడు. తరువాత ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే తమ్ముడిని ‘వాతాపీ! రా!’ అని పిలిచాడు. వాతాపి బతికి బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు. బ్రాహ్మణుడు చచ్చిపోయాడు.

అలాగే ఇల్వలుడు తన దగ్గరికి వచ్చిన బ్రాహ్మణుల్ని చంపెయ్యడం మొదలుపెట్టాడు. బ్రహ్మచర్య దీక్షతో కఠోర తపస్సు చేస్తున్న అగస్త్యమహర్షి అడవిలో తిరుగుతూ అక్కడ అందుగు చెట్టు చిగురాకుని ఆధారంగా చేసుకుని తలక్రిందులుగా వేలాడుతున్న తన పితృదేవతల్ని చూసి ‘ఇలా ఎందుకు ఉన్నారు?’ అని అడిగాడు.

ఆ పితృదేవతలు ‘నాయనా! మేము నీ పితృదేవతలం. నువ్వు గొప్ప బ్రహ్మచర్య నిష్ఠతో తపస్సు చేస్తున్నావు. నీకు సంతానం లేని కారణంగా మాకు ఉత్తమగతులు లేకుండా పోయాయి. నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని పొందితే మాకు పుణ్యగతి కలుగుతుంది’ అని చెప్పారు. అగస్త్యుడు వాళ్లు చెప్పినట్టే చేస్తానని చెప్పాడు.

సంతానాన్ని కోరుతున్న విదర్భరాజుకి తన తపస్సు మహిమతో ఒక కూతుర్ని పుట్టించాడు. ఆమె పేరు లోపాముద్ర. ఈడు జోడు కుదిరిన వందమంది చెలికత్తెలు కొలుస్తుంటే లక్ష్మీదేవిలా దేదీప్యమనంగా వెలిగిపోతూ పెరుగుతోంది.

అనేకమంది రాజకుమారులు ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుని అగస్త్యమహర్షికి భయపడి ముందుకి రాలేదు. విదర్భరాజు తన కూతురుకి తగిన వరుడికోసం వెతుకుతున్నాడు. అగస్త్యమహర్షి విదర్భరాజు దగ్గరికి వచ్చి లోపాముద్రని తనకిచ్చి పెళ్లి చెయ్యమని అడిగాడు.

విదర్భరాజు తన కూతురిని ఋషికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టంలేదు. ‘నారబట్టలు కట్టుకుని ఆకులు, అలములు ఆహారంగా తీసుకుంటూ భయంకరమైన అడవిలో తపస్సు చేయడం వల్ల బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఈ నిరుపేద బ్రాహ్మడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమెని కారడవుల్లో నారబట్టలు కట్టుకుని ఆకులు, అలములు తింటూ తనతోపాటు తపోభారాన్ని మోయమని నియోగిస్తాడు.

అన్నీ తెలిసి నా కూతుర్ని ఇతడికి ఎలా ఇవ్వాలి.  భోగభాగ్యాలతో తులతూగుతున్న అందమైన తన కుమార్తెని ఇతడికి ఇవ్వకపోతే శాపమివ్వకుండా ఊరుకోడు’ అని విదర్భరాజు తన భార్యతో కలిసి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు.

లోపాముద్ర తల్లితండ్రుల దగ్గరికి వచ్చి ‘గొప్పవాడైన ఈ ఋషికి నన్నిచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లిచేయండి. దీనికోసం మీరు ఆలోచనలతో కుంగిపోతున్నారెందుకు?’ అని అడిగింది. ఆమె మాటలు విని ఆమె తల్లితండ్రులు ఎంతో సంతోషించారు.

శాస్త్రాల్లో ఉన్న సూత్రాల్లో నిర్దేశించబడిన పద్ధతిలో విదర్భరాజు తన కూతురు లోపాముద్రని అగస్త్యమహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. అగస్త్యుడు లోపాముద్రని ధర్మత్నిగా స్వీకరించి ఆమెని నారచీరలు, జింకచర్మం ధరించమని తనవెంట తీసుకుని వెళ్లి గంగాద్వారంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.

ఒకరోజు లోపాముద్ర అందాన్ని చూసి సంతానాన్ని కోరుకున్నాడు. లోపాముద్ర భర్తతో ‘భార్య ద్వారా సంతానాన్ని కోరుకోవడం సహజసిద్ధమే అయినా నన్ను శోభాయమానాలైన ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించి నా మనస్సుకి ఇష్టాన్ని కలగచెయ్యి. అలాగే నీవు కూడా శోభాయమానాలైన ఆభరణాలు అలంకరించుకుని పరిమళాలు వెదజల్లే మైపూతలతో నన్ను ఆనందించేలా చెయ్యి’ అని చెప్పింది

అగస్త్యమహర్షి పొట్టలో వాతాపి జీర్ణము

లోపాముద్ర మాటలు విని అగస్త్యుడు ‘నా దగ్గర ఉన్న ధనం తపస్సే కదా. వేరే ధనం ఏదీ లేదు. తపస్సువల్ల అన్నీ సమకూర్చుకోవచ్చని నువ్వు అనవచ్చు. కాని ఇటువంటివాటి కోసం తపస్సుని వెచ్చించడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పాడు.

తరువాత అగస్త్యుడు ధనం కోసం ‘శ్రుతర్వుడు’ అనే రాజు దగ్గరికి వెళ్లాడు. శ్రుతర్వుడు అగస్త్య మహర్షిని పూజించి వచ్చిన కారణం చెప్పమన్నాడు. మహర్షి ‘రాజా! నేను ధనార్ధినై వచ్చాను. నువ్వు పోషించవలసిన వాళ్ల పోషణకు భంగం కలగకుండా నాకు ధనాన్ని ఇయ్యి’ అని అడిగాడు. శ్రుతర్వుడు తన ఆదాయవ్యయాలు సమానమని తన దగ్గర మిగిలేంత ధనం లేదని చెప్పాడు.

తరువాత శ్రుతర్వుడు, అగస్త్యుడు కలిసి ‘బ్రధ్నశ్వుడు’ అనే రాజు దగ్గరికి వెళ్లారు. ఆ రాజు కూడా వాళ్లిద్దర్ని భక్తితో పూజించి తన ఆదాయవ్యయాలు సమానమని చెప్పాడు.

అగస్త్యమహర్షి శ్రుతర్వుడిని, బ్రధ్నశ్వుడిని తీసుకుని ‘పురుకుత్సుడి’ కొడుకు ‘త్రసదస్యుడి’ దగ్గరికి వెళ్లారు. అతడు ముగ్గురినీ పూజించి ముందువాళ్లు చెప్పినట్టే చెప్పి ‘ఈ మణిమతీ పట్టణంలో ఇల్వలుడు అనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. ఈ పురంలోనే కాదు ఈ భూమండలంలో అందరికంటే ధనవంతుడు. అతడు మీకు కావలసిన ధనాన్ని ఇవ్వగలడు’ అన్నాడు.

ముగ్గురు రాజులతో కలిసి అగస్త్యుడు ఇల్వలుడి దగ్గరికి వెళ్లాడు. ఇల్వలుడు వాళ్లందర్ని అతిథి సత్కారాలతో సత్కరించాడు. వాతాపి మాంసాన్ని ఎప్పటిలాగే అగస్త్యమహర్షికి తినిపించాడు.

ఆ విషయం తెలిసిన ముగ్గురు రాజులు అగస్త్యమహర్షికి నమస్కరించి ‘ఈ ఇల్వలుడి తమ్ముడు మొదట బ్రాహ్మణులకి తను ఆహారమవుతాడు. తరువాత వాళ్ల పొట్ట చీల్చి చంపుతాడు. మనం ఇతడి ఇంటిలో తిండి తినవద్దు. ధనమిస్తే తీసుకుని వెళ్లిపొదాము’ అన్నారు.

తపస్సంపన్నుడైన అగస్త్యమహర్షి వాళ్ల మాటలు విని భయపడలేదు. అతడు పెట్టినదంతా పీక వరకు తిని బలంగా ఉన్నాడు. అప్పుడు ఇల్వలుడు వాతాపిని పిలిచాడు. ఆ సంగతి గుర్తుచేసుకుని అగస్త్యుడు పొట్ట నిమురుకుంటూ గుర్రుమని తేన్చాడు. ఆ సమయంలో అగస్త్యమహర్షి పొట్టలో వాతాపి రాక్షసుడు జీర్ణమైపోయాడు. ఇల్వలుడు అగస్త్యుడి మహిమకి భయపడ్డాడు. తమ్ముడు చనిపోయినందుకు బాధపడినా పైకి కనిపించకుండా సంతోషం నటిస్తూ మహర్షికి నమస్కరించి వచ్చిన కారణం చెప్పమన్నాడు.

అగస్త్యమహర్షి ‘నేను ఈ రాజులతో కలిసి ధనం కోసం వచ్చాను. నువ్వు గొప్ప ధనవంతుడివని విన్నాను’ అన్నాడు.

ఇల్వలుడు ‘మీకు ఎంత ధనం కావాలో అడగండి ఇస్తాను’ అన్నాడు. అగస్త్యుడు ‘పదివేల ఆవులు, పదివేల గద్యాణాల బంగారం ఈ రాజులకి ఒక్కొక్కళ్లకి ఇయ్యి. నాకు వాళ్లల్లో ఒక్కొక్కళ్లకి ఇచ్చినదానికి రెండింతలు గోధనాన్ని, ఒక బంగారు తేరుని ఇయ్యి’ అని అడిగాడు.

ఇల్వలుడు ఎవరికి కావలసినవి వాళ్లకి ఇచ్చాడు. రాజులు అగస్త్యమహర్షి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు. అగస్త్యుడు లోపాముద్ర అడిగినవన్నీ సమకూర్చి ఆమెతో ‘నీకు పదిమందితో సమానులైన వందమంది కొడుకులు కావాలా? వందమందితో సమానులైన పదిమంది కొడుకులు కావాలా? వేయిమంది కొడుకులు కావాలా? వేయిమందితో సమానమైన ఉత్తముడైన ఒక కొడుకు కావాలా?’ అని అడిగాడు.

లోపాముద్ర సంతోషంతో ‘వేయిమందితో సమానమైనవాడు మహాబలశాలి, బుద్ధిమంతుడు అయిన ఒక కొడుకు కావాలి. బుద్ధిహీనులయిన వేయిమంది కొడుకులు ఉండి లాభమేమిటి?’ అంది. అగస్త్యమహర్షి ఆమె కోరినట్టుగా గుణవంతుడైన ఒక కొడుకు పుడతాడు అని చెప్పి కొంత కాలం ఆమెతో ఉండి తపస్సు చేసుకునేందుకు అరణ్యానికి వెళ్లిపోయాడు.

లోపాముద్రకి ప్రపంచమంతా వ్యాపిస్తున్న వెలుగుతో సూర్యుడి తేజస్సువంటి తేజస్సు కలవాడు, కళంకంలేనివాడు ‘దృఢస్యుడు’ అనే పేరు కలవాడు వేదాల్ని, వేదార్థాల్ని వల్లెవేస్తూ జన్మించాడు. అతడికి తేజస్వి అనే పేరుకల ఋషి పుట్టాడు. అతడు చెప్పలేనంత బరువు కలిగిన వంటకట్టెల్ని సులువుగా మొయ్యగలగడం వల్ల అతడికి ‘ఇధ్మవాహుడు’ అని పేరు వచ్చింది.”

ఈ విధంగా అగస్త్యుడు కొడుకుల్ని మనవల్ని పొందడం వల్ల అతడి పితృదేవతలకి పుణ్యగతులు ఏర్పడ్డాయి. ఇది వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పిన కథ.

అరణ్యపర్వంలోని (మొదటిభాగము)  రెండవ ఆశ్వాసం సమాప్తం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here