విష్ణు నిలయం

0
4

[మణి గారు రాసిన ‘విష్ణు నిలయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]త్రి 11 అవవస్తోంది. అంతా నిశ్శబ్దం అలముకొంది. అష్టమి చంద్రుడు, చీకట్లను తరిమికొట్టడానికి, తన వంతు ప్రయత్నం చేస్తూనే వున్నాడు.

అందరినీ నిద్ర, తనలోకి లాక్కుంటోంది, ఒక ఇల్లు మినహాయించి. అది పెద్ద ఇల్లు. దాని పేరు విష్ణు నిలయం. చుట్టూ పెద్ద తోట. పెద్ద పెద్ద చెట్లతో అడవిని మరిపిస్తోంది.

ఆ ఇంటి దగ్గరకి, ఇంకా నిద్ర చేరలేకపోయింది. దానికి కారణం వుంది.

***

చాలా ఏళ్ళుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. దానితో, ఆ ఇంటి చుట్టూ వున్న స్థలం, విచ్చలవిడిగా పెరిగిన గడ్డీ, మొక్కలతో అడవిలా తయారయింది. మనుష సంచారం లేకపోవడంతో, చాలా రకాల జీవాలు అక్కడకి చేరాయి.

కానీ అనుకోకుండా, మూడు రోజుల నుంచి, మనుష సంచారం ఎక్కువ అయింది. గడ్డి కొట్టి వేయడం, మొక్కలు కొట్టివేయడంతో పాటు ఇంటిని, తోటనీ అంతా శుభ్రం చేయడం. ఒకటే హడావిడి..

అన్ని ఏళ్ళు భయం లేకుండా అక్కడ సుఖంగా వుంటున్న జీవాలలో అలజడి రేపింది. కొత్తగా ఏర్పడ్డ పరిస్థితికి, ఆ రాత్రి అందరూ అక్కడ సమావేశం అయ్యారు.

 ఒక కుందేలు మొదలు పెట్టింది. “రెండు అడవి కుందేళ్ళని పట్టుకుపోయారు. చాలా ఏళ్ళనుంచి ఏ భయమూ లేకుండా వున్నాము” మాటలు రాక దాని గొంతు గద్గదమయింది.

మళ్ళీ అంది, గొంతు పెకలించుకొని, “భయం వేస్తోంది!” ఇంక దానికి మాటలు రాలేదు.

“అడవి కుందేళ్ళు ఎప్పుడూ అనేవి, ‘అడవి కన్నా ఇక్కడ బాగుంద’ని! ‘అడవిలో ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలి. ఇక్కడ ఏ భయమూ లేకుండా వున్నామ’ని.”

“చివరకి, వాళ్ళు మనకి లేకుండా అయిపోయారు” దానికి మళ్ళీ దుఖం ముంచుకు వచ్చింది.

“అవును! భయంగానే వుంది” అంది ఒక పక్షి.

“జరగరానిది ఏదయినా జరిగితే, పిల్లలతో ఎక్కడకి వెళ్తాము!? రెక్కలు రాని పసి కూనలు. కొందరు ఇంకా గుడ్లు పొదగలేదు. వదిలి వెళ్ళగలమా!” దానికీ దుఖం వచ్చింది.

ఇంకో పక్షి అందుకుంది, “అన్నిటినీ మించి, మాకు ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన మిమ్మల్ని తలచుకుంటే ఇంకా బాధగా వుంది. మీకు ఏదయిన జరిగితే.. ఊహించుకోడానికి కూడా బాధ గానూ, భయం గానూ వుంది. మీతోనే మా ఉనికి..” అని, అక్కడ తాము గూడు కట్టుకున్న చెట్లని ఉద్దేశించి అంది.

జమ్మి, వేప, రావి, మామిడి, నేరేడు, మారేడు, అక్కడ పెద్దగా విస్తరించి వున్నాయి. అందుకే చాలా పక్షులు అక్కడ చేరి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

చెట్లన్నీ, మౌనంగా వుండిపోయాయి.

“మీరు ఇక్కడే పెరిగి పెద్ద అయ్యారు. మీ గురించి కూడా, కాస్త అలొచించరే?” ఒక పక్షి నిష్ఠురంగా అంది.

“నేను చూసాను! యజమానిలా వున్నాడు. పెద్ద అయ్యని. ప్రేమగా ముట్టుకుని, ‘వీటిని నేనే వేసాను! మా నాన్న నాతో వేయించాడు’ అంటూ మిగిలిన వాళ్ళతో చెప్పడం చూసాను” ఇంకొక పక్షి అంది.

“అవును. అతనే! నన్ను తాకినప్పుడు, అతన్ని గుర్తు పట్టాను. మమ్మల్ని మొక్కలుగా ఇక్కడ వేసాడు. మాతోనే, పెరిగాడు. మాతో, చాలా కబుర్లు చెప్పేవాడు. ఆటలు ఆడేవాడు” రావి చెట్టు అంది.

మళ్ళీ అంది, “చిన్నప్పుడు వేరు. పెద్ద అయ్యాక మారుతారు. చిన్నప్పుడు, అన్నిటితోనూ కబుర్లు చెప్తారు, ఆడతారు. పెద్ద అయ్యాక, తమని తాము అన్నిటినుంచి వేరుగా, ఆవిష్కరించుకుంటారు. అందుకే, ప్రకృతికి కూడా దూరం అవుతారు.”

కాస్సేపుండి, మామిడి చెట్టు అంది “మాదేముంది! మీ గురించే మాకూ ఆందోళన. పిల్లలని వదలి ఎలా వెళ్తారు? ఎలా, ఎక్కడకని తీసుకుపోతారు!?”

“మా బతుకులు, ఈ మనుషులతోనే, ముడి పెట్టాడు దేవుడు. మేము వున్నా ఈ మనుషుల కోసమే! మరణించినా వారి కోసమే! వారి తోనే, ఏదో ఒక రూపంలో వుంటాము.. చివరకి మనుషులు మరణించినా వారితో మేమూ కాలాల్సిందే! ఇది మా నుదుట రాసిన రాత.”

“మాలో, స్థితప్రజ్ఞత పెంచడానికే ఏమో, దేవుడు మమ్మలని, స్థాణువులుగా చేసాడు. అదే, మమ్మలని ఎప్పుడూ తపస్సులో వుండే టట్లు చేస్తుంది” అంది జమ్మి చెట్టు.

మిగిలిన చెట్లు తలలు ఊపాయి, “అవును!” అన్నట్లు.

“మీరు ఎంతయినా, తపస్విలు. కాస్త కూడా కోపం రాదు మీకు! మీ గురిచి కూడా మీరు ఆలోచించాలని అనుకోరు. దేనినీ వ్యతిరేకించరు. అందుకే మిమ్మల్ని, జ్ఞానులు పూజిస్తారు.”

వున్నట్లుండి, కొత్తగా రెక్కలు వచ్చిన ఒక పక్షి, చెట్లని ఉద్దేశించి, “మీకు ఏదయినా జరుగుతుందేమో అనే ఆలోచన కూడా నేను భరించలేక పోతున్నాను” అంది.

“ఏమీ చేయలేమా?”

“ఎందుకు చేయలేము?”

“పెద్ద అయ్యలని రక్షించుకుంటే మనమూ క్షేమంగా వుంటాము.”

“అవును!” అందరూ అంగీకారంగా తలలు ఊపారు.

“ఏదయినా, నేను ఇక్కడే ప్రాణాలు వదులుతాను. పిల్లలని వదలి వెళ్ళలేను” అంది ఒక పక్షి.

“మనము ఊహిస్తున్నట్లు ఏమీ జరగక పోవచ్చు” అంది కళ్ళ గుడ్లు, గుండ్రంగా తిప్పుతూ, ఒక ఉడత.

“ఎన్ని చోట్ల చూడలేదు. చెట్లు కొట్టేయడం! ఇళ్ళు కట్టడం! అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, ఆలోచించడం మంచిది కదా!” ఒక పక్షి అంది.

“అలా అని కీడుని, ఊహించుకొని దాని మీదే దృష్టి పెట్టుకోవడం కన్నా, ఏమి చేయాలని ఆలోచిస్తే మంచిది అని నా ఉద్దేశం” చెప్పింది ఇంకొక పక్షి.

“ప్రకృతిలో మనకంటూ ఏమీ లేదా? మనము ప్రకృతిలో భాగస్వాములం కామా? ఎప్పుడూ ఇలా మనుషుల మీద ఆధారపడి బతకడమేనా?” ఆక్రోశించింది ఒక కుందేలు.

“నేను చచ్చిపోయి పైకెళ్తే, దేవుడిని అడుగుతా ‘ఈ మనుషులకే, అందరి మీద ఎందుకు ఆధిపత్యం కలిగించావు?’ అని” అంది ఇంకో కుందేలు.

“దేవుడు అందరికి సమాన అధికారాలే ఇచ్చాడుట! నేను అడవిలో ఉన్నప్పుడు విన్నాను. మనుషులకి ఆశ ఎక్కువ. దురాశ కూడాను.”

“మననే కాదు వాళ్ళల్లో వాళ్ళు కూడా, బలిష్టులు, బలహీనులని హింసిస్తూనే వుంటారుట”.

“వాళ్ళల్లో, స్వార్థం ఎక్కువ అంటారు, అడవిలో అందరూ!” తోట శుభ్రం చేసేడప్పుడు, వాళ్ళ కంట పడకుండా తప్పించుకున్న, అడవి కుందేలు ఒకటి, ఆరిందాలా అంది.

అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెపుతూ.. అలా జరుగుతోంది వాళ్ళ సంభాషణ.

***

ఇంక.. అక్కడ ఇంట్లో కూడా, ఉద్విగ్నత నెలకొంది. కానీ అది ఎక్కువ ఉద్వేగం వల్ల వచ్చింది.

చాలా ఏళ్ళ తర్వత వచ్చిన విష్ణుకి, ఆ ఇల్లు, తోట చూసాక చిన్నప్పటి విషయాలు ఒక్కొకటీ గుర్తుకు వస్తూంటే ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ఎంతో ఉత్తేజంగా మాట్లాడుతున్నాడు భార్యతో, వీడియో ఫోన్‌లో. వచ్చినప్పటి నుంచీ ఇల్లు, తోట అంతా ఫొటోలు, వీడియోలు, తీసి పంపుతున్నాడు.

విష్ణు చాలా ఏళ్ళుగా, అమెరికా లోనే వుంటున్నాడు. అతనికి తల్లీ, తండ్రీ పోయాక, ఇండియాకి రావాల్సిన అవసరమూ కలగలేదు. ఆసక్తీ కలగలేదు. ఇండియాలో వున్న, ఇంటి గురించి కూడా మర్చిపోయాడు.

వున్నట్లుండి చిన్నప్పటి స్నేహితుడు వాసు ఫోన్ చేసి, ఇల్లు అమ్మకం గురించి ప్రతిపాదించడం, ఒక వారం రోజులలోనే, అంతా అయిపోయేటట్లు ఏర్పాటు చేస్తానని భరోసా కల్పించడంతో, విష్ణు ఇండియాకి, ఇంటికీ రావడం జరిగింది.

వచ్చినప్పటి నుంచి, వాసునే అన్ని ఏర్పాటులు చేస్తున్నాడు. ఇల్లు, తోట శుభ్రం చేయడం, ఇంట్లో తను వుండడానికి అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పించడం, అన్నీ వాసూనే, దగ్గర వుండి చూసుకుంటున్నాడు.

విష్ణు హోటల్‌లో వుంటానంటే, “ఇల్లు అమ్మేస్తావు కదా. మీ ఇంట్లోనే వుండు. జ్ఞాపకాలు వుంటాయి.” అంటూ వాసు, ఇంట్లో ఉండటానికి అవసరం అయిన అన్ని ఏర్పాటులు చేసాడు. అదే చెప్తున్నాడు భార్య రమతో

“రమా! అంతా వాసూనే చూసుకుంటున్నాడు. అతను చెప్పినట్లే వారం రోజుల్లో, అంతా అయిపోయేలా వుంది. ఈ రోజు ముగ్గురు వచ్చి చూసారు. సీరియస్ బైయర్స్ లానే వున్నారు.” అంటూ చెప్తూ వున్నాడు. ఈ లోపల పిల్లలు శ్రీ రాం, అపర్ణ, కూడా ఫొన్ దగ్గరకి వచ్చారు.

“డాడీ! తోట బాగుంది. చేట్లు ఎంత పెద్దవి” పిల్లలు ఇద్దరూ పోటీ పడుతున్నారు, మాటాడడానికి.

విష్ణు కూడా, వాళ్ళకి, ఉత్సాహంగా చెప్పసాగాడు. తన తండ్రి, తనతో ఆ మొక్కలు ఎలా వేయించిందీ, తను వాటికి ఎంత శ్రద్ధగా నీళ్ళు పెట్టిందీ, తను వాటి నీడలో, చదువుకున్నదీ, ఆడుకున్నదీ, వాటితో కబుర్లాడిందీ, అన్నీ, చాలా ఆసక్తిగా చెప్పసాగాడు.

“మా నాన్న ఈ ఇంటిని నేను పుట్టినపుడు కట్టాడు. అందుకే ఈ ఇంటి పేరు ‘విష్ణు నిలయం’ అని పేరు పెట్టాడు. ఆయనకి చెట్లన్నా, మొక్కలన్నా చాలా ఇష్టం. అందుకే ఊరికి దూరంగా పెద్ద స్థలం తీసుకొని, ఇల్లు కట్టించాడు.”

పిల్లలు కూడా చాలా కుతూహలంతో వినసాగారు. “విష్ణు నిలయం! బాగుంది పేరు” పిల్లలు సంబరపడుతూ అన్నారు.

వాళ్ళు జ్ఞానం వచ్చేక, ఇక్కడకి రాలేదు. అందుకే, ఆ ఇంటి గురించిన విషయాలు, ఎక్కువగా వాళ్ళకి తెలియవు. అందుకే, ఆసక్తిగా వింటున్నారు.

వున్నట్లుండి శ్రీరాం అన్నాడు – “ఇప్పుడు, నువ్వు ఆఇల్లు అమ్మేస్తే, కొనేవాళ్ళు, ఆ చెట్లని కొట్టేస్తారేమో డాడీ!”

“అయ్యో! అవును డాడీ!” అపర్ణ కోరస్.

“వాటికి ఏమైనా అవుతే నీకు బాధ వుండదూ?”

“ఉష్! ఉష్!…” అంటూ వాళ్ళని వారించింది రమ. విష్ణు, శ్రీరాం మాటలకి కాస్సేపు అవాక్కయ్యాడు.

పిల్లలు, వాళ్ళకి చిన్నప్పుడు కొనిపెట్టిన బొమ్మలు, ఇంకా ఇప్పటికీ, పక్కలో వుంచుకొని పడుక్కుంటారు. వాళ్ళవరకూ, అవి జీవంతో వున్నట్లే. అందుకే వాళ్ళకి అలా అనిపించడంలో, అటువంటి ప్రశ్న రావడంలో, ఆశ్చర్యం ఏమి లేదు.

చిన్నప్పుడు తనూ, ఆ చెట్లతో, తన పిల్లల లాగే, ఆడుకున్న వాడే. కానీ మధ్యలో, ఆ కనెక్క్షన్, పోయింది. చదువులూ, ఉద్యోగాలు! ఇలా, రకరకాల ఒత్తిళ్ళు, ఆ బంధాన్ని మరుగుపరిచాయి. మర్చిపోయేలా చేసాయి.

అందుకే, ఇల్లు అమ్ముదామనుకున్నప్పుడు కూడా ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. ఇక్కడకి వచ్చాక కానీ, ఆ ఇంటితో, తనకి వున్న అనుబంధం గుర్తుకు రాలేదు.

గిల్టీగా అనిపించసాగింది అతనికి, ఆ చెట్లు తనతో పాటు పెరిగాయి. వాటితో ఆడుకున్నాడు, పాడుకున్నాడు. కానీ అన్నీ మర్చిపోయాడు.

“నీతోనే పెరిగాయి కదా! నీకు సిబ్లింగ్స్‌లా కదా. వాటికి ఏమయినా అవుతే నీకు బాధ కాదూ!”

“అబ్బా!, శ్రీరాం! అపర్ణా! వుండండి!.. ఇప్పుడు వాటిని ఎవరు ఏమి చేస్తున్నారు?” అంటూ పిల్లలని గదమాయిస్తోంది రమ.

“నీకు తెలియదు మమ్మీ! వాళ్ళు, వాటిని కొట్టేస్తే? డాడీకి వాటితో వున్న కనెక్షన్ వాళ్ళకి వుండదు.”

“చాల్లే, చెప్పొచ్చేరు!” రమ వాతావరణాన్ని తేలిక చేస్తూ అంది.

“వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇంక పెట్టేస్తా. వీళ్ళని స్కూల్‌లో దింపాలి” అంటూ ఫోన్ పెట్టేసింది రమ.

పిల్లల ప్రశ్నలు, ఇంకా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి విష్ణులో. పిల్లలు అమాయకంగా మాట్లాడినట్లు వుంటుంది కానీ ఆ మాటల్లో చాలా నిజాయితీ వుంటుంది. కల్తీ లేని నిజాయితీ!

‘అవి నాతో పాటే పెరిగాయి కదా. శ్రీరాం చెప్పినట్లు సిబ్లింగ్స్ లానే. కానీ, వాటికి ఒక మాట కూడా చెప్పకుండానే, ఇల్లు అమ్మెయ్యాలని అనుకున్నాడు, అది ఎంత వరకు సరైనది? వాటికీ, నాలానే ఈ స్థలం పైన హక్కు వుంటుందిగా.’

‘మాటాడలేవనేగా, వాటిని పక్కకి పెట్టేస్తాము.. మాటలు వస్తే అవీ గొడవ పెట్టేవి. కోర్టుకి వెళ్ళేవి. వాటిని ఇంత వరకూ ప్రేమగా పలకరించను కూడా లేదు నేను.’ ..మనసులోకి, తెరలు తెరలుగా, అలా ఆలోచనలు వస్తూనే వున్నాయి.

ఉన్నట్లుండి, దుఖం పెల్లుబికి వచ్చింది విష్ణుకి. ఏదో కోల్పోయినట్లు అనిపించింది.

ఇంతలో రమ ఫోన్. “పిల్లలని స్కూల్‌లో దింపాను” అంటూ.

రమ గొంతు వినగానే, దుఖం వెల్లుబికింది. తనని తాను తమాయించుకుంటూ, దుఖంతో పూడుకుపోయిన గొంతుని, సరి చేసుకుంటూ, – పిల్లల ప్రశ్నలతో తన మనసులో పుట్టుకొచ్చిన ఆలోచనలు, భావాలు, తనలో కలిగిన అపరాధ భావన.. – అన్నీ చెప్పాడు. అంతా ఓర్పుగా వింది రమ.

“విష్ణూ! అసలు ఇప్పుడు, అంత అర్జెంట్‌గా ఆ ఇంటిని అమ్మాల్సిన అవసరం ఏముంది? ప్రశాంతంగా, ఎటువంటి ఒత్తిడులకీ, ప్రభావితం కాకుండా, అలోచించి, నీకు ఏమి చెయ్యలని అనిపిస్తే అది చెయ్యి. సరేనా? నేను ఇంక పెట్టేస్తా. నాకు, ‘బాక్ టు బాక్’ మీటింగ్స్ వున్నాయి” అంటూ రమ ఫోన్ పెట్టేసింది.

రమతో మాట్లాడేక, కాస్త ఉపశమనం పొందాడు విష్ణు. ఆలోచిస్తూనే, నిద్ర లోకి ఒరిగాడు.

***

జెట్ లాగ్‍తో, తెలతెలవారుతూంటేనే, మెలుకువ వచ్చేసింది విష్ణుకి.

లేచి, కాఫీ కలుపుకొని, తనకి అవసరమయిన అన్ని ఏర్పాటులూ చేసిన, వాసూకి మనసు లోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాకిలి తలుపు తెరిచాడు, కళ్ళ ముందు దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.

***

వాకిలి నిండా, రక రకాల పక్షులు నిలబడి వున్నాయి. మాములుగా కాస్త శబ్దానికే, బెదిరి ఎగిరిపోయే పక్షులు, కాస్త కూడా చలించకుండా, అలాగే నిల్చున్నాయి.

విష్ణు, పక్షులని.. పక్షులు, విష్ణుని.. అలా చూస్తూనే వుండి పోయారు కాస్సేపు.

‘అవి, నన్ను ప్రశ్నిస్తున్నాయా? ఏమయినా చెప్పాలని అనుకుంటున్నాయా?’ అవి, కాస్త కూడా జంకకుండా వుండడం ఆశ్చర్యంగా అనిపించింది.

‘ఇంగ్లీష్ సినిమాలో లాగ నా మీద దాడి చేయవు గదా?!. అన్నీ, అంత కలిసికట్టుగా అలా నిలబడ్డాయంటే, ఏదో ఒక ప్రత్యేకమయిన ఉద్దేశం తోనే, అయి వుంటుంది’ అనుకుంటూ వాటినే చూస్తున్నాడు.

విష్ణుకి, కాస్త భయం, కాస్త విస్మయం, ఇంకా అయోమయం. అచేతనంగా అలానే చూస్తూ వుండి పోయాడు.

కాస్సేపటికి, వుండి వుండి, వెనకకి తిరిగి, తన వైపే చూస్తూ, పక్షులు గుంపుగా, తోటలోకి దారి తీసాయి. అవి తనని పిలుస్తున్నట్లే అనిపించింది విష్ణుకి. మంత్రముగ్ధుడిలా వాటిని వెంబడించాడు.

పక్షులన్నీ, గుంపులు గుంపులుగా విడిపోయి, తలో చెట్టు దగ్గర, నిలబడ్డాయి. వాటి దృష్టి తనని కాసింత మాత్రం కూడా వదలటం లేదు. అతను వాటిని సమీపించగానే, అవి ఎగిరి కొమ్మల మీద నిలబడ్డాయి.

తల ఎత్తి చూసిన విష్ణుకి, విస్తరించిన కొమ్మల మీద పక్షి గూడులు, లెక్కపెట్టలేనన్ని గూడులు, కనిపించేయి.

కొన్ని గూడుల లోంచి, వచ్చి రానీ రెక్కలతో, పక్షి పిల్లలు. కొన్ని, శబ్దాలు చేస్తూ మెడలు బయటకి పెట్టి చూస్తున్నాయి.

విష్ణుకి, వేరే ప్రపంచం లోకి వెళ్ళినట్లు అనిపించింది. కాస్సేపు అలానే చూస్తూ వుండిపోయాడు.

అతనికి అర్థమయింది, తనని, పిల్లలు ప్రశ్నించినట్లే అవీ ప్రశ్నిస్తున్నాయి “ఎక్కడకి పోవాలి మేము?” అని. ఆ అలోచనకి, అతనికి ఇంక నిలబడడానికి కూడా శక్తి చాలలేదు. అక్కడ, ఆ వేప చెట్టు మొదట్లో కూలబడ్డాడు.

చెట్టు మొదలుకి, నడుం వాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుంచి, నీళ్ళు జాలువారాయి.

గుండెలోంచి దుఃఖం పొంగి వచ్చింది, వాటి నిస్సహాయతకి, తన స్వార్థానికి సిగ్గుగా అనిపించింది. దేని గురించీ ఆలోచించకుండా తను తీసుకున్న నిర్ణయానికి, తను సిగ్గుపడాల్సిందే కదా.

మెడ పైకెత్తి, పక్షుల కేసి, చెట్ల కొమ్మల లోకి చూస్తూ అన్నాడు “నన్ను క్షమించండి.”

లేచి, అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి, ఒకసారి కౌగలించుకున్నాడు, “నన్ను క్షమించండి!” అంటూ చెట్ల మొదలుని, చేతితో నిమురుతూ “మీరంతా నన్ను క్షమించండి. నాతో సమానంగా పెరిగారు. మీరంతా నాకు తోబుట్టువులు.”

“ఈ స్థలం పైన నాతో సమానంగా మీకూ హక్కు వుంది. మీతో ఒకమాట కూడా చెప్పకుండా, ఈ ఇల్లు అమ్మేద్దామనుకున్నా. తప్పే! “

“దేవుడి దయ వల్లో, తల్లి తండ్రుల ఆశీర్వాదం వల్లో, ఇల్లు అమ్మాల్సిన అవసరం నాకు లేదు. రాదనే అనుకుంటున్నా. మీ హక్కుని నేను గౌరవిస్తాను. మీరు ఆశ్రయం ఇస్తున్న ఈ ప్రాణులందరికీ కూడా చెప్పండి. నేను మిమ్మలని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను. వింటున్నారా?”

విష్ణు తల పైకెత్తి, ఆగి ఆగి గట్టిగా చెప్తున్నాడు, ఉద్విగ్నతతో, ఆ చెట్లతో, ఆ పక్షులతో, ..అక్కడ జీవాలన్నిటినీ, ఉద్దేశిస్తూ, అవన్నీ విన్నాయో లేదో, అసలు వింటాయా అనే సందేహం కాస్త, కూడా లేకుండా.

విష్ణుని, ఆ పరిస్థితిలో చూసేవాళ్ళు ఎవరయినా, ‘అతనికి పిచ్చి గాని పట్టలేదు గదా’ అని అనుకోకుండా వుండలేరు.

విష్ణుకి శరీరం అంతా ప్రకంపనలు, కాళ్ళు బలహీనమయ్యాయి. మళ్ళీ, ఒక చెట్టు మొదటలో కూలబడి, చెట్టుకి, తల ఆనించి భారంగా కళ్ళు మూసుకున్నాడు ‘నాకు ఏమైంది?’ అనుకుంటూ.

శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోడానికి, ప్రయత్నిస్తూ కళ్ళు తెరిచాడు. కళ్ళముందు మునపటిలానే, పక్షుల గుంపు, నిలబడి తననే చూస్తున్నాయి.

నెమ్మదిగా తనని సమీపించాయి. ఒకటి భుజాలమీద, ఒకటి ఒళ్ళోను, మరొకటి తన చేతి మీద, తల మీద కొన్ని, వాలాయి. అలా అన్నీ అతనిని కప్పి వేస్తున్నాయి..

ఇంతలో ఒక పక్షి దాని నోట్లో వున్న నేరేడు పండుని తన చేతిలో వుంచింది. అలా ఒక్కొక్కటి, ఒక్కొక్క పండు తెచ్చి తన చేతిలో జార విడుస్తున్నాయి. గుప్పిడి నిండింది పళ్ళతో.

విష్ణుకి అర్థమైంది, అవి తన మాటలు విన్నాయని, కృతజ్ఞతని తెలియ చేసుకుంటున్నాయని.

దగ్గరగా వస్తున్న, వాటిని ప్రేమగా నిమిరాడు. అతనిలో, అంత వరకూ అతనిని ఉద్విగ్నపరచిన గిల్టీనెస్ పక్కకి జరిగింది. అతని హృదయాన్ని, ప్రేమ వెల్లువలా ముంచెత్తింది.

కళ్లనుంచి నీళ్ళు అతనికి తెలియకుండానే ఆగకుండా చెంపల మీదకి జారిపడసాగాయి. అలౌకిక అనుభూతితో తనని తానే మర్చిపోయి చాలా సేపు ఉండిపోయాడు.

పక్షులు కూడా ఎటువంటి భయం లేకుండా, అతన్ని కప్పి వేస్తున్నాయి, కాస్సేపు వాటి ముక్కులతో, అతనిని ప్రేమగా తాకుతూ. రెక్కలతో అతనిని నిమురుతూ.

నెమ్మదిగా పొద్దు పొడవడంతో, భానుని కిరణాలు తీక్షణంగా మారాయి. పక్షులన్ని వారి వారి స్థానాలకి వెళ్ళిపోయాయి. వాటి వాటి పనులలో మునిగిపోయాయి.

***

 ఆ అలౌకిక స్థితి నుంచి బయటకి వచ్చిన విష్ణుకి, శరీరం, తేలిక అయినట్లు అనిపించింది.

లేచి, రెండు చేతులలో నేరేడు పళ్ళతో, ఇంట్లోకి వచ్చాడు. పళ్ళు అక్కడే వున్న బల్ల మీద పెట్టి, చాలా సేపు మంచం మీద అలానే పడుక్కుండి పోయాడు. మనసు కూడా తేలిక అయింది, తెలియని అనందంతో.

కాస్సేపటికి తేరుకొని, జరిగినది అంతా నెమరు వేసుకుంటూ, ఫోన్ చేసి, రమకి జరిగినది చెప్పాడు. చెప్తూంటే, మళ్ళీ భావోద్వేగానికి గురి అయ్యాడు.

“ఇది, నిజమో, కలో తెలియటం లేదు. నాకు ఏమైనా అయింది అంటావా?” అంటూ.

విష్ణు చెప్తూండగానే, పిల్లలు అక్కడకి చేరారు. అంతా వింటున్న రమ, పిల్లలు దిగ్భ్రాంతి చెందారు.

“డాడీ! అయ్యో మేము, మిస్ అయ్యాము. ఈసారి మేమూ వస్తాము.”

“అలాగే! ఈసారి నుంచి అందరమూ ప్రతి సంవత్సరమూ వద్దాము.”

“డాడీ! నువ్వు ఎందుకు వీడియో తీయలేదు?..”

పిల్లల హడావిడికి, తమని మాట్లాడనిచ్చేలా లేరని, “మీరు పొద్దున్నే లేవాలి. వెళ్ళండి ఇంక! పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో రాకూడదని ఎన్ని సార్లు చెప్పాలి?” అంటూ పిల్లలని అదిలించి అక్కడ నుంచి, వెళ్ళగొట్టింది.

పిల్లలు వెళ్ళిపోయాక, “ఇల్లు అమ్ముతున్న విషయం అవి ఎలా గ్రహించాయి?” ఆశ్చర్యపోతూ అంది.

మళ్ళీ అంది. “అందుకే మనుషులకి వున్న జ్ఞానం, ప్రాణులన్నిటికీ కూడా వుంటుంది అంటారు. ప్రకృతి మన ఆలోచనలు, మాటలు, వింటుందంటారు. అది నిజమే అనిపిస్తోంది.”

ఊ!.. కొట్టాడు విష్ణు.

“పిల్లల వల్ల, నేను పెద్ద పాఠం నేర్చుకున్నాను” ఉండుండి చెప్తున్నాడు, విష్ణు.

“ప్రకృతి అందరిదీను. ఆ సత్యాన్ని గౌరవించాలి. అందరికీ హక్కులుంటాయి. మూగవి అని వాటి హక్కుల గురించి ఆలోచించక పోవడం, లక్ష్య పెట్టక పోవడం, నిరంకుశత్వమే అవుతుంది..”

విష్ణు మాటలకి నవ్వింది, రమ.

మళ్ళీ అన్నాడు, “పిల్లల మాటలని పట్టించుకోము గానీ, వాళ్లు చెప్పేవి అన్నీ నిజాలు. మన కండిషనింగ్‌తో, మనం వాటిని ఒప్పుకోకపోవచ్చు. అంత మాత్రాన, అవి నిజం కాకుండా వుండవు.”

“అయితే, ఇల్లు అమ్మనట్లేగా! “

“అవును.”

రమ మాటలకి తడుముకుంటూ, వుండుండి అంది,..

“నీది మంచి మనసు విష్ణూ! అందుకే ఇటువంటి అపురూపమయిన అనుభవం నీకు కలిగింది. నాకూ, వింటూ ఉంటేనే, ఒళ్ళు జలదరించింది. తలుచుకుంటే కూడా.. ఇటువంటి అనుభవాలని మనసు లోకి ఇంకించుకోవడం కూడా కష్టమే. నీ పరిస్థితి నాకు అర్ధమవుతోంది. మంచి నిర్ణయమే తీసుకున్నావు!”

కాస్సేపు, ఇద్దరూ, నిశ్శబ్దంగా వుండి పోయారు.

“ఎప్పుడు తిరుగు ప్రయాణం?” మళ్ళీ అంది రమ.

“బుక్ చేసుకున్న డేట్‌నే! ఇంకా నాలుగు రోజులుంది. ఇప్పుడు, ఇక్కడ ఎవరూ లేరనే భావన లేదు. వీళ్ళతో, నాలుగు రోజులు ఇట్టే గడచి పోతాయి”, మైకం లోంచి ఇంకా బయటకి రానట్లే వుంది విష్ణుకి.

“ఊ!..” అంటూ నవ్వింది రమ

“సరే! ఇంక ఫొన్ పెట్టేస్తాను. పొద్దునే లేవాలి” అంటూ ఫోన్ పెట్టేసింది రమ.

అంతలో, వాసు వచ్చాడు, టిఫిన్‌తో.

ఇద్దరు టిఫిన్ తిన్నారు. విష్ణు కాఫీ కలిపి వాసుకి ఒక కప్ ఇచ్చి, తను ఇంకొక కప్ తీసుకొని, కాఫీ తాగుతూ పొద్దున్న జరిగిన సంఘటన చెప్పుతూ అన్నాడు,

“మూగ జీవాలకి, మన ఆలోచనలు చదివే జ్ఞానం వుంటుందేమో అనిపిస్తుంది. మన మాటలు అర్థమవవు, అని అనుకుంటాము, కానీ అర్థం అవుతాయి, అని చెప్పడానికి, ఇంతకన్న సాక్ష్యం ఏమి కావాలి?”

విష్ణు చెపుతూంటే వాసు విస్మయంతో, విభ్రాంతి చెందుతూ విన్నాడు. అవాక్కయ్యాడు.

ఇద్దరూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచాలని కూడా అనిపించలేదు ఇద్దరికి. అలా ఎంత సేపు గడిచిందో కూడా ఇద్దరూ గమనించలేదు.

వాసు ఫోన్ మోగడంతో, ఇద్దరూ ఈ లోకం లోకి వచ్చారు.

వాసు ఫోన్‌లో “హలో” అంటూ.. అటువెంపు వాళ్ళు చెప్పింది విని, “నేను మళ్ళీ ఫోన్ చేస్తాను” అని పెట్టేసాడు.

నెమ్మదిగా అన్నాడు, మాటలు వెతుక్కుంటూ “ఇప్పుడు. ఏమి చేద్దామని?”

“ఏముంది. ఇల్లు అమ్మడం విషయం, ఇంతటితో వదిలేద్దాం. నోరు లేని ఈ జీవాలకి కూడా హక్కు వుంటుందని విషయాన్ని నా పిల్లలు నాకు చాలా సున్నితంగా తెలియచేసారు. నేను ఇంక అది మర్చిపోను. నా నిర్ణయాన్ని, వ్యతిరేకించడానికి నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు లేరు. ఏమంటావు?” నవ్వుతూ అన్నాడు విష్ణు.

“పిల్లలే, నాకిప్పుడు, గురువులు. నేను నా భార్య, వాళ్ళు చెప్పిందే వినదల్చుకున్నాము ఈ విషయంలో.”

“ఊ!” అన్నాడు వాసు.

 బల్ల మీద, తను అంతకు ముందు పెట్టిన రేగి పళ్ళు కొన్ని, వాసు చేతిలో వేసాడు, విష్ణు. “తిను!” అంటూ.

“పక్షులు. ఈ పళ్ళు ఇచ్చి, వాటి కృతజ్ఞత తెలియచేసాయి.” అన్నాడు విష్ణు, నవ్వుతూ.

“ఊ!..” అంటూ నోట్లో వేసుకున్నాడు, వాసు. “అదృష్టవంతుడివి. ఒక అపురూపమయిన అనుభవాన్ని పొందావు. మంచి నిర్ణయం తీసుకున్నావు.”

కాస్సేపు ఉండి, వాసు మళ్ళీ అన్నాడు “ఈ ఇల్లు అమ్మకం విషయం కదిపి, అనవసరంగా, నిన్ను ఇబ్బంది పెట్టినట్లు అయింది.”

“లేదు వాసూ! నాకూ ఇది మర్చిపోలేని అనుభవం. నేనే థేంక్స్ చెప్పాలి. నువ్వు ఈ విషయం కదపకపోతే, నేను ఇక్కడకి రాకపోతే, నేను ఈ అనుభవాన్ని పొందేవాడినీ కాదు. ఇంత విలువైన సత్యాన్ని, ఎప్పటికీ నేను గ్రహించి వుండేవాడిని కాను. ఇటువంటి అలౌకికమయిన అనుభూతి, చాల అరుదైంది, విలువ కట్టలేనిది, మర్చిపోలేనిది, నాకు దక్కేదే కాదు!” ఉదయాన జరిగిన సంఘటనని, పునశ్చరణ చేసుకుంటూ, మైమరచి మాట్లాడుతున్నాడు, విష్ణు.

“ఇంకా నాలుగు రోజులుంది, నీ తిరుగు ప్రయాణానికి.. నీ ప్లాన్? టికెట్ మార్చుకుంటావా?”

“పర్వాలేదు. ఇక్కడే, ఈ నాలుగు రోజులు గడుపుతాను. నువ్వు మాత్రం, నాకు ఒక సాయం చేయాలి. ఈ ఇల్లూ, తోట, తోటలో అన్నీ క్షేమంగా వుండేటట్లు, అప్పుడప్పుడు చూసుకుంటూ వుండాలి!”

“తప్పకుండా!”

మళ్ళీ విష్ణు అన్నాడు. “ఇంక నుంచి మేము అందరమూ ప్రతీ సంవత్సరం వస్తూ ఉంటాము.”

“ఊ!.. ఊ!” అంటూ, వాసు అన్నాడు, “నువ్వు చెప్తున్నది విన్నాక, నాకూ అనిపిస్తోంది, మన ఆలోచనలని, మనము ఎప్పుడూ ప్రశ్నించుకోము. ఏది, ఎంత వరకూ సమంజసం అంటూ ఎప్పుడూ అనుకోము. అటువంటిది, మూగ జీవుల మాటకి వస్తే, వేరే చెప్పేది ఏముంటుంది? అన్ని హక్కులూ బేషరతుగానే, అని భావిస్తాము.. తప్పే మరి!.. నాకూ ఇది మరపురాని అనుభవమే!”

“ప్రకృతిలో ప్రాణులందరికి, సమాన హక్కులు వుంటాయి. మనము ఆ విషయాన్ని విస్మరించినంత మాత్రాన అది నిజము కాకుండా వుండదు కదా. పూర్వ కాలం ఋషులు, ప్రకృతిలో అన్నిటినీ గౌరవించమనే చెప్పారు. మనము తినే ఆహారం కూడా, అన్నిటికీ, పెట్టే తినాలి అని చెప్పారు.”

“ఆ సంస్కృతికి దూరం అయ్యాక, మనం ప్రకృతినే కాదు, ఎవ్వరిని గౌరవించడం మానేసాము. ఎవ్వరి గురించి ఆలోచించడమూ మానేసాము” నవ్వుతూ అన్నాడు, వాసు.

విష్ణు “అవును”, అంటూ తల ఊపి అన్నాడు, “మనమంతా, ‘నేను’లో చిక్కుకు పోయాము. అందరమూ అనే మాట కూడా మర్చిపోయాము.”

కాస్సేపు మౌనంగా వుండి, ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, కాస్త ఆగి, మళ్ళీ అన్నాడు వాసు.

“పని అయిపోయింది, ఇంతటితో సరి, అన్నట్లు కాదు, విష్ణూ!, నువ్వు వెళ్ళేవరకూ నీతోనే వుంటాను. సరేనా!”

ప్రేమగా నవ్వాడు విష్ణు. “థేంక్స్ వాసూ! ఈ నాలుగు రోజులు, చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ, నీ తోనూ, ఈ తోటతో.. ఈ తోటలో గడిపేస్తాను. నేనిప్పుడు ఇక్కడ ఎవరూ లేరు అని అనుకోవటం లేదు. ఇప్పుడు, ఇటువంటి ఆత్మీయులని, ఎలా వదలి వెళ్ళాలా అని అలోచిస్తున్నా.”

“ఊ..!” అంటూ వాసు తల ఊపాడు.

“అయినా, చిన్నప్పటి విషయాలు, చిన్నప్పటి స్నేహితునితో, నెమరు వేసుకోవడం కన్నా, సంతోషకరమైనది ఏముంటుంది!?.. వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాను. ఏమంటావు?” నవ్వుతూ అన్నాడు విష్ణు.

వాసు కూడా నవ్వాడు “ఖచ్చితంగా!” అంటూ.

ఇద్దరూ ఆ మాటలకి హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రి తోటలో ప్రతీ జీవి, ఇంట్లో విష్ణు, చాలా ప్రశాంతంగా నిద్ర పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here