[box type=’note’ fontsize=’16’] మనుషులు స్వార్థం వీడి చెట్ల వలె జీవించాలని అంటున్నారు పుప్పాల జగన్మోహన్రావు ఈ పద్య కవితలో. [/box]
కొంటె గాలి పట్టు కొచ్చింది ఒక విత్తు
మట్టి యందు విడచి మరలి పోయె
మట్టి యందు విత్తు మత్తుగా నిదురోయి
స్వప్న లోక మందు సంచరించె ౧
విత్తు మొలక నెత్తి విరుచు కొనియె ఒళ్ళు
చిన్ని రూప మొంది చిందు లేసె
కనులు విప్పి జూచె కాంతి పుంజమ్మును
దొరకె తిండి త్రాగ దొరకె నీరు ౨
నిలువ బలము దొరుక నిలువుగా నది లేచి
తలను ఎత్తి జూచె నలుదెశలను
వ్రేళ్ళు జొచ్చుకొనుచు పృథ్విలోనికి బోయె
రెమ్మ లొందె నెన్నొ కొమ్మ లొందె 3
ఎంతొ శోభ నొందె లేత యాకుల నొంది
మొగ్గ తొడిగి నిల్చె సిగ్గు పడుచు
విరులు గూడ దాల్చి వింత శోభల నొందె
సిగ్గు పడుచు తనదు శిరము వంచె ౪
కాలగమనమాయె కాయలనది దాల్చె
కాయ లన్ని పండ్ల గాను మారె
ఎదుగు తున్న కొలది ఒదుగుటొక్కటె నేర్చి
శిరము మాడు తున్న చింత లేక ౫
పరుల కొసగు నీడ పరమ సంతోషాన
పరుడు మెచ్చు గాన పరహితమ్ము
పరుల సేవ లోనె పరమార్థ ముందని
జనుల కిచ్చె తనదు సంప దంత ౬
శోభ లన్ని పోయి శుష్కించి తా నిల్చె
జన్మ నెత్తి చెట్టు జగము నందు
రోగి అయ్యె వెతల భోగి అయ్యెను వెక్కి
వెక్కి ఏడ్చె నెంతొ విసుగు చెందె ౭
ఉన్న దంత ఊడ్చి ఊపిరి పీల్చిరి
పీల్చి పీల్చి దాన్ని పిప్పి చేసి
నరుల కంట బడకె వరమైన ఒక విత్తు
ఎండలోన మిగిలె ఎండి పోయి ౮
కాల మంత మెల్ల గాను కరగి పోయె
దొరక లేదు తిండి మరియు నీరు
మట్టి లోనె తాను మత్తుగా నిదురోయి
సంచరించ సాగె స్వప్న మందె ౯
వర్ష కాల మొచ్చు వసుధ జలము నొందు
దొరకు నంత తిండి దొరకు నీరు
మరల విత్తు వెలయు మహిని వృక్షమ్ముగ
పీల్చు బ్రతుకు గాలి వృద్ధి నొందు ౧౦
రోగి యగును వెతలు భోగి యగును ఏడ్చు
నిస్సహాయయైన నిర్మలాత్మ
శోభ లన్ని పోవు శుష్కించి నిల్చును
మట్టి యందె కలియు మరల పుట్టు ౧౧
కాల చక్ర గతుల కడు జన్మ లెత్తియు
పరుల పైన తనదు బరువు నిడక
స్వార్థ పరత వీడి అర్థ పూర్ణత గల్గి
నరులు బ్రతుక వలెను తరుల భంగి ౧౨