పిచ్చుక

0
5

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా పిచ్చుకల గురించి, అవి ఎదుర్కుంటున్న ప్రమాదల గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]ప[/dropcap]రి, ఆర్యన్ రోజుకంటే ఆలస్యంగా నిద్రలేచారు. వారి గది కిటికీ దగ్గర ఒకటే పక్షుల రొద, అరుపులు – కిచ కిచమని.

“అబ్బా! మొదలుపెట్టారా గోల. మమ్మల్ని నిద్రపోనివ్వరా? ముంబై వెళ్తే పొద్దున్నే లేవాలి. మాకు సెలవులు. మీకు సెలవులు ఇవ్వరా?” అని విసుక్కున్నారు అన్నా చెల్లి.

“ఎవరితో మాట్లాడుతున్నారు?” అంటూ తాత జగన్ లోపలికి వచ్చారు.

“గుడ్ మోర్నింగ్ తాతా! ఇంకెవ్వరితో ఆ పిచ్చుకలతో” అన్నారు.

“పిచ్చుకలతో మాటలా?”

“అవును. రోజూ మమ్మల్ని నిద్రలేపుతాయి. ఇవ్వాళ కొంచం ఎక్కువసేపు పడుకుంటే గోలగా అరుస్తున్నాయి. స్టుపిడ్ బర్డ్స్!”

వాళ్ళ మాటలికి నవ్వి, ముద్దుపెట్టుకుని “రండి! తయారై గుడికి వెళ్దాము. ఇవాళ అమ్మమ్మ పుట్టినరోజు” అన్నారు.

“అమ్మమ్మా! హ్యాపీ బర్త్ డే!” అంటూ వెళ్లి గట్టిగా ముద్దుపెట్టారు.

“థాంక్స్! రెడీ అవ్వండి. మీ అమ్మ ఇంకా పిల్లలు లేవలేదా అని రెండుసార్లు ఫోన్ చేసింది.”

“సారీ! అమ్మమ్మా” అని తయారుకావటానికి పరిగెత్తారు.

అందరూ గుడికి వెళ్లి పూజ చేసిన తరువాత గుడి మండపంలో కూర్చుని కొబ్బరికాయ, పులిహోర ప్రసాదం తింటుంటే ఎక్కడ నుండో కొన్ని పిచ్చుకలు వచ్చి వాలాయి. మామయ్య వాటికి కొబ్బరి ముక్కలు, అన్నం మెతుకులు విసిరాడు. కిచకిచమంటూ వచ్చి ముక్కుతో ఏరుకుని తినటం చూసిన ఆర్యన్, పరి “మామా! వీటి పేరేంటి? రోజు మా నిద్ర పాడుచేస్తున్నై. మా ముంబైలో కనపడవు” అన్నారు.

“ఇవా? పిచ్చుకలు. చాలా ముద్దుగా ఉంటాయి. ఒకప్పుడు మీ ముంబైలో కూడా ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయాయి” అన్నది అంబిక.

అమ్మమ్మ పిచ్చుకల కథ చెప్పబోతోందని పిల్లలకి అర్థం అయింది.

“అమ్మమ్మా! మేము రెడీ, పిచ్చుక గురించి తెలుసుకోవటానికి.”

“అయితే అటు చూడండి ఆ పిచ్చుకలు ఎటు వెళ్తున్నాయో?”

పిల్లలు పిచ్చుకని అనుసరించారు. అవి కొద్దీ దూరంలో గుడి ప్రాకారంలో సేఫ్ చోటులో గూడు పెట్టి ఉన్నాయి. గూడులోంచి చిన్న పిచ్చుకల గొంతులు వినిపిస్తున్నాయి. పెద్ద పిచ్చుకలు అవి తెచ్చిన ఆహారాన్ని గూటిలోని పిల్లల తెరిచిన నోటిలో ముక్కు ద్వారా పెడుతున్నాయి.

పిల్లలు వింతగా, ఆనందంగా చూస్తున్నారు.

ఇంతలో ఆర్యన్ గోడెక్కి పక్షి గూటిలోని పిల్లలను ముట్టుకోవాలని ప్రయత్నించటం చూసిన మామ వాడిని ఒక్కసారిగా కిందకు లాగి దించాడు.

“మామా! నన్నెందుకు లాగావు? నేను చూడాలి. పిచ్చుక పిల్లని పట్టుకోవాలి” అన్నాడు ఆర్యన్.

“నేను కూడా! నాకు కూడా” అంది పరి.

“బుద్ధి లేకపోతే సరి” అని విసుక్కున్నాడు మామ.

“అది కాదు ఆర్యన్! గూటిలో తల్లి దగ్గరున్న పసిపాపల్ని ఎవ్వరైనా ముట్టుకుంటే తల్లి పక్షికి కోపం వచ్చి వాటిని గూటిలోంచి పడేస్తుంది. అది మీ కిష్టమా?”

“లేదు. ఏదో చూద్దామని అంతే.”

“అసలు సంగతి వినండి. పిచ్చుకలు మనిషితో పాటే పుట్టాయి అని చెబుతారు. మనకి వాటికి చాలా చాలా ఏళ్లుగా స్నేహం అన్నమాట. ఇవి ఇక్కడే కాదు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి.”

“అంటే చాలా దేశాలలోనా?”

“అవును.”

“ఇవి చాలా సోషల్. అంటే మనుషులు ఎక్కడుంటే ఇవి అక్కడ ఉండటానికి ఇష్టపడతాయి. అందుకే వీటిని హౌస్ స్పారో అంటారు.”

“వాటి సైజ్, బరువు తెలుసా?”

“తెలీదు. చాలా చిన్నవి.”

“16 సెంటీమీటర్లు పొడవు, 24-35 గ్రాముల బరువు ఉంటాయి. 3 ఏళ్ళు జీవిస్తాయి. మగ పిచ్చుకల ముదురు గోధుమ రంగులో, ఆడ పిచ్చుకలు లేత రంగులో అందంగా ఉంటాయి.”

“అమ్మమ్మా! వాటి ఇల్లు ఎవరు కడతారు?”

“చిన్ని పరీ, మనలాగా పనివాళ్ళు కట్టరు. ఆడామగా పిచ్చుకలు పిల్లలు పెట్టాలనుకున్నప్పుడు రెండూ కలిసి గూడు కట్టుకుంటాయి.”

“దేనితో? సిమెంట్, బ్రిక్స్?”

“కాదు కాదు! చెట్ల కొమ్మల్లో, ఇళ్ల పై కప్పు, కిటికీల్లో, ఇలా గుడులు, బిల్డింగ్స్ ఎత్తు భాగంలో ఎండిపోయిన గడ్డి ఆకులు పుల్లలు తీసుకొచ్చి గూడు కడతాయి. ఒక్కొక్క పక్షీ ఒక్కొక్క స్టయిల్‌లో ఇల్లు కట్టుకుంటుంది… ఇంటిని చూసి ఏ పక్షిదో చెప్పవచ్చు.”

“అలాగా! మరి ఏమి తింటాయి?” అంది పరి

“బుద్ధు! కొబ్బరి, రైస్ తింటాయి. మామ పెట్టాడు చూడలేదా?” అన్నాడు ఆర్యన్.

“అవి మనం తినేవన్నీ తింటాయి. వడ్లు, గింజలు మనం పడేసిన అన్నం మెతుకులు, క్రిములను తింటాయి. పిచ్చుక పర్యావరణ ఆరోగ్యానికి సూచికగా చెబుతారు. మన చుట్టూ పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం పిచ్చుకల జనాభా తగ్గటానికి ఒక కారణం. గాలి, నీరు, ఆహారంలో ఉంటున్న రసాయనాలు పిచ్చుకల మరణానికి కారణం. అలాగే తగ్గుతున్న చెట్లు, పెరుగుతున్న ఎత్తైన భవనాలు, వాటి గూడుకట్టానికి అనుకూలంగా ఉండటం లేవు.”

“పిల్లలూ, పిచ్చుక శత్రువులు ఎవరు?”

“కుక్క, పిల్లి” అన్నారు పిల్లలు.

“కరెక్ట్!”

“వాటికి కుక్క, పిల్లి, పాము ముఖ్య శత్రువులు. వీటినుండి తప్పించుకోవటానికి కొన్నిసార్లు పిచ్చుకలు వేగంగా నీటిలో ఈదటం చూస్తాము. పిచ్చుకల సంఖ్య దాదాపు 10% కంటే తక్కిపోయిందిట. పిచ్చుకల సంఖ్య పెంచటానికి వాటికి అనువైన చోట చెక్కపెట్టెలు గూడుకోసం పెట్టాలి. మంచినీళ్లు, రసాయనాలు లేని గింజలు పెట్టాలి. చెట్లు పెంచాలి.”

“ఆర్యన్! అర్ధం అయిందా? పిచ్చుకలు ఎంత కష్టంలో ఉన్నాయో.”

“అవును. పాపం! చిన్ని పక్షులు.”

“మరి వాటిని విసుక్కొరు కదూ?”

“విసుక్కోము. వాటికి ఇక నుంచి గింజలు, నీళ్లు పెడతాము. మా ఫ్రెండ్స్‌కీ చెబుతాము” అన్నారు ఆర్యన్, పరి.

వారిద్దరి చేతిలో గింజలు పెట్టి భుజం తట్టి ప్రోత్సహించారు అమ్మమ్మ అంబిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here