సిరివెన్నెల పాట – నా మాట – 74 – కన్నీళ్ళకు సరికొత్త భాష్యాన్ని చెప్పిన పాట

0
4

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి

~

చిత్రం: ఆహా

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఉన్ని కృష్ణన్, సుజాత, బృందం

~

పాట సాహిత్యం

పల్లవి:
ఆమె : సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ॥ 2 ॥
కోరస్ : సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥
ఆమె: నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
ఆమె: నవ్వి నవ్వి తడికానీ నీ కంటి పాపలు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
అతడు: ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన
చిక్కులెన్ని రానీ కరిగిస్తుంది చప్పున
కోరస్: సువ్వి సువ్వమ్మా సువ్వి సువ్వి ఆహా
॥ నవ్వులైన ॥

చరణం:
ఆమె: మావిపళ్ళు ఇవ్వదా మండువేసవి పైరుపాట పాడదా వానపల్లవి
అతడు: మంచుబాటలో సంకురాత్రిని తెస్తుంది కాదా చలి!
కాళరాత్రిలో కాంతిరవ్వలై వస్తుంది దీపావళి పండుగలన్నీ కనువిందుగ అల్లి ఋతువుల హారం
అందించే కాలం దేవుడు పంపిన దీవెన అనుకుంటే
ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే ॥ దేవుడు ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

చరణం:
అతడు: నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా
నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా
ఆమె: రేకులు వాడని పున్నమి నవ్వులు
రేపటి ఆశల ఊపిరి గువ్వలు
ఆలపించే సంగీతంలో సంగతులే గుండెలలో హాయి కచేరీ చెయ్యాలి
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి, ఆహా!
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

సుఖస్యానంతరం దుఃఖం
దుఃఖస్యానంతరం సుఖం
న నిత్యం లభతే దుఃఖం
న నిత్యం లభతే సుఖం

భారతంలోని ఈ శ్లోకానికి అర్ధం- ‘సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తాయి. దుఃఖమూ సుఖమూ ఎవరికీ, ఎప్పుడూ నిత్యం కాదని అర్థం. సుఖమంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం. బాధల వెంటే సంతోషాలు, కన్నీళ్ళు వెంటే ఆనందభాష్పాలు. కొంచెం ఓపికతో వేచి చూస్తే కన్నీళ్ళను తుడిచే సంతోషాలు, బాధలను మరిపించి ఆనందభాష్పాలు మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. మనలో కలిగే ఉద్వేగాలకు అసంకల్పితంగా వచ్చే హృదయ స్పందనే కన్నీరు. గుండెలోని తడి, కళ్ల ద్వారా చంపల పైకి చేరుతుందన్నమాట. మానవుల భావోద్వేగాలను లాక్రిమల్ గ్రంథులు ప్రేరేపించినప్పుడు కన్నీళ్లు వస్తాయి. నవ్వినా ఏడ్చినా అందుకే సందర్భంతో పని లేకుండా కన్నీళ్ళు బయటికి వస్తాయి. మరో విషయం! రోజూ సుమారుగా 300 మి.లీటరు కన్నీళ్ళు స్రవించి, కళ్ళను తడిగా ఉంచుతాయిట!

When you are joyous, look deep into your heart and you shall find it is only that which has given you sorrow that is giving you joy. When you are sorrowful look again in your heart, and you shall see that in truth you are weeping for that which has been your delight.. అంటారు ఖలీల్ జిబ్రాన్.

చిరునవ్వు, కన్నీళ్ళు ఈ ప్రపంచంలో అందమైన జోడి అయినా ఈ రెండూ కలిసి చాలా అరుదుగా కనిపిస్తాయి. మనసుకు ఏ స్పందన వచ్చినా ముందు ఇవే వస్తాయి. నవ్వు వచ్చినప్పుడు, ఆనందంతో కన్నీరొస్తే, బాధొచ్చినప్పుడు బాధతో కన్నీరొస్తుంది. ఏది చేసినా వచ్చే కన్నీరు ఒక్కటే! కానీ అది మనసు లోతుల్లో నుండి వచ్చే సహజసిద్ధమైన స్పందన కాబట్టి చాలా, బలమైనది, చాలా విలువైనది.

ఈ వారం మనం కన్నీళ్లు, చిరునవ్వులకు సంబంధించిన ‘ఆహా’, అనే చిత్రంలోని పాట గురించి విశ్లేషించుకుంటున్నాం. మంచి అనుబంధాలతో జీవిస్తున్న ఒక కుటుంబంలో; నాన్నమ్మ, అమ్మ, నాన్న, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి ఉంటారు. ఆ చెల్లెలు కాస్త అంగవైకల్యం కలిగి ఉంటుంది. పెళ్లయిన అన్నా, వదినలకు ఒక కొడుకు ఉంటాడు. వాడి బర్త్ డే పార్టీ రోజున తెలిసీ తెలియక, తన మేనత్తకు సంబంధించిన లోపాన్ని గురించి ప్రశ్నిస్తాడు. దాంతో ఆమె మనసు ఎంతో నొచ్చుకుంటుంది. అప్పుడు ఇంటిల్లిపాదీ, ఆమెను ఓదారుస్తూ ఈ పాటను ఆలపిస్తారు. ఈ పాట ‘సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి..’ అనే సంప్రదాయపు జానపద శైలితో ప్రారంభమవుతుంది.

ఎన్నో శతాబ్దాలుగా సజీవంగా ప్రాణం పోసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాయి జానపదాలు. వాస్తవిక జీవితానుభవాలూ, ఆ అనుభవాలు రేపిన ఆవేశాలూ, ఆ ఆవేశాలు ప్రేరేపించిన భావన, ఆ భావన కల్పించిన చిత్రాలూ, ఆ చిత్రాల్ని నిర్మించిన మాటలూ, ఆ మాటలు మళ్ళీ పాటలై జనాల నోళ్ళలో నిరంతరం నర్తిస్తూనే ఉన్నాయి. సరళతతో, నిరాడంబరతతో, అందమైన దరువుతో, సహజమైన తెలుగు తీయదనాన్ని ఈ విశిష్ట సంస్కృతి చాటుతూనే ఉంది. ఈ జానపదాలకు ఊతగా,’ సువ్వి సువ్వి, సందమామ, వెన్నెల, తుమ్మెద, సిరిసిరిమువ్వ’.. వంటి పదాలు ఎక్కువగా ఈ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి.

పెండ్లిలో నలుగులు పెట్టేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు.. ఈ సువ్వి పాటలు ఎక్కువగా కనిపిస్తాయి.

1.సువ్వి సువ్వి సువ్వినీ
సుదతులు దంచెదరోలాలా ఆహుం..
~
అన్నమయ్య కీర్తనల్లోనూ ఈ జానపద శైలి మనకు తరచూ దర్శనమిస్తుంది.
2. సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె||
……………
కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె –
~
చుట్టాలబ్బాయి చిత్రంలో కూడా ఒక పాట ఇలా మొదలవుతుంది.
3.సువ్వి సువ్వి సుందరాంగిరో
కవ్విస్తూ ఉంటే నవ్వుతాదిరో..
~
స్వాతిముత్యం చిత్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాట మనందరికీ ఎంతో సుపరిచితమే.
4. సువ్వి సువ్వి సువ్వాలమ్మ, సీతాలమ్మా
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ..

ఉన్నికృష్ణన్, సుజాత, బృందం ఆలపించిన ఆహా చిత్రంలోని ‘సువ్వి సువ్వమ్మ’ పాటకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. సిరివెన్నెల గారు ఈ పాట ద్వారా తను అందించాలి అనుకున్న సందేశాన్ని మనకు అందించనే అందించారు. ఇక పాట సాహిత్యంలోకి వెళ్దాం!

పల్లవి:
ఆమె: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ॥ 2 ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥


ఆమె: నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
ఆమె: నవ్వి నవ్వి తడికానీ నీ కంటి పాపలు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
అతడు: ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన
చిక్కులెన్ని రానీ కరిగిస్తుంది చప్పున
కోరస్: సువ్వి సువ్వమ్మా సువ్వి సువ్వి ఆహా

Then a woman said,
Speak to us of Joy and Sorrow.
And he answered:
Your joy is your sorrow unmasked.
And the selfsame well from which
your laughter rises was oftentimes
filled with your tears.
And how else can it be? –

అంటారు Kahlil Gibran.

‘నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు’ అన్న సిరివెన్నెల గారి ఉపమానమే మనకు జిబ్రాన్ మాటల్లో కూడా వినిపిస్తుంది.

అసలు భగవంతుడు విశిష్టమైన మానవజన్మ ఇచ్చిందే, ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం.

‘చిదానంద రూపం.. శివోహమ్.. శివోహమ్’ అని నిర్వాణ షట్కములో చెప్పినట్టు శివాత్మకమైన ప్రతి మానవుడు చిదానంద రూపుడే! మనసులో ఎప్పుడూ సహజమైన ప్రశాంతతతో ఉంటూ, ఆనంద అనుభవంలో ఉండడమే చిదానందం. కానీ, ఆ సహజత్వానికి భిన్నంగా, లేనిపోని కృత్రిమత్వంలో చిక్కుకొని, మన జీవితాన్ని మనమే దుఃఖమయం చేసుకుంటున్నాం. కాబట్టి, వాటన్నిటినీ పక్కకు నెట్టి, నవ్వుతూ, తుళ్ళుతూ, హాయిగా, ఆశావహంగా ఉండమంటున్నారు సిరివెన్నెల.

మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు, నవ్వినా, ఏడ్చినా కంట్లో నుండి నీళ్లయితే వస్తాయి. అందుకని కన్నీళ్లు కారేంతగా తుళ్ళి తుళ్ళి నవ్వమంటున్నది సిరివెన్నెల అంతరంగం.

‘ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన

ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన’

అంటున్నారాయన. వెక్కిళ్లు పెట్టి ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు ఉప్పగా ఉంటాయనీ, మనసారా నవ్వినప్పుడు వచ్చే కన్నీళ్లు తేనె ఉప్పెనంత తీయగా ఉంటాయని, కన్నీళ్ళకు సరికొత్త భాష్యాన్ని, కన్నీటి రుచిని చెప్పారాయన. మానవ జీవితంలో కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతూనే ఉంటాయి. కానీ మనసారా హాయిగా నవ్వగలిగితే, ఆ చిక్కులన్నీ చిటికలో సమసిపోతాయని ఒక పరిష్కారం మార్గాన్ని కూడా సూచిస్తున్నారు.

చరణం:
ఆమె: మావిపళ్ళు ఇవ్వదా మండువేసవి పైరుపాట పాడదా వానపల్లవి
అతడు: మంచుబాటలో సంకురాత్రిని తెస్తుంది కాదా చలి!
కాళరాత్రిలో కాంతిరవ్వలై వస్తుంది దీపావళి పండుగలన్నీ కనువిందుగ అల్లి ఋతువుల హారం
అందించే కాలం దేవుడు పంపిన దీవెన అనుకుంటే
ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే ॥ దేవుడు ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

Nature is the best Teacher. మనసుపెట్టి ఆలోచిస్తే, ప్రకృతిలోని అణువణువు మనకు జీవితానికి కావలసిన అనుభవ సారాన్నంతా ఇస్తుంది, గురువై పాఠాలు చెబుతుంది. అదే విషయాన్ని బలంగా నొక్కి చెబుతున్నారు సిరివెన్నెల. అంత రుచికరమైన మామిడి పండ్లు కావాలంటే, అంత ఘుమఘుమలాడే మల్లెలు విరియాలంటే, అంత చల్లదనాన్ని ఇచ్చి కర్బూజ కాయలు కావాలంటే, మండిపోయే ఎండలు ఉండాలి. ఆ ఎండ కష్టాన్ని ఇష్టంగా ఓర్చుకున్నప్పుడే, ప్రకృతి మనకివన్నీ అందించగలుగుతోంది. ఇతరులందరికీ ఇబ్బందిగా అనిపించే వానాకాలం రైతులకు పచ్చటి పైరుల పండగలు తెస్తుంది. భరించలేని చలికాలంలో, వణికించే చలిలో, మంచులో.. సంబరాల సంకురాత్రి వస్తుంది. చిమ్మ చీకటి అమావాస్య రోజున వెలుగుల పండుగ దీపావళి, మనందరి జీవితాలను వెలిగిస్తుంది. నిజంగా ఆలోచిస్తే ప్రతి ఋతువులోనూ కష్టమూ, ఉంది సుఖమూ ఉంది. కష్ట సుఖాల మధ్య విడదీయలేని ఒక తీయటి బంధం ఉంది. ఈ ఋతువుల హారం మధ్యలో పండుగల పరమానందాన్ని అల్లి, దేవుడు మనకు చల్లటి దీవెనలు అందిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగిన రోజు, ఈ వేదాంత సారాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న రోజు, మన జీవితమే నవ్వుల జేగంటలా మోగుతుందని గట్టి భరోసా ఇస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
అతడు: నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా
నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా
ఆమె: రేకులు వాడని పున్నమి నవ్వులు
రేపటి ఆశల ఊపిరి గువ్వలు
ఆలపించే సంగీతంలో సంగతులే గుండెలలో హాయి కచేరీ చెయ్యాలి
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి, ఆహా!
॥ 2 ॥

ఇక రెండవ చరణానికి వచ్చేసరికి, మనం సంతోషంగా ఉంటే ప్రపంచం ఎలా కనిపిస్తుందో వివరిస్తున్నారు సిరివెన్నెల. Every Individual is a Universe in himself.. అన్నట్లు మనమే మన ప్రపంచం. అందుకే సిరివెన్నెల ‘నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా.. నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా.. అంటారు. నీ ఉల్లాసం, నీ ఆనందం, ఈ సంతోషం, ప్రకృతికే వన్నెలు అద్దేలా ఉండాలంటారు. ఎవరి ప్రపంచానికి వారే మెరుగులు దిద్దుకోవాలి, అందాల్నీ, ఆనందాల్నీ అద్దుకోవాలి. అలసిపోని నవ్వుల్లో రేపటి ఆశల పున్నమి రెక్కలు చిగురిస్తూ ఉంటాయట. ఆ ఆశల ఊపిరి గువ్వల్లా ఎగురుతూ సంగీతం ఆలపించాలట. ఆ సంగీతంలోని సంగతులు గుండెల్లో హాయిగా కచేరి చేయాలట! ఎంత హృద్యమైన వ్యక్తీకరణ! ఎంత సున్నితమైన భావ కవిత్వం!

గొప్ప కవిలో ఉండాల్సిన సార్వజనీనత, విశ్వమానవత, సిరివెన్నెల సాహిత్యంలో అడుగడుగునా మనకు దర్శనమిస్తాయి. ఆయన సూక్ష్మ పరిశీలనా దృష్టి, భావుకత, మనిషితనం, అవ్యాజమైన ప్రేమ – ప్రతి పదంలోనూ ప్రకటితమవుతుంది. సజీవమైన సానుకూల దృక్పథమే పాటగా, బాటగా మారిన‌ మధురమైన పాటసారికి, ఇదే నా అక్షర నివాళి!!

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here