[హిందీ నవలల పరిచయం శీర్షికలో భాగంగా ‘మహాభోజ్’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]
[dropcap]సా[/dropcap]హిత్యంలో రచయిత్రులు ఎందరున్నా కొన్ని గంభీరమైన విషయాలను చర్చించడానికి స్త్రీలు పనికి రారని వారిలో రాజకీయ విషయాలపై అవగాహన తక్కువని, ఒకవేళ వారిలో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నా అది ఎక్కడో సెంటిమెంట్ల మధ్య నలిగిపోతూ ఉంటుందన్నది చాలా మంది రచయితల అభిప్రాయం. అందుకే ఇలాంటి విషయాలపై రచనలు చేయడానికి పూనుకున్న రచయిత్రులు చాలా తక్కువ. హిందీ సాహిత్యంలో స్త్రీవాది రచయిత్రిగా గుర్తింపు పొందిన మన్నూ భంఢారి 1979లో ‘మహాభోజ్’ అనే ఓ నవలను రాసారు. దళితవాదాన్ని ప్రధాన విషయంగా తీసుకుంటూ భారతీయ రాజకీయ వ్యవస్థపై గంభీరమైన వ్యంగ్యంతో లోతైన అవగాహనతో ఓ ప్రభంజనంగా సాహితీ ప్రపంచంలో ప్రవేశించిన ఈ నవల స్వాతంత్రానంతరం భారతీయ రాజకీయ వ్యవస్థపై వచ్చిన ఓ గొప్ప నవల అని ప్రశంసలు అందుకుంది. ఒక స్త్రీ ఇంత విశ్లేషనాత్మక శైలితో వ్యంగ్యాన్ని జోడిస్తూ భారత దేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను నిష్పక్షపాత ధోరణిలో చర్చకు తీసుకురావడాన్నిచూసి చాలా మంది రచయితలు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ దళితవాద దృష్టికోణంలో వచ్చిన ఎనో నవలల మధ్య అత్యున్నత స్థానంలో నిలిచి ఉన్న ‘మహాభోజ్’ నవలను సాహితీకారులు ఎన్నో సందర్భాలలో విశ్లేషించారు. దీన్ని ఆంగ్లంలోకి ‘ది గ్రేట్ ఫీస్ట్’ అనే పేరుతో రూథ్ వినీతా అనువదించారు.
‘మహాభోజ్’ బీహార్‌లోని బెల్చి ప్రాంతంలో దళితులపై జరిగిన ఊచకోత సంఘటన ప్రభావంతో రాసిన కథ. పదకొండు మంది దళిత యువకులను ఉన్నత కులాలకు చెందిన భూస్వాములు హత్య చేసి వారిని శవాలను అక్కడ తగులబెట్టారు. ఇది అప్పట్లో మన్నూ భండారిని ఎంతగానో కదిలించిన సంఘటన. దీన్ని నేపథ్యంగా తీసుకుని దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, వారిని ఓట్ల కోసం ఉపయోగించుకుంటూ ఎన్నో రకాలుగా మోసం చేస్తున్న రాజకీయ నాయకుల స్వార్థాన్ని ఈ నవలలో చూపించారు రచయిత్రి. ఎన్నికల ప్రచారం నడుమ దళితుల అణిచివేత, వారి రాజకీయ దుర్బలత్వం వెనుక ఉన్న కారణాలను సామాజిక అవగాహనతో ఈ నవలలో ప్రస్తావిస్తారు రచయిత్రి. 2021 నాటికి ఈ పుస్తకానికి సంబంధించి 31 ఎడిషన్‌లు వచ్చాయి అంటే హిందీ సాహిత్యంలో ఈ నవలకున్న స్థానం అర్థం చేసుకోవచ్చు.
ఓ గ్రామం సరిహద్దుల్లోని బ్రిడ్జ్‌పై బిసేసర్ అనే దళిత యువకుడి శవం పడి ఉండగా ఈ నవల ప్రారంభం అవుతుంది. ఆ గ్రామంలో తన వర్గంవారికి వారి హక్కుల పట్ల చైతన్యాన్ని కలిగిస్తూ వారి మధ్య పని చేస్తున్న ఓ చదువుకున్న యువకుడు బిసు. అంతకు ముందు అదే ఊరిలో కొన్ని దళిత గుడిసెలను కాల్చేస్తారు ఊరిలోని అగ్ర కులస్తులు. అందులో చాలా మంది మరణిస్తారు. ఆ కేసును పక్కదారి పట్టిస్తారు రాజకీయ నాయకులు. బిసు దానికి సంబంధించి కొని సాక్షాలను సంపాదించి ఢిల్లి వెళ్ళే ప్రయత్నంలో ఉండగా అతని హత్య జరుగుతుంది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయం అది. ఈ సంఘటన ఇరు వర్గాల రాజకీయ నాయకులలో కొత్త ఆలోచనలను రేపుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న దా సాహెబ్ గాంధేయవాది. ఇంటి నిండా భగవద్గీత పుస్తకాలు పెట్టుకుని అహింసను ప్రచారం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటాడు. దేనికి పెద్దగా చలించక తన రీతిలో ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్ధులను చిత్తు చేసే వ్యక్తి. తనకేం కావాలో సూటిగా చెప్పకుండా కావల్సిన విధంగా అధికారులను లోబర్చుకుని పని చేయించుకోవడంలో దిట్ట. మృదు స్వభావం మాటున ఇతని కరుడు కట్టిన రాజకీయనీతి ఆయనతో పని చేసే వారినే ఎన్నో సందర్భాలలో ఆశ్చర్యపరుస్తుంది.
బిసు శవం దొరకడంతో అప్పటి దాకా ముఖ్యమంత్రిగా ఉండి పదవి పోగొట్టుకున్నసుకుల్ బాబు దీన్ని తన ప్రచారం కోసం వాడుకోవాలనుకుంటాడు. బిసు ఊరిలో ఓ సంతాప సభ పెడతాడు. ఆ రోజు బిసు తండ్రి ఆ ఊరులో ఉండకపోవడంతో అతన్ని కలిసే అవకాసం సుకుల్ బాబుకు దొరకదు. కాని సభ మాత్రం దిగ్విజయంగా పూర్తి అవుతుంది. బిసు హత్యకు ప్రభుత్వాన్ని నిందిస్తాడు సుకుల్ బాబు. దళితులలో ఆవేశాన్నికొంత వరకు రగల్చడంలో ఈ సభ విజయం సాధిస్తుంది. దీనికి బదులుగా దా సాహెబ్ ఆ ఊరిలో మరో మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ ఉద్దేశం కుటీర పరిశ్రమల కోసం ఆ ఊరి వారికి ఆర్థిక సహకారాన్ని అందించడం. ఈ నెపంతో ఆ ఊరు చేరిన దా సాహెబ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిసు తండ్రి ఇంటికి వెళ్ళి అతన్ని స్టేజీ మీదకు తీసుకొని వచ్చి అతనితో సభ ప్రారంభింప చేయడంతో దళిత బంధువుగా అతని పేరు ఊరిలో మారు మోగిపోతుంది. అక్కడ అతన్ని ఎదిరించ ప్రయత్నించిన బిసు స్నేహితుడు బిందాతో బిసు మరణం గురించి ఓ ఎంక్వరీ పెట్టిస్తానని, నిజం తెలిసిన గ్రామస్థులందరూ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలని దా సాహెబ్ కోరతాడు. ఆ ఊరిలో నిజం తెలిసిన వారెవ్వరూ భయంతో గొంతు విప్పరని బిందాకి తెలుసు. కాని దా సాహెబ్ ఈ రకంగా తప్పంతా దళిత సోదరులదే అంటూ వారు పూనుకుంటే బిసుకు న్యాయం జరుగుతుందని, అలా జరగలేదంటే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించిన వారిదే బాధ్యత కాని తమది కాదు అనే విషయాన్ని అక్కడి జనం మనసులలోకి ఎక్కిస్తాడు. మరో పక్కన అతని రౌడీలు సభలో మరెవ్వరూ లేచి మాట్లాడకుండా కాపలా కాస్తూ ఉంటారు.
బిసు ఈ ఊరి దళిత కూలీలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ వారికి రావల్సిన కూలీ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అతన్ని నక్సలైట్ అనే అనుమానంతో ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. జైలుపాలయి కొన్నాళ్లకు ఊరు తిరిగి వచ్చాక బిసు తన పనిని ఇంకా ముమ్మరం చేస్తాడు. అతనితో చదువుకున్నఆ ఊరి యువతి రుక్మా బిసుని ఎంతో అభిమానిస్తుంది. ఆమె భర్త బిందాకి బిసు మధ్య గొప్ప స్నేహం కలుగుతుంది. ఇద్దరూ తమ తోటి దళితుల ఉన్నతి కోసం పాటుపడాలనే ఆలోచన ఉన్నవారే. బిసు తాను పోగు చెసిన సాక్షాలను బిందా దగ్గర దాచిపెడతాడు. బిసు మరణంతో బిందా వాటిని ఎలాగన్నా ఢిల్లీ తీసుకువెళ్లాలని, బిసు పోరాటం ఆగకూడగని దృఢ సంకల్పంతో ఉంటాడు.
దా సాహెబ్ ముందుగా ఓ ప్రముఖ పత్రికా ఎడిటర్‌ను తన దగ్గరకు పిలిపించుకుని తన పద్ధతిలో ఆ పత్రికకు తానెలా సహాయపడాలనుకుంటున్నాడో చెప్తాడు. అందులోని అంతరార్థం అవగతమై ఆ ఎడిటర్ దా సాహెబ్‌కు అనుకూలంగా పత్రికలో వ్యాసాలు ఉండేలా జాగ్రత్తపడతాడు. అతన్ని దళిత బంధువుగా, ప్రజానాయకుడిగా చిత్రించడంలో ఆ పత్రిక విశేషంగా కృషి చేయడం మొదలెడుతుంది. తరువాత ఎప్పటి నుండో ప్రమోషన్ రాక దిగాలుపడి ఉన్న పోలీస్ ఆఫీసర్ సిన్హాను బిసు మరణం వెనుక నిజాలు వెలికితీయడానికి ఎంక్వయిరీ నిర్ణయించమని ఆదేశానిస్తాడు దా సాహెబ్. తానేం చేయాలో ఎంక్వయిరీ ఏ దిశలో ఉండాలో సిన్హాకు ముందే అర్థం అయిపోతుంది. అతను సక్సేనా అనే ఓ ఆఫీసర్‌ని ఎంక్వయిరీ కోసం ఆ గ్రామం పంపిస్తాడు.
సక్సేనా బిసు గురించి ఆ ఊర్లో ఆరా తీస్తున్న క్రమంలో బిసు వ్యక్తిత్వం, నిజాయితీ పట్ల అతనికి ఓ స్పష్టత వస్తుంది. తన సాటి వారిని బిసు ఎంతగా ప్రేమించేవాడో బిసుతో గడిపిన యువకులతో మాట్లాడాక సక్సేనాకు అర్థం అవుతుంది. బిందా ముందు ఎంక్వయిరీకి రానంటాడు. కాని బిసు తండ్రి వచ్చి అర్థించడంతో ఒప్పుకుంటాడు. తన భార్యా బిసు స్నేహితులని, అలా కలిసిన తాము తమ ఆదర్శాలు ఒకటవడంతో మిత్రులమయ్యామని చెప్తాడు బిందా. కాని ముందు తాను బిసుతో ఢిల్లీ వెళ్ళడానికి నిరాకరించానని, అదే విషయంగా తమ మధ్య వాదన జరిగిందని, తరువాత తనతోనే భోంచేసి బిసు వెళ్లిపోయాడని, అదే అతన్ని తాను చివరి సారి చూడడం అని దా సహెబ్ అనుచరుడే అతన్ని హత్య చేసాడని అందరికీ తెలుసని ఎంక్వయిరీలో చెప్తాడు బిందా.
సక్సేనా బిందాలో తన కాలేజీ రోజుల్లో కలిసిన ఓ ఉద్యమ మిత్రుడిని చూస్తాడు. ఇద్దరూ కాలేజీ రోజుల్లో ఓ ధర్నాలో పాల్గొంటారు. పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నప్పుడు మితృడిని ఒంటరిగా వదిలి సక్సేనా పారిపోతాడు. అక్కడ పోలీసుల దెబ్బలకు అతని మిత్రుడు చనిపోతాడు. తాను మిత్రుడిని ఒంటరిగా వదిలేసానన్న భావం సక్సేనాను ఎప్పుడూ కలవరపెడుతూ ఉంటుంది. ఇప్పుడు బిందాలో అదే స్నేహితుడు కనిపిస్తాడు. తాను బిసు మరణానికి న్యాయం చేయాలని బిందా ఆక్రోశానికి ముగుంపు ఇవ్వాలని, మరోసారి పిరికిగా ప్రవర్తించకూడదని నిశ్చయించుకుంటాడు సక్సేనా. అలాగే రిపోర్ట్ తయారు చేస్తాడు కూడా.
దా సాహెబ్ అనుచరులు జరుతున్న విషయాలన్నీ అతనికి చేరవేస్తూ ఉంటారు. సక్సేనా తయారు చేసిన రిపోర్టును దా సాహెబ్ సిన్హాతో తెప్పించుకుని చూస్తాడు. బిందా ఓ టీ కొట్టులో ఇద్దరు పక్క ఊరు కుర్రవాళ్లతో టీ తాగుతాడు. అందులో విషం కలుపుతాడు దా సాహెబ్ అనుచరుడు. ఇది స్పష్టంగా ఎంక్వయిరీలో బైటపడుతుంది. అయితే దా సాహెబ్ అండ ఇచ్చిన ధైర్యంతో ఆ అనుచరుడు ఎన్నికలలో నిలబడాలని నిశ్చయించుకుంటాడు. ఈ హత్య ద్వారా తన రాజకీయ మార్గాన్ని ఏర్పరుచుకోవాలన్న స్వార్థం అతనిది. అతని చేతి క్రింద దళిత ఓట్లన్నీ ఉంటాయి. దా సాహెబ్ ఆ అనుచరుడిని ఉపయోగించుకుంటాడు కాని అతన్ని రాజకీయంగా ఎదగనివ్వాలనుకోడు. ఆ రిపోర్ట్ ఆ అనుచరుడికి చూపి అతను తనకై తాను ఎన్నికల నుండి తప్పుకునేలా చూస్తాడు. మరో పక్క అతనికి సహాయపడుతున్నట్లుగా నటిస్తూ సక్సేనా ఇచ్చిన రిపోర్టును సిన్హా ద్వరా మార్పిస్తాడు. సక్సేనా అవినీతిపరుడని, తొందరగా ప్రలోభాలకు గురయ్యే మనిషని చెప్తూ ఆ రిపోర్టును తనకు కావలసిన విధంగా మార్పించుకుంటాడు.
బిందా భార్య రుక్మాతో బిసుకు అక్రమ సంబంధం ఉందని, ఆ కోపంతో విషప్రయోగం చేసి బిందా బిసును చంపేసాడని, ఆఖరి సారి బిందాతోనే బిసు భోంచేసాడని పకడ్బందీగా సాక్షాలు తయారు చేయబడతాయి. బిసు మరణానికి న్యాయం చేసిన పేరు దా సాహెబ్‌కి దొరుకుతుంది. అలాగే బిసు హంతకుడిని శాశ్వతంగా తన బానిసగా మార్చుకుని అతను తనకు పోటీగా ఎప్పటికీ రాజకీయాలలోకి రాకుండా తన దారి సుగమం చేసుకుంటాడు దా సాహెబ్. తన పార్టీలో ప్రత్యర్థులను దా సాహెబ్ డబ్బు పదవులతో కొనడం, తనకు ఎదురు తిరిగిన కార్యకర్తల రాజకీయ జీవితం లేకుండా చేయడానికి పార్టీ పెద్దలతోనే పని జరిపించుకోవడం, ఇవన్నీ నవలలో కనిపించే మరి కొన్ని అంశాలు.
అన్నిటికంటే ఆశ్చర్యం దా సాహెబ్ భార్య అతన్ని దేవుడిగా కొలవడం. తన భర్త దీన బంధు అని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అతన్ని దేవుడిలా కొలుస్తుంది. చుట్టు ఉన్నవారి నమ్మకాన్ని చూరగొంటూ తనకు అనుకూలంగా వారందరినీ మలచుకుంటూ జీవించే దా సాహెబ్ లాంటి రాజకీయనాయకులను ప్రజా బంధువులుగా, దళిత బంధులుగా ప్రజలు నమ్మడం, దా సాహెబ్, సుకుల్ బాబు లాంటి రాజకీయ నాయకులు దళిత చైతన్యానికి దారులు మూసివేస్తూ వారి జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం ఈ నవలలో స్పష్టంగా చర్చిసారు రచయిత్రి. చివరకు సక్సేనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రుక్మాతో పాటు తనకు లభించిన సాక్షాలతో ఢిల్లీ బయలుదేరతాడు. జైలులో పోలీసుల దెబ్బలు తింటూ బిందా ఈ వ్యవ్యస్థ పై కసితో రగిలిపోతూ ఉంటాడు. అయితే ఢిల్లోలోమాత్రం వీరికి న్యాయం జరుగుతుందా అన్నది పాఠకులు వేసుకోవలసిన ప్రశ్న.
మహాభోజ్ అంటే పెద్ద విందు అని అర్థం. దళిత యువకుల మరణం, బిసు హత్య, బిందా జైలు కెళ్ళడం, వీటన్నిటి తరువాత దా సాహెబ్ అండతో దొరికిన ప్రమోషన్‌కి సంతోషిస్తూ సిన్హా ఓ పెద్ద విందు ఇస్తాడు. మరో పక్క తమ పత్రిక సర్క్యులేషన్ పెరగడం, పేపర్ పర్మిట్ రెండింతలవడంతో సమాచార క్షేత్రంలో విజయం సాధించిన సందర్భంగా ఎడిటర్ మరో చిన్న విందుకి సనాహాలు చేస్తాడు. ఈ రెండు చోట్ల కూడా ఎవరూ ఎవరినీ ప్రశ్నించరు. హఠాత్తుగా వారి జీవితాలు ఇంత ఉన్నత దిశలోకి ఎలా వెళ్లాయన్న అనుమానం ఎవరికీ రాదు. వచ్చినా పైకి దాన్ని ప్రకటించరు. ప్రతిపక్ష నేత సుకుల్ బాబు భారీ ర్యాలి నిర్వహించి దాని విజయంతో తన కార్యకర్తలకు విందు ఏర్పాటు చేస్తాడు. దా సాహెబ్ అన్ని కష్టాలు తొలిగిపోయి తృప్తిగా భార్యతో ఇష్టమైన వంటకాలు చేయించుకుని ఆనందిస్తాడు. ఇన్ని విందుల మధ్య దళిత యువకుల హత్య, బిసు మరణం, బిందా జైలు పాలవ్వడం మరుగున పడిపోతుంది. దళిత వాడలో జీవితం ఏ మార్పు లేకుండా ఇంకొంత అన్యాయాన్ని కలుపుకుని అదే తమ జీవితమనే రాజీతో గడిచిపోతూనే ఉంటుంది. ఆ రక్తపు కూడు అందరికీ ఆమోదమే, స్వీకారమే. అమాయమైన దళిత యువకుల రక్తంతో తడిచిన ఆ విందు, దాన్ని ఆరగిస్తున్న మర్యాదస్థుల జీవితాలను చర్చించిన ‘మహాభోజ్’ హిందీ సాహిత్యంలో వచ్చిన ఓ గొప్ప నవల.
దళిత సాహిత్యం అంటే “దళిత రచయితలు, దళిత సమస్యలపై దళిత దృష్టికోణంలో రాయడం” అనే దృష్టితో ‘మహాభోజ్’ని దళిత సాహిత్యంగా కొందరు దళిత సాహితీకారులే పరిగణించకపోవడం మాత్రం విచారకరం. ఉన్నత జైనుల కుటుంబంలో జన్మించిన మన్ను భండారి దళిత కులస్తురాలు కాదు. కాని కొందరు దళిత రచయితులు చెప్పినట్లు ఉన్నత కులస్తురాలిగా దళిత కథాంశంతో నవల రాస్తూ ఆమె దళిత పాత్రలను అసహాయులుగా, అశక్తులుగా చూపుతూ వారి పట్ల పాఠకులలో జాలి కలిగేలా ఆమె ఈ రచన చేయలేదు. ‘మహభోజ్’ లో ప్రస్తావించిన దళిత పాత్రలు భాదితులే కాని అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తి ఉన్న మానవులు.
బిసు, బిందా ఇద్దరు కూడా గొప్ప చైతన్యం ఉన్న వ్యక్తులు. ఎవరికీ భయపడని ధైర్యవంతులు, బిసు తాను అనుకున్నది సాధించడానికి ప్రాణాలను కూడా లెక్క చేయడు. బిందా జైలులో దెబ్బలు తింటూ కూడా ఆ వ్యవ్యస్థకు లొంగడు. అతని ధైర్యమే సక్సేనాను మారుస్తుంది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి న్యాయపోరాటం వైపుకు నడిపిస్తుంది. అంతకు ముందు దళితేతర రచయితలు సృష్టించిన అసహాయ పాత్రలు కావు ఇవి. పాఠకులకు సమాజంలో ఉన్నతంగా జీవిస్తూ ప్రశంసలు అందుకుంటున్న అగ్రకుల నాయకులయిన దా సాహెబ్, సుకుల్ బాబులపై అసహ్యం కలుగుతూ ఉంటే అత్యంత భయంకరమైన వివక్షను అన్యాయలను ఎదుర్కుంటున్న బిసు, బిందాల ప్రదర్శించే పోరాట స్ఫూర్తికి గౌరవం కలుగుతుంది. అందువల్ల దళితేతర రచయితలు తమ రచనలలో దళితులను అసహాయులుగా తప్ప మరోలా చిత్రించలేరనే కొందరు దళిత రచయితల ఆలోచనను ఈ నవల తప్పు అని నిరూపిస్తుంది.
దళిత రచనలు చేస్తూ భాషాపరంగా దళిత పాత్రల సంభాషణలలో యాసను, అనాగరికతను ప్రకటిస్తూ వారిని దళితేతర రచయితలు తక్కువ చేస్తారనే మరో వాదన కూడా ఉంది. ఇది కొన్ని సందర్భాలలో నిజం కావచ్చు కాని ‘మహాభోజ్’ నవలలోని దళిత పాత్రల భాషలో యాస కనిపించినా ఎంతో ఆర్ద్రత, ఆలోచన, ప్రేమ కూడా సమపాళ్లలో ప్రకటితమవుతూ ఉంటాయి. అపారమైన మానవీయ ప్రేమ ఆ సంభాషణలలో కనిపిస్తుంది. సక్సేనా జరిపే ఎంక్వయిరీ సందర్భంగా వచ్చే సంభాషణలలో ఈ విషయం గమనించవచ్చు. సుకూల్ బాబు, దా సాహెబ్‌ల భాషలో నాగరికతో పాటు క్రూరత్వం కనిపిస్తూ ఉంటుంది. పల్లెటూరి యసలో మాట్లాడే దళిత పాత్రల సంభాషణలలో కనిపించే నిజాయితీ పాఠకుల మనసులో దళిత వర్గాల పట్ల అంతులేని గౌరవాన్ని కలిగిస్తుంది. తన వ్యంగ్య శైలితో కథను అసాంతం నడిపిస్తూ మన్ను భండారి దళిత సాహిత్యంలో దళితేతర రచయితల విషయంలో అప్పటి వరకు సాహితీ ప్రపంచంలో ఉన్న అపోహలను తొలగిస్తూ ఓ గొప్ప నవలను సృష్టించగలిగారు.
దళిత సాహిత్యం దళితుల నుండే రావాలన్న వాదానికి విరుద్దంగా ఈ నవల నిలుస్తుంది. కాని ఇప్పటికీ ‘మహాభోజ్’ను దళిత సాహిత్యంగా అంగీకరించని కొందరు సాహితీకారులు తమ వితండవాదంతో దళిత సాహితీ ప్రపంచానికి తీరని అన్యాయం చేసినవారే అవుతారు. భారతీయ రాజకీయ వ్యవస్థపై ఓ మహిళ రాసిన అతి గొప్ప నవలగా దళితేతర వర్గానికి చెందిన ఓ రచయిత్రి సృజించిన అతి గొప్ప దళిత నవలగా ‘మహాభోజ్’ అన్ని రకాలుగా ఉన్నతంగా నిలుస్తుంది అన్నది ఈ నవల చదివిన ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం.
***
మహాభోజ్ (నవల)
రచన: మన్నూ భండారీ
తొలి ప్రచురణ: 1979
ప్రచురణ: రాధాకృష్ణ ప్రకాశన్.
పేజీలు: 167
వెల: ₹ 250.00
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/-/hi/Mannu-Bhandari/dp/8183610927