తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-37

0
3

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

జీవన రాగాలు:

లబ్..

డబ్..

లబ్, డబ్..

లబ్డబ్..

నా చెవులకు ఈ శబ్దమే వినబడుతోంది. రాత్రి టైమ్ ఎంతైందో తెలియడం లేదు. గదిలో ఏసీ పనిచేస్తున్నట్లు లేదు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. నిజానికి నేను ఉన్నది గదిలో కాదు. అది గుండెకు ఆపరేషన్లు చేసే ఓ పెద్ద ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ (ఐసీయు)లో. ఈ సంగతి నిన్ననే తెలిసింది. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరడం, డాక్టర్లు అనేక పరీక్షలు చేసి గుండెలో నాలుగు చోట్ల రక్తప్రసరణ బ్లాక్ అయిందని తేల్చడం, ఇక బైపాస్ శస్త్ర చికిత్సే శరణ్యమని చెప్పేయడంతో ఓ ప్రముఖ సర్జన్ (జయరాం పే)గారి పర్యవేక్షణతో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడం గుర్తుంది. (‘ఎలుక మళ్ళీ పుట్టింది’ – అన్న అధ్యాయంలో ఈ సంఘటన ప్రస్తావించాను) రెండు రోజుల తర్వాత నిన్ననే మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూస్తే ఇదిగో ఈ విశాలమైన గది (ఐసీయు)లో ఉన్నానని కాసేపటికి తెలిసింది. ఆపరేషన్ కాగానే ఐసీయు లోకి తీసుకువచ్చారట. నాకేం తెలుసు? మొండి నిద్రాయె. ఇంత నిద్ర నా జీవితంలో ఎరుగను. ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఇంత నిద్ర పడుతుందా! బోలెడు ఆశ్చర్యం. అంతలో నవ్వు వచ్చింది. అన్నీ తెలిసినా ఒక్కోసారి ఏమీ తెలియని అజ్ఞానంలోకి జారుకోవడమంటే ఇదేనేమో. రెండో రోజు రాత్రి – టైమెంతైందో తెలియడం లేదు. నిద్ర పట్టడం లేదు. చేయి కదిలించాలంటే ఏవో వైర్లు తగిలించి ఉన్నాయి. వెల్లికల పడుకున్న నేను ఎటూ కదలలేని పరిస్థితి. చేతులు పైకి లేపలేను. కాళ్లు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ విపరీతమైన బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. రెండు కాళ్లకు కోతలు పడ్డాయనీ, అక్కడి రక్త నాళాలను చిన్నచిన్న ముక్కలుగా కోసి ఇస్తుంటే బైపాస్ సర్జరీ చేస్తూ బ్లాక్ ఆయిన చోట్ల బైపాస్ (రక్తం సాఫీగా ప్రవహించడానికి ప్రక్క దారి) వేసుంటారని తెలియనంత అజ్ఞానిని కానులేండి. ఎందుకంటే, ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ‘కులాసా’ పేరిట వారానికి ఓ రోజు ప్రత్యేక పేజీని నడిపేవాడని. దానికి ఇన్ఛార్జ్‌గా ఉన్నప్పుడే విజయవాడలో అనేక మంది డాక్టర్లతో పరిచయాలు అయ్యాయి. డాక్టర్ అయోధ్య గారితో మానసిక రుగ్మతల మీద ఆర్టికల్స్ వ్రాయించాను.

కలిసిన వేళ:

డాక్టర్ జి.వి. పూర్ణచంద్ గారితో ‘కలసిన వేళలో..’ పేరిట సందేహాలకు జవాబులు వ్రాయించాను. పూర్ణచంద్ గారు ఆయుర్వేద వైద్యులు. వీరు వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా రచయిత. పైగా తెలుగు భాషాభిమాని. ‘కళారత్న’ పురస్కారం అందుకున్న డాక్టర్ పూర్ణచంద్ గారిని ఆ తర్వాత అంటే 25 సంవత్సరాల తర్వాత ఈ వ్యాసం వ్రాయడానికి కొద్ది రోజుల ముందే (2024 డిసెంబర్ 4) విజయవాడలో కలిశాను. వారెంతో సంతోషించారు.

ఆ రోజుల్లో ఓ మీడియా మిత్రుని సహాయంతో డాక్టర్ రమేష్ బాబు గారిని కలిశాను. అప్పట్లోనే వారు కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు గడించారు. వీరి ఆస్పత్రిలోనే నాకు బైపాస్ సర్జరీ అయింది. సరే, మళ్ళీ ఐసీయు దగ్గరకు వెళదాం..

క్క్యూర్.. క్క్యూర్:

ప్రక్క మంచం మీద పడుకున్నదెవరో తెలియదు. కీచు గొంతుకతో – ‘సిస్టర్.. సిస్టర్..’ అంటూ పదే పదే పిలుస్తున్నారు. కానీ, అటు నుంచి సమాధానం లేదు. పోనీ నేను గట్టిగా పిలుద్దామని ట్రై చేశాను. అప్పటికే నా గొంతు దాహంతో బాగా ఎండిపోయింది. మండుటెండలో ఎడారిలో ఉన్నట్లుంది నా పరిస్థితి. గొంతు పూడుకుపోయినట్లుంది. ఈ సిస్టర్స్ మీద కొపం వచ్చింది. మంచినీళ్ళని సైగలు చేస్తే ఓ చెంచాడు నీళ్లతో నోరు తడుపుతున్నారు. ప్రక్క బెడ్ పేషెంట్‌కి సాయం చేద్దామని నోరు చించుకుని అరుద్దామనుకున్నాను. ఊహూ.. ఆ కీచు గొంతే బెటర్. నా గొంతు ఆ మాత్రమన్నా లేవడం లేదు. ‘క్క్యూర్.. క్క్యూర్’ అంటూ ఏదో వింత శబ్దం మాత్రమే వచ్చింది. ఆ శబ్దం వింటుంటే నాకే భయం వేసింది. ఏమిటో, బైపాస్‌తో నా గుండె బాగవడం మాట అలా ఉంచితే, గొంతు పోయిందా ఏమిటీ.. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి గొంతు సరిచేసే ఆస్పత్రికి తరలిస్తారేమో.. ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు. సరిగా అప్పుడు అనిపించింది.

శరీరం కదలడం లేదు.

గొంతు రావడం లేదు.

శ్వాస గట్టిగా పీల్చలేకపోతున్నాను.

అయినా.. మెదడు మాత్రం చురుగ్గా పనిచేస్తున్నది. ఎంతగా అంటే, విద్యుత్ ప్రవహిస్తున్న తీగలా చాలా చురుగ్గా. విపరీతమైన చలాకీగా..

ఏమిటిది.. ఆశ్చర్యమే.

మెదడులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రాత్రి పూట కాసేపు కునుకు పట్టినా కలలో కూడా ఎప్పుడో చిన్నప్పటి సంగతులే కళ్లకు కడుతున్నాయి. పల్లెటూరు.. పెంకుటిల్లు.. ఆవులు.. ఎద్దులు.. తరుముతున్న ఆబోతు.. అంతలో ఎవరో అరుస్తున్నారు. ఎవరు..? ఓ ఆడమనిషి. బామ్మలా అనిపించింది. కానీ జుట్టు విరబోసుకుంది. ఎవరో తెలియడం లేదు. ఆ పెంకుటిల్లు అడవిరావులపాడులోని మా ఇల్లులా లేదు. ఏదో వింతగా ఉంది. ఆకారం నా దగ్గరకు వచ్చింది. మరీ దగ్గరగా.. ఆ వింత ముఖం చూడగానే నేను ఉలిక్కి పడ్డాను. కల చెదిరింది. అంతే ఆ రాత్రికి ఇక నిద్ర లేదు. పిచ్చి ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. ఎప్పుడెప్పుడూ తెల్లవారుతుందా అని తూర్పున ఉన్న కిటీకీ వైపు చూస్తున్నాను. అదేమిటో మనం ఎదురు చూసేటప్పుడు సూర్యోదయం ఎంతకీ కాదు.

ఇంకా తెలవారదేమీ..

ఈ చీకటి విడిపోదేమీ?!!

మంచు కడిగిన ముత్యం:

తెల్లవారాక సిస్టర్‌ని పిలిచి మాట్లాడటానికి ప్రయత్నించాను. అప్పటికే కాసిని మంచి నీళ్లు త్రాగడంతోనో మరి దేని వల్లనో తెలియదు కానీ గొంతు లేచింది. సన్నగా నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను. అడిగాను, సిస్టర్‌ని..

‘రాత్రి నిద్ర పట్టడం లేదు’

‘కొన్నాళ్లు పట్టదు. నిదానంగా మామూలు అవుతుంది’

‘కానీ ఆలోచనలు ఆగడం లేదు. పిచ్చెక్కేలా ఉందే’

‘మీ గుండెకు ఆపరేషన్ అవడంతో రక్తప్రసరణ మామూలు స్థాయికి వచ్చింది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తున్నది.. మీరు ఓ పని చేయండి. మీరు జర్నలిస్ట్‌ట కదా, తెలిసిందిలేండి. పెద్ద డాక్టర్ గారికి కూడా మీరు తెలుసట కదా..’

‘అవును. నేను జర్నలిస్ట్‌ని’ – ఈ మాటలు అంటున్నప్పుడు అంత బాధలోనో ఏదో గర్వం తొణికిసలాడింది.

ఏమిటో నా పిచ్చి. ముందు బతికి బట్టకట్టనీ, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనీ..అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను.

‘ఏం చేయమంటారు?’

‘మీకు నచ్చిన టాపిక్స్ మీద ఆలోచనలు పెట్టండి. అలా ఆలోచిస్తుంటే మీకు ఉత్సాహంగా ఉంటుంది. పైగా మంచి నిద్ర కూడా పట్టవచ్చు.’

సిస్టర్ ముఖం చూశాను. ఆమె పేరు మాధవి. చలాకీగా ఉంది. చాలా చక్కటి సలహా ఇచ్చినందుకు అమ్మాయి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను.

అర్థం చేసుకుంది. ప్రేమగా నా చెయ్యి నొక్కింది.

ఆ స్పర్శలో అమ్మ ప్రేమ కనిపించింది.

మూడవ రోజు రాత్రి ఈ సూత్రం పాటించాను. మంచి విషయాల గురించి ఆలోచించాలి. మనసులోని చెడును దూరం చేయాలి. అసలు ఈ గండం నుంచి బయటపడగానే మనసును ఎల్లవేళలా మంచు కడిగిన ముత్యంలా ఉంచుకోవాలి. అలాంటి పనులే చేపట్టాలి.

ఇలా ఆలోచిస్తుంటే – సినిమా పాటలు గుర్తుకు వచ్చాయి. అంతే, నాలో నేను పాటలు పాడుకోవడం మొదలుపెట్టాను. ఒక అంత్యాక్షరి కార్యక్రమాన్ని నేనొక్కడినే.. నాలో నేనే నిర్వహించుకుంటూ కాలాన్ని దొర్లిస్తున్నాను. ఒక పాట వెంట మరో పాట.. దాని వెంట ఇంకో పాట.

చిత్రం.. ఈ సూత్రం పనిచేయడం మొదలుపెట్టింది. అంత్యాక్షరి సాగుతుండగానే ఎప్పుడో నిద్ర పట్టింది.

ఐసీయులో అంత్యాక్షరి!

‘గుడ్ మార్నింగ్’

‘ఓహ్.. గుడ్ మార్నింగ్’

‘రాత్రి నిద్ర పట్టిందా..?’

‘పట్టిందమ్మా, నీవు చెప్పినట్లు చేశాను. అంత్యాక్షరి ఆడుకున్నాను’

‘ఆడుకున్నారా! అంత్యాక్షరా..!!’

సిస్టర్‌కి అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. అంతకన్నా వివరంగా నేనూ చెప్పలేదు.

పాటలు పాడుకోవడంతో పాటుగా ఆ పాట ఏ సినిమాలోనిదీ, ఏ సన్నివేశంలోనిది, సాహిత్యం ఎలా ఉంది..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుంటే, జీవితం మొత్తం ఓ రాగాల అల్లికగా కనబడసాగింది. మున్ముందు ‘జీవనరాగాలు’ పేరిట పుస్తకం వ్రాయడానికి బహుశా ఆ క్షణంలోనే బీజం పడిందేమో.

నాకు బైపాస్ జరిగినప్పుడే (2020) కారోనా మహమ్మారి విరుచుకుపడింది. ఏ క్షణంలో ఎవరి ప్రాణం అనంత వాయువుల్లోకి కలిసిపోతుందో తెలియని పరిస్థితి. అప్పటికి ఇంకా వాక్సిన్ కనుక్కోలేదు. ఎవరి జాగ్రత్తలో వారుండాల్సిందే. అలాంటప్పుడు ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండకూడదంటూ కొద్దిగా కోలుకోగానే పేషెంట్స్‌ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. ఐదు రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయితే ఆ రోజు మంచి రోజు కాదనీ మర్నాడు వెళతామని మా వాళ్లంటే, ఆపరేషన్ చేసిన సర్జన్ మందలించారు.

‘మీకేం తెలియడం లేదు. కరోనా కారణంగా పేషెంట్స్‌ని ఎలా రక్షించాలా అని మేమే భయపడుతున్నాము. క్షేమంగా ఆపరేషన్ జరిగింది. అది చాలు. నో.. నోనో ఇక ఉండకూడదు. ఇంటికి వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి’ – అంటూ మందలించారు. దీంతో మర్నాడే డిశ్చార్జ్ చేశారు. కరోనా సమయంలోనే జీవితం విలువ అందరికీ తెలిసి వచ్చింది. ఈ సందర్భంలోనే నాకు ఓ పాట గుర్తుకు వచ్చింది.

‘పోతే పోనీ పోరా

ఈ పాపపు జగతిలో

శ్వాశ్వత మెవడురా..

వచ్చుట ఏలో

పోవుట ఎటకో

వాస్తవమెవరూ కనలేరు.’

– అంటారు కవి అనిశెట్టి. ఇదే పాటలో మరో చోట..

‘ప్రకృతి శక్తుల జయించు నరుడా ప్రాణ రహస్యం కనలేవా?’ అని ప్రశ్నిస్తారు.

ఇంకో చోట..

‘ప్రాణం పోసిన దాతయెరా, ఈ సృష్టికి అతడు కర్తయెరా, ఇల సర్వం దేవుని లీలయెరా’ – అంటారు.

ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మన మెంత? మన జీవితం ఎంత..? అసలు ఈ భూమి ఎంత..? ఈ సౌర కుటుంబం ఎంత..? ఆమాట కొస్తే లక్షలాది నక్షత్రాలను తనతో పాటుగా తీసుకువెళుతున్న పాలపుంత ఎంత..? ఎవరు నడిపిస్తున్నారు వీటిని. విశ్వం అంతు ఎక్కడ?? అన్ని ప్రశ్నలే.. ఇదంతా దేవుని లీల కాకపోతే మరేమిటి? అంటూ సరిపుచ్చుకోవడమే..

‘చెబితే చానా ఉంది,

ఇంటే ఎంతో ఉంది..’

అంటారు వేదాంతులు. అటు శాస్త్రవేత్తలకూ, ఇటు వేదాంతులకు పూర్తిగా అంతు చిక్కని విశ్వ రహస్యాల ముందా మన యీ కుప్పిగెంతులు? ఈ అహంకారం, ఈ స్వార్థం.

అందరిలో గుడి ఉంది:

మనంతా దేవుడు చేసిన బొమ్మలం. బొమ్మకు ప్రాణం పోసినవాడే మనతో ఆడుకుంటాడు. అది అతగాడికి వేడుక. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. లాలిస్తాడు, పాలిస్తాడు. మనలో జీవన నాదం పలికిస్తాడు. మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు..?

‘అరే, ఎక్కడో లేడురా అబ్బాయి. అడుగడుగునా గుడి ఉంది. మనందరిలోనూ ఆ గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది. ఆ దీపమేరా దైవం. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతకడం కంటే నీలోని పరమాత్మను, అలాగే తోటి జీవుల్లోని దైవాన్ని గుర్తించు’ అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

అసలు నీలోనే దేవుడు ఉంటే, ఆ దేవుడి కోసం వెతకడమేమిటి? ఒక వేళ ఎక్కడో అక్కడ దేవుడు ఉన్నప్పటికీ, ఈ మనసు లేని మనిషిని చూసి ఆ దేవుడు ఎప్పుడో రాయైపోయాడట. దాగుడు మూతలు సినిమా కోసం వ్రాసిన పాటలో ఆత్రేయ అలా అనేస్తాడు. ఇక ఆ దేవుడు కనబడటంలేదని మనిషేమో నాస్తికుడయ్యాడట. ఎంత అజ్ఞానం, మరెంతటి అవివేకం.

అసలు మనిషికీ, ఇతర జీవులకు పెద్ద తేడా ఉంది. అదేమిటంటే, మనిషికి మాత్రమే బుద్ధి (ఆలోచించే మెదడు) ఇచ్చాడు. దీనికి తోడుగా హృదయాన్ని (మనసు) కూడా ఆ దేవుడే ఇచ్చాడు. ఈ రెండూ ఇచ్చి భూమి అంతా నీదేరా అబ్బాయి, ఏలుకో అని పంపాడట. అయితే బుద్ధికేమో హృదయం లేదు, ఇక హృదయానికేమో బుద్ధే రాక ఈ లోకాన్ని మానవుడు నరకం చేస్తున్నాడట – ఆహా.. ఏమి ఆలోచన అండి. అందుకే, ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యారు.

ఈ జీవితం ఎంతో చిత్రమైనది. అందుకు తగ్గట్టుగానే దాని నడత కూడా బహు చిత్రమైనది. ఎప్పుడు పైకెక్కుతామో మరెప్పుడు దిగజారుతామో ఒక్క కాలానికే తెలుసు. అందుకే ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవ్వరూ ఊహించలేరు. విధి విధానాన్ని తప్పించడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. మహా రాజులకైనా, మానవ జన్మ ఎత్తిన మహామహా దేవుళ్లకైనా ఇది తప్పదు. కాలం చెప్పిన సత్యం. లవకుశ సినిమా కోసం కొసరాజు రాఘవయ్య గారు వ్రాసిన పాటలో ఈ సత్యం ఆవిష్కృతమైంది.

జయమ్ము నిశ్చయమ్మురా:

కొసరాజు రాఘవయ్య

కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ప్రతి కష్టం వెంటనే సుఖం ఉంటుంది. కష్టకాలం కాగానే సుఖపడే యోగం వస్తుందిరా అంటూ నిరుత్సాహం పడే వారిలో ఉత్సాహం నింపిన పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. నాకైతే శభాష్ రాముడు సినిమాలో..

జయమ్ము నిశ్చయమ్మురా

భయమ్ము లేదురా

పాట నచ్చుతుంది.

జంకు గొంకు లేకుండా ముందుకు సాగిపోమ్మంటారు కవి. కష్టాలు కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి. గాఢాంధకారం అలుముకున్నప్పుడు భీతిల్లికూడదు. వెలుగు దారి కోసం వెతకాలి. సాగిపోవాలి. నిరాశతో జీవితాన్ని కృంగదీసుకోకూడదు. ఎక్కడో అవమానం జరిగిందనీ, మరో సారి ఆరోగ్యం క్షీణించి పోయిందనో ఈ జీవితం వృథా.. వృథా అనుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడి ఈ లోకం నుంచి పారిపోకూడదు. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలోని ప్రతి సంఘటన వాడి లీలగా భావిస్తూ కష్టకాలం వెళ్ళేదాకా పోరాడాల్సిందే. చివరకు విజయకేతనం ఎగురవేయాల్సిందే.

నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఇలాగే నా బతుకు అంధకారం అయింది. చుట్టూ చీకటి.. నడిచే ఓపికే లేనప్పుడు ఇక పోరాటం కూడానా..అనే నిస్పృహ. ఇలాంటి పరిస్థితి లో ఈ పాట నాకు కరదీపక అయింది. చీకటి మనసులో కొత్త దీపాలు వెలిగించింది. పర్యవసానంగా మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాక నా సొంత చానెల్ (channel5am) వైపు దృష్టి పెట్టి ఏ పాటలైతే నాకు ఊరట ఇచ్చాయో ఆ పాటలతోనే ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను.

ఏ పాట నే పాడనూ..:

పాట కున్న శక్తిని గ్రహించాను. పాటలో బలమైన సాహిత్యం ఉండి, దానికి తగ్గట్టుగా చక్కటి రాగం ఉంటే ఆ పాట హృదయాలను కట్టి పడేస్తుంది. నిద్ర లేచిన దగ్గరి నుంచి నిద్రలోకి జారుకునే వరకూ నిత్యం మనం చేసే పనులన్నింటికీ ప్రేరణ కలిగించే పాటలు మన తెలుగు సినిమాల్లో ఉన్నాయి.

‘అలలు కదిలినా పాటే

ఆకు మెదలినా పాటే

కలలు చెదిరినా పాటే

కలత చెందినా పాటే..

ఏ పాట నే పాడనూ,

బతుకే పాటైన పసివాడను’

అవును, నేను పాటకు బానిసైన పసివాడను. పాటలోని సాహిత్యం ఎన్నో సందర్భాల్లో నన్ను లాలించింది. ఊరడించింది. కొత్త ఊపిరులూదింది. ఉరకలెత్తించింది. పట్టుదల పెంచింది. పోరాట శక్తిని మేల్కొలిపింది. సాహసాలు చేయమని ప్రోత్సహించింది. పల్టీ కొట్టిన ప్రతిసారీ తట్టి లేపింది. ఇలా ప్రతి చోట పాటే. ప్రతి నిమిషం రాగమే. అందుకే నా జీవితం ఓ పాట, ఓ రాగం.

నాలో నేనే..:

నేను సంగీతం నేర్చుకోలేదు. పాట పదిమందిలో పాడి రక్తి కట్టించాలంటే సంగీతం అవసరం. కానీ పాటని వింటూ సాహిత్యంలోని భావాలను జీర్ణించుకోవడానికి సంగీతం అవసరం లేదు. నేను బయట అందరి ముందూ తరచూ పాడలేకపోవచ్చు. కానీ నాలో నేను ఎక్కువగా పాడుకుంటాను. మురిసిపోతుంటాను. బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఈ లక్షణం మరీ ఎక్కువైనట్లు అనిపించింది.

అసలు గానానికి ఓ గొప్ప శక్తి ఉంది. అది ఎలాంటిదంటే..

పులకించని మది పులకిస్తుంది.

వినిపించని కథ వినిపిస్తుంది.

మనసును మురిపిస్తుంది.

రేపటి మీద ఆశలు రేపుతుంది గానం.

చెదిరిపోయిన భావాలను చేర్చి కూర్చును గానం.

నిజమే కదా, నా జీవితంలో ఎప్పుడో మరచిపోయిన సంఘటనలను చేర్చి కూర్చడమంటే ఎంత కష్టం. కానీ పాటలు తలచుకుంటూ నా జీవన యాత్రను అక్షరబద్ధం చేసేటప్పుడు చెదిరిపోయిన సంఘటనలు మళ్ళీ కళ్ల ముందు సాక్షాత్కరించాయి. అందుకే జీవనరాగాలు పలికించ గలుగుతున్నానేమో.

గుండె చెదిరింది.

బతుకుపై ఆశలు చెదిరాయి.

ఆపరేషన్ విజయవంతం అవడంతో ఆశలు చిగురించాయి.

ఏదో చేయాలన్న తపన మొలకెత్తింది.

వెలుగే శ్రీరామ రక్ష:

బైపాస్ సర్జరీ అయ్యాక మూడు నెలలు మంచానికి అంటిపెట్టుకునే ఉన్నాను. ఆ మూడు నెలలు నా చేతికి సెల్ ఫోన్ ఇవ్వలేదు. నందిగామ ఇంటికి చేరాక కూడా రాత్రి పూట ఏదో ఆస్పత్రిలో ఐసీయులో ఉన్నట్లే భావన. ఉలిక్కిపడి లేచేవాడ్ని. శ్రీదేవి అడిగేది..

‘ఎందుకండి ఉలికిపాటు పడుతున్నారు. పీడకల ఏమైనా వచ్చిందా?’

‘పీడకల కాదు కానీ, మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నట్లు కల వచ్చింది. నా గుండెను ఎవరో చీలుస్తున్నారు. అంతలో ఓ దేవతలాంటి మనిషి వచ్చి నా చేతిలో ఓ బొమ్మ పెట్టింది. అది కార్డు సైజులో ఉన్న బొమ్మ. ఆంజేయస్వామి తన గుండెను చీల్చాడు.

పక్కటెముకల గూడుని బలంగా అటూ ఇటూ లాగి పట్టుకున్నాడు. లోపల అంతా ఎర్రటి రక్తం. ఆ ఎరుపులో ఓ మెరుపు. ఆ మెరుపులో ఓ విగ్రహం చూశాను.

శ్రీరాముని విగ్రహం అది. ఆయన చిరునవ్వుతో దర్శనం ఇచ్చారు. కానీ, అంతలో మళ్ళీ చీకటి. ఎవరో కత్తితో నా గుండెను చీలుస్తున్నారు. ఆ చీకటిని తట్టుకోలేకపోయాను..’

శ్రీదేవికి అర్థమైంది. వెంటనే లేచి లైటు వేసి. ‘ఇక లైటు ఆపనులేండి. మీరు నిశ్చింతగా పడుకోండి. ఈ ‘వెలుగే’ మీకు శ్రీరామరక్ష’

ఆ తర్వాత చాలా రోజులు ఆలోచించాను. చీకటిని ప్రారద్రోలే శక్తి ఒక్క వెలుతురుకే ఉంది. ఆ వెలుతురు ఏది? ఇలాంటి ఆలోచనల నుంచి పరిష్కార మార్గం దొరికింది. ఎస్, వెలుగు దారిన సాగడమే. అంటే మంచి పనులు చేయడమే. నాకు శక్తి రాగానే ఇక జీవితంలో మంచి పనులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అవి కూడా సమాజానికి పనికొచ్చే పనులే అయి ఉండాలి. పిల్లలు పెద్దవారయ్యారు. వారి సంసారాలు వారివి. అయినప్పటికీ ఇంటి పెద్దగా కొన్ని బాధ్యతలు మిగిలే ఉన్నాయి. వాటిని ఒక ప్రక్క నిర్వహిస్తూనే సమాజం హర్షించే కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి.

పని ప్రారంభం:

మూడు నెలలు కాగానే మంచం దిగి, ఉత్సాహంగా ల్యాప్‌టాప్ తెరిచాను. ఛానెల్ 5ఏఎం లో సరికొత్త కార్యక్రమాలు రాబోతున్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రకటన ఇచ్చాను.

ఘంటసాల మాష్టారిని స్మరించుకుంటూ పాటల పల్లకీ కార్యక్రమాలను 30 రోజుల పాటు నిర్ణీత వేళల్లో ప్రసారం చేశాను. ఆ తర్వాత పిల్లల కోసం బాలవినోదిని, గురువులను స్మరించుకుంటూ జై సద్గురు, అన్నమయ్య కీర్తనలు, జై శ్రీరామ్ వంటి కార్యక్రమాల్లో దేశ విదేశాల నుంచి వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా వ్యాధి కారణంగా కన్నుమూయడం బాధ కలిగించింది. వారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఎస్పీ బాలు గీతాలపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాను. 90ఏళ్ల తెలుగు సినిమా వైభవం పేరిట ఏకంగా 90 రోజుల పాటు విశిష్ట కార్యక్రమాలను అందజేశాను. తెలుగు వారి పండుగ అయిన ఉగాది సందర్భంగా చైత్రమాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలిగాను. పైసా రాకపోయినా పవిత్ర కార్యంగా ఈ పనులు చక్కబెట్టాను.

తెలుగు భాషకు చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అధికార భాషా సంఘం నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకోగలిగాను.

పాటలు, వాటిలోని సాహితీ విలువలు గ్రహించడానికి చక్కటి అవకాశాలు వచ్చాయి. ‘సునాద వినోదిని’ అనే గ్రూప్‌లో చేరి మహానుభావుల విశ్లేషణలు చదివి ఎంతో ఆనందించాను. అలాగే ‘జనరంజని’ వంటి సోషల్ మీడియా పేజీల ద్వారా తెలుగు పాత పాటలు ఇప్పటికీ వింటూ మురిసిపోతుంటాను. ఇంతలో బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామ (ఆకాశవాణి) వారు అందించిన ప్రోత్సాహంతో మంచి పాట – మనసులో మాట పేరిట సినిమా పాటలను నాదైన శైలిలో విశ్లేషించగలిగాను. ‘తానా’ వారి ప్రపంచ సాహితీ వేదిక పై విశిష్ట అతిథిగా పాల్గొని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి గురించి పదిహేను నిమిషాలు ప్రసంగించగలిగాను. అంతలో అనుకోకుండా వచ్చిన అవకాశం – నా యీ జీవన సాఫల్య యాత్ర రచన. ఇప్పటికి 37 అధ్యాయాలు పూర్తయ్యాయి.

ఇంకా..

లబ్

డబ్

లబ్ డబ్.. లబ్డబ్..

ఈ హృదయ స్పందనలో ఓ రాగం ఉంది.

ఏదో వినిపించాలన్న తపన దాగి ఉంది.

ఈ శబ్దం..

నా ఆయుధం.

నా బలం.

ఈ యాత్రలో ఇంకా ఎన్ని జీవన రాగాలు మిగిలి ఉన్నాయో..

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here