శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-13

0
5

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

170.
కం:
గురువర్యుడు శుక్రుండును
వరతపమును జేసి రిపుని వంచెడు విధమున్
సరసిజగర్భుని కరుణను
దొరకొనుమని యానతిచ్చె ధృతమతి నైతిన్

171.
తే.గీ.:
మద్దిచెట్టును వేరును పట్టి నరుక
వృక్షమంతయు నిర్జీవమైన భంగి
విష్ణు జంపిన సురరాజు వెలుగు బాయు
సకల దానవ లోకంబు సుఖము నొందు

172.
వచనము:
“మహాపరాక్రమశీలురైన మీరు, విజృంభించి, లోకముల మీద పడి, శిష్ట శిక్షణంబు సేయుడు. యజ్ఞయాగాదుల ధ్వంసము గావించుడు. మునీశ్వరుల వధి౦పుడు. మునిపత్నుల చెరబట్టుడు. బ్రాహ్మణులను గోవులను హత్య గావింపుడు. వేదపఠనము జరుగుచోట, ఆ వేదములను పఠించువారిని తగులబెట్టుడు” అని దానవేశ్వరుండగు హిరణ్యకశివుండు ఆనతి నివ్వ

173.
శా.:
దైత్యుల్ జృంభిత క్రోధ ద్వేషమదముల్ ధర్మాతి రిక్తంబులై
అత్యాచారము చేయసాగిరి; మునుల్ అత్యంత నిష్ఠాత్ములై
నిత్యాగ్నుల్ జ్వలియించు యాగములపై, నిర్దోషులౌ వారిపై
కృత్యాకృత్యము వీడి పీడనములన్ క్రుంగంగ సర్వుల్ కడున్

174.
కం.:
పురములు బల్లెల గాల్చిరి
వరవృక్షము లెల్ల నఱకి ప్రజల గృహములన్
కొరవులతో ముట్టించిరి
సురవైరులు దీక్షబూని, శోకానలమున్

175.
చం.:
విడిచె తిలోదకంబులను ప్రేమయు దుఃఖము తోడ, తమ్ముకున్
గడచిన నాటి సంగతులు గ్రమ్మగ సోదరపుత్రయుక్తుడై
నడిపెను సాంత్వానాన్విత మనస్కుల జేయుచు వారి నెంతయున్
‘విడుడిక దుఃఖమున్’ యనుచు పెద్దను తండ్రిని మీకటంచు తాన్

176.
చం:
శకునిని, భూతసంతపుని, శంబరు, ధార్ష్ణిని, కాలనాభునిన్
వృకుని, మధోత్కచున్, సుతులమాతను, దుఃఖము దేర జేసె తాన్
సకల సురారి నాథుడు, విశాల మనంబున, స్వీయ మాతనున్
చరిత సమస్తలోక ఘన శౌర్యుని మృత్యువు దుఃఖహేతువే?

177.
కం.
అని రిపు మార్కొని మడిసెను
తన మరణము వీరవరుల దగు యని, దానిన్
కొనియాడ దగును, దుఃఖము
గన నేటికి యనుచు వారి గని యోదార్చెన్

178.
వచనము:
ఈ విధంబున మరదలు వృషద్ధానువును ఆమె పుత్రులను, తన తల్లి దితిని, జ్ఞాన సంపన్నుండైన హిరణ్యకశిపుడు, మృత్యుతత్త్వము నెఱింగించి వారల శోకము బాపెను.

179.
సీ.:
చలి వణకుచు వచ్చి చలిమంట చుట్టును
మూగును ప్రాణులు ముదము తోడ
మంట తగ్గిన తరి మరులుదురటునిటు
జూడ జీవితమును గూడ నిటులె
ఆత్మ నిత్యంబు జీవుండ శాశ్వతుండు
వివిధమైనట్టి మేనుల వెల్గుచుండు
పరమాత్మ తత్త్వంబు ప్రకటంబు గాదిటు
మాయను గ్రమ్మిన ఛాయయగుట
తే.గీ.:
జనని! ప్రవహించు జలమున వనతరువులు
తాము చలియించు నట్టివి ధమది తోచు
చిన్ని కుర్రలు గిరగిర చేరి తిరుగ
భూమియును దిర్గు భ్రాంతిని పొందునటుల

180.
వచనము:
అని, దానవ ప్రభువు, ఉపాధి ధర్మంబుల నుపహితమైన దృష్టాంతముల ద్వారా వారికి వివరించినాడు.

181.
కం:
మరదల! యమునికి మరియును
మరణించినవాని పుత్రు బంధువులకు, నే
జరిగిన సంవాదము, మీ
కెరిగించెద వినుడు మీరు నెంతయు శ్రద్ధన్

సుయజ్ఞుని వృత్తాంతము

182.
చం.:
సమసె సుయజ్ఞుడన్ నృపుడు సంగరమందున శత్రురాజు తోన్
కుములుచు పత్నులున్ సుతులు క్రుంగిన దేహము జూచి రచ్చటన్
అమరిన భూషలున్ కవచమవ్విధి ఛిన్నముగాగ, రక్తముల్
కమలిన మేన చారికలు గట్టగ, మేదిని కూలి యుండగన్

183.
తే.గీ.:
భర్త శవమున బడి ఏడ్చి పత్నులపుడు
తండ్రి నిర్జీవ దేహంబు తనయులచట
మరణ నిశ్చల గాత్రంబు బాంధవులును
కనుచు విలపించుచుండిరి మనము కరుగ

184.
కం.:
రాజును దహనము చేయగ
నిజభార్యలు సమ్మతింప నేరక నడలన్
రాజీవహితుడు కిరణపు
రాజిని తగ్గించి పశ్చిమాద్రిని జేరెన్

185.
వచనము:
ఇది యంతయు తన దివ్యదృష్టితో తెలుసుకున్న పరేతవిభుండు, సమవర్తి, యమధర్మరాజు ఒక బాలుని వేషములో వారి దగ్గరకు వచ్చి, ఇట్లు చెప్పదొడంగెను.

186.
తే.గీ.:
ప్రకృతి ధర్మంబు మరణంబు, రాలు జనుల
చూచుచును మోహపాశాన స్రుక్కువారు
మనుట, మరణించుటయు గూడ మాయ యనెడు
నిత్యసత్యంబు దెలియక మెలగువారు

187.
ఉ.:
ధన్యులు మానవుల్, చనగ తల్లియు దండ్రియు, క్రుంగరెంతయున్
అన్యులు చావ, శోకమది ఆవపుగింజయు రాదు, ఎందరో
గణ్యులు కీర్తిశేషులయి కల్సిరి కాలపుగర్భమందు, ఏ
పుణ్యము జేసినన్ మరణమున్ కనకుండగ బోరు తప్పకన్

188.
తే.గీ.:
ఇంటి యజమాని గృహమున ఎంత యేని
ప్రేమ వసియించినను దాని వీడిపోవు
తనువు సైతము నట్టులే తథ్యముగను
శాశ్వతంబుగ నిలువదు చాల తడవు

189.
సీ.:
దారువు లందుండు దావాగ్ని ఎవ్విధి
మండుచు వేరుగా బ్రకటమగును
మానవ దేహన వ్యాపించు వాయువు
నాసికాదుల వేర నాట్యమాడు
విశ్వమంతయు నిండి వెలుగు యాకాశంబు
వస్తు ధర్మమునెట్లు వదలి యుండు
ఇంద్రియ వ్యాపార మేర్పడు జీవుండు
కాదు శ్రోతయు వక్త, కాదు నెవడు
తే.గీ.:
కర్మబంధము దేహాల కారణంబు
నేను దేహము నను భ్రాంతి నిన్ను విడువ
మాయ తొలగును భ్రాంతియు వదలిపోవు
వస్తు దృశ్యాది సకలము వట్టి మిథ్య

190.
వచనము:
“కావున, ఓ సాధ్వీమణులారా! మీ మృత్యువును మీరు తెలుసుకొనక పతి మరణించెనని బాధపడుచున్నారు. మీరు శత సంవత్సరములు రోదించినను మీ పతిని మరల పొందజాలరు” అని, బాలుని రూపమున యున్న నరకాధిపుడు, సుయజ్ఞుని పత్నులకు తెలిపి అంతర్హితుడయ్యెను. రాణులు, నితర బంధువులు, మరణ తత్త్వమును గ్రహించిన వారై, శోకము నధిగమించి రాజుకు దహన సంస్కారములు జరిపించిరి.

191.
మ.కో.:
పుత్రుడవ్విధి పుత్రశోకము పూని దూరము జేయగా
చిత్రమైనవి చావు పుట్టుక, చేర వీడగ శక్యమే
శత్రు భీకరుడైన పుత్రుడు శౌర్యగౌరవ మొప్పగా
ధాత్రి వీడెనటంచు మాతయు దార దుఃఖము బాయగన్

~

లఘువ్యాఖ్య:

పద్యం 171లో హిరణ్యకశిపుడు, విష్ణువును చంపితే, దేవతలందరూ నిర్జీవులవుతారు అంటూ ఉన్నాడు. అక్కడ ఒక చక్కని ‘ఉపమ’ ఉంది, ‘మద్దిచెట్టు వేరును నరికితే, చెట్టంతా చచ్చినట్లు’. 172 వచనం. తన రాక్షస సైనికులు ఏ విధంగా ప్రపంచం మీద పడి అత్యాచారాలు చేయాలో దిశానిర్దేశం చేస్తున్నాడు. పద్యాలు 173, 174లో వారు సాగించిన దమనకాండ వర్ణింపబడింది. పద్యాలు 175, 176లో తన తల్లిని, సోదరుని భార్యను, ఓదార్చాడు రాక్షసపతి. తన తమ్ముడు వీరమరణం పొందాడని, దానిని చూసి గర్వపడాలని చెప్పాడు. వచనం 178 లో అతని మరదలు పేరు తెలుస్తుంది. (వృషద్ధానువు). అతడు జ్ఞాన సంపన్నుడని, మృత్యుతత్త్వము తెలిసినవాడని తెలుస్తుంది. పద్యం 179 లో ఆత్మ నిత్యమని, శరీరం అశాశ్వతమని చెబుతాడు. చలి మంట చుట్టూ మూగిన జనులు మంట తగ్గిన తర్వాత వెళ్లిపోయినట్లు, అందరూ ఈ లోకాన్ని వీడవలసిందే. జీవితం ఒక భ్రాంతి. పారే నీళ్లలో ప్రతిఫలించే చెట్లు అవి కూడా కదిలినట్లు కనపడతాయి. చిన్నపిల్లలు గిరగిర తిరుగుతూ భూమే తిరిగినట్లు భావిస్తారు (179). హిరణ్యుని జననమరణ వివేకం గొప్పది.

181 నుంచి 191 వరకు హిరణ్యకశిపుడు తన తల్లికి, మరదలికి ఆమె పిల్లలకు సుయజ్ఞుని వృత్తాంతమును వివరిస్తాడు. సుయజ్ఞుడు అనే రాజు యుద్ధంలో మరణిస్తే, అతని రక్త బంధువులు ఎంతో దుఃఖిస్తుంటారు, అతనికి అంత్యక్రియలు చేయకుండా. అప్పుడు మరణానికి అధిష్ఠానదేవత అయిన యమధర్మరాజు ఒక బాలుని వేషములో వచ్చి, వారికి చావు పుట్టుకలలోని రహస్యాలను వివరించి, వారి దుఃఖాన్ని తొలగించి, రాజుకు అంత్యక్రియలు జరిగేలా చూస్తాడు. 186లో ‘మనుట, మరణించుటయు గూడ మాయ’, ‘ప్రకృతి ధర్మంబు మరణంబు’ అంటాడు. ఆప్తులు చనిపోతే తాత్కాలిక దుఃఖమేగాని, తర్వాత మరచిపోవడం మానవుల అదృష్టం అంటాడు యముడు. ‘Grief is brief’ అన్నారు అందుకే. 189లో దేహాలకు కారణం కర్మ బంధమేనని, దానికి దృష్టాంతాలను శరీరానికి, జీవానికి గల తేడాలను కవి చక్కగా వర్ణించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here