[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఎండాకాలం రోజులు కావడంతో సారిక నైనితాల్ వెళ్తుంది. తనకి షూటింగ్ షెడ్యూల్స్ ఉండడం వల్ల సమీర్ వెళ్ళలేకపోతాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన సమీర్, ఒక కొంకణీ కథను గుర్తు చేసుకుంటాడు. ఒకరోజు ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. సాధారణంగా ఇంట్లో పనివాళ్ళు ఎవరినీ కాలింగ్ బెల్ కొట్టేంత దూరం రానీయరు. తలుపుకున్న పరికరం నుంచి చూస్తే, బెర్ముడా షార్ట్స్‌లో ఉన్న ఒకతను కనిపిస్తాడు. వచ్చినతని పేరు కుల్వంత్ అనీ, మీకు చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వాలని బలవంతం చేసాడని చెప్తాడు కుర్రాడు. అతడిని పంపేసి, కుల్వంత్‌ని లోపలకి రమ్మంటాడు సమీర్. కుల్వంత్ సమీర్‍కి నమస్కారం చేసి, తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. కానీ తనొచ్చిన పనికీ, తన వృత్తికీ సంబంధం లేదని చెప్తాడు. సమీర్‌కి తొలిసారి ఛాన్స్ వచ్చిన సినిమాని ప్రస్తావించి, ఆ తీసేసిన హీరో తన తమ్ముడని చెప్తాడు. అతనికి సినిమాలు బాగానే ఉన్నాయిగా అని సమీర్ అంటే, సమస్య అది కాదనీ, సమస్య సారికతో ఉందని చెప్తాడు కుల్వంత్. వివరాలడిగితే, సారికకు దగ్గరైన వారెవరూ రజనీశ్‍కి నచ్చరని అంటాడు. రజనీశ్ ఒక సైకో అని చెప్తాడు. సాలెగూడు లాంటి రజీనీశ్ వ్యూహంలో సారిక ఈగలా చిక్కుకుపోయిందనీ చెప్తాడు. రజనీశ్ వ్యూహాల గురించి చెప్తాడు. మీకెలా తెలుసు అని సమీర్ అడిగితే, తను తెలుసుకున్నానని అంటాడు. రజనీశ్‍కి తన మేధస్సుపై విపరీతమైన నమ్మకం ఉందని అంటాడు. తన మిత్రుడూ, రజనీశ్ మైసూరులో గుర్రపు పందేలు సందర్భంగా కలుసుకున్నారనీ, తర్వాత ఓ హోటల్‍లో జల్సా చేసుకున్నారనీ చెప్తాడు. తన మిత్రుడు అడిగిన ఓ ప్రశ్నకు రూపాయి నాణెం గాల్లోకి ఎగరేసి, ‘హెడ్స్ సమీర్, టెయిల్స్ సారిక’ అన్నాడని చెప్తాడు కుల్వంత్. – ఇక చదవండి.]
[dropcap]ఒ[/dropcap]క విషయం మీద మననం చేయటానికి అసలు ఆ ప్రక్రియకు సమయం కేటాయించాలా? లేదా అన్నది ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం. నాలో నేను రజనీశ్ గురించి ఆలోచిస్తూ, సారిక గురించి ఎందుకో మథనపడుతూ నిద్ర పోగొట్టుకుని ఓ గ్లాసు మంచి నీళ్ళు సేవించి డాబా మీదకి వెళ్ళిపోయాను. జో ఫోన్ చేసి సారిక తండ్రి కలవబోతున్నాడని సమాచారం అందించాడు. ఇంతలో ఈ ఆర్కిటెక్ట్ వచ్చి ఎంతో పట్టుదలతో ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. డాట్స్ ఎలా కనెక్ట్ చెయ్యాలి?
సీన్ చేసే ముందు రజనీశ్ అంటూ ఉంటాడు – ‘ఏదో చెయ్యాలనో లేక చేసెయ్యాలనో సీన్ లోకి వెళితే అక్కడ మరేదీ జరగదు. ఒక జోకర్‍లా మిగిలిపోతావు. మామూలుగా ప్రవేశించి కథను జరగనివ్వడం ఒక పద్ధతి. రంగంలోకి వచ్చిన తరువాత అక్కడ జరుగుతున్న వాటిని బట్టి నువ్వేదో చాలా గొప్పగా నటించావని అందరూ అనుకుంటారు..’
రజనీశ్‌కి ఏ గ్రంథంలోనైనా ఎక్కడ నాటకీయత ఉన్నదో దానిని అన్వేషించి సమయానికి, సందర్భానికి అన్వయించి చెప్పే గొప్ప ప్రతిభ ఉన్నది.
“నీ గురించి ప్రేక్షకుడికి సంఘటనల ద్వారా విశేషంగా తెలిసిపోయినప్పుడు నీ నటనలో ఆ అంశాన్ని నాడకోవటం చాలా అవసరం..!” అన్నాడు. ఓ రోజు “..భారతంలో, పాండవులు ద్రౌపదిని వివాహమాడిన తరువాత శ్రీకృష్ణుడు – పాండవులతో కలసి హస్తినాపురం వచ్చాడట. ధృతరాష్ట్రుని కొలువులోకి ప్రవేశించారు. శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడక ముందరే ధృతరాష్ట్రుడు ‘వీరిరువురు కొట్టుకోకుండా అర్ధరాజ్యం ఇస్తున్నాను’ అన్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఎటువంటి మనోభావాలను మాట్లాడకుండా వ్యక్తపరుస్తాడు అనేది ఆలోచించు” అన్నాడు.
అటువంటి రజనీశ్ ఇటువంటి పనులు చేస్తారా? చేయగలడా? ఏమో! తర్కానికి అందటం లేదు. దూరంగా ఓ షిప్ వెళ్లిపోతోంది. ఇక్కడి నుండి చూస్తే వాస్తవానికి ఎటు వెళుతోందో తెలియదు.
నిజమే. కేవలం తర్కానికీ, సరైన ఆలోచనకే కట్టుబడి గొప్ప గొప్ప పనులు చరిత్రలో జరిగి ఉండలేదు. ఆ మాటకొస్తే ఆ పద్ధతిలో చరిత్ర ఏనాడూ స్పష్టింపబడలేదు.
అడిగినా కూడా సారికను పెళ్లి చేసుకోవాలా? రజనీశ్ గురించి నా కంటే ఎక్కవ తెలిసిన అమ్మాయి! నన్ను ఆసరాగా వాడుకుంటోందా? లేక నిజంగా ఒక అనుబంధం ఏర్పరచుకుంటోందా?
హాయిగా, గోవాలో డాఫోడిల్స్‌లో నాటకాలు, సంగీతపరమైన కార్యక్రమాలూ చేసుకుంటూ కాలం గడపవలసిన వాడిని. ఎక్కడి నుండి ఎక్కడికో అనవసరంగా వెళ్ళిపోయానా?
నేను ముంబయి వెళ్ళను అని పట్టుబట్టినప్పుడు జో అన్నాడు – కొందరి జీవితాలు పెద్ద పెద్ద కాన్వాస్‍ల మీద దిద్దే బొమ్మల వంటివి – చిన్న చిన్న ఆనందాలు, కోరుకొన్నప్పుడు మనశ్శాంతులు దొరకకుండా బార్డర్‍కి అవతల ఉంటాయి..
***
“అందరినీ పోగొట్టుకున్నాననుకున్నాను..” ఆ పెద్దాయన చెబుతున్నాడు, “..నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను వదిలేసిన నా భార్య ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి పిల్లల గురించి కనుక్కోలేదు.”
ఆయనను కలవాలా వద్దా అని ఎంతో ఆలోచించి, చివరకు కలిసి కనీసం సమాచారం సేకరించవచ్చనే ఆలోచనతో లీలా హోటల్ లోకి వచ్చాను. సారిక అంతా తన తండ్రి పోలికేనని అర్థమయింది.
“సార్..” అన్నాను, “..నేను ఏదో సినిమాలలో నటించే మనిషిని. సంసారాల గురింంచి నాకు తెలియదు. అంత అవసరం కూడా నాకు లేదు..”
చెయ్యి అడ్డం పెట్టాడు.
“ప్లీజ్,..!” అన్నాడు. “..ప్లీజ్ బేర్ విత్ మీ! నేను మీ ముందర మాట్లాడవలసినదంతా ఇప్పటికి ఇరవై సార్లు రిహార్సల్ చేసాను.”
“ఓ. మేము ఒక షాట్ కూడా అంత శ్రమించం.”
“జీవితం.. ఇది జీవితం. ఆలోచనకీ, అనుభూతులకీ మధ్య పలు సుడిగుండాలు ఏర్పడిపోతాయి. కొన్ని ఎక్కడి నుండో వచ్చి నిలబడిపోతాయి. కొన్ని కనబడకుండానే ఎప్పటి నుండే ఉండే ఉంటాయి. చెప్పటం నా ధర్మం..”
తెల్లని గెడ్డం, ఎర్రని చర్మం, నల్లని కళ్లద్దాలు.. మనిషి అంతర్జాతీయంగా వ్యాపారంలో ఎంతో ఎత్తు ఎదిగినప్పటికీ, పాపం, జీవితంలో పొందవలసినదేమీ పొందలేదని తెలుస్తోంది.
“మరేం ఫరవాలేదండీ. మీరు చెప్పండి. నేను అన్న మాట అది కాదు. అందరికీ ఏదో ఒక బాధ అంటుంది. అవి మామూలే.. కాకపోతే నేను ఎంతగా మీ విషయాలలోకి రావచ్చు అనేది నాకు తెలియదు. అంత కంటే ఏమీ లేదు.”
ఆలోచించాడు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండీ చక్కగా వేయించిన ఆ జీడిపప్పుల లోంచి ఒక్కొక్కటి స్పూనుతో తీసుకుని దాని మీద ఉన్న కారాన్ని ఊదేసి జాగ్రత్తగా నోట్లోకి తీసుకుని ఇష్టంగా నములుతున్నాడు.
“నిజమే. నేనెవరినో, మీరెవరో, అవునూ.. సారిక కూడా.. ఎవరో కదా?”
“అదేంటి? మీ అమ్మయి కాదా?”
“అమ్మాయే. భార్యా బాధితుడినైన నాకు కొత్త జీవితం ఇస్తుందని ఆశ పడ్డాను. ఈ గొడవలను భరించలేకో, మరి వేరే ఆలోచనలు తనతో రగిలినందుకో తెలియదు, స్వంత కళ్ల మీద నిలబడటానికి పూణె చేరి, అక్కడి నుండి ఇక్కడికి చేరింది. ఎక్కడికో వెళ్లిపోయింది.”
“మీరు సారికను ఎక్కువగా కలవరన్న మాట.”
“సారిక ముంబయిలో లేనప్పుడు నేను మిమ్మల్ని రహస్యంగా కలవటానికి ఎందుకు వచ్చానుకున్నారు?”
“ఓ. అన్నీ సమస్యలే.”
“అవును. సారిక ఏమైనా ప్రపోజల్ పెట్టిందా?”
“లేదు.”
“మీరు ఏదైనా..?”
“లేదు.”
“పెడతారా?”
గట్టిగా నవ్వాను.
ఆయన కూడా చిత్రంగా నవ్వాడు. తొందరపడ్డానేమోనని అనుకున్నట్లున్నాడు.
ఓసారి చుట్టుతా చూసాడు.
“మీరు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారా?” అడిగాను.
దీర్ఘంగా నిట్టూర్చాడు.
“రోజూ చేసే పనులు కొంతమంది అలవాటుగా, సునాయసంగా చేసేస్తారు. అవి చేసేస్తూనే వేరే పనులలోకి అలవోకగా వెళ్ళిపోతారు.”
“కరెక్ట్.”
“జాగ్రత్తగా కళ్ళతో చూడకుండా, ఎడమ కాలి చెప్పు కుడి కాలి లోనూ, కుడి కాలి చెప్పు ఎడమ కాలికీ తొడుక్కుని కొంత దూరం నడిచేసాక కూడా ఏం జరిగిందో అర్థం చేసుకోలేని మనిషిని.”
“ఓ. ప్రపంచం లోనే టెక్స్‌టైల్ రంగంలో ఇంత పేరున్న మీరు, ఇలా మాట్లాడేస్తే ఎలా?”
“దేని దారి దానిదే – కొందరు కొన్ని చేయలేరు. దట్సాల్. అర్థం కాని జీవితాలు అర్థం లేనివిగా మారటానికి అర్ధ నిమిషం పట్టదు.”
“నాకొకటి చెప్పండి?”
“అడగండి. ఎన్నో చెప్పాలి.”
“ఇక్కడి సంగతులు మీకు ఎలా తెలుస్తూ ఉంటాయి?”
“పెద్ద విషయం కాదండీ.. ఎవరి దగ్గరా ఈ రోజు ఏదో దాగి లేదు.”
“ఒకే. సారికలో ఏవో కొన్ని విచిత్రమైన ఒరవడులున్నాయి.”
అనుమానంగా చూసాడు.
“ఎలాంటివి?”
“ఒక్కోసారి బాగా ఎక్సైట్ అయిపోతుంది. ఒక రోజు నన్ను కారులో తీసుకుని వెళుతూ నడిపిన తీరుకి అది నా చివరి రోజు అనుకున్నాను. లోలోపల బాధపెట్టే ఏదో రుగ్మతని అధిగమించేందుకు అలా చేస్తుందా అనుకున్నాను. అలా ఎక్కువ సార్లు జరగలేదు.”
“మీరు సినిమాలలో నటిస్తారు.”
“అవును.”
“ప్రేమ, వాత్సల్యం వంటి వాటి మీద మీ అభిప్రాయం?”
“ప్రేమ గురించి నాకు తెలియదు. వాత్సల్యం అనేది మనిషిని మనిషిగా నిలబెట్టి చూపుతుందని నాకు తెలుసు.”
“ఎవరినీ ప్రేమించలేదా?”
“లేదు. లేను.”
“అంటే?”
“అది ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఎలా అని చెప్పగలను?”
“ఊఁ.. ఇష్టపడడం?”
“ఒక ఉద్దేశం కోసం అని ఎన్నడు ఎవరినీ ఇష్టపడలేదు.”
“సారిక జీవితం ముళ్ళతో కూడినది. కొట్టుకు చచ్చిన తల్లిదండ్రులు, ఆ తరువాత నాట్యం, నటన మీద ఉన్న అనంతమైన ఇష్టం వలన పిపాస, ఒక దాహం వలన మామూలుగా సాగిపోయే జీవితాలు ఆమెకు ఎన్నడూ నచ్చలేదు. నేను సినిమాలను ఇష్టపడలేదు. అంతకంటే ఏమీ లేదు.”
“అంతేనా? అవి మామూలే కదా?”
ఆయన లేచి వాష్ రూమ్‌కి వెళ్ళివచ్చాడు. లోపల చాలా ఆలోచించాడని చెప్పటానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అక్కరలేదు.
“మామూలే, నిజమే. కానీ అత్యంత బాధాకరమైనది ఇంకా ఉన్నది.”
“ఏంటది?”
“వదిలెయ్యండి. నేను వచ్చిన పనికీ దానికీ సంబంధం లేదు.”
“రజనీశ్..”
తల అడ్డంగా ఊపి చెయ్యి అడ్డం పెట్టాడు.
“సార్, ఆ కోణం ఈ రంగంలో అంతటా చెప్పుకునేదే. అలాంటిది మీకూ బాగా అర్థమయ్యే ఉంటుంది.”
“మీకు సమాచారం బాగా అంది ఉంటుంది కదా?”
“నిజమే. నేను అంతగా పట్టించుకోను.”
“మీరు వచ్చిన పని? నాకు వరసగా కాల్స్ వస్తున్నాయి!”
కళ్ళజోడు తీసి ప్రక్కన పెట్టాడు. అటు ప్రక్క నుండి ఒక పెద్ద బాగ్ తీసాడు. లేచి నిలబడ్యాడు. ఆ బాగ్‌తో సహా పైకి పెట్టుకుని చేతులు జోడించాడు.
“ఒక కూతురు ఒక తండ్రికి తెలియకుండా, తెలియాలని కూడా అనుకోకుండా, అసలు తండ్రి ప్రమేయం కూడా వద్దు అనుకుని కూడా, జీవితంలో నచ్చిన వ్యక్తితో వివాహం చేసుకుని స్థిరపడిపోవాలనుకున్నప్పుడు ఆ తండ్రి ఏ విధంగా – ఆమెను ఏలుకోవయ్యా? – అని అడుగుతాడో, ఆమెకు తెలియకుండా అది నేను మిమ్మల్ని అడగుతున్నాను. నేను చదివిన చరిత్రలో నా లాంటి తండ్రి ఒకరే ఉంటాడు” అని నా చేతిలో ఆ బాగ్ పెట్టాడు. గుళ్ళో అర్చకుడు కూడా అర్చనకు సంకల్పం అంత స్పీడులో చెప్పటం నేను చూడలేదు. అంతే కాదు, మారు మాట్లాడకుండా బయటకు నడిచాడు. ఆ బాగ్ తోనే డోర్ బయటకు వచ్చాను.
“సార్, నా నిర్ణయం అలా ఉంచండి. ఈ నిర్ణయం రజనీశ్‌కు ఏదైనా సందేశం ఇవ్వటానికా?”
“కాదు. సారికలో చిత్రమైన ఒరవడులు ఉండవచ్చు. కానీ చేతకానిది కాదు. ఆమెలోని బాధలు వేరే ఉన్నాయి.”
“బై!..” అంటూ నా వైపు బాధగా చూసాడు, “..సార్, సారికకు ఒక చిన్ని తమ్మడుండే వాడు..!”
నా చేతిలోని బాగ్ జారి క్రింద పడిపోయింది.
(ఇంకా ఉంది)