[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[దసరా సెలవలకి ఇంటికి వచ్చిన రాఘవతో అతని పెళ్ళి ప్రస్తావన తెస్తారు తల్లిదండ్రులు. మేనమామ కూతురు మమతని పెళ్ళి చేసుకోమని అడుగుతారు. ఇప్పట్లో తనకి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని, తన సంపాదనతో మరో మనిషిని పోషించలేనని చెప్తాడు రాఘవ. తాను ఆర్థికంగా అండగా ఉంటానని తండ్రి అన్నా, అందుకు ఇష్టపడడు రాఘవ. కావాలంటే, ముందు తమ్ముడికి పెళ్ళి చేసేయమంటాడు. అమ్మానాన్నలు బాధపడతారు. సెలవలు అయిపోయాకా, మళ్ళీ తామరగుంటకి వచ్చేస్తాడు రాఘవ. ఇళ్ళకు వెళ్ళిన పిల్లలలో చాలామంది ఊర్లనుంచి రాకపోవడంతో, తరగతులు వెంటనే మొదలవలేదు. ఓ రోజు సాయంత్రం, టీచర్లతో పాటు ప్రధానాధ్యాపకులు కూడా సాయంత్రపు నడకకి వెళ్తారు. నడుస్తూంటే ఎదురైన రైతులు ప్రధానాధ్యాపకులకు నమస్కారాలు చేస్తారు. ఒక చోట కూర్చుంటారు అందరూ. ప్రధానాధ్యాపకుల కోరిక మేరకు రాఘవ కొన్ని పాటలు పాడతాడు. అందరూ మెచ్చుకుంటారు. పిల్లలకి కూడా కొన్ని భక్తిపాటలు నేర్పమంటారు ప్రధానాధ్యాపకులు. ఆ రాత్రి రెండు గంటల సమయంలో ఓ పిల్లాడు గట్టిగా ఏడుస్తాడు. వాడి చెవిలో ఏదో దూరిందని, అందుకే బాగా నొప్పి వస్తోందని అంటాడు. మందులిచ్చే నిరంజన్ గారు ఊళ్ళో ఉండరు. తన గదిలోకి వెళ్ళి ఇయర్ డ్రాప్స్ ఉన్నాయోమో చూస్తారు ప్రధానాధ్యాపకులు. లేవు. దాంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. రాఘవ అప్పుడు ఓ చిట్కా వైద్యం చేసి ఆ పిల్లవాడి చెవినొప్పికి ఉపశమనం కలిగిస్తాడు. – ఇక చదవండి.]
33. బిచ్చగాడు
[dropcap]ఆ[/dropcap] రోజు ఆదివారం! నిజానికి ఆదివారం అందరికీ సెలవు దినం. కానీ ఆ ఆవాస విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఆ రోజు అదనపు పని భారం ఉంటుందని చెప్పాలి.
ఆదివారం కావటంతో తమ తమ పిల్లల్ని చూసి వెళ్లటానికి తల్లిదండ్రులు వస్తారు.
స్కూటర్లలో, కార్లలో, జీపులలో వచ్చి పిల్లల్ని కలుస్తారు. ఆ సందర్భంగా ఉపాధ్యాయులందరూ వచ్చిన తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించి వాళ్లతో నవ్వుతూ మాట్లాడవలసి ఉంటుంది. వాళ్లడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పవలసి ఉంటుంది.
పాఠశాలకొచ్చే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏవేవో తినుబండారాలు తీసుకొస్తారు. అవి వారానికో, పదిరోజులకో సరిపడా తెస్తారు. కానీ పిల్లలు వాటిని రెండు రోజులకంతా పూర్తి చేసేస్తారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎక్కువగా పచ్చళ్లు, ఊరగాయలు, పప్పుల పొడులు తీసుకొస్తారు. వాటిని పెట్టెల్లో దాచుకుని పిల్లలు భోజనాలప్పుడు తెస్తుంటారు. అలాగే మరికొందరు ఆ వారంలో వచ్చే తమ బిడ్డల పుట్టినరోజుల కోసం కొత్త దుస్తులు, చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చి పోతుంటారు.
ఆ ఆదివారం చాలా వాహనాలే వచ్చాయి. మైదానం పక్కనున్న చెట్ల కిందంతా వాహనాలు కనిపిస్తున్నాయి. చోటు చాలక కిలోమీటరు దూరంలోని హరిజనవాడ చెట్ల దగ్గర కూడా కొందరు తమ బండ్లను ఆపారు.
కొందరు తమ పిల్లల్ని వరంగల్‌కు తీసుకెళ్లి హోటల్లో భోజనం తినిపించి, సినిమాకు తీసుకెళ్లి, సాయంత్రానికి తీసుకొచ్చి వదిలేవాళ్లూ లేకపోలేదు.
ఎటూ వచ్చాము కనుక పిల్లల చదువు విషయం కనుక్కుందామని ఉపాధ్యాయులను కలిసి బిడ్డల చదువు గురించి వాకబు చేస్తుంటారు. ఉపాధ్యాయుల్ని మరింత శ్రద్ధ తీసుకోమని చెబుతూ ఉపాధ్యాయులకు కూడా ఏవో తినుబండారాలు ఇచ్చి పోతుంటారు.
ఆ రోజు శుభదినం కూడా కావటంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కొత్తగా హాస్టల్లో చేరుస్తున్నారు. ఒకవైపు ఆ తంతూ కొనసాగుతోంది. మొత్తమ్మీద ఆ రోజు ఆ ఆవాస విద్యాలయ పరిసరాలు ఒక తిరణాలను తలపిస్తోంది.
ఆ రోజు తల్లిదండ్రులు భోజనానికి ఉంటారు కనుక, ముందురోజే ఏదో ఒక స్వీటు స్పెషల్‌గా చేయిస్తారు ప్రధానాచార్యులు. దాంతో వచ్చినవాళ్లు సంతృప్తిగా భోజనం చేసి వెళుతుంటారు.
భోజన సమయం దగ్గరపడుతూ ఉండటంతో.. రాఘవ భోజన ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నాడు.
ఇంతలో ఒక విద్యార్థి వచ్చి.. “ఆచార్జీ, మిమ్మల్ని ప్రధానాచార్యులు పిలుస్తున్నారు.” అంటూ చెప్పి వెళ్లాడు.
వెంటనే కార్యాలయానికి వెళ్లాడు రాఘవ.
“రండి, వీళ్ల బాబును ఇవ్వాళే చేర్పించారు. మీ నిలయంలో ఒక పడక ఖాళీగా ఉందిగా, అది ఈ బాబుకు కేటాయించండి.” అంటూ వాళ్లవైపుకు తిరిగి, “వీరి పేరు రాఘవ. ఇక్కడ తెలుగు ఆచార్యులుగా ఉన్నారు. మీ బాబును ధైర్యంగా వదిలి వెళ్లండి, ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు.” అని చెప్పారు ప్రధానాచార్యులు.
“రా బాబూ, నీ పేరేమిటీ?” అని ఆ పిల్లవాణ్ణి నవ్వుతూ అడిగాడు రాఘవ.
ఆ పిల్లవాడు ఆరవ తరగతిలోకి వచ్చినట్టున్నాడు. ఆవాసంలో చేరటం ఇదే కొత్త కాబోలు. పాపం పిల్లవాడు చాలా బిడియపడుతున్నాడు. ఎందుకో కాస్త భయపడుతూ కూడా ఉన్నాడు. వాణ్ణి బుజ్జగించి తీసుకెళ్లటానికి రాఘవ ప్రయత్నించాడు. కానీ ఆ పిల్లవాడు ఏడవటం మొదలుపెట్టాడు. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుని వెళ్లనని మొరాయించసాగాడు.
అటువంటి విద్యార్థులను బలవంతం చెయ్యకూడదని భావించి వాళ్ల నాన్నతో.. “మీరూ మాతోపాటు రండి సార్. పిల్లవాడికి బెరుకు పోయేంతవరకూ కొంతసేపు మా దగ్గరే ఉండండి.” అంటూ ముందుకు నడిచాడు రాఘవ.
ఆ పిల్లవాడు రానంటే రానని మొండికెయ్యసాగాడు. వాణ్ణి నయానో భయానో నిలయం దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్లకు ఖాళీగా ఉన్న పడకను చూపించి పదవ తరగతి పిల్లలు ఇద్దర్ని పిలిచి వాళ్లకు కావలసిన సౌకర్యాలను చూడమని వంటశాలకేసి నడిచాడు రాఘవ. అక్కడే ఉంటే పిల్లవాడు మరింత మొండికేసేలా ఉన్నాడు. పైగా వాణ్ణి సముదాయించే సమయం అతనికి లేదు.
వచ్చిన తల్లిదండ్రులకు భోజనాలు ఒకవైపు, పిల్లలకు భోజనాలు మరొకవైపు..తీరిక లేకుండా పొయ్యింది రాఘవకు.
భోజనాలంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది.
ఏదో మిగిలింది తినేసి నిలయానికి వచ్చేసరికి దాదాపు ముప్పావు వంతు మంది పిల్లలు విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. తనూ నడుము వాల్చి పడుకున్నాడు రాఘవ. అలాగే నిద్రలోకి జారుకున్నాడు.
ఐదు గంటలకు మెలకువ వచ్చింది రాఘవకు. వచ్చిన తల్లిదండ్రుల్లో దాదాపు అందరూ తమతమ వాహనాలను తీసుకొని తిరిగి వెళ్లిపోయారు. పిల్లల్ని తీసుకుని వరంగల్‌కు వెళ్లినవాళ్లు మాత్రం రావలసి ఉంది.
కొత్తగా చేరిన విద్యార్థి పడకకేసి చూశాడు రాఘవ. అది ఖాళీగా ఉంది. ఆ విద్యార్థి కనిపించలేదు. బయట ఉన్నాడేమోననుకుని బయటికెళ్లి చూశాడు. పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు. ఆ రోజు ఆదివారం కావటంతో పిల్లలకు అల్పాహారం లేదు. అందుకే వాళ్లు గుంపులుగా గుంపులుగా చేరి ఆడుకుంటున్నారు.
ఆ గుంపులో ఆ కొత్త విద్యార్థికోసం వెతకటం కష్టం కనుక ఒక పదవ తరగతి విద్యార్థిని పిలిచి వాకబు చెయ్యమన్నాడు. వాడు అంతా చూసొచ్చి కొత్త విద్యార్థి కనిపించటం లేదని చెప్పాడు. ఎక్కడికెళ్లి ఉంటాడబ్బా అనుకుంటూ, వెనకున్న తైలంచెట్ల దగ్గర చూసి రమ్మన్నాడు. వాడు ఓ పదినిమిషాల తర్వాత వచ్చి అక్కడా కనబడ్డం లేదన్నాడు.
అప్పుడు మొదలైంది రాఘవలో కంగారు. పిల్లల్ని పిలిచి నాలుగువైపులా వెతకమన్నాడు. నేరుగా ప్రధానాచార్యుల దగ్గరకెళ్లి విషయం చెప్పాడు. ఆయన వెంటనే టీచర్లనందరినీ పిలిచి వెతకమన్నాడు. కానీ ఆ కొత్త విద్యార్థి ఎక్కడా కనిపించలేదు.
ఈలోపు మోహనరావు, కె.కెలిద్దరూ స్కూటర్ మీద వాణ్ణి వెతికే పనిలో భాగంగా.. వరంగల్‌కేసి బండిని పోనిచ్చారు. రాజారావు, సుందరం ఊళ్లో వెతకటానికి వెళ్లారు.
ఈలోపు తమ పిల్లలను వరంగల్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఓ జీపులో తిరిగొచ్చారు. వాళ్లకు విషయం చెప్పి ఆ జీపులో నిరంజన్, రాఘవ ఎక్కి కూర్చుని ఆ పిల్లవాణ్ణి వెతకటానికి ఇంకోవైపు బయలుదేరారు.
అలా వెళ్లిన వాళ్లిద్దరూ దాదాపు రెండుగంటల తర్వాత మొహాలు వ్రేలాడేసుకుని జీపు నుండి దిగారు. జీపులోని తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జీపులోని తల్లిదండ్రులు.. ‘రేపు మళ్లీ పిల్లవాడి కోసం వెతకమని’ చెప్పి వెళ్లిపోయారు. పిల్లవాడు ఎటు వెళ్లాడో తెలియటం లేదు. ఏమయ్యాడో అర్థం కావటం లేదు. ఒకవేళ వాళ్ల ఊరికే వెళ్లిపోయాడేమో అని కూడా అనుకున్నారు.
కానీ, వాడు వాళ్ల ఊరికి వెళ్లకపోయి ఉంటే?.. ఇంకెక్కడికెళ్లి ఉంటాడు? లేదూ వాడు ఒంటరిగా ఉండటం చూసి ఎవరైనా ఏమైనా చేసుంటారా?
రాఘవ మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.
వాడు కనిపించలేదన్న విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడేం చెయ్యాలి? ఊళ్లోకెళ్లి పోలీసుస్టేషన్లో రిపోర్టు ఇద్దామా అని కూడా ఆలోచించారు ప్రధానాచార్యులు.
మోహనరావు, కె.కె.లిద్దరూ తప్పక పిల్లవాడి ఆచూకీని కనిపెట్టి వెంట తీసుకొస్తారని అందరూ వాళ్లకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూడసాగారు.
వాళ్లు రాత్రి పదిగంటలకు తిరిగొచ్చారు. కానీ విద్యార్థి ఆచూకీ మాత్రం తెలియలేదని నిరుత్సాహంగా చెప్పారు.
సరే ఇంకేం చెయ్యలేం, రేపు ఉదయం పోలీస్టేషన్‌కెళ్లి రిపోర్టు ఇవ్వాలని ప్రధానాచార్యులు నిర్ణయించారు.
కానీ ఆ రాత్రి ఉపాధ్యాయులెవ్వరూ భోజనం చెయ్యలేకపోయారు. వాళ్లకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు.
మరుసటిరోజు ఉదయం.. యథాప్రకారం పిల్లల్ని నిద్ర లేపి అధ్యయనం తరగతి నిర్వహించారు. ఆరుగంటలవుతుంటే కె.కె. పిల్లలకు యోగాసనాల శిక్షణ మొదలుపెట్టాడు. పిల్లలందరూ ఆసనాలు వేస్తున్నారు. ఈలోపు కొందరు ఉపాధ్యాయులు గబగబా స్నానానికి వెళ్లారు. రాఘవ కూడా స్నానం పూర్తి చేసి వంటశాల వైపు వెళ్లాడు. ఆరోజు ఏం అల్పాహారం చెయ్యాలో చెప్పి, అలాగే మధ్యాహ్నం ఏం వండాలో కూడా వంటమాస్టరుకు చెప్పాడు.
కానీ రాఘవలో మునుపటి ఉత్సాహం లేదు.
విద్యార్థులకు అల్పాహారం పూర్తయ్యాక తరగతులు ప్రారంభమయ్యాయి. మోహనరావు, కె.కె.లిద్దరూ పోలీస్‌స్టేషన్‌లో రిపోర్టు ఇవ్వటానికి స్కూటర్‌మీద ఊళ్లోకెళ్లారు. తరగతులు ప్రారంభమైనా మనసుపెట్టి పాఠం చెప్పలేకపోతున్నాడు రాఘవ. తప్పిపోయిన విద్యార్థి కనిపిస్తాడేమోనని అప్పుడప్పుడూ గుమ్మం దగ్గరికొచ్చి బయటికి చూస్తున్నాడు.
అంతలో.. హరిజనవాడ వైపు నుండి ఒకవ్యక్తి పాఠశాలకేసి వస్తూ ఉండటం కనిపించింది.
‘ఎవరబ్బా అతను?’ అనుకుంటూ అతను దగ్గరికొచ్చేంతవరకూ గుమ్మం దగ్గరే నిలబడి చూశాడు.
అతను దగ్గరికొచ్చాక తెలిసింది, అతనొక బిచ్చగాడని! అడుక్కోవటానికి ఇటు వచ్చినట్టున్నాడు.. అనుకుంటూ తరగతిలోని పిల్లలకేసి తిరిగాడు రాఘవ.
ఆ వచ్చిన బిచ్చగాడు సరాసరి పాఠశాల కార్యాలయంలోకి అడుగుపెట్టాడు.
అతణ్ణిచూసి కార్యాలయం గుమస్తా..”ఏమయ్యోవ్, ఏం కావాలి నీకు? అక్కడే ఆగు. ఏంటీ సరాసరి లోపలికే వచ్చేస్తునావు?” అంటూ కసురుకుంటున్నట్టుగా అరిచాడు.
ప్రధానాచార్యులు తల పైకెత్తి ఆ బిచ్చగాడివైపు చూస్తూ..”ఏం కావాలి?” అని అడిగారు.
“అయ్యా, నమస్కారం. మీ బళ్లో సదూకునే పిల్లవాడెవడైనా తప్పిపోయినాడా?” అంటూ ప్రశ్నించాడు ఆ బిచ్చగాడు.
“అవునూ.. నీకేమైనా కనిపించాడా?” అని ఆతృతగా ప్రశ్నించారు ప్రధానాచార్యులు.
“అవునయ్యా.. పోశెమ్మ గుడికాడ నేనూ నా భార్యా కాపురముంటామయ్యా. నిన్న రేత్రి ఒక పిల్లవాడు గుడికాడ దిగాలుగా కూసోని ఉంటం నేను జూసినానయ్యా. ఎవరూ ఏందని ఇసయాలు అడిగితే వాడు ఏమీ బదులు సెప్పలేదయ్యా. రేత్రి మేము తినే అన్నంలో కొంచెం పెడితే పాపం బాగా ఆకలేసిందేమో గబగబ తినేసినాడయ్యా. అప్పుడు మళ్లీ ఇసయాలు అడిగినా సెప్పలేదయ్యా. సరే ఇప్పుడేమీ అడగకూడదనుకుని వాణ్ణి మాకాడ్నే పడుకోమని సెప్పినామయ్యా. వాడు పడుకుని నిద్రపోయాక, జేబులు తడిమితే ఈ కాగితం దొరికిందయ్యా, దీన్ని దాసి తెల్లారాక నలుగుర్నీ ఇసారిస్తే.. ఈ బడికి దారి సూపించినారయ్యా. వాణ్ణి కూడా ఎంటబెట్టుకుని వొస్తుంటే వాడు ఇసయం తెలుసుకుని ఇక్కడికి రానంటే రానంటే మొండికేసినాడయ్యా..”
“ఏదీ ఎక్కడున్నాడు పిల్లవాడు.?” కుర్చీలో నుండి లేచి బయటికొస్తూ అడిగారు ప్రధానాచార్యులు.
“రానని మొరాయిస్తుంటే, ఆణ్ణి నా భార్యకాడ అట్టిపెట్టి ఇద్దర్నీ అరిజనవాడ దగ్గరుంచి ఇటొచ్చినానయ్యా.”
ప్రధానాచార్యులు వెంటనే రాఘవను పిలిపించి ఆ బిచ్చగాడితో వెళ్లమని చెప్పాడు.
వీళ్లు వెళ్లేసరికి బిచ్చగాడి భార్య పక్కన బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉన్నాడు ఆ విద్యార్థి.
వాణ్ణి చూసేసరికి ప్రాణం లేచి వచ్చింది రాఘవకు. దగ్గరికి వెళ్లి వాడికి నచ్చచెప్పి, బుజ్జగించి దగ్గరకు తీసుకున్నాడు.
వచ్చేముందు ఆ బిచ్చగాళ్ల దంపతులకు కృతజ్ఞతలు తెలియచేసి తన జేబులో ఉన్న పదిరూపాయల్ని వాళ్లకిచ్చాడు రాఘవ. పిల్లవాడిని పాఠశాలకేసి మెల్లగా నడిపించుకుని తీసుకొచ్చాడు.
34. ఊహించని ఆతిథ్యం
తప్పిపోయి దొరికిన పిల్లవాడిపై ఎందుకైనా మంచిదని ఓ కన్నేసి ఉంచాడు రాఘవ.
అతని ప్రతి కదలికనూ జాగ్రత్తగా గమనించసాగాడు. వాడు ఎక్కడికెళ్లినా వాడి వెనకే ఇంకో పిల్లవాణ్ణి కాపలాగా పంపుతున్నాడు. వాణ్ణి ఒంటరిగా మాత్రం పంపటం లేదు.
‘పిల్లవాడు దొరికాడు కనుక సరిపోయింది, లేకపొయ్యుంటే వాడి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పి ఉండాలి? పాపం, ఇంత చిన్నవయసులో కొత్త ప్రదేశంలో ఉండటం ఎవరికైనా కష్టమే. అందులోనూ ఈ అడివిలాంటి ప్రదేశంలో ఉండాల్సి రావటంతో వాడు పారిపోవాలని చూశాడు. తల్లిదండ్రులు వాడికీ వయస్సులో ఎందుకీ శిక్ష వేశారా?’ అనిపించింది.
వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని మంచి మంచి కథలు చెబుతూ వాణ్ణి మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించాడు. మరో రెండు రోజులకు కానీ వాడు మామూలు మనిషి కాలేకపొయ్యాడు.
ఆ తర్వాత వాడు అటువంటి పనులకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.
పాఠశాల పునఃప్రారంభమై రెండునెలలు దాటాయి. ఆ రోజు ఉదయం తరగతులు ప్రారంభమై రెండవ కాలాంశం జరుగుతోంది. రాఘవకు విశ్రాంతి ఉండటంతో వంటశాలలో ఉన్నాడు. ఉన్న కూరగాయల్లో మధ్యాహ్నానికి ఏంచేస్తే బావుంటుందో వెంకటయ్యతో కలిసి మాట్లాడుతున్నాడు.
ఇంతలో గుమస్తా వచ్చి రాఘవను ప్రధానాచార్యులు పిలుస్తున్నారని చెప్పాడు.
ఐదు నిమిషాల్లో వస్తానని ప్రధానాచార్యులకు చెప్పమన్నాడు.
వంటశాలలో పని ముగించుకుని కార్యాలయంలోకి అడుగుపెట్టాడు.
అప్పటికే అక్కడ రాజారావు ఆచార్యులు కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
“నమస్కారం ఆచార్యజీ..” అంటూ ప్రధానాచార్యులకు నమస్కరించాడు రాఘవ.
“నమస్కారం. కూర్చోండి!” అనగానే రాఘవ కుర్చీలో కూర్చున్నాడు.
“ఇందాకే ఊళ్లోనుండి మన పాఠశాల కార్యదర్శి ఇంటి మనిషొచ్చి ఈ ఉత్తరం ఇచ్చి వెళ్లాడు. ఇది మన ప్రధాన కార్యాలయం హైదరాబాదు నుండి మన పాఠశాలకొచ్చిన ఉత్తరం. దీని సారాంశమేమిటంటే.. రేపు, ఎల్లుండి మన ప్రాంతానికి సంబంధించిన ఆచార్యులకు ‘భోదనా నైపుణ్య తరగతులను’ నిర్వహించబోతున్నది. అందుకు ప్రతి పాఠశాలనుండి ఇద్దరేసి ఆచార్యులను తప్పకుండా పంపించమని కోరింది. మొదటి రెండురోజులు తెలుగు, సోషియల్ సబ్జెక్టులకు సంబంధించిన తరగతులు నిర్వహించనున్నారు. మన పాఠశాల నుండి మిమ్మల్ని, రాజారావు గార్లను పంపిస్తే బావుంటుందని మన కార్యదర్శి నాకు రాసిన ఉత్తరంలో తెలియజెయ్యటం జరిగింది. మీరిద్దరూ వెంటనే తయారవ్వండి. ఈ మధ్యాహ్నమే మీరు బయలుదేరవలసి ఉంటుంది..” అని ఆయన పూర్తిచెయ్యక మునుపే.. “ఆచార్యజీ, తరగతులు ఎక్కడ నిర్వహిస్తున్నారు?” అని రాజారావు ప్రశ్నించాడు.
“హుజూరాబాద్‌లోని మన శాఖా పాఠశాలలోనే తరగతులు ఉంటాయి. మీరు మధ్యాహ్నం బయలుదేరితేనే సాయంత్రానికి అక్కడికి చేరుకోగలుగుతారు. రేపు ఉదయం 8 గంటలకల్లా తరగతులు ప్రారంభమవుతాయి.” అన్నారు ప్రధానాచార్యులు.
“తప్పదా ఆచార్యజీ? నా బదులు ఇంకెవరినైనా పంపలేరా?!..” ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాడు రాజారావు.
“తప్పదు రాజారావుగారూ. సీనియర్లు, మీకు తెలియనిది ఏముంది? ఇలాంటి తరగతులకు హాజరైతేనే మీకు జీతాల్లో హెచ్చింపులుంటాయి. ప్రతి సంవత్సరమూ వెళ్లక తప్పదు, ప్రతి ఒక్కరూ పాల్గొనక తప్పదు. ఇప్పుడు మీరు కాదనుకున్నా మళ్లీ వచ్చే తరగతులకైనా హాజరు కావలసిందేగా? అదేదో ఇప్పుడే వెళ్లొచ్చేస్తే, ఒక పనైపోతుందిగా?” అన్నారు ప్రధానాచార్యులు.
“ఆ రాఘవగారూ.. మన కార్యదర్శి మీ క్షేమాన్ని కాంక్షించేవారు కాబట్టి, మిమ్మల్ని ఈ తరగతులకు పంపమని వారే మీ పేరును సూచించటం జరిగింది. పైగా వచ్చే యేడాది మేలో నిర్వహించబోయే ‘30 రోజుల ప్రత్యేక శిక్షణా శిబిరం’లో ఇప్పటి ఈ శిక్షణ మీకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీరు ఈ సంస్థలో ఉపాధ్యాయుడిగా కొనసాగే పక్షంలో ఇలాంటి తరగతుల్లో పొల్గొనటం మీకు ఎంతైనా అవసరం. అది మీ బోధనా సామర్థ్యాన్ని మరింత పెంచటమే కాక, మీకు ప్రాథమిక జీతపు స్కేలుకు అర్హతను కూడా కలిగిస్తుంది. కనుక తప్పకుండా వెళ్లి రండి.” అంటూ గుమాస్తా వైపుకు తిరిగి “వీళ్ల ఖర్చుకు కావలసినంత డబ్బును ఇచ్చి పంపండి!” అంటూ ముగించారు.
ఇద్దరూ గుమస్తా దగ్గరికెళ్లి అతనిచ్చిన పైకాన్ని తీసుకుని రిజిష్టరులో సంతకం చేసి బయటికొచ్చారు.
“రాఘవగారూ, ఒక జత లాల్చీ- పంచె, సబ్బు, తువ్వాలు, మగ్గూ అన్నింటినీ బ్యాగులో సర్దుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక నోటు పుస్తకము, కలమూ కూడా తీసుకురండి! మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరుతాం.” అంటూ తన నిలయం కేసి నడిచాడు రాజారావు.
ఆ మధ్యాహ్నం భోజనం చేశాక ఇద్దరూ వరంగల్ వెళ్లి అక్కణ్ణించి హుజూరాబాద్ వెళ్లే బస్సెక్కారు.
ఆ సాయంత్రానికి హుజూరాబాద్ చేరుకుని, అక్కణ్ణించి తాము బస చెయ్యవలసిన శాఖా పాఠశాలకు చేరుకున్నారు.
అప్పటికింకా పూర్తిగా చీకటి పడకపోవటంతో.. ఫ్రెషప్ అయ్యి.. “అలా వెళ్లి ఊరును చూసొద్దాం పదండి” అని రాజారావును పిలిచాడు రాఘవ.
“మీరు వెళ్లిరండి, నాకు పెద్దగా ఆసక్తి లేదు.” అంటూ రాజారావు తిరస్కరించాడు.
“భలేవారే, రండి రాజారావుగారూ.. నేనొక్కణ్ణే ఎలా వెళ్లను? మీరు నాకు తోడుగా ఉంటారనేగా మీతోపాటు ధైర్యంగా ఇక్కడికొచ్చింది. మరి మీరేమో ఇలా అంటున్నారు. సరేలెండి నేనొక్కణ్ణే వెళ్లొస్తా లెండి.” అంటూ నిష్ఠూరపొయ్యేసరికి రాజారావు అయిష్టంగానే బయలుదేరక తప్పలేదు.
ఇద్దరూ బయటికి నడిచారు.
హుజూరాబాద్ పెద్ద పట్టణం కాకపోయినప్పటికీ ఊరు కొత్త కాబట్టి ఆసక్తిగా అటుఇటు చూసుకుంటూ నడుస్తున్నారు.
క్రమంగా వెలుతురు తగ్గిపోతూ చీకటి పడసాగింది. చమక్కుమంటూ అంగళ్లముందు విద్యుద్దీపాలు వెలగసాగాయి.
“రాఘవగారూ ఇప్పటిదాకా ఊరును చూశాంగా, ఇక చాలు. వెనక్కు తిరిగి వెళ్లిపోదామా?” అన్నాడు రాజారావు.
“ఇప్పుడే వెళ్లి చేసేది మాత్రం ఏముందనీ? ఇంకాస్త దూరం నడుద్దాం.” అంటూ ముందుకు నడిచాడు రాఘవ.
రాన్రానూ రాజారావు, రాఘవకు దగ్గర దగ్గరగా జరిగి భుజాన్ని రాసుకుంటున్నట్టుగా నడవసాగాడు. అతను దగ్గరయ్యేకొద్దీ రాఘవ కాస్త దూరంగా జరిగి నడవసాగాడు. కానీ వెంటనే రాజారావు మళ్లీ అతనికి దగ్గరగా వచ్చి నడవసాగాడు.
రాఘవకు చిరాకుగా అనిపించింది. అతను ఈసారి వేగంగా రాజారావుకన్నా రెండడుగులు ముందుకు నడవసాగాడు.
రాజారావు కూడా అంతే వేగంగా నడుస్తూ రాఘవను అందుకోవాలని ప్రయత్నించాడు.
రోడ్డు పక్కగా ఒక వినాయకుడి గుడి కనిపిస్తే.. “స్వామిని దర్శించుకుని వెళదాం పదండి!” అంటూ రాఘవ వేగంగా గుడి మెట్లెక్కసాగాడు. వెనకే వస్తున్న రాజారావు తడబడి కాలు మెట్లకు తగిలి నేలమీద పడిపొయ్యాడు.
అరరే.. అంటూ రాఘవ గబగబ మెట్లు దిగి వచ్చి రాజారావును పైకిలేపి.. “మెట్లను చూసుకొని నడవాలి కదా రాజారావు గారూ..” అంటూ అతని కాలికేసి చూసి కంగారుపడ్డాడు.
అతని కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. దాన్ని పట్టించుకోకుండా అతను అడుగు ముందుకు వెయ్యబొయ్యాడు.
“అయ్యో.. రక్తం..ఆగండి!” అంటూ రాఘవ అతణ్ణి ఆపి మెట్టుపైన కూర్చోబెట్టాడు. ఎక్కణ్ణించి రక్తం కారుతోందో తెలియక రాజారావు తన చేతిని కాలిమీద తడమటం చూసి రాఘవ అతని చేతిని పట్టుకుని సరైన ప్రదేశంలో ఉంచాడు. వేలిని నొక్కిపట్టాడతను.
“మరీ ఇలా కళ్లు మూసుకుని గుడ్డిగా నడిస్తే ఎలా రాజారావుగారూ..” అంటూ మందలించాడు రాఘవ.
వంచిన తలను పైకెత్తి రాఘవవైపు చూశాడు రాజారావు. అతని కళ్లల్లో నీళ్లు చూసి చలించిపొయ్యాడు రాఘవ.
“రాజారావుగారూ.. ఏంటిదీ?” అంటూ ఆప్యాయంగా అతని భుజమ్మీద చెయ్యేశాడు.
“రాఘవగారూ, నాకు నిజంగా రాత్రయితే కళ్లు కనిపంచవు. నాకు రేచీకటి.” అని మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
“రాజారావుగారూ.. నన్ను క్షమించండి.. నాకీ విషయం నిజంగా తెలియదు!” పశ్చాత్తాపపడుతూ అన్నాడు రాఘవ.
“మీరన్నదాంట్లో తప్పేమీ లేదు. కానీ ఆ భగవంతుడే నాకెందుకో ఈ శిక్ష వేశాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో..” అంటూ కుమిలిపోయాడు.
“ఛ..ఛ.. ఏంటిది ఊరుకోండి రాజారావుగారూ..” అంటూ అతణ్ణి ఓదార్చాడు రాఘవ.
‘అందుకే కాబోలు రాజారావుగారు రాత్రిపూట భోజనశాలకు వచ్చేవారు కారు. ఎవరో ఒక విద్యార్థి అతని కోసం చపాతీలు పట్టుళ్లేవాడు. అది తనకెంతో కోపాన్ని తెప్పించేది కూడా! ఇక్కడికే వచ్చి తినొచ్చుకదా అని చాలాసార్లు అనుకున్నాడు. అసలు విషయం ఇద్దన్నమాట.’ అని మనసులో అనుకుని, అతని బొటనవేలిని చూశాడు. రక్తం కారటం ఆగిపోయింది.
“రక్తం ఆగిపోయింది. పైకి లేవండి, దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళదాం! దేవుడు అనవసరంగా ఎవరికీ ఏ శిక్షా వెయ్యడు రాజారావుగారు. మనం అలా అనుకుంటాం, అంతే!” అంటూ అతణ్ణి పట్టుకుని లేపి మెట్లెక్కించి దేవుని ముందు నిలిపాడు. ఇద్దరూ ప్రశాంతంగా చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించారు.
తర్వాత రాఘవ అతని చేతిని పట్టుకుని జాగ్రత్తగా మెట్లు దిగేందుకు సాయపడ్డాడు.
రోడ్డుమీదికి వచ్చాక రాజారావు మొహమాటంకొద్దీ తన చేతిని మెల్లగా విడిపించుకునేందుకు ప్రయత్నించాడు.
కానీ రాఘవ.. “మీకు మరోసారి ప్రమాదం జరిగేందుకు నేను అంగీకరించను.” అంటూ అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని ముందుకు నడిచాడు.
దాంతో రాజారావు ప్రేమగా రాఘవ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
ఇద్దరూ పాఠశాల చేరుకున్నారు.
మరుసటిరోజు ఉదయం 8 గంటలకల్లా ప్రారంభోపన్యాసం మొదలైంది.
నిర్వాహకులు, తాము ఏ ఉద్దేశంతో నైపుణ్య తరగతులను నిర్వహిస్తున్నారో వివరించి తరగతులను ప్రారంభించారు. ఇద్దరూ సబ్జెక్టుల వారీగా వేరు వేరు గదులకు వెళ్లిపొయ్యారు.
అప్పటికే కొంత అనుభవం ఉన్నవారికి మరింత బోధనను మెరుగుపరుచుకునేందుకు, అస్సలు బోధనానుభవం లేని రాఘవ లాంటి ఉపాధ్యాయులకు ఆ తరగతులు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి.
రెండు కాలాంశాలు అయ్యాక కొంత విరామం ఇచ్చారు. వచ్చినవాళ్లందరికీ చల్లటి మజ్జిగను అందించారు.
పదిహేను నిమిషాల తర్వాత మళ్లీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తరగతులు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనసాగాయి.
భోజన సమయమైంది. మైకులో అప్పుడొక ప్రకటన వెలువడిరది.
“ప్రియమైన ఆచార్యులారా! మీకొక విన్నపం! ఒక్కొక్క పాఠశాలనుండి వచ్చిన ఉపాధ్యాయులకు ఒక్కో సీరియల్ నెంబరును కేటాయించటం జరిగింది. అదే సీరియల్ నెంబర్‌ను కొందరు పోషకులకు ఇవ్వటం జరిగింది. ఆ పోషకులు ప్రస్తుతం మైదానంలో వేచి ఉన్నారు. ఆచార్యులు మీమీ నెంబర్లు కలిగిన పోషకులను కలుసుకుని వాళ్ల ఇండ్లకు వెళ్లి భోజనం చేసి రావలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఏర్పాటు ఈ రెండురోజుల పాటూ కొనసాగుతుంది. అనగా ఆ పోషకులే ఈరోజు రాత్రికీ, రేపు మధ్యాహ్నానానికీ, అవసరమనుకుంటే రేపు రాత్రికీ మీకు ఆతిథ్యమిస్తారు. కొందరు రేపు సాయంత్రమే వాళ్ల వాళ్ల పాఠశాలలకు వెళ్లిపోయే పక్షంలో ఆ విషయం వాళ్లకు ముందే తెలియజెయ్యాలి. ఒకవేళ ఇక్కడే ఉండి ఎల్లుండి తెల్లవారి వెళ్లే పక్షంలో రేపు రాత్రికీ ఆ పోషకులే మీకు భోజనం ఏర్పాట్లను చూస్తారు.” అన్న ప్రకటన ముగియగానే.. ఆచార్యులందరూ మెల్లగా మైదానంలోకి నడిచారు.
అక్కడ చాలామంది పోషకులు చేతుల్లో నెంబర్ స్లిప్పుల్ని పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాలలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తోంది.
‘ఈరోజు తమ ఇంటికి అతిథులుగా ఎవరు రాబోతున్నారు?’ ఆసక్తిగా ఆచార్యుల రాక కోసం ఎదురుచూస్తున్నారు.
రాజారావు, రాఘవ తమ నెంబరు కలిగిన వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆ వ్యక్తిని చూసి రాఘవ ఆశ్చర్యపొయ్యాడు.
కారణం! అతనొక ముసల్మాను. గడ్డం పెంచుకుని, తలమీద కుళ్లాయి పెట్టుకుని, జుబ్బా లుంగీ కట్టుకుని ఉన్నాడు. తనలోని ఆశ్చర్యాన్ని బయటికి కనిపించనియ్యకుండా ఆ వ్యక్తిని చూసి పలకరింపుగా నవ్వుతూ నమస్కరించాడు రాఘవ.
అతను కూడా నవ్వుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ, “రండి ఆచార్జీ.. స్వాగతం. నా పేరు దిల్దార్ హుస్సేన్, ఇతను నా రెండవ కొడుకు, పేరు ఇస్మాయిల్. ఇక్కడే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు.” అనగానే అతనూ ఇద్దరికీ నమస్కరించాడు.
“ఇవ్వాళ మీరు మా ఇంటికి అతిథిగా భోజనానికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం, రండి వెళదాం!” అంటూ పక్కనున్న స్కూటర్ దగ్గరకు నడిచాడు. అతని కుమారుడు ఇంకో స్కూటర్ దగ్గరకు వెళ్లాడు.
ఇద్దరూ స్కూటర్లను స్టార్ట్‌చేసి వీళ్లిద్దరినీ చెరొక బండిమీద కూర్చోబెట్టుకుని తమ ఇంటికేసి బయలుదేరారు.
పదినిమిషాల ప్రయాణం తర్వాత వాళ్లింటికి చేరుకున్నారు. స్కూటర్ల శబ్దం విని ఇద్దరు ఆడవాళ్లు బయటికొచ్చారు.
అందులో ఒక ఆవిడ బహుశా ఆ ముసల్మాను భార్య అయ్యుండొచ్చు. ఆమె బయటున్న బక్కెట్లో నుండి గుండుచెంబు నిండుగా నీళ్లు ముంచి ఇద్దరికీ కాళ్లు కడుక్కోవటానికి ఇచ్చింది. ఇద్దరూ చేతులూ కాళ్లూ కడుకున్నారు. ఆమె పక్కనున్న అమ్మాయి తన చేతిలోని తువ్వాలును వాళ్లకు అందించింది. ఆ తువ్వాలుతో వాళ్లిద్దరూ చేతులు శుభ్రంగా తుడుచుకున్నారు. తర్వాత అందరూ ఇంట్లోపలికి నడిచారు.
లోపల ఒక పెద్దావిడ హాల్లో భోజనాలకోసం ఏర్పాట్లు చేస్తోంది. వాళ్లిద్దరూ అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నారు.
“ఈమె నన్ను కన్నతల్లి. ఈమె నా పత్ని. ఇది నా రెండో కూతురు మీర్జా, కాలేజీకి వెళుతోంది. పెద్దవాడు మన దేశంలో లేడు, దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. పెద్ద కూతురికి ఈమధ్యనే షాదీ చేశాను.” అని తన కుటుంబ సభ్యులందరి గురించీ చెప్పాడు.
ఆ ముసల్మాను జేబులో చెయ్యిపెట్టి ఇరవై రూపాయల నోటును తీసి కొడుక్కు ఏదో చెప్పి పంపించాడు.
“బాయి సాబ్, మీరేం చేస్తారో చెప్పనేలేదు.” అంటూ అడిగాడు రాఘవ.
“నేను పాదరక్షలు అదే చెప్పులు తయారుచేసి అమ్ముతాను. మాకు బజార్లో ఒక షాపు కూడా ఉంది.” అంటూ ఎంతో గొప్పగా చెప్పాడతను.
పెద్దావిడ పిలుపు అందుకుని వాళ్లద్దిరూ నేలమీద పరిచిన చాపమీద కూర్చున్నారు. ఆ పెద్దావిడ, మనవరాలు వడ్డించారు. ఇద్దరూ తినటం మొదలుపెట్టారు.
చక్కగా ఉన్నాయి వంటలు. మసాలాలు ఎక్కువ లేకుండా రుచిగా చాలా బావున్నాయి.
ఆయన భార్య, “బాబూ.. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో? ఏదో మాకు తెలిసినట్టు చేసాం..” అంది.
“అమ్మా, అతిథి అనుకుని అన్నం పెడుతున్నారు. ఇందులో మీ అభిమానం కనిపిస్తోందే కానీ రుచులు కావు. దాన్ని మేము ఆస్వాదిస్తున్నాము..” అన్నాడు రాఘవ. రాజారావు అవునన్నట్టుగా తనూ తలాడిరచాడు.
రెండోసారి అన్నం పెట్టి గడ్డ పెరుగు వడ్డించింది వాళ్ల అమ్మాయి.
“ఏమ్మా, నువ్వేం చదువుతున్నావు?..” ఆ అమ్మాయిని ప్రశ్నించాడు రాజారావు.
ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుండగా.. బయట ఎవరో గట్టిగట్టిగా అరుస్తున్న అరుపులు వినిపించాయి.
“మారో.. మారో..” అని అరుస్తూ ఎవరో ఎవరినో తరుముతూ వెళుతున్నట్టుగా బయటి మాటల్ని బట్టి అర్థమవుతోంది.
ఇంతలో ఒకతను “అయ్యో.. అమ్మా.. కాపాడండీ.. కాపాడండీ..” అన్న గావుకేకలూ వినిపించాయి.
ఆ ముసల్మాను భార్య గబగబా వెళ్లి గుమ్మం తలుపును మూసి గెడియపెట్టింది.
వాళ్లమ్మాయి కిటికీ తలుపును మూసేసింది. దాంతో గదంతా చీకటి ఆవరించింది.
రెండు నిమిషాలు గడిచాక.. ఆ అమ్మాయి కిటికీ రెక్కను కొద్దిగా తెరిచి బయట ఏం జరుగుతోందో చూడసాగింది. బయట ఏదో గందరగోళంగా ఉన్నట్టుంది. అరుపులూ, కేకలూ వినిపిస్తున్నాయి.
ఆ ముసల్మాను బయటికెళ్లిన తన కొడుకు కోసం ఆతృతగా ఎదురుచూడసాగాడు. గుమ్మం దగ్గర కాలుగాలిన పిల్లిలా అటుఇటు తిరగసాగాడు. అతని ప్రవర్తనను బట్టి అతను కంగారుపడుతున్నట్టుగా అనిపిస్తోంది.
ఆ ముసల్మాను తల్లి ఒక బుడ్డీదీపాన్ని వెలిగించి వాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పెట్టింది.
ఆయన గుమ్మం దగ్గరనుండి కదిలి వీళ్ల దగ్గరికొచ్చి ప్రసన్నంగా ముఖం పెట్టి.. “మీరు భోజనం చెయ్యండి ఆచార్జీ. బయటేదో చిన్న గొడవ జరుగుతున్నట్టుంది.” అని ఆ ముసల్మాను అంటున్నా వినకుండా ఇద్దరూ ఎంగిలి చేతులతోటే కిటికీ దగ్గరికెళ్లి బయట ఏం జరుగుతోందా అని ఆసక్తిగా చూడసాగారు.
కానీ బయటి పరిస్థితి ప్రశాంతంగా భోజనం చేసేలా అనిపించటం లేదు.
కొందరు మనుషులు చేతుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఆవేశంతో ఎవరినో చంపాలన్న కసితో ఊగిపోతున్నారు. కొందరు అటు ఇటు వేగంగా పరుగెడుతున్నారు.
కిటికీలో నుండి వీళ్లిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోసాగారు. వీళ్ల పరిస్థితిని గమనించిన ఆ అమ్మాయి గబుక్కున కిటికీ రెక్క మూసేసింది.
వాళ్లను వెళ్లి కూర్చుని బోజనం చెయ్యమని బ్రతిమాలింది. కానీ వాళ్లు తినే పరిస్థితిలో లేరు.
ఇంతలో గుమ్మం దగ్గర ఎవరో తలుపును దబదబమంటూ బాదుతున్న శబ్దం వినిపించింది.
ముసల్మాను వెంటనే తలుపు తియ్యకుండా ‘కౌన్’ అంటూ అడిగాడు. కొడుకు గొంతు విని వేగంగా తలుపు తీసి, కొడుకు లోపలికి రాగానే అంతే వేగంగా మళ్లీ తలుపును మూసేశాడు.
వాళ్ల మాటల్లో.. అయోధ్య.. బాబ్రీ మసీదు.. కరసేవకులు.. లాంటి మాటల్ని బట్టి.. అంతకు నెలరోజుల క్రితమే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటన గుర్తుకొచ్చింది రాఘవకు. ఆ విషయమే చెప్పాడు రాజారావుకు. అప్పుడు అతనిలోనూ కంగారు ప్రస్ఫుటంగా కనిపించింది.
‘ఈ పరిస్థితుల్లో మనం ఒక ముసల్మాను ఇంట్లో చిక్కుకుపోయామే.. తమను ఏం చేస్తోరో, ఏమో? కరసేవకులపైనున్న ద్వేషంతో తమపైన దాడి చేస్తే.. తమను హతమార్చటానికి ప్రయత్నిస్తే.. తాము ఏం చెయ్యగలం? ద్వేషం మనిషిని ఎలాంటి స్థితికైనా నెట్టేస్తుంది. వీళ్ల మనసుల్లో ఏముందో? తమను ఆదుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరు. తమను ఆ భగవంతుడే రక్షించాలి.’ అనుకుంటూ ఇద్దరూ వణికిపోసాగారు
ఆ ముసల్మాను వాళ్లకు దగ్గరగా వచ్చి ఇద్దరి చేతులపై తన చేతిని ఉంచి.. “ఆచార్జీ, మీరేమీ భయపడకండి. మీకు మేమున్నాము. ఎవరూ మా ఇంట్లోకి అంత ధైర్యంగా రాలేరు. మీరు మీ ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడా నిర్భయంగా ఉండండి.” అని ధైర్యాన్నిచ్చాడు.
“దయచేసి వెళ్లి భోజనం చెయ్యండి.” అని ఆ ఇంటావిడ ఎంత చెప్పినా వినకుండా మౌనంగా వెళ్లి ఎండిన తమ చేతుల్ని కడిగేసుకున్నారు వాళ్ళిద్దరూ. వెళ్లి కుర్చీలలో భయం భయంగా కూర్చున్నారు.
వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాడు ఆ ముసల్మాను.
వాళ్లకు ఎదురుగా తానూ కుర్చీలో కూర్చుంటూ..”బాబ్రీ మసీదు దుర్ఘటన (6-12-1992) జరిగి ఇప్పటికి పదిరోజులు గడుస్తున్నా ఇంకా మావాళ్లలో ఆ కోపం తగ్గినట్టు లేదు. అందుకే ఈరోజు మళ్లీ కత్తులు నూరుతున్నారు. కానీ ఎవరికీ ఏమీ కాకూడదనే నేను ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను.” అంటూ ఆకాశం కేసి చేతులు చాచాడు ఆ ముసల్మాను.
తలెత్తి ఆయనకేసి చూశాడు రాఘవ.
“ఎక్కడో జరిగిన సంఘటన దేశమంతా ఎలాంటి భావాలను రెచ్చగొట్టాయో చూశారా బాయ్. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమీ అర్థం కావటం లేదు.” అని సన్నగా నోరు విప్పాడు రాజారావు.
“అవును. గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆనాడు ప్రత్యక్షంగా చూసినవాళ్లెవరూ ఇప్పుడు బ్రతికి లేరు. కనుక మనమున్న ఈ పరిస్థితిలో ఇప్పుడు ఏది ఎలా ఉన్నదో వాటిని ఉన్నది ఉన్నట్టుగా అలాగే స్వీకరిస్తే ఎలాంటి సమస్యా రాదు. కానీ ఎవరికి వారు చరిత్రను తవ్వుకుంటూ పోయి తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి.” నిర్లిప్తంగా అన్నాడు ఆ ముసల్మాను.
“అవును, బాగా చెప్పారు.” అని మాత్రం అనగలిగాడు రాజారావు.
అర్థగంట గడిచాక బయట పరిస్థితులు నెమ్మదించినట్టుగా అనిపించాయి.
“బాయి సాబ్, మేము పాఠశాలకు వెళ్లిపోతాము. మమ్మల్ని అక్కడ దించెయ్యండి.” అన్నాడు రాఘవ.
ఆ ముసల్మాను తన కొడుకును పిలిచి చెవిలో ఏదో చెప్పాడు.
అతను గుమ్మం తలుపు తెరుచుకుని బయటికెళ్లాడు.
పదినిమిషాల తర్వాత వచ్చి..”ఆచార్జీ.. మీరు బయటికెళ్లే పరిస్థితులు ఏమాత్రం కనిపించటం లేదు. దాదాపు అన్ని చోట్లా షాపులూ అంగళ్లూ మూసేశారు. బస్సులు కూడా తిరగటం లేదు. మీ పాఠశాల కూడా మూసేశారు. ఈ పరిస్థితిలో మీరు బయటికి వెళ్లటం అంత క్షేమం కాదు. ఇవ్వాళ మీరు మా ఇంట్లోనే ఉండండి. రేపటికి అన్నీ సర్దుకుంటాయేమో చూద్దాం. మీరేమీ కంగారు పడకుండా ఇక్కడే నిశ్చింతగా ఉండండి.” అని ధైర్యమిస్తున్నట్టుగా చెప్పాడు.
“మావాడు చెప్పిందే కరెక్టు. మీరు బయటికి వెళ్లాలని ప్రయత్నించి ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మేం భరించలేం. మీరు ఇక్కడే మా ఇంట్లోనే నిర్భయంగా ఉండండి. మమ్మల్ని నమ్మండి, మీకేమీ కానివ్వం.” అంటూ ఆయన ఎంతో ధైర్యాన్నిచ్చాడు.
దాంతో మౌనంగా ఉండిపోయారిద్దరూ.
తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా వాళ్లద్దరూ మళ్లీ భోజనం చెయ్యలేదు.
వాళ్లు తినకపోయేసరికి ఆ కుటుంబ సభ్యులు కూడా భోజనంపై ఆసక్తి చూపించక పస్తులుండిపోయారు.
కొంతసేపటికి ఆ అమ్మాయి టి.వి.ని ఆన్‌చేసి ఒక తెలుగు సినిమాను పెట్టింది.
“అన్నా, ఈ సినిమాను చూశారా. చాలా కామెడీగా ఉంటుంది.” అంటూ వాతావరణాన్ని తేలిక పరిచింది.
సినిమాలో పడిపోయి వాళ్లిద్దరూ కొంత తేలికపడ్డారు. క్రమంగా వాళ్లల్లో ఆందోళన తగ్గింది.
ఆ సాయంత్రం అందరూ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. కొంతసేపు పాచికలు ఆడారు.
ఆ సాన్నిహిత్యంతో ఇద్దరికీ వాళ్లపట్ల ఉండే భయమంతా తగ్గిపోయింది.
ఐదుగంటలకు ఆ ఇంటి ఇల్లాలు వేడివేడి టీచేసి తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. టీ తాగాక అందరిలోనూ నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. రాఘవ చాలాసేపు ఆ పెద్దమ్మతో మాట్లాడుతూ గడిపాడు. ఇద్దరూ వాళ్లమ్మాయిచేత హిందీ పాటలు పాడిరచుకుని విన్నారు.
ఆ రాత్రి అందరికీ చపాతీలు రుద్దారు ఆ అత్తా, కోడళ్లు.
వాళ్లమ్మాయి పొయ్యి ముందు కూర్చుని వాటిని చక్కగా కాల్చింది. రాత్రి తొమ్మిది గంటలకు అందరూ కలిసి కూర్చుని తిన్నారు.
తిన్నాక చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపారు.
ఇక నిద్రకు సమయమైంది.
“ఆచార్జీ, మీరిద్దరూ ఈ గదిలో పడుకోండి. గుమ్మం దగ్గర నేనూ నా కొడుకూ పడుకుంటాం. డాబామీద నా భార్యా, కూతురూ పడుకుంటారు. హాల్లో మా అమ్మ పడుకుంటుంది. ధైర్యంగా నిద్రపోండి. మీకు ఏ ఆపదా రానివ్వం. మీకేమైనా అవసరమొస్తే నన్ను నిర్మొహమాటంగా లేపి అడగండి. సరేనా! వెళ్లి హాయిగా నిద్రపోండి.” నవ్వుతూ ఎంతో భరోసాన్నిస్తున్నట్టుగా అన్నాడు ఆ ముసల్మాను. అందరూ నిద్రకు ఉపక్రమించారు.
ఎందుకో తెలియదు కానీ చాలాసేపటి దాకా నిద్రపట్టక మేలుకునే ఉండిపోయారు రాఘవ, రాజారావులిద్దరూ.
తర్వాత ఎప్పటికో నిద్రలోకి జారిపొయ్యారు.
మరుసటిరోజు మధ్యాహ్నానానికి బయట గొడవ బాగా తగ్గింది.
మామూలు పరిస్థితి నెలకొన్నట్టుగా ఆ ముసల్మాను కొడుకు చెప్పాడు. “ఆచార్జీ, ఇక మీరు ఏ తరగతులకూ వెళ్లనవసరం లేదట. తరగతుల్ని క్యాన్సిల్ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. మీకు ఇప్పుడు వరంగల్‌కు బస్సుంది. బయలుదేరండి.” అంటూ వాళ్లు చెరో స్కూటర్‌మీద వాళ్లిద్దరినీ ఎక్కించుకొని బస్టాండుకొచ్చి దగ్గరుండి బస్సు ఎక్కించారు.
రాఘవ, రాజారావులు చేతులు జోడించి వాళ్లకు కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించారు.
క్షేమంగా వెళ్లి రమ్మన్నట్టుగా వాళ్లూ నమస్కరించి చేతులూపారు.
కొంతసేపటికి బస్సు బయలుదేరింది.
(ఇంకా ఉంది)