మరుగునపడ్డ మాణిక్యాలు – 107: అమెరికన్ ఫిక్షన్

0
3

[సంచిక పాఠకుల కోసం ‘అమెరికన్ ఫిక్షన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]ర[/dropcap]చయితలు మార్కెట్ డిమాండ్లకి తలవంచాలా? అక్కర్లేదని అందరూ అంటారు. కానీ పుస్తకాలు అమ్ముడవకపోతే ఏం చేయాలి? డబ్బుకి కటకటగా ఉంటే ఏం చేయాలి? డబ్బుకి లోటు లేనివారు కళాసేవ చేయొచ్చు. డబ్బు లేనివారు తమ అవసరాల కోసం రాజీ పడకతప్పని పరిస్థితులు వస్తాయి. ఇది కృష్ణదేవరాయల కాలం కాదు కదా ఉత్తమ కళాకారులని కూర్చోబెట్టి పోషించటానికి! ప్రస్తుతకాలంలో రచయితల పరిస్థితులపై వచ్చిన వ్యంగ్య చిత్రం ‘అమెరికన్ ఫిక్షన్’ (2023). ఇందులో అమెరికాలో పుస్తకాలకి మార్కెట్ ఎలా ఉందో ప్రస్తావించారు. అక్కడ కొన్ని కథలకి డిమాండు ఉంది. మిగతా ప్రపంచంలో డిమాండున్న కథలు, రచయితలు వేరుగా ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా రచయితలకి ఈ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. డిమాండు నిజంగా ఉందా లేక కొందరు మేధావులు సృష్టించారా అనేది మరో అంశం. ఇది వ్యంగ్య చిత్రం కాబట్టి హాస్యం పాళ్ళు ఎక్కువ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

థెలోనియస్ ఎలిసన్ అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో ఉండే ఒక రచయిత. అతన్ని అందరూ మంక్ అని పిలుస్తారు. అవివాహితుడు. నవలలు రాశాడు. ప్రొఫెసర్‌గా పని చేస్తుంటాడు. నల్లజాతికి చెందినవాడే కానీ అతను అన్ని రకాల పాత్రలను సృష్టించాడు. ఈ జాతి, ఆ జాతి అనే తారతమ్యం లేదు. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి జాతివివక్ష చూపించేవారిని తప్పుబట్టటం అనే స్టేజిని దాటి నల్లజాతి వారిని అక్కున చేర్చుకోకపోతే తప్పు అన్నట్టు ఉంది. నల్లజాతి వారు పడ్డ బాధలు, వారిపై పోలీసు జులుం, ఆర్థికంగా వారు ఎలా వెనకబడ్డారో చెప్పే కథల మీద ఆసక్తి పెరిగింది. అదొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఆ ఆసక్తి చూపకపోతే జాతివివక్ష చూపినట్టే అనే భావన పెరిగింది. దీన్నే Woke culture అని కూడా అంటారు. అయితే నల్లజాతివారిలో బాగా చదువుకున్నవారు, మంచి ఉద్యోగాలు చేసేవారు చాలామంది ఉన్నారు. మంక్ ఆ కోవకి చెందినవాడే. అతను రాసిన కొత్త నవల గురించి అతని ఏజెంట్ “ప్రచురణకర్తలకి నల్ల పుస్తకం (నల్లజాతి వారి దీనగాథ అని గూఢార్థం) కావాలి” అంటే అతను “నేను నల్లవాణ్ణి. ఇది నేను రాసిన పుస్తకం. కాబట్టి ఇది నల్ల పుస్తకమే” అంటాడు! మంక్ ఒకసారి ఒక పుస్తకాల దుకాణానికి వెళతాడు. అతను రాసిన పుస్తకాలు ‘ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్’ అనే విభాగంలో ఉంటాయి. అతను నల్లజాతికి చెందినవాడు కాబట్టి అవి అక్కడ పెట్టారు, కథాంశాన్ని బట్టి కాదు! మంక్‌కి చిర్రెత్తుకొస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

తన కొత్త నవల ప్రచురణకర్తలకి నచ్చటం లేదని మంక్ అసహనంగా ఉంటాడు. పైగా అతనికి Woke culture అంటే చిరాకు. కాలేజీలో క్లాసులో ఒక శ్వేతజాతి అమ్మాయి “నల్లవారిని కించపరిచే మాటలు నాకు ఇష్టం లేదు” అంటే అతనికి చిర్రెత్తుకొస్తుంది. ఆ మాటలు ఒకప్పుడు శ్వేతజాతి వారు వాడినవే. పాత సాహిత్యం గురించి మాట్లాడేటపుడు ఆ మాటలు వస్తాయి. వద్దంటే ఎలా? ఇదే Woke culture. అతను ఆ అమ్మాయి మీద కేకలేసి ఆమెకి బయటకి పొమ్మంటాదు. దీంతో అతని మీద ఫిర్యాదులొస్తాయి. కాలేజీ వారు అతన్ని బలవంతంగా సెలవు మీద పంపిస్తారు. జీతం కూడా ఆపేస్తారు. ముందుగా అనుకున్న ప్రకారం అతను కాలేజీ తరఫున బోస్టన్ నగరంలో ఒక పుస్తక ప్రదర్శనకి వెళతాడు. అక్కడ సింటారా అనే నల్లజాతి రచయిత్రి రాసిన తొలి నవల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె బాగా చదువుకుని ఒక ప్రచురణసంస్థలో పని చేసి ఇప్పుడు నవల రాసింది. కథాంశం మాత్రం పేదరికపు నల్లజాతి కుటుంబం గురించి. పాత్రలు వ్యాకరణ దోషాలతో మాట్లాడతాయి. పెళ్ళి కాకుండానే గర్భవతి అయి అబార్షన్ కోసం వెళ్ళే పిల్ల ఒక పాత్ర. కథలో ఆ పాత్ర తల్లితో మాట్లాడే మాటలు సింటారా చదివి వినిపిస్తే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తారు. ఇదంతా చూసి మంక్‌కి కంపరంగా ఉంటుంది. ఇక్కడ మంక్ పాత్రధారి జెఫ్రీ రైట్ హావభావాలు నవ్వు తెప్పిస్తాయి. మొత్తానికి మంక్ ఇంకా కుంగిపోతాడు. సాహిత్యమంటే తరతరాలు నిలిచేది కాక అప్పటికి కుహనా మేధావులు ఏది మెచ్చుతారో అదే సాహిత్యం అన్నట్టు ఉంది పరిస్థితి. సింటారా “నా జాతి వారి కథలు ఎక్కడా కనపడలేదు. అందుకే ఈ పుస్తకం రాశాను” అంటుంది. తానేమో బాగా చదువుకుంది. ఆ నేపథ్యంతో కథ రాయొచ్చుగా. తన జాతిలో ఇతరులకి ప్రేరణగా ఉంటుంది. అబ్బే, అదెవరు చదువుతారు? కష్టాలు, కన్నీళ్ళు ఉంటేనే చదువుతారు. అయితే సింటారాకి తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఆమెని విమర్శించటం కరెక్టేనా? ఈ చిత్రం గొప్పతనం ఏమిటంటే ఆమెకి తన వాదన వినిపించే అవకాశం వస్తుంది.

బోస్టన్ మంక్ సొంత ఊరు. అతని తండ్రి, అక్క, తమ్ముడు అందరూ డాక్టర్లే. మంక్ మాత్రం సాహిత్యం మీద మక్కువతో రచయితగా మారాడు. తండ్రి చనిపోయాడు. తల్లి ఆగ్నెస్, అక్క లీసా బోస్టన్‌లోనే ఉంటారు. మంక్‌ని చూసి ఆగ్నెస్ “లావయ్యావు. ఏమైంది? కుంగిపోతే ఎక్కువ తినేస్తావు నువ్వు” అంటుంది. తల్లికి అన్నీ తెలిసిపోతాయి. లీసాకి విడాకులయిపోయాయి. అయితే ఆగ్నెస్ ఆ విషయం మర్చిపోతుంటుంది. లీసా భర్త గురించి అడుగుతూ ఉంటుంది. ఆమె మతిమరపు చూసి లీసాకి ఆందోళనగా ఉంటుంది. “నర్సుని పెడదాం” అంటాడు మంక్. “డబ్బుల్లేవు. నా విడాకులకి ఖర్చయింది. అమ్మకున్న రెండు ఇళ్ళలో ఒకటి అమ్మొచ్చు కానీ ఆ డబ్బు రెండో ఇంటి తనఖా విడిపించటానికే సరిపోతుంది” అంటుంది లీసా. తమ్ముడు క్లిఫ్‌కి కూడా విడాకులయిపోయాయి. అతని పరిస్థితీ బాలేదు. భార్యకి సగం ఆస్తి ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా లీసా హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోతుంది. బిడ్డ మరణంతో ఆగ్నెస్ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. క్లిఫ్ అక్క అంత్యక్రియలకి వస్తాడు కానీ తల్లిని పెద్దగా పట్టించుకోడు. తల్లి తనని ప్రేమగా చూసుకోలేదని అతని భావన. మంక్ కాలేజీవారు తనకి జీతం ఇస్తారేమో అని అడుగుతాడు కానీ చుక్కెదురవుతుంది.

ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలిన మంక్‌కి కోరలైన్ అనే ఒక లాయరు పరిచయమవుతుంది. ఇద్దరూ ఒకరికొకరు నచ్చుతారు. మంక్ ఈ పరిణామంతో కొంచెం తేరుకుంటాడు. కానీ తల్లిని డాక్టర్ దగ్గరకి తీసుకువెళితే ఆల్జీమర్స్ అని తేలుతుంది. మరోపక్క ఎక్కడ చూసినా సింటారా పేరు మారుమోగిపోతూ ఉంటుంది. మంక్ కసి మీద ఒక నవల రాస్తాడు. తండ్రెవరో తెలియని, నేరగాడైన ఒక నల్లజాతి యువకుడి కథ అది. సింటారా నవలలో పాత్రల్లాగ ఇందులో పాత్రలు కూడా వ్యాకరణదోషాలతో మాట్లాడతాయి. అనుకోకుండా తండ్రిని కలుసుకున్న ఆ యువకుడు కోపంతో తండ్రిని చంపేస్తాడు. చచ్చిపోతున్న తండ్రితో “నువ్వు చెత్తగాడివి కాబట్టి నేను చెత్తగాడినయ్యాను” అంటాడు. చివరికి ఒక పోలీసు చేతిలో మరణిస్తాడు. మంక్ ఆ నవలని తన ఏజెంటుకి పంపిస్తాడు. ఏజెంటుకి అస్సలు నచ్చదు. మంక్ “ఎవరూ అచ్చు వేయరని తెలుసు. వాళ్ళు కోరుకుంటున్న చెత్త ఎంత కంపు కొడుతుందో చూపించాలని రాశాను. పబ్లిషర్లకి పంపించు” అంటాడు. అయితే మెలిక ఏమిటంటే అతను ఆ నవల స్టాగ్ లీ అనే పేరుతో రాశాడు. మంక్ రాశాడని ఏజంటుని తప్ప ఎవరికీ తెలియదు. తల్లికీ, ప్రియురాలికీ కూడా చెప్పడు. ఒక పబ్లిషర్ ఆ నవలని ప్రచురించటానికి ఒప్పుకుంటుంది. ఆమె మంక్ రాసిన ఇతర పుస్తకాలని ఎప్పుడూ తీసుకోలేదు. ఇది మాత్రం నచ్చింది. పెద్ద మొత్తం కూడా ఇస్తానంటుంది. ఈ నవల బెస్ట్‌సెల్లర్ అవుతుందని అంటుంది. మంక్ మొదట ఒప్పుకోడు. “నేను కేవలం వారిని పరిహసించటానికి రాశాను. ఇక వేళాకోళం చాలు” అంటాడు. కానీ ఏజెంటు అతన్ని ఒప్పిస్తాడు. తల్లి వైద్యానికి ఆ డబ్బు ఉపయోగపడుతుందంటాడు. “నీ పుస్తకాలు బావుంటాయి. కానీ అవి ఖరీదైన మద్యం లాంటివి. ఆ మద్యం అందరూ కొనలేరు, నీ పుస్తకాలు అందరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు చవక మద్యం లాంటి నవల రాశావు. జనాలకి అదే కావాలి” అంటాడు. మంక్ అయిష్టంగానే ఒప్పుకుంటాడు.

మంక్ తన సిద్ధాంతాలని అమ్ముకోవటానికి ఇష్టపడలేదు. డబ్బు అవసరమున్నా తీసుకోవటానికి ఒప్పుకోలేదు. ఇది అతని ఔన్నత్యం. ‘నీ పుస్తకాలు అందరూ అర్థం చేసుకోలేరు. ఈ పుస్తకం జనంలోకి వెళ్ళనీ’ అంటేనే ఒప్పుకున్నాడు. అయితే ఒక రకంగా మంక్ కూడా కుహనా మేధావిలాగే ప్రవర్తించాడు. సింటారా పుస్తకాన్ని అకారణంగా ద్వేషించాడు. ఆమె సృష్టించిన పాత్రలు సమాజంలో లేవని అనటానికి అతనికి అధికారం లేదు. అతను అలాంటివారిని కలవలేదు, అంతే. ఈ చిత్రం గొప్పతనం ఏమిటంటే అతన్ని పూర్తిగా సమర్థించదు. అన్ని దృక్కోణాలు చూపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లేపరంగా, దర్శకత్వపరంగా మంచి మార్కులు కొట్టేస్తుందీ చిత్రం. స్క్రీన్‌ప్లే గురించి చెప్పటానికి ఒక సన్నివేశం ఉదహరించవచ్చు. మంక్ కోరలైన్‌ని మొదటిసారి తన తల్లి ఇంటి బయట కలుసుకుంటాడు. అది అతని తల్లికి చెందిన రెండో ఇల్లు. సముద్రతీరంలో ఉంటుంది. చాలాకాలంగా ఖాళీగా ఉంది. లీసా అస్థికలు సముద్రంలో కలపటానికి అక్కడికి వస్తుంది మంక్ కుటుంబం. మంక్ ఎవరో తెలియక కోరలైన్ “ఆ ఇంట్లో ఎవరో పెద్దాయన తుపాకీతో కాల్చుకుని చనిపోయాడట” అంటుంది. మంక్ ముఖంలో రంగులు మారతాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోయినది మంక్ తండ్రే అని మనకి అర్థమవుతుంది. కోరలైన్‌కి కూడా తన పొరపాటు అర్థమవుతుంది. అతని పేరు విని అతను రచయిత అని గుర్తుపడుతుంది. ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి రమ్మంటుంది. సాధారణంగా కొత్త మనిషిని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆ మనిషి మీద రొమాంటిక్‌గా ఆసక్తి ఉన్నట్టే. మాటల్లో ఆమె పరిణతి గల స్త్రీ అని అర్థమవుతుంది. “రచయితలు ఎవరినీ వెంటనే చెడ్డవారని ముద్ర వేయరు. అలా చేస్తే మంచి కథలు రాయలేరు” అంటుంది. ఇలాంటి లోతైన భావాలతో ఆమె మేధస్సుని ఎస్టాబ్లిష్ చేసేస్తాడు స్క్రీన్‌ప్లే రచయిత. వారు మాటల్లో ఉండగా ఇంటికి ఇంకో పురుషుడు వస్తాడు. మంక్ సెలవు తీసుకుని వచ్చేస్తాడు. తన మేధస్సుకి సరితూగగల స్త్రీ చేజారిపోయినందుకు అతను నిరాశగా ఉంటాడు. ‘నా జీవితమింతేనా?’ అన్నట్టు ఉంటాడు. మర్నాడు కోరలైన్ అతని దగ్గరకి వచ్చి “నిన్న వచ్చినతను నా మాజీ భర్త. త్వరలో విడాకులు తీసుకోబోతున్నాం. నీతో ఇంకా మాట్లాడాలనుంది” అంటుంది. మంక్ ఆనందపడతాడు. చీకట్లో చిరుదీపం కనిపించినట్టు. పరిస్థితులు మారబోతున్నాయి అనే సూచన ఇది.

ఇంకా స్క్రీన్‌ప్లే గురించి చెప్పాలంటే లీసా పాత్ర గురించి చెప్పాలి. తండ్రికి ఎఫెయిర్లు ఉండేవని లీసా మంక్‌తో అంటుంది. ఒకసారి ఒక తెల్లజాతి స్త్రీని అతను ముద్దాడుతుండగా చూశానని అంటుంది. ఇది క్లిఫ్‌కి కూడా తెలుసు కానీ మంక్‌కి తెలియదు. లీసా, క్లిఫ్ ఒక జట్టుగా ఉండేవారు. తండ్రికి మంక్ అంటే ఇష్టమని వారిద్దరికీ అక్కసు. మంక్ ఎప్పుడూ తాను ఇతరలు కంటే మేధావినని అనుకుంటాడని లీసా అంటుంది. మంక్ “నువ్వు రోగులకి సేవ చేస్తున్నావు. నేనేమో కల్పిత పాత్రల కల్పిత సంభాషణలు రాస్తూ ఉంటాను” అంటాడు. తమకి మేధస్సు ఎక్కువని గర్వపడేవారు ఇతరులని చూసి ‘వారిలా సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాను’ అనుకోవటం మామూలే. తర్వాత మంక్ కోరలైన్‌ని తల్లికి పరచయం చేస్తే ఆమె కోరలైన్‌తో “నువ్వు తెల్లగా లేనందుకు నాకు ఆనందంగా ఉంది” అంటుంది. ఆమెకి కూడా భర్త ఎఫెయిర్ల గురించి తెలిసి ఉండవచ్చు అనే సూచన ఉంది. అతని ఆత్మహత్యకి అదే కారణం అయి ఉండవచ్చు. దర్శకత్వపరంగా చూస్తే ఇంకో సన్నివేశం గురించి చెప్పుకోవచ్చు. ఏజెంటు ఆఫీసులో మంక్ అతన్ని కలుసుకుంటాడు. పబ్లిషర్ ఒప్పుకుందని ఏజెంటు చెబుతాడు. మంక్ ప్రచురణకి ఒప్పుకోనంటాడు. అప్పుడు ఏజెంటు గదిలో ఉన్న మూడు మద్యం బాటిళ్ళు తెచ్చి టేబుల్ మీద పెడతాడు. “ఒకటి ఇరవై నాలుగు డాలర్లు. ఒకటి యాభై డాలర్లు. ఒకటి నూట అరవై డాలర్లు. అన్నీ జానీ వాకర్ కంపెనీవే. మొదటిది నాసి రకం. రెండోది తక్కువ నాసి రకం. మూడోది మంచి రకం. మూడోది ఖరీదెక్కువ కాబట్టి ఎక్కువమంది కొనరు. కానీ ఎవరైనా కోరుకునేది మత్తునే. నీ నవలలు మూడోరకం మద్యం లాంటివి. గాఢత ఎక్కువ. కానీ అందరికీ నచ్చవు. జనాలకి తేలికైన కథలు కావాలి. నువ్వు ఇప్పుడు మొదటి రకం మద్యం లాంటి నవల రాశావు. దాని వల్ల నీ ప్రతిభకి మచ్చ రాదు. నువ్వు అన్ని రకాల కథలూ రాయగలవు” అంటాడు. అప్పుడు మంక్ ఒప్పుకుంటాడు. మద్యం సీసాలని గమనిస్తే మొదటి సీసా కాస్త ఖాళీగా ఉంటుంది. రెండో సీసా సగం ఖాళీగా ఉంటుంది. మూడోది నిండుగా ఉంటుంది. ఏజెంటు ఎక్కువగా తాగేది, తాగించేది రెండో రకం అన్నమాట. అటు చవకదీ కాదు, ఇటు ఖరీదైనదీ కాదు. ఖరీదైనది ఎప్పుడైనా మంచి సందర్భం వచ్చినప్పుడు తాగవచ్చని అట్టేపెట్టాడు. మధ్యతరగతి మనస్తత్వం. ఇలాంటి సూక్ష్మమైన విషయాలు చాలా కనిపిస్తాయీ చిత్రంలో.

పెర్సివల్ ఎవరెట్ రాసిన ‘ఇరేజర్’ అనే నవల ఆధారంగా కోర్డ్ జెఫర్సన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించాడు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే రచయితగా ఆస్కార్ అందుకున్నాడు. మంక్‌గా జెఫ్రీ రైట్, సింటారాగా ఇస్సా రే, కోరలైన్‌గా ఎరికా అలెగ్జాండర్ నటించారు. జెఫ్రీ రైట్ నటన ఈ చిత్రానికి హైలైట్. మంక్ తమ్ముడు క్లిఫ్‌గా నటించిన స్టెర్లింగ్ బ్రౌన్‌కి కూడా మంచి పేరొచ్చింది. అతనికి చిత్రం రెండో భాగంలో మంచి సన్నివేశాలు ఉంటాయి. ఇద్దరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ వ్యాసంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు.

మంక్, ఏజెంటు ఫోన్లో పబ్లిషర్ పౌలాతో మాట్లాడతారు. మంక్ మోటు భాష వాడతాడు. తాను తన అనుభవాల ఆధారంగా పుస్తకం రాశానని అంటాడు. స్టాగ్ లీ (మంక్ పెట్టుకున్న పేరు) అనేది అసలు పేరు కాదని, అతను పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు కాబట్టి మారుపేరుతో రాశాడని అంటాడు ఏజెంటు. అందుకే వీడియో కాల్ చేయట్లేదని అంటాడు. ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతాడు. మంక్ అయిష్టంగానే ఊకొడుతూ ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత పౌలా మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఈసారి వాళ్ళ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి జాన్ ఆమెతో ఉంటాడు. పుస్తకాన్ని ఆఘమేఘాల మీద ప్రచురించి, అమెరికాలో నల్లజాతి బానిసత్వం రద్దు చేసిన జూన్ పంతొమ్మిదవ తేదీన విడుదల చేస్తామని అంటాడు. నల్లజాతివారు సంబరాలు చేసుకుంటారని, తెల్లజాతివారు అపరాధుల్లా ఫీలవుతారని అంటాడు. మంక్‌కి ఇది నచ్చదు. ఇది మరీ విపరీతంగా ఉందని అతని భావన. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తవ్వి గాయాలు రేపటం అతనికి ఇష్టం లేదు. అతనికో ఆలోచన వస్తుంది. పుస్తకం పేరు మారుస్తానని అంటాడు. ఎఫ్‌తో మొదలయ్యే అసభ్య పదమే తన పుస్తకానికి పేరని అంటాడు. పౌలా, జాన్‌లకి నచ్చదు. ఆ పేరు పెట్టకపోతే ప్రచురణకి ఒప్పుకోనని మంక్ అంటాడు. వాళ్ళు ఆ పేరు పెట్టటానికి ఒప్పుకోరని, పుస్తకం ప్రచురణ ఆగిపోతుందని అతని ఆశ. పౌలా, జాన్ మాట్లాడుకుని దానిక్కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకోరనుకున్న మంక్ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అన్నిటికీ ఒప్పుకుంటే ఇంకేం చేస్తాడు? ఆ విధంగా పుస్తకం ప్రచురణకి వెళ్ళిపోతుంది.

ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరుగుతాయి. మంక్ తల్లి మానసికస్థితి మరింత క్షీణిస్తుంది. ఆమెని ఇరవై నాలుగు గంటలూ ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాలి. మరో పక్క ఒక సాహిత్య సంస్థ వారు సాహిత్య పురస్కారానికి నిర్ణేతల కమిటీలో మంక్‌ని చేరమంటారు. “కమీటీలో వైవిధ్యం (అంటే నల్లజాతి వారు అని గూఢార్థం) ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నాం” అంటాడు ఆ సంస్థ అధ్యక్షుడు. మంక్‌కి ఈ ముసుగులో గుద్దులాట నచ్చదు. “మీరు జాతివివక్షకి పాల్పడుతున్నారనే ఆరోపణలు తప్పించుకోవటానికి నన్ను అడిగినందుకు థ్యాంక్స్” అంటాడు వ్యంగ్యంగా. ఆ అధ్యక్షుడు “యువార్ వెల్‌కమ్” అంటాడు తానేదో ఘనకార్యం చేస్తున్నట్టు. మంక్ అతని ప్రతిపాదనని తిరస్కరిస్తాడు. కానీ ఆ అధ్యక్షుడు “పైపై విమర్శలు కాకుండా నిజంగానే ఇతర రచయితల తప్పొప్పులు ఎంచే అవకాశమిది” అంటాడు లౌక్యంగా. మంక్ ఆయువుపట్టు మీద కొట్టాడు. మంక్ వెంటనే ఒప్పుకుంటాడు. కొసమెరుపు ఏమిటంటే సింటారా కూడా ఆ కమిటీలో ఉంటుంది. ఇది తెలిసి మంక్ నిస్పృహతో తల పట్టుకుంటాడు.

మరో పక్క ఒక సినీ నిర్మాత మంక్ పుస్తకాన్ని సినిమాగా తీస్తానని ముందుకొస్తాడు. ఏజెంటు ఆఫీసు దగ్గర రెస్టారెంట్లో ఆ నిర్మాతతో మంక్ సమావేశమవుతాడు. “నిర్మాతని కలిస్తే నేనెవరో తెలిసిపోతుందిగా?” అని ఏజెంటుతో అంటే “నీకంత సీన్ లేదు” అంటాడు ఏజెంటు. తల్లిని చూసుకోవటానికి ఎవరూ లేక మంక్ ఆమెని ఏజెంటు ఆఫీసులో వదిలి నిర్మాతని కలవటానికి వెళతాడు. నిర్మాతతో తాను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నానని చెబుతాడు. ఇంతలో ఆంబులెన్స్ సైరన్ వినపడుతుంది. తల్లికి ఏమైనా అయిందని మంక్ “నేను వెళ్ళాలి” అని పరుగున ఏజెంటు ఆఫీసుకి వస్తాడు. పోలీసు సైరన్ అనుకుని అతను పారిపోతున్నాడని నిర్మాత అనుకుంటాడు. హాలీవుడ్ వాళ్ళకి ఇలాంటి గిమ్మిక్కులంటే పిచ్చి. “ఎంత నిజాయితీ!” అని సినిమా తీయటానికి ఒప్పుకుంటాడు. ఇంతకీ మంక్ తల్లి క్షేమంగానే ఉంటుంది. “నేనెన్ని పిచ్చిపనులు చేస్తే నాకంత డబ్బొచ్చి పడుతోంది” అంటాడు మంక్ ఏజెంటుతో. “అందుకే మా అమ్మా నాన్న అమెరికాకి వలస వచ్చారు” అంటాడు ఏజెంటు. ఇది అమెరికా మీద వ్యంగ్య బాణం. మంక్ తనకొచ్చిన అడ్వాన్సులతో తల్లిని మంచి నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తాడు.

సాధారణంగా సినిమా కథల్లో నాయకుడు లేదా నాయిక జీవితాన్ని పరిచయం చేసి తర్వాత వారికి ఏ కష్టాలు వచ్చాయో, వాటిని ఎలా అధిగమించారో చూపిస్తారు. ఇక్కడ మంక్‌కి వచ్చేవి లౌకికమైన కష్టాలు కాదు. సిద్ధాంతపరమైన కష్టాలు! లౌకికంగా డబ్బు వచ్చిపడుతూ ఉంటుంది. అయినా మంక్‌కి ఆనందం లేదు. సిద్ధాంతాలని అమ్ముకుంటున్నాడుగా! ‘వద్దంటే డబ్బు’, ‘బాబాయ్ అబ్బాయ్’ లాంటి సినిమాల్లో డబ్బు వచ్చిపడుతూ ఉంటే నాయకులు హైరానా పడుతుంటారు. కానీ మంక్ అంతా మన మంచికే అన్నట్టు ఉంటాడు. అయితే కొత్త కష్టాలు వచ్చిపడతాయి.

చిత్రంలో ముఖ్యమైన ఉపకథ మంక్ తమ్ముడు క్లిఫ్‌ది. అతను పెళ్ళి చేసుకుని పిల్లల్ని కన్నాడు. కానీ అతను స్వలింగప్రియుడు. ఆ విషయం తెలిసి అతని భార్య విడాకులు తీసుకుంటుంది. ‘ఇన్నాళ్ళూ సంకెళ్ళలో ఉన్నట్టు ఉన్నాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను’ అని అతను చాలామంది పురుషులతో సంబంధాలు పెట్టుకుంటాడు. మంక్ నీతులు చెబుతాడని అతనికి మంక్ అంటే చిరాకు. తల్లి నర్సింగ్ హోమ్‌లో ఉందని తెలిసి చూడటానికి బోస్టన్ వస్తాడు. ముందు ఇంటికి వెళతాడు. ఇంట్లో మంక్ ఉంటున్నాడు. మంక్‌తో కోరలైన్ ఇంటికి వస్తుంది. క్లిఫ్ ఇతర పురుషులతో తన సంబంధాల గురించి ఇద్దరికీ కథలు కథలుగా చెబుతాడు. మంక్‌కి చిరాకు వస్తుంది. కోరలైన్ మాత్రం “ప్రపంచం ఎలాగూ తగలబడుతోంది. ఎంజాయ్ చేయటంలో తప్పు లేదు” అంటుంది. ప్రపంచం తగలబడుతోందని అందరూ అనుకునేదే. దానికి ప్రతిస్పందన మాత్రం ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. కోరలైన్ విశాల దృక్పథం చూసి క్లిఫ్ “నీకు మంక్ ఎలా నచ్చాడు?” అంటాడు. “అతనిలో బాధా ఉంది, హాస్యమూ ఉంది” అంటుందామె. “అంటే దొడ్డికెళుతూ చచ్చిపోయేవాడిలాగన్న మాట” అంటాడతను. మంక్ “ఎప్పుడూ కాస్తంత హద్దు దాటి మాట్లాడటం నీకలవాటేగా” అంటాడు. అందరూ నవ్వుకుంటారు. తర్వాత క్లిఫ్ నర్సింగ్ హోమ్‌లో తల్లిని కలిసి ఆమెతో డ్యాన్స్ చేస్తాడు. ఆమె ఆల్జీమర్స్ అప్పటికే ముదిరింది. ఆమె ఉన్నట్టుండి “నువ్వు గే కాదని నాకు తెలుసు” అంటుంది. అంటే అతను గే అయినందుకు ఆమెకి నిరాశగా ఉందన్నమాట. ఆ మాటకి క్లిఫ్ చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడు. తలిదండ్రులు బిడ్డలని ‘నువ్వు నన్ను నిరాశపరచావు’ అంటే ఎంత క్షోభ? ఎవరి ఉనికి వారిది. ఎవరి పోరాటం వారిది. ధైర్యం చెప్పాల్సిన తలిదండ్రులు తీర్పులు చెబితే మనసు చివుక్కుమనదా? కుటుంబాలలో బంధాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో ఇలా చూపించారు.

చిత్రంలో వచ్చే మలుపు ఒకటి చెప్పి ముగిస్తాను. మంక్ రాసిన పుస్తకం కూడా అవార్డు పరిశీలనకి వస్తుంది. ఆ కమిటీలో మంక్ సభ్యుడు! అతను వేరే పేరుతో రాశాడు కాబట్టి ఇతరులకి తెలియదు. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూస్తేనే బావుంటుంది. మంక్ తానే మేధావిననుకోవటం వల్ల అతనికి సమస్యలు వచ్చిపడతాయి. అందులో హాస్యమూ ఉంటుంది, నిరాశా ఉంటుంది. చిత్రంలో సందేశం ఏమిటంటే ఎవరినీ చిన్నచూపు చూడవద్దు. ఎవరి ప్రతిభ వారికి ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు, అభిరుచులు వారికి ఉంటాయి. అలాగే ఎవరి కష్టాలు వారికుంటాయి. మంక్ క్లిఫ్‌ని చూసి కాసింత అసూయపడతాడు. కానీ క్లిఫ్ తల్లి ప్రేమని పూర్తిగా పొందలేకపోయాడు. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. మంక్ సింటారాని చిన్నచూపు చూశాడు. ఆమె అతనికి దీటుగా జవాబు చెబుతుంది. జీవితం ముందు పరీక్షలు పెట్టి తర్వాత పాఠాలు నేర్పుతుంది. అదంతే! ఈలోగా మనవారిని మనం కోల్పోకుండా ఉంటే అదే విజయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here