అద్వైత్ ఇండియా-40

0
5

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాబర్ట్‌ దగ్గరకు బయల్దేరిన అద్వైత్‌కు దారిలో సుల్తాన్ కొడుకు అంజాద్ ఎదురవుతాడు. రాఘవ గురించి అడుగుతాడు. అద్వైత్ తెలియదని చెప్తే, హేళనగా మాట్లాడతాడు. రాబర్ట్ ఇంటికి చేరేసరికి అక్కడ పోలీసులు ఉంటారు. రాఘవ జాడ తెలిసినా, చెప్పలేదంటూ అద్వైత్‌ని అండమాన్‌కి తీసుకెళ్ళమని చెప్తాడు రాబర్ట్. పోలీసులు రాఘవని వ్యాన్‍లో ఎక్కించి తీసుకుపోతారు. దారిలో సుల్తాన్ కనబడితే, గట్టిగా పిలుస్తాడు అద్వైత్.  ఆ పిలుపు విన్న సుల్తాన్ గబగబా పోలీస్ స్టేషన్‍కి వెళ్తాడు. ఇన్‌స్పెక్టర్ అద్వైత్‌ని కలవనీయడు. అండమాన్‌కి పంపేస్తున్నట్లు చెప్తాడు. వ్యాన్‍లో అద్వైత్‌ని తీసుకెళ్ళడం చూసిన ఓ వ్యక్తి, వెళ్ళి శాస్త్రి గారికి చెప్తాడు. ఈలోపు సుల్తాన్ రెడ్డిరామిరెడ్డిని గారిని కలిసి విషయం చెప్తాడు. వారిద్దరూ వెళ్ళి రాబర్ట్‌ని కలిసినా, ఉపయోగం ఉండదు. రాఘవ వచ్చి లొంగిపోతేనే అద్వైత్‌కి విడుదల అని చెప్తాడు. విషయం తెలిసిన సీత బాధపడుతుంది. సుల్తాన్ తెల్లదొరల వద్ద ఉద్యోగం మానేసి తన సమయమంతా శాస్త్రి గారితోనే గడుపుతుంటాడు. శాస్త్రిగారికి, సీతకి ధైర్యం చెబుతూంటాడు. కాస్త తేరుకున్న శాస్త్రి గారు సీతకి మనోధైర్యం కల్పిస్తూ, తొందరలోనే అద్వైత్ తిరిగి వస్తాడని చెప్తారు. వ్యాపకం కల్పించుకునేందుకు, సీతని స్కూలుకి వెళ్ళి పాఠాలు చెప్పమని చెప్తారు. సరేనంటుంది. కాలం గడుస్తూంటుంది. ఇక్కడ జరిగినవన్నీ ఆండ్రియాకి ఉత్తరం ద్వారా తెలియజేస్తాడు సుల్తాన్. – ఇక చదవండి.]

అధ్యాయం 79:

[dropcap]ఆ[/dropcap] రోజు.. వేకువన యధావిధిగా నరసింహశాస్త్రిగారు.. పాండు గోదావరీ నదికి వెళ్లి ఆరుగంటల ప్రాంతంలో ఇంటికి వచ్చారు. పాండూ వీధి తలుపు తెరిచాడు. ఇరువురూ లోన ప్రవేశించారు. దారి ప్రక్కన వెదురు బుట్టలో పొత్తి గుడ్డ మధ్యన మూడు నెలల బాబు. కాళ్ళు చేతులూ జాడిస్తూ.. వారికి గోచరించాడు.

శాస్త్రిగారు.. పాండు ఆశ్చర్యపోయారు.

పాండు ఆత్రంగా వంగి చూచి..

“మామయ్యా!.. బాబు..” అన్నాడు. బిడ్డను తన చేతుల్లోకి తీసికొని.. శాస్త్రిగారికి చూపించాడు.

శాస్త్రిగారి నోటి వెంట మాట రాలేదు.

“మామయ్యా.. ఈ బాబు ఎవరు? ఈ పసికందును ఎవరు మన ఇంటి ముంగిట వదలి వెళ్ళి వుంటారు?..” ఆత్రంగా అడిగాడు పాండు.

శాస్త్రిగారి కళ్ళు ఎదురు బుట్టలోని గుడ్డవైపు మళ్ళింది. వంగి బుట్టను చేతికి తీసుకొన్నారు. బుట్టలో ఒక కవరు కనుపించింది. ఆ కవరును చేతికి తీసుకున్నారు.

“పాండూ.. పద లోపలికి..” అన్నారు శాస్త్రిగారు చేతిలోని కవరును పాండు కంట పడనీయ్యకుండా.

బాబుతో పాండు ముందు, వెనుక శాస్త్రిగారు నడిచారు.

“సీతా!.. సుమతీ!..” పిలిచారు శాస్త్రిగారు.

వారిరువురూ వరండాలోకి వచ్చారు.

పాండురంగ చేతుల్లో వున్న నెలల బాబును చూచి ఆశ్చర్యపోయారు.

“ఎవరండీ ఆ పాప?..” ఆశ్చర్యంతో అడిగింది సుమతి.

“పాప కాదు బాబు..” అన్నాడు పాండు సుమతి ముఖంలోకి చూస్తూ.

బాబు ఏడవసాగాడు.

నరసింహశాస్త్రిగారు.. సీత ముఖంలోకి చూచారు.

“పాండూ!.. లోపలికి తీసుకురా.. పాలు పడదాం..” అంది సీత

“నీ చేతుల్లోకి తీసుకో అమ్మా!..”

సీత పాండూను సమీపించిం బాబును తన చేతుల్లోకి తీసుకొంది.

“సుమతీ!.. యీ బాబు ఎవరోకాని.. ఎంత అందంగా వున్నాడో చూచావా.. ఆకలితో ఏడుస్తున్నాడు. పాలు పట్టాలి.. పద లోపలికి.” అంది సీత.

సుమతి సీతలు బాబుతో లోనికి వెళ్ళిపోయారు.

“సీతా!.. బాబుకు నేను పాలు ఇస్తాను..”

“ఏం నేను ఇవ్వకూడదా!..”

“మన పాపకు పాలు చాలవేమో!..”

“మన ఇద్దరు పిల్లలూ.. మన దగ్గరి మార్చి మార్చి పాలు ఎవరి దగ్గర వుంటే వారి దగ్గర తాగుతున్నారుగా..”

“సరే!.. బాబు గుక్క పట్టాడు. ముందు పాలు యివ్వు..”

సీత కూర్చొని పవిట కప్పుకొని బాబుకు పాలు ఇవ్వసాగింది. బిడ్డ ఏడ్పును అపాడు.

ముఖ్యమైన పని వున్నందున పాండు వారికి శాస్త్రిగారికి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.

నరసింహశాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు. కప్పుకొన్న పై పంచ కింద చంకలో పెట్టుకొన్న ఉత్తరాన్ని బయటికి తీశారు.

సీత పాలు త్రాగిన బాబు నిద్రపోయాడు.

పాప భవానీ మంచంపై పడుకొని నిద్రపోతూ వుంది. బాబును భవాని ప్రక్కన పడుకోబెట్టింది సీత, బొజ్జ నిండిన కారణంగా హాయిగా నిద్రపోతున్న బాబును చూచింది. తెల్లగా కాళ్ళు చేతులు పొడుగ్గా ఎంతో అందంగా వున్న బాబును కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది.

ఉత్తరాన్ని విప్పబోయి.. తాను దాన్ని చదివేటప్పుడు సీతకాని సుమతి కాని వస్తే.. వారు ఉత్తరం ఎక్కడి నుంచి యింత ఉదయాన్నే వచ్చిందని అడుగుతారు.

వారి ఆ ప్రశ్నకు.. తాను జవాబు చెప్పలేక తడబడవలసి వస్తుంది.. లేక అబద్ధానైనా చెప్పవలసి వస్తుంది. ఆ దొండూ శాస్త్రిగారికి నచ్చని కారణంగా.. ఎటన్నా వెళ్ళి ఉత్తరాన్ని ప్రశాంతంగా చదువుకోవాలనుకొన్నారు శాస్త్రిగారు.

“అమ్మా సీతా!..” పిలిచారు శాస్త్రిగారు.

వారి పిలుపును విని సీత వరండాలోకి వచ్చింది.

“మామయ్యా.. ఆ బాబు ఎవరి బాలై వుంటాడు. మూడు నెలల ఆ పసికందును మన వాకిట ఎవరు వుంచి వెళ్ళి వుంటారు.. మీకు ఏమనిపిస్తూ వుంది మామయ్యా?” అడిగింది సీత అమాయకంగా.

“నేనూ ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నానమ్మా!.. నాకూ అయోమయంగా వుంది. బాబుకు పాలు యిచ్చావా అమ్మా..” ప్రీతిగా అడిగారు శాస్త్రిగారు.

“ఇచ్చాను మామయ్యా.. కడుపు నిండా తాగి నిద్రపోతున్నాడు..”

“బాబు చాలా అందంగా వున్నాడు మామయ్యా.. ఏ తల్లి కన్న బిడ్డ.. మన ముంగిటికి ఎలా వచ్చాడో.. ఎంతో ఆశ్చర్యంగా వుంది మామయ్యా!” చిరునవ్వుతో చెప్పింది సీత.

శాస్త్రిగారు సీత ముఖంలోకి చూచాడు. ఆమె ముఖంలో ఏదో క్రొత్త కాంతి.

“మామయ్యా.. మీరు ఏమీ అనుకోనంటే నాకు ఓ మాట చెప్పాలని వుంది..” ప్రాధేయపూర్వకంగా వారి ముఖంలోకి చూచింది. సీత

“చెప్పమ్మా..”

“ఆ బాబును అనాథశరణాలయం పాలు చేయకుండా మనమే పుంచుకొందాం మామయ్యా! ఇది నా ఉద్దేశ్యం.. మీరేమంటారు?..” అనునయంగా అడిగింది సీత.

‘ఇదే మాతృత్వపు మహత్తర లక్షణం.. ఆ బిడ్డ ఎవరో తనకు తెలీదు కానీ,. తన బిడ్డతో పాటే ఆ బిడ్డను పెంచుకోవాలనుకొంటూ వుంది సీత. యీ సద్గుణాలు సంపత్తి హైందవజాతి స్త్రీమూర్తుల ఘనతకు కారణం’ అనుకొన్నారు. శాస్త్రిగారు.

సీత వారినే చూస్తూ నిలబడింది. ఆమె ముఖంలోకి చూచారు శాస్త్రిగారు, చూపులు కలిశాయి. సీత తల దించుకొంది. ఆమె మనోభావన శాస్త్రిగారికి అర్థం అయింది.

“అమ్మా.. సీతా!.. నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.” చిరునవ్వుతో చెప్పారు శాస్త్రిగారు..

సీత.. ఆనందంగా నవ్వింది. “నాకు తెలుసు మామయ్యా.. మీరు నా మాటను కాదనరని,” సంతోషంగా చెప్పింది సీత.

ఉత్తరం.. గుర్తుకు వచ్చింది శాస్త్రిగారికి,

“అమ్మా.. నేను శ్రీ మహాలక్ష్మిదేవి గుడి వరకూ వెళ్ళి వస్తాను” అన్నారు.

“సరే మామయ్యా..” సీత లోనికి వెళ్ళిపోయింది.

శాస్త్రిగారు పై పంచను సవరించుకొని లేచి.. వీధిలో ప్రవేశించారు. చేతిలోని కవర్‌ను చూచారు నడుస్తూనే..

‘ఈ ఉత్తరాన్ని ఎవరు వ్రాసి వుంటారు?.. ఆ బాబుకు యీ ఉత్తరాన్ని వ్రాసిన వారికి సంబంధం వుండి వుంటుంది. వారు ఎవరో..’ అనుకొన్నారు శాస్త్రిగారు. వేగంగా నడిచి శ్రీమహాలక్ష్మిదేవి ఆలయం ముందున్న వేపచెట్టు.. దాని చుట్టూ వున్న అరుగుపై కూర్చున్నారు. కవర్‌ను చించి అందులోని ఉత్తరాన్ని బయటికి తీసి చదవసాగారు.

‘బ్రహ్మ శ్రీ వేదమూర్తులు.. నా గురుదేవులు.. గారి పాదపద్మాలకు నమస్కారములు వారు.. మీ కుమారులు లండన్‍లో వుండగా నా పుట్టినరోజు నాడు ఉంగరాన్ని బహుమతిగా నా కోర్కె మీద నా వేలికి తొడిగారు. నేనూ.. అదే రోజు కొన్ని గంటల తర్వాత నా చేతిలోని ఉంగరాన్ని తీసి వారి చేతికి తొడిగాను. ఆ రీతిగా వారి పట్ల నాకు వున్న ప్రేమ మా యిరువురినీ సన్నిహితులుగా మార్చింది. వారిని నేను లండన్‌కు వెళ్ళిన తర్వాత ఎంతగానో అభిమానించాను. ప్రేమించాను. మాకు ఆ రీతిగా గాంధర్వ వివాహం జరిగింది. ఒక్కటైనాము. నా కోర్కెకు మా అమ్మమ్మ.. అమ్మల అమోదం లభించింది.

అది జరిగిన నెల రోజులకు సీత ఉత్తరం వారికి అందింది.. వారు గర్భవతిగా వున్న సీతను.. మిమ్ములను చూడాలని ఇండియాకు బయలుదేరారు. స్టీమర్ ఎక్కించి వీడ్కోలు చెప్పి త్వరగా తిరిగి రావలసిందిగా కోరాను. ఒకవేళ.. సీత.. లేక ఏ యితర కారణాల వల్ల మీరు తిరిగి రాలేకపోతే.. నా పరిస్థితీ సీతలా అయితే.. నేను ఏం చేయాలని వారిని అడిగాను, వారు నన్ను ఇండియాకు రమ్మన్నారు.

నా అనుమానం నిజం అయింది. గర్భవతినైనాను. వారి మాట ప్రకారం ఇండియాకు రావాలనుకొన్నాను. మా అమ్మా నాన్నలు విడాకులు తీసికొన్న కారణంగా.. మిస్టర్ రాబర్ట్ మరో యువతిని వివాహం చేసికొన్న కారణంగా.. అమ్మ – నేను ఆ స్థితిలో ఇండియాకు వచ్చేదానికి అంగీకరించలేదు. నెలలు నిండాయి. బాబు పుట్టాడు. సుల్తాన్ భాయ్. వ్రాసిన లేఖ చేరింది. ఇక్కడి విషయాలన్నీ నాకు తెలిసాయి. ఎంతగానో బాధపడ్డాను.

అన్నిటికన్నా నాకు ఎంతో ఆవేదన కలిగించిన విషయాలు.. మా అత్తగారి నిర్యాణం.. రాఘవగారి కారణంగా మిస్టర్ రాబర్ట్ మానవత్వం లేకుండా మా వారిని అండమాన్ జైలుకు పంపడం.. అక్కడ వుండలేకపోయాను. మిమ్మల్ని చూడాలని ఇండియాకు వచ్చాను. మా యిరువురి సంబంధాన్ని విన్న సీత ఎంతగానో బాధపడుతుందనే భయం. సీత ఎంతో మంచిది. ఆమె నా కారణంగా బాధపడడం నాకు ఇష్టం లేదు. అందువలన నేను మిమ్మల్ని కలవలేకపోయాను. అండమాన్‍కు వెళ్లి మావారితో తిరిగి రావాలని నిర్ణయించుకొన్నాను.

బాబు.. మీ యింటి వారసుడు. వాడు మీ చేతుల్లో పెరిగి పెద్దవాడై.. వాడి నాన్నగారిలాగా.. మీలాగా మంచి వ్యక్తిత్వం వున్న వాడిగా బ్రతకాలని నా ఆశ. అందుకే.. మీ మనువడిని మీ ఇంటి ముంగిట వుంచి నేను అండమాన్.. మావారిని విడిపించుకొని తిరిగి రావాలని వెళుతున్నాను. నేను తిరిగివస్తే.. మిమ్మల్ని తప్పక మా వారితో కలసి కలుస్తాను. ఏ కారణాల వల్లనైనా.. నేను తిరిగి రాలేక పోతే బాబు ఎవరో అనాథ కాదని.. మీ రక్తమేనని మీకు తెలియాలని ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను. మా ఇరువురి మధ్యన జరిగిన దానిలో.. వారి తప్పు లేదు. తప్పంతా నాదే!.. మిమ్మల్ని మామయ్యా అని పిలవాలని వుంది, మీ ఎదుట నిలబడి. నాకు ఆ యోగం వుందో లేదో.

నా తప్పును మన్నించండి. బాబును జాగ్రత్తగా చూచుకోండి వారితో నేను కలసి తప్పక తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించండి. మరోసారి మీకు నా పాదాభివందనం.

ఒకనాటి మీ ప్రియశిష్యురాలు నేటిది.. మీ కోడలు – ఇండియా అద్వైత్’

ఉత్తరం సొంతం చదివేసరికి శాస్త్రిగారికి చెమట శరీరాన్నంతా కమ్ముకుంది. నిర్ఘాంతపోయారు.

‘నా వాకిట పుదయం నేను చూచిన పసికందు నా అద్వైత్ బిడ్డా!.. అచ్చం నా పోలికలతో వున్న అబ్బాయి.. నా మనుమడా!.. హే భగవాన్.. ఏమిటయ్యా నీ లీల.. గత జీవితంలోని చేదు అనుభవాలను జీర్ణించుకోలేదు.. నా హృదయ వేదనను ఎవరికీ చెప్పుకోలేక.. నాలో నేను సతమతమౌతూ వుంటే యీ స్థితిలో నాడు ఏమిటయ్యా యీ పరీక్ష.. నేను యీ యథార్థాన్ని సీతకు చెప్పాలా వద్దా!.. అండమాన్‌కు వెళ్ళిన ఇండియా.. నా కోడలు.. నా కొడుకుతో.. తిరిగి వస్తుందా!.. రాక్షసుడు రాబర్ట్ మనుషులు వారిని క్షేమంగా తిరిగి రానిస్తారా!.. వారు ఒకవేళ తిరిగి వచ్చినా పాపి రాబర్ట్ వాళ్ళను బ్రతకనిస్తాడా!.. సీత.. ఇండియాను అభిమానంగా చూడగలదా!.. ఇరువురి స్త్రీల మధ్యన అది తన భావి జీవితాన్ని ఎలా సాగిస్తాడు?!.. ఎవరిని స్వీకరిస్తాడు.!.. ఎవరిని కాదనగలడు?1.. వారిని చూస్తూ.. న్యాయం చెప్పండి మీరే అని నన్ను ఆ స్త్రీ మూర్తులు ఇరువురూ అడిగితే.. వారి ఆ ప్రశ్నకు నేను ఎలాంటి జవాబు చెప్పగలను?.. జీవితపు చివరి మజిలీలో నా ముందు ఇన్ని ప్రశ్నలు.. సమస్యలు. నేను వాటిని ఎదిరించి ఎలా ముందుకు సాగాలి!!!.. రక్షకా!.. తమేవశరణం. నాకు సమయస్ఫూర్తిని.. సహనాన్ని.. శక్తిని ప్రసాదించు’ అరుగు దిగి ఆలయంలో ప్రవేశించి ఆ మహాలక్ష్మి విగ్రహాన్ని కన్నీటితో చూస్తూ చేతులు జోడించారు శాస్త్రిగారు.

అధ్యాయం 80:

ఇండియా అండమాన్ చేరింది. అక్కడి జైల్ సూపరిండెంట్ జాన్ మిల్టన్, వారిని కలిసింది ఇండియా. పది సంవత్సరముల క్రిందట మిల్టన్ కలకత్తాలో వుండేవాడు. ఆ రోజుల్లో రాబర్ట్.. మిల్టన్ ప్రక్క ప్రక్క యిళ్ళల్లో వుండేవారు. వారిని గుర్తించిన ఇండియా.. తాను ఎవరో తెలియజేసి.. రాబర్ట్ ఏ కారణంగా అద్వైత్‌ను అండమాన్ జైలుకు పంపాడో.. తనకు అద్వైత్ కుటుంబానికి వున్న సంబంధాన్ని.. ఆ కుటుంబ సభ్యుల అద్వైత్ యొక్క తత్వాన్ని వివరించింది. అద్వైత్‌ను జైలు నుంచి విడిపించవలసిందిగా ప్రాధేయపూర్వకంగా కోరింది.

జాన్ మిల్టన్ తొలుత అంగీకరించలేదు. ఆండ్రియా తనకు తెలిసిన వారి సతీమణి రోజ్‌మన్‌కు తన కథనంతా వివరంగా చెప్పింది. కేవలం రాఘవ మీది పగతో తన భర్తను అండమాన్ జైలుకు రాబర్ట్ పంపాడని.. తన గురువు.. మామగారైన నరసింహశాస్త్రిగారు వయస్సు మీరిన వారని.. ఎంతో మంచివారని తెలియజేసి.. జాన్ మిల్టన్‌కు అద్వైత్‌ను విడిచి పెట్టవలసిందిగా చెప్పమని కోరింది.

రోజ్‌మన్.. తన భర్తతో, ఇండియా తనకు చెప్పిన వివరాలనన్నింటినీ ఇండియా సమక్షంలో చెప్పింది. నిరపరాధి అయిన అద్వైత్‌ను విడిచి పెట్టమని కోరింది.

భార్య చెప్పిన మాటలను సొంతం విని.. జాన్ మిల్టన్ తన మనస్సు మార్చుకొన్నాడు. దీనంగా తన్నే చూస్తున్న ఇండియాతో..

“ఇండియా, నేను నీ భర్తను విడిపిస్తాను. మీరు ఇండియాకు వెళ్ళేదానికి ఒక బోట్‍ను సిద్ధం చేస్తాను. నీ కథనంతా విన్న తర్వాత నాకు ప్రేమ తత్వం ఎలాంటిదో తెలిసి వచ్చింది. నీవు చాలా తెలివైనదానవు, మంచిదానివి. నా నిర్ణయం మారే దానికి కారణం నీ మంచితనం..” చెప్పాడు జాన్ మిల్టన్.

జైలుకు వెళ్ళిపోయి.. గంటలో అద్వైత్‌తో తిరిగి వచ్చాడు. చెప్పిన మాట ప్రకారం బోట్‌ని సిద్ధం చేయించాడు.

ఆ దంపతులకు ధన్యవాదాలను తెలియజేసి.. ఇండియా అద్వైత్‌లు బోట్లో ఇండియాకు బయలుదేరారు.

లండన్‌‍లో అద్వైత్ బోట్‍ నడపడం ఇండియా ప్రోద్బలంతో నేర్చుకొన్నాడు. ఇరువురూ అక్కడ ప్రతి ఆదివారం బోట్ షికారు చేసేవారు. అనాటి అనుభవం ఈనాడు ఉపయోగపడింది. ఇండియా అద్వైత్‌ను సమీపించి అతన్ని గట్టిగా కౌగలించుకొంది. బోరున ఏడ్చింది.

“ఇందూ.. ఎందుకు ఏడుస్తున్నావ్? మనం కలిసి ఇండియాకు వెళుతున్నాముగా!..” ఆమె కన్నీటిని తుడుస్తూ ప్రీతిగా అడిగాడు అద్వైత్.

“మన బాబు ఎలా వున్నాడో.. వాడు గుర్తుకు వచ్చాడు అది!..” బొంగురు పోయిన కంఠంతో చెప్పింది ఇండియా.

“నీవు బాబును వదిలింది వారి తాతగారి ఇంట. వారు ఎలాంటి మనస్తత్వం కలవారో నీకు బాగా తెలుసు. నీవు వారికి వ్రాసిన ఉత్తరాన్ని చదివి.. బాబు ఎవరో తెలిసికొని వారు బాబును ఎంతో జాగ్రర్తగా చూచుకొంటూ వుంటారు. బాధపడకు. నాలుగు రోజుల్లో మనం వారినందరినీ కలసికొంటాంగా..” అనునయంగా చెప్పాడు అద్వైత్..

గాలి వాలు అనుకూలంతో బోట్ ప్రశాంతంగా ముందుకు సాగిపోతూ వుంది..

అద్వైత్ తన్ను విడచి.. ఇండియాకు బయలుదేరిన నాటి నుంచి జరిగింది.. తాను గర్భవతినని చెప్పిన నాడు మేరీ.. ఆండ్రియా మూన్ ఎంతగా సంతోషించిందీ.. తన ప్రసవం ఎలా జరగింది. సుల్తాన్ భాయ్ వ్రాసిన లేఖను చదివిన తర్వాత.. తాను పడ్డ ఆవేదనను గురించి.. బాబుతో తన ఇండియా ప్రయాణాన్ని గురించి.. అన్ని వివరాలు.. ఇండియా అద్వైత్‌కు తెలియజేసింది.

తన కోసం.. ఇండియా పడ్డ కష్టాలు తలచుకొని అద్వైత్ ఎంతో బాధపడ్డాడు. సాహసించి ఎంతో నమ్మకంతో అండమాన్‌కు వచ్చినందుకు.. జైలు సూపరెండెంట్‌తో మాట్లాడి వారిని మెప్పించి తనకు జైలు విముక్తిని ప్రసాదించినందుకు అద్వైత్ ఎంతో ఆనందంగా ఇండియాను తన హృదయానికి హత్తుకొన్నాడు.

పరవశంతో ఇండియా అతని కౌగిలిలో ఒరిగిపోయింది.

ఆనాడు ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి. ఆకశాన చంద్రుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. ఆ ఇరువురు తమ భావిజీవితాన్ని గురించి మాట్లాడుకొంటూ బోట్లో ముందుకు పయనిస్తున్నారు.

“ఎవరూ నిన్ను నా దగ్గిర నుంచి వేరు చేయలేరు ఇందూ!..” ప్రేమతో ఆమె నొసటన ముద్దిడి ఆనందంగా నవ్వాడు అద్వైత్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here