[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
~
బెంగాలీ సంగీత దర్శకుడు, స్వరకర్త, జానపద గాయకుడు కమల్ దాస్‌గుప్తా:
కోమోల్ దాస్ గుప్తా లేదా కమల్ దాస్‍గుప్తా లేదా కమాల్ ఉద్దీన్ అహ్మద్ (28 జూలై 1912 – 20 జూలై 1974) ఇరవయ్యవ శతాబ్దపు బెంగాలీ సంగీత దర్శకుడు, స్వరకర్త, జానపద కళాకారుడు. రాగం, ఠుమ్రి వారి సంగీతంలో ప్రధాన అంశాలు. ఆయన భార్య ఫిరోజా బేగం (1930-2014) నజ్రుల్ సంగీత గాయని. వారి రెండవ, మూడవ కుమారులు హమిన్ అహ్మద్, షఫిన్ అహ్మద్ బంగ్లాదేశ్ బ్యాండ్ మైల్స్‌లో ప్రధాన గాయకులు.
కోమోల్ దాస్ గుప్తా 28 జూలై 1912న అప్పటి బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని జెస్సోర్‌లోని నరైల్‌లో జన్మించారు. ఆయన 1928లో కలకత్తా అకాడమీ నుండి మెట్రిక్యులేషన్ చదివారు, తరువాత కొమిల్లా విక్టోరియా ప్రభుత్వ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. భజనల స్వరకర్త, గాయని మీరాబాయిపై చేసిన పరిశోధనకి 1943లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డాక్టరేట్ పొందారు. వారికి ప్రారంభ ప్రేరణ తండ్రి తారా ప్రసన్న దాస్‌గుప్తా నుండి లభించింది. ఆయన తన తొలి సంగీత పాఠాలను తన సోదరుడు బిమల్ దాస్ గుప్తా నుండి నేర్చుకున్నారు. తరువాత అతను దిలీప్ కుమార్ రాయ్, కానా కేస్తా, ఉస్తాద్ జమీరుద్దీన్ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు.
కోమోల్ దాస్ గుప్తా బహుముఖ సంగీత మేధావి. అతను బెంగాలీ, ఉర్దూ, హిందీ, తమిళంలో ఆధునిక పాటలు పాడారు. దాదాపు ఎనిమిది వేల పాటలకు సంగీతాన్ని సమకూర్చిన ఆయన అద్భుతమైన స్వరకర్త కూడా. వారి పని శాస్త్రీయ సంగీతంపై ఆధారపడింది, ఠుమ్రీ శైలి వైపు మొగ్గు చూపింది. అయినప్పటికీ ఆయన ఇతర వనరుల నుండి కూడా ప్రేరణ పొందారు.
కోమోల్ దాస్ గుప్తా దాదాపు ఎనభై బంగ్లా చిత్రాలకు సంగీతం అందించారు, వాటిలో తుఫాన్ మెయిల్, ఝమెలార్ ప్రేమ్, ఈ కి గో షెస్ డాన్ ముఖ్యమైనవి. సంగీత దర్శకుడిగా అతని చివరి చిత్రం బధు భరన్ (1967). ‘వార్ ప్రాపగాండా’ అనే అమెరికన్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని కూడా సమకూర్చారు. స్వరకర్తగా అతని దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రియాశీలకంగా ఉన్నారు. స్వరలిపి (నోటేషన్స్) కోసం సంక్షిప్తలిపి పద్ధతిని (షార్ట్‌హ్యాండ్) కనిపెట్టడం సంగీతానికి ఆయన చేసిన విశేష కృషి అని చెప్పుకోవాలి.
1935లో కోమల్ దాస్ గుప్తా గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాలో సంగీత దర్శకుడిగా చేరారు. అక్కడ తన పదవీకాలంలో, అతను కాజీ నజ్రుల్ ఇస్లాంతో సన్నిహిత అనుబంధాన్ని పెంచుకున్నారు. అతని నాలుగు వందల పాటలకు పైగా సంగీతాన్ని సమకూర్చారు. కమల్ దాస్ గుప్తా సంగీతం అందించిన గ్రామఫోన్ రికార్డులు 1950, 1960 దశకాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన పాటల్లో ‘సంజేర్ తారకా అమీ’ (నేను సంధ్యా నక్షత్రం), ‘పృథివీ అమరే ఛాయ్’ (ప్రపంచానికి నా అవసరం ఉంది), ‘అమీ భోరేర్ జూతిక’ (నేను ఉదయపు మల్లెపూవును) నేటికీ సుప్రసిద్ధం.
1956లో ఇస్లాం స్వీకరించి కమల్ ఉద్దీన్ అహ్మద్‌గా పేరు తెచ్చుకున్నారు. అదే సంవత్సరంలో ప్రఖ్యాత నజ్రుల్ సంగీత గాయని ఫిరోజా బేగంను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు తహసిన్ అహ్మద్, హమీన్ అహ్మద్, షఫిన్ అహ్మద్. చివరి ఇద్దరు కూడా ప్రముఖ గాయకులే.
కమల్ దాస్ గుప్తా 20 జూలై 1974న ఢాకాలో మరణించారు.
ఆయన సంగీతమందించిన హిందీ చిత్రాలు:
- జవాబ్ (1942)
- హాస్పిటల్ (1943)
- రాణి (1943)
- మేఘ్‌దూత్ (1945)
- అరేబియన్ నైట్స్ (1946)
- బిందియా (1946)
- కృష్ణ లీల (1946)
- జమీన్ ఆస్మాన్ (1946)
- ఫైస్లా (అనుపమ్ ఘటక్‌తో) (1947)
- గిర్‌బాలా (1947)
- మన్మణి (1947)
- చందర్ శేఖర్ (1948)
- ఇరాన్ కీ ఏక్ రాత్ (1949)
- ఫుల్వారి (1951)
ఆయన సంగీతమందించిన బెంగాలీ చిత్రాలు:
- పండిట్ మాషి (1936)
- శేష్ ఉత్తర్ (1942)
- సహధర్మిని (1943)
- జోగా జోగ్ (1943)
- చందర్ కళంక (1944)
- దంపతి (1944)
- బిదేష్ని (1944)
- నందిత (1944)
- మేఘ్‌దూత్ (1945)
- భాబీ కాల్ (1945)
- రంగమతి (1948)
- అనురాధ (1949)
- మలంచ (1952)
- ప్రార్థన (1953)
- భగవాన్ శ్రీ కృష్ణ చైతన్య (1953)
- సంధన్ (1953)
- నబిబిధన్ (1954)
- బ్రతచారిణి (1955)
- మనరక్ష (1956)
- గోవిందదాస్ (1956)
- మధు మాలతి (1956)
- బోధు బరన్ (1967)
హిందీ చలనచిత్రం ‘జవాబ్’ (1942)లో, గాయని-నటి కానన్ దేవి, తన అద్భుతమన గానంతో – చంచలమైన, చిన్నపిల్లాడి స్వభావం కల పి.సి. బారువాను నిద్ర పుచ్చుతారు. ఈ పాట ‘ఏయ్ చంద్ చుప్ నా జానా’. గొప్ప సాంత్వననిచ్చే పాట. ప్రస్తుత సమాజంలో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వారు ఈ పాట వినవచ్చు. పండిట్ మధుర్ సాహిత్యం అందించగా, కమల్ దాస్‌గుప్తా స్వరపరిచిన ఈ లాలిపాట అద్భుతంగా ఉంటుంది.
లింక్: