[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
రెండవ భార్య
ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి – అన్నది సభ్య నాగరిక సమాజం ఆమోదించిన న్యాయసూత్రం. ఏ కారణం చేతనైనా మొదటి భార్య చనిపోయినా, లేక విడాకులు తీసుకున్న రెండవ భార్యను చేసుకోవచ్చు. కానీ కొంతమంది మొదటి భార్యతో జీవిస్తూనే, మరొక స్త్రీని వివాహం చేసుకుంటుంటారు. వీరి సంఖ్య తక్కువే అయినా, వీరి కుటుంబంలో తలెత్తే సంక్షోభం మాత్రం సామాన్యమైనది కాదు.
పూర్వం రాజులు, రారాజులు ఒకరి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకునేవారు. ఎంతమంది భార్యలు ఉంటే, ఆయన అంత గొప్ప రాజుగా భావించేవారు. ఒకటి రెండు తరాలు వెనక్కి వెళ్లి చూస్తే, పల్లెటూర్లల్లో శ్రీమంతులు అసలు భార్య ఇంట్లో ఉండగా, మరోచోట మరో స్త్రీని చేరదీసి తన అధీనంలో ఉంచుకునేవారు. ఈ రెండవ స్త్రీని ‘ఫలానా వారి ఇలాకా’ అని చెప్పుకునేవారు.
రెండవ భార్యగా ఉండటానికి నిజానికి ఏ స్త్రీ అంగీకరించదు. అతను ఆమెకు ఎక్కడో తారసపడతాడు. పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. తనకు అంతకు ముందే వివాహం అయినా, అతను ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. అబద్ధం చెబుతాడు. లాంఛనంగా పెళ్లి తంతు జరిపిస్తాడు. తరువాత ఎప్పుడో తను మోసపోయినట్లు తెల్సుకున్నా, అప్పటికే జరగ వల్లన నష్టం జరిగి పోతుంది.
మరి కొన్ని సందర్భాల్లో ఆమె అతని ఆకర్షణలో పడి, అందులో నుంచి బయట పడలేక పోతుంది. అన్నిటికీ సిద్ధపడే అతనికి రెండవ భార్యగా మిగిలి పోతుంది.
ఒక నటుడు ఉంటాడు. భార్యాపిల్లలూ, సంసారమూ అన్న సజావుగా సాగిపోతుంటాయి. కానీ వృత్తిరీత్యా మరొక స్త్రీ ఆతనికి ప్రియురాలిగానో, భార్యగానో నటిస్తూ మానసికంగా బాగా దగ్గర అవుతుంది. నటనే అయినా, ఈ కాసేపూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచం మీద పడుకుంటారు. ఆ నటనే నిజం కావాలన్న కోరిక బలంగా ఏర్పడుతుంది. ఆ ఆకర్షణలోని బలం, తీయని వేదన శారీరికంగానూ చేరువ చేస్తుంది. అన్నీ తెల్సినా అతనికి రెండవ భార్యగా మారిపోతుంది.
కవులూ, కళాకారులదీ దాదాపుగా ఇదే పరిస్థితి. తమ బలహీనతను ఏదో కారణాలతో సర్ది చెప్పుకుంటారు. మొదటి భార్య దీనిని సహించదు. కానీ అప్పటికీ సగం జీవితం గడిచి పోయి; పిల్లలతో విడిగా ఉండలేని పరిస్థితి ఆమెది.
రెండవ భార్యగా ఉండటం వలన ఆమెకు జరుగుతున్న నష్టం ఏమిటి? నిజానికి భార్యాభర్తల అనుబంధం పవిత్రమైనది. తమ మధ్య మరో వ్యక్తికి చోటు ఉండకూడదని భావిస్తారు, ప్రగాఢమైన ప్రేమ వైవాహిక బంధానికి ఎంతో ముఖ్యం. కానీ రెండవ భార్య వల్ల అతను ఇద్దర్లో ఎవరికీ పూర్తిగా స్వంతం కాలేకపోతాడు. నూటికి నూరు పాళ్లూ అతని మీదనే ఆధారపడి, తన బాగోగులన్నీ అతనే చూసుకుంటాడని నిశ్చింతగా ఉండలేదు. మనస్ఫూర్తిగా నమ్మలేదు. ఆస్తిపాస్తుల విషయంలో చట్టరీత్యా మొదటి భార్యకే హక్కులు ఉంటాయి. రెండవ వివాహం చట్ట సమ్మతమైనది కాదు గనుక, సమాజంలో రెండవ భార్యకు చిన్న చూపు. ఎంత పట్టించుకోకుండా తిరుగుతున్నా, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట, ఏదో మాటలు వచ్చి తూటాల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. సోషల్ స్టిగ్మా కారణంగా గిల్టీగా ఫీలవుతుంది. నలుగురిలో ధైర్యంగా చొరవగా వెళ్లలేదు. ఇక స్త్రీ తన కడుపున పుట్టిన బిడ్డ ఒకరైనా ఉండాలని కోరుకుంటుంది. రెండవ భార్యకు సంతానం కలగటానికి భర్త సహకరించడు. పిల్లలు పుడితే నీ అందం తరిగిపోతుందని మభ్యపెడతాడు. ఒక వేళ పిల్లలను కన్నా, సమాజంలో వాళ్ల స్థానం ఎక్కడ? ఇన్ని అవాంతరాల మధ్య రెండవ భార్య స్థానం ఎక్కడ? హృదయంలోనా? పాదాల చెంతనా?