వసంత లోగిలి-8

0
3

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[కూతురు కోట విడిచి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్న తిలక్ బహాదూర్‍ని ఓదారుస్తారు మార్తండ. విధి బలీయమైనదని అంటారు. తన కలలు కల్లలయాయని అంతుంది నందిని. అదే అదనుగా, ఎవరు పడితే వాళ్ళని కోటలోకి రానివ్వద్దంటే వినలేదు, అందుకే ఎవరితోనే ఉడాయించింది అన్న అంజన మాటలకు ఆమె వైపు తీవ్రంగా చూస్తుంది నందిని. తాను పెళ్ళాడాలనుకున్న స్వప్నిక ఇలా చెందుకు చేసిందో అర్థం కాదు ధనుంజయ్‍కి. ఇప్పుడు అత్తామామాలకి తానే దిక్కు కాబట్టి, ఆస్తి తనదే అన్న ఆలోచనలో ఉంటాడు ధనుంజయ్. ఆస్తిని చేజిక్కుంచుకోడానికి కుట్రలు పన్నుతూనే ఉంటారు అంజన, ధనుంజయ్. అత్తామామల వెన్నంటే ఉంటూ స్వప్నిక గురించి ఏమైనా తెలిస్తే, తనకి చెప్పమని తల్లితో అంటాడు ధనుంజయ్. అడవుల మధ్య ఆశ్రమంలో స్వప్నిక-సుధీర్‍ల వివాహాం నిరాడంబరంగా జరిగిపోతుంది. రాచరికపు ఆనవాళ్ళను వదిలి, ఇక్కడ ఇల రహస్యంగా జీవించడం ఎందుకో స్వప్నికకు అర్థం కాదు. అసలు తన 18వ పుట్టినరోజు ముందు ఏం జరిగిందని సుధీర్‍ని అడుగుతుంది. తనకు తెలిసిన వివరాలు చెప్తాడు సుధీర్. తమని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో తనకీ తెలియదని, ఇక్కడికి వచ్చాకనే స్వప్నికని పెళ్ళి చేసుకోవాలని చెప్పారని చెప్తాడు. స్వప్నిక ఆశ్చర్యపోతుంది. ఒకసారెప్పుడో మాటల మధ్య సుధీర్ గురించి తన తల్లిదండ్రులు అభిప్రాయం అడగడం, మంచివాడని తాను చెప్పటం, అయితే అల్లుడిని చేసుకుందాం అని అమ్మ నందిని అనటం స్వప్నికకి గుర్తొస్తాయి. వాళ్ళిద్దరూ అసలు తమ మధ్య ప్రేమనేది ఉందా అని తర్కించుకుంటారు. అది రహస్యం కాబట్టి పెద్దగా మాట్లాడుకోరు. ఆ రోజు రాత్రి మార్తాండ గారు తమని కలవడానికి వస్తున్నారనీ, ఆయనతో మాట్లాడితే ఎన్నో విషయాలు తెలుస్తాయని చెప్తాడు సుధీర్. ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి 12 దాటింది.. ఆ నిశిరాత్రి ఆ ఆశ్రమంలో సుధీర్ వర్మ, స్వప్నిక తప్ప ఇతరులు ఎవరూ లేరు.. ఇంకా రాజ మార్తాండ రాలేదు.. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఇద్దరూ.

“ఏంటి సుధీర్ ఇంకా రాలేదు.. అసలు ఆయన వస్తారంటావా?” అంది సుమిత్ర (స్వప్నిక).

“లేదు లేదు.. మార్తాండ ఇక్కడ ఒక గురువుకి సమాచారం ఇచ్చి, ఇక్కడ మనల్ని ఉండమని చెప్పారు.. ఆయన తప్పకుండా వస్తారు” అన్నాడు సుధీర్ వర్మ.

ఇంతలో.. గుమ్మం దగ్గర చప్పుడు విని అటుగా చూసింది స్వప్నిక. “అదిగో మార్తాండ వస్తున్నారు.. నిజంగానే” అంటూ చిన్న పిల్లలా సంబరపడిపోయింది సుమిత్ర (స్వప్నిక).

ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్నదానిలా.. “తల్లి తండ్రులకు దూరంగా ఈ ఎడబాటు నన్ను నా మనసుని ఎంతో మథనపడేలా చేస్తోంది. కాలం ఇంత కఠినంగా నాతో ఎందుకు ఉంది? ..నా తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాక పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను ఆచార్యా!” అని మార్తాండ కాళ్ళ మీద పడింది సుమిత్ర (స్వప్నిక). కళ్ళనుండి ఏకధాటిగా కన్నీళ్లు కారుస్తున్న స్వప్నికను చూసి,

“లే తల్లీ.. లే.. నీ బాధలో అర్థం ఉంది కాని, పరిస్థితుల ప్రభావం తల్లీ.. ఏమీ చెయ్యలేని దుస్థితి.. నేను నీ కలవరపాటుని అర్థం చేసుకోగలను.. నీ మీమాంసని తొలిగించడానికే వచ్చా తల్లీ” అని అనునయిస్తూ సుధీర్ వర్మని స్వప్నికని దగ్గర కూర్చోబెట్టుకున్నారు మార్తాండ.

“మీరు ఎంత మథనపడుతున్నారో నాకు అర్థం అయింది. కాని, కొన్ని సార్లు పరిస్థితులకు తల ఒగ్గాల్సిందే” అన్నారు గంబీరంగా మార్తాండ ఆచార్యుల వారు.

“ఆడుతూ పాడుతూ అమ్మానాన్నలతో హాయిగా ఉండే ఈ సుమిత్ర (స్వప్నిక) పరిస్థితులకు తలోగ్గాలా! ఎందుకు? ఏమిటా పరిస్థితులు ఆచార్యా! చెప్పండి, నా వల్ల కావటం లేదు.. పైగా నా జీవితంలో ముఖ్యమైన ఘట్టం నా వివాహం. అది.. ఇక్కడ.. ఇలా” అని కన్నీళ్లు తుడుచుకుంటూ.. కాసేపటికి తేరుకుని

“ఇంతకీ, మా అమ్మా నాన్న ఎలా ఉన్నారు?” అని అడిగింది.

ఆ ప్రశ్నకి సమాధానంగా.. “కళ్ళల్లో పెట్టి పెంచుకున్న కూతురు కళ్ళకు కనపడకుండా ఉందంటే ప్రాణం విలవిలలాడిపోదా! తల్లీ.. వాళ్ళ బాధను చూడలేకున్నాను. వాళ్ళు బాధ వర్ణనాతీతం” అన్నారు. “నిన్ను తన దగ్గర ఉంచుకోలేని పరిస్థితి.. నిన్ను వదిలి ఏనాడైనా ఉన్నారా తిలక్ బహుదూర్.. నందినిలు.. కాని తప్పదు తల్లీ.. లోక కల్యాణం కోసం” అన్నారు మార్తాండాచార్యులు.

“లోక కల్యాణం కోసమా! లోక కల్యాణం కోసం బిడ్డని ఈ పరిస్థితులకు నెట్టేస్తారా! అసలు నన్ను తమ వద్ద ఉంచుకోలేని పరిస్థితి ఏంటి చెప్పండి ఆచార్యా!.. అంటే నాన్నగారే నన్ను కోట నుంచి బయటకు పంపేసారా! ఎందుకు? ఎందుకు అలా చేసారు? నేనేం తప్పు చేసాను?” అని ఆవేశపడింది సుమిత్ర (స్వప్నిక). “మమ్మల్ని ఇక్కడ ఎవరు ఉంచారు? ..అమ్మా నాన్న లేకుండా అసలు ఈ పెళ్ళేంటి?” అని కోపంతో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఊగిపోతున్న సుమిత్ర (స్వప్నిక) భుజాలు పట్టుకుని కూర్చోబెట్టారు మార్తాండ ఆచార్యుల వారు.

“అన్నీ చెబుతా!.. ఓపిగ్గా వినమ్మా” అంటూ మొదలు పెట్టారు ఆచార్య మార్తాండ.

“బహుదూర్ వంశంలో తెలిసో తెలియకో చాలా తప్పిదాలు జరిగాయి అని మా తాత ముత్తాతలు మాట్లాడుకునేవారు.. అవేంటో నాకు కూడా సరిగా తెలీదు. వాటి పరిణామాలే ఇవ్వన్నీ. అయినా కావాలని ఎవరూ తప్పులు చెయ్యరు కదా! అవి ఏ పరిస్థితులలో చేసారో, ఎలా చేసారో, అసలు ఏమి చేసారో మనకు తెలీదు. ఏది ఏమైనా కాలంతో పాటు ప్రయాణం చేసి తీరాలి. ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి. బహుదూర్ వంశంలో ఆడపిల్లలు పుట్టారటే అడుగడుగునా భయపడుతూ బతకాల్సిందే, అదృష్టమో! దురదృష్టమో గాని బహుదూర్ వంశంలో ప్రతి తరం లోను అమ్మాయిలు పుట్టరు. ప్రతి రెండు తరాల తరువాత మూడో తరంలో మాత్రమే ఒక ఆడపిల్ల పుడుతుంది. అరుదుగా ఆడపిల్ల పుట్టడంతో విపరీతమైన ప్రేమాభిమానాలను పెంచుకుంటారు వారి తల్లి తండ్రులు. అలా పుట్టిన వరప్రసాదానివి నువ్వు. కాని, నిన్ను కన్నవాళ్ళు భయం భయం గానే బతకాల్సిన దుస్థితి. ఎందుకంటే  ఈ వంశంలో పుట్టిన ఆడపిల్లకి ఒక శాపం వెంటాడుతూ ఉంటుంది” అని ఆగారు మార్తాండాచార్యుల వారు.

“శాపమా?” అంది స్వప్నిక.

“అవును స్వప్నికా (సుమిత్ర). 18 సంవత్సరాల తరువాత ఆ ఆడబిడ్డ కోటలో ఉండకూడదు. ఆమెకి రాజకుమారుడితో వివాహం చెయ్యకూడదు. అలా చేసుకున్న అమ్మాయికి మృత్యువు తథ్యం. ఇది తరతరాలుగా జరుగుతున్న ఘోరం. అందుకే బహుదూర్‌ల వంశంలో పుట్టిన ఆడబిడ్డ అంటే కన్నవాళ్లకి కడుపు కోతే. కానీ, ఇది విధి వైపరీత్యం.. దీన్ని ఎవరు తప్పించుకోలేరు.

ఇది నాకు మీ అమ్మ, నాన్నలకు తప్ప ఎవ్వరికీ తెలియని వంశరహస్యం. నువ్వు పుట్టిన తరువాత నిన్ను చూసి ఎంతో మురిసిపోయే తిలక్ నిన్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఎంతో మంది ఋషులను కలిసారు.. ఎన్నో గుడులు, గోపురాలు తిరిగారు.. హిమాలయాలలో ఉన్న గొప్ప గొప్ప ఋషులను, స్వామిజీల దగ్గరకు కూడా నాన్నగారిని తీసుకుని వెళ్ళాను కానీ నీ ఆయుష్షు పెంచే దారే కనపడలేదు మాకు.

నువ్వు తొమ్మిదో తరంలో పుట్టిన ఆడబిడ్డవి. నీ కంటే ముందు అంటే, ఆరో తరంలో స్వప్న బహుదూర్ పుట్టింది.. ఆమె రాజసం ఉట్టిపడేలా ఉండే అందమైన యువతి..18 సంవత్సరాల తరువాత లోకమాన్య మహారాజ్‌కి ఇచ్చి వివాహం చేసారు. కోట దాటకముందే ఆమె మరణించారు. మూడో తరంలో అశ్విని బహుదూర్, ఆమె కూడా అందాలరాశి. 18వ సంవత్సరం లోనే సంజీవ ధన్‌రాజ్ కిచ్చి వివాహం చేసారు. ఆమె వివాహ ఘడియలు ముగియనే లేదు, ఆమె కూడా హఠాత్తుగా మరణించారు. వీళ్ళిద్దరూ చాలా ఆరోగ్యంగా పుట్టారు, అదే ఆరోగ్యంతో జీవించారు. ఎటువంటి అనారోగ్యం లేదు వీళ్ళకి. వీరికి ముందు ఊర్మిలా బహుదూర్, ఆమె కూడా ఇలాగే మరణించారు. ఎందుకో ఏమిటో తెలియనే తెలియదు. కేవలం మీ వంశానికి ఉన్న శాపం వల్లే ఇలా జరుగుతోంది అంతే. దీనికి ఎవ్వరూ పరిష్కారం చూపలేకపోతున్నారు. ఈ శాపం జాడ్యంలా బహుదూర్ వంశాన్ని పీడిస్తోంది. ఈ విషయాలన్నీ పూర్వీకులు రాసిన పుస్తకంలో రాసి ఉన్నాయి. ఎంతో అందంగా ఉండే స్వప్న బహుదూర్ చనిపోయిన తరువాత మళ్ళీ ఆడబిడ్డ పుట్టాలంటే బహుదూర్ వంశం తొమ్మిదో తరం వరకు ఎదురు చూడాలి. అప్పుడైనా పరిష్కారం లభిస్తుందో లేదో అని మా ముత్తాత గారు బాధపడ్డ వైనం నాకు కన్నీరు తెప్పించింది. ఇది తిలక్ బహుదూర్‌కి చూపించిన తరువాత.. మీ రాజవంశంలో ఉన్న తాళపత్ర గ్రంథాలన్నీ తిరగేసి చూసాం.. ప్రతి మూడో తరంలో ఒక ఆడబిడ్డ పుట్టడం ఖాయం కాని, 18 ఏళ్ళ తరువాత చనిపోవడం ఖాయం.. పరిష్కారం ఎక్కడా రాయలేదు, అసలు ఆడబిడ్డ పుట్టకపోయినా బాగుండేది కదా! అని బాధపడ్డాం.

నువ్వు పుట్టేసరికి రాచరికం పోయినా రాజసం.. హోదా.. గౌరవం కొద్ది కొద్దిగా మిగిలి ఉండేవి. ప్రభుత్వాలు వచ్చాయి. రాజులకు మెల్లగా ప్రాముఖ్యత పోయింది. రాజరిక పాలనకి స్వస్తి చెప్పి, సాధారణ మనిషిలా బతకడం చాలా కష్టమైన పని. ఆ రాచరికపు చాయలు.. ఆ రాజసం, దర్పానికి దూరంగా బతకడానికి మీ నాన్నగారు, అమ్మ చాలా ప్రయత్నాలు చేసారు. నలుగురికి పెట్టే చెయ్యి నందిని అమ్మది. ఆ కోటతో పాటు ఉన్న ఆస్తులు మెల్లిగా తరగడం ప్రారంబించాయి. దానధర్మాలు చెయ్యడంతో ఆర్థిక ఇబ్బందులు చోటు చేసుకున్నాయి.. ఏది ఏమైనా ఉన్న వాటితో లోటు లేకుండా నిన్ను పెంచుకున్నారు తిలక్ నందిని బహుదూర్‍లు. నీ వయసు 18 సంవత్సరాలకు దగ్గర అవుతున్న కొద్దీ తిలక్ బహుదూర్, నందినిల మనసుల్లో ఒకటే ఆందోళన.. బయటకు కనిపించకుండా లోలోపల మథనపడుతూనే ఉన్నారు.. నువ్వు తమకి ఎక్కడ దూరమైపోతావో అని భయపడుతూనే ఉన్నారు.

కాత్యాయని అమ్మవారు బహుదూర్ వంశ ఇలవేల్పు. మీ వంశంలో  ఆడపిల్లలు నిష్కారణంగా చనిపోతుండడంతో కాత్యాయని అమ్మవారిపై నమ్మకం పోయి, మీ పూర్వీకులు ఆమెని కొలవటం, తలవటం కూడా ఏడో తరం నుంచి మానేశారు.. ఎవరూ ఆమె గుడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు.

కాని, నందిని గారు నువ్వు పుట్టాక కాత్యాయని దేవి తలుపులు తీయించి మళ్ళీ పూజలు జరిగేలా, పద్ధతి ప్రకారం జరుపుతూ వస్తున్నారు.. ప్రతి వారం కాత్యాయని దేవి గుడికి వెళ్లి పూజలు చేసుకుని రావాల్సిందే, ఆ దేవి మాత్రమే నిన్ను రక్షిస్తుంది అని మీ అమ్మగారిన నందిని గారి నమ్మకం. ఆమె నమ్మకం ఆమెది, దైవం తప్ప మన బిడ్డని ఏ శక్తి రక్షించలేదు అని ప్రగాఢంగా నమ్మేవారు. ఓ రకంగా ఆమె నమ్మకం గెలిచింది.

ఒక రోజు కాత్యాయని దేవి సేవలో తరిస్తున్న వేళ.. ఒక అద్భుతం జరిగింది.. అదే మమ్మల్ని ఇలా నడిపించింది.

అప్పటికి ఇంకా నీకు ఆరేళ్ళు ఉంటాయేమో! నిన్ను తీసుకుని కాత్యాయని అమ్మవారి గుడిలో మూడు నిద్రలు చేయ్యాలని సంకల్పించి మీ అమ్మానాన్నలతో పాటు నేను కూడా వచ్చాను. హోమం చేయించాను. అక్కడ ఆ రాత్రి యోగ ముద్రలో ఉన్న బహుదూర్ తిలక్ తన కూతురు స్వప్నిక పట్ల తనకున్న ఆందోళనను, భయాలను ఆ కాత్యాయని దేవితో మనసు విప్పి చెప్పారుట.. మన కోటద్వారానికి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గుడికి సర్వ సాధారణంగా ఎవరి రాకపోకలు ఉండవు. కాని, ఆ రాత్రి ఒక ముసలావిడ వచ్చి మీ నాన్నగారు యోగ ముద్రలో కూర్చుని ఉండగా, ఎదురుగా కూర్చుని ‘నేనే తాళం కప్పని, నేనే తాళాన్ని. సమస్యని నేనే పరిష్కారం నేనే’ అందట. ‘ప్రతి మూడో తరంలో పుట్టే ఆడబిడ్డ 18 సంవత్సరంలో వివాహం చేసుకోవడం, చనిపోవడం జరుగుతోంది. అదే నీ బిడ్డకి కూడా జరుగుతుందని నువ్వు ఆందోళన చెందవద్దు. అలా జరగకుండా నేను అడ్డుకుంటాను. నీ బిడ్డని నిండు నూరేళ్ళ జీవితం ఉండే విధంగా నేను చేస్తాను, చెయ్యాల్సిన ఆవశ్యకత కూడా నాకుంది. నీ వంశం ద్వారా నేను చేయించుకోవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి మిగిలి ఉంది.. దానికోసమైనా నీ బిడ్డని నేను రక్షిస్తాను’ అందట.

సంభ్రమాచార్యాలతో కళ్ళు తెరిచి చూసిన తిలక్ బహుదూర్ ఎదుట ఆమె లేదు. తన ఆన౦దానికి అవధుల్లేవు. పిచ్చివాడిలా గుడి చుట్టూ తిరుగుతూ దీపాలంకారం చేస్తున్న నందినిని పట్టుకుని “నందినీ.. నందినీ.. ఇప్పుడు ఒక పెద్దావిడ వచ్చింది గుడిలోకి, ఆమెని చూసావా! నా ముందు కూచుని నాకు నాకు ఏమి చెప్పిందో తెలుసా!.. ఏమి చెప్పిందో తెలుసా!”.. అంటూ కలవరపడ్డ ఆయనని..

“ఏమి జరిగింది, ఎవరు వచ్చారు? ఇక్కడ ఎవరూ లేరే! మీరు కలగన్నారా!” అంటూ నందిని అమ్మ స్తిమితపరుస్తూ ఉన్నప్పడు నేను వెళ్లి “ఏమి జరిగింది బహుదూర్, ఆ కలవారపాటు ఏమిటి, ఎందుకంత ఆరాటం, ఏమి జరిగింది?” అని అడిగాను.

“పెద్దావిడ వెళ్ళిపోయిందా! మార్తాండా, ఇక్కడే, ఇప్పుడు నాతో.. మాట్లాడింది” అన్నారు తిలక్ బహుదూర్.

“పెద్దావిడా? ఎవరు ఎవరు? ఇంత దూరం ఎవరు రాగలరు? వచ్చి పోయేవారు ఎవరూ లేరే, ఆమె ఎలా ఉంటుంది బహుదూర్?” అన్నాను

పైగా ఆమె ఒక పెద్ద వయసు స్త్రీ, పెద్ద బొట్టు పెట్టుకుని, కాళ్ళకు గజ్జెలు పెట్టుకుని, భుజం నిండా పైట కప్పుకుని ఇక్కడే ఇక్కడే.. నా ముందు కూచుని నాతో మాట్లాడింది మార్తాండా”

అటువంటి వాళ్ళు ఎవరూ లేరే? అంటూ.. నందిని అమ్మ, నేను చుట్టూ పక్కల వెతికాం ఆమె కోసం. కాని, ఎక్కడా కనిపించలేదు.. “భ్రమపడి ఉంటారు! బహుదూర్..” అన్నాను.

“భ్రమ కాదు మార్తాండా.. నా ముందు ఆమె కూర్చుంది.. నాతో మాట్లాడింది.. ఎర్రని చీర లో పెద్ద బొట్టు పెట్టుకుని సుమారు 70 ఏళ్ళు పైన ఉంటాయి.. నా ముందే తన చీర కొంగు భుజం నిండా కప్పుకుని నాతో మాట్లాడింది. బహుదూర్.. ఏంటి బాదపడుతున్నావా! అంది.”

“ఏం మాట్లాడారు బహుదూర్?” అని అడిగాను.

తనతో ఆ పెద్దావిడ మాట్లాడిన మాటలు చెప్పారు.. “ప్రతి మూడో తరంలో జరిగే ఘోరమే జరుగుతుందని భయపడుతున్నావా! నీ బిడ్డకి కూడా జరుగుతుందని నువ్వు ఆందోళన చెందవద్దు. అలా జరగకుండా చెయ్యాల్సిన ఆవశ్యకత నాకుంది. నీ వంశం ద్వారా నేను చేయించుకోవలసిన అతి ముఖ్యమైన బాధ్యత ఒకటి మిగిలి ఉంది.. దానికోసమైనా నీ బిడ్డని రక్షిస్తాను అందట. దానితో మాకు చాల ధైర్యం వచ్చింది. “కాని ‘నా వంశం ద్వారా చేయించుకోవలసిన పని మిగిలి ఉంది ..అది చెయ్యటం కోసం నీ బిడ్డని నేను రక్షిస్తాను’ అంది అది ఏమై ఉంటుందో అర్థం కావటం లేదు” అన్నారు బహుదూర్.

“మన బిడ్డ ఈ భూమి మీద ఉంటుందన్న నమ్మకం కలిగింది. అది చాలు” అంటూ నందిని అమ్మ పొంగిపోయారు. “నేను కొలిచే కాత్యాయనీ దేవి నన్ను అన్యాయం చెయ్యదు, తప్పకుండా మనబిడ్డని రక్షిస్తుంది.. ఆవిడికి ఏమి కావాలో ఆమే చేయించుకుంటుంది, చేయించుకోనివ్వండి” అంది. ఆ కాత్యాయనీ అమ్మవారే స్వయంగా వచ్చారని అర్థం అయింది మాకు. ఆ తల్లికి మనసారా నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చాం. అదే నమ్మకంతో బతికారు

ఆ రాత్రి నందిని అమ్మ కలలో.. అదే పెద్దావిడ కనిపించిందట. ‘నేనే తాళం కప్పని, నేనే తాళాన్ని, సమస్యని నేనే పరిష్కారం నేనే’ అందట. అలా చెబుతూ “సమస్యని నేనే సృష్టించాను కాబట్టి దాని పరిష్కారం నేనే చెబుతా..

18 సంవత్సరాలు నిండిన వెంటనే నీ బిడ్డని కోట దాటించు.. అలాగే ఒక బ్రాహ్మణుడితో వివాహం చెయ్యి.. వివాహనంతరం వారికి పుట్టిన బిడ్డకి 18 వత్సరాలు వచ్చే వరకు మీ భార్యాభర్తలు మీ కుమార్తెని, అల్లుడిని వారి బిడ్డని చూడరాదు. మీ ఛాయలు వారి మీద పడరాదు. మీ ఆడబిడ్డ ద్వారా వచ్చే బిడ్డ ఈ బహుదూర్ వంశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. అప్పటి నుంచి మీ వంశంలో సమూల మార్పులు వస్తాయి. ఈ వంశానికి నాశనం ఉండదు. ఆ వంశమే నీకు, నాకు ఆధారం. అంతే కాదు అప్పటి మారుతున్న కాలమాన పరిస్థితులకు లోబడ్డ ఈ సమాజానికి మీ వంశాన్ని నిలబెట్టే ఆడబిడ్డ ఆధారం అవుతుంది. నీ కూతురు బిడ్డని 18 వత్సరాలు నిండిన తరువాత ఈ గుడికి తీసుకు రా” అని చెబుతూ “..ఈ వంశంలో జరిగే ప్రతి తప్పిదానికి సమాధానం మీ బిడ్డకి పుట్టే ఆడబిడ్డ చెబుతుంది. ఆ బిడ్డ తోనే తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తాను” అని కరాకండిగా చెప్పి మాయమైపోయిందట ఆ కాత్యాయనీ దేవి.

ఆ కాత్యాయనీ దేవి ఆశ ఏమిటో తెలియదు, ఆమె ఆశయం ఏమిటో తెలియదు.. నీ బిడ్డతో ఏమి చేయించాలని అనుకుంటుందో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు అది కూడా ఆ కాత్యాయనీ దేవే చెబుతుంది అనుకుని ముందుకు సాగిపోవాలనుకున్నాం. ఆమె మాటలు పదే పదే గుర్తు చేసుకున్నాం. అంతే కాదు అమ్మ కలలో కూడా కనిపించడంతో నీకు, నీ ప్రాణానికి వచ్చే ముప్పు ఏమీ లేదని, నువ్వు క్షేమంగా ఉంటావని మాకు ధైర్యం కలిగింది. నీ వెనుక సాక్షాత్తు అమ్మవారే ఉండడంతో మా భయాలన్నీ పటాపంచలైపోయాయి.

అందుకే నీకు 18 సంవత్సరాల పుట్టిన రోజుకి ఒక సంవత్సరం ముందు నుంచే రహస్యంగా ఒక ప్రణాళిక రచించాం.. ఆ ప్రణాళిక ప్రకారమే నడుచుకున్నాం. నువ్వు క్షేమంగా ఉండాలి. నీ ద్వారా వంశం విస్తరించాలంటే ఏమి చెయ్యాలో యోచన చేసాం.

ఒక పక్క నీ అత్త అంజన కుమారుడు ధనుంజయ్ నిన్ను, నీతో పాటు వచ్చే ఆ కోటని తన వశం చేసుకోవాలని కొత్త కొత్త ప్రణాళికలు వేస్తున్నాడు. అత్త అంజన మీ నాన్న అమ్మ సమీపంలో ఉంటూ ఎక్కడ నీ గురించి సమాచారం వస్తుందో తెలుసుకుందామని అక్కడే తిరుగుతోంది. కాని – నువ్వు తల్లి తండ్రులను వదిలి, నీకు నువ్వుగా వెళ్లిపోయావనే భ్రమలోనే అందర్నీ ఉంచాం. నిన్ను కావాలని మేమే ఆ కోట దాటించి సుధీర్ వర్మకిచ్చి  ఈ  అడవుల్లో ఉన్న ఈ ఆశ్రమానికి పంపించామన్న విషయాన్ని గోప్యంగా ఉంచాం. నువ్వు క్షేమంగా ఉన్నావన్న విషయం నాన్న- అమ్మలకి తెలుసు. మీకు వివాహం కూడా అమ్మా నాన్న ‘ఇచ్ఛ’ ప్రకారమే జరిగింది. కాని ఆ విషయం బయట పడకుండా ‘మా కూతురు మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది’ అని చెప్పి తిలక్ బహుదూర్, నందినిలు నటించాల్సి వస్తోంది. ఎంతో ముద్దుగా పెరిగిన నీ గురించి అలా చెప్పడానికి చాలా బాధగా అనిపించినా తప్పటం లేదు.

అంతే కాదు, ‘స్వేచ్ఛ కావాలి, పక్షిలా ఎగరాలి, బయట ప్రపంచాన్ని చూడాలి’ అని అనుకునే నువ్వు ‘ఎవరితో ఎగిరిపోయావో’ అని నలుగురు వేసే నిందలు కూడా వారికి వినిపిస్తున్నాయి, బాధపెడుతున్నాయి. స్వేచ్ఛగా బయట తిరగాలని నువ్వు తరచూ అనేదానివని చెబుతూ – నువ్వు కోరుకున్న స్వేచ్చని ఒక ఉత్తరం ద్వారా ఈ ప్రపంచాన్ని నమ్మించడం కోసం నేనే ఉత్తరం రాసి నాన్నగారి కోరిక మేరకు నీ గదిలో పెట్టాను. తద్వారా నువ్వే ఆ కోటని, అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోయావని అందరూ నమ్ముతున్నారు. కాని, ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాం.. నీతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ బతికేస్తున్నాం స్వప్నికా. ఇది శాపమో! వరమో అర్థం కాని పరిస్థితి.. ఏది ఏమైనా ఆ కాత్యాయనీ దేవి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది.. ఆమె నీ సంరక్షకురాలు అనుకుని అదే నమ్ముతున్నాం.

సుధీర్ వర్మ తండ్రి సంచిత రామ వర్మ ఒక సనాతన బ్రాహ్మణుడు, వారి తాత ముత్తాతలు కూడా మీ బహుదూర్ వంశం సేవలో తరించినవాళ్ళే. భార్య చనిపోయినా కొడుకుని అల్లారుముద్దుగా పెంచుతూ మంచి చెడ్డ నేర్పించి ఉన్నతమైన విలువలు నేర్పించాడు, వేదాలు, ఉపనిషత్తులతో కూడిన మంచి విద్యని కొడుక్కి ఇచ్చాడు.. అటువంటి కొడుకుని వదిలి సుధీర్ తండ్రి సంచిత రామ వర్మ ఉండటం కూడా కష్టమే.. కాని తిలక్ బహుదూర్ సంచిత రామ వర్మని పిలిచి ‘నా కూతురు స్వప్నిక వివాహం సుధీర్ వర్మతో చెయ్యాలి మిత్రమా! ఇది బహుదూర్ వంశాన్ని రక్షిస్తుంది, వంశ రక్షణ బాధ్యత నీమీద కూడా పెడుతున్నా.. ఈ సహాయం కావాలి మిత్రమా!, నా ప్రాణానికి ప్రాణమైన స్వప్నికని నీ కొడుకు సుధీర్ వర్మ కిచ్చి వివాహం చెయ్యటం అవశ్యం మిత్రమా!’ అనగానే, ఎందుకు? ఏమిటి? వంటి ప్రశ్నలు అడగనే లేదు. వంశం కోసం తల ఒగ్గి, తన కొడుకుని అప్పగిస్తూ స్వప్నికతో వివాహానికి తన కొడుకుని ఒప్పించి అప్పగించాడు. అతనిది అంత దొడ్డ మనసు తల్లీ” అన్నారు మార్తాండ.

సుధీర్ వైపు కృతజ్ఞతగా చూసింది స్వప్నిక.

“మేము ఎవరం లేకుండా మీ ఇద్దరి వివాహం జరిగింది.. అందుకు బాధగా ఉన్నా తప్పుదు” అంటూ ఆగారు ఆచార్యుల వారు.

“దీని వెనుక మీ కాత్యాయనీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి తల్లీ.. మీ ప్రాణాలకి ముప్పు కలిగించే చిన్న రిస్క్ కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త వహిస్తూ వస్తున్నాం.. ఒక వైపు ధనుంజయ వర్మ వేట ప్రారంభిస్తున్నాడు.. నేను ఇక్కడకి వచ్చినట్టు మీ అమ్మనాన్నలకు తప్ప ఎవరికీ తెలియదు.. ఇక్కడ నుంచి తక్షణమే నైమిశారణ్యంలో ఉన్న ఆశ్రమానికి మీ మకాం మార్చండి.. అక్కడ మీకు అన్ని వసతులు ఏర్పాటు చేయబడ్డాయి.. కొన్నేళ్ళ తరువాత మీరు జన జీవన స్రవంతిలో నలుగురితో బాటు జీవించే అవకాశం తప్పక వస్తుంది.. అమ్మ నాన్న గురించి దిగులు వలదు.. ఇది ఒక యుద్ధం.. అది నువ్వే చెయ్యాలి స్వప్నికా.. నీకు తోడు, నీ సుధీర్ వర్మ ఉండనే ఉన్నాడు. మీకు ఆ కాత్యాయనీ అమ్మవారి అండదండలు మెండుగా ఉన్నాయి” అన్నారు మార్తాండ.

“అయితే.. అయితే.. 18 సంవత్సరాలు పూర్తైన తరువాత నా మరణం..” అంటూ నసిగింది స్వప్నిక.

“లేదు తల్లీ, ఆ భయాలు పెట్టుకోవద్దు.. మీరిద్దరూ ప్రశాంతమైన జీవితం గడపండి.. పండంటి బిడ్డని బహుదూర్ వంశానికి బహుమతిగా ఇవ్వండి. ఇప్పుడు నీ ఆయుష్షుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. కాత్యాయని అమ్మవారు చెప్పినట్టే నిన్ను కోట దాటించాం, బ్రాహ్మణుడితో వివాహం జరిపించాం. మీ ఇరువురి జాతకాల రీత్యా మీ ఇద్దరు పూర్ణాయుష్కులు అయ్యారు. కాని మీరు చెయ్యాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.. జీవితం చాలా నేర్పుతుంది తల్లీ. నేర్చుకోండి.. జయహో. తల్లీ జాగ్రత్త..” అని చెప్పి నిష్క్రమించబోతారు మార్తాండ.

***

“ఆచార్యా!.. మీరు.. మీరు వెళ్ళిపోతున్నారా! ఈ అడవుల మద్య ఆశ్రమంలో వదిలి..” అంటూ వెనుక వెళ్ళిన సుధీర్ వర్మకి, “నాయనా సుధీర్ మీ మద్య స్నేహం మాత్రమే ఉందని నాకు తెలుసు. కాని అది మరో మెట్టు ఎక్కి ప్రేమగా మారాలి.. అప్పుడే మేం చేసిన ఈ పవిత్రమైన కార్యానికి ఒక అర్థం-పరమార్ధం ఉంటుంది. ఆ మరో మెట్టు ఎక్కించే బాధ్యత నీదే సుమా!” అని హెచ్చరిస్తూ, “ఇక మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తూ బహుదూర్ గారి యోగక్షేమాలు తెలుపుతూ ఉంటాను.. నైమిశారణ్యంలో గడుపు పూర్తయిన వెంటనే మీరు రామకృష్ణ మిషన్ – వేలూర్ మఠంకి వెళ్ళండి.. ఏడాది పాటు ఇలా ఎవరికీ అనుమానం రాని ప్రాంతాలలో ఉండండి.. అక్కడ నుంచి మీరు మీకు నచ్చిన ప్రాంతాలకు వెళ్ళి, నచ్చిన పని చేసుకుంటూ అతి సామాన్యంగా బతకండి. మీ అవసరాలకి ఈ కొద్ది పాటి ధనాన్ని ఉంచండి” అంటూ ఒక చిన్న మూట ఇచ్చి వెళ్ళిపోయారు మార్తాండ.

వెక్కి వెక్కి ఏడుస్తున్న స్వప్నికతో..

“నువ్వు చాలా ధైర్యవంతురాలివి అనుకున్నాను.. కాని ఇంత పిరికిదానివా! నువ్వు ఏడుస్తున్నావా! మన మీద ఏంతో బాధ్యాతాయుతమైన కర్తవ్య౦ ఉంది.. దాని గురించి ఆలోచించాలి గాని పిరికిదానిలా ఏడవకూడదు.. అలా ఏడ్చిన నిన్ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది స్వప్నిక.. అది, అది.. నేను భరించలేను.

స్వప్నికా నువ్వు బహుదూర్ బిడ్డవి,  రాణి స్వప్నికా బహుదూర్‍వి, ఎన్నో విద్యలతో పాటు వేదాలు, ఉపనిషత్తులు వంటి వాటిలో మంచి ప్రావీణ్యత ఉన్న ధీశాలివి. నువ్వు ఇంత డీలా పడితే ఎలా?” అన్నాడు సుధీర్ వర్మ.

“వద్దు సుధీర్, అలా నన్ను పిలవద్దు. రాణి స్వప్నికా బహుదూర్ అన్న ముసుగు తీసి సుమిత్ర గానే ఈ ప్రపంచాన్ని చూడనీ” అంది స్వప్నిక.

“అలాగే సుమిత్రా, మన మీద బహుదూర్ వంశానికి చెందిన పవిత్రమైన గురుతర బాధ్యత ఉంది. దానికి మనం సన్నద్ధం కావాలి” అన్నాడు సుధీర్ వర్మ.

కళ్ళ నుంచి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ.. ‘ఈ నా కన్నీళ్ళకు శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందో’ అంటూ అక్కడ నుంచి లేచింది స్వప్నిక.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here