[box type=’note’ fontsize=’16’] నాలుగు చిరు కవితలను ‘చిరు తవికలు’గా అందిస్తున్నారు అందె మహేశ్వరి. [/box]
పరమావధి:
నేనున్నా నొక నిశీధి గుహలో, కానీ భయమెరుగను
నేనున్నా పవనుడు సంచరించని సొరంగంలో, కానీ బాధనెరుగను
నేనున్నానొక విశ్వమెరుగని ప్రపంచంలో, కాని ఒంటరితనమెరుగను
ఇట్టి మహత్ సౌకర్యములు గల్గిన ప్రదేశము అనగా నా తల్లి గర్భమునుండి బయటపడ్డా
అది మొదలు, ఆరంభమైంది నా మహాప్రస్థానం
నేనున్నా గాలి, వెలుతురున్న దేశంలో, కాని బాధ, భయమెరిగాను
ఎందరో ఉన్న విశాల ప్రపంచంలో ఉన్నా, ఒంటరితనమెరిగాను
రాగద్వేషాల నడుమ ముందుకు సాగడం తప్ప, వెనకడుగు వేయక, జీవనం సాగించడమే పరమావధని కనుగొన్నా.
కవితావేశం:
గలగలా పారే సెలయేటి పరుగులు
గంభీరమైన కడలి ఆటుపోటులు
పచ్చని పైరగాలి సవ్వడులు
గూటికి పోయే గువ్వల కిలకిలలు
కన్నతల్లి ఒడిలో చంటిపాప కేరింతలు
వెర్రెక్కించే వెన్నెల వెలుతురులు
మత్తెక్కించే మల్లెల గుభాళింపులు
మనసు స్పందించేలా, తనువు పులకించేలా..
ఇవేవి కవితావేశానికి కారణాలు కానక్కరలేదు
చేయుతలేని చిన్నారులు
బడుగుజీవుల ఆక్రందనలు
కొరతగా మారిన వనరులు
ప్రకృతి వైపరీత్యానికి బలియైన జీవులు
కరుణ లేక కరుడుకట్టిన హృదయాలు
మృగాలుగా మారుతున్న మనుషులు
ఇలా మనిషిని ఆలోచింపజేయు
పలు సామాజిక స్పృహలు కూడా కవితవేశానికి కారణాలు కావచ్చునేమో..!!
నా ఘోష:
కులం పేరిట కుట్రలు మాకొద్దు
మతం పేరిట మోసాలు మాకొద్దు
ప్రాంతం పేరిట విభజనలు మాకొద్దు
భాష పేరిట బేధం మాకొద్దు
రంగుల పేరిట రాక్షసత్వం మాకొద్దు
కనిపించని కులాల కాఠిన్యాన్ని కాలరాసి
మనిషి అని మరపించే మతాల ముర్ఖత్వాన్ని మాయంచేసి
పశువులుగా మార్చే ప్రాంతీయాభిమనాన్ని పారద్రోలివేసి
బదులు చెప్పలేని భాష పిచ్చిని బహిష్కరించేసి
రాణించనివ్వని రంగుల అరాచకాన్ని అంతంచేసి
కొంగొత్త లోకానికి ‘శ్రీకారం చుడదాం
మన కులమే మానవ కులమనీ
మన మతమే ఐక్యమత్యమనీ
మన ప్రాంతానికి ఈ విశ్వమే హద్దు అనీ
మన భాషకు భాష్యం ఒకటేననీ
దేహపు రంగు వేరయినా రక్తం రంగు ఒకటే అనీ
చాటుదాం చాటుదాం ఎలుగెత్తి చాటుదాం
తరతరాల తారతమ్యాలను తరిమి తరిమి కొడదాం.
ఇచ్చావళి:
కరగని కల, చెదరని అల
వాడని పువ్వు, చెరగని నవ్వు
కదలని కాలం, కదిలే కలం
కలవరింత లేని మనసు, కలకాలం నిలిచే సొగసు
ఓటమి లేని ఆట, విసుగు లేని పాట
పశ్చాత్తాపం లేని గతం, ప్రశాంతమైన జీవితం
చేరువైన తారకలు, నిశ్శేషమైన కోరికలు.