[box type=’note’ fontsize=’16’] విజయవాడ నుంచి హౌరా వెళ్ళే రైలులో జరిగిన సంఘటనలను “ప్రయాణంలో పదనిసలు” కథలో వివరిస్తున్నారు పి.వి.డి. భావనారాయణ. [/box]
[dropcap]వి[/dropcap]జయవాడ స్నేహానికి, చిరు తిళ్ళకి, సినిమాలకి పుట్టినిల్లు. నా పరిచయం: నా పేరు భావనారాయణ. ఇంట్లో అందరు, నా ముఖ్య స్నేహితులు ‘స్వామి’ అని పిలుస్తారు. ఆ పేరు పెద్దది కాబట్టి, అందరిలాగే నా పేరు రెండు లేదా మూడు అక్షరాలతో స్వామి అనే ఎక్కువగా పిలుస్తారు. విజయవాడలో నేను రెండవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివాను. నేను చదివాను అనే కంటే, సినిమాలు, చిరు తిళ్ళు, ఆటలు, ఫ్రెండ్స్‌తో కబుర్లుతో 28 ఏళ్ళు హాయిగా గడిపాను. ఆ స్కూల్ స్నేహితులలో ఒకడు నా ప్రాణ స్నేహితుడు జాన్సన్.
జాన్సన్‌తో నా పరిచయం 13 జూన్ 1978, ఎస్.జె.పి.వి. హైస్కూల్‌లో గాంధీనగర్ (విజయవాడ) ఎనిమిదవ తరగతి డి సెక్షన్‌లో ఒకే బెంచ్‌లో సీట్‌తో మొదలైంది. టెన్త్ (1981) అయ్యాక నేను, వాడు పాలిటెక్నిక్‌కి అప్లై చేసాం. వాడికి టెన్త్‌లో నాకంటే ఎక్కువ మార్క్ వచ్చి వాడికి గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో సీట్ వచ్చింది. నేను ఇంటర్ ఎంపీసీలో చేరాను. 1985 సంవత్సరంలో జాన్సన్ వాడి డిప్లొమా డిస్టింక్షన్‌లో పాస్ అయ్యి, రైల్వే పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలు వ్రాస్తున్నాడు. నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో వున్నాను.
నేను, జాన్సన్ ఆ వయస్సు విజయవాడ కుర్రాళ్ళలాగే రోడ్లు, సినిమా హాళ్లు సర్వే చేస్తూ వుండే వాళ్ళం. చదువు రీత్యా మా దారులు వేరు అయినా, మేము ఇప్పటికి వీడలేదు. వాడు ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సీనియర్ మానేజ్మెంట్ హోదాలో, నేను సికింద్రాబాద్‌లో రైల్వేలో సీనియర్ టి.ఐ.ఏ. (ఇంటర్నల్ ఆడిట్ -అకౌంట్స్) గా పని చేస్తున్నాం. అప్పటికి వాడు రైల్వే పరీక్ష పాట్నా వ్రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు లేట్ శ్రీ ప్రసాద్ రావు గారికి వాడిని ఇంటర్వ్యూకి బీహార్ పంపడం ఇష్టం లేదు. వాళ్ళ నాన్న గారు – పరీక్ష పాస్ కాకపోతే బాగుండును, బీహార్ పంపకుండా ఉండచ్చు అని అనుకొన్నారు. కానీ ఎంప్లాయిమెంట్ న్యూస్ రానే వచ్చింది, వాడు పరీక్ష పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ తారీఖు, సర్టిఫికెట్స్‌తో పాట్నా రమ్మని లెటర్ వచ్చింది. వాడు చాలాసార్లు వాళ్ళ నాన్నగారిని బతిమాలాడాడు పంపమని. ఇక వాడికి అర్థమైంది, తాను అడిగితే పంపరు అని. నన్ను వాళ్ళ నాన్నగారిని ఒప్పించమని చెప్పాడు. ఎంతకీ ఆయన ఒప్పుకోలేదు. ఇక నేను రంగంలోకి దిగి ఆయనని బతిమాలడం మొదలు పెట్టాను. ఆయన ముందు ఒప్పుకోలేదు, మా ఇద్దరి పోరు పడలేక, నన్ను కూడా జాన్సన్‌తో వెళ్ళేటట్లు, ఇద్దరి ఖర్చులు ఆయనే ఇస్తానని డబ్బులు ఇచ్చారు. ఇక మా ఆనందానికి హద్దులు లేవు. నేను మొట్ట మొదటసారి స్టేట్ దాటుతున్నాను, వాడు ఇంటర్వ్యూకి వెడుతున్నాడు.
వెంటనే రైల్వే స్టేషన్ కి పరిగెత్తాం. మా అదృష్టం కొద్దీ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో బెర్తులు దొరికాయి. ఆ రోజుల్లో రిటర్న్ రిజర్వేషన్ అంత సులభం కాదు. ఆ ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది. మధ్యాన్నం మూడున్నరకి కోరమాండల్ విజయవాడ 5వ నెంబర్ ప్లాట్‌ఫారం పైకి వచ్చింది. మా బెర్త్‌లో ఇద్దరం కూచున్నాం. మెల్లిగా పరిసర జ్ఞానం కోసం చుట్టూ చూసాం, ఎక్కడ ఎక్కారో తెలియదు గాని మా ఎదురుకుండా బెర్తుల్లో ఇద్దరు తల్లి కూతుళ్లు కూర్చుని వున్నారు. ఆ అమ్మాయికి సుమారుగా మా ఏజ్ ఉంటుంది. ఆ అమ్మాయి అందం వర్ణనాతీతం. లంగా, ఓణి వేసుకుని, నుదుట ఎర్రటి తిలకం (బొట్టు కాదు) దిద్దుకుని వుంది. బండి బయల్దేరి వూరు దాటుతుంటే, సాయంకాలపు సూర్యుడు తన తెల్లటి కాంతి తగ్గించుకొని ఆ అమ్మాయి రంగులోకి మారాలని చూస్తూ వున్నాడు. కానీ ఆ పిల్ల ఎర్రటి రంగుకు తన వంతు అందాన్ని దిద్దాడు గాని తన వైపు జనాలని తిప్పుకోలేకపోయాడు. ఆ అమ్మాయి సహజమైన అందానికి, ట్రైన్ దాటుతున్న పొలాలు, చెట్లు కూడా జనాలు చూడటం మానేశారు. అటు ఇటు తిరుగుతున్న కుర్రాళ్ళు, పనిగట్టుకుని మా కోచ్‌లో తిరుగుతూ ఆ అమ్మాయి కేసి చూడటం మొదలుపెట్టారు. ఒకోసారి ఎక్కువ అందం కూడా ఇబ్బందే. ఇతరుల చూపులు, అసూయలు, నిలబెట్టుకోడానికి పడే తపనలు చాల కష్టమే. మా ఇద్దరికీ చాలా ఆనందం వేసింది.
అందరు అటు ఇటు తిరగాలి గాని మేము తిరగక్కర్లేదు. మా ఎదురుకుండానే వుంది. ఆ అమ్మాయి ఏటో చూస్తున్నప్పుడు మేము తన వైపు చూడడం, తాను మా వైపు చూసినపుడు మేము ఏటో చూడడం చేస్తున్నాం. వెంటనే నాకు నా నైన్త్ క్లాసులో ఒక అమ్మాయి గుర్తు వచ్చింది. ఆ అమ్మాయి అందాల భరిణ. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ అమ్మాయి దేవకన్యలా ఉండీ చదువులో కూడా సరస్వతిలా ఉండేది. ఎక్కడా ఎవరిని ఏమీ అనడం, గర్వంగా ఉండటం చేసేది కాదు. ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి తేడా రవ్వంత గర్వం ఈ అమ్మాయి కళ్ళలో కనపడుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది. నా మనసు ఒక్కసారి నిటుర్చి ఈ లోకంలోకి వచ్చింది. ఒకేసారి ఎందరి హృదయాలు మీటిందో ఈ పిల్ల. మా వాడు వెంటనే బ్యాగులోంచి ఒక బుక్ ‘బి ఎల్ తెరాజా’ (చాంద్ పబ్లికేషన్స్)- ‘ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్’ బుక్, ఒక చిత్తు పుస్తకం తీసి అందులో లెక్కలు చేయడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి ఆ బుక్ వైపు మా వాడి వైపు ఒకసారి చూసింది. ఒక పదినిమిషాలకి మా వాడు లేచి పక్కకి పోయాడు. నేను వాడి వెనకాలే వెళ్లి, “ఏరా ఆ అమ్మాయికి ఫోజ్ కొడుతున్నావా, రన్నింగ్ ట్రైన్లో ఏమి లెక్కలు చేస్తావురా, అది వెళ్ళేది ఇంటర్వ్యూకి అన్నాను”.
వాడు “ఒరే ఆ అమ్మాయి బి.కామ్, బి.ఏ లేదా బి.ఎస్సీ చదువుతుండొచ్చు, కాబట్టి నా ఎలక్ట్రికల్ బుక్స్ వింతగా చూస్తోంది” అన్నాడు. సరే నీ ఇష్టం అన్నాను. మళ్ళీ మా సీట్‍కి వచ్చి కూచున్నాము. కొంతసేపటికి వాడికి విసుగు పుట్టి పుస్తకం లోపల పెట్టాడు. మాకు తెలియకుండానే ట్రైన్ గోదావరి బ్రిడ్జి దాటింది. రాజమండ్రి స్టేషన్ వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇక్కడ చెట్నీ బాగుంటుంది, తిందామా అని అడిగింది. వద్దు ట్రైన్ ఎక్కువ సేపు ఆగదు, ఇంకొకసారి తిందాం అని అంది. వెంటనే మా జాన్సన్ గాడు , మేము తీసుకోవాలి, మీకు తెస్తాం అని ఇద్దరం దిగాం. జనాలతో కిటకిట లాడుతోంది స్టాల్ మొత్తం. రెండు ఇడ్లి, రెండు వడ మొత్తం చెట్నీ ఒక ఆకులో పోసి, చెరో ప్లేట్ తీసుకొన్నాం. బండి బయలుదేరింది. వాళ్ళు మా ఇద్దరినే చూస్తున్నారు. వాళ్ళకి కిటికీలో గాని, డోర్‌లో గాని ఇచ్చి మాకు వేరే తీసుకొందాం అని అనుకొన్నాం. బండి బయలుదేరింది. పరుగుతో రెండు పెట్టెల అవతల ట్రైన్ ఎక్కాము. మా జాన్సన్ గాడు, “ఒరే ఆ అమ్మాయి మన వైపే చూస్తోంది” అన్నాడు. వాడి అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చి “ఒరే ఆ అమ్మాయి టిఫిన్ కేసి చూస్తోంది” అని అన్నాను. వాడికి నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా కాదని సరిపెట్టుకొన్నాడు. అదే మనసు గొప్పతనం, మనది కానిది మన కోసమే అని భ్రాంతిలో ఉంచడం. అనేక విన్యాసాలతో మా సీట్ కి వచ్చి వాళ్ళకి టిఫిన్ ఇచ్చాము. “మరి మీరు తీసుకోరా” అని వాళ్ళ అమ్మ గారు అంటే “అబ్బే మేము తినము, ఒకేసారి భోజనం చేస్తాం” అని ఇద్దరం కూడబలుక్కొని అన్నట్లు అన్నాము. ఆకలిగా వున్నా ఊరుకొన్నాం.
రైలు విశాఖపట్నం చేరింది. మేము ఆర్డర్ చేసిన డిన్నర్ వచ్చింది. టైం రాత్రి ఎనిమిదిన్నర కావస్తోంది. ఒక అరగంటలో అందరి భోజనాలు, టిఫిన్లు పూర్తి అయ్యాయి. పెరుగు అన్నం తన పని మొదలు పెట్టింది. ఆవలింతలు మొదలు అయ్యాయి. అప్పట్లో రాత్రి తొమ్మిదిన్నరకి టంచన్‌గా నిద్ర పోయేవాళ్ళు. అందరం బెర్తు వేసుకొన్నాం. నేను మా వాడు ఇద్దరం వాళ్ళకి బెర్త్ వేసుకోడానికి సహాయం చేసాం. బెడ్ లైట్స్ వెలిగించి, మెయిన్ లైట్స్ ఆర్పి పడుకున్నాం. అందరం మంచి నిద్రలో వున్నాం.
ఉన్నటుండి ఒక్కసారిగా గట్టిగా మాటలు వినపడి, లైట్స్ వెలిగాయి, మేము ఇద్దరం నిద్దర మత్తులోంచి లేచాం. చుట్టూ రైల్వే పోలీసులు, పక్క బెర్త్ జనాలు. మా నిద్ర మత్తు ఒక్కసారిగా వదిలి పోయింది. మేము చూస్తున్న ఆ అమ్మాయి ఏడుస్తోంది.
వాళ్ళ అమ్మగారు చెబుతున్నారు, “శ్రీకాకుళం దాటే వరకు లగేజ్ వుంది. ఒక అరగంట నిద్ర పోయాను. మధ్య మధ్యలో లగేజ్ చూస్తూనే వున్నా, ఇంతలో మాగన్నుగా నిద్ర పోయాను. గబుక్కున మెలుకవ వచ్చి చూసేసరికి మా అమ్మాయి బాగ్ లేదు. చుట్టుపక్కల బెర్స్ అన్ని చూసాను, ఎక్కడా లేదు. అందులో రెండు వందలు కాష్, ఆ అమ్మాయి కాలేజీ గుర్తింపు కార్డు, ప్రాజెక్ట్ పేపర్లు వున్నాయి” అని అన్నారు. టీటీఈ అడిగాడు, “అమ్మా, మీ అమ్మాయి, మీ వారు ఏమి చేస్తారో వివరాలు చెప్పండి.”
“నేను ఢిల్లీ ఐఐటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్, మా వారు ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ప్రొఫెసర్, మా అమ్మాయి ఖర్గపూర్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ రెండవ సంవత్సరం చదువుతోంది” అని చెప్పగానే నా నోరు సగం, మా వాడి నోరు పూర్తిగా తెరుచుకుంది. మా ముఖాలలో కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు. ఒక గంట తరువాత, వాళ్ళు ఖరగ్‌పూర్‌లో దిగిపోయారు. మేము మెల్లిగా హౌరా చేరాము. ఇక మా వాడు బేసిక్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ బుక్ తీస్తే ఒట్టు. నేను, వాడు ఈ విషయం గుర్తుకు వచ్చినా, ఆ బుక్ ఎప్పుడు చూసినా నవ్వు వస్తుంది.