ఆధునిక కాలపు దయ్యం: “స్త్రీ”

1
4

[box type=’note’ fontsize=’16’] “హాస్యమూ సస్పెన్సూ రెండూ కలవగలవా? ఉత్కంఠా, పొట్టా చెక్కలవడం వొకే చిత్రంలో సాధ్యమా? ‘స్త్రీ’ ఆశ్చర్యంగా దాన్ని సాధ్యం చేసింది” అంటున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]హా[/dropcap]స్యమూ సస్పెన్సూ రెండూ కలవగలవా? ఉత్కంఠా, పొట్టా చెక్కలవడం వొకే చిత్రంలో సాధ్యమా? “స్త్రీ” ఆశ్చర్యంగా దాన్ని సాధ్యం చేసింది.

అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో “ఓ స్త్రీ రేపు రా” కథలు విన్నాం. బహుశా ఆ పేరుతో సినెమా కూడా వచ్చిందేమో. కొన్నాళ్ళు వార్తల్లో ఆ స్త్రీ గురించిన పుకార్లే వుండేవి. భయపడ్డ జనం తమ ఇంటి ముందు గోడలకు “ఓ స్త్రీ రేపు రా” అని వ్రాయించుకున్నారు కూడా. ఆ తర్వాత ఆ కథ వో పుకారుగానే ముగిసింది.

ఇప్పుడు ఇదే కథ ఈ సినెమాలో మధ్య ప్రదేశ్‌లోని వో పల్లె “చందేరి” లో జరుగుతుంది. ప్రతి యేటా జరిగే నాలుగురోజుల అమ్మవారి పండక్కు “స్త్రీ” వస్తుందట. తనకు నచ్చిన మగాణ్ణి యెత్తుకెళ్ళిపోతుందట, అతని ఆనవాలుగా అతని దుస్తులు వదిలేసి. తర్వాత రుద్ర (పంకజ్ త్రిపాఠీ) అన్నట్టు ఆ స్త్రీ తొలుత పేరుపెట్టి పిలుస్తుంది, అలా మూడు సార్లు పిలిచినా వెనుతిరగకపోతే యేమీ చేయదు. అంటే సంస్కారవంతురాలన్న మాట. అంగీకారం (consent) ప్రధానం. వూళ్ళోని మగాళ్ళు ఆ నాలుగు రాత్రులూ రోడ్డుమీదకెళ్ళడానికి భయపడతారు. “తొందరగా వచ్చేయవే, ఇంట్లో వొక్కడినే, నాకు భయం” లాంటి సంభాషణలుంటాయి. ఇలాంటి వూళ్ళో విక్కీ (రాజ్ కుమార్ రావు) కళ్ళతోనే కొలతలు తీసుకోగల వీర లేడీసు టేలరు. లోకల్ మనీష్ మల్‌హోత్రా అన్నట్టు. అతని దగ్గర రవికలు, డ్రెస్సులూ కుట్టించుకోవడానికి ఆడవారు లైన్లు కడతారు.

సరే ఆ దయ్యం యెంత చదువుకున్నదైనా, ప్రజాస్వామికురాలైనా, కేవలం చెడిపోయిన తన శోభనం, అవాంచిత మరణం కారణంగా కేవలం స్వచ్చమైన ప్రేమ కోసమే ఆరాటపడుతుంది, మరేం లేదు. ఆ వూరు ఆ నాలుగు రోజులు తప్పిస్తే మిగతా సంవత్సరమంతా మామూలే. కుర్రాళ్ళు వొక చోట మందు పార్టీ పెట్టుకుంటారు. వాళ్ళల్లో వొకడు వో వేశ్యను కూడా పిలిపించుకుంటాడు “ఫ్రెండ్షిప్” చేయడానికి. ఇటం సాంగు. కరంటు పోవడం. వి క్కీ అల్లరిగా “ఓ స్త్రీ రేపు రా” అన్న చోట రేపును చెరిపేస్తూ దాని మీద మూత్ర విసర్జన చేయడం, కరెంటు పోవడం ఇలాంటివన్నీ జరిగిపోతాయి. ఇంకా “ఫ్రెండ్షిప్” కాకుండానే ఆ స్నేహితుని బట్టలు మాత్రం విడిచి ఆ “స్త్రీ” అతని కాయాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు వూరంతా ఇదే చర్చ, రభస, భయం, భక్తి. మరో పక్క వొక అందమైన అమ్మాయి (శ్రధ్ధా కపూర్) వచ్చి విక్కీ ని తనకోసం అర్జంటుగా ఘాఘరా (లంగా జాకెట్లలో లంగా) కుట్టిపెట్టమంటుంది, ప్లీజ్ అని. ఆమె యెప్పుడూ అకస్మాత్తుగా రావడం, అకస్మాత్తుగా అంతర్ధానమవడం జరుగుతుంటాయి. విక్కి తన స్నేహితులిద్దరి దగ్గరా (బిట్టు-అపార్శక్తి ఖురానా, జానా-అభిషేక్ బెనర్జీ) తనని వో కొత్తగా వూళ్ళోకొచ్చిన అమ్మాయి ప్రేమిస్తున్నట్టు చెప్పుకుని మురిసిపోతాడు. కాని బిట్టుకి వ్రాసిన “ప్రేమ లేఖ” లో తనకు తెల్ల పిల్లి వెంట్రుక, బల్లి తోక ఇంకా కొన్ని వస్తువులు తెమ్మని వ్రాస్తుంది. యెవరి వారింపులూ వినకుండా ఆ పని చేస్తాడు. ఆ అమ్మాయి యెవరు? ఆవిడే “స్త్రీ”నా? ఆమె యెందుకలా చేస్తుంది? ఇదంతా మిగతా కథ.

రాజ్ నిడిమోరు, కృష్ణ డి కె లు వ్రాసిన కథ. ఇద్దరూ తెలుగువారిలా వున్నారు. కాని పని బాలీవుడ్ లో! ముందుగా వాళ్ళను అభినందించాలి. నవ్వి నవ్వి పొత్త చెక్కలయ్యేలాగా, భయంతో బిగుసుకునేలాగా, ఆలోచించేలాగా కూడా చేశారు. అర్ధ రాత్రి ఆడది వొంటరిగా వీధుల్లో తిరిగే రోజు యెప్పుడొస్తుందోగాని, యేడాదికి నాలుగు రాత్రులు మగవాళ్ళు కూడా రోడ్డు మీద వొంటరిగా వెళ్ళడానికి భయపడే కథ అల్లాడు. అందులోనూ ఆ దయ్యం చాలా ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. వొక రకంగా చెప్పాలంటే సమాజంలో అమలులో వున్న పరిస్థితులపై చురకలు వున్నాయి ఇందులో.సచిన్-జిగర్ ల సంగీతము, నేపథ్య సంగీతము బాగున్నాయి. పాటలు బాగున్నాయి కాని ఇలాంటి కథకు అనవసరం. ఇక నటన విషయంలోకొస్తే రాజ్ కుమార్ రావు నటన అద్భుతం. అతని నడక, మాట తీరు, ఆ మధ్య ప్రదేశ్ గ్రామీణ హిందీ, (వొక్క చోట మాత్రం “షిట్” అంటాడు, అతకదు. అది తప్పిస్తే అన్ని ఆంగ్ల పదాలూ దేశీ ఉచ్చారణతో “ప్లీజ్” లాగా పలుకుతాడు). ఆ అమ్మాయి చేయి పట్టుకుని “విక్కీ ప్లీజ్” అన్నందుకే టీనేజ్ కుర్రాడిలా వొంకర్లు పోవడం, స్నేహితులకు కథలు కథలుగా చెప్పడం అలాగే ఇతర సన్నివేశాలలో భయ పడటం, లేని ధైర్యాన్ని (మోపబడిన) తెచ్చుకోవడం అంతా చాలా బాగా వ్యక్త పరుస్తాడు. చివర్న ఆ స్త్రీతో ముఖా ముఖి అప్పుడు భయంతో వణికిపోతూ వుంటే వెనుకనుంచి వినిస్పిస్తుంది “విక్కీ అలా కాదు, ఆ స్త్రీ ముఖం లో చూడు, కళ్ళల్లో చూడు, నవ్వుతూ చూడు”. అసలే ఉచ్చ పడిపోతుంటే భయంభయంగానే నవ్వుతూ, యేడుస్తూ ఆమె ముఖంలో చూడటం : ఈ వొక్క సన్నివేశం మరచిపోలేము. అలాగే తన విటుడు డబ్బులివ్వకుండానే దుస్తులు విడిచి మాయమైపోయాడని ఆ డబ్బులు వసూలు చేయడానికి ఆ వేశ్య విక్కి ఇంటికొస్తుంది. తండ్రి దీన్ని మరోలా అర్థం చేసుకుని ఆమెకు డబ్బిచ్చి పంపేస్తాడు. తర్వాత కొడుకుని కూర్చోబెట్టి వయసులో శరీరంలో హార్మోన్లు చేసే హడావిడీ, కోరికలు ముప్పిరిగొనటం వగైరా చెబుతూ యేదన్నా చేయి కాని డబ్బిచ్చి “ఫ్రెండ్షిప్” వద్దంటాడు. అక్కడ వారిద్దరి నటనా విపరీతంగా నవ్విస్తుంది. విక్కీ స్నేహితులకు శ్రధ్ధా నే దయ్యం అని అనుమానం, ఆమె తెప్పించుకున్న వస్తువుల కారణంగా. మాట వినని విక్కీ మీద కోపంగా, దయ్యం కారణంగా భయంగా వుంటారు వాళ్ళు. “ఛ ఛ అంత అందమైన అమ్మాయి దయ్యమెలా అవుతుందిఈ?” అంటాడు విక్కి. అలాంటి సన్నివేశంలోనూ వొక మిత్రుడు మొహమంతా కళ్ళు చేసుకుని చూస్తూ, “అవునా, అందంగా వుందా?” అంటాడు ఆశగా. ఇలాంటి హాస్యం సినెమా మొత్తం పరచుకుని వుంది. ఇలాంటి సన్నివేశాల రూపకల్పనకు, తగిన మాటలు వ్రాసినందుకు సుమిత్ అరోరాను అభినందించాల్సిందే.

వొక గొప్ప చిత్రం కాకపోవచ్చు గాని వొక కొత్త తరహా చిత్రం, నాలుగు నాళ్ళు గుర్తుండే చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here