ఆధా ముసల్మాన్లు

0
3

[box type=’note’ fontsize=’16’] “మన పద్ధతుల్ని పూర్తిగా పాటిస్తేనేగా పక్కా ముసల్మాన్ అన్పించుకుంటావు. సగం సగం ఆచరిస్తే ఆధా ముసల్మానువే అవుతావు” అంటున్నారు సలీం – ‘ఆధా ముసల్మాన్లు’ కల్పికలో. [/box]

[dropcap]ఆ[/dropcap]ఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ప్యూన్ లోపలికొచ్చి “ఎవరో కరీం అట సార్. మిమ్మల్ని కలవాలట. ఏం పనిమీద వచ్చావని అడిగాను సార్. మీకు బంధువని చెప్పాడు” అన్నాడు.

“సరే. రమ్మను” అన్నాను.

కరీం లోపలికొచ్చాడు. ఎప్పటికిమల్లే దరిద్రదేవతకు ప్రతిరూపంలా ఉన్నాడు. మాసిపోయిన లాల్చీ పైజమా, తైలసంస్కారం లేని జుట్టు, లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన దవడలు, మొహర్రం నాడు కర్బలా మైదానానికి తరలించే పీరులా బలహీనమైన శరీరం…

కరీం నాకు దూరపు బంధువు… తమ్ముడి వరసవుతాడు. నాకంటే ఓ ఏడాది చిన్నవాడు. మా గ్రామంలో ఓ మూల పాతిక దాకా ముస్లిం కుటుంబాలుండేవి. కరీం వాళ్ళిల్లు మా యింటి పక్కనే ఉండటంతో మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. గోలీలు, బొంగరాలాట, బెచ్చాలాట… మా వూళ్ళో ప్రాథమిక పాఠశాల ఉండేది. ఐదో తరగతి వరకు అక్కడే చదువుకుని హైస్కూల్ చదువులకోసం మూడు కిలోమీటర్ల దూరం ఉన్న పట్టణానికి వెళ్ళాల్సి వచ్చేది.

కరీం కెందుకో మొదట్నుంచీ చదువంటే ఇష్టం ఉండేది కాదు. ముస్లిం పేటనుంచి నేనొక్కణే క్రమం తప్పకుండా బడికెళ్ళేవాణ్ణి. నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు రాఘవయ్య మాష్టారు కొంతమంది కుర్రవాళ్ళని ముస్లింల ఇళ్ళకు పంపించి కరీంని, దాదాపు అదే వయసున్న మరికొంతమంది ముస్లిం పిల్లల్ని లాక్కు రమ్మని చెప్పేవాడు. వాళ్ళకు తోడుగా నన్నూ పంపించేవాడు. మమ్మల్ని చూడటం ఆలస్యం కరీం రేసు గుర్రంలా పొలాలకు అడ్డంపడి పరుగెత్తేవాడు. ఎప్పుడైనా మాకు దొరికిపోతే మట్టిలోపడి దొర్లుతూ ఏడ్చేవాడు. ముప్పయ్ యేళ్ళ క్రితం జరిగిన విషయాలైనా కరీంని చూస్తే ఇప్పటికీ అతను మట్టిలో పడి దొర్లుతూ ఏడ్వటమే గుర్తుకు వస్తుంది.

“ఏంటి కరీం ఇలా వచ్వావు?” అని అడిగా.

“జరూర్‌గా ఓ ఐదొందలు కావాలి భాయ్. అప్పుగానే ఇవ్వు. ఇంతకు ముందు ఇవ్వాల్సిన బాకీతో కలిపి తీర్చేస్తాను” అన్నాడు.

“ఇంట్లో సరుకులు లేవని చెప్పి నాలుగు రోజుల క్రితమేగా వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళావు” అన్నాను.

“వాటితో సరుకులు కొన్నాను భాయ్. ఇప్పుడు మూడో వాడికి జ్వరంగా ఉంది. దవాఖానాలో చూపించాలి. మందులు కొనాలి. అందుకనీ…” అంటూ నసిగాడు.

నేను డిగ్రీ పాసయ్యాక పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. రెండేళ్ళ క్రితమే ఆఫీసర్‌గా ప్రమోషన్ ఇచ్చి నేను హైస్కూల్ చదువులు చదివిన పట్టణంలోనే పోస్టింగ్ ఇచ్చారు. అప్పటినుంచి నాకు కరీం తాకిడి ఎక్కువైంది. కరీంకి పొట్టకోసినా అక్షరం ముక్క రాదు. పెళ్ళి చేసుకున్నాక పల్లెటూరు వదిలేసి ఇక్కడ వెల్డింగ్ పనిలో కుదురుకున్నాడు. ముప్పయ్ ఐదేళ్ళు. ఐదుగురు పిల్లలు… ముగ్గురు ఆడపిల్లలు… ఇద్దరు మగపిల్లలు…

ఐదొందలు కరీంకిచ్చాను. “షుక్రియా భాయ్” అంటూ సలాం చేసి వెళ్ళిపోయాడు.

రెండ్రోజుల తర్వాత కరీం కొడుక్కి ఎలా ఉందో కనుక్కుందామని వాళ్ళింటికెళ్ళాను. అద్దె యిల్లు… రెండు గదుల రేకుల షెడ్డు… అతని భార్య ఫాతిమా స్టూల్ తెచ్చి వేసి “కూచోండి భాయీజాన్” అంది. సమయం సాయంత్రం ఆరున్నర. కరీం లేడు.

“కరీం ఎన్నింటికొస్తాడు” అని అడిగాను. “రాత్రి ఎనిమిది తర్వాతే వస్తారు భాయీజాన్” గ్లాస్‌తో నీళ్ళిస్తూ అంది.

“మూడో వాడికి జ్వరం అని చెప్పాడు. ఇప్పుడెలా ఉంది” అని అడిగా.

“జ్వరమా? ఎవ్వరికీ జ్వరాలు లేవే” అంటూ నా వైపు చూసి “డబ్బులేమైనా ఇచ్చారా?” అని అడిగింది.

“డాక్టర్‌కి చూపించాలంటే ఐదొందలిచ్చాను”

ఆమె మొహం నిండా దిగులు పర్చుకుంది. “ఆయన అడిగినా ఇవ్వకండి భాయీజాన్. తాగడానికి డబ్బుల్లేనపుడు వాటికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. పిల్లలకు జ్వరాలనేం ఖర్మ నా దినాలని చెప్పినా చెప్తాడు” జారిన కన్నీళ్ళను తుడుచుకుంటూ అంది.

“కరీం తాగుతాడని నాకు తెలుసమ్మా. వారం క్రితం సరుకులు కొనాలని వెయ్యి రూపాయలడిగాడు. ఇవ్వకపోతే పిల్లలు పస్తులు పడుకోవాల్సి వస్తుందేమోనని ఇచ్చాను. కనీసం ఆ డబ్బులతోనయినా సరుకులు కొన్నాడా?”

“లేదు. పిల్లలకు రెండుపూటలా తిండి పెట్టాలన్న ధ్యాస ఆయనకు లేదు. మేము ఆకలితో మాడినా పర్వాలేదు. ఆయనకు మాత్రం రోజూ తాగడానికి డబ్బులు కావల్సిందే. వెల్డింగ్ షాపు ఓనర్ దగ్గర కూడా అప్పులు పెడ్తున్నాడట. మీరైనా చెప్పండి భాయీజాన్” అంది.

ఆమె కడుపు ఎత్తుగా ఉండటం గమనించాను. ఐదో సంతానం ఆడపిల్ల… దానికిపుడు ఏడాదిన్నర వయసు. మళ్ళా కడుపా? నిర్ధారించుకోడానికి “ఎన్నో నెల?” అని అడిగాను.

“ఐదో నెల” అంటూ తలవొంచుకుంది.

“ఇంకా పిల్లలు దేనికి? వద్దని చెప్పొచ్చుగా” అన్నాను.

“నా మాట ఎక్కడ వింటారు భాయీజాన్… పిల్లల్ని కనీకనీ నా ఆరోగ్యం పాడైపోయింది. గుండె దడ, నీరసం, కాళ్ళు పీకుతుంటాయి, కొద్ది దూరం నడిచినా ఆయాసం… నా కష్టాలు ఎవరికి చెప్పుకోను? ముగ్గురు పిల్లల తర్వాత ఇక చాలండీ అన్నాను. జుట్టు పట్టుకుని కొట్టాడు మీ తమ్ముడు” ఆమె మళ్ళా ఏడుస్తోంది.

“పిల్లల్ని పోషించే శక్తి లేనపుడు కనడం దేనికని అడగలేకపోయావా?”

“పిల్లలు అల్లా ప్రసాదించిన వరాలట. వాటిని కాదనకూడదట, వాటికి అడ్డు పడకూడదట. అది పాపమట” అంది.

నా ఫోన్ నంబర్ ఇచ్చాను. డబ్బులు అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాను. కరీం అడిగినా అతని చేతికివ్వకుండా నేరుగా ఇంటికేవచ్చి ఇచ్చిపోతానని చెప్పాను.

వూహించినట్టే వారం తిరక్కుండానే కరీం డబ్బులు కావాలంటూ ఆఫీస్‌కొచ్చాడు.

“పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకోవూ” అని అడిగాను.

“మన ఇస్లాం ప్రకారం అపచారం కదా భాయ్” అన్నాడు.

“నువ్వు ఇస్లాం ఆచారాల్ని పద్ధతుల్ని అంత ఖచ్చితంగా అచరిస్తున్నావా?”

“ఆచరించకపోతే గునాహ్ కదా భాయ్”

“పిల్లల విషయంలో ఆపరేషన్ చేయించుకోకుండా మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నావు సరే. మరి తాగుడు విషయంలో ఇస్లాం మతం చెప్పినదాన్ని ఎందుకు ఆచరించడం లేదు? మన పద్ధతుల్ని పూర్తిగా పాటిస్తేనేగా పక్కా ముసల్మాన్ అన్పించుకుంటావు. సగం సగం ఆచరిస్తే ఆధా ముసల్మానువే అవుతావు” అన్నాను.

“నేనేం తప్పు చేస్తున్నానో అర్థమయ్యేలా చెప్పు భాయ్” అన్నాడు.

“ఇస్లాం ప్రకారం తాగుడు హరాం కదా. తాగుడు మానెయ్. ఒకవేళ తాగుడు విషయంలో నువ్వు మతానికి విరుద్ధంగా ప్రవర్తించేట్టయితే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునే విషయంలో పట్టుదల వదిలెయ్”

కొద్దిసేపు తలవొంచుకుని కూచుని ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు.

భార్యకు కాన్పు అయ్యాక పిల్లలు పుట్టకుండా ఆమెకు ఆపరేషన్ చేయించాడు.

నాకు తెలుసు కరీం తాగుడు వ్యసనాన్ని మానుకోలేడని. కనీసం అతని భార్యని మరిన్ని కాన్పులతో కష్టపడకుండా కాపాడానన్న తృప్తి నాలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here