భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 9: శ్రీ భావనారాయణ స్వామి ఆలయం, బాపట్ల

0
2

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 9” వ్యాసంలో బాపట్లలోని “శ్రీ భావనారాయణ స్వామి ఆలయం” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

క్షీరవృక్షేవ తీర్ణాయ క్షీరసాగరశాయినే
రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ భావ దేవాయ మంగళమ్
శ్రీ మహీభ్యాంచ సహితం శ్రీ వత్స మణిభూషణమ్
భావనారాయణమ్ దేవమ్ భజే భావపురీశ్వరమ్.

[dropcap]జి[/dropcap]ల్లెళ్ళమూడి వెళ్ళేటప్పుడు బాపట్లలో మేము వెళ్ళే దోవలోనే కనిపించింది పురాతనమైన భావనారాయణస్వామి ఆలయం. మధ్యాహ్నం అవటం వల్ల మూసి వుంది. అందుకే తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆలయాన్ని దర్శించాము.

ఆసక్తి వుండి తెలుసుకోవాలేగానీ, పురాతన ఆలయాల వెనక ఎంత చక్కటి పురాణ గాథలుంటాయో!! అవి నిజంగా అక్కడ జరిగాయా లేదా అనే తర్కాన్ని వదిలిపెట్టి, పుణ్యభూమి మన భారతదేశంలో ప్రతి స్ధలాన్నీ అల్లుకుని ఎన్ని పురాణ గాథలున్నాయో అని ఒక్క నిముషం ఆలోచించండి. అలాంటి సన్నివేశాలన్నీ ఇక్కడ జరిగాయి కనుకే ఇది పుణ్యభూమి అయింది. ఇలాంటి దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. సరే, సరే, అసలు కథకి వస్తా.

పూర్వం ఈ ప్రాంతాన్ని బ్రహ్మారణ్యం అనేవారు. ఇక్కడ బ్రహ్మదేవుడు వశిష్ఠుడు మొదలగు మహర్షులతో కలసి శ్రీ మహావిష్ణువు గురించి యజ్ఞం చేశాడుట. అప్పుడు ఆ యాగగుండంనుంచి ఒక క్షీర వృక్షం ఉద్బవించిందట. దానిలో అంతర్గతంగా వున్న శ్రీహరి బ్రహ్మని వరం కోరుకోమన్నాడుట. చేసిన యజ్ఞం లోక కళ్యాణం కోసమే కదండీ. దానికి తగ్గట్టే వరం కోరుకున్నాడు బ్రహ్మ. భూలోక ప్రజలకోసం అక్కడే స్వామిని శ్రీ భావన్నారాయణుడిగా అర్చారూపంలో కొలువు తీరమని కోరుకున్నాడు. దానికి శ్రీహరి కృత, త్రేతా, ద్వాపర యుగాలవరకు క్షీర వృక్షంలోనే నిగూఢంగా వుంటాననీ, తర్వాత కలియుగంలో అర్చారూపుడిగా వెలుస్తానని వరం ఇచ్చాడుట. అక్కడ క్షీర వృక్ష రూపంలో వున్న శ్రీమహావిష్ణువుని అనేకమంది ఋషులు దర్శించి, అనేక యజ్ఞాలు చేశారు.

6వ శతాబ్దంలో బాపట్లకి దగ్గరలోవున్న కొండపాటూరు అనే గ్రామంలో నివసించే బావ, బావమరుదులు వంటచెఱకు కోసం ఈ అరణ్యానికి వచ్చి ఇద్దరూ చెరో చోటా కట్టెలు కొట్టసాగారు. అందులో ఒకరి పేరు నారాయణ. ఆ నారాయణ శ్రీ భావన్నారాయణ స్వామి వున్న క్షీర వృక్షాన్ని గొడ్డలితో కొట్టేసరికి దానిలోంచి రక్తం కారింది. అది చూసి అతను మూర్ఛపోయాడు. ఇంకో చోట వున్న అతను తన పని పూర్తి కావటంతో, బావా, నారాయణా, అని తన బావని పిలిచాడు. సమాధానంగా ఓ.. అని వినిపించింది. అది విని, తన బావ, నారాయణ వున్న వైపు వెళ్ళినతను చెట్టునుంచి కారుతున్న రక్తాన్ని, మూర్ఛపోయి వున్న తన బావని చూసి ఆత్రంగా, బావా, నారాయణా అని పిలిచాడు. దానికీ సమాధానంగా ఓ అని క్షీరవృక్షంనుంచి రావటం చూసి ఆశ్చర్యపోయాడు. దానిని దైవ వృక్షంగా భావించి నమస్కరించాడు. తన బావమరిది ఏదైనా తప్పు చేస్తే క్షమించమని ప్రార్థించాడు. ఇంతలో బావమరిది కూడా మూర్ఛనుంచి తేరుకుని, జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ ఆ రోజునుంచీ ప్రతి ఆదివారమూ ఆ క్షీర వృక్షాన్ని పూజించి, క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టటం మొదలు పెట్టారు.

ఒకసారి క్రిమికంఠ చోళ చక్రవర్తి రాజ్యాన్ని విస్తరిస్తూ, కావేరీ తీరాన్నించి సమస్త రాజులనూ జయిస్తూ బ్రహ్మారణ్యం ప్రాంతంలోని ఆముదాలపల్లికి (ఈ ఆముదాలపల్లే తర్వాత భావపరిగా, బాపట్లగా మారింది) వచ్చి సైన్యంతో విడిది చేశారు. ఆ సమయంలో రాజుగారి ఏనుగులు అడవిలో ఆహారం కోసం వెళ్ళి, భావనారాయణుడు వున్న క్షీర వృక్షాన్ని తమ తొండాలతో విరిచి తినబోయాయి. కానీ ఆ ఏనుగుల తొండాలు ఆ వృక్షానికి అతుక్కుపోయాయి. భయపడ్డ మావటివాడు పరుగు పరుగున వెళ్ళి రాజుగారికి విషయం తెలియజేశాడు. రాజు వచ్చి చూసి, అది దైవ మాయగా గ్రహించి, తన ఏనుగులను క్షమించి విడిచి పెట్టమని ప్రార్థించాడు. ఆ సమయంలో ఇద్దరు విప్రులకు స్వామి ఆవహించి తాను భావనారాయణుడననీ, కృత, త్రేత, ద్వాపర యుగాలనుంచీ అక్కడనే వుండి బ్రహ్మాది దేవతలచేత, మహర్షులచేత పూజింపబడుతున్నానని తెలిపి తనకి ఏనుగు పాదములవంటి స్తంభములతో అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని, తన పేరుతో అక్కడ ఒక ఊరు నిర్మించమని అప్పుడు తాను ప్రసన్నుడనవుతానని తెలియజేశాడు. రాజు నారాయణుని ఆనతి తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. ఏనుగులకు స్వస్ధత చిక్కింది.

తర్వాత చోళ చక్రవర్తి చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడినుంచి రాళ్ళను తెప్పించి ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ తెల్లవారేసరికి కట్టిన ఆలయం శిధిలమయ్యేది. రాజు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుండగా, ఒక రోజు స్వామి రాజు కలలో కనిపించి వెంకటగిరి సంస్ధానంలో చిమ్మిరిబండ అనే కొండ వుంది. దానిలో రాళ్ళకి వేసవికాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా వుండే గుణం వున్నది. ఆ రాళ్ళమీది బావా అనే అక్షరాలు కూడా వుంటాయి. వాటితో ఆలయ నిర్మాణం చెయ్యమని తెలియజేశాడు.

చోళ చక్రవర్తి స్వామి ఆదేశానుసారం వెంకటగిరి రాజావారి అనుమతితో చిమ్మిరిబండనుంచి కొండరాళ్ళను తెప్పించి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. పునాదులు తవ్వుతుండగా ఒక పుట్టనుంచి జ్వాలా నరసింహుని విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని అక్కడనుండి కదిలించటం సాధ్యంకాక అక్కడే ప్రతిష్ఠ చేశారు. అయితే ఆయన దృష్టి అక్కడికి 6 మైళ్ళ దూరంలో వున్న కారంచేడు అనే గ్రామంమీదపడి, అది తరచూ అగ్నికి ఆహుతి అయ్యేదిట. దాన్ని ఆపటానికి శ్రీ జ్వాలా నరసింహునికి ఎదురుగా శాంత కేశవస్వామిని ప్రతిష్ఠ చేశారు.

    

అమ్మవారు:

ఆలయ నిర్మాణం జరుగుతుండగానే కొండపాటూరు గ్రామంలో కాపుల ఇంట్లోని జొన్న పాతరలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు వెలిసింది. ఆ ఇంటివారికి స్వప్నంలో కనిపించి తాను భావనారాయణుని దేవేరి రాజ్యలక్ష్మినని, కొండపాటూరు తన పుట్టిల్లని, భావపురి (బాపట్ల) తన మెట్టినిల్లని తనని అక్కడ ప్రతిష్టించి కళ్యాణం చేయమని చెప్పింది. వారు చోళ చక్రవర్తితో ఆ విషయం చెప్పగా, ఆయన మంగళవాయిద్యాలతో కొండపాటూరు వచ్చి, అమ్మవారిని జొన్న పాతరనుంచి తీసి, భావనారాయణుడి దగ్గర ప్రతిష్ఠచేసి వైభవంగా కళ్యాణం జరిపించాడు. అప్పుడు ఆముదాలపల్లిని భావపట్టణంగా నామకరణం చేసి, అష్ట దిక్కులలో వళ్ళాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగారమ్మ, ధనుకొండమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొమ్మలమ్మ అనే గ్రామ దేవతలను ప్రతిష్ఠ చేయించాడు. అప్పటినుంచి కొండపాటూరు గ్రామస్తులు రాజ్యలక్ష్మి అమ్మవారిని తమ ఊరి ఆడబడుచుగా భావిస్తున్నారు.

తర్వాత కాలంలో చోళులు, కాకతీయులు, గజపతులు, రెడ్డిరాజులు, విజయనగరరాజులు, అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు మొదలగు రాజులు ఈ స్వామిని సేవించారు. 1750 దశకంలో తురుష్కులు ఈ ఆలయంపై దండెత్తి వచ్చి, గర్భాలయంలో ప్రవేశించారుట. అప్పుడు శ్రీ భావనారాయణ స్వామి అదృశ్యమయి తిరిగి ఏడాది తర్వాత పునఃదర్శనమిచ్చారుట. 1760లో ఈ ప్రాంతము ఈస్ట్ ఇండియా కంపెనీవారి అధీనమయింది. ఆ కంపెనీ దివాను, రాజమండ్రికి చెందిన రాజా కండ్రేగుల జోగి జగన్నాధ బహుదూర్ గారు ఆలయాన్ని అభివృధ్ధి చేశారు.

ఈ క్షేత్రంలో స్వామి శంఖ చక్రములతో, అభయ, కటి హస్తములతో, రాజ్యలక్ష్మీ సమేతంగా దర్శనమిస్తారు. ఈ స్వామి ప్రతి సాయంత్రం మోటుపల్లి (ప్రకాశం జిల్లా) వీరభద్రునితో సముద్రతీరాన విహరిస్తారని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం పాలకుడు శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామి. ఈయన విగ్రహం రెండు వందల సంవత్సరాల క్రితం ఒక బావిలో వున్నట్లు గట్టుపల్లి వెంకయ్యపంతులుగారికి స్వప్నంలో తెలిసింది. ఆంజనేయస్వామి ఆజ్ఞానుసారం ఆయనని భావనారాయణ క్షేత్ర పాలకునిగా ఆయనకి ఎదురుగా ఉపాలయంలో ప్రతిష్ఠించారు.

ఉత్సవాలు

ఇక్కడ వైశాఖ శుధ్ధ పౌర్ణమికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వాతి నక్షత్రంనాడు ఈ ఆలయంలో జరిగే గరుడపూజ ప్రత్యేకమైనది.

బాపట్ల గుంటూరు జిల్లాలో 6వ పెద్ద పట్టణం. ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి. రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు వున్నాయి.

ఒక్క పురాతన ఆలయం దర్శిస్తే ఎన్ని విశేషాలు తెలుసుకున్నామో చూశారా!!?

ఆలయ దర్శనం తర్వాత తెనాలి వెళ్ళి అక్కడ ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాము. మా తెనాలి ముచ్చట్లు వచ్చే వారం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here