జీవన రమణీయం-24

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను చిన్నపోయాను. “ఇది బావుంది… కానీ అద్భుతంగా వుండాలి” అన్నారు. ‘మొగుడే రెండో ప్రియుడు’ రొమేంటిక్ నవల. ఆయన రొమేన్స్ రాస్తే చాలా సున్నితంగా ఉండి, మళ్ళీ మరోసారి ఇంకొకరికి చదివి వినిపించేట్లు వుంటుంది.  ఎవరైనా వస్తే సిగ్గుపడి డ్రాయింగ్ రూమ్‍లోంచి తీసేసి దాచేసేటట్లు వుండదు!

నేను మళ్ళీ మళ్ళీ ఆలోచించి, ఇంకో వెర్షన్ రాసి తీసుకెళ్ళాను. ఆయనకి అద్భుతంగా నచ్చేసింది. “…అందుకే… మొదటిసారి తృప్తి పడిపోకూడదు ప్రారంభ దశలో” అన్నారు.

“వంటింట్లో అస్తమానం మసాలా వాసనలే కాదు, మొగలిపూల పరిమళాలు, అగరు పొగలూ కూడా వుండచ్చు, గంటెల నేపథ్యమే కాదు ఘంటసాల గళం కూడా. ‘మొగలిపూల వాసనతో ఓ గది నాట్యమాడిందీ’ అని వినిపించవచ్చు. మధ్యమావతి పాడుకుంటూ… మజ్జిగ చిలుక్కుంటూ… మేఘమల్హార్ ఆలపిస్తూ వుల్లిపాయలు తరుక్కుంటూ… కళ్యాణి వింటూ కాఫీ కలుపుతూ… మాయమాళవగౌళలో దప్పళం పెడ్తూ…”

ఇలా సాగుతాయి అందులోని వర్ణనలు.

“పడకటింట్లో ఆమె ఒక ప్రబంధ నాయిక! ‘గురువె’క్కడ వాడాలో, ‘లఘువు’ ఎక్కడ వాడాలో ఆమెకి కరతలామలకం. అంత్యప్రాసలు ఆమె పాద మంజీరాలు. ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో ‘యతులు’ సజీవాలు. ‘ఛందస్సు’లో చమత్కారాలు ఆమె చెంగుమాటున దాగిన కలవింకాలు.

ఆమె ఊరువులు ‘ఉత్పలమాలలు’; బాహువులు ‘చంపక మాలలు’; సిగ్గు చాటు ‘సీసాలు’, వయసు ‘తేటగీతాలూ! తెరచాటు తొలగిన ‘ద్విపదలూ!’ డెందానికి హత్తుకుపోయే కందమూ’, మధ్యలో మత్తుగా ‘మత్తేభమూ’, రెచ్చగొట్టి చిత్తుచేసే ‘శార్ధూలమూ’ అన్నీ ఆమే అవుతుంది.

ఎన్ని ఆటలు తెలుసో ఆ ‘ఆటవెలదికి’!

ఇలాంటి శృంగార వర్ణనలు అక్కడక్కడా రాసినా, అది మొత్తానికి శృంగార ప్రధానమైన నవల. హాస్యం, చమత్కారం కూడా నేను బాగానే రాస్తానని ఆ నవలతోనే అందరికీ తెలిసింది.

తోటకూర రఘుగారు, గురువుగారు బావుందనగానే ప్రచురణ ప్రారంభించారు. అప్పటికి ‘లీడర్’, ‘తృప్తి’, ‘మధురమైన ఓటమి’ ఒక్కసారిగా పబ్లిష్ అయిన నవలలే. సీరియల్ ఇదే మొదటిది. నా చిన్నతనం (పద్ధెనిమిదేళ్ళ) ఫొటో వెయ్యడం మూలానా, ఓ ఆడపిల్ల చలం శతజయంతి సందర్భంగా శృంగార రస ప్రధానమైన నవల ‘మొగుడే రెండో ప్రియుడు’ అన్న టైటిల్‌తో వ్రాయడం మూలాన, చాలా సెన్సేషనల్ హిట్ అయింది.

మొదటి వారం నుండే పత్రికాఫీసుకి ‘ఎవరా అమ్మాయి’ అని చాలా ఉత్తరాలొస్తున్నట్లు ఎడిటర్‌గారు చెప్పారు.

నాకు అప్పటిదాక లేని పేరు (మంచీ, చెడూ కూడా) ఆ నవలతో రావడం ప్రారంభం అయింది.

నా ఫొటోతో వచ్చే ఆ నవల చూసి ఆంధ్రజ్యోతిలో ‘అమ్మాయి చాలా బావుంది’ అని కామెంట్ చేస్తే, మా ఆడబిడ్డ కొడుకు రామూ ‘మా అత్తయ్య’ అని సిగ్గుపడుతూ మిత్రులకి చెప్పాల్సొచ్చిందట. మా అన్నయ్య కూడా కొంచెం ఇబ్బందిపడి ‘మరీ మొదటి నవలే అలా శృంగారంతో రాయాలా?’ అని గునిసాడు. నేను నవ్వి వూరుకున్నాను. మా వారూ, మా అత్తగారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు! చాలా ఆనందంగా చదివేవారు. నాకది చాలు! స్కూల్లో నా నెచ్చెలులు కూడా వింతగా ఆశ్చర్యంగా నాతో ఆ పాయింట్సే డిస్కస్ చేసేవారు! ‘మధురమైన ఓటమి’ చదివి యద్దనపూడి శైలిలా వుందన్నవారంతా, ఈ నవలతో నా శైలి నాకు వచ్చేసిందన్నారు.

ఇరుగు పొరుగులకి కూడా ఆంధ్రజ్యోతిలో నా ఫొటో, దానికింద ‘ముఖాముఖీ’ పడడం వల్ల, నేను రచయిత్రినని తెలిసింది.

‘మయూరి’లో కాలమ్స్ రాసేదాన్ని. శర్మాజీ అనే ఎడిటర్ అడిగి రాయించుకునేవారు. ఒకసారి ‘గుడ్ నైబర్’ ఎలా వుండాలో రాస్తూ, ‘పక్కింటావిడ నన్ను అడగక్కుండానే కరివేపాకు గోడ మీద నుండి కోసినా వూర్కోవాలి’ అని రాశాను. దాంతో ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. నేను కొంత కాలానికి గమనించి అడిగితే కారణం చెప్పింది! నవ్వుకున్నాను.

‘పెద్ద కథల’ పోటీ ప్రకటించారు కనకాంబర రాజుగారు ‘ఆంధ్రభూమి’లో. నేను మా ఇంట్లో జరిగిన కథే ‘ఆత్మకథ’ పేరుతో, మా ‘వేపచెట్టు’ కొట్టేయాలనుకోవడం… అది సామాజిక, రాజకీయ, భావోద్వేగపు సంఘటనగా ఎలా మారిందో రాసాను!

మొత్తం నా చేతిరాతలో 36 పేజీల కథ అది. వీరేంద్రనాథ్ గారు చదివి దాన్ని 28 పేజీలకు కుదించారు.

“అంతా  బావుంటుంది మనం రాసాం కాబట్టి. కానీ పాఠకులకి విషయం త్వరగా తెలుసుకోవాలని వుండే కథల్లో వర్ణనలు ఎక్కువ రాసి వారి సహనానికి పరీక్ష పెట్టకూడదు” అన్నారు.

ఆ కథ నేనే స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను. వారానికి కనకాంబర రాజుగారు ఫోన్ చేసి “ఆ అమ్మాయి ఇంతకు ముందు ఏం రాసింది? కొత్త రచయిత్రిలా లేదే? చాలా బాగా రాసింది పరిపక్వతతో” అన్నారట వీరేంద్రనాథ్ గారితో.

‘ఆత్మకథ’కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 3000/- రూపాయలు.  ఇంకా స్కూల్లో నా జీతం అప్పటికి 500/- మాత్రమే. గురువుగారు మానెయ్యమన్నా, నేనింకా మానలేదు.

అభినందన భవానిగారు ‘లీడర్’ ఆవిష్కరణ సందర్భంగా పరిచయం అయ్యారుగా, ఓ సారి కలిసినప్పుడు “నాకు టెలిఫోన్ కావాలండీ” అన్నాను. నేను వీరేంద్రనాథ్‌గారితోనైనా, అక్కినేని గారితోనైనా పబ్లిక్ బూత్ నుండి మాట్లాడుతున్నప్పుడు, “యండమూరి గారున్నారా?” అని అడుగుతుంటే, ఆ బూత్ అమ్మాయి కూడా విచిత్రంగా చూసేది. ఒక్కోసారి నాగేశ్వరరావుగారు ఏదైనా చెప్తూ వుంటే, బయట నుండి బూత్ మీద దబదబా బాదేవారు అర్జెంటు వున్నవాళ్ళు!

పైగా పత్రికాఫీసులకు ఫోన్ చేసి వెళ్ళాలి. అక్కడ పని చేసేవాళ్ళు మమ్మల్ని ‘పురుగుల్లా’ చూసేవారు. ఒక్కోసారి “కనకాంబర రాజు గారున్నారా?” అంటే ఒకావిడ వున్నారో లేదో కూడా చెప్పేది కాదు. “కూర్చోండి, మంచినీళ్ళు కావాలా?” లాంటి మాటలు అసలే వుండేవి కావు!

నేను ఫోన్ గురించి అడగగానే భవానిగారు “అయ్యో ఇంతకాలం అడగలేదేం రమణీ? అప్లై చెయ్యండి… నేను టెలిఫోన్స్ జీ.ఎం. మురళీకృష్ణ గారి దగ్గరకు తీసుకెళ్తాను” అన్నారు. ఆవిడది చాలా హెల్పింగ్ నేచర్!

నేను ఎక్కడికెళ్ళాలన్నా కాకతీయ నగర్‌లో వున్న మా ఇంటి నుండి, నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్స్‌కి నడుచుకుంటూ వెళ్ళి, బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి, మరో బస్ ఎక్కి వెళ్ళాలి.

ఆ సందర్భాల్లో పిల్లలు చిన్నవాళ్ళు. ఒక్కళ్ళనీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తుంటే భయంగా వుండేది. ఒకసారి సగం దూరం వెళ్ళాకా, ఇంట్లో ఇమ్మర్షన్ రాడ్ వేసి మరచిపోయి వచ్చాను అని గుర్తొచ్చింది. చిన్నవాడు మరీ నాలుగేళ్ళ పసివాడు. ఎర్రగా మండుతూ కనిపిస్తే వెళ్ళి పట్టుకుంటాడేమో అన్న వూహకే ఒళ్ళంతా భయంతో చెమట్లు పట్టాయి. వెంటనే బస్ దిగిపోయి, ఆటో చేసుకుని బాబాని తలచుకుంటూ ఇల్లు చేరాను.

అప్పటికే పెద్దవాడు అది చూసి, స్విచ్ ఆఫ్ చేసి, బాత్‌రూమ్ తలుపేసేసి, తమ్ముడ్ని ఆడిస్తూ కనిపించాడు. నేను ఇద్దరు పిల్లల్నీ దగ్గరకు తీసుకుని చాలా ఏడ్చాను. “ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను కన్నా… నాకీ రచనలొద్దు, ఏవీ ఒద్దు” అని ఏడ్చాను.

ఆ సమయంలో ఎదురుకుండా ప్లాట్‌లో ఇల్లు కట్టుకుంటున్న మేస్త్రీ సుబ్బారావు, సుశీలా దంపతులు పరిచయం అయ్యారు. సుశీలకి పిల్లలు పెద్దవాళ్లు. “అమ్మా నేను చూస్తా. బుడ్డమూతి ఆయన్ని నా దగ్గర వదిలిపెట్టి వెళ్ళు” అంది.

ఆ తరువాత్తరువాత సుశీల ఇంట్లో మనిషిలా అయిపోయింది. ఇంట్లో పని చేసేది, పిల్లలకి స్నానాలు, సాయంత్రం వాళ్ళ కోసం నేను చేసి పెట్టిన టిఫిన్ పెట్టడాలూ, నాకే నొప్పొచ్చినా, రోగం వచ్చినా చూడడం, సుబ్బారావు బయటి పనులు చేసిపెట్టడం బాగా అలవాటుగా మారింది. దాంతో కొంత నిశ్చింత వచ్చింది. ఈయన జహీరాబాదు నుండి రోజూ అప్ అండ్ డౌన్ జర్నీ చెయ్యలేక, వారానికి ఒక్కసారి రావడం మొదలుపెట్టారు.

ఆ సమయంలో భవానిగారి దయవల్ల మా ఇంట్లోకి ఫోన్ వచ్చింది. అది ఫిట్ చేసి వెళ్ళాక, ఎప్పుడు మోగుతుందా? అని నేనూ పిల్లలూ ఆశగా ఎదురు చూసేవాళ్ళం. ఎక్కువగా గురువుగారూ, పని వేళల్లో ఆఫీస్ నుండి మా ఆయనా చేసేవారు. చుట్టాలకి చెయ్యాలంటే వాళ్ళ ఇంట్లో వుండాలిగా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here