[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా చేపల గురించి, వాటిలోని రకాల గురించి, మనుషులకు అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]ప[/dropcap]రి, ఆర్యన్ వాన వెలిసిన తరువాత తోటలోకి వెళ్లి మొక్కల్ని పూలని పరిశీలనగా చూస్తూ తిరుగుతున్నారు.
పనస చెట్టు మొదల్లో నీరు చాలా రోజులుగా నిలిచి ఉంది. నిన్నటి వానకి ఇంకా ఎక్కువగా నీరు చేరింది. ఆ నీటిలో కాగితం పడవలు వేద్దామని ముందుకి వంగిన పిల్లలకు నీటిలో ఈదులాడుతున్న చేపలు చిన్నవి, పెద్దవి కనిపించి ఆనందపడ్డారు. కొద్దిసేపు వాటినే చూస్తూ ఉన్నారు. ఇంతలో అమ్మమ్మ పిలిస్తే ఇంట్లోకి వెళ్లారు.
“అమ్మమ్మా! మేము తోటలో పనస చెట్టుకింద నీళ్లలో చేపలు చూసాము. ఎంత ముద్దుగా ఉన్నాయో! మనిషిలా ఈదుతున్నాయి తెలుసా?” అన్నారు.
“తెలుసు” అని ఇద్దర్ని ముద్దుపెట్టుకున్నారు అంబిక.
“అమ్మమ్మా! చేపల సంగతులు చెప్పవా?” అంది పరి.
“తప్పకుండా. రండి కూర్చోండి. విష్ణు దశావతారాల్లో మొదటిది మత్స్యావతారమని మీకు తెలుసా?”
“తెలీదు.”
“సరే వినండి. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిలో తనకి మంచి చేసేవాటిని దేవుడిలా పూజించటం మొదలుపెట్టింది చేపతోనే. అదే మత్స్యావతారము. అది సరే మీకు చేపల గురించి ఏమి తెలుసు?” అని అడిగింది అమ్మమ్మ.
“ఫిష్‌ని ఫుడ్‌గా తింటారు.”
“ఆఁ! ఫిష్‌ని నీళ్లలో పెట్టి… అదే అమ్మమ్మ… ఎక్వేరియంలో పెడతారు” అంది పరి.
“ఓహ్! అర్థం అయ్యింది. మీకు తెలియని విషయాలు చేప గురించి చెబుతా వినండి.”
“ఓహ్! చేపా చేపా! నీ సంగతులు వింటా! టా!” అంటూ పరి గెంతులు వేస్తుంటే… “పరీ! డోన్ట్ బీ సిల్లీ! సిట్” అన్నాడు ఆర్యన్.
“వేవ్వే!” అని ఎక్కిరించి వినటానికి కూర్చుంది పరి.
“ఈ భూమి మీద చేపలు 500 మిలియన్ల సంవత్సరాల నుండి ఉన్నాయి. డైనోసార్ల కంటే ముందునుండి అన్నమాట.”
“డైనోసార్ల కంటే ముందా? అమ్మో!” అన్నాడు ఆర్యన్ ఆశ్చర్యంతో.
“అవును. అంతే కాదు చేపల్లో దాదాపు 25000 రకాలున్నాయిట.”
“25000! ఓ మై గాడ్!” అన్నారు పిల్లలు.
“అంతే కాదు చేపలకు జంతువుల్లాగే వెన్నుపూస ఉంటుంది. అన్ని చేపలూ సకశేరుకాలు (వెర్టిబ్రేట్స్)! నీటిలో ఉండి వాటి పొలుసులు, ఫిన్స్‌తో గాలి పీలుస్తూ బ్రతికే జంతువుల్లో చేపలు ఉన్నాయ్. చేపల్ని మూడు ముఖ్య రకాలుగా విడదీశారు. jaw లేనివి, cartilaginous, బోనీ అని. దాదాపు 15000 చేపల్ని ఇంకా గుర్తించలేదుట. మీకు ఇంకో వింత తెలుసా?”
తెలీదన్నట్లు తల అడ్డంగా ఊపారు పిల్లలు.
“చేప కోల్డ్ బ్లడెడ్”
“అంటే?” అన్నారిద్దరూ ఒక్కసారే.
“అంటే వాటి చుట్టూ ఉన్న వాతావరణం, వేడికి అనుగుణంగా చేపల శరీర ఉష్ణోగ్రత (టెంపరేచర్) మారుతుంది. మనకి అలా కాదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. పెరిగితే జ్వరం అంటారు. 40% చేపలు మంచినీటిలో జీవిస్తాయి. భూమి మీద మంచి నీరు కేవలం 1% కంటే తక్కువ.”
“ఇంకో వింత తెలుసా? కొన్నిరకాల చేపలు షార్క్ ఫిష్‌కి నీటిలో తేలటానికి గాలి సంచి ఎయిర్ బ్లాడర్ ఉండవు. అందువల్ల అవి నీటిలో ఈదుతూనే ఉండాలి లేదా పొట్ట మీద తేలాలి. కొన్ని చేపలు గాలిలో ఎగరగలవు, కొన్ని నీటి ప్రవాహంలోని రాళ్లను ఎక్కగలవు.”
“వావ్!” అన్నారు పిల్లలు.
“చేపలలో ఉండే ఒక ప్రత్యేకమైన అవయవం లాటరల్ లైన్ – మురికి నీరు, చీకటిగా ఉన్న నీటిలో ఈదటానికి రాడార్‌ల పనిచేస్తుంది. అన్నింటికన్నా పెద్ద చేప గ్రేట్ షార్క్ వేల్. 55 అడుగులు పొడవు. అన్నింటికన్నా చిన్నది ఫిలిపైనే గోబీ ¾ అంగుళం పొడవు. ఇంకో వింత తెలుసా? చేపలకు మనలాగే వాసన, స్పర్శ అంటే టచ్, చూపు, వినికిడి, నొప్పి, ఆందోళన ఉంటాయి.”
“వాట్? అమ్మమ్మా! అర్ యూ కిడ్డింగ్?” అన్నాడు ఆర్యన్
“నో! ఐయామ్ నాట్!” అంది అమ్మమ్మ.
“ఫిష్ ఆహరం తెలుసా?”
“చిన్న కీటకాలు, పురుగులు” అన్నాడు ఆర్యన్
“అవును. నీటిలో ఉండే క్రిమి కీటకాలు, నాచు, ఇతర నీటిలో పెరిగే మొక్కలు తింటాయి. అంతే కాదు చేప సైజ్‌ని బట్టి చేపలు ఇతర చేప గుడ్లను, చిన్న చేపలను, కప్పలు, పాములు, తాబేలు, నీటి పక్షులు, చిట్టెలుకల్ని తింటాయిట. కొన్ని రకాల చేపల్లో ఆడ మగ వేరువేరు రంగులు లేదా సైజ్‌లలో ఉంటాయి. చేపల గురించి పరిశోధించి అధ్యయనం చేసేవారిని ichthyologist అంటారు. క్లీనర్ చేప ఇతర చేపల వ్యర్ధాలను, రాలిన పొలుసులు, నీటిలోని రోగకారక క్రిములని శుద్ధి చేస్తుంది. జెల్లీ ఫిష్, క్రె ఫిష్ పేర్లలో ఫిష్ ఉన్న అవి ఫిష్ కాదు.”
“మనుషుల పనులవల్ల పర్యావరణంలో మార్పులు, సముద్ర జలాల ఉష్ణోగ్రతల పెంపు, నీటి కాలుష్యం వల్ల దాదాపు 1000 రకాల చేపలు అంతరించి పొయ్యే ప్రమాదముందిట. మత్య కన్య అంటే క్రింది శరీరం చేప పైన మనిషి శరీరంగా చెప్పే మెర్మెయిడ్ ఒక అభూత కల్పన మాత్రమే.”
“అంటే కాదు అనేక వేల ఏళ్లుగా చేపలు మనిషికి ఆహారంగా పనికి వస్తున్నాయి. సీ ఫుడ్ చాల బలమైనది. మన ఆరోగ్యానికి అవసరమైన అనేక గుణాలున్నాయి. విటమిన్లు, ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియం లాంటివి. నీటిలో ఉండే క్రిముల్ని తినేసి మనకి రోగాలని రాకుండా హెల్ప్ చేస్తాయి. మనకి చేపలు కూడా హితులే.”
“అమ్మమ్మా! మా అమ్మ, మా టీచర్ కూడా ఫిష్ గురించి ఇన్ని సంగతులు చెప్పలేదు. మా ఫ్రెండ్స్‌కి కూడా చెబుతాము” అన్నారు ఆర్యన్, పరి ఉత్సహంగా.
“పదండి. లంచ్ తిందాము” అంటూ వాళ్ళని లేవదీశారు అంబిక.