[box type=’note’ fontsize=’16’] కొండగానో, చెట్టుగానో, నదిగానో, మెరుపుగానో, ప్రవాహంగానో కాకుండా మనిషిగా పుట్టినందుకు జన్మ వ్యర్థమయిందంటున్నారు చల్లా సరోజినీదేవి “గిరినైనా కాకపోతిని” అనే ఈ కవితలో. [/box]
[dropcap]హ[/dropcap]రపాదముంచెడి గిరినైనా కాకపోతిని
శ్రీహరి శయనించెడి ఉరగమునైన కాకపోతిని
లోకానగల కటిక చీకటులను గానలేని
కఠిన శిలనైన నే కానైతిని.
నాకానగల సుఖాలన్ని
కనిపించు కలనైన కానైతిని
చందురిని గాంచి నింగికెగయు
సందురిని అలనైన కాకపోతిని.
మురళీరవంలో తొణికిసలాడెడు
సరళీస్వర వల్లరినైన కాకపోతిని
నీలాల నింగిలో మెరియు
తటిల్లతా మాలనైనా కానైతిని.
ఉల్లాసంతో పొంగిపొరలెడు
జాహ్నవి తరంగమైన కాకపోతిని
కొండరాళ్ళను చొచ్చుకొని పరుగులిడు
ఝరీకన్నియనైన కాకపోతిని.
నిండి పండిన పండ్లతో వంగివున్న
తరుల తల్లి నైన కాకపోతిని
సౌరభాలను వెదజల్లుతు రంజిల్లెడు
సుమలతా నికుంజయమునైన కాకపోతిని
మనుజ జన్మయేటికిల వ్యర్థము గదా?