తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు – 8: “న్యాయం” కథ వ్రాసి అన్యాయమైపోయిన రచయిత యం.వి.తిరుపతయ్య!

0
3

[box type=’note’ fontsize=’16’] ‘న్యాయం’ కథ వ్రాసి అన్యాయమైపోయిన రచయిత యం.వి.తిరుపతయ్య! అనే ఈ వ్యాసంలో యం.వి.తిరుపతయ్య రాసిన కథలను పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు – మానవసంబంధాలు గురించి వివరించడంలో, వ్యవస్థలో రావల్సిన మార్పులు గురించి తెలియజేయడంలో రచయిత చూపిన శ్రద్ధ, ముందుచూపు పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని వివరిస్తున్నారు. [/box]

యం.వి. తిరుపతయ్య కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో 1942లో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తిరుపతయ్య బాల్యం వరంగల్‌కు దగ్గరుండే కరీమాబాద్‍లో గడించింది. వరంగల్ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.ఎ. చదివిన తిరుపతయ్య 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. 1980లలో అడవి బాపిరాజు నవలల మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను పొందారు. దాదాపు 35 సంవత్సరాల పాటు తెలుగు అధ్యాపకుడిగా జమ్మికుంట, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించి 1998లో పదవీ విరమణ చేశారు.

తిరుపతయ్య కాలేజీలో చదువుకుంటున్న రోజులలోనే కవితలు, కథలు రాస్తూండేవారు. పంతొమ్మిది వందల డెబ్భైలలో విప్లవ సాహిత్యం విరివిగా వెలువడుతున్న దశలో తిరుపతయ్య “న్యాయం” అనే కథను రాశారు. ఇందులో ఒక దొర తన దగ్గర పాలేరుగా పని చేస్తున్న ఒక బీదవాడి శ్రమను ఎంత అమానుషంగా దోచుకుంటాడో చిత్రీకరించారు. మోసానికి గురయిన ఆ పాలేరు కొడుకులు ఆ దొర పాలిస్తున్న గ్రామంలో న్యాయం దొరకడం అసంభవమని భావించి అడవుల్లోనైనా న్యాయం దొరుకుతుందన్న ఆశతో, అడవుల్లోకి వెళ్ళిపోయారని చెబుతూ కథ ముగిస్తారు. అప్పట్లో కరీంనగర్ ఉద్యమ సాహితి వారు “బదలా” అనే పేరుతో వెలువరించిన కథా సంకలనంలో ఈ కథ కూడా ఉంది. తర్వాత జననాట్య మండలివారు ఈ కథను నాటికగా మలిచి అనేక చోట్ల ప్రదర్శించారు. అలా ఈ కథకు గొప్ప ప్రాచుర్యం లభించింది. నాటికగా ప్రదర్శిస్తున్న రోజుల్లోనే తిరుపతయ్య పోలీసుల దృష్టిలో పడ్డారు. ఆయన జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నాడని తెలుసుకున్నారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం లెక్చెరర్లకు సకాలంలో జీతాలు చెల్లించేది కాదు. ప్రభుత్వం నుండి తీసుకున్న గ్రాంటును స్వంతానికి వాడుకుని లెక్చెరర్లుకు జీతాలిచ్చే వాళ్ళు కాదు. లెక్చెరర్లు ధర్నాలు, నిరాహారదీక్షలు ప్రారంభించారు. పోరాటాల్లో తిరుపతయ్య చురుకుగా పాల్గొన్నారు. అలా ఆ కాలేజీ కమిటి చైర్మన్ ఆగ్రహానికి గురయ్యారు. తిరుపతయ్యను గురించి పోలీసులు ఎంక్వయిరీకి వచ్చినప్పుడు కాలేజి యాజమాన్యం తిరుపతయ్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని చెప్పింది. అవకాశం కోసం చూస్తున్న పోలీసులకు 1975లో విధింపబడిన అత్యయిక పరిస్థితి అంది వచ్చింది. 1976లో తిరుపతయ్యను అరెస్టు చేసి ఓ పోలీసు క్యాంపులో నిర్భంధించారు. ఇది ఆయన జీవితం మీద చెరగని ముద్ర వేసింది. 26 రోజుల తర్వాత పోలీసు క్యాంపు నుండి విడుదల చేశారు. సహజంగా భయస్తుడైన తిరుపతయ్య ఆ చేదు అనుభవాన్ని జీర్ణించుకోలేకపోయారు. “ఏం రాస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో” అనే భయం ఆయనలో స్థిరపడిపోయి రాయడం మానేశారు. ఆయనను పొలీసుల అరెస్టు చేసిన సంఘటనను ఆధారం చేసుకుని ఆ సంఘటనతో ఎమెర్జెన్సీ విధించబడిన కాలంలో,  భారతదేశంలో జరిగిన మరిన్ని ఇతర సంఘటనలన్నీ జోడించి అంపశయ్య నవీన్ “చీకటి రోజులు” నవలను రాశారు.

తిరుపతయ్య రచనలు రాసిలో తక్కువైన వాసిలో విశిష్టమైనవి. అలాంటి విశిష్టమైన “న్యాయం” కథతో పాటు అయన రచించిన మరో అయిదు కథలను కలిపి “న్యాయం” పేరుతోనే సంపుటంగా తీసుకువచ్చారు. “న్యాయం” కథలో సాయిలు, శ్రీనివాసరావు దొర దగ్గర సేరీదారుగా నమ్మకంగా పని చేస్తూ, అతను మరింత ఎదగడానికి కారకుడవుతాడు. సాయిలు పెండ్లిలో వరకట్నంగా వచ్చిన వెయ్యి రూపాయలు తీస్కొని దొర ఉసికెపట్టులో పది గుంతల పొలం నీ పేరిట రాస్తానని చెబుతాడు. రెండేళ్ళ తర్వాత డబ్బు అవసరమై అది షాపుకారుకు అమ్మేస్తున్నాను. ఆ పది గుంతలకు బదులుగా నాలుగెకరాల దుబ్బ చెక్క తీసుకోమంటాడు. అది ఎందుకూ పనికి రాదని ఇంట్లో వాళ్ళంతా తిట్టిపోసినా దొరమీద నమ్మకంతో సాయిలు తీసేసుకుంటాడు. స్వంత వ్యవసాయం చేసుకోకుండా దొర ఎన్ని అడ్డంకులు పెట్టినా వినకుండా సాయిలు దొర బాకీ వెయ్యి రుపాయలు చెల్లించి, వ్యవసాయంకు దిగుతాడు. సాయిలు, పెద్దకొడుకు కలిసి అయిదు సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడి భూమిని సాగుకు తెస్తారు. ఆ పొలంలో మొక్కజొన్న ఏపుగా కాయడంతో దొరకన్ను ఆ పొలం మీద పడుతుంది. ఆ భూమి మీద తాను పదివేలు అప్పు తీసుకుని తీర్చనందున షావుకారుకు ఆ భూమి ఇచ్చేయాలనీ, దానికి బదులుగా వేరే చోట ఇస్తానని దొర అనడంతో సాయిలు భగ్గుమంటాడు. “జీవితాంతం వెట్టి చాకిరి చేసినా, తిండి గింజలు తప్ప ఏం మిగలలేదు. ఇరవై ఏళ్ళక్రింత కట్నం డబ్బులు తీసుకుని అక్కడ కాదు భూమి ఇక్కడ అని ఇచ్చావు. ఇప్పుడు ఇందులోంచి పొమ్మంటే ఎక్కడికి పోవాలె” అని నిలదీస్తాడు. సాయిలు రెండో కొడుకు రాయలింగు పట్నంలో చదువుకుని నౌకరీ చేస్తుంటాడు. వాడు ఊరికి వచ్చి ఊరి పెద్దలను, కుల పెద్దలను అడిగితే దొర చేసింది అన్యాయమే అంటారు. కాని ఎవరూ ముందుకు వచ్చి అడగలేరు. పొలం ఇవ్వనందుకు దొర కోర్టులో కేసు వేస్తాడు. అన్ని సాక్షాలూ దొరకు అనుకూలంగా వుండటంతో దొర కేసు గెలుస్తాడు. పోలీసుల బలగంతో దొర పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు. మరుసటి రోజు రామలింగు నేస్తగాండ్రు ఓ ఇరవైమంది ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళెక్కడికి పోయారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ విషయం తెలియగానే దొర తన ఇల్లు, పొలం, పనివాళ్ళకు అప్పజెప్పి పట్నం మకాం మారుస్తాడు. ఆ కథలో రచయిత ఎక్కడా వర్గ శత్రువు, విప్లవం గురించి చెప్పలేదు. రాయలింగు తన స్నేహితులతో అన్నలతో చేరిపోయాడని అన్యాపదేశంగా తెలియచేశాడు. ఆది గ్రహించిన దొర పట్నానికి పారిపోతాడు.

మేడిపండు లాంటి ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో ముడిపడిన రాజకీయాలను, ఓట్ల ప్రహసనాన్ని అద్భుతంగా చిత్రించిన కథ “పునాది”. మన ప్రజాస్వామ్యంలో డబ్బులు వెదజల్లే వారే ఎన్నికలలో పోటీ చేసి నాయకులవుతారు. ఊరు వాడలలో సారాయి డబ్బు గుప్పించి గంపగుత్తగా ఓట్లు వేయించుకుంటారు. మఖ్యంగా దళితవాడలను ఎప్పుడూ పట్టించుకోని నాయకులు ఎన్నికల వేళ వరాలను గుప్పిస్తారు. డబ్బుతో వీరిని లొంగదీసుకుని తమకే ఓట్లు వేసేలా చూసుకుంటారు. కాని ఈసారి కిష్టాయిగూడెంలో  ఈ ప్రణాళిక పని చేయలేదు. అక్కడి దొరల నియంతృత్వం పట్నం నుండి వచ్చిన సత్తిగాడి దెబ్బకు బీటలు వారిపోతుంది. “ఇంతకు ముందు ఎన్నికలప్పుడు వారు చేసిన వాగ్దానాలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కొత్త వాగ్దానాలు కూడా అంతే. వాళ్ళు తెస్తానన్న మార్పులు వారి అవసరాలనే తీరుస్తాయి తప్ప మనలాంటి బీదా బిక్కికీ ఏం జరుగదు. అందుకని మనం ఓటు వేయవద్దు. ఎన్నికలను బహిష్కరిద్దాం” అని తమ వూరినే కాదు చుట్టు పక్కల వున్న వూళ్ళలో కూడా సత్తిగాడు తన అనుచరులతో ప్రచారం చేస్తాడు. “మనం ఓట్లేయకున్నా ఏమవుతుంది? ఏమీ కాదు. వాళ్ళు గెలుస్తారు. రాజ్యమేలుతారు. వాళ్ళు మన తప్పు వల్ల గద్దె నెక్కలేదనే తృప్తి వుంటుంది” అని అందరికి నచ్చజెబుతాడు. ఓట్లు వేయవద్దని ప్రచారం చేసిన వాళ్ళను కొందరిని పోలీసులు పట్టుకుపోతారు. ఎన్నికల రోజు ఆ ఊళ్ళో జరిగిన పోలింగలో దొర మనుషులు వచ్చి ఓట్లేసి పోతారు. అతి తక్కువ పోలింగ్ జరుగుతుంది. అందురూ ఎన్నికలను బహిష్కరించడంతో పని వాళ్ళు కూడా దొరకుండా పోతారు. పోలింగ్ ముగిసిన తర్వాత బాలెట్ పెట్టెలు తీసుకువెళ్ళడానికి మనుషులు దొరకరు. చివరకు పోలీసులు రాత్రి వేళలో పొలానికి పోతున్న ఇద్దరు మనుషులను దౌర్జన్యంగా ఆ పెట్టెలు మోయించి తీసుకెళదామనుకుంటారు. అప్పుడే వచ్చిన సత్తిగాడు వాళ్ళను ఎదిరిస్తాడు. అంతలో పోలీసు బలగం రాగా, వాళ్ళు బాలెట్ పెట్టలు ఎత్తుకుపోతున్నారని ఫిర్యాదు చేయడంతో ఇన్‌స్పెక్టర్ సత్తిగాడిని అరెస్టు చేసి పట్టుకుపోతాడు. “నాలాంటి అమాయకులను పెట్టిన కష్టాలే మీ నాశనానికి పునాదు”లని సత్తిగాడి హెచ్చరికతో కథ ముగుస్తుంది. ఈ రెండు కథల్లో పల్లెల వాతావరణాన్ని, అక్కడి పరిస్థితులను, దొరల ఆధిపత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రకరించారు. ఊరిని తమ గుప్పిట్లో వుంచుకున్న దొరలు  సామాజికంగా ఆర్ధికంగా ఎవరూ ఎదగకుండా జాగ్రత్త పడతారు. ఎదిరించిన వాళ్ళను తమ బలగంతో చావదన్ని తమ దారికి తెచ్చుకుంటారు. వారు వెదజల్లే డబ్బుతో కోర్టులు, పోలీసులు కూడా వారి వైపే వుంటారు. “న్యాయం” కథలో దొరలకు కోర్టులు సహాయం చేస్తే, రెండవ కథలో పోలీసులు అండగా నిలుస్తారు. అక్కడ దొరలదే రాజ్యం. అది ఎప్పటికీ సాగదన్నట్లుగా ప్రజలలో వస్తున్న చైతన్యన్ని చిత్రీకరించిన ఉత్తమ కథలుగా ఇవి ఇప్పటికీ నిలిచిపోతాయి.

కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో చోటు చేసుకుంటున్న స్వార్థం, అవకాశవాదం వల్ల అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని మరో రెండు కథలు తెలియజేస్తాయి.

“మబ్బు వీడని ఆకాశం”: బయట ముసురు పడుతుంటుంది. ఎంతకూ వీడని ముసురు. ఆనందరావుకు తన గత జ్ఞాపకాలు ముసురులా అలుముకుంటాయి. బాల్యంలో తల్లిదండ్రులు చనిపోతే మేనమామ వచ్చి వీడికింత ఆస్తి ఎందుకని అమ్మేసి, వీడికి చదువెందుకని ఏడో తరగతిలో మాన్పించేసి, పోకిరిమూకల స్నేహం దాకా చూసి, వీడికా పిల్లనివ్వడం అని తన కూతురును ఇంజనీర్ కిచ్చి పెళ్ళి చేస్తాడు. గుండె పగిలిన ఆనందరావును నీ బతుకు నువు చూసుకోమని ఇంట్లోంచి తరిమేస్తాడు. ఆత్మహత్య చేసుకోబోయిన ఆనందరావు చివరికి జేబు దొంగగా మారిపోతాడు. ఫలితంగా పోలీసు రికార్డులోకి ఎక్కడం, ఎక్కడ దొంగతనం జరిగినా; హత్య, జరిగినా తన ఉనికిని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోక తప్పదు. ముసురు పడుతూ వుంది. ముసురు వల్ల ఎవరి వ్యాపారాలు సాగడం లేదు. రోడ్ల మీద జనాలు తిరగడం లేదు. అలాంటప్పుడు పిక్‌పాకెటర్ ఆనందరావు పని ఎలా వుంటుంది? అతనికి అర్జంటుగా వంద రూపాయలు కావాలి? ఎలా వస్తాయి? ఆ రాత్రి ఆ ముసురులో ఎలా వంద రూపాయలు సంపాదించడం? ఆమె కోసం వంద కావాలి. ఒకరోజు రైల్వే ప్లాట్‌ఫారం మీద అనాథగా కనిపించిన పార్వతి అనే అందమైన అమ్మాయి, ముసలివాడితో బలవంతపు పెళ్ళి తప్పించుకోడానికి పారిపోయి వచ్చానని ఆనందరావు ఆశ్రయం కోరుతుంది. పార్వతికి గది కుదిర్చాడు. తన పేరు మూర్తియని, ఉద్యోగస్తుడనని, పెళ్ళి కాలేదని చెబుతాడు. ఆమెకు తరుచుగా ఆర్థిక సహాయం చేస్తూ ఆమె అభిమానాన్ని చూరగొంటాడు. వంద రూపాయలు డబ్బుంటే ఉద్యోగం దొరుకుతుంది. అది దొరికిం తర్వాత మనం పెళ్ళి చేసుకుందామని చెబితే ఆనందరావు పొంగిపోతాడు. జేబులో యాభై రూపాయలున్నాయి. ఇంకో యాభై కావాలి. ఆ ముసురులో ఎలా? ముసురు ఆగేట్లుగా లేదు. తనను మంచివాడిగా, మర్యాదస్తుడిగా నమ్మి తన మీద ఆశలు పెంచుకున్న పార్వతిని మోసం చేయలేనని భావించి, ‘నిన్ను  మోసగించలేను. నన్ను మరిచిపో. ఈ యాభై మాత్రమే ఇవ్వగలను. మన్నించమ’ని కోరుకుంటూ, తన నిజస్వరూపం తెలుపుతూ ఉత్తరం రాసి పార్వతికి ఇవ్వడానికి ఇంటికి వెళితే తాళం కనిపిస్తుంది. అక్కడ అతనికి కనిపించిన ఉత్తరంలో “నేను చెప్పందంతా అబద్దం. నేను అన్నివిధాలా చెడిపోయాను. ఎవరూ నమ్మని నన్ను నమ్మారు. మిమ్మల్ని మోసగించలేను. మీరు మంచివారు, అమాయకులు. నేను మీకు తగను, నన్ను మర్చిపోండి” అని వుంటుంది. ఆ ఉత్తరం చదివి ఆనందరావు కదిలిపోతాడు. తనకో హృదయంలో స్థానం దొరికిందని సంతోషపడతాడు. ఇంతలో ఒక పోలీసు వచ్చి పట్టుకుని “ఎవరో అమ్మాయిని తెచ్చి వ్యాపారం చేస్తున్నావని తెలిసింది. పద పోలీసు స్టేషన్‌కు” అని గద్దిస్తే, పార్వతికి ఇవ్వాలనుకున్న యాభైరూపాయలు వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. హృదయంలో బాధ, మనసులో దుఃఖం, తడుస్తున్న శరీరం, కండ్లకు అడ్డు వచ్చిన నీరు, విషాదంగా నవ్వుతున్న ఆనందరావు ఆ ముసురులో, బ్లేడుముక్కను పట్టుకుని బజారులోని వెళ్ళిపోతాడు. ముసురు నేపధ్యంలో “మబ్బు పట్టిన ఆకాశం” అనే ఈ కథ బాగా వచ్చింది. ఒక వైపు ఎంతకూ ముసురు పట్ల చీకాకును, ఇంకో వైపు ఆనందరావు అంతర్మథనాన్ని సమన్వయం చేస్తూ కథ నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

“కరుణ పోయాక” కథలో తండ్రి లేని తనను చదివించి, కూతుర్నిచ్చి పెళ్ళి చేసిన మామయ్య, చిన్న వ్యాపారం నుండి హఠాత్తుగా ధనవంతుడై తనకు ఆధర్శంగా నిలచిన మామయ్య నిజస్వరూపం తెలుసుకున్న విధానం ఉత్కంఠ భరితంగా తయారయింది. మిత్రుడు, భాగస్వామియైన సుబ్బారావును వంచించడం, అతడు పిచ్చివాడు కావడానికి కారకుడు తన మామయ్య అని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. ఈ కథలో సుబ్బారావు పాత్ర పరిచయం, అతని పట్ల కలిగిన ఆసక్తి, అన్వేషణగా మారి తన మామయ్య చేసిన దుర్మార్గాన్ని తెలుసుకున్న విధానం అపరాధ పరిశోధనను మరిపిస్తుంది.

సిగరెట్లు లేవు. సిగరెట్ తెచ్చుకోవడానికి అర్ధరాత్రి చౌరాస్తా దాకా వెళ్ళాలి. ఈ వరంగల్ ఇంత తొందరగా నిద్రపోతుంది. ఎందుకని? అని తిట్టుకుంటూ సిగరెట్ కోసం సాంబశివుడు బయలుదేరుతాడు. అతని అలోచనా స్రవంతిలో సిగరెట్ తాగొద్దని చెప్పే రావుగాడు, సిగరెట్‌తో తనను చూసి ఎగతాళి చేసే రెడ్డిగాడు, తను సిగరెట్లు కాల్చడానికి తప్ప  ఎందుకూ పనికిరాడనే రజని! రజని తెగింపుగల మనిషి. సంఘమంటే లెక్కలేదు. ఆమె గురించి, అమె ప్రవర్తన, శీలం గురించి… రెడ్డి, రావులకు ఆమెతో అక్రమ సంబంధం అంటకట్టి వినోదిస్తాడు. సిగరెట్లు తీసుకుని వస్తూ, దారిలో ఆ రాత్రి ఆమె ఇంటి తలుపు తట్టి ఆమెను ఆశ్చర్యపరుస్తాడు. ఆమె తాతయ్యతో కలిసి వుంటుందని తెలిసి, అమె మీద అన్యాయంగా, వక్రంగా ఆలోచించానని బాధపడుతాడు. ఇంటికి వచ్చి పడుకోబోతున్న సాంబశివుడు తలుపు చప్పుడు కాగా ఎదురుగా రజని. మరిచిపోయిన గొడుగు ఇవ్వడానికి వచ్చానంటే, లోపలకు పిలవడు సరికదా అక్కడే నించోబెట్టి ఆమె ప్రవర్తన గురించి ఆలోచనలో పడతాడు. అతడు సిగరెట్టు విసిరేస్తే “సిగరెట్ నిరర్ధకంగా కాలిపోయింది.” అంటుంది. “అనుభవిచే వాడికే కదా సిగరెట్..” “సిగరెట్ తాగే దమ్ముందా…” “ఛీ అసమర్థుడా! నువ్వు మగాడివే… ” ఈ మాటలు ద్వారా రజనికి సాంబశివుడు మీద వున్న అభిప్రాయం తెలిసిపోతుంది. గిల్టీ ఫీలింగ్‌తో ఆఫీసులో రిజైన్ చేసి వెళ్ళిపోదామనుకున్న సాంబశివరావు, అంతకు ముందే రజని రిజైన్ చేసి వెళ్ళిపోయిందని తెలుసుకుని మ్రాన్పడిపోతాడు. తాననుకున్నదేమిటి? అయిందేమిటి? తను సమర్థుడా? అసమర్థుడా? తను నిజమా, రజని నిజామా? అనే విచికిత్సలో పడిపోతాడు. వ్యసనంగా మారిన సిగరెట్ అలవాటు గురించి, సిగరెట్ కుతి గురించి వివరించిన ఈ కథలో… సాంబశివరావు ఆలోచనా పద్ధతి చైతన్యస్రవంతి ధోరణిలో నడుస్తుంది. తన మిత్రులైన రావు, రెడ్డి, రజనిల గురించి తన అంతరాంతరాల్లో వారి పట్ల గల హేయభావాల్ని వ్యక్తీకరిస్తూ అతని ఆలోచనలు సాగుతాయి. దారి మధ్యలో చావు గురించి… తోవలో మధ్య కనిపించిన పిచ్చిదాన్ని గురించి… ఎవడో దానికి కడుపు చేశాడు. అది పిల్లాడ్ని కంటే అనాథాశ్రమంలో వదిలేశారు. దాని నగ్నత్వాన్నిచూసి అంతా వినోదిస్తారు, తనతో సహా… ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. తను రజని ఇండివిడ్యువాలిటీని హర్షించలేకపోవడం, అంతరాంతరాల్లో అమె మీద వున్న ఆసక్తి, ఇష్టాలను అణుచుకోవడం, చివరికి రజని ప్రేమను గుర్తించలేకపోవడం జరుగుతుంది. మనుషుల్ని కాల్చిపారేసే సిగరెట్లలా భావించే సాంబశివుడి మనస్తత్వాన్ని, అతని కంటే బాగా రజని గుర్తించడం ఈ కథలో కొసమెరుపు. అది చివరకు సాంబశివుడి ఆత్మపరిశీలనకు పురిగొల్పుతుంది. “కొడిగట్టిన సిగరెట్”గా సాంబశివుడ్ని పొలుస్తూ రచయిత ఈ కథ రాసాడు.

మూర్తి చిన్నప్పుడే కలిగిన అనుభవం వల్ల స్త్రీలన్నా, స్త్రీల కారెక్టర్ పట్ల అపనమ్మకం పెంచుకుంటాడు. దాంతో స్త్రీద్వేషిగా మారి, బ్రహ్మచారిగా బతికేస్తూంటాడు. వాడ్ని ఒక గృహస్తుడిగా చేయాలని ఇంట్లో వాళ్ళు, మిత్రులు ప్రయత్నించి విఫలమవుతారు. అలాంటిది  “మూర్తి ఓ ఇంటివాడు అవుతున్నా” డంటే అందరిలో పెద్ద సంచలనం. నైతిక విలువల మీద నమ్మకంతో శీలవతియైన భార్య కోసం జరిపిన అన్వేషణ ఫలించిదనుకున్న మిత్రుడు పెళ్ళికూతురుని చూసి షాక్ తింటాడు. ఆయన పని చేసిన పాత స్కూళ్ళో ఆ అమ్మాయి అతని శిష్యురాలు. హెచ్.ఎస్.సి చదువుతుండగానే, ఆమెను ఓ చీచర్‌తో పాటు సస్పెండ్ చేశారు. నిజం చెప్పి మూర్తి సంతోషాన్ని, అతని కుటుంబ జీవితాన్ని నాశనం చేయలేక, పెళ్ళి కాగానే మిత్రునికి మొహం చూపించలేక బయటపడతాడు.

అష్టవిధనాయికలలో “విరహోత్కంటిత” ఒకరు. విరహం వల్ల వేదన పడే నాయికను విరహోత్కంఠిత  అంటారు. పని కారణంగా ప్రియుడు ఇంటికి రాలేకపోయినప్పుడు ఈమె విరహంతో బాధ పడుతుంది. ఈమెను పానుపు మీద కూర్చున్నట్లు లేదా నిలబడినట్లుగా లేదా వరండాలో నిలబడినట్లుగా భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పం మరియు శాస్త్రీయ నృత్య సంప్రాదయాలలో చూపిస్తారు. అలాంటి విరహోత్కంఠిత కథే “ఆయనింకా రాలేదు”. సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చే భర్త కోసం, బాగా అలంకరించుకుని భార్య ఎదురుచూస్తుంటుంది. డాబా మీద పిట్టగోడ కానుకుని వేసుకున్న కుర్చీలో కూర్చుని వచ్చే పోయే జంటలను వాళ్ళ అన్యోన్యతను చూసి ఈర్ష్య పడుతుంది. తనను, తన అందాన్ని పట్టించుకోని భర్త; ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన మనుషులు జ్ఞాపకం వస్తారు. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో రగిలిపోతూ భర్త కోసం ఎదురు చూస్తుంటే, రాత్రి పది గంటలకు భర్త వస్తాడు. మిత్రునితో కలసి సినిమాకు వెళ్ళానని, అక్కడే తిని వచ్చానని చెప్పి భర్త బెడ్‌రూమ్‌లోకి పోయి హాయిగా నిద్రపోతాడు. హతాశురాలైన భార్య తన దురదృష్టానికి ఏడ్వక తప్పలేదు. ఒంటరితనం, ప్రేమరాహిత్యంతో బాధపడే భార్య మానసిక సంఘర్షణను ఈ కథలో చక్కగా చూపించారు.

కట్నంతో వచ్చే పిల్లను కాదనుకుని ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య పరాయి మొగాడితో కనిపించే సరికి రచయిత బాధతో కుమిలిపోతాడు. తన ప్రేమ కథను, సుఖ సంసారాన్ని వివరిస్తూ “త్యాగమూర్తి”  కథను రాసిన రచయిత భార్య నమ్మక ద్రోహాన్ని వివరిస్తూ “త్యాగఫలం” కథ రాసుకుంటాడు. తీరా చూస్తే ఆ పరాయి మొగాడు ఎవరో కాదు. చిన్నప్పడే జైలుకు వెళ్ళిన తమ్ముడని తెలుసుకుని రచయిత ఆదరంగా ఇంట్లోకి తీసుకువస్తాడు. రచయిత రచనలో జీవించాలో, పాత్రల్ని సజీవంగా చిత్రించాలో తెల్చుకోలేకపోతాడు.

విప్లవాత్మక భావాలతో సమాజాన్ని తృణీకరించినందుకు “శేష ప్రశ్న” లోని కమల అంటే ఆనందరావుకు ఇష్టం. రైలు ప్రయాణంలో పరిచయం అయిన కమల మాత్రం “ఈ వాస్తవ లోకంలో కమల ఎంత వరకు నిలబడగలుగుతుంది? ఈ పవిత్ర భారతదేశంలో కమల లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు?” అని ప్రశ్నిస్తుంది. కేవలం రైలులో జరిగిన పరిచయంతో కమల ఇంటికి  వెళ్ళిన ఆనందరావుకు ఆమె కళ్ళలో కనిపించిన విషాదం, ఆమె అనుభవించే నరకం తెలియవస్తుంది. భావాలు ఎంత విప్లవాత్మకమైనా, చేతలు సంప్రదాయబద్ధాలు కావడం నేటి రివాజు. సమాజానికి ఎదురు నిలిచే ధైర్యం, శక్తి భారత స్త్రీకి లేదు. సమాజానికి తలవొగ్గినవారు చరిత్ర హీనులవుతారు. సమాజానికి ఎదురు నిలిచిన వారు ఎప్పటికప్పుడు శేష ప్రశ్నలుగా నిలిచిపోతారు. వారిని వారు క్షమిచుకోవాలి కాని, సమాజం వారిని క్షమిచడానికి సిద్ధపడదని ఈ  “వెలగని దీపం” కథ తెలియజేస్తుంది.

ప్రేమను, ప్రేమరాహిత్యాన్ని, దాంపత్య జీవితంలోని అసమానతలను ఈ కథలు చిత్రీకరిచాయి. క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు – మానవసంబంధాలు గురించి వివరించడంలో, వ్యవస్థలో రావల్సిన మార్పులు గురించి తెలియజేయడంలో రచయిత చూపిన శ్రద్ధ, ముందుచూపు పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వస్తుపరంగానే కాకుండా, శిల్పపరంగా కూడా ఈ కథలను తీర్చిదిద్దడంలో రచయిత చక్కటి నేర్పును కనబరిచారు. బీజప్రాయమైన చైతన్యస్రవంతి పధ్దతి “మబ్బు వీడని ఆకాశం”,  “కొడిగట్టిన సిగరెట్” కథల్లో కనిపిస్తుంది. దాదాపు కథలన్నీంటికి కొసమెరుపు కథలుగా రూపొందించడంతో ఈ కథలు మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తయారయ్యాయి. ఈ కథల్లో చోటు చేసుకున్న వరంగల్ టోపోగ్రఫీ మనల్ని అబ్బుర పరుస్తుంది. “న్యాయం”, “పునాది” కథలలో కనిపించే పాత్రోచిత తెలంగాణ మాండలికం, ఆ కథలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది.

ఈ కథల్లో నాలుగు కథలు ‘విద్యుల్లత’ పత్రికలో, ఒకటి ‘సృజన’లో, మరొకటి ‘బదలా’ సంకలనంలో రాగా వాటన్నింటిని కలిపి ‘న్యాయం’ పేరుతో సంకలనంగా వెలువరించారు. ఈ సంకలనంలో చేరని మూడు కథలలో ‘మబ్బు వీడని ఆకాశం’ ఆంధ్రపత్రికలో, ‘వెలగని దీపం’ ఆంధ్రప్రభలో, ‘కొడిగట్టిన సిగరెట్’ కళాకేళి పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ కథలన్నీ అరవైయవ దశకంలో రాసినవే. చివరగా రాసిన ‘న్యాయం’ కథ 1973లో వెలువడిన ‘బదలా’ సంకలనంలో చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here