ఆకుపచ్చని పొద్దు పొడుపు – పుస్తక పరిచయం

0
3

[dropcap]తె[/dropcap]లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంపై వెలువడిన కవితా సంకలనం “ఆకుపచ్చని పొద్దు పొడుపు”. హరితహారానికిది అక్షర హారతి అని రాష్ట్రమంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు.

***

“భాషా సాంస్కృతిక శాఖ ‘హరితహారం’ అంశంగా కవితా పోటీలను నిర్వహించింది, కవులు మార్గదర్శులు, అక్షర క్రాంతదర్శులు కనుక వారి పద్యాలు/కవితల ద్వారా  జనబాహుళ్యంలో చైతన్యాన్ని మాత్రమే కాక బాధ్యతను, సామూహిక పర్యావరణ అనుభూతిని కలిగించాలని సంకల్పించుకుంది. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలలనుంచి దాదాపు 728కి పైగా కవితలు వచ్చాయి. వాటిల్లోంచి మేలైన కవితలను ఎంపిక చేయడానికి ఆరుగురు ప్రముఖ కవులతో కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఎంపిక చేసిన కవితలకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది.

బహుమతులు పొందిన (7) కవితలే కాక ప్రచురణకు యోగ్యమైన 120 ఇతర కవితలను కమిటీ సూచించింది. వీటికి తోడు మరో కొంతమంది ప్రముఖ కవుల కవితలను తీసుకుని మొత్తం 164 కవితలను కలిపి ఈ “ఆకుపచ్చ పొద్దుపొడుపు” కవితా సంకలనాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ కవితలన్నింట్లో ప్రకృతి, చెట్టుపట్ల అనురాగం, చెట్టు ఆవశ్యకత, చెట్లలేమివల్ల లోకానికి జరుగుతున్న హాని, చెట్ల విధ్వంసంవల్ల మానవాళికి జరుగుతున్న ముప్పు, వన సంరక్షణ – చెట్లను నాటే దిశగా కర్తవ్యబోధ, చైతన్య స్ఫురణ, ఆచరణాత్మకత వైపు మార్గదర్శనం వంటి భావనలను విస్తృతంగా కవులు వ్యక్తీకరించారు. అలా ఈ 171 (164 + 7 బహుమతి కవితలు) కవితల సంకలనం తెలుగులోనేకాక భారతీయ భాషలలో కూడా “పర్యావరణ కవిత్వం’ (Ecopoetry) లో అతిపెద్ద సంకలనంగా తనదైన ప్రత్యేకతను సాధించింది” అన్నారు మామిడి హరికృష్ణ “తెలంగాణకు కవితల హారం” అన్న సంపాదకీయంలో.

***

ప్రథమ బహుమతి పొందిన ‘పిట్టలు వాలిన చెట్టు’ కవిత వ్రాసినది బండారి రాజ్‌కుమార్.

ఈ కవితలో –

“పచ్చని మొక్కలు నాటుదం రాన్రి
ఒళ్లంత ఆకుపచ్చరంగుల్ని పూసుకుందం రాన్రి
గప్పుడే…
నీడనిచ్చే చెట్టయి ఎదుగుతయి
చెట్ల నీడన సేదదీరే మూగజీవాలుంటయి
చిటారుకొమ్మన స్వేచ్చగ ఎగిరే పిట్టలుంటయి
పచ్చని చెట్లున్న కాడ… ఒల్సెన్ని ముచ్చట్లుంటయి
ముచ్చటంటే చెవులుగోసుకునే మట్టిమనుషులుంటరు
సెమటబొట్ల సువాసనలుంటయి
మట్టిమనిషి బత్కాలంటే…
నా తెలంగాణ పిట్టలు వాలిన చెట్టు కావాల్సిందే!!” అంటారు.

***

ఎందరో వర్ధమాన, సుప్రసిద్ధ కవుల కవితలున్న ఈ సంకలనం విశిష్టమైనది. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధా రెడ్డి వ్రాసిన “అడవి హరితం” కవితోని కొన్ని పంక్తులు:

“కడుపేదల ఆకలికి కాయలు పండ్లిస్తది
నీరస పడు బాటసారి నీడయి ఒడిపడుతది
నాగలి గొడ్డలి కొడవలి నాగరికత ఆటపట్టు
వ్యవసాయం పనిముట్టు అవ్యవస్థ పనిపట్టు
అమ్మా చెట్టుకు నువురక్ష ! నీకు చెట్టు రక్ష!”

***

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పి. శ్రీకాంత్ వ్రాసిన “నేను… చెట్టుని” కవితలో

“గుక్కపెట్టి మీరేడ్చినపుడు
మీకు జోలలు పాడిన ఉయ్యాల తొట్టిని
మీ అవసరాలకై, ఆవాసాలకై
నా తనువంతా చీలిస్తే రాలిన రంపపుపొట్టుని” అంటారు.

***

“బడీ, గుడీ, మసీదు, గురుద్వార, చర్చిలల్ల అయితేంది దప్తర్ల, దవఖాన్ల బాటలపొంటి, బాయికాడ, చెరువు కట్టల మీద, చేన్ల ఒరాల మీద, బస్టేషన్ల, రైల్ స్టేషన్ల, పోలీస్ స్టేషన్ల, సబ్ స్టేషన్ల నదుల వెంబడి, వాగుల వెంబడి, గుట్టల మీద, మట్టి పుట్టల మీద, ఇంటి ముంగట, ఇంటెనక, ఏడ బాగుంటే ఆడ చక్కని మొక్కలు నాటాలి. మొక్కలు నాటిన చేతులే చేతులని చాటాలి. పూజించే చెట్లు, పూలిచ్చే చెట్లు, పండ్లిచ్చే చెట్లు, పసరు మందిచ్చే చెట్లు, ఈ చెట్టు ఆ చెట్టని కాదు అన్ని రకాల చెట్లు పెంచాలె. చెరువు కట్టల మీద తాటి వనాలు పెంచి కట్ట మైసమ్మకు సాక పొయ్యాలె. ముంతెడు మీసాల పోతరాజుకు మోదుగు దొప్పల్ల నైవేద్యం పెట్టాలి. అల్లోనేరడల్లో అని పాడుకుంటూ అల్లనేరేళ్లు నాటాలె, నాటిన మొక్కలు మొరసాచి మొగులును మొక్కాలై. మొగులు మురిసి వరుసబెట్టి వానలు కొట్టాలె. నేటి మొక్క రేపటి చెట్టయి, తెలంగాణకు చల్లని నీడబడితే మన తెలంగాణ మేఘాలయమైతది. ప్రతి పల్లె చిరపుంజైతది, చిరాయువైతది. మనం కోల్పోయిన స్వర్గం మల్ల దిగిరావాలె. వలసపోయిన పక్షులు తిరిగొచ్చి గూళ్లు కట్టుకొని సల్లగ బతకాలె. పక్షుల కిలకిలలకు పశువుల అంబారావాలతో తెలంగాణ ఆకుపచ్చని పొద్దు పొడవాలె. అందమైన తెలంగాణ ఆకుపచ్చని కోన కావాలె. తెలంగాణ తల్లి మెడలో హరిత కాంతులు ప్రజల జీవితాలలో సుఖశాంతులు నింపాలె” అన్నారు దేశపతి శ్రీనివాస్ తన ఆప్తవాక్యం “ఆకుపచ్చని పొద్దు పొడుపై”లో.

***

ఆఆకుపచ్చని పొద్దు పొడుపు (కవితా సంకలనం)
పుటలు: 353+
వెల: రూ. 350/-
ప్రచురణ:
డైరక్టరు, భాషా సాంస్కృతిక శాఖ,
కళాభవన్, రవీంద్రభారతి,
హైదరాబాద్. తెలంగాణ .
ప్రతులు ప్రచురణకర్త వద్ద లభ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here