కేంద్ర సాహిత్య అకాడమీ, క్రియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ లోని జేఎన్‌టియూ ఆలుమ్ని ఆడిటోరియంలో 09 సెప్టెంబరు 2018 ఆదివారం నాడు “తెలుగులో యాత్రా సాహిత్యం” అనే అంశంపై ఒక రోజు సదస్సు జరిగింది.
సదస్సుకు సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.పి. మహాలింగేశ్వర్ స్వాగతం పలకగా, ప్రారంభ సమావేశానికి అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు కె. శివారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ఎం. ఆదినారాయణ తెలుగులో వచ్చిన యాత్రా సాహిత్యపు మూలాల గురించి వివరించి “మహా యాత్రికుడు మన వీరాస్వామి” అంటూ తొలి యాత్రా రచన అయిన ఏనుగుల వీరాస్వామి రచించిన “కాశీయాత్ర” గురించి విస్తృతంగా తెలిపారు. తన అనుభవాలను వివరించారు. ప్రముఖ రచయిత, కవి వాడ్రేవు చినవీరభద్రుడు కీలకోపన్యాసం చేస్తూ భారతీయ ప్రాచీన గ్రంథాలలోని యాత్రాకోణాలను వివరించారు. యాత్రా రచనల్లో సామాజికాంశాలపై ఉపన్యసించారు.
“తెలుగులో యాత్రా సాహిత్యం – భిన్న కోణాలు” అనే మొదటి సమావేశానికి వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసిన సం.వె. రమేష్ “యాత్రా రచనల్లో మూలాల శోధన” అనే అంశంపై ఉపన్యసించారు. “జర్నలిస్టు యాత్రా రచనలు” అనే అంశంపై మాట్లాడిన రెహాన “జర్నలిస్ట్ ప్రయాణం యాత్ర కోసం కాదు. ఆనందం కోసం అంతకంటే కాదు. జర్నలిస్టుల ప్రయాణాలలో ఒక సామాజిక అవసరం ఉంటుంది. ఉత్పన్నమైన సమస్యలను, బాధితులను, వారి ఆవేదనను, అక్కడి పరిస్థితులను సమాజం ముందుపెట్టాలన్న తపన ఉంటుంది” అంటూ తాను ఇటీవల కవర్ చేసిన వార్తాంశాల కోసం తాను చేసిన ప్రయాణాలను వివరించారు. “ప్రయాణం నుంచి యాత్రలోకి” అనే అంశంపై మాట్లాడిన దేవులపల్లి కృష్ణమూర్తి తన పఠనాభిరుచిని, ప్రయాణల పట్ల ఇష్టాన్ని వివరిస్తూ 24 మందితో కలసి మినీ టూరిస్టు బస్సు మాట్లాడుకుని బాసర, షిరిడి, ఎల్లోరా, దౌలతాబాద్, అజంతా మొదలుకొని, అన్నవరం, భద్రాచలంతో మొత్తం 30 యాత్రాస్థలాలను దర్శించేందుకు బయల్దేరిన వైనాన్ని వివరించి తోటి యాత్రికులను పరిచయం చేశారు. యాత్ర ఆరంభంలో ముభావంగా ఉన్నవారు, యాత్ర ముగిసేనాటికి ఒకరికి ఒకరు ఆత్మీయులుగా మారిపోయారని చెప్పారు.
“తెలుగులో యాత్రా రచనలు – పరిశీలన” అనే రెండవ సమావేశానికి సి. మృణాళిని అధ్యక్షత వహించారు. తన చైనా పర్యటనలోని అనుభవాలను వివరించారు. “తెలుగులో యాత్రా రచనలు 1838 – 2000 వరకు” అనే అంశంపై ప్రసంగించిన దాసరి అమరేంద్ర తెలుగులో వచ్చిన మొదటి యాత్రా రచన కాశీయాత్ర నుంచి 2000 సంవత్సరం వరకు ప్రచురితమైన పలు యాత్రా రచనలు ప్రస్తావించి ఆయా రచయితల దృక్పథాన్ని వివరించారు. “2000 సంవత్సరం తర్వాత తెలుగులో యాత్రా రచనలు” అనే అంశంపై ప్రసంగించిన కొల్లూరి సోమ శంకర్ గత 18 ఏళ్ళలో యాత్రా సాహిత్యం పాఠకులను ఎలా ఆకర్షించిందో తెలిపి, ఈ కాలంలో వెలువడిన కొన్ని యాత్రా గ్రంథాలను ప్రస్తావించారు. ఆయా యాత్రా రచనలలోని మనుషులను, ప్రకృతినీ, సంవేదనాశీలతనీ వివరించారు. “యాత్రాసాహిత్యం – పరిశోధన” అనే అంశంపై తొలిసారి యాత్రాసాహిత్యంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందిన మచ్చ హరిదాసు ఉపన్యసించారు. తన పరిశోధనకు ఎంచుకున్న గ్రంథాలు, వాటిలోని అంశాలను ఏ రకంగా అధ్యాయాలుగా విభజించినదీ వివరించారు. యాత్రా చరిత్రల స్వరూప స్వభావాలను వివరించారు.
అనంతరం చర్చ జరిగింది. సభికులలోని కొందరు తమ యాత్రానుభవాలను వివరించారు. తదుపరి క్రియా సొసైటీ సంయుక్త కార్యదర్శి పి. జగన్నాథ రాజు వందన సమర్పణ చేయగా, సభ ముగిసింది.