[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా వానపాముల గురించి, మనుషులకు అవి చేసే మేలు గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]రో[/dropcap]జులాగే అన్నాచెల్లి ఆర్యన్, పరి ఉదయం టిఫిన్ తిని తోటలోకి వెళ్లారు. ఎప్పటిలాగే పూలతోటలో రంగురంగుల సీతాకోకచిలుకల్ని చూస్తూ, వాటిని ‘హాయ్!’ అని పలకరిస్తూ తిరిగి చూసారు. కొద్దీ దూరంలో తోటమాలి స్వామి ఏదో తవ్వుతుంటే అటుగా పరుగెత్తారు.
“స్వామీ! ఏం చేస్తున్నావు?”
“కూరల నార్లు పెట్టటానికి నేల సిద్ధం చేస్తున్నా” అన్నాడు స్వామి. అతని ప్రక్కనే చాలా చిన్న చిన్న మొక్కలున్నాయి.
“స్వామీ! ఇవేమి మొక్కలు?” అన్నాడు ఆర్యన్.
“ఇవా? బెండ, టమాటా, వంకాయ, మిరప.”
“ఒకే!” అని స్వామి పనిని శ్రద్ధగా చూస్తూ, సడెన్‌గా ఆర్యన్ “స్వామీ నాకు మట్టి తవ్వటానికి టూల్ ఇవ్వు” అన్నాడు
“మీకెందుకు బాబు? అలా వెళ్లి ఆడుకోండి.”
“నో! నేను తవ్వుతా!” అని మొండిపట్టుపడితే తప్పనిసరై స్వామి ఆర్యన్‌కి చిన్న ఇనుపకడ్డీ ఇచ్చాడు.
“పరీ రా! మనం తవ్వుదాం! యూ హెల్ప్ మీ టు డిగ్, ఒకే?”
ఇద్దరు కొద్దిదూరంలో గత రెండు రోజులుగా తడిసి ముద్దైన నేలను సులువుగా కొంత లోతుకి తవ్వారు. పరి మట్టిని చేతితో పక్కకి తీసిపోసింది. ఇంతలో ఒక్కసారిగా పరి, ఆర్యన్ మట్టి వైపు, తవ్విన గుంటలోకి తొంగి చూస్తూ
“ఓహ్ గాడ్! పాములు! స్నేక్స్! స్నేక్స్! తాతా! మామా! స్నేక్స్!” అని భయంతో పెట్టిన కేకలకు దగ్గర్లో ఉన్న స్వామి, ఇంట్లో ఉన్న తాత జగన్, మామ విశాల్ పరుగెత్తుకుంటూ పిల్లలున్న చోటికి వచ్చారు.
“స్వామీ! ఏమైంది? పాము ఎక్కడ? నిన్ను పిల్లల పక్కనే ఉంది చూసుకోమన్నాను కదా?” అని అరుస్తూ పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు.
“మామా పాము ఇక్కడ మట్టిలో ఉన్నాయి” అంటూ ఆర్యన్ తవ్విన చిన్ని గుంత చూపించింది. పిల్లల్ని తాత జగన్ గట్టిగా పట్టుకుని దూరంగా ఉన్నారు. పరి చూపించిన మట్టి లోకి చూసిన విశాల్ గట్టి నవ్వి
“నాన్నా! స్నేక్ లేదు. పాము లేదు. ఒట్టి వానపాములు” అన్నాడు.
“వానపాములకి భయపడ్డారా?” అని తాతా కూడా విశాల్‌తో జతకలిపి నవ్వితే పిల్లలు అర్థంకాక తెల్లబోయారు.
ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మమ్మ అంబిక వాళ్ళను దగ్గర తీసుకొని “అయ్యో! భయపడ్డారా?” అంది.
“అవును అమ్మమ్మా. చాలా భయం వేసింది” అంది పరి.
“అమ్మమ్మా ఎందుకు అందరూ నవ్వారు? అవి స్నేక్స్ కాదా? దెన్ వాట్?” అని అడిగాడు ఆర్యన్
“రండి! ఉయ్యాలలో కూర్చుని విందురుగాని అవేంటో?” అంది అమ్మమ్మ.
ఇద్దరు ఉయ్యాలలో కూర్చుని వినసాగారు.
“పరీ, ఆర్యన్ అవి పాములు కాదు.”
“మరి విశాల్ మామ వానపాములన్నాడు.”
“వానపాములంటే మీరు అనుకుని భయపడిన స్నేక్స్ కాదు. ఇవి మనకి, నేలకి, పర్యావరణానికి స్నేహితులు. మన చుట్టూ ఉండే నేలను సారవంతం అంటే హెల్తీగా చేస్తాయి.”
“దే ఆర్ సో స్మాల్! చిన్నవి. అవెలా హెల్ప్ చేస్తాయి?” అంది పరి.
అంబికా నవ్వి “పరీ!అవి చిన్నవే.. కానీ నేలకి చాలా సాయపడతాయి” అంది.
“ఎలా? అమ్మమ్మా. నేలని ఎలా హెల్తీగా చేస్తాయి?” అడిగాడు ఆర్యన్.
“ఎలా అంటే ఇలా!” అని అమ్మమ్మ అంబికా వానపాముల కథ చెప్పటం మొదలుపెట్టింది.
“ఆర్యన్, పరీ మీ ముంబైలో ఎప్పుడైనా వీటిని చూసారా?”
“లేదు.”
“వీటిని ఇంగ్లీష్‌లో ఏమంటారు?”
“ఆ ఆ! ఎర్త్ వార్మ్!” అన్నారిద్దరు.
“సో! పేరులోనే ఉంది కదా ఎర్త్.”
“ఈ వానపాములు సాధారణంగా నేలలో ఉంటాయి. మీ సిటీలో కనపడే నేల తక్కువ. ఒకవేళ ఉన్నా మీకు టైం, వీలు ఉండదు వాటిని వెతికి చూడటానికి. వీటికి ఇంకో పేరుంది తెలుసా?”
“తెలుసు అమ్మమ్మా. వానపాములు!” అంది పరి ఉత్సహంగా.
అంబికా నవ్వి “ఇంకోటి వీటిని ఎర్త్ ఇంజినీర్స్ లేదా ఎర్త్ డాక్టర్స్ అంటారు, నేలని బాగుచేస్తారని” అంది.
“ఎర్త్ ఇంజినీర్స్! వావ్!”
“ఇంకా?”
“ఇంకా? ఇవి వేల ఏళ్ళ నుండి మనిషికి హెల్ప్ చేస్తున్నాయి. నేలలో లోపలికి నిలువుగా లేదా అడ్డంగా తవ్వి లోపల ఉంటాయి. నేలలోకి ఆక్సిజన్, నీళ్లు వెళ్లి లోపలుండే కార్బన్‌డయాక్సిడ్ లాంటి గ్యాసెస్ బైటకి వచ్చేలా చేస్తాయి.”
“అవునా?”
“అవును. ఇంకా ఉంది వినండి. వానపాములు నేలని గుల్లగా అంటే సాఫ్ట్‌గా చేసి లోపలున్న సారాన్ని పైకి తీసి టాప్ సాయిల్‌ని హెల్తీగా చేస్తాయి. అంతేకాదు తోటలో మూలగా ఉన్న కంపోస్ట్ పిట్ చూసారా?”
“యాక్! మురుగు కంపు!” అన్నారు పిల్లలు.
“అవును కంపే! మనం తిని పడేసిన ఫుడ్, ఆర్గానిక్ అంటే కూరల, పండ్ల తొక్కలు, రాలిన ఆకులు లాంటి వాటిని తొరగా కుళ్లిపోయేలా చేసి మంచి ఎరువుగా తయారు చేస్తాయి.”
“కంపోస్ట్ ఎరువు కదా?” అన్నాడు ఆర్యన్
“అరె! నీకు చాలానే తెలుసు.”
“మా సైన్సు టీచర్ చెప్పింది. ఇట్స్ వెరీ గుడ్ అని.”
“అంతేకాదు వానపాములు నేలలో ఉండే ఫంగి, బాక్టీరియాలను చురుకుగా చేసి సాయిల్‌ని హెల్తీగా ఉంచి ఆ నెలలో పెరిగే మొక్కలకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. వానపాములు ఎక్కడ ఎక్కువుంటే ఆ నేల అంత ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇవి పొలాల్లోనే కాకుండా ఆకురాలిన అడవుల్లో, పండ్ల తోటల్లో, పచ్చిక నేలల్లో ఉండి నేలరాలిన ఆకులు పండ్లు ఇతరాలని ఫంగి, బాక్టీరియాలతో కలిసి టన్నులకొద్దీ కంపోస్ట్ ఎరువుని తయారు చేసి నేల సారాన్ని పెంచుతాయి. అందుకే వ్యవసాయం చేసేవాళ్ళు నేల ఆరోగ్యం కోసం, నేల బలం కోసం వందలు వేల సంఖ్యలో వానపాముల్ని నేల దున్ని అందులోకి వదిలిపెడతారు. ఇవి మనకి, నేలకీ ఉపయోగపడడమే కాదు అనేక చిన్న పెద్ద జీవులకి, పక్షులకి ఆహారంగా ఉన్నాయి. వానపాములు మన స్నేహితులని తెలిసింది కదా? వాటిని చూసి భయపడతారా?” అంది అమ్మమ్మ.
“లేదు. ఇంక భయం లేదు మాకు. మా స్నేహితులకి కూడా వాటి గురించి చెబుతాము.”
“పదండి లోపలికి” అని పిల్లలను లోపలికి పంపి అంబిక వంటింటిలోకి వెళ్ళింది, పరికి ఇష్టమైన స్వీట్స్ చెయ్యటానికి.