[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత సలీం కలం నుంచి జాలువారిన నవల “ఎడారి పూలు“.
***
ఆ అమ్మాయికి పధ్నాలుగేళ్ళు.. ఇప్పటివరకూ తనను నిఖా చేసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తను చూడలేదు. జల్వా సమయంలో అద్దంలో మొహం చూపిస్తారుకదా చూద్దామనుకుంది. కానీ జల్వా లేకుండానే పెళ్ళితంతు ముగించారు. నిఖా చేస్తున్నట్టు కాకుండా ఏదో నేరం చేస్తున్నట్టు… హడావుడిగా చేసేశారు. సుహాగ్ రాత్ రోజు కళ్ళెత్తి అతని మొహంవైపు చూసింది. అంతే… దెయ్యాన్ని చూసినట్టు జడిసి చిన్నగా కేకపెట్టి వెనక్కి పడిపోయింది. ముక్కుపచ్చలారని ఇలాంటి ముస్లిం ఆడపిల్లల కన్నీటి గాథలకు కారణం ఎవరు? అరబ్ నిఖాలు చేసుకునే పేద ముస్లిం ఆడపిల్లల విషాద జీవితాల్ని అక్షరబద్ధం చేసిన నవల “ఎడారి పూలు”.
***
ఆర్థికావసరాలు తరుముతుంటే బ్రోకర్ల మాటలు నమ్మి అరబ్ దేశాలకు పనిమనుషులుగా వెళ్ళే ఆడవాళ్ళు… కుటుంబాల్ని వదిలేసి కోటి కలల్ని – మోసుకుంటూ ఎడారి దేశాలకు వలసపోయే కార్మికులు… చిక్కటి నల్లటి దుఃఖ సముద్రంలో ఈదుతూ.. అలసిపోయి మధ్య మధ్యలో మునిగి చావబోతూ… మళ్ళా తేలుతూ… కొన్ని వ్యధాభరిత జీవితాల చిత్రణే “ఎడారి పూలు”.
***
ఆసక్తిగా చదివించే ఈ నవల లోని కొంత భాగం :
“ఇంతకూ దేని గురించి?”
“మీ పెద్దమ్మాయి జుబేదాకి నిఖా చేయాలిగా. ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. మన ముస్లిం ఇలాకాలో సమర్తయిన అమ్మాయికి పెళ్ళి చేయకుండా యింట్లో పెట్టుకోవడమే మంచిది కాదు. పిల్లకు పదిహేనో పదహారో వచ్చేలోపల ఓ అయ్య చేతిలో పెట్టి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది. అసలే ఇప్పుడు రోజులు బాగాలేవు”
“నువ్వు చెప్పింది నిజమే గౌస్ భాయ్. కానీ నిఖా చేయాలంటే మాటలా? అంత డబ్బు ఖర్చుచేసి పెళ్ళిచేసే స్థితిలో నేను లేను.”
గౌసుద్దీన్ పెద్దగా నవ్వాడు. “నువ్వు ఆడపిల్ల తండ్రివి. నిఖా చేయడానికి నీకు ఖర్చేముంది? దండిగా మెహర్ యిచ్చే జమాయిబాబుని వెతికిపట్టుకుంటే సరి.”
“ఎంత మెహర్ ఇచ్చినా పెళ్ళి ఖర్చులుంటాయిగా. యింటిల్లిపాదికీ మంచి బట్టలు తీసుకోవద్దా… దూబ్జా కి ఓ షేర్వాణీ అయినా కొనివ్వద్దా? నిఖారోజు మిస్తీ బాదం జీడిపప్పులైనా పంచొద్దా… కనీసం ఇంటికొచ్చే బంధువులకు భోజనాలు పెట్టొద్దా?”
“ఆ ఖర్చులన్నీ భరించేవాడు దొరికితేనో.”
“పరాచికాలొద్దు గౌస్ భాయ్. ఈ రోజుల్లో అలాంటివాళ్ళుంటారా ఎక్కడైనా?”
“ఉన్నారు కాబట్టేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.”
***
ఎడారి పూలు (నవల)
రచన: సయ్యద్ సలీం
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్
వెల: రూ.150, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, రచయిత
సలీం, ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మీనారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29.