మనసులోని మనసా… 8

2
2

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]చి[/dropcap]న్న పిల్లల కథల గురించి, సాహిత్యం గురించి ఎవరు మాట్లాడినా నాకు గుర్తుకొచ్చేది చందమామే. చందమామలో అప్పట్లో ఎవరెవరు కథలు రాసేవారో నాకు గుర్తు లేదు కాని ఆ కథలు మాత్రం చాలా గుర్తుండిపోయాయి. అసలా జ్ఞాపకమే ఎంతో మధురం. ఆ కథల్లో తర్కం ఉండేది, నీతి ఉండేది, రస గుల్లాల్లా వూరించగల తీపి ఉండేది. అసలా శైలే విలక్షణం. పిల్లలని ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్ళగల అద్భుత శక్తి ఆ కథలలో వుండేది. మర్యాద రామన్న కథలు చదువుతున్నప్పుడు ఆ చిక్కుని రామన్న ఎలా విడదీసి తీర్పు చెబుతారో అని ఎంతో ఆసక్తిగా చదివేవాళ్ళం. ఆ చిక్కు విడదీసిన విధానం ఎంతో అబ్బురంగా, న్యాయ సమ్మతంగా వుండేది. కథ పూర్తయ్యేసరికి ఎంతో సంతృప్తిగా, సంతోషంగా అనిపించేది. అలాగే భేతాళ కథలు! ఈ సారి ఎలాంటి క్లిష్ట సమస్య యిస్తాడో అని వూపిరి బిగపట్టి కథ చదివేవాళ్లం. చివరిలో విక్రమార్కుడు విడదీసి చెప్పిన అర్థం ఆశ్చర్యాన్ని కలిగించేది. అలాగే శంకర్, చిత్ర గారి బొమ్మలు సరేసరి! కథకి తగిన విధానంలో ఎంతో ఓపికగా, వివరంగా ముద్దుగా వేసిన బొమ్మలు కథ మీద మరీ మరీ ఆసక్తిని కలిగించేవి.  ఇక వడ్డాది పాపయ్య గారి ముఖచిత్రాలు పత్రికకి మరింత ఆకర్షణగా నిలబడేవి. నాకు చిత్రకళ మీద ఉన్న ఆసక్తి కొద్దీ బొమ్మల్ని పరిశీలనగా చూసేదాన్ని. నేనూ మా అక్కయ్యా, పాపయ్య గారి బొమ్మలూ, బాపూ గారి బొమ్మలు శ్రద్ధగా చూసి అనుకరించేవాళ్ళం.

నిజానికి చందమామ కథలు పిల్లల్ని అలరించడమే కాదు – పెద్ద వాళ్ళని కూడా పిల్లలుగా మార్చేవి. అప్పటి సంపాదకులు, సంచాలకులు సమిష్టిగా తీసుకుని నిర్వహించిన బాధ్యత అది! ఎవరికీ ప్రత్యేకంగా పేరు తెచ్చుకోవాలన్న యావ లేదు. ఒక్కోసారి అనుకుంటాను కథలు రాయాలని, బొమ్మలు వేయాలని నాకు ఆసక్తి కలిగించింది ‘చందమామ’ పత్రికే అయి వుండొచ్చని.

తర్వాత కాలంలో ఎవరూ ఆ పత్రికకి ధీటుగా మరో పత్రికని నడపలేకపోయారు. ఆ రచయితలెవరో నాకు గుర్తులేదు కాని అంతలా మరెవరూ పిల్లల కథలు రాయలేకపోయారు.

కథలనగానే నాకు మాకు మా మంగాయమ్మ పెద్దమ్మ గుర్తొస్తుంది. మంగాయమ్మ పెద్దమ్మని అందరూ అలానే పిలిచేవారు. పిల్లలం మేము కూడా అలానే పిలిచేవాళ్ళం. నెలకోసారి రిక్షా వేసుకుని కాకినాడ నుండి మా యింటికి వచ్చేది. కాకినాడంటే మేముండే దెక్కడనుకుంటున్నారు. అదీ కాకినాడే. మా ప్రాంతాన్ని జగన్నాధపురం అనేవారు.

ఈ రెండు ప్రాంతాలని విడదీస్తూ మధ్యలో ఉప్పుటేరు (బాక్ వాటర్స్) ప్రవహిస్తుండేది. దాని మీద వంతెన దాటితే ఇటు జగన్నాధపురం – అటు కాకినాడ. అంతే.

సరిగ్గా ఆరున్నర ఏడు గంటల మధ్య సాయంత్రం కనుచీకటి పడేవేళ ముసిముసిగా నవ్వుతూ రిక్షా దిగేది పెద్దమ్మ. అప్పటికే మా పిల్లల భోజనాలయ్యేవి. మా మామయ్య, దొడ్డమ్మల మధ్య ప్రాంతం పొడువుగా గచ్చు చేయించి వుండేది. వీధిలోకి వెళ్ళడానికి దానికొక వాకిలి వుండేది. అక్కడ వరుసగా పీటలు వేసి మా పిల్లలందరికి కాళ్ళూ చేతులూ కడిగి భోజనానికి కూర్చోబెట్టేవారు. పిల్లలంటే తక్కవ గాంగ్ కాదు మరి. మామయ్య పిల్లలు, మేము, దొడ్డమ్మగారి పిల్లలు- ఇంకా ఎదురింటి బంధువుల పిల్లలూ ఇలా రెండు డజన్లకి తక్కువ కాకుండా వుండేవాళ్ళం. ఆ రోజుల్లో అత్తయ్యల ఓపికలు గుర్తోస్తే కళ్ళు చెమరుస్తాయి. అది కావాలి, ఇది కావాలి అంటూ ఎంతో గందరగోళం చేసేవాళ్ళం. ఇక భోజనాలయ్యాక మండువా ఇంటి ముందున్న పెద్ద దిబ్బమీద ఆటలు! ఆ స్థలమంతా పచ్చగా గడ్డి మొలిచి వేసిన లాన్ లానే వుండేది. నెల రోజుల కొకసారి గడ్డి కత్తిరింపజేసి పశువులకి వేస్తుండేవారు. అక్కడ వెన్నెల్లో మా దాగుడు మూతలు, చాకిరేవు ఆటలూ సాగేవి.

సరిగ్గా అప్పుడు రిక్షా దిగేది మా సదరు మంగాయమ్మ పెద్దమ్మ. ఇక మా ఆనందం చూడాలి. పెద్దమ్మ వచ్చింది, పెద్దమ్మ వచ్చింది అని గెంతుకుంటూ ఆటలు మాని పరుగున రిక్షాని చుట్టుముట్టేవాళ్ళం. పెద్దమ్మ రిక్షా అతనికి డబ్బులిచ్చి అదే నవ్వుతో నోటి మీద వేలుంచుకు ‘ఉష్, వుండడల్లా’ అంటూ మమ్మల్ని వారిస్తూ పెద్దవాళ్ళ దగ్గరకెళ్ళేది. ఇక మాకు మా దొడ్డమ్మ, అమ్మ, మామయ్యలంటే హడల్ కాబట్టి గిరిగీసినట్లు ముందు వరండాలో రెండు మూడు చాపలు కలిపి వేసి వూపిరి బిగపట్టుకుని ఆవిడ కోసం ఎదురు చూసేవాళ్ళం. రోజూ మా మామయ్య రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికొస్తూ విడివిడిగా విస్తరాకు పొట్లాలలో తీబూంది కట్టించి తలా ఒకటి మాకు యివ్వటం అలవాటు. వంతెన వారగా వుండే కోటయ్య కొట్లో తీబూంది కాకినాడ కాజాల్లానే స్పెషల్. బెల్లంతో చేసేవారు. అలా అని బూంది నల్లగా వుండేది కాదు. మంచి రంగులో మెరుస్తూ విటమిన్-డి మాత్రల్లా మెరిస్తూ పూసల్లా వుండేది. అది అందరం తిన్నాక చేతులు కడిగి ఇక పడుకోమని మంచాలెక్కించేవారు. రోజూ ఆ మిఠాయి కోసం ఎదురు చూడటం మాకు రివాజు. కానీ ఈ రోజు దానికి విరుద్ధంగా మంగమ్మ పెద్దమ్మ కోసం చాపల మీద కూర్చుని ఎదురు చూస్తున్నాం మేము.

కారణం పెద్దమ్మ బహు రంజనంగా వూరిస్తూ అర్ధరాత్రి దాటినా ముగియని కథలు మాకు చెప్పడమే.

పెద్దమ్మకి కూడా మా మీదే ద్యాస. కాని పెద్ద వాళ్ళతో మంచీ చెడూ మాట్లాడి భోజనాలు ముగించి చిన్న పిల్లల దగ్గరికి రావడం మర్యాద అని అలా పాటించేది.

మాకు నిద్రలు వస్తున్నా ఆపుకుని పెద్దమ్మ కోసం గోడలకి జారబడి కూర్చునేవాళ్ళం. సరిగ్గా అప్పుడు ప్రత్యక్ష్యమయ్యేది పెద్దమ్మ! ఇక ఎక్కడి నిద్రలు అక్కడ ఎగిరి పోయాయి. మళ్ళీ అదే ముసిముసి నవ్వులతో మమ్మల్ని చూస్తూ ‘ఇంకా నిద్రలు పోలేదంటల్లా’ అని అమాయికంగా ఏమీ తెలియనట్లుగా.

మాకు తెలుసు పెద్దమ్మ అలా వూరించి వూరించి కథ మొదలెడుతుందని. చివరికి మా బ్రతిమాలటాలయ్యేక పెద్దమ్మ ఆకాశంలోకి చూసి నిట్టూర్చి –  ఆపైన మా వంక చూసేది. మేం చాలా ఆసక్తిగా నోరావలించి పెద్దమ్మ వైపు వూపిరి బిగబట్టుకుని చూసే వాళ్ళం. మళ్ళీ పెద్దమ్మ చిరునవ్వు నవ్వు… ‘అప్పుడా చిన్నదీ…’ అనేది. అంతే! తెరమీద సెవెంటీ ఎం.ఎం.బొమ్మ పడినట్లు కళ్ళు పెద్దవి చేసి చెవులు నిగిడ్చే వాళ్ళం.

‘అప్పుడా చిన్నది… ఆ సంధ్యవేళ చంకన కడవ పెట్టుకుని చెరువు గట్టుకు రాగానే…’ అంటూ ఆగేది.

ఇలా కథ ఎంతో ఆసక్తిగా పరిసరాల్ని వర్ణిస్తూ ఒక దృశ్యకావ్యంగా సాగేది. అర్ధరాత్రి దాటేవరకూ చెప్పి “మిగతాది రేపు చెబుతానల్లా – పడుకోండి, పెద్దోళ్ళు తిడతారు” అనేది.

అప్పటికే ‘మంగాయమ్మ పడుకో, వాళ్ళంతే నువ్వు రా’ అన్న పిలుపు మా దొడ్డమ్మ నుండి వచ్చేది.

ఇక చేసేది లేక మేము నిస్సహాయంగా మంచాలెక్కేవాళ్ళం. అలా తనున్న మూడు రోజులూ వూరిస్తూ సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ అన్ని రకాల రసాల్ని సమంగా పోషిస్తూ ఒక సినిమా కన్నా ఉత్కంఠ కల్గించే విధంగా పెద్దమ్మ స్టోరీ టెల్లింగ్ ముగిసేది.

అందుకే పెద్దమ్మంటే మా పిల్లలకి ప్రాణం.

పెద్దమ్మ వయసుకి పెద్దదయినా పిల్లల మనస్తత్వం. పిల్లల్లో పిల్లలా కలిసిపోయేది. ఎప్పుడూ నవ్వు మొహం. పమిట భుజాల మీదుగా కప్పుకుని పురాణ సివిమాల్లో రాజులు భుజాల మీదగా వెనుకగా వేసుకున్న కర్టెన్ క్లాత్‌లా చెంగు వదిలేది. పిల్లలు లేరు. బాల వితంతువట. ఇవన్నీ మాకు కొంచెం పెద్దయ్యేకా తెలిసేయి. కారణం మా పెద్దవాళ్ళు. పిల్లలకి ఏదీ తెలియనిచ్చేవారు కాదు.

కానీ పెద్దమ్మకి చాలా సరదాలుండేవి. గోరింటాకు పెట్టుకోవాలని, పెళ్ళిళ్ళలో అన్ని పనులూ చెయ్యాలని. ఎవర్నీ పట్టించుకునేది కాదు. గబగబా వచ్చేసి “ఉండడల్లా మీకు పెట్టడం రాదు. నేను పెడతాను” అంటూ పెళ్ళి కూతురికి గోరింటాకు పెట్టేసేది. పసుపు దంచేటప్పుడు రోకలి అందుకునేది. పెళ్ళి ఫోటోలు తీసేటప్పుడు రెండు మోచేతులతో తోసేసి మధ్యలో నిలబడేది. వీళ్ళేమో ఆమె వితంతువని మొహాలు చిట్లించుకునేవారు. కాని పెద్దమ్మ వాటిని పట్టించుకునేది కాదు.

కొంత వూహ వచ్చేక నాకు పెద్దమ్మ పట్ల చాలా జాలి, బాధ కల్గేవి. ఈ దురాచారాలు ఎందుకొచ్చాయో… పెద్దమ్మ చేసిన పాపం ఏమిటో అర్థంకాక కోపం వచ్చేది.

ఒకసారి జరిగిన చిన్న గమ్మత్తు సంఘటన చెప్పి ముగిస్తాను.

మా అమ్మగారు, దొడ్డమ్మ, అత్తయ్య అంతా కారులో ఏదో శుభకార్యానికి ఏనాం వెళ్తున్నారు. కాకినాడ నుండి ఏనాం ప్రయాణం బాగుటుంది – దారిపొడుగునా కాలువలు, పడవలు బారులు తీరి. కాలువ మీద చేపల కోసం ఎగిరే కొంగలు, కాలువ పొడవునా బారులు తీరి నిలబడిన సైనికుల్లాంటి కొబ్బరిచెట్లు – అందుకే ‘దొడ్డమ్మా నేనూ వస్తా!’ అన్నా.

‘సరే రా!’ అంది దొడ్డమ్మ.

‘రండి రండి. మంగాయమ్మ చూడకుండా వెళ్ళిపోదాం. అక్కడి వాళ్ళకి ఈవిడ రావడం యిష్టం లేదు’ అంది మా దొడ్డమ్మ.

అందరూ గబగబా కారెక్కడానికి వచ్చారు.

నేను ముందు సీట్లోనే ఎక్కడానికి డోర్ తెరచి తెల్లబోయి మా దొడ్డమ్మ వైపు చూశాను.

దొడ్డమ్మ, అమ్మ, మా అత్తయ్య గబగబా వచ్చి కారు డోర్ తెరిచి నోరెళ్ళబెట్టారు.

“ఏంటర్రా ఇంతాలస్యం! త్వరగా ఎక్కండి. అక్కడ మూహుర్తం దాటిపోదూ!” అంది మంగాయమ్మ పెద్దమ్మ లోపల కిటికీ వైపు కూర్చుని తొందరపెడుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here